22, జులై 2012, ఆదివారం

భావ చౌర్యం.. అంటే

నిన్నటి పోస్ట్ లో భావ చౌర్యం అని చెప్పాను కదా!

భావ చౌర్యం అనగానే నాకు ఒక సంగతి గుర్తుకు వస్తుంది.ఆ విషయం చెపుతాను.

అప్పుడప్పుడే కాస్త నా కవిత్వపు పైత్యం ముదురుతున్న రోజులు.. ఒక కవిత ని వ్రాసుకుని వ్రాసిన కవిత ని హ్యాండ్ బేగ్ లో భద్ర పరచుకున్నాను.

కొన్నాళ్ళకి నెల్లూరు నుండి విజయవాడకి వస్తూ రైలు ప్రయాణం చేస్తున్నాను.

దొరికిన విండో సీట్ వెనక్కి  వెళుతున్న అందమైన దృశ్యాలు నాలో ఉన్న కవయిత్రి రూపం పెళ్ళున  ఒళ్ళు విరుచుకుని లేచింది.

హ్యాండ్ బేగ్ లో నుండి వ్రాసిన కవిత తీసుకుని చదువుకుంటున్నాను.

సుమారు నా వయస్సు ఉన్న ఒక ఆమె తో..ప్రయాణంలో పలకరింపుగా  అంతకు ముందు రెండు మూడు మాటలు కలిపి ఉన్నాను ఆమె ..నన్ను మాటల్లోకి దించుతూ.. ఏమిటి..మీలో మీరే చదువుకుని నవ్వుకుంటున్నారు.. కవిత్వం అనుకుంటాను..నాకు చూపించ వచ్చు కదా..అని అంది. సరే  అని ఆమెకి  ఇచ్చాను చూడండి..అంటూ (లోలోపల గర్వంగా ఫీల్ అవుతూ )  .ఆమె ఆ కవిత చదివి.. ఎంత బాగా వ్రాశారు అని మెచ్చుకుంది.

ఏ పత్రికలకైనా పంపారా? అని అడిగింది. నేను ఇలా అన్నాను." లేదండి ..పంపలేదు.మేము ఉండే చోట పోస్ట్ ఆఫీస్ సౌకర్యం లేదు. ఇప్పుడు అమ్మ వాళ్ళింటికి వెళ్ళాక పెయిర్ చేసి అక్కడ నుండి పంపుతాను" అని

అలా మాట్లాడుకుంటూ .. విజయవాడకి సమీపంగా రాగానే  నేను నా కవిత వ్రాసిన పేపర్ కోసం చేయి చాచి ..నా కవిత ఇస్తారా? అడిగాను.

లేదండీ.. నేను ఇవ్వదల్చుకోలేదు మీరు ఈ కవితని పత్రికలకి పంపక అశ్రద్ద చేసేలాగా ఉన్నారు. నేనే ఈ కవితని స్వయంగా పత్రికకి పంపుతాను ..మీ పేరు,ఊరు అడ్రస్ అన్నీ వివరంగా చెప్పండి అంటూ నన్ను తొందర పెట్టారు.
ఆ సమయంలో..మరో మాట చెప్పడానికి కూడా సమయం లేక గబా గబా నేను నా వివరాలు చెపుతుంటే ఆమె నేను వ్రాసిన కవిత వెనుక ఆ వివరాలు వ్రాసుకున్నారు.

నేను రైలు దిగిపోయాను. ఆమె అదే ట్రైన్ లో హైదరాబాద్ వరకు వెళ్ళాలని చెప్పారు. ఆమెతో పాటు .. నా కవిత వెళ్ళిపోయింది.

తరువాత కొన్ని నెలలకి ఓ.. వార పత్రికలో ఓ..పుల్ పేజీలో ప్రచురితమైన నా కవిత. ఎంత అందంగా అచ్చై ఉందొ.. నాకు చాలా సంతోషం వేసింది. ఆనందంగా నాట్యం చేసాను.

నా కవిత ..నా కవిత అంటూ..అందరికి చూపించాలనుకుని బయటకి వస్తూ ..కవిత వ్రాసిన వారి పేరు చూస్తూ ..షాక్ కొట్టినట్లు ఆగిపోయాను.

కోపం,దుఖం రెండు కలగా పులగమై ..చీ.. చెత్త..______ అని కోపంగా తిట్టుకున్నాను.

ఆమె పేరు తెలుగు భాష అంత అందంగా ఉంది. కాని బుద్ది మాత్రం .".గుడిసేటిది". 


 ఆమె ఎవరో నాకు తెలియదు కాని ఆమె ఒక రచయిత్రి . లెక్చరర్ గా పనిచేస్తుంటారు. అని చెప్పారు.

స్టూడెంట్స్ తో..కూడా కవితలు వ్రాయించి..ఆకవితలన్నీ సంకలనం తీసుకు వస్తానని అందరి దగ్గర సేకరించి.. తర్వాత తన పతి మీద ప్రేమతో.. ఆ కవితలన్నీ కలిపి ఆయన గారి పేరు పై ప్రచురింప జేసి..సంకలనం తెచ్చారని ఆమె స్టూడెంట్ ఒకరు "రుక్సానా" ఆనే అమ్మాయి నాకు చెప్పింది.

ఈ పోస్ట్ చూస్తే ఆమె తప్పకుండా గుర్తుపడతారు. చేసిన పనికి సిగ్గుపడే ఆమె అయితే ఆ పని అసలు చేయరు కదా!
ఆమె తెలుగు పద్యములలో ఒక పద్య లక్షణం ని తన కలం పేరుగా పెట్టుకున్నారు.
ఎంత గొప్పో!

తర్వాత నేను చాలా సార్లు ఆ విషయం తల్చుకుని బాధ పడ్డాను. నా ఫ్రెండ్ నన్ను ఓదార్చేది..ఇలా ..అని.." నీకేమిటి ..బంగారు! నువ్వు ఏ సబ్జెక్ట్ పైన అయినా వ్రాయగలవు. నువ్వు అలా నిరుత్సాహపడవద్దు.. చక్కటి భావ వ్యక్తీకరణ నీ సొంతం. నువ్వు వ్రాయాలి..వ్రాయగలవు కూడా..అని నన్ను ప్రోత్సహించిన నా నేస్తం కి ఎప్పటికి నేను థాంక్స్ చెప్పుకుంటాను.

తర్వాత నేను ఎన్నో కవితలు వ్రాసుకున్నాను. కొన్ని పత్రికలో ప్రచురింపబాడ్డాయి.కాని నేను ఆ విషయం మాత్రం మర్చిపోలేదు.

గొప్ప పేరు సంపాదించుకున్న వారిలో కూడా అలా భావ చౌర్యం ని చేసిన వారు ఉన్నారు. బయట పడనంత వరకు అందరు.. గొప్పవారే! బయట పడితే కదా తెలిసేది. ఒక ప్రముఖ కవి ఇంగ్లిష్ బాషలోని కవితలని అనువాదం చేసి తన పేరున ప్రచురింపజేసుకున్నారు. ఇంకెవరో..సాహితిమిత్రులు అది గుర్తించి ప్రశ్నించారు కూడా..

ఇలాటిదే మరొకరి అనుభవం.

చిన్ని గీత ..ఆనే పేరుతొ వ్రాసే ఓ..యువ వర్ధమాన కవి ఉన్నాడు. ఎమ్.బి ఏ చదివి జాబ్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు.

మా అబ్బాయికి చిన్నప్పటి క్లాస్మేట్ . అతను చాలా బాగా వ్రాస్తాడు. స్పందించి ఆశువుగా అప్పటికప్పుడే గేయ రూపంలో వినిపించిన అతని భావ ప్రకటనకి ముచ్చట వేసేది.

అతను సినీ రంగం వైపు వెళ్ళాడు.జూనియర్ రైటర్గా అతను వ్రాసుకున్న కవితలని,పాటలని కూడా..అలాగే చౌర్యం చేసి..తమదిగా చెప్పుకునేవారని చెప్పి చాలా బాధపడ్డాడు.

బ్లాగ్ వ్రాసుకోమని సలహా చెప్పాను. అక్కడా అంతే కదా ఆంటీ ! అన్నాడు.!కాపీ రైట్ పెట్టుకోమని సలహా చెప్పాను. సరే అని తల ఊపాడు కాని అతను బ్లాగ్ ప్రారంభించ లేదు.

ఎప్పుడైనా కనబడితే మాట్లాడతాను ఏదో ఒక చిన్న చిత్రం కి పాట రాసే అవకాశం అతనికి వచ్చిందని చెప్పాడు.

ఒకసారి ఒక సభలో సినీ గీత రచయిత అదృష్ట దీపక్ గారు ఒక విషయం చెప్పారు. ఒక కవి తన కవిత్వం గురించి కొన్ని పరిచయ వాక్యాలు వ్రాయమని ఆయనని అడిగారట. పూర్తిగా చదివి వ్రాస్తాను..అక్కడ పెట్టి వెళ్ళ మన్నారట.అదృష్ట దీపక్ కి తీరిక లేక తనకి అసిస్టెంట్ గా   చేస్తున్నఒక అతనితో.. ఆ కవిత్వం ఎలా ఉందొ..చూసి చెప్పు ?  అని అన్నారట.

ఆ ..అందులో ఏముంది సార్.. మీరు వ్రాసిన పాటలలోని కొన్ని చరణాలను అటు ఇటుగా మార్చి ..మరి కొందరు వ్రాసినవి చూసి.. అతని కవిత్వం  వ్రాసాడు..అని చెప్పాడట అతను.

 అదృష్ట దీపక్ గారు ఈ విషయం చెప్పుతూ..ఇది అండీ కవిత్వం అంటే..అని అంటూ ..అసలైన కవిత్వం అంటే ఏమిటో..అర్ధం లేకుండా పోతుంది..అని బాధ పడ్డారు.


అలా ఉంది కవిత్వం  తీరు తెన్నులు అన్న సంగతి నేను చెప్పడం లేదు. కాని భావ చౌర్యం మాత్రం  ఉంది అని చెప్పడమే నా ఉద్దేశ్యం. .

ఆంధ్ర దేశం లో ఏ కవితా సంకలనం వెలువడినా ఒక ప్రముఖ విశ్లేషకుడి అభిప్రాయం తో ఒక  కవితా సంకలనం వెలువడుతుంది. ఆయన అందరి కవితలని మెచ్చుకుంటారు. తప్ప ఒక్క లోపం ని చెప్పరు. బహుశా..కవి లేక కవయిత్రి ని బాధ పెట్టడం ఇష్టం లేక ఏమో..అనుకుంటాను నేను.

ఇవి అండీ కొన్ని భావ చౌర్యం కబుర్లు.

10 కామెంట్‌లు:

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

మీ అనుభవాలు చాలా మందికి ఉంటాయనుకుంటాను.కాపీ కొట్టటం లో వారికి అంత త్రుప్తి ఎలా వస్తుంది.ఎంత పేపర్ లో పడ్డా తన మనసుకి తెలుసు కదా కాపీ అని.

అజ్ఞాత చెప్పారు...

హ్మ్మ్ ఈ మధ్యన బాగా వింటున్నాను,ఈ plagiarism గురించి. సినిమాల్లో చాల ఎక్కువని తెలుసు, కాని బ్లాగుల్లో కుడా ఇప్పుడిప్పుడే మొదలవుతుందన్నమాట .
ఆ మధ్యన బ్లాగుల్లో పెద్ద రభస జరిగింది ఇలాగె. పాపం ఎవరో తను రాసుకుని అచ్చువేయిన్చుకున్న పుస్తకం లో కవిత ని తనది అని చెప్పి బ్లాగులో పబ్లిష్ చేసేసారు ఒక రచయత్రి, తీరా అతను పెద్ద గొడవ చేసి ఏకంగా ఒక పోస్ట్ వేసేసరికి అంతా gupchup అయిపోయారు. కాని ఒక పని చేసేటప్పుడు తప్పు అని ఎవరు చెప్పవలసిన అవసరం ఉండదు ఎవరికైనా, మన మనస్సాక్షి చెప్తుంది మనకి. అది కూడా వినకుండా చేస్తే, మనమేం చేస్తాం. వాళ్ళ పరిస్తితికి జాలిపడటం తప్ప. జ్ఞానం ఎవరు దొంగిలించలేరండి, మీరు అలాంటివి కొన్ని వందలు రాయగలరు, వాళ్ళు తీసుకుని వెళ్ళింది ఒక్క కవితే, ఇంకా చెప్పాలంటే అది మీ మంచికేనండి , ఒక్క కవిత పోయింది కాని, మనుషులు ఇవి కూడా వదలరు అని అర్ధం అవుతుంది కదా మనకి. కాకపోతే మీరు ఎన్ని hints ఇచ్చిన వాళ్ళెవరో తెలుసుకోవడం అవ్వడం లేదు నా బుర్రకి. సరేలెండి వాళ్ళే వస్తారు ఎప్పుడో ఒకప్పుడు బయటకి.
మీరు మాత్రం రాస్తూనే ఉండండి.

జ్యోతిర్మయి చెప్పారు...

ఏమాశించి ఈ భావచౌర్యానికి ఒడిగడతారో..చదువు, సంస్కారం ఉన్నవారే ఇలా చేస్తే నేర్చుకున్న చదువుకే ఇది గొప్ప అవమానం.
మంచి పోస్ట్ వ్రాశారు వనజ గారూ..

అజ్ఞాత చెప్పారు...

అసలైన ఆంధ్రదేశపు తిట్టు తిట్టారు. సినిమాలలో ఇది అలవాటే. ఒకరు రాస్తారు, మరొకరి పేరు వేస్తారు. అదో దరిద్రంలెండి.

Meraj Fathima చెప్పారు...

mee okka kavithane dongilichagaligaaru kaanee mee bhaaukathanu kaadu. vanajaa dear konni anubavaalu manchive. jeevithalo jaagrattanu nerputaayi

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ది ట్రీ ..భాస్కర్ గారు.. మీరు పెట్టిన కామెంట్ చాలా చాలా అభ్యంతరకరంగా ఉంది. ఒక సారి మీరు ఎవరికీ పెట్టబోయి కామెంట్ నాకు పెట్టారో..సరి చూసుకోండి. మీ మెయిల్ ID నాకు తెలియదు..
మీరు ఏ పోస్ట్ గురించి వ్యాఖ్యానించ దలచుకున్నారో....సరి చూసుకోండి.
మీ కామెంట్ నేను పోస్ట్ చేయడం దలచుకోలేదు. కామెంట్ చేయదలచుకున్న పోస్ట్ ని మరొకసారి చదవండి

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఒద్దుల రవిశేఖర్..గారు.. మీరు చెప్పినది నిజం అండీ! థాంక్ యు.
@ సన్నాయిరాగాలు గారు. ఈ వర్డ్ నేను వినడం మొదటిసారి అండీ. (plagiarism ).నాకు పెద్దగా ఇంగ్లీష్ తెలియదు.
ఇక మీరు చెప్పినట్లు జ్ఞానం ఎవరు దొంగిలించలేరండి.
ఆమె కలం పేరు తో రచనలు చేస్తారు. అందుకే మీకు స్పురించలేదు. సరే! వారి అజ్ఞానం కి వారిని వదిలేద్దాం.
మీ అభిప్రాయానికి,అభిమానం కి ధన్యవాదములు.
@ జ్యోతిర్మయి గారు.. కొంతమంది అంతే! ఏం చేద్దాం చెప్పండి. థాంక్ యు వేరి మచ్!
@ కష్టేఫలె గారు.. కోపంలో ..అలా వచ్చేసించింది.అప్పుడప్పుడు నాకు అలవాటు.సంస్కారం కాదని తెలిసినా..విచక్షణ లోపిస్తుంటుంది.
భావదరిద్రం కన్నా భావచౌర్యం ఇంకా నీచం కదండీ! ధన్యవాదములు.
@ మేరాజ్ ఫాతిమా గారు.. మీ అభిమానానికి థాంక్ యు వేరి ముచ్.

భాస్కర్ కె చెప్పారు...

సారీ అండి, నేనవరి గురించి వ్యాఖ్యానించలేదు, మీకు సపోర్టగానే వున్న ఒక నానీ ని అక్కడ వుంచాను,
భావచౌర్యం అంత దరిద్రపు పని అనే నా ఉద్దేశ్యం.
మిమ్మల్ని భాదించివుంటే క్షమించండి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఓకే..ఓకే..భాస్కర్ గారు.. మీ అభిప్రాయం క్లియర్గా చెపుతూ.. మీరు వ్రాసిన "నానీ " ని మళ్ళీ కామెంట్ రూపం లోనో ,మీ బ్లాగ్ పోస్ట్ గానో పెట్టండి . కొంతమందికి చెంపపెట్టుగా ఉంటుంది.వివరణ తో మళ్ళీ కామెంట్ ఇచ్చినందుకు థాంక్ యు వేరి మచ్..

శ్రీ చెప్పారు...

వనజ గారూ!
ఇలాంటివి ఈనాడు కోకొల్లలు...
కొంతమంది అనువాదాలు తమ కవితలుగా చెప్పేసుకుంటారు...
కొన్ని చదువుతుంటే అనువాదపు వాసనలు వచ్చేస్తుంటాయి చూడండి...
అలా పట్టుబడిన ఒక ప్రఖ్యాత రచయిత నాకు తెలుసు...
చాలా భావాలు ఎవరైనా ఒక మాట చెప్పినపుడు కలగటం...
ఎక్కడైనా రెండు లైన్లు చదివితే కలగటం సహజం...
బహుశా చాలా రచనలు ఇలాగే పుడతాయేమో...
కానీ పూర్తిగా మక్కీకి మక్కీ కాపీ కొట్టడం భరించలేము...
మీదగ్గరనుంచి ఒక కవిత దొంగిలించాడమంటే...
సముద్రంలో ఓ నీటి చుక్క పోయిన్దన్నమాట...:-))...:-))
భావ చౌర్యం కంటే ఇంకా కటువైన పదమే ఉండాలి మీ అనుభవానికి...
ఈ సారి ట్రైన్లో మీతో ప్రయాణం చేస్తే...లాభం ఉంటుందన్నమాట..:-))..(సరదాకి)
@శ్రీ