8, జనవరి 2013, మంగళవారం

ఓ..కాంత ..ఏకాంత గాధ.."తన్హాయి"



"తన్హాయి" నవలని నేను నవలగానే చదివాను. నేను ఆ నవలని చదక ముందు.. ఆ నవల పై వచ్చిన సమీక్షలని చదవాలనుకున్నాను. 

కానీ.. సమీక్షలు  చదివి నవల చదివితే.. ఆ సమీక్షల ప్రభావం నాలో ఉన్న   
పఠనా శక్తిని చంపేస్తుందేమో అని అనిపించింది. 

తన్హాయి నవలని చదవడం  మొదలెట్టగానే.. కొంచెం ఆసక్తి. ..ఓహ్.. పెళ్ళయిన వారి మధ్య ప్రేమ చిగురించిందా!? ఏమవుతుందో..చూద్దాం  అనుకుంటూ ఏక బిగిన చదవడం మొదలెట్టాను. చదువుతున్న కొద్దీ పరిచయం అవుతున్న ప్రతి పాత్ర లోను..మరో నేను ప్రత్యక్షం అవుతున్నాను. కల్హార,కౌశిక్ ల ప్రేమ,వారి మానసిక సంఘర్షణ .. నాకు తెలిసిన ఎవరిలోనో చూస్తున్నట్లు బలమైన భావన. 

కౌశిక్ అనుకుంటాడు..కల్హార మనసు నాది. ఆమె పూర్తిగా నా సొంతం. ఆమెని నాతొ కలసి జీవించడానికి ఒప్పించి  నా భార్యకి తెలియకుండా.. ఆమెతో.. కలసి ఉండటం ని సాధ్యం చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత వచ్చే ప్రేమలో ..ఆ ప్రేమని సొంతం చేసుకోవడంలోను ,మరొకరికి అన్యాయం చేస్తున్నామన్న భావనలోను యెంత మానసిక క్షోభ
ఉంటుందో..చదువు కుంటూ పోతుంటే.. టెన్షన్ మొదలయింది. ఆఖరికి ఏమవుతుందో..అన్న టెన్షన్ తో.. ఆఖరి పేజీలు చదవడం నాకు అలవాటు. కానీ మనసు ఉగ్గ బట్టుకుని ఓపికగా..చదవడం చేసాను. విదేశాలలో జరిగే పెళ్ళిళ్ళు.వారు తీసుకునే స్వేచ్చా నిర్ణయాలు..అందువల్ల కుటుంబానికి జరిగే నష్టాలు గురించి ఆలోచిస్తూనే.. కౌశిక్,కల్హార ల ప్రేమ ఒక తీరం చేరాలని ఆశించాను. కానీ కల్హార యెంత సంఘర్షణ అనుభవించింది. యెంత నిజాయితీగా..తన మనసుని,భావాలని వ్యక్తీకరించ గల్గింది అని నిశితంగా చూసేటప్పటికి ఆ పాత్ర పై..నాకు అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. చదివిన బాగం నే  మళ్లీ మళ్లీ చదివాను.

అపుడు.. ఈ నవలపై ఒక సమీక్ష వ్రాస్తే అన్న ఆలోచన వచ్చింది. అది ఒక సాహసమే.. అనుకున్నాను. ఎందుకంటె..సమీక్ష వ్రాయడం అంటే.. ప్రతి పాత్రని నిశితంగా అర్ధం చేసుకోగల్గి  ఏ  పాత్ర పై అభిమానం ఏర్పరచుకోకుండా నిస్పక్షపాతంగా తప్పు ఒప్పులని చెబుతూ..వ్రాయాలి ఏమో! కానీ నాకు ఈ నవల చదవడం పూర్తయ్యేటప్పటికి "కల్హార"పాత్ర పై..విపరీతమైన అభిమానం పుట్టుకొచ్చింది. పెళ్లి అయిన తర్వాత పుట్టే  ప్రేమ పై నెగెటివ్ ఫీలింగ్ .ని ..అది సమంజసమే అని చెప్పడం సాహసం అని చెప్పను. అది సహజం అని కొందరైనా గుర్తించారు కాబట్టి ..అలాటి ప్రేమలోని.. లోతుపాతులని, కలసి బ్రతకాలి అనుకునే టప్పుడు ఉండే   సాధ్యా సాధ్యాలని .. చెప్పే ప్రయత్నం చేసారు ..నవలా రచయిత్రి.

మానసిక మైన ప్రేమ మాత్రమే సొంతం చేసుకుని.. బాధతో విడిపోయిన పెళ్ళయిన ప్రేమికులు కల్హార-కౌశిక్ లు. వారి మధ్య శారీరక సంబంధాలు కనుక నెలకొని ఉంటే.. వారి జీవిత భాగస్వామ్యులు చైతన్య,మృదుల..అంత పాజిటివ్గా ఆలోచించ గల్గేవారా!? అన్న కోణంలో.. నేను చేసిన ఈ సమీక్ష. ఇది.
  
ప్రేమ .. ఒక భావ ఉద్వేగం,కొన్ని అనుభూతుల పుష్ప గుచ్చం. 
పెళ్లి ..ఒక భాద్యత తో కూడిన ఆలోచనా స్రవంతి.


ఎవరి యెదలో ఎప్పుడు ఈ ప్రేమ జనియిస్తుందో..ఎందుకు  మరణిస్తుందో ..! మరణించి బ్రతికి ఉంటుందో..ఎవరు చెప్పలేరు.


భావాలు,అభిరుచులు కలసినంత మాత్రాన ఎవరు  స్నేహితులు అయిపోరు.కలవక పోయినా భార్యాభర్తలు కాకుండాను పోరు. కానీ .. ఆమె లేదా అతని ఫీలింగ్ ని తన ఫీలింగ్ గా అనుభూతి చెందే  భావం మాత్రం ..ఖచ్చితంగా iప్రేమే! 

ఆ ప్రేమలో స్వార్ధం ఉంటుంది కౌశిక్ ప్రేమలో స్వార్ధం ని చూస్తాం మనం, కల్హార మనసు తనది అని తెలుస్తూనే ఉంది. ఆమె మనసు పై సర్వ అధికారంఉన్నప్పుడు..ఆమె శరీరం ని తను  కోరుకుంటున్నాడు.అది అతనికి తప్పుగా తోచలేదు. ఎందుకంటె అతను పురుషుడు. ఏ పురుషుడు కూడా నీ మనసుమాత్రమే నాకు కావాలి నీ శరీరం  నాకు అక్కర్లేదు అనడు. తనువూ,మనసు కలిస్తేనే పరిపూర్ణం అనుకోవడం కద్దు.


అదే సంఘర్షణ కల్హార మనసులోనూ తలెత్తి..కౌశిక్ ని తను మనసారా  కోరుకుంటున్నాని అర్ధం కాగానే.. భయం కల్గుతుంది  అది ఆమెలో కల్గిన శారీరక,మానసిక స్పందనలకి పరాకాష్ట. అది మనం గుర్తించ గల్గుతాము కూడా.

కౌశిక్ ని ప్రేమించానని తెలియగానే ఆమె మనసులో తలెత్తిన సంఘర్షణ .. అదే ప్రేమని కొనసాగించాలనే ఉద్దేశ్యం ఉంటే..తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలు ఆమెకళ్ళ ముందు కదలాడి..ఆమెని కట్టడి చేసి ముందుకు వెళ్ళనీయకుండా సంకెళ్ళు వేసాయి కానీ.. కౌశిక్ పై ఆమెకి కల్గిన ప్రేమని మొదలంటా తుడిచివేయలేకపోయింది..అంటే.. మనసు యొక్క ప్రభావం మనిషిని శాసించ లేదని చెప్పకనే చెబుతుంది.

కౌశిక్ కల్హార ల మద్య ఒక ఆకర్షణ ,బలీయమైన మోహం,ఇద్దరు దగ్గరగా ఉండాలనే కాంక్ష కూడా కనబడుతుంది.వ్యక్తీ గతమైన భావనలకి విలువనీయకుండాఇద్దరూ కూడా వారితో ముడిపడిన మిగిలిన వారి గురించి కూడా ఆలోచించుకుని విడివడటం.. "తన్హాయి" చదివిన పాఠకుల అందరి కి నచ్చిన విషయం.

కల్హార మరో రాజేశ్వరి కాలేదు. చినుకుకై పుడమి నోరు తెరిచి నట్టు..కౌశిక్ ప్రేమకై ఆమె అంతరంగం పరితపించింది. అయినను మోహం తో అతని దరి చేరలేదు.కౌశిక్ ప్రేమలో ఆమెకి హృదయ సాంత్వన లభించింది. ఆమె స్నేహితురాలు మోనికా ఇంట్లో వారు ఇరువురు కలసినప్పుడు ప్రేమలోని ఒక ఉద్వేగం తో..వారుఇరువురు ఆత్మీయంగా దగ్గరిగా ఒదిగిపోవడంలో ప్రేమ తప్ప దేహపరమైన కాంక్ష ఉండకపోవడాన్ని  మనం చూడవచ్చు. 

చైతన్య తో.. గడిపిన జీవితంలో ప్రేమ లేకపోయినా ..ఆ బంధంలో భద్రత ఉంది. తన కూతురి బాగోగులు,సమాజంలో ఒక గౌరవనీయమైన స్థానం కూడా ఉన్నాయి . అందు కోసమే.. ఆ ప్రేమని త్యజించింది.
హటాత్తుగా ..ఆమె కి లభించిన  ప్రేమ పాత్ర లో కౌశిక్ ఇచ్చిన ప్రేమామృతం తో నింపబడిన తర్వాత కూడా ఆమె సంశయించింది. నిజాయితీగా తనలో కౌశిక్ పట్లకల్గిన భావ సంచలనాలను చైతన్యకి చెప్పడం అన్నది సాహస నిర్ణయమే!ఇలా ఎందుకు  చెప్పడం ? మనసులోనే దాచేసుకోవచ్చు కదా ..అన్న చిరాకు కల్గుతుంది. కానీ కల్హార తనను తానూ మోసగించుకొని,ఇతరులని మోసగించే గుణం లేని నిజాయితీ కల్గిన స్త్రీ. 

చైతన్య కూడా .. మీరివురి మధ్య సంబంధం అక్కడి వరకు వెళ్ళిందా..? అనే సందేహాన్ని పదే పదే వ్యక్తీకరిస్తాడు. అది ఒక అనుమాన పూర్వకమైన  సందేహం,అవమాన పూర్వక మైన సందేహం కూడా.

అలాంటి సందేహం పురుషునిలో ఉంటుందని తెలుసు కాబట్టీ.. కల్హార పాత్రని కౌశిక్ తో మమేకం
చేయకుండా..శారీరక సంబంధాలకి అతీతమైన ప్రేమ కూడా ఉంటుందని ఒక పాజిటివ్ దృక్పధాన్ని చెప్పే ప్రయత్నంలో  సపహలీకృతం అయ్యారనే చెప్పవచ్చు. 

రచయిత్రి.. ఈ కోణం లోనే.. కల్హార చుట్టూ..ఒక బలమైన కోట గోడ కట్టారు. స్త్రీ మనసులో పెళ్లి తర్వాత కూడా ప్రేమ జనించడం సహజమైనదే! వివాహ బంధంలోమూడో మనిషి కి ప్రవేశం కొన్ని అసంతృప్తుల మధ్య మాత్రమే సులువు అవుతుంది. ఆ అసంతృప్తి కల్హార మనసులో ఉంది. ప్రేమ లేని పెళ్లి ఉంటుంది. ఉందికూడా. అదే ప్రేమ ఉన్న మనుషులు ఒకటిగా కలసి ఉండటానికి ..అంతకి ముందు ఉన్న బందాలని త్రుంచుకు వెళ్ళ గల్గె సాహసం భారతీయ స్త్రీకి ఉండదు అనికాదు కాని.. ఆ సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ముందు..వివేకం కల వ్యక్తిగా ఆలోచించడం, నిజాయితీగా చెప్పడం .. జీవితాంతం ఒక అనుమాన పూరితమైనప్రశ్నకి సమాధానం తానూ చెప్ప గల్గినా  కూడా ఆ ప్రశ్న ని ఎదుర్కోడానికి తయారుగా తనని తానూ బలోపేతం చేసుకోవడం సామాన్య విషయమేమీ కాదు.చాలా మంది కల్హార పాత్రని చిన్న చూపు చూస్తారేమో..కూడా! పెళ్లి అయిన స్త్రీకి మళ్ళీ ప్రేమ ఏమిటి? అన్న నిరసన భావం తో పాటు చైతన్య కాబట్టి అర్ధంచేసుకోగల్గాడు..అన్న సానుభూతి చైతన్య పై కలగడం సాధారణ విషయం.

మనసు భావ సంచనల రూపం. దురదృష్టవశాత్తు మనసుని మనం నగ్నీకరించి చెప్పలేం. అలాగే  మాట కూడా. మనం  మాటకి ముసుగు వేస్తాం. కల్హార తనమనసుని ఎక్కువ కాలం దాచుకోలేకపోయింది. నిజాయితీగా ఏం  చేయాలో  చెప్పమని చైతన్యని  అడుగుతుంది. ఒకవేళ అతను ఆమెని ద్వేషించి ఆమె నుండివిడిపోయినా కూడా ఆమె తప్పుకు ఆమె బాద్యురాలిగా చేసుకునే వ్యక్తిత్వం ఉన్న స్త్రీ.


ఇదే నవలలో.. ఇంకా కొన్ని స్త్రీల పాత్రల కంటే కూడా ఆమె పాత్ర.. విభిన్నమైనది.

పవిత్రత అన్నది అది మానసికమా - శారీరకమా అన్నది ఎవరికి వారు విలువనిచ్చుకునే విషయం. ప్రమాదవశాత్తు పడిన ప్రేమలో.. మనసు జారిపోయినా చాలా సందర్భాలలో  కౌశిక్  సన్నిహితంగా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడల్లా   అతనిని కట్టడి చేస్తూ..ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది చైతన్య పదే పదే అడిగినప్పుడు కూడా  తానూ మనసునే కోల్పోయింది కాని శరీరాన్ని కౌశిక్ తో పంచుకోలేదు అని చైతన్య కి చెప్పగల్గింది. అదే విషయం వారి మధ్య ఎడబాటు రాకుండా ఎడబాటు కానీయ కుండా ..కాపాడ కల్గింది. చైతన్య కూడా ఒక సాధారణ పురుషుడే! తన వైవాహిక జీవితం అనే కోట కి పగుళ్ళు ఏర్పడినాయి అనితెలియగానే..తన పరువు-ప్రతిష్ట లకి భంగం వాటిల్లుతుందని బాదపడతాడు. భార్యకి తను ఏం తక్కువ చేసాడు ..ఇప్పుడేనా కల్హార ఇలా ప్రవర్తించడం,లేకఇంతకూ ముందు కూడా ఇలాటి ప్రేమ కలాపాలు కొనసా గించి మభ్య పెట్టిందా లాటి ప్రశ్నలు తలెత్తుతాయి. అదే అభద్రతా బావం మృదుల మనసులో కూడాతలెత్తడం సహజం. .

కౌశిక్,కల్హార ల మధ్య శారీరక సంబంధం కనుక ఏర్పడి ఉంటే.. చైతన్య కానీ ,మృదుల కానీ ఆ విషయాన్ని అంతా తేలికగా తీసుకునే వారా!? ఇదంతాఆలోచించేనేమో రచయిత్రి కౌశిక్,కల్హార మధ్య శారీరక దూరాన్ని ఉంచారు ఏమో అనిపించక తప్పదు. 

ప్రేమలో మోహం కూడా మిళితమై ఉండటమే..ప్రేమకి పరాకాష్ట. సంపూర్ణ ప్రేమ స్వభావాన్ని అనుభవంలోకి రానీయక ఒక ఆత్మీయ చుంభనంతో ఇరువురుప్రేమికులని విడదీయడం వెనుక.. భారతీయ మనస్తత్వమే గోచరించింది. అదే ఇంకెవరు ఆయినా లేదా రంగనాయకమ్మ లాంటి రచయిత్రి అయి ఉన్నట్లుఅయితే ఆ విషయం కి అంత ప్రాధాన్యత నివ్వరు. ప్రేమ అన్నది మనసుల కలయిక ,శరీరాల కలయిక అన్నదానికి ప్రాముఖ్యత నివ్వరు. నీ మనసులో ప్రేమేకావాలి నీ శరీరం వద్దు అనే ప్రేమికుడు ఎవరైనా ఉన్నారంటే నమ్మశక్యం కాదు. 

మన భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ ఇంకా బ్రతికి ఉంది అంటే కారణం అదే! ప్రేమ లేకపోయినా పెళ్లి జరిగాక శారీరకమైన సంబంధం ద్వారా పురుషుడు స్త్రీతో అనుబంధం ఏర్పరచుకుంటాడు. ఆ అనుబందాన్ని బలోపేతం చేసుకుంటాడు.ఒకవేళ పురుషుడు  వేరొక ఆకర్షణలో పడినా కూడా స్త్రీలు తప్పని సరి అయిసర్దుకుని ఉండే వారు కావడం వల్ల వివాహ వ్యవస్థకి భంగం వాటిల్లలేదు.

అదే స్త్రీల విషయంలోకి వచ్చేసరికి పెళ్ళికి ముందు ఎన్ని ఊహలు ఉన్నా.. పెళ్లి జరిగిన తర్వాత పురుషుడి చుట్టూ..తన ఆలోచనలని అల్లుకుని..అందుకుఅనుగుణంగా తనని తీర్చి దిద్దుకుంటూ అక్కడే జీవితాన్ని నిర్మించుకుంటుంది.

ప్రపంచం ఏమిటో తెలియని స్త్రీకి పురుషుడే ప్రపంచం. అందుకని ఏమో.. స్త్రీలని వీధి వాకిట నిలబడటానికి కూడా అభ్యంతరం చెప్పేవారు. ప్రపంచాన్ని చూసినస్త్రీకి తనకి కావాల్సినది ఏదో తెలుసుకుంటుంది. ఆ తెలుసుకున్న క్రమంలో.. హద్దు దాటుతుంది. ఆ హద్దు దాటే ప్రయత్నంలో తనకి తానే చేటుచేసుకుంటుంది. అసంత్రుప్తులని బడబాగ్నిలా దాచుకుని ..కోర్కెలని అణచుకొని వివాహ జీవితంలో మగ్గిపోతుంది. నాకు కల్హార పాత్రలో ఇదే కనబడింది. సప్తసముద్రాలు దాటినా యెంత ఉద్యోగం చేసినా.. ఆమెలో కల్గిన ప్రేమ రాహిత్యం అన్న భావనని చైతన్య తుడిచి వేయగలడా? కౌశిక్ ని ఆమె మనసు నుండి తుడిచి వేయగలడా!? 

స్త్రీ ప్రేమ మానసికం. ప్రేమించిన వ్యక్తి ని ఆలోచనలోను,జ్ఞాపకాలలోను నింపుకుని ప్రేమని క్షణ క్షణం సజీవంగా ఆస్వాదించ గలదు. ఆఉత్తెజంతోనే.. బ్రతక గలననే నిబ్బరం తోనే.. కౌశిక్ తనని వీడి పోతుంటే.. కల్గిన బాధని అనుభవిస్తూ కూడా అలాగే నిలబడి పోయింది.

ప్రతి కలయిక ఒక విడిపోవడానికి నాంది అంటారు. వారి ఎడబాటు మాత్రం జీవిత కాలం బ్రతికి ఉండటానికి అని వారిద్దరికీ మాత్రమే తెలుసు. మరో ఇద్దరికీతెలిసే అవకాశం ఉన్నా కూడా.. వారు మనిషికి ఇచ్చిన ప్రాముఖ్యత మనసుకి ఇవ్వలేదు కాబట్టి..సంప్రదాయమైన వివాహ జీవితం మాత్రం పై పైమెరుగులతో..లోపల డొల్ల గానే మిగిలి ఉంటుంది.

అవగాహన,సర్దుబాటు,రాజీపడటం,సమాజంలో గౌరవం  ఈ నాలిగింటి కోసమే ఆ రెండు జంటలు ..మరో రెండు హృదయపు శకలాల పై నిలబడి ఉన్నాయి అన్నది ఎవరు కాదనలేని సత్యం.

ఈ నవలలో నాకు అత్యంత బాగా నచ్చిన పాత్ర కల్హార. తనలో కలిగే భావనలకి ఎక్కడా ముసుగు వేయదు. అనవసరమైన పవిత్రతని ఆపాదించు కోదు.ఎప్పటికప్పుడు సహజంగా ప్రవర్తించడం కనబడుతుంది. రక్త మాంసాలు ఉన్న స్పందన కల్గిన స్త్రీగా.. ఆమె మనసులో కల్గిన భయాలని మరచిపోయే చోటుకౌశిక్ సాన్నిహిత్యమే అని ఆమెకి తెలుసు. అలాగే చైతన్య తో.. తన జీవితం లో కల్గిన లోటు కూడా ఏమి ఉండదు అని అనుకుంటుంది. కౌశిక్ నిప్రేమించడానికి, చైతన్యని ద్వే షించాల్సిన   పని లేదు అనుకుంటుంది. ఇద్దరి పైనా ఏక కాలంలో ప్రేమ కల్గినా కూడా అది తప్పు కాదనుకుంటుంది

ప్రేమ లక్షణం బహుశా అదేనేమో!అది అందరికి  నచ్చదు కూడా. ఇద్దరి పై ప్రేమ ఏమిటి..అది వళ్ళు బలిసిన ప్రేమ కాకపొతే..అని తిట్టిన్చుకోవాల్సి వచ్చినా సరే రహస్యంగా ఉంచక ఏమో..ఎందుకు కల్గిందో.. ఈ ప్రేమ ..అనుకునే.. స్వచ్చత కల్గిన స్త్రీ మూర్తి కల్హార.  ఆమె  ప్రేమని..బహుశా కౌశిక్ కూడా  పూర్తిగా అర్ధం చేసుకుని ఉండదు. ఒక్క మోనికా తప్ప.

ఒకే ఒక్క రోజు ఆయినా సరే అతనితో సన్నిహితంగా ఉండి సంపూర్ణ జీవితం ని గడపాలనే ఆకాంక్షని వ్యక్త పరుస్తుంది. అక్కడ మనసు,శరీరం రెండు కలసిన కలయికకి యెంత తపించిపోయిందో.. రచయిత్రి సహజంగా వ్రాశారు. అందులో ఎక్కడా కల్హార పాత్రని ద్వైదీ భావనలో ..తేలియాడించనూ ఒక ఇనుప చట్రంలో ను బిగించలేదు. మనసు పిలుపు కన్నా కూడా శరీరం పిలుపు  కూడా  అంతే బలంగా ఉంటుందని కల్హార పాత్ర ద్వారా.. చెప్పడం ని  పాఠకులు జీర్ణించు కోలేరేమో అన్న అనుమానం  ఉంది. కాని అలా చెప్పడం  సబబుగానే అనిపించింది.

తప్పు ఒప్పు ల దృష్టి తో చూస్తే..ఆంతా తప్పే! అసలు తన్హాయి నవల లో కల్హార పాత్ర చిత్రీకరణే తప్పు. మన మధ్య చైతన్య లు, మృదుల లు ఎక్కువ శాతం, కౌశిక్ లు మరి కొంత శాతం, అతి తక్కువ శాతం మంది మాత్రమే కల్హార లాంటి నిజాయితీ కల్గిన పాత్రలు ఉంటారు.

రచయిత్రి నాలుగు పాత్రలలోనూ తన వ్యక్తి గత అభిప్రాయం ని జోప్పించినా జోప్పించక పోయినా అది పెద్ద పరిగణలోకి నేను తీసుకోలేదు. కల్హార పాత్ర చిత్రీకరణ ని చాలా మంది స్వాగతిస్తారు అనుటలో ఎట్టి సందేహం లేదు. 

కల్హార .. వికసిత విరాజ కుసుమం. . బుద్భుదమైనభావ జాలంలోనుండి..జనియించిన  సహస్ర భావాల తో అరవిరిసిన పుష్పం..

తనలో కలిగే భావాలని,ఆలోచనలు  స్వేచ్చగా వెల్లడించు కునేటప్పుడైనా నిజాయితీ లోపిస్తే.. ఈ మనుషులకి మనసు అనే వ్యర్ధ పదార్ధం ఎందుకు? అని నాకు అనిపించినది అంటే..అంతలా కల్హార పాత్ర చుట్టూ.. నెలల తరబడి నా ఆలోచనలు చుట్టుకుని ఉన్నాయి.

పెళ్ళికి ముందు పెట్టుకునే డేటింగ్ గురించి ,  ఓపెన్ మేరేజ్ సిస్టం గురించి,వైఫ్  స్వాపింగ్ గురించి  మనం చీత్క రించు కుంటున్నాం కానీ మన భారతీయ వివాహ వ్యవస్థలో సంప్రదాయ  ముసుగులో.. ఎన్నో మనవి కాని విచ్చలవిడి తనాలు రాజ్యం యేలుతున్నాయి సంప్రదాయవాదులు పాశ్చాత్య నాగరికత తో మన వాళ్ళు చెడిపోతున్నారు అంటున్నారు .కానీ మన వారిలోనూ ఉండే బహు భార్యా తత్వాలు,అక్రమ సంబంధాలు మాటేమిటి!? కొన్ని భావజాలాల మధ్య స్త్రీ స్వేచ్చని అణగ ద్రొక్కిన ..వివాహ వ్యవస్థలో.... కల్హార లాటి వాళ్ళు తమ మనసుని..తమలో పెళ్లి తర్వాత కల్గిన భావ ప్రకంపనలని వెల్లడి చేసే నిజాయితీ తనం అందువల్ల కలిగే  పరిణామాలు మంచి-చెడులు .. వాటి మధ్య వివాహ బందానికి ఇస్తున్న ప్రాధాన్యత అందరికి నచ్చి ఉండవచ్చును.

నాకు మాత్రం కౌశిక్  ప్రేమకి దూరం అవుతున్న కల్హార మనసులో వేదన కళ్ళముందు కదలాడుతుంది. ఆమె పాత్రపై సానుభూతి కల్గుతుంది.

 "ప్రేమయన నొక పంచభూతముల సమాహారమ్ము!అందుకలయికొక్కటేను,ప్రేమికుల ముందున్న దారి!!" అని సాఖీ గీతం. ఇదేమిటి ..వీరు ఇలా విడిపోయారు అన్న బాధ కల్గింది.కన్నీళ్లు వచ్చాయి. 

మనసంటే అచ్చమైన నిజాయితీ.
 
ఆ మనసుకి లభించే కూసింత ఆలంబన, లభించిన  ప్రేమ,జీవన పర్యంతం కాపాడే స్నేహ హస్తం  దొరికే చోట  మనసు స్వేచ్చగా నిర్భయంగా మసలగల్గుతుంది.

కల్హార మనసుకి  తనకి కావలసినది దొరికే చోటు కౌశిక్  హృదయం అని తెలుసు.ఇద్దరు వివాహితుల మధ్య   అది సాధ్యం కాదు కనుకనే విడిపోయి ఆ ప్రేమని తలచుకుంటూ.. బ్రతక గలం అని .దూరం అవుతారు.    మనసు ఏకాంతంలో తనని తానూ తరచి చూసుకుంటుంది. ప్రపంచం నుండి విడివడి  ఆ ఒంటరి తనం లోనే, తనలోనే బ్రతుకుతూ.. కాసిన్ని మధుర జ్ఞాపకాలుతో....సహజీవనం చేస్తుంది.   అదే "తన్హాయి"

ఈ నవల లోని కథ పాతదే కావచ్చు. ఎందుకంటె.. వివాహం తరవాత ప్రేమ కూడా చాలా పాతదే!  ఒక "సిల్సిలా" చిత్రం.. నా కనుల ముందు..అలా కదలాడింది. ఆఖరిగా ఒకటి అనిపించింది. కల్హార-కౌశిక్ విడిపోయారు కాబట్టి ఇది..ఒక "సిల్సిలా" చిత్రం లా ఉంది. లేకపోతె.. మేఘసందేశం అయి ఉండేది అని.

 ఒక వివాహిత స్త్రీ మనసులోని భావ ప్రకంపనలని, అనుభూతులని ..అక్షరీకరించి.. "కల్హార" ని  పరిచయం చేసినందుకు. కల్పన రెంటాల గారికి ..అభినందించక తప్పదు.

అలాగే నేను గమనించిన ఒక ..చిన్న అంశం. కలువ పూలతో.. లక్ష్మి దేవిని పూజించడం కాదు.కమలాలు..అని చెప్పాలి కదా! కలువ కి  కమలానికి తేడా ఉంది .. ఆ చిన్న విషయంని గమనించలేదేమో అనుకున్నాను. కొన్ని చోట్ల ఇంగ్లీష్ లో ఉన్న సంభాషణ లన్నిటిని తెలుగులో ఉంచితే బాగుండును కదా అనిపించింది కూడా.
ప్రతి పెళ్లి కాని అమ్మాయి, పెళ్లి అయిన స్త్రీ కూడా చదవాల్సిన నవల ఇది.

 "ఓ అపురూప ప్రేమ కావ్యం " గా ఉదాహరించుకోవచ్చు కూడా. 

4, జనవరి 2013, శుక్రవారం

ఆనవాలు

పురిటి గడ్డని ఓ నాలుగేళ్ల తర్వాత చూస్తున్నాననేమో   ఎద లయలలో  ఎక్కడో రేగుతున్న  ఎడతెగని  ఉద్వేగపు అలజడి కన్ను మూతపడ నివ్వడం  లేదు. పక్క  కుదరడం   లేదు.

 పక్కనే మెసులుతున్న సవ్వడికేమో భార్య లేచి బద్దకంగా ఆవలిస్తూ "ఏమండీ! ఇకనైనా  నిద్రపోరా?ఎంతసేపని ఆలోచిస్తారు. మీకే విషయం మీద ఒక అభిప్రాయం లేనిదే ఇక మీ నాన్నకి  చెప్పి ఏం ఒప్పించ గల్గుతారు . ఆయనకన్నా సెంటిమెంటల్ ఫూల్ మీరు" అనేసింది. 

నేను ఏం సమాధానం చెప్పలేదు. "మీరు నిద్రపోతారో లేదో మీ ఇష్టం.తెల్లవారుజ్హామున లేచి  మెయిన్  డోర్  బయట  లాక్ చేసుకుని మీరు వెళ్ళిపొండి.నాకసలే నిద్ర చాలడం లేదు " అని చెప్పేసి ముసుగు తన్ని పడుకుంది. 

తన భార్యకి అంత సుతిమెత్తనైన మనసు లేకపోవడమే మంచిదేమో!ఎదుటి వారి మనసు గాయ పడుతుందో లేదో చూసుకోకుండానే అనాల్సిన మాట అనేసి ఎదుటి మనిషిని బాద పెట్టామనే బెరుకు కూడా లేకుండా అతి మాములుగా ఉంటుంది.

ఈ మాటలే  ఆమెతో అన్నాననుకోండి.  మీలా ఉంటే   ఇక ఈ లోకంలో బ్రతికినట్లే !   అయినా మిమ్మల్ని అని ఏం లాభం ? మిమ్మల్ని అలా పెంచిన ఆ పుణ్యమూర్తులని  ఎంతైనా సరే మెచ్చుకుని తీరాల్సిందే అంటూ  గాలిదుమారంలా మాటలని విసురుతూ  విషయాన్ని అమ్మ నాన్నల వైపు  మళ్ళిస్తుంది.   లోకంలో   భార్యామణుల అసంకల్పిత ప్రతీకార చర్యకి ఎప్పుడూ బలయ్యేది భర్త వైపు వాళ్ళే  అనుకుంటాను. ఇలా ఆలోచిస్తూ ఒక గంటలోపే గడిపేసానేమో  ఇక ప్రక్క పై నుండి లేచి బయటకి వచ్చాను. హాల్లో దక్షిణం వైపు గోడకి  అమ్మ ఫోటో మినుకు మినుకు వెలుగుతోఉన్న దీపం.నాలో మిగిలినవనుకున్న జ్ఞాపకాల గుర్తుల్లా..  

అక్కడి   నుండి  .నా చూపు క్రిందికి దిగి దివాన్ కాట్ పై పడింది. ఒక ఇరవై రోజుల క్రితం వరకు నాన్న స్థానం అది.  అప్పుడప్పుడు నాన్న   పడక పిల్లలతో పాటే.  వాళ్ళ గదిలో కబుర్లు,హాయిగా క్రింద ఏ చాపో,దుప్పటో  పరచుకుని ఏ ఆంక్షలు లేకుండా నేలంతా డొల్లాడుతూ ఉష్! అమ్మ వస్తుంది అనే హెచ్చరికలు మద్య, కాశీ మజిలీ కతలు,సుమతీ శతకం వల్లె  వేయించడాలు, పిల్లల అల్లరి ప్రశ్నలు నాన్న ఓపికైన సమాధానాలు తో అదో చైతన్యం. 

కాలం  అలాగే గడచి పోతుందనుకున్నఆశ అడియాశ అయిపొయింది .

నాన్న ఇక్కడి నుండి వెళ్ళిన రోజు ఏం జరిగిందో కళ్ళ ముందు మెదిలింది.  నాన్న వల్ల పిల్లలకి క్రమశిక్షణ లేకుండా పోతుందని క్లాస్స్ లో రాన్కింగ్ పడిపోయిందని లాగే ఉంటే పల్లెటూర్లో  మట్టి  పిసుక్కో డానికి కూడా పనికి రారని  నా భార్య నిశ్చితాభిప్రాయం.

" మామగారూ ! మీ పాత కాలం సుద్దులు,శతకాలు వాళ్ళని ఏ అందలాలు ఎక్కించాలేవు. మీరు లేనప్పుడే నయం  పిల్లలు నేను చెప్పిన మాట వినేవారు. ఇప్పుడు మీ అలుసు చూసుకుని ఈవెనింగ్ ట్యూషన్ కి వెళ్ళడం లేదు" అంది.

"ట్యూషన్ లో చేర్పించు తల్లీ! నేనే రోజు సాయంత్రం  తీసుకునివెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తాను " ఆన్నాడు నాన్న మృదువుగా..

"మీకెందుకు ఆ శ్రమ !? ఎలాగు గొడ్డు చాకిరి చేసుకుంటూ ఇంటాబయటా కష్ట పడి సంపాదిస్తున్నాను కదా.. ఇంటికే వచ్చి ట్యూషన్ చెప్పి వెళ్ళే ఏర్పాటు చేసాను లెండి. మీరు వాళ్ళ చదువుకి అడ్డు రాకుంటే చాలు" అంది పెడసరంగా.   

"అమ్మా!  తాత గారిని ఏమన్నా అన్నావంటే ఊరుకోను. నేనే ఎగ్జాం కి బాగా ప్రిపేర్ అవలేదని   చెపుతున్నాను కదా!"అన్నాడు రిషి . 

"ఏంటిరా ! ఎదురు సమాధానం చెపుతున్నావ్? చీరేస్తాను"అంటూ వాడి వెంట పడింది. 

ఆ రోజు రాత్రి మీ నాన్న ఇక్కడ ఉంటే..నా పిల్లలు నా మాట వినరు. వాళ్ళ భవిష్యత్   బాగుండాలనే కదా.. ఉద్యోగం చేస్తున్నాను అంది. తను ఒక రియల్ ఎస్టేట్ వారి ఆఫీస్ లో డెస్క్  వర్క్ చేస్తుంది. 

"అందుకే నాన్న ఉంటే మన ఇద్దరం వచ్చేవరకు వాళ్ళకి ఒంటరి తనం ఉండదు కదా! అయినా ఆయనేం చేసారు ..మధ్యలో "అన్నాను. 

"ఆయన ఆరోగ్యం బాగోలేక ట్రీట్మెంట్  తీసుకుని  ఏదో కొద్ది రోజులు ఉంది వెళ్ళిపోతారు అనుకున్నాను. ఆయన ఇక్కడే ఉండిపోతారని   అనుకోలేదు. అదివరకులా ఆ పల్లెలోనే ఉండవచ్చు కదా.".అంది.

"ఉన్నది నేను ఒక్కడిని. అమ్మ పోయిన పదేళ్ళ నుండి చుట్టపు చూపుగా రావడమే తప్ప ఆయనిక్కడ  ఎప్పుడైనా ఒక నిద్ర అయినా చేసారా ? ఆరోగ్యం బాగోలేని స్థితిలో ఆయన అక్కడ ఉండటం ఏం బాగుంటుంది". అన్నాను. 

"మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఆయన ఇక్కడ ఉండటానికి లేదు.."ఖండితంగా చెప్పింది. నేను ఇంకా వాదిస్తే నాన్నకి వినబడుతుందని నేను మాట్లాడలేదు.

వూళ్ళో పదెకరాల పొలంలో వచ్చే ఆదాయం అంతా తీసుకుని వచ్చి నాన్న కోడలికే ఇస్తుంటారు.  "ఇల్లాలంటే సంసారం నడిపే రధ సారధి. మగవాళ్ళకి ఏం తెలుస్తాయి  ఇంటి ఖర్చులు   అవీ.. పొద్దస్తమాను   కష్టపడటం  ఇంటికి వచ్చి తిని పడుకోవడం తప్ప "అంటారు.

అమ్మ ఉన్నప్పుడు అంతా అమ్మే చూసుకునేది.  తాతలు ఇచ్చిన రెండెకరాల పొలాన్ని పది ఎకరాలు చేసి.. ఇరవయ్యి ఏళ్ళు  నా పట్నం చదువుల కోసం  ఆహర్నిశలు  శ్రమించిన ఆయన్ని నా ఇంట్లో విశ్రాంతిగా ఉండనివ్వలేని నా చేతకానితననాకి  సిగ్గుపడాల్సి వస్తుంది.

 లోలోప దుఖం. "బాబూ !ఇలాగేనా నువ్వు మీ తండ్రికి ఇచ్చే గౌరవం అని అమ్మ నిలదీసి అడిగినట్లు ఉంటుంది. 

తెల్లవారాక నేను లేచే టప్పటికే నాన్న తన బట్టల సంచీతో ఊరికి వెళ్ళడానికి తయారుగా ఉన్నాడు.

"నాన్నా ఇప్పుడు ఊరికి వెళ్ళడం ఎందుకు? మీరు వెళితే పిల్లలకి ఎవరు తోడూ ఉంటారు? అన్నాను .నా మాటలు అతుకు పెట్టినట్లుగా ఉన్నాయని నాకు తెలుస్తూనే ఉన్నాకూడా

"మళ్ళీ వస్తానులే  బాబు.  ఏమిటో,  ఆర్నెల్లు అయ్యిందిగా ఊరిపై పీకుతుంది "అన్నాడు నాన్న.
తాతగారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అని  కావ్య  ఏడుపు  మొహం పెట్టింది.

మళ్ళీ త్వరగానే వచ్చేస్తాను కదా తల్లి. ! అలా ఏడవ కూడదు అంటూ మనుమరాలిని  ఓదారుస్తూనే      అటు వైపు తిరిగి నాన్న కళ్ళు తుడుచుకుంటున్నారు.  


నేను ఏమి మాట్లాడకుండా కాలకృత్యాలు తీర్చుకుని నాన్నని బస్ స్టాండ్ లో దింపి వచ్చాను. 

నేను వచ్చే టప్పటికి భార్యా మణి పోన్ లో  వాళ్ళ అక్కతో అనుకుంటాను మొహం అంతా వెలుగుతూ ఉండగా చెపుతూ ఉంది.  

"అబ్బ , ఆ ముసలాయన పీడా వదిలిపోయింది.  ఆర్నెల్ల నుండి నా ఇల్లు నాకు పరాయిదై పోయింది. రోజు గంట కొట్టినట్లు అయిదున్నరకి అల్లా ఆయన గారికి కాఫీలు అందించడం,ఏడు గంటలకి టిఫిన్లు పెట్టడం.. విసుగేసిపోయింది అనుకో. ఆయన నాలుగు గంటలే లేవడం,వాకింగ్ కి కొడుకుని  లేపడం . పూలు కోసుకు వచ్చి పూజ చేసుకో అమ్మా అని చెప్పడం, నేను లేవడం ఆలస్యం అయితే వంట ఇంట్లోకి జొరబడి కాఫీలు   కలిపి .కొడుకుకి ఇవ్వడం నా వంట ఇల్లు అంతా  అరాచకం అయిపొయింది అనుకో !  పైగా ఆయన ఉంటే మా ఆయన నైటీ వేసుకోనివ్వారు. పెద్ద వాళ్ళ ముందు గౌరవంగా ఉండటం నేర్చుకోమని పోరు పెడుతుంటారు.  నా స్వేచ్చ, నా ఇష్టా ఇష్టాలు అన్నీగాయబ్.!  అందుకే మొహమాటం లేకుండా పిల్లల చదువు వంక చెప్పి గట్టిగా క్లాస్  తీసుకున్నాను. 


తెల్లారేసరికి సంచీ సర్దేసాడు." చెపుతుంది.

అటు వైపు ఏం అడిగారో కానీ నా గురించి ఒక స్టాండ్ మార్క్ స్టాక్ డైలాగ్  

"మా ఆయన ఒట్టి సెంటిమెంటల్ పూల్. ఆయన వెంట బడి బస్ స్టాండ్ దాకా వెళ్ళాడు.  మళ్ళీ ఈ సారి ఆ ముసలాయనని  ఈ ఇంటికి రాకుండా ఏం చేయాలో ఏమిటో..?  ఫిక్సుడ్ డిపాజిట్ లాగా పిక్సుడ్ లైఫ్ ఉంటే బాగుండును. సీనియర్ సిటిజన్స్ అనేది లేకుండా " అని.. పగలబడి నవ్వుతూ .  వెనుకకి తిరిగి నన్ను చూసింది కానీ  ఏమి తొట్రు పడలేదు.

పైగా "జోక్ బాగా పేల్తుంది కదండీ"అంది.

"నోర్ముయ్యి."అని మాత్రం అనగల్గాను. 

"మా ఆయనలో సెన్సాఫ్ హ్యుమరే లేదు. అన్నిటికి విసుగే "అని చెపుతుంది.

నిజమే!  నాలో సేన్సాఫ్ఫ్ హ్యూమర్ ఏమిటీ? హ్యుమానిటీ కూడా తగ్గుతుంది అనుకుని అక్కడినుండి దూరంగా పారిపోయాను.  నాలా భార్యల ముందు పిరికిగొడ్డులా పారిపోయేవాళ్ళు యెంత మందో! 

అలా నాన్న వెళ్ళాక ఫోన్ సమాచారమే తప్ప  ప్రేమగా ఆయనని నేను వెళ్లి చూసే తీరిక లేక  పోయింది.

నిన్న సాయంత్రం భార్య  ఆఫీసు నుండి హడావిడిగా వచ్చి చెప్పుల్లో   కాళ్ళు   అయినా తీయకుండానే

"ఏమండీ ఇది విన్నారా..!?"అని అడిగింది.

ఏమిటన్నట్లు చూసాను.  "మన వూరు ఉంది చూసారు."ఆగింది. నేను ఏమి అంటానో అని అనుకుంటాను.. 

మన వూరు అని అందంటే.. ఏదో ప్రమాదం ముంచు కొచ్చినట్లే  అని నా మనసు సంకేతం అందించింది. నేను చెప్పు అనకుండానే చెప్పడం మొదలెట్టింది. 

"మన వూరిలో మన పొలం ప్రక్క నుండే బైపాస్ రోడ్డు పడుతుంది అట. మన పొలం ప్రక్కన ఉన్న పొలాన్ని  ఓ ఇరవయి ఎకరాల వరకు  మా రియల్ ఎస్టేట్  వ్యాపారస్తులు కొనుగోలు చేస్తారట.ఆ వెంచర్ కోట్ల లాభాలు ఆర్జించి పెడుతుందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ కొనే పొలానికి దారి మన పొలం లోనుండే వెళుతుందట." అని చెప్పుకొచ్చింది. 

"అది దారి కాదు కాలువ కట్ట. ఆ కాలువ లో నుండి వచ్చే నీళ్ళే మాగాణి భూములకి ఆధారం. అలాగే వరదలు వచ్చినప్పుడు చేలల్లో నీళ్ళు అన్నీ ఆ కాలువ ద్వారానే బయటకి వెళ్ళాలి " అని చెప్పాను. 

"నిజమే అనుకోండి కానీ ఇపుడు వ్యవసాయం ఏం గిట్టు బాటుగా ఉందండీ, మనం ఆ కాలువ ని ఆనుకుని మన పొలం పొడుగూతా కొన్ని గజాలు దారికి ఇచ్చామంటే మన పొలంకి బోలెడంత  రేటు పెరుగుతుంది. మనం ఇచ్చిన స్థలానికి రేటుకి రేటు ఇచ్చి  మనకి సిటీలో  డ్యూ ప్లెక్స్  ఇల్లు ఇస్తామంటున్నారు. ఇచ్చేద్దా మండి. "అని చెప్పింది. ఒహొ..యెంత  పకడ్బందీ ప్లాన్ వేసేవే! భార్యా మణి అనుకున్నాను.

" నాన్నని ఒక మాట అడిగి "అన్నాను.ఆమె మాటని తక్షణం కాదంటే ఏం ఉపద్రవం సృష్టిస్తుందో తెలిసి.

"మీరు గట్టిగా చెపితే ఆయన ఏమంటారు. ఆయనకీ మనం కాక ఎవరం   ఉన్నాం. మన మంచి-చెడు ఆయనకీ కాక   ఎవరికి చెప్పుకుంటాం ? అంది.

నేను ఆమె మాటలకి ఆశ్చర్యపోలేదు. పదేళ్లుగా ఆమె రెండునాల్కల  ధోరణికి అలవాటు పడిపోయాను. 

"రేపే వెళ్లి మీ నాన్నగారికి ఈ విషయం చెప్పి ఒప్పించండి." హుకుం జారీ చేసింది. నాన్న ఒప్పు కుంటాడో లేదో! కానీ నాన్నని ఒక  సారి చూసినట్లు ఉంటుంది వూరికి   వెళ్లి రావాలి అనుకుని ఆమె తో.. మాత్రం " సరే వెళతానులే  ! " అన్నాను. 

అలా నాలుగేళ్ల తర్వాత ఊరికి వెళుతున్నాను. సమయం నాలుగు గంటలవుతుంది.ఇక మళ్ళీ పడుకోకుండా స్నానం చేసి తయారు అయ్యాను. బయలుదేరేముందు ఎందుకైనా మంచిదని నాన్నకి   ఫోన్ చేసాను.   నాన్న ఆశ్చర్య పోతూనే  బండి మీద వద్దు దట్టమైన పొగ మంచు కురుస్తుంది. బస్ ఎక్కి రా అని చెప్పాడు. 

నేను బస్ దిగేటప్పటికి నాన్న  బస్ స్టాప్ లో నా కోసం ఎదురు చూస్తున్నాడు. నేను బస్ దిగగానే నా చేతిలో ఉన్న సంచిని అందుకోబోయాడు.నేను  సున్నితంగా తిరస్కరించాను. చాలా కాలంకి రావడం మూలంగా నేమో.. "బాబూ బాగున్నావా? చాలా ఏళ్ళ తర్వాత వచ్చావ్? నాన్నని మళ్ళీ  తీసుకు వెళ్ళడానికి వచ్చావా? "లాంటి ప్రశ్నలతో నన్ను నాకు గుర్తు చేస్తున్నారు. 

 అందరిని పలకరింపులకి సమాధానం ఇస్తూ  ఇంటికి వచ్చే టప్పటికి ఓ పావు గంట పట్టింది.  

"పిల్లలు ఎలా ఉన్నారు ? పద్దాక వాళ్ళే గుర్తుకు వస్తున్నారు" అడిగాడు నాన్న. "బాగున్నారు నాన్నా. నిన్ను తీసుకురమ్మన్నారు "అబద్దం చెప్పాను. 

నిజానికి   నేను ఇక్కడికి వచ్చేదే తెలియదు వాళ్ళకి . అని మనసులో అనుకుంటూ                


నాన్న చేది పట్టిన బావిలోని నీళ్ళు   పాకుడు పట్టకుండా తెల్లగా సున్నం రాసిన రాతి తొట్టి నిండా  తొణికిసలాడుతున్నాయి నా మనసులో నిండిన సంతోషంలా .  

కాళ్ళు కడుక్కుని   కాస్త మొహం మీద నీళ్ళు చిలకరించుకుని కర్చీఫ్ తో తుడుచుకుంటుంటే నాన్న తన భుజం మీద తువ్వాలు తీసి ఇచ్చాడు అమ్మ చీర కొంగుతో తుడుచుఉన్న ఆత్మీయ  స్పర్శ గుర్తుకు తెచ్చేలా. 

"ఇటు కూర్చోరా ఇప్పుడే కాఫీ తెచ్చి ఇస్తాను" అన్నాడు నాన్న. అతిది మర్యాదలు జరపడానికి నాన్న తప్ప ఆ ఇంట్లో ఎవరు లేరు. ఉండాల్సిన అమ్మ పది ఏళ్ళక్రితమే కాలం   చేసింది.  అమ్మ ఉన్నప్పుడు మరుగున పడిన నాన్న ప్రేమ ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది. నాన్న కాఫీ కలుపుతూ ఉంటే  ఇల్లంతా తిరిగి చూసాను. పెచ్చులు పెచ్చులు గా ఊడిపోయి ఉన్న సున్నం గోడలు, పగలంతా ఎనిమిది గంటల కరంట్ కోతతో చీకటితో నిండిన గదులు  ఒక   విధమైన ముక్కు   వాసన  అబ్బ ఈ వాసనలో ఈ చీకటిలో నాన్న ఎలా ఉంటున్నాడో !?  

అందరి ఇళ్ళు బాగున్నాయి. తను బ్యాంకు లోన్ తీసుకుని అయినా  మంచి ఇల్లు ఇక్కడే కట్టుకోవాలి. ఎక్కడెక్కడో.పెద్ద ఇల్లు ఉంటే మాత్రం ఏం గొప్ప? పుట్టిన ఊర్లోనే గొప్పగా ఉండాలిగాని అనుకున్నాను స్వగతంలో  

అమ్మ ఉన్నప్పుడు ఎంతో శుభ్రంగా ఉండే ఇల్లు ఇలా అయిపొయింది. క్రింద గచ్చంతా  కూడా తవట వేసినట్లు మచ్చలు మచ్చలుగా ఉంది. నాన్న వంట ఇంట్లో ఏదో అవస్థలు పడుతున్నట్లున్నాడు. 

నా కోసం  ఏమి ప్రత్యేకంగా చేయ వద్దు   అని చెప్పడానికన్నట్లు వంటింట్లోకి  వెళ్లాను. వంటింటి  గోడపై అమ్మ సంప్రదాయం కొనసాగిస్తూ  ఉన్నట్లు బల్లులు రాకుండా ఉంటాయని అమ్మ పెట్టినట్లుగానే కోడిగుడ్డు డోప్పలు తగిలించే ఉన్నాయి. శుభ్రంగా కాగితాల పిండితో అలికిన చేట, గోడకి కొట్టిన  గ్యాస్ లైటర్ స్టాండ్ అన్నీ అమ్మ ఉన్నప్పుడు  ఉన్నట్లే ఉన్నాయి. బియ్యం డబ్బా తీసి చూసాను పురుగు పట్ట కుండా ఎండిన వేప ఆకు కలిపి   వుంది.  కాఫీ తాగుతూ పెరట్లో తిరుగుతుంటే నాన్న బియ్యం కడిగి ఆ నీటిని కరివేపాకు చెట్టు మొదట్లో వంచుతూ కనబడ్డాడు.  చిన్నప్పుడు తను  నిద్ర లేచేటప్పటికే ఎర్రగా మండుతూ సెగలు కక్కే బొగ్గుల కుంపటి,పొగ గొట్టం తుప్పు పట్టి కనిపించాయి అమ్మ పక్కనే ఉండి సరదాగా  పొగ ఊది అవస్థలు పడిన రోజులు  జ్ఞాపకం వస్తున్నాయి.  విసన కర్ర తీసుకుని బొగ్గుల పొయ్యిని బాగా రాజింపజేసిన జ్ఞాపకం, 

ఎన్నో రోజులుగా కోయకుండా రాలిపోయి ఉన్న సన్నజాజులు మనుషులు ఒకరి తర్వాత ఒకరు రాలిపోతున్న  విధంకి  ప్రతీకగా కనిపించాయి. 

నిజానికి తన వూరు ఊరంతా ఖాళీ అయిపొయింది. తన తండ్రితరం వారు కొద్దిగా వాళ్ళ తండ్రుల తరం వారు వేళ్ళ సంఖ్యలోనూ  గత వైభవాన్ని గుర్తుకు తెచ్చు కుంటూ రోజులు వెళ్లదీస్తున్నారు. ఒకమాదిరిగా ఉన్న కుటుంబాలలోని పిల్లలందరూ చదువుకుని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే   స్థిరపడి పోయి వాళ్ళ ఆర్దిక   అభివృద్దికి చిహ్నంగా పాత పెంకుటిళ్ళు కూల్చి  మేడలు కట్టారు కార్లు అమర్చారు కానీ అందులో ఉంటున్నది మాత్రం జీవచ్చవాలే! ఏడాదికో రెండేళ్ళకో ఆ ఇళ్ళకి ఓ పది రోజులు పండగ వస్తుంది. అంతే! వచ్చినప్పుడు..కూడా ప్రేమగా, ఆత్మీయంగా హత్తుకోలేని అడ్డు గోడలు ఒట్టి పోయిన  పశుశాలలు.

కాన్వెంట్   చదువుల కోసం మిగిలిన కుటుంబాలు దగ్గరలోని సిటీకి  కాపురాలు  మార్చడం, నామ మాత్రంగా మిగిలిపోయిన వ్యవసాయం, విస్తరించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం.ఇది తన ఊరు ముఖ చిత్రం. 

దాదాపుగా అన్ని ఊర్ల పరిస్తితి ఇంతేనేమో! పల్లె వెళ్లి పట్నంలో కలుస్తుందా ? పట్నం వచ్చి పల్లెని  కబలిస్తుందా?  ఏదో చెప్పలేని పరిస్థితి.    

ఎండ పెరిగింది. లోపలి వచ్చాను. గోడల చల్లదనం హాయిగా ఉంది . చలువరాతి పరిశుభ్రమైన   ఇంటిలో ఉంటున్న తను ఈ ఇంటి వాతావరణం కి అలవాటు పడటానికి   ఓ గంట పట్టింది.అయినా ఇక్కడ ఏదో తెలియని హాయి ఉంది. నాన్న ఏదో రెండు కూరలు వండాక తనకి పెద్దమ్మ  వరుసకయ్యే ఆమె వచ్చి మా ఇంట్లో భోజనం చేయి బాబు. పాపం నాన్న ఏం చేయి కాల్చుకుని చేస్తాడు అని వచ్చింది. 


"లేదులే పెద్దమ్మా  నాన్న  వంట చేసేసాడు.ఇక్కడే తింటాను." అని చెప్పాను.సరే రాత్రియినా మా ఇంట్లో భోజనం చేయి."అని చెప్పింది పెద్దమ్మ. 

రాత్రికి  ఇక్కడ ఉండటమా? ఆలోచన. సరే అన్నట్లు తల ఊపాను. నాన్న ముఖంలో సంతోషం; ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఓగంట తర్వాత భోజనం చేసాం. నాన్న కొసరి కొసరి   వడ్డించాడు. ఇంట్లో నాలుగు రకాల కూరలలో లేని రుచి ఏదో తగులుతుంది.అది ప్రేమ రుచి అనుకుంటాను.  

కాసేపు అలా పందిరి మంచం మీద పడుకున్నాను. చిన్నప్పుడు నుండి ఈ మంచం మీదే కదా పెరిగి పెద్దయ్యింది ఎందుకో ఆ మంచం మీద అమిత మైన ప్రేమ పుట్టుకొచ్చ్చింది. ఏనాడు నాన్నని ఏది అడగని నేను..  నాన్నా ఈ పందిరి మంచం కావాలి నాకు అడిగాను. నాన్న నవ్వి అలాగేలేరా వేసి పంపనా? అన్నాడు. కాదు నేనే వేసుకెళతానూ అన్నాను. నాన్న అర్ధమైనట్లు తల ఊపాడు. ఓ గంట పాటు చిన్న కునుకు   తీసి  నాన్న ఇచ్చిన టీ  తాగి నాన్నా ! అలా మాగాణి పొలం లోకి వెళ్లి వద్దామా అడగాలనుకున్నాను. అంతలో నాన్నే అడిగారు. "అలా. మాగాట్టి చేలోకి వెళ్లి వద్దాం రా ! అని.   సరే అన్నాను. 

మాగాణి పొలాల మద్య నుండి నున్నని తారు రోడ్డు. పల్లె నుండి పట్టణానికి జ్ఞానాన్ని, సంపదనంతటిని  మోసుకుని వెళ్ళడానికి   వేసినట్లు.

ఈ రోడ్డుని వెడల్పు జేసి   బందరు దాకా బైపాసస్ రోడ్డు వేస్తున్నారు రా అన్నాడు నాన్న.

" నేను పేపర్లో చదివాను"  చెప్పాను. 

ఆ రోడ్డు నుండి చీలి ఎడమ వైపు ఉన్న మా పొలంలోకి  దిగాము వరికోసి  వేశాక రెండో పంటకి   నీళ్ళు అందుతాయో లేదని అపనమ్మకం వల్ల ఏమో ఎవరు మళ్ళీ దాళ్వా సాగు చేయడం లేదు ఆరు తడి పంటలు వేసారు. మా చేనుకి తూర్పు ప్రక్కన   ఉన్నపంట కాలవ దగ్గరికి వచ్చాం. కాలువ ఎండి పోయి ఉంది. 

"ఈ కాలవని దానికి ఆనుకుని ఉన్న మన పొలంలోని ఓ ముప్పై  అడుగుల వెడల్పుకి వచ్చే దారినే కదా వాళ్ళు ఇమ్మని అడుగుతుంది."అడిగాడు నాన్న. 

నేను షాక్ అయ్యాను. "నాన్నా మీకు ఇది ముందే తెలుసా.!?"  అడిగాను. 

"లేదురా! నువ్వు బయలు దేరి వచ్చాక  కోడలు పోన్ చేసి చెప్పింది." చెప్పాడు నాన్న. పీకల దాక భార్య పై కోపం   ముంచుకొచ్చింది.

"నాకు ఇవ్వడానికి అభ్యంతరం ఏం లేదురా!  పిల్లలకి నగరం నడిబొడ్డు కి స్కూల్  కి  వెళ్ళడానికి గంటల తరబడి బస్ లలో   మగ్గిపోవాల్సి వస్తుంది.  మనం ఈ దారి ఇస్తే మనకి  ఇల్లు ఇస్తారు. బాగానే ఉంటుంది కానీ వాళ్ళు ఈ కాలువ మొత్తాన్ని పూడ్చేసి రోడ్డు వేసేస్తారు. ఈ కాలవ  క్రింద సాగులో ఉన్న పొలాలకి యెంత ఊపిరో నీకు తెలుసు. ఈ కాలవ కింద అందరు ఎకరం, రెండెకరాలు ఉన్న  రైతులే . ఇప్పటీకే వ్యవసాయం గిట్టు బాటు అవక అప్పుల్లో ఉన్నారు. మనం దారి ఇస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు సిండికేట్   అయి వాళ్ళ అవసరాలని తెలుసుకుని పొలాలన్నీ కారు చవకగా కాజేద్దామని   చూస్తారు. ఊరు ఊరు గాకుండా పోతుంది" అని వివరంగా చెప్పాడు నాన్న.

"అయినా ఇక్కడ వచ్చి ఎవరుంటారు రా ఇక్కడ ఏమన్నా కాలేజీలా పాడా? ! ఏదన్నా రోగం, నొప్పి వచ్చినా  హాస్పిటల్ కి  పాతిక మైళ్ళు పరిగెత్తాలి. "

"అది కాదు   నాన్నా! ఏదో ఇళ్ళ నిర్మాణం కి అంటున్నారు.

"లేదురా! ఆమతలబున్నీ నిజం కాదు ఏదో నల్ల డబ్బు ఉన్న వాళ్ళ పన్నాగం ఇది. ఇక్కడ ఇళ్ళ ప్లాటులు ఏసినా  వెర్రి బట్టినట్టు కొనేది పట్నం వాళ్ళే  రా ముందు ముందు పెరగకపోతాయా అని ఆశ. ఇంకొన్ని   ఏళ్ళకి ఇది కూడా   దొరకదని భయం, లేని డిమాండ్   సృష్టించి నోటి మీద లక్షల లెక్క   పెంచేస్తున్నారు. రెండేళ్లనాడు లక్ష రూపాయలు కూడా రేటు పలకని పొలాలు ఈ ఏడాది ఇరవై లక్షలకి కొని ఏం చేస్తారు? పంట గట్టిగా పండినా ఇరవై వేలకి  మించి ఆదాయం రాదు.ఇరవై లక్షల  రేటు అనడమే కానీ ఆరు లక్షలకి  మించి ఎక్కడా   బేరం జరగడం లేదు. అంతా  వ్యాపారుల మాయా జాలం  అని వివరంగా చెప్పాడు నాన్న.

"మనం ఇప్పుడు దారి ఇస్తే కాలవ లేకుండా పోద్ది. ఈ ఊరులో వ్యవసాయం చేసేవాడు ఉండడు .అయిన కాడికి   అమ్ముకుని అప్పులు తీర్చుకుని బాధల నుండి బయట పడతారు, జల్సాలు చేస్తారు".సూక్ష్మంగా అన్నీ పరిశీలించినట్లు  చెప్పాడు నాన్న  నాకు ఆశ్చర్యం వేసింది.  నాన్నది ఏడో  తరగతి చదువు మాత్రమే! అయినా యెంత అవగాహన.!! అందుకే చదువు కన్నా అనుభవం ముఖ్యం అంటారు.   

నేను ఆలోచించసాగాను. "మనం దారి ఇవ్వవద్దు.నాన్నా ! ఎక్కడ   పడితే అక్కడ ఆక్రమించుకుని అక్రమ   నిర్మాణాలు చేపట్టి,నీటి పారుదల వ్యవస్థని, మురుగునీటి వ్యవస్తని నాశనం చేసి చెరువులు ఊళ్ళు, ఊళ్లు చెరువులు అయ్యే  పరిస్తితిని అడ్డుకోవాలి అంటే మనం మన వంతు భాద్యతగా ఉండాలి" అన్నాను నేను. 

"మన  దూరపు బంధువు నాకు బాబాయి కొడుకు రవి నీకు  బాబాయ్ అవుతాడు   వాడు  తెలుసు కదా..  ..పొలాలకి రేట్లు పెరిగినాయని  ధీమా వచ్చి వడ్డీలకి తెచ్చి  మరీ వ్యాపారం చేసాడు. అటు వ్యాపారం కలసి రాలేదు. ఇప్పుడు లక్షలకి లక్షలు రేటు పలుకుతుందని అనుకున్నపొలం కొనే నాధుడే లేడు. కొనుక్కునే  వాడు ఆరు లక్షలు అంటాడు. అమ్ముకునేవాడు ఇరవయి లక్షలు ఉంది..అంతకన్నా తక్కువ  అయితే ఇవ్వనని భీష్మించుకుని కూర్చుని ఆఖరికి అప్పుల వాళ్ళ  బాధలు పడలేక పురుగు మందు తాగి చచ్చిపోయాడు. ఉన్న పొలం అంతా  అప్పులవాళ్ళు ఎగదన్నుకుపోయారు. వాడి పెళ్ళాం బిడ్డలు రోడ్డున పడ్డారు" నాన్న బాధగా చెప్పాడు.      

అలా వ్యవసాయం ,ఇబ్బందులు చెప్పుకుంటూ ఇంటికి  వచ్చాం.

ఆ రాత్రికి ఆలోచిస్తూ ఉన్నాను.

అర్ధరాత్రి లేచి నాన్నని లేపి మరీ చెప్పాను, నాన్నా! మనం  దారి ఇవ్వం. మా పది ఎకరాలు పొలం మొత్తం ఎకరం ఇరవయ్యి లక్షల చొప్పున అయితేనే  ఇస్తాం అని చెపుదాం.అన్నాను.

వాళ్ళు ఖచ్చితంగా  వద్దని అంటారు రా,ఎందుంటే మనం దారి ఇస్తే వాళ్ళు కొనే పొలం రేటు ఎకరం ఆరు లక్షలు. మన పొలం  కొనే రేటు ఇరవై లక్షలు  పెట్టాలి గనుక    లాభాలు ఉండవు కాబట్టి ఎట్టి  పరిస్థితుల్లోను  కొనరు అన్నాడు నాన్న .

అదే  కదా ! మనకి   కావాల్సింది. ఇక  వ్యాపారులెవరు మన పొలాలకేసి  కన్నెత్తి చూడరు  అని చెప్పాను.

నాన్న తలపంకించాడు . 

తెల్లవారి నాలుగు గంటలకే నా సెల్ పోనే మోగింది. నా భార్య నుండి పోన్. నాన్న  పొలం ఇవ్వడానికి ఒప్పుకున్నాడా లేదా అన్నది తెలుసుకోవాలని ఆత్రం. 

"నీకొక శుభవార్త నాన్న  దారి మాత్రమే  ఎందుకు? మన పది ఎకరాలు పొలం అమ్మేసుకో అని అన్నారు.   . ఎకరం ఇరవై లక్షలు రేటు వస్తుంది. మనకి   రెండు కోట్లు   వస్తాయి చెప్పాను  ఆశ గా ఊరిస్తూ..

"అవునా మామయ్యా గారు ఒప్పుకున్నారా? మై గుడ్నెస్   చాలా హేపీ అండి." అంది.

ఒక   మాట నువ్వు ఏమనుకోనంటేనే .!? .అడిగాను. "చెప్పండి "అంది భార్యా మణి

"మరి నాన్న పొలం అమ్మేశాక ఎలా ! ఆయన  ఎక్కడ  ఉంటారు? " అడిగాను .

 "అయ్యో ! అదేం మాటండీ, ఆయనకి మనం కాక  ఇంకా ఎవరున్నారు. మనతోనే ఉంటారు.ఇంటికి పెద్దదిక్కు .పిల్లలు కూడా ఆయనపై దిగులు పెట్టుకున్నారు. 

ఆయన రానన్నా సరే బలవంతంగానైనా తీసుకుని రండి" చెప్పింది సంతోషంగా రెండు కోట్లు వస్తున్నాయి అనే ఆనందంలో.

అలాగే మరొక   పోన్ చేసాను. మేము మీకు దారి ఇవ్వదల్చుకోలేదు. పొలం మొత్తంగా అయితేనే  అమ్మదలచాము. ఎకరం  ఇరవై లక్షల ఖరీదు  లెక్కన అయితేనే   ఇస్తామని చెప్పాను. వాళ్ళు అంత ఎక్కువైతే వద్దని చెప్పేశారు నాకు.  ఇప్పుడు ఎంతో .హాయిగా ఉంది. నా పొలం జోలికి ఇప్పట్లో ఎవరూ రారు.  

నిజానికి ఆ పొలం అమ్మడం నాకేమాత్రం ఇష్టం లేదు.  నా భార్య మాటల్లో నేనెప్పుడు ఓ..సెంటిమెంటల్ పూల్ ని. కానీ నా ఊరు, నా వాళ్ళ విషయంలో నేనెప్పుడు సెంటిమెంటల్ ఫూల్ నే నని నా భార్య కి అర్ధంయ్యేదాక ఓర్చుకోక తప్పదు కూడా. 

అలాగే నా భార్య పరిస్తితి ఇప్పుడు  కుడితిలో పడ్డ ఎలుకలా ఉంటుంది.  ఇప్పుడామె  నాన్నని కాదని అనడానికి వీలులేదు . 

అలా నేను అనుకున్న రెండు పనులు అలా విజయవంతంగా నెరవేరాయి. 

నాన్నా,నేను కలసి పందిరి మంచం వేసుకుని పట్నం బయలుదేరాం.  మా బొగ్గుల పొయ్యిని, ఊదుడు  గొట్టాన్ని  చేతిలోకి తీసుకున్నాను.  నా కొడుకు రిషి కి వాటిని  అపురూపంగా చూపాలని. 

చిరు చీకట్లు ముసురు కుంటున్నాయి.  అక్కడ చిరు కాంతులతో నా ఊరు  పల్లె ఆనవాలు మిగులుస్తున్నట్లు ఉంది.

"అవును, నా తరం వరకయినా   నా పల్లె ఆనవాలుని  కాపాడాలని కంకణం  కట్టుకున్నాను.

కౌముదిలో 2012 మే మాసంలో వచ్చిన కథ                                          

3, జనవరి 2013, గురువారం

లోపం లేని చిత్రం




                                                                లోపం లేని చిత్రం  

"ఇప్పుడు వరకు ఇంటిపనులే  సరిపోయాయి. మళ్ళీ అవి ముందేసుకుని కూర్చోక పొతే కాసేపు పడుకో రాదు.." అని  కోడలిని కాస్త మందలిపు కలపిన ప్రేమతో.. ఆంది వర్ధనమ్మ 

"లేదత్తమ్మా..  విశ్రాంతి సమయంలో కూడా ఇలా ఇష్టమైన పని చేస్తేనే నాకు నిజమైన విశ్రాంతి .ఇది ఒక పనని అనుకోను” అప్పటికే  స్టాండ్  బిగించుకుని  కలర్ మిక్సింగ్  చూసుకుంటూ చెప్పింది  హేమ.

"ఇప్పుడు ఇలాగే అనిపిస్తుంది, ఓపిక తగ్గినప్పుడు చేసి పెట్టడానికి..  ఎవరు లేనప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం విలువ " అని అంటూ  వచ్చి తను కోడలి ముందు కూర్చుంది. 

"దేవుడి దగ్గర ఎగ్రిమెంట్ చేసుకుని  వచ్చి మీరు ఉంటారుగా" అని నవ్వింది కోడలు. దానికి అత్తగారు నవ్వుకుంది. అలాంటిది  ఆ అత్తకోడళ్ళ అనుబంధం. అది చూసేవారికి కనువిందుగా మరి కొందరికి మూతి విరుపు, ముక్కు విరుపుగా. 

కోడలి చేతిలో వొంపులు తిరుగుతూ రంగులు   అద్దుకుంటూ.. సహజాతి సహజంగా.. ఓ..అందమైన చిత్ర రాజం రూపు దిద్దుకుంటుంది. ఆ వేళ్ళ కదలికల్ని రంగుల మేళవింపుని , ఏకాగ్రతని చూస్తూ.. కోడలికి  తన దిష్టే తగులుతుంది.. అనుకుంది. కొడుకు కన్నా కోడలంటేనే అపురూపం ఆమెకి. పెళ్ళైన మర్నాటి నుండి.. రుబ్బు రోలులో  పొత్రం ఎటు వైపు  తిప్పాలో కూడా  తెలియకుండా పెరిగి వచ్చిన పిల్ల  గిర గిర పొత్రంలా తిరుగుతూ..  ఆ ఇంటికే చైతన్యం తెచ్చింది. సూక్ష్మగ్రాహి. ఎవరి మనసులో ఏముందో  పసికట్టి వాళ్లకి నచ్చినట్లే చేస్తుంది. ఇంటా బయటా అందరి నోటి వెంటా.."హేమమ్మా" అనే పిలుపులే. 

పెద్దదాన్ని నేనొక దానినున్నానని  అందరూ మర్చిపోయారు. ఇంకో అత్తగారైతే కోడలి పెత్తనం కొరివితో తలగోక్కున్నట్లు ఉన్నదని ఆడిపోసుకునే వారు. అత్త అనే హొదానో,లేదా పెద్దరికాన్నో ప్రదర్శించాలని ఆలోచన చేసి ఆచరణలో చూపించక ముందే పసి గట్టి.. అయ్యో..! అన్నీ నన్నడుగుతారు ఏమిటీ !?  అన్నీ నాకేం తెలుసు.. అత్తమ్మ ఉన్నారు. కదా ..! ఆవిడని అడగండి.. అంటూ.. తన ముందర కాళ్ళకి బంధం వేసినట్లు మాట్లాడేది గడుసు కోడలు. ఇంకేం అధికారం చూపిస్తాం?  అంతా  ఐస్..ఐస్.. ఐస్..  అవి తెలితేటలో,  లేదా గడుసుతనమో..తెలియడానికి ఓ..నాలుగేళ్ళు పట్టింది ఆవిడకి.

నిజంగానే కోడలు బంగారం వంటి మనసున్న పిల్లే. కానీ..  తరచూ భర్త తోనే గొడవ పడుతూ ఉంటుంది. ఆడ జన్మలు కొన్ని కొన్ని వాటికి  సర్దుకోవాలమ్మా..అంటే వినదు. అలా అని మొండితనము  అనడానికి వీల్లేదు. నిక్కచ్చిగా.. మాట్లాడటం హేమ  అలవాటు. ఎదుటి మనిషి  తిరిగి అనడానికి కూడా ఏమీ ఉండేది కాదు. అలా కాసేపే.. మళ్ళీ అత్తమ్మా..అంటూ పలకరించేది. ఇలా కోడలి గురించి.. మంచి చెడు బేరీజు   వేసుకుంటుంది.  

హేమ తను పూర్తి చేసిన చిత్రాన్ని రకరకాల కోణాలలోకి మార్చి చూసుకుంటూ..తుది మెరుగులు దిద్దుకుంటుంది. అది ఒక అందమైన స్త్రీ మూర్తి  చిత్రంl ఎక్కడో   ఏదో లోపం. లోపం ఉన్న చిత్రం కి పై పై మెరుగులు దిద్ది నగిషీ పెట్టి  ఆ లోపాన్ని పూడ్చి అందంగా చూపించవచ్చు.కానీ హేమకి అలా ఇష్టం లేదు.

"ఇక వదిలేయరాదు బాగానే ఉంది " ..అంది వర్ధనమ్మ.


"మనం స్వయంగా..చిత్రించుకున్న చిత్రం జీవితం లాటిది. జీవిత చిత్రంలో ..లోపాలు చిత్రిస్తారా ఎవరైనా.. ? ఒకవేళ లోపాలు ఉన్నా ఎన్నిమెరుగులు దిద్దినా, నగీషీలు పెట్టినా కూడా   కనబడే లోపం లోపమే కదా..!  చూసే కళ్ళని బట్టి చిత్రం ఉంటుందేమో కానీ.. లోపం తెలిసి సరిపుచ్చుకునే చిత్ర కారుడు  ఉండడు.. ఏ విధమైన  లోపం లేకుండా ఉండాలనే చూస్తాడు" అంది.

"ఏమిటో..నీ మాట ఒక్కటి అర్ధం కాలేదు" అంది. 

అర్ధం చేసుకునే తత్త్వం మీకు ఉందిలెండి..అంటూ..  లోపం ఉన్న  చిత్రాన్ని స్టాండ్ నుండి తీసి  ఉండచుట్టి పడేసింది.

"అమ్మా.. చిన్న బాబు ఉన్నాడా.." అంటూ వచ్చాడు ఎదురింట్లో ఉండే  సుధాకర్.  అతను  వాళ్ళ ట్రాక్టర్  డ్రైవర్ గా పని చేస్తుంటాడు. 

 చెరుకు ఫ్యాక్టరీకి వెళ్లి ఇంకా రాలేదు. ఇంకా.. బళ్ళు అన్లోడ్   కాలేదనుకుంటాను..నువ్వు వెళ్ళవా.. ? నువ్వు వెళితే కానీ చిన్న బాబు ఇంటికి రాడు.. వెళ్ళమని  చెపుతున్నట్లు చెప్పింది వర్ధనమ్మ.

 "లేదమ్మా..నేను వెళ్ళ దలచుకోలేదు."  ఏదో చెపుతున్నాడు.మనిషి బాగా తాగి నట్లు ఉన్నాడు. మాట తూలుతూ.. ఎర్రబారిన కళ్ళతో..అసహ్యంగా కనిపించాడు. అతనిని ఆ అవతారంలో  చూసి  కొంచెం అసహ్యంగా,భయంగా లోపలకి వెళ్ళబోయింది హేమ. 

"హేమమ్మా.. నీతో మాట్లాడాలి, కాస్త ఆగు "అన్నాడతను. అతని మాటల్లో తగ్గుతున్న గౌరవానికి చిరాకు పడుతూ.. "ఏం మాట్లాడాలి. అత్తమ్మ ఉన్నారుగా ఆవిడికి చెప్పు " అంటూ..లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె వెనుకనే గదిలోకి రాబోతు.. వర్ధనమ్మ అడ్డుగా ఉండేటప్పటికి ఆగిపోయాడు. 

"మేము మీలా చేస్తే మీరు ఊరుకుంటారా? మేము మీ దగ్గర పనిపాటలు చేసేటొల్ల మనే  కదా.. ఎలా పడితే అలా మాట్టాడతారు." అంటున్నాడు. 

"ఏంటిరా ..ఒళ్ళు తెలియకుండా ఏమిటేమిటో   మాట్లాడుతున్నావ్? అవతలకి పో!  ఏమైనా మాట్లాడాలిసినది ఉంటే.. పెద్దాయన వచ్చాక రా..పో.."అని.. కసురుతూ  మాట్లాడింది వర్ధనమ్మ. 

"నేను పెద్దాయనతోనో, చిన్నబాబుతోనో మాట్లాడటానికి రాలేదు మీ ఆడాళ్ళ తోనే మాట్లాడటానికే వచ్చాను. 
నేను నిన్నటేల ఊర్లో లేకుండా జూసి నా ఇంటికి జొరబడి నా పెళ్ళాం చేయి పట్టుకున్నాడట నీ కొడుకు .
ఇప్పుడు ఆయన ఇంట్లో లేడని నేను ఆయన భార్య చేయి పట్టుకుని.. అడుగుతాను, మీరు ఊరుకుంటారా? అదేమని అడిగితే తాగి ఉన్నాడులే..పోనీయి అంటారు.ఇట్టా  రెండు సార్లు జరిగింది.. అందుకే నేను ఆయన పెళ్ళాన్ని అలా చేయి పట్టుకుని అడగటానికి వచ్చాను." .అని వాగుతున్నాడు. 

లోపలి నుండి వింటున్న హేమకి అవమాన భారంతో.. తల నరికేసుకోవాలనిపించింది. ఏ మాత్రం రక్త పాతం కనిపించని అవమానపు కోత.  దీనికి సమాధానం చెప్పే తీరాలి. తర తరాలుగా.. స్త్రీ జాతికి జరిగే అవమానం ఇది అనుకుంది.

"సుధాకర్ నువ్వు వెళ్ళు, చిన బాబు రాగానే నేను ఏం జరిగిందో అడుగుతాను. నువ్వు తాగి ఏం మాట్లాడుతున్నావో..నీకు తెలియడం లేదు.ఇంటికి వెళ్ళు.."అంటుంది బ్రతిమిలాడుతున్న దోరణిలో.. కోడలు వాడి మాటలు వినడం ఇష్టం లేక. అప్పటికే జరిగేది జరిగిపోయింది.

హేమ చాలా ప్రశాంతంగా బయటకి వచ్చింది. "ఏమిటి సుధాకర్ ? "అడిగింది. 

"నా పెళ్ళాన్ని మీ ఆయన చేయి పట్టుకుని  సుజాతా నాతో వస్తావా? అని అడిగాట. నేను హేమ ..వస్తావా..? "అని అడుగుతాను అని రెండు సార్లు మళ్ళీ మళ్ళీ కావాలనే ఆమాట అంటూ..  అని  హేమకి సమీపంగా రాబోయాడు.


అతను తనదాకా రాకుండానే..తనే ముందుకు వెళ్లి అక్కడే  ఉన్న  జత లో నుండి ఓ చెప్పు అందుకుని  వాడి మొహం పై.. టప టపా వాయించి.. "ఇదిగో..ఇలా నీ పెళ్ళాం కూడా నా మొగుడిని కొట్టాల్సింది.. అని అంది హేమమ్మ అని  వెళ్ళి మీ ఆవిడకి చెప్పు "  అంది హేమ.    

అంతే..వాడి మొహం పై నెత్తురు చుక్క లేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా   వెళ్ళిపోయాడు. " వాడిని అలా కొట్టావు.వాడు ఏమైనా చేస్తే..ఇక్కడ అంతా వాళ్ళ బలం, బలగం " అంది వర్ధనమ్మ  భయపడుతూ .

తప్పు ఎవరిది.. ? మన దగ్గర పని చేస్తున్నారు కదా అని,  వారు పేదవాళ్ళు ,శీలం అంటే విలువ తెలియని వాళ్ళు, నాలుగు డబ్బులు పడేస్తే మెదలకుండా పడి ఊరుకుంటారనే అహంకారంతో, ధీమాతోనే కదా వాళ్ళ ఇళ్ళ ల్లోకి వెళ్లి మరీను, లేదా పొలాల్లోనూ , ఒంటరిగా దొరికితేను ..వాళ్ళ ఆడవాళ్ళని ఆడుకోవడం మదపు చర్య అవదు ?.." అడిగింది ఆవేశంగా హేమ. 


"ఇక్కడ ఇవన్నీ మామూలే.. వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం లేదని అలాటి పన్నాగాలు పన్ని డబ్బు గుంజుతారు " అంది ఆవిడ.

"అన్యాయంగా కొడుకుని వెనకేసుకుని వచ్చి సమర్ధించకండి అత్తమ్మా "అంది కోపంగా హేమ.

"లేదు హేమా ! పొలాలో పనిపాటలు చేసుకునే వాళ్లకి ఇవి మామూలే!వదిలేయి"  అంది.

"మరింకేం? వాడు ఇప్పుడు నన్ను అలా మాట్లాడటం కూడా  మామూలే అనుకోమంటారా? " అడిగింది  రగిలిపోతూ.. హేమ. 

మొన్నటికి మొన్న టౌన్ కి హాస్పిటల్కి వెళ్లి వస్తుంటే.. ప్రక్కన ఊరికి చెందిన ఒకామె నా కన్నాముందు   బస్ ఎక్కింది.నన్ను ఎవరో పలకరించి నేనెవరో ఆమెకి  చెప్పగానే లేచి సీట్ ఇచ్చి కూర్చోబెట్టి గౌరవం ఇచ్చి అంతకన్నా  గౌరవంగా   చెప్పింది  "మీ ఇంటాయన వూర్లో ఆడవాళ్ళని బతక నీయడా. తల్లీ ! .తెగ అల్లరి పెడుతున్నాడు. ఏం పద్దతి అది.  అలా మిమ్మల్ని అంటే ఊరుకుంటారా? "  అని. ఆమె చదుకున్నమనిషి  కాబట్టి మర్యాదగా చెప్పింది. నేను అవమానంతో వెంటనే ఆ బస్ దిగిపోయాను " అది చాలదా..?  మన కున్న గౌరవం ఏమిటో తెలియడానికి " అంది ఒకింత వ్యంగంగా.

  "అదేమిటో తప్పు చేసేది ఆయన .ఆ తప్పుకి నేను బాధ్యత వహించాలని అన్నట్లు నా వరకు విషయాన్ని లాక్కుని వస్తారు.  అది నాకు అవమానంగా ఉండదా? నేను  ఈ లోకం లో గౌరవం కల వ్యక్తిగా బతకాలనుకుంటాను. భర్త మంచిచెడులు,కష్ట-నష్టాలు పంచుకోవడానికి నేను సదా సిద్దమే..కానీ..ఇలాటి అవమానాలా? నా వల్ల కాదత్తమ్మా  ఆయనలో  ఏ మార్పు లేదు. ఉచ్చనీచాలు మరచి అలా అచ్చోసిన ఆంబోతులా ఆడవాళ్ళ వెంట పడటం,  అంత కాముక ప్రవృత్తిని భరించడం నా వల్ల కాదు. అని చెప్పింది. ఆడవాళ్ళు కాపురాలు కావాలనుకుని ఇలాటివన్నీ భరించడం, నిజం ఏమిటో తెలుసుకున్నాక కూడా ఏమి తెలియనట్లు నటిస్తూ బ్రతకడం ఆత్మహత్యా సదృశ్యం అనిపించుకోదు?  అంది ఆవేదనగా.

"మీరు చదువుకున్నవాళ్ళు గనుక  మీకు ఇవన్నీ తప్పు అనిపిస్తాయి. ఇలాటివి మా తరం ఎన్నో చూసి ఉంటాయి "అంది అనుభవం చెపుతున్నట్లు. 

ఆ రోజు రాత్రి ఓ..పెద్ద యుద్దమే జరిగింది..ఆ ఇంట్లో. "నేను ..ఆ డ్రైవర్ గాడి పెళ్ళాం పట్ల అసభ్యంగా ప్రవర్తిన్చానో లేదో..నిరూపణ అయ్యాక కదా నీకు కోపం రావాలి, వాడిని అనవసరంగా కొట్టావు. వాడది  మనసులో పెట్టుకుని కక్ష కట్టి నన్ను ఏమైనా చేస్తే..ఎవరికీ నష్టం నీకేగా  ? అంటూ.. సెంటిమెంటల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నభర్త  తీరుకి అసహ్యం కల్గింది...  హేమకి. 

"ఇదిగో చూడు..నీలో నూరు తప్పులని క్షమించే గుణం నాకు లేదు.నేను అసలు అంత  పెద్ద ప్రతివతా శిరోమణిని కాదు. భర్త మదమెక్కి   చేసే పనులకి నేను నా అభిమానాన్ని,గౌరవాన్ని, విలువని పోగొట్టుకున్న  భార్యగా బ్రతకడం కన్నా.. ఇంకో సిగ్గు చేటు  లేదు. నీ కన్నా ..ఆ డ్రైవర్ యే నయం. పెళ్ళాం చేయి పట్టుకున్నది ఎవరైనా సరే.. ఆ పట్టుకున్న వాడి ఇంటికే వచ్చి వాడి పెళ్ళాంకి అలాటి అవమానం కల్గించి వెళ్లాలని ప్రయత్నం చేసి వెళ్ళాడు చూడు ..   వాడు మగవాడు." నిదానంగా ఒక్కొక్క  మాటే ఒత్తి పలుకుతూ . చెప్పింది. 

"హేమ ..గొడవ పెరుగుతుంది..ఊరుకో.".సర్దిపెట్టాలని  చూసింది వర్ధనమ్మ. 

మీరుండండి అత్తమ్మా.. అంటూ.. హేమ భర్తని ఏహ్యభావం తో అడిగింది.

"భార్య అంటే భర్తకి అన్నిటికన్నా మించిన ఆస్తి. ఆ ఆస్తిని పదిలంగా కాపాడుకోలేనివాడు.. తన ప్రవర్తనవల్ల  ఇతరుల గౌరవానికి భంగం కల్గించే వాడు, పరుల చేత హీనంగా మాటలు అనిపించేవాడు.. భర్త ఎలా అవుతాడు.? అంతకన్నా భర్త లేడని అనుకోవడం ఉత్తమం " అంది  హేమ ..తన పెట్టె సర్దుకుని బయట పడుతూ.. 

"హేమా  ..నేను ఎందుకు  చెపుతున్నానో విను.. వినమంటున్నాను కదా.! " చేతిలో ఉన్న పెట్టెని లాక్కోబోయింది 

"అమ్మా.. దాన్ని వెళ్ళనీ.. కుక్కలాగా మళ్ళీ అది  ఇక్కడికే రాక ..ఏం చేస్తుందో ..చూద్దాం!"  అంటున్నాడు మగ అహంకారంతో.  

ఆ అహంకారం పై, విశృంఖలత్వం  పై  ఒకే  ఒక చిరునవ్వు చెంప దెబ్బ వేసి.. ఈ విశాలమైన ప్రపంచంలోకి .. కాలు బయట పెట్టింది.హేమ.   

లోపాలు  ఉన్న  చిత్రాన్ని చింపి పడేసినంత తేలికగా .. లోపాలు ఉన్న వ్యక్తి ని మార్చలేక..తను అవమానాలు దిగమింగి రాజీ పడలేక.