20, జనవరి 2026, మంగళవారం

కిటీకీలు వికసిస్తాయి

 




కిటికీలు వికసిస్తాయి 

వెలుగుతో రంగులతో

జీవం నిండిన ప్రపంచంతో 

********

పుస్తకంలో అక్షరాలు 

అడవి పూలు లాంటివి

ఎవరో చూస్తారనీ వికసించవు

పరిమళాలు వెదజల్లవు

కాలానికి  అవే పూస్తుంటాయి

విత్తనాలై వెదజల్లబడతాయి

ఏదో వొకనాడు ఎవరో వొకరి 

అరచేతుల మధ్య ప్రేమగా 

పాత పుస్తకమై జీవిస్తాయి

*****

జీవితం ఇస్తుంది  ఎన్నో అవకాశాలు

ఆ అవకాశాలు ఉపయోగించుకుని

అవే తప్పులు మళ్ళీ చేయకు

పరిణామాలు ఎదురుచూస్తుంటాయి

దండిచడానికి.  

                                 -వనజ తాతినేని


18, జనవరి 2026, ఆదివారం

పంట కోసే పిల్ల పాట

The Solitary Reaper  - William Wordsworth 

 ద సోలిటరీ రీపర్ 

                    ప్రముఖ ఆంగ్ల కవి - విలియం వర్డ్స్‌వర్త్  రాసిన కవిత కు తెలుగు అనువాదం వినండీ. అనువదించిన వారు  P. సింహాద్రమ్మ. విశాఖపట్టణం



అదుగో! అక్కడ!

ఆమె పాటను శ్రద్ధగా వినండి 

వొంటరిగా పొలంలో పనిచేసుకుంటోంది 

దూరంగా ఉన్న పర్వత ప్రాంతాలనుంచి వొచ్చిన పిల్ల 

పంట కోస్తూ తనలో తానే పాడుకుంటోంది 

కాసేపు ఆగి వినండి... లేదా నెమ్మదిగా వెళ్ళండి 

ఒక్కతే కోస్తూ కోసిన వెన్నుల్ని కట్టగా కడుతూ 

ఒంటరిగానే పాడుకుంటోంది 

ఏదో ప్రాచీన గానం  ఒంటరి విషాద గీతం 

వినండి! లోయలనిండా నిండిపోయి 

కొండల్లో ప్రతిధ్వనిస్తోంది 

లోతైన ధ్వనిలో ఉప్పొంగిపోతోంది


ఎక్కడినుండో దూరాభారాలనుండి వొచ్చి 

అరేబియా ఎడారి ఇసుక తిన్నెల మధ్య అలసిపోయి 

ఏ నీడలోనో విశ్రాంతి తీసుకునే ప్రయాణీకులకు 

ఏ చకోర పక్షీ కూడా ఈమె పాడినంత శ్రావ్యంగా 

స్వాగత గీతాలు పాడివుండదు 

వసంత కాలంలో కోయిల పాట కూడా ఇంత మాధుర్యంగా వినబడి ఉండదు 

అంతగా ఉత్తేజ పరిచేలా ఎన్నడూ వినలేని స్వరం అది 

సముద్రాల నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ 

సుదూరంగా వ్యాపించిన హెబ్రైడ్స్ ద్వీప సమూహాల 

మధ్యనుండీ వస్తున్న సాంప్రదాయ సంగీత విభావరేమో అది!!


ఆ పాట ఏదో సుతి మెత్తటి సందర్భం గూర్చి పాడినదా!

లేక రోజూ ప్రతినిత్యం జరుగుతున్న ఏదేని ప్రాముఖ్యత గల అంశమా?

ఏదేని సహజంగా ఉండే విషాదమా 

ఏదేని కోల్పోయిన విషాదమా 

ఎప్పుడో ఒకనాడు  బాధించినదా 

లేక మళ్ళీ ఇప్పుడదే బాధిస్తున్నదా

ఎవరైనా చెబుతారా నాకు?

ఆమె ఏం పాడుతోంది?

కవితలా ? వాటి ఛందస్సు తీరు తెన్నులా

బహుశా ఏనాటి తన గుండె గాయాల గురించా 

తీరని కోర్కెల గురించా 

సుదూరంగా ఉండే చిన్న చిన్న సంతోషాల గురించా 

తాను ఒకనాడు చేసిన యుద్ధాల గురించా 

లేక మరికొంచెం నిజాయితీ గా చెప్పాలంటే 

తన సహజ కష్టాల గురించా 

తాను పోగొట్టుకున్నదీ , లేక

తనను పదే పదే తాకుతున్న 

ఏదేని దుఃఖపు  తెరల గురించా??


అర్ధం ఏమైనా అయి ఉండొచ్చు 

ఆపిల్ల పాటకి అంతే లేనట్టుంది 

తాను పని చేసుకుంటుండగా పాడడం

కొడవలి వంపులోంచీ చూసాన్నేను 

కదలకుండా నిశ్చలంగా నిలబడి విన్నానా పాట 

కొండ చిగురుకి ఎక్కుతూ 

నాగుండెలో ఎన్నాళ్లకయినా ఆ గానాన్ని దాచుకున్నాను

ఇంకేనాటికీఆ స్వరం నాకు వినపడ నప్పటికీ......

(ఎప్పటికీ ఆపాట వినలేక పోయినప్పటికీ......)





పండగ అంటే..

 


పండగంటే.. ఏమిటంటే.. 

పండగ అంటే నాకు ప్రత్యేకమైనదిగా ఏమీ వుండదు. మన ఆత్మీయులు కళ్ళ ముందుంటే వారితో కలిసి పచ్చడి మెతుకులు తిన్నా అదే సంతోషం. అబ్బాయి అమెరికా వెళ్ళాక ఏ పండుగ చేయలేదు నేను. నా బిడ్డ లేకుండా ఏం పండగ అంటాను. గారెలు చేసినా పాయసం వండినా బెండకాయ + కొబ్బరి ప్రై చేసినా.. అయ్యో! నా బిడ్డ తినకుండా నేను తింటున్నాను కదా! అనే బాధ వుంటుంది. అసలు ఆ వంటలు చేయను కూడా!  అందుకే పండగంటే ఏమీ వుండదు. అన్ని రోజులు వొకటే!  బొటిక్ లో పని చేసే వర్కర్స్ వుంటే వారికి కొన్ని వంటలు  చేసి ఇచ్చేదాన్ని. వాళ్ళు సంతోషంగా తింటుంటే అదో తృప్తి.  14 సంవత్సరాలు ఆదివారం అంటే కూడా ఏమీ తెలియకుండా దగ్గర బంధువులు స్నేహితుల ఇళ్ళలో  శుభకార్యాలు వేడుకలు వినోదాలు అశుభకార్యాలు వేటికి వెళ్ళలేనంత బిజిగా గడిచిపోయాయి. ఇప్పుడు అంతా ఖాళీ గా వుంటాను. అయినా వెళ్ళను. తప్పనిసరి అయితే తప్ప. పండుగలు, వేడుకలు, సరదాలు, ప్రయాణాలు ఏమీ లేవు. అంతా వొకటే!

అప్పుడప్పుడు శ్రీశైలం వెళ్ళినట్లు పుట్టింటికి వెళ్తాను. నేను ఒక్కదాన్ని అయితే కదలను. చెల్లి నాకు లింక్ పెడుతూంది కాబట్టి. నిన్న మా నాన్న చాలా సంతోషించారు.. కజిన్స్ ని కలిశాము. సంతోషంగా గడిచిపోయింది. మొన్న కాలు బెణికింది. విపరీతమైన పెయిన్. నొప్పి అనగానే మా నాన్న గారు గబగబా  లోపలికి వెళ్ళి ఆయన మోకాళ్ళ నొప్పులు లకు రాసుకునే మందు రాసి మసాజ్ చేసారు. బస్తాడు మునగాకు కోయించి ట్రంక్ లో వేయించారు. మా అన్నయ్య చెల్లెళ్ళు కోసం ఏవేవో సర్దాడు. మా వదినమ్మ తాంబూలం ఇచ్చి మంచి చీరలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చింది. నేను యదాతథంగా చెట్టు చేమ నది మనుషులు ఫోటోలు తీసి తీసి ఫోన్ GB బద్దలు అయ్యింది. మా నాన్న వచ్చేటప్పుడు చెప్పారు. పెందలాడే పడుకో.. ఆ కళ్ళు చూడు ! చుట్టూ నల్లగా అయిపోయాయి..మొహం అంతా పొక్కులు వచ్చేసాయి అని. “లేదు నాన్నా! బాగానే వున్నాను.చాలా ప్రశాంతంగా వున్నా!” అని చెప్పాను. మా చెల్లి జోక్స్ మా అన్నయ్య శబ్దం లేని నవ్వులు.. మా నాన్న ని షర్టు గుండీ పెట్టించి మరీ తీసిన ఫోటో మిట్టమధ్యాహ్నం పూట కూడా పక్షుల సంగీతం కోతుల విహారం అన్ని అలా మైండ్ లో ఇంకిపోయాయి. నలుగురు కలినప్పుడు పుట్టేదే పండగ! 

నా ఆలోచనలకు దగ్గరగా.. పండగంటే ఏమిటంటే… సిరివెన్నెల మాటల్లో.. గతంలో ఒక పోస్ట్ రాసాను.

లింక్.. ఇక్కడ.. పండుగ అంటే..