17, జులై 2012, మంగళవారం

కూతురైతేనేం

పచ్చగా , గుబురుగా ఉన్న చెట్లమధ్య విజ్ఞానం పంచిపెట్టే గ్రంధాలయం ఆ కాలనీకి అలంకారం.

లోపల కూర్చుని చదువుకునేవారికి సరి సమానంగా వెలుపల వైపు సిమెంట్ బెంచీల మీద కూర్చుని దిన పత్రికలూ చదువుకుంటున్న కాలనీ జనులు. వారిలో వృద్దులు రిటైర్ అయిన వారే అధికం .

కాలక్షేపు కబుర్లు,అనుభవాలు చెప్పుకుంటున్న వారి దృష్టి అక్కడే ఓ..ప్రక్కగా నిలబడి ఉన్న శాంతమ్మపై ప్రసరించింది.

"ఎక్కడికి బయలుదేరారు? అమ్మాయి వద్దకా? రేపే కదా భోగి పండుగ.అమ్మాయి పిల్లలతో ఇక్కడికి రావడం లేదా!అని అడిగారు మూర్తి గారు.

"అవునండీ! అమ్మాయి దగ్గరకే అని చెప్పింది  చిన్నగా నవ్వుతూ.

"మన శాంతమ్మ గారికి చాలా ఓపిక. వారానికి రెండు సార్లయినా అమ్మాయి ఇంటికి ప్రయాణం కడతారు. ఈ వయసులో తల్లి మనసుని అర్ధం చేసుకునే తీరిక,వివేకం ఆ పిల్లకి లేవు. ఏం చేస్తాం?వయసు ఉడిగిందని పెద్దలకి పిల్లల పట్ల మమకారాలు అడుగంటుతాయా? పిల్లలని చూసుకోవాలని తపిస్తారు "అని చెపుతున్నారాయన .

''శాంతమ్మ గారు ఇంకా ఇక్కడ మీరొక్కరే ఏమి ఉంటారమ్మా ఇక అమ్మాయి దగ్గరే ఉండిపోకూడదు."ఉచిత సలహా ఇచ్చాడు ఇంకో ఆయన.

శాంతమ్మ గారి ముఖం మాన్లమైంది.

తనకా హై బి.పి,షుగర్ లాంటి దీర్ఘ కాలిక వ్యాదులు తో పాటు కొత్తగా ఆస్త్రియో పోరాసిస్ అనే వ్యాది వచ్చినదట.

ఎముకలు గుల్లబారి ఎక్కడ పడితే అక్కడ పెళుక్కు మంటూ ఇరిగిపోయే రోగం వచ్చింది. మీరసలు ఎక్కువ కదలకుండా జాగ్రత్తగా బెడ్ రెస్ట్ లోనే ఉండాలమ్మా! లేకపోతే ఎముకలు విరిగి మంచం మీద పడి ఉండాల్సి వస్తుంది అని హెచ్చరించారు ఆర్ధోపెడిక్ డాక్టర్. కానీ మనసు ఊరుకుంటుందా! కూతురు కన్నా కూడా మనుమడు "బుజ్జి"ని మనుమరాలు "పండు " ని చూడాలని ఆమె మనసు ఆరాట పడుతుంది.

ఒక్క గానొక్క కూతురు. ధనవంతుల ఇంటి కోడలిగా చూసి మురిసి పోవడమే తప్ప కూతురు,అల్లుడు పట్టుమని పది రోజులు కూడా ఈ ఇంట్లో నిద్రచేసింది లేదు.పెళ్ళైన రోజుల్లో నాలుగైదు రోజులు ఉన్నారేమో! !

శాంతమ్మ గారి భర్త రాదాకృష్ణ గారు కావాలని కోరి కోరి ప్రశాంతంగా ఉంటుందని.. సిటికి  చివర వెలిసిన ఓ..కాలనీలో స్థలం తీసుకుని కట్టించుకున్న ఇల్లు. చుట్టూ..రక రకాల చెట్లు. పూల మొక్కలు..రణ గొణ ధ్వని లేకుండా హాయి గా తోచే పరిసరాలు. ఇక్కడ అలవాటు పడి ఎక్కడన్నా ఉండగల్గడమే అనుకునేది

ఇరవైయేళ్ళు  మారుమూలన ఉన్న కాలనీ నుండే రాధాకృష్ణ గారు సిటికెళ్ళి  ఉద్యగం చేసి వచ్చారు.కూతురి పెళ్లి చేసిన తర్వాత ఓ సంవత్సరానికే హార్ట్ ఎటాక్ తో మరణించాక శాంతమ్మగారు ఒంటరి జీవి అయిపొయింది.

కూతురు కూడా వచ్చి అక్కడే ఉంటే బాగుంటుందని ."బాబూ ! ఇంత ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉండటం ఎందుకు? మీరిక్కడికే వచ్చేసి ఉండవచ్చు కదా" అని అల్లుడు గారిని నోరు తెరచి అడిగింది

అతని కన్నా ముందే కూతురు స్వప్న మాటల్లో జోక్యం చేసుకుని "ఇక్కడ ఉండటం ఎందుకమ్మా! ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి.".అని ఆరింద మాటలు చెప్పింది.

ఇక అల్లుడు ఏం మాట్లాడతాడు? భార్య మాటలకి నవ్వి ఊరుకున్నాడు.

స్వప్న బాధంతా సిటి లో ఉన్న కాలక్షేపం ఇక్కడ ఈ మారు మూల కాలనీలో ఉండడని.

అక్కడ ఉంటే ఫ్రెండ్స్ తోనో,బంధువులతోనో కలసి సినిమాలకి షికార్లకి హాయిగా తీరవచ్చు. అదే ఇక్కడ ఉంటే..సరిగా బస్ సౌకర్యం లేని కాలనీ. ఎక్కడి అయినా వెళ్ళాలంటే ఓ..కిలోమీటర్ దూరం నడిస్తే కాని.నట్టడివి నుండి జనం లోకి వచ్చినట్టని ఆలోచించుకుని వద్దనుకుంటుందని  అర్ధమయింది. శాంతమ్మ కి. మనసులో బాధ  కల్గినా బయటకి వెల్లడించలేదు. దూరంగా ఉండే చోట ఇచ్చి పెళ్ళి  చేస్తే ఇలాగే ఉండేది కదా !అనుకుని సర్ది చెప్పుకుంది.

ఇద్దరు పిల్లలు తల్లి అయినప్పుడు కూడా కాన్పుకి వచ్చి మూడు నెలలకే తన ఇంటికి వెళ్ళిపోయేది.

నెలకి ఒకసారి పిల్లలని తీసుకుని రావడానికి కూడా స్వప్నకి కష్టంగా ఉండేది.

"పోమ్మా, నీ దగ్గరికి రావడమంటేనే విసుగు. వందలకి వందలు పోయాలి ఆటోల ఖర్చులకి "అనేది.

ఆ మాట వినగానే మనసులో ముల్లులా గుచ్చుకుంది.

నెలా నెలా వచ్చే పెన్షన్ డబ్బు మొత్తం కూతురికే ఇచ్చేసేది. స్వప్న చేసే షాపింగ్ కి ఎక్కడ డబ్బూ  చాలదు.ఆంతా వెంటనే ఖర్చు పెట్టేసేది.

నేను ఒక్క కూతురినన్న మాటే కాని మా తోడి కోడళ్ళ తో పోల్చుకుంటే నాకే అన్ని విషయాలలోనూ తక్కువ. వాళ్ళకీ కారు కూడా పుట్టింటి వాళ్ళే ఇచ్చారు. నాకా  అవకాశమే లేదు అని అంటే ఒంటి మీద ఉన్న బంగారం అమ్మి ఆ డబ్బుని అల్లుడు చేతికి ఇచ్చి కారు కొనుక్కోమని చెప్పింది  శాంతమ్మ .

అప్పుడైనా కూతురు ముఖం లోతల్లి ఒంటి మీద బంగారం కరిగిపోయిందన్న కించిత్ బాద లేదు కారుని చూసి మురిసి పోయింది.

కారు ఉంది కాబట్టి వారం వారం తను వెళ్ళకుండానే వాళ్ళే వస్తారు అనుకునేది. అది ఆమె అమాయకత్వమని  కొన్ని నెలలకి గాని తెలియలేదు.

మళ్ళీ కొన్నేళ్ళకి అమ్మా! మేము ఉమ్మడి కుటుంబం నుండి విడి పోతున్నాం. మా వాటాకి ఉన్న ఇంటిలో భాగం రాలేదు. నువ్వు ఊర్లో ఉన్న పొలం కాని  ఈ ఇల్లు కాని అమ్మేసి ఇస్తే సిటీ లో మంచి ప్లాట్ కొనుక్కుంటాం అని చెప్పింది  స్వప్న.

అందుకు తీవ్రంగా అభ్యంతరం చెప్పింది శాంతమ్మ. పొలం కాని,ఇల్లు కాని అమ్మే పరిస్థితి లేదని ఖచ్చితంగా చెప్పింది. పొలం  కౌలుకి ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బుతో అద్దె కట్టుకుని అద్దె ఇంట్లో ఉండమని చెప్పింది. కూతురుకి కోపం వచ్చినా సరే .. ఇద్దరి మధ్య నాలుగు నెలలు మాటలు లేకపోయినా బెట్టుగానే ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి  పిల్లలని చూసి డబ్బు ఇచ్చేసి వచ్చేది.

ఏమిటో..ఈ తరం వారికి దేని విలువ అర్ధం కాదు. ఈ ఇంటిని కట్టడానికి ఆయన యెంత కష్టపడ్డారో! ఎన్ని కష్టాలు వచ్చినా సరే పెద్దలు ఇచ్చిన భూమిని అమ్ముకోవాలని తాము ఎన్నడూ అనుకోలేదు.ఇప్పుడు చూస్తే కూతురు ఎప్పుడూ ఈ ఇంటిని, ఆ పొలాన్నిఅమ్మేసి డబ్బు చేసి తనకి ఇచ్చేస్తామా అన్నట్లు చూస్తుంది. సంపాదించిన వారికి తెలిసిన విలువ అయినకాడికి అమ్మేసి దర్జాగా బ్రతకాలని అనుకునేవారికి ఎలా తెలుస్తుంది..అని ఆలోచన చేస్తుంటుంది.

తనతో కూతురు సరిగా మాట్లాడదు అని తెలిసినా కూడా మనసు ఆపుకోలేక పిల్లలను చూడాలని బయలు దేరింది. రెండు మూడు సంచీల నిండా పండుగ కని చేసిన నేతి అరిసెలు,జంతికలు,మిఠాయి, అటుకులు,కమ్మగా కాచిన నెయ్యి తో పాటు.. పల్లెనుండి  తెచ్చిచ్చిన తేగలని.. కుండలో పెట్టి తంపటి వేయించి, రేగు పళ్ళు, బంతి పూలు,గుమ్మడి పండు,చెరకు ముక్కలు.పెరడులో కాసిన చిక్కుడు కాయలు,మునక్కాయలు,జామ కాయలు..అన్నీ కలిపి మూడు నాలుగు సంచీలలో సర్దింది. అవన్నీ బరువు అయినా సరే ఆటో కట్టించుకుని వెళితే..ఓ..వంద రూపాయల ఖర్చు అని ..లెక్క పెట్టుకుని ..కాలనీ కి వచ్చే బస్ కోసం ఎదురు చూస్తుంది. ఆ వంద రూపాయలు ఉంటే మనుమడికి ఇంకాస్త ఖరీదైన డ్రస్ కొన్నివ్వ వచ్చు కదా అని ఆమె ఆలోచన. అది పిసినారి తనం అనుకోవాలో ప్రేమ అనుకోవాలో! అలా అని ఆమె పిసినారి కాదు. చెట్టుకు కాసిన కాయ,పండు తో సహా అందరికి పంచి పెడుతుంది.ఇతరుల అవసరాలకు డబ్బు ఇచ్చి ఆదుకుంటూ ఉంటుంది . అందుకే శాంతమ్మ గారు అంటే కాలనీ వాసులందరికీ అభిమానం.

పదకొండు గంటలకి రావాల్సిన బస్ ఓ గంట ఆలస్యంగా వచ్చింది.

ఎలాగోలా ఇతరుల సాయం తీసుకుని ..ఆ సంచీలన్నీ బస్ లో పెట్టుకుని శ్రమ పడుతూ కూతురు ఇంటికి చేరుకునే లోపు బస్ కిటికీకి తల ఆనించి కళ్ళు మూసుకుంది.  

చేతుల్లో బరువైన సంచీలని మోసుకుని కూతురు ఇంటికి చేరింది. .

మనుమడు బుజ్జి, మనుమరాలు పండు అమ్మమ్మ వచ్చింది అంటూ సంతోషంతో గంతులు వేసారు.

మనుమరాలయితే నా కోసం ఏమి తెచ్చావు అమ్మమ్మా అని అడుగుతూ ఎప్పుడెప్పుడు తీసి ఇస్తుందా అన్నట్లు చూసింది.

ఆమె తెచ్చినవి తీసి ఇవ్వగానే  తింటూ..

అమ్మమ్మా ! నువ్వు తెచ్చిన అరిసెలు యెంత బాగున్నాయో అని చెబుతుంటే సంతోషంగా అనిపించింది. మనుమడు అయితే..మెడ చుట్టూ చేతులు వేసి వేలాడుతూ ముద్దులు పెట్టాడు.

శాంతమ్మకి కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగాయి. ఆత్మీయ మైన స్పర్శ కోసం ఎన్నాళ్ళుగా అలమటించి పోయింది.

తల్లిని ఆ స్థితిలో చూసి  స్వప్నకి కూడా ఏడుపు వచ్చింది. చిన్న పిల్లలా తల్లి ప్రక్కన కూర్చుని తల్లి చేయి పట్టుకుంది. ఆ మాత్రం దగ్గరి తనానికే కరిగి పోయి కూతురిని దగ్గరకి తీసుకుంది.

తేలికైన మనసులతో కళ్ళల్లో ఆనందపు కన్నీరు చిప్పిల్లగా కూతురు మసక మసకగా కనబడింది తడిమి తడిమి తన మనసులో దాగిన ప్రేమని ప్రకటించింది.

"అమ్మా! పండుకి సాయంత్రం భోగి పళ్ళు పోద్దామా ?.ఇక్కడ అందరి పిల్లలకి భోగి పళ్ళు వేడుక చేస్తున్నారు.మనం అలాగే చేద్దాం "అని అడిగింది.. "అలాగే నమ్మా."అంది సంతోషంగా శాంతమ్మ. భోజనాలు అయ్యాక ఒక గంటలోనే అన్ని తయారు చేద్దాం ముందు భోజనం కానీయండి అంది శాంతమ్మ.

అల్లుడు భోజనానికి వచ్చినప్పుడు ఇంట్లో కనబడుతున్న వాతావరణం చూసి నవ్వుకున్నాడు. రక్త సంబంధం ముందు కోపాలు-తాపాలు యెంత సేపు?ఎన్ని పొరపొచ్చాలు ఉన్నాక్షణంలో ఏకమైపోతారు అనుకున్నాడు.

సాయంత్రం చుట్టూ పక్కలవారిని,దగ్గర బంధువులని పిలిచి భోగి పళ్ళు పోసేటప్పుడు అక్షింతలు వేస్తూ.. మనుమరాలికి అరవంకీ పెట్టింది. కూతురి కళ్ళల్లో సంతోషం చూసి శాంతమ్మ కి సంతోషం వేసింది

శాంతమ్మ తెచ్చిన తినుబండారాలని, కాయగూరలు,పండ్లు ని అందరికి పంచి మా పొలంలో పండినవి, మా పెరట్లో కాసినవి గర్వంగా చెప్పింది స్వప్న.

ఆ సందడి సద్దు మణిగాక."ఇక నేను వెళతాను స్వప్నా అంది.

'"అమ్మా ఇక్కడే ఉండకూడదా" అని అడిగింది. స్వప్న

"లేదమ్మా వెళతాను " అంటుంది తను.

ఇలా కలగంటున్న శాంతమ్మ" ఏమ్మా శాంతమ్మ గారు".అన్న పిలుపుకి ఉలికి పడి కనులు తెరిచింది..

అమ్మా! మీరు దిగే స్టాప్ వచ్చింది. దిగండి అని చెప్పాడు బస్ కండక్టర్.
మళ్ళీ ఎవరో సాయం చేస్తేనే ఆ సంచీలన్ని బస్ లోనుండి కిందికి దిగాయి.

నిదానంగా చేతుల్లో బరువు లు మార్చుకుంటూ బస్ లో కన్న కల నిజం కావాలని కోరుకుంటూ కూతురు స్వప్న ఇంటికి చేరుకుంది శాంతమ్మ గారు.

కూతురు ఇంట్లోనే ఉంది. పిల్లలు వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు.

"హాయ్ అమ్మమ్మా!."అని పలకరించి ఆటలో ముంగిపోయారు.

తల్లికి తాగడానికి నీరు తీసుకువచ్చి ఇచ్చి.."నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా సంచుల మోత వేసుకుని రోడ్దేమ్మట పడి మోయలేక మోయలేక నడిచి వచ్చి మా పరువు తీయకు. అయినా ఇవన్నీ నిన్నెవరు తెమ్మన్నారు." అని విసుక్కుంది.

"అదేమిటమ్మా.. పిల్లలున్నారు వాళ్ళ కోసం కనీసం ఈ మాత్రమయినా పిండివంటలు చేసి ఇవ్వడం నాకేం కష్టం ."అంది శాంతమ్మ.

"నీకు కష్టంగా ఉన్నవి నువ్వు ఎలాగు ఇవ్వలేవులే! ఈ చెత్త చెదారం కూడా ఎందుకు ఇవ్వడం? చూసేవాళ్ళు కూతురి కోసం యెంత కష్టపడుతుందో అని అనుకోవడానికి తప్ప" అంది. స్వప్న.

ఆ మాటకి శాంతమ్మ మనసు విల విల లాడిపోయింది. గుండెల్లో గునపాలు గుచ్చినట్లు అయింది.మౌనంగా ఊరుకుంది. తనకి ఒక కొడుకు ఉండి ఇదే మాటలు కోడలు అని ఉంటే గనుక ఎలా జీర్ణించుకునేదో అలాగే జీర్ణించు కుంది. ఆ నిమిషంలో కూతురే కోడలు లాగా అనిపించింది.
.
పిల్లల దగ్గరికి వెళ్లి "పండు నీకోసం ఏమి తెచ్చానో చూడు. ఇదిగో.ఈ నేతి అరిసె తిని చూడు .ఎంత బాగుంటుందో! పండు..ఈ తేగని తినడం తెలుసా నీకు? రా చూపిస్తాను . తింటే చాలా బాగుంటుంది." అంటూ వాళ్ళకి దగ్గర కాబోయింది.

మనుమడు ఒక అరిసెని కొరికి తిని చూసి ఛీ ! ఇదేమి బాగోలేదు అమ్మమ్మా! నాకు ఫైవ్ స్టార్ చాక్లెట్స్ కావాలి .అని చెప్పాడు..

పండు ఏమో.. తేగని చూసి మొహం చిట్లించింది. నాకు వద్దు నువ్వు తెచ్చినవి అన్నీ పిచ్చి స్నాక్స్ అని తోసేసింది.

శాంతమ్మ బాగా నొచ్చుకుంది మనుమరాలికి చేయించుకుని వచ్చిన అరవంకీ తీసి ఇచ్చింది. కూతురు..అటు ఇటు తిప్పి "ఇది చేయించే ముందు నాకు ఒక మాట అన్నా చెప్పవచ్చు కదా! లేటెస్ట్ మోడల్స్ చూసి చేయించేదానిని "అంది. మళ్ళీ అంతలోనే "అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేస్తావు.ఇది నాకేమి నచ్చలేదు" అని చెప్పింది.

"నేను నెల నెలా స్కీం లో కట్టిన డబ్బుకి కొంత డబ్బు వేసి చేయించాను. ఆ రోజు షాప్ నుండి చాలా సార్లు పోన్ చేసాను. నువ్వు పోన్ తీయలేదు స్వప్నా అందుకే నేను నా ఇష్టప్రకారం కొనాల్సి వచ్చింది. ఇప్పటికి ఎలాగోలా పెట్టేయిలేమ్మా! ఈ సారి పెద్దదిగా కావాల్సి వచ్చినప్పుడు నీకు నచ్చినట్లు చేయించుకోవచ్చు" అని చెప్పింది.

"భోజనం చేయి"అంది మొక్కుబడిగా. భోజనం వడ్డించి ఎదురుగా కూర్చుని "అయితే ఆ పొలం కాని ఇల్లు కాని అమ్మి డబ్బు ఇవ్వనంటావు.".అడిగింది స్వప్న..

''నేను ఇవ్వనని అనలేదు స్వప్నా! నాకు నువ్వు తప్ప ఇవ్వడానికి ఇంకెవరు ఉన్నారు. బంగారం లాంటి పొలం ఇప్పుడుకిప్పుడు అమ్మితే ఏం వస్తుంది చెప్పు? ఇరుకు గదుల ఇల్లు తప్ప కొన్నాళ్ళు ఆగితే మంచి విలువ పెరుగుతుంది. కాస్త ఓపిక పట్టి నేను ఎందుకు చెపుతున్నానో..అర్ధం చేసుకో..'అని చెప్పింది

"పెద్దరికం పేరు చెప్పి ఏదో విధంగా సర్దిపెట్టాలని చూస్తావు కాని బిడ్డ మనసు అర్ధం చేసుకోవు నాకు మంచి ఇంట్లో ఉండే రాత లేదు అనుకుంటాను" అంది నిష్టూరంగానో,వెటకారం గానో..

శాంతమ్మ మాట్లాడలేదు. నాలుగు గంటల సమయమప్పుడు నేను ఇంటికి వెళతాను అంటూ బయలుదేరబోయింది. ..

ఆమెకి ఇంటితో పెనవేసుకున్న అనుబంధాలు అలాంటివి. ఒక్క రాత్రి కూడా ఎక్కడా ఉండలేని తనం.

ఓ,, రెండు గంటలుండు ఇప్పుడే వచ్చేస్తాను..ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో చిన్న పంక్షన్ ఉంది అని పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళింది. పండు చేతికి తను ఇచ్చిన అరవంకీ పెట్టడం చూసి నవ్వుకుంది సంతోషించింది.

"ఏదో స్వప్న నచ్చలేదు అని ఒంక పెట్టింది కాని బంగారు ఆభరణం అంటే ఇష్టం లేకుండా ఎందుకు ఉంటుంది.? పైగా ఇప్పుడు గొప్ప కోసమైనా ప్రదర్శించాలని ఉండే మనస్తత్వం తనకి తెలియదా స్వప్న మనస్తత్వం అనుకుంది లోలోపల.

ఆ రెండు గంటల సమయాన్ని రెండు యుగాల్లా గడుపుతూనే.. ఇంట్లో చిందర వందరగా ఉన్న వస్తువులన్నిటిని సర్దింది.

ఇంటి ముందు  శుభ్రం చేసి వాకిట్లో సంక్రాంతి ముగ్గు పెట్టింది.
ఆ ముగ్గుని తను తెచ్చిన పూలతో చక్కగా అలంకరించింది.

ఎప్పుడు కూతురు వస్తుందా ! ఎప్పుడు ఇంటికెళ్ళి పడదామా అని ఎదురు చూసింది. పది గంటలకి కాని స్వప్న ఇంటికి రాలేదు.పిల్లలు ఇద్దరూ నిద్రకళ్ళతో వేలాడుతున్నారు.

"వస్తాను రా బుజ్జి, పండు టా..టా అని చెప్పి..స్వప్నా..రేపు పిల్లలని తీసుకుని నువ్వు, అల్లుడుగారు భోజనానికి వచ్చేయండి' అని చెప్పింది.

"వీలయితే వస్తాం లేకపోతే లేదు. హైరానా పడి నాలుగు రకాలు వంటలు చేసి వస్తున్నారా లేదా అని తొందరగా రమ్మనమని పోన్ లు మీద పోన్ లు చేయకు"అని హెచ్చరించింది స్వప్న.

"సరే నమ్మా వెళ్లొస్తాను..పిల్లలు జాగ్రత్త.!.నువ్వు జాగ్రత్త" అని చెప్పి బయటకి వచ్చింది. గుమ్మం దాకా వచ్చి నట్టే వచ్చి లోపలి తిరిగి వెళ్ళిపోయింది కూతురు.

ఆ రాత్రి వేళ  బస్ సౌకర్యం లేని తమ కాలనీకి ఆటో  మాట్లాడుకుని ఇంటికి వచ్చి పడింది.

ఏమి తినాలనిపించలేదు.తాగాలనిపించేలే
దు. స్వప్న ప్రవర్తనని మర్చిపోలేక పోతుంది. తల్లి బిడ్దల బంధం కూడా "ధనం మూలం మిదం జగత్" లో పలుచనై నీరు కారి పోయింది.

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే! అన్న మాటలు అక్షరాలా నిజం అనిపించాయి.

అలాగే ఆలోచిస్తూ పడుకుంది. మరలా ఏదో గుర్తుకు వచ్చినట్లు ఒక ఉదుటున లేచివెళ్ళి ఆస్తిపాస్తులున్న డాక్యుమెంట్స్ అన్నీ ఒకచోట చేర్చి పెట్టింది నిద్ర రాని రాత్రి ఎంతకీ తెల్లారదు అన్నట్టు.వేకువ కోసం ఎదురు చూసింది.

నాలుగు గంటలకి రామాలయంలో మ్రోగుతున్న గంటలు విని ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని రధం ముగ్గు పెట్టి.. పసుపు,కుంకుమతో అలంకరించి.పువ్వులు పేర్చి అందంగా ఉన్న వాకిలిని చూస్తూ లొపలకి వచ్చింది.

స్నానాదులు ముగించుకుని పూజ అయ్యేటప్పటికి ఆరు గంటలు దాటింది. అలాగే గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని వచ్చింది పాలు కాఛి గ్లాస్ లో పోసుకుని వచ్చి అందులో ఏదో టాబ్లెట్స్ వేసుకుని బాగా కలుపుకుని తాగింది. భారంగా నిట్టూర్చింది

పనివాళ్ళు వచ్చారు. వారికి చేతినిండుగా చేసిన తినుబండారాలు అన్ని పెట్టి పంపింది. "కళ్ళు తిరుగుతున్నాయి నేను కాసేపు పడుకుంటాను" అని చెప్పి అలా వాలు కుర్చీలో తలవాల్చి పడుకుంది.
అలా పడుకున్న శాంతమ్మ కూతురు, అల్లుడు,పిల్లలు వచ్చేవరకు లేవలేదు .

వాళ్ళు వచ్చి తట్టి లేపుతున్నా లేవనే లేదు. కూతురు తల దగ్గరకు వచ్చి అమ్మా , అమ్మా అని కదిల్చేటప్పటికి కూతురి చేతిమీడకి ఒరిగి పోయింది నిర్జీవంగా.

ఏ ప్రేమని 
ఏ సేవని ఆశించక,  

చూడటానికి వచ్చిన అందరూ ఎంత అదృష్టవంతురాలు పండుగ పూట చనిపోయింది. అంటున్నారు

"అమ్మా ఒక్కసారి మాట్లాడమ్మా ! మాట్లాడమ్మా..!" కూతురు అడుగుతూనే ఉంది. ఆ పిలుపు వినబడని తీరాలకి ఆమె ఆత్మ ఎప్పుడో చేరుకుంది.


(ఆటా సావనీర్ లో  వచ్చిన నా కథ )

15 కామెంట్‌లు:

భాస్కర్ కె చెప్పారు...

ధన సమాజాన్ని కళ్లకు కట్టారండి, వాస్తవ చిత్రణ.

జలతారు వెన్నెల చెప్పారు...

:(( కధ బాగుందండి వనజ గారు.

Sai చెప్పారు...

కధ చాలా బాగుంది వనజమాలి గారు...
ముగింపు లైన్లు బాధగా ఉన్నాయి..

కాయల నాగేంద్ర చెప్పారు...

కధ బాగుంది వనజ గారు!

జీడిపప్పు చెప్పారు...

ఇలాంటి (తల్లిదండ్రులను సరిగా చూసుకోని పిల్లల) కథలు అమెరికాలో భలే హిట్టవుతాయి :)

http://100telugublogs.blogspot.in


.

knmurthy చెప్పారు...

సహజత్వానికి దగ్గరగా వుంది

jp చెప్పారు...

మానసికంగా , శారీరకంగా అలిసిపోయిన నాలాంటి వాళ్ళకి మీ కథ కర్తవ్యాన్ని సూచించింది. చాలా Thanks.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Jp గారు.. మీ కామెంట్ వణికించింది. నేను ఈ కామెంట్ ని పోస్ట్ చేయకూడదు అనుకున్నాను. కానీ మీరు ఈ రిప్లై చూస్తారు కాబట్టి వెంటనే స్పందించి ఈ వ్యాఖ్యకి ఆన్సర్ చేస్తున్నాను.
దయచేసి.. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. జీవితం అంటే పోరాటమే కదా!పోరాటంలో ఓటమి చవి చూస్తుంటే.. అలసి పోతామా? మరలా ప్రయత్నించి గెలుపు కొస పట్టుకుని అక్కడికి చేరుకోవాలి.
కథలలో ల్లా జీవితాలు ముగించుకోవడం వివేకవంతుల లక్షణం కాదు.
దయచేసి ఆలోచించండి. లేకపోతె ఈ కథ వ్రాసినందుకు నేను బాధపడతాను.

Overwhelmed చెప్పారు...

amma,

kathalaku ilanti ending ivvakandi. ee situations lo unnavaru vallaku relate chesukuntaru. edanna manchi alternatives suggest cheyyandi.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కొన్ని కథలు ముగింపు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే జీవితం కథగా మారింది గనుక.
ఆశావాదంతో బ్రతకడానికి బ్రతకాలనే ఆసక్తి లేదు కాబట్టి ఆమె జీవితం అలా ముగించుకుంది.
Enki ..గారు ఈ కథని మలుపు తిప్పి ముగించ వచ్చును. కానీ కొన్ని కథలు ఇలాగే ఉంటాయి..
ఈ కథలోని పాత్ర కన్నా దయనీయ పరిస్థితి లో ఉన్న వారు బ్రతుకుతున్నారు. వారిని చూసి స్ఫూర్తి తోనూ ఆశావాదం తోనూ బ్రతకాలి.కూడా.
మీ సూచనకి ధన్యవాదములు. మంచి సూచనలు చెప్పడానికి "మారు పేరు తో ప్రొఫైల్" సృష్టించుకోవఫం ఎందుకండీ!? నా బ్లాగ్ లో సద్విమర్శకి ఎప్పుడూ..స్వాగతం.సరి అయిన ప్రొపైల్ లేకుండా కామెంట్ చేస్తేనే. డిలీట్ చేస్తాను.
ఏది ఏమైనా .. మంచి సూచన చేసినందుకు ధన్యవాదములు. సాహిత్యం ప్రయోజనకారి కావాలి అని నేను 100 శాతం నమ్ముతాను .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ది ట్రీ భాస్కర్ గారు..
@ జలతారు వెన్నెల గారు
@సాయి..గారు..
ముంగింపు విషాదమే! కానీ ఏం చేస్తాం. అది అలాగే జరగాలని రాసి ఉంది. నేను వ్రాయాల్సి వచ్చింది.
అలా ప్రవర్తించే కూతురులు ఉన్నారని చెప్పడమే నా ఉద్దేశ్యం. మీ అందరి స్పందన కి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కాయల నాగేంద్ర గారు వాస్తవ కథలు ఇందుకు భిన్నంగా లేవు. మన కథలలోని కథే ఈ కథ. మీ స్పందనకి ధన్యవాదములు అండీ!
@జీడిపప్పు గారు.. మీ స్పందనకి ధన్యవాదములు. తల్లిదండ్రులని నిరాదరణలో ముంచి వెళ్ళిన వారికి ఈ కథలు నచ్చుతాయి..అండీ.:) అయితే అక్కడి వారికి నచ్చినట్లే వ్రాయాలని నేను అనుకోలేదు. ధన్యవాదములు.
@kn .murty గారు. . అవునండీ!! కథ కథ కాదు. ధన్యవాదములు.

అజ్ఞాత చెప్పారు...

మీ కథ ఇటీవల నే చూసిన మా బంధువుల అమ్మాయి గయ్యాళి తనం, అత్యాశ, అల్లుడు కాక కూతురిచే సాధించబడుతున్న ఇటీవలే భర్తను కోల్పోయిన ఓ తల్లి వ్యథ మనసులో మెదిలింది. :( అవిటివాడు, మానసిక వికలాంగుడైన మొదటి కొడుకు ఆలనాపాలనలో తమను కొద్దిగా అశ్రద్ధ చేసిందనే కసి కూడా. 30ఏళ్ళ వయసున్న ఆ మొదటి కొడుకు పోయాక ఈ అమ్మాయి పెళ్ళి చేశారు, ఆతరవాత రెండేళ్ళకు ఆమె భర్తనుకోల్పోయారు. ఇప్పుడు వున్న ఆస్థి మీద కూతురు కన్నేసింది, ఉద్యోగం లేని చదువుకుంటున్న తమ్ముడికే అంతా కట్టబెడుతుందేమో అన్న దురాశ. ఆడపిల్లలకు ఆస్థి హక్కు అనే తలమాసిన ఎదవ చట్టంతో తల్లిని, తమ్ముడిని కోర్టుకీడుస్తామనే వుద్దేశ్యంలో వుందా, ఇంజనీరును పెళ్ళాడి సుఖంగానే వున్న ఆ ఇంజనీరింగ్ చదివి గృహిణిగా వున్న ఆ కూతురు. అలా చేయడం తప్పు అని చెప్పబోయిన సమీప బంధువులకి 'మా మమ్మ మా ఇష్టం, ఇది మా కుటుంబ విషయం' అని కరిచినంత పనిచేసిన శునకత్వం.

ఇలాంటి పిల్లలను నిర్దాక్షిణ్యంగా షూట్ చేసి పారేసే హక్కు కన్నవారికి కల్పించే చట్టం రావాలంటాను. :(

నిరంతరమూ వసంతములే.... చెప్పారు...

ఆటా సావనీరులో మీ కథ వచ్చినందుకు అభినందనలు వనజా గారు...its a heart touching story! బాగుంది!

శ్రీ చెప్పారు...

అభినందనలు వనజ గారూ! చాలా బాగుంది...
@శ్రీ