25, జూన్ 2011, శనివారం

పెయిర్ & లవ్లీ అయినా కొని పెట్టలేదు


ఈ మద్య అసలు.. కాగితపు పుటలు కళ్ళ ముందు..రెపరెపలాడటం లేదు. నాకు  ఆధునికత  వంటబట్టి..వెబ్ పేజెస్ క్లిక్ క్లిక్ తో..మారిపోతున్నాయి. దుమ్ము కొట్టుకుని..వరుసలు వరుసలుగా..పేరుకుపోతున్న పత్రికలు..మమ్మల్ని కాస్త చూడమ్మా!..అప్పుడే..అంత చేదు అయిపోయామా..అని..నిద్రలో..ఉన్నప్పుడు కూడా.. దెప్పి పొడుస్తున్నాయని.. అలా..ఒక పత్రిక పట్టుకుని...అక్షరాల వెంట కళ్ళని..పరుగులు పెట్టిస్తున్నా.. అందులో..ఇలా..ఉంది.... 

ఆమె ఎన్ని బరువులైనా మోయగలదు.
ఎన్ని కష్టాలైనా ఎదుర్కోగలదు.
ఎంతటి దరిద్రాన్ని అయినా అనుభవించ గలదు 
కానీ  ..తన మనసుని పంచుకోలేనివాడుతో.. .
శూన్య నరకాన్ని భరించలేదు...
ఈ సృష్టి లో..అతి క్లిష్టమైన విద్య 
మనసుని అర్ధం చేసుకోవడం.. 
అని చదువుతూ.. ఆహా భలే బాగా రాసారు!.అనుకుంటున్నాను.. 

మాకుటుంబానికి.బాగాకావాల్సిన  వారు..ఒక ఆమె వచ్చారు.. "అమ్మాయి..బాగున్నావా..అమ్మా!..అంటూ..పుస్తకం ప్రక్కనబడేసి.. ఈ..చదవడంకి..ముహూర్తం కుదరలేదు..అనుకుని.."బాగున్నాను"..కూర్చోండి..మంచి నీళ్ళు  తాగుతారా.".అని అడిగి.. మర్యాదలు చేశాను. ఏం తాగుతాను లేమ్మా! మా అల్లుడు మా చేత మూడుచెరువులు ..తాగిస్తున్నాడు..అంది ఆవిడ. 

అలాగా..! ఏం జరుగుతుంది.అన్నాను.  అన్నీ  ..నీకే  కావాలి.. ఎందుకు  వాళ్ళ సంగతులు...అంటున్నారు..మా అత్తమ్మ. అయ్యో..అలాగంటావేమిటి..అక్కా.. మనిషి అన్నాక కాస్తంత మంచి చెడు చెప్పుకోవాలి.లేకపోతే గుండె బరువెక్కుద్ది అంట..టి.వి.లో చెపుతున్నారు..అంది. 

నాకు నవ్వు వచ్చింది.ఆరోగ్యం పట్ల ఎంతటి అవగాహన..కల్పిస్తున్నారు. ఎంతైనా ప్రసార సాధనాల యుగం కదా..అనుకున్నాను.ఒక అడుగు వెనుకకు తగ్గే..(చానల్స్ యుగం అనాలి కదా) .

"సరేలే..చెప్పు అంది.."మా అత్తమ్మ ఆవిడని. 
ఏం చెప్పను ..అక్కాయి.. మా అల్లుడు అమ్మాయిని నానా రకాల బాధలు పెడుతున్నాడు. 

పెళ్ళైన  పదేళ్ళ లో ప్రేమగా  ఒకసారైనా  ఒక పెయిర్  & లవ్లీ పేకెట్ అయినా కొని పెట్టలేదు..
నేను అమ్మాయిని ఎంత బాగా పెంచాను.. ఏమిటో..దాని జీవితం అలా తగలడింది..అందుకే విడాకులు  ఇచ్చేయమంటున్నాను..అంది.నేను షాక్ అయ్యాను.మా అత్తమ్మ నా వైపు చూసి నవ్వింది. 



వెంటనే.. నిన్ననే.. మాట్లాడుకున్న ఓ..సంగతి మెదిలింది.  నా ఫ్రెండ్ కూతురు..స్వేచ్చ వచ్చి వెళ్ళింది.. ఇక్కడికి దగ్గరలోనే.. బందువుల  పెళ్లి. నా దగ్గర కాసేపు ఉండి..చీర కట్టుకోవడం నేర్చుకుని..వడ్డానం తో..సహా అన్ని నగలు పెట్టుకుని.. చక్కగా జడ వేయించుకుని..తలనిండా..పూలు పెట్టించుకుని..అసుర సంధ్య వేళ లో.. మా ఇంటి ముందు "తులసమ్మ" ముందు..నిలబడి..ఫోటో..తీయించుకుని..వెళ్ళింది.. ఏ..మేకప్ లు    లేకుండా...ఎంత ముచ్చటగా ఉందొ.. .! 

ఏమిటి..తల్లీ..ఇలా ఏం అలంకరణ సామాగ్రి లేకుండా  వచ్చావు? ఈ ఇంట్లో..టాల్కం పౌడర్ కూడా ఉండదు అన్నాను. పర్లేదు..ఆంటీ..నాకు ఆలాటివి ఏం వద్దు.. మీకొక ఇంటరెస్టింగ్.. విషయం  చెప్పనా..?అంది..

చెప్పు..అన్నాను.. మా వూరిలో..ఒక ఫ్రెండ్ ఉంది.వాళ్ళు ఇద్దరు..అక్కచెల్లెళ్ళు. వాళ్ళ మమ్మీ..నన్ను చూసి..ఏమిటి స్వేచ్చా..!ఇలా ఉన్నావు..? ఆడ పిల్లలు.. చక్కగా..బ్యుటి టిప్స్ ఫాల్లౌ అవుతూ..అప్పుడప్పుడు..పార్లలకి..వెళ్లి అందంగా..ఉండేందుకు..జాగ్రత్తలు తీసుకోవాలి...అని చెప్పింది..ఇంకా   ఏమందంటే..

బోలెడంత ఖర్చు పెట్టి చదివిస్తున్నాం..ఇంకా కట్నాలు కూడా ఇచ్చి, బోలెడంత ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు ఎక్కడ చేయగలం..?అందంగా,ఆకర్షనీయం గా ఉంటె..ఎవరో..ఒకరు..మంచి..(అంటే ఉద్యోగం,ఆస్తి ఉన్న) పిల్లాడు కాణీ కట్నం లేకుండా  చేసుకుంటాడు..అంటుంది. ఆమె వాళ్ళ పిల్లలకి డబ్బు ఇచ్చి మరీ బ్యుటి పార్లల్ కి పంపుతుంది.వాళ్ళ అమ్మాయిలకి..ఎంత బ్యుటి కాన్షియస్ ..ఉంటుందో..అంది.. నేను..  ఆశ్చర్య పోయాను...(ఇక నుండి ఆశ్చర్యపోవడం తగ్గించుకోవాలి)  ప్రతిదానికి ఆశ్చర్య పడటమేనా? ఎక్కడ ఉన్నాను..బి .సి.లో కాదుగా.. అనుకున్నాను కూడా.. 

ఇప్పుడు..ఇంకా ఆశ్చర్యపోయాను. ఇలా..  మునుపటి తరం ఆడవాళ్ళ ఆలోచనలే ఇలా ఉంటె.. చిన్న చిన్న విషయాలకి..విడాకులు తీసుకునేందుకు, పిల్లలకి..కొన్ని ప్రేరణలు ఇచ్చి..పెద్దలు ఎంకరేజ్ చేస్తున్నారా అనిపిస్తుంది. 

కానీ..  భార్య ముద్దుముచ్చట  తెలియని భర్తల పట్ల విసిగిపోవడం..లేదా సమస్యలు ఉంటె తల్లిదండ్రులు..అండదండ ఉండటం..సాధారణంగా..ఉంటుంది. ఇక్కడ  పెయిర్  & లవ్ లి  యే సమస్య కాకపోవచ్చు..అవ్వను వచ్చు.. లేదా మా స్వేచ్చ చెప్పిన ..వాళ్ళ ఫ్రెండ్ తల్లి.. ఆలోచనా ధోరణి  కావచ్చు. ఆ ఆలోచనల వెనుక ఉన్న కారణాలు కావచ్చు.. అందం.. ఒక అవసరం..అందం గా ఉండాలన్న తపనతో.. అలంకరణ లేదా స్కిన్ కేర్.. కోసం..బోలెడంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరం.


అందమే.. పెళ్ళికి..ప్రామాణికం.!? అప్పుడు కట్నకానుకలు వద్దు.. చదువు సంస్కారం వద్దు.. ఒకవేళ అందంగా లేని అమ్మాయిలు ఏం చేయాలో.. ?   ఏం చేయాలో..?ఇలా ఆలోచనల్లో ఉండగానే.. మా బంధువుల ఆవిడ..వెళ్లొస్తాను అమ్మాయి.. అంది.. సరేనండీ..అన్నాను. 

మళ్ళీ చదువుతూ ఆపేసిన పత్రిక అందుకున్నాను.ఆగిపోయిన చోట కి..వెళ్లి వెనక్కి వెళ్లాను  ఒకసారి..

మనసుని పంచుకోలేనివాడితో..శూన్య నరకాన్ని భరించలేదు..
అన్న దగ్గర ఆగాను.. గాడిదగుడ్డు ఏం కాదు.. దానికన్నా చాలా చిన్న కారణాలకి..విడిపోతున్నారు..చాలా అవసరాల కోసం కలసి..బ్రతకాల్సి  వస్తుంది.. మనసుండి మాత్రం కాదు అనుకున్నాను..  పనిలో పనిగా  "మనసు కవి" పాట ఒకటి గుర్తుకు  వచ్చింది. మనసు  లేని  బ్రతుకొక  నరకం  -అంటూ.. వినేద్దాం మరి. 

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Read this Tapa

http://kalagooragampa.blogspot.com/2011/06/1_25.html

అజ్ఞాత చెప్పారు...

*పెళ్ళైన పదేళ్ళ లో ప్రేమగా ఒకసారైనా ఒక పెయిర్ & లవ్లీ పేకెట్ అయినా కొని పెట్టలేదు...అందుకే విడాకులు ఇచ్చేయమంటున్నాను..అంది.నేను షాక్ అయ్యాను.*

ఇది చదివిన తరువాత చింతామణి నాటకం లో చింతామణి అమ్మ లతప్ప గుర్తుకు వచ్చింది. ఆ నాటకం లో చింతామణికి కావలసిన వారిని లతప్ప నిర్ణయిస్తుంది. బిల్వమంగళుడి దగ్గర డబ్బులు అయిపోయాయని తెలిసి, "అమ్మా భవాని శంకరంగాడిని ఈడ్చి అవతలికి పారేయవే తల్లి" అని అంటుంది. చింతామణి మంచి వ్యక్తి కనుక, అతని డబ్బులన్ని మనం తినేసి అలా చేయటం తప్పుకదా అని సర్ది చెప్పుతూ ఉంట్టుంది. ఈ మధ్య అత్త అల్లుడు ముఖ్యంగా అత్తకంటికి నచ్చాలి, ఇక అల్లుడి సంపద రోజు రోజుకి కార్పోరేట్ కంపెనిలో త్రైమాసిక ఫలితాల లా కోట్ల లో అభివృద్ది అవుతూండాలి. ఆతరువాత అల్లుడి ఇంట్లో తిష్ట్ట వేసి వాడికి మనశాంతీ లేకుండా చేయాలి. ఏమైనా మాట్లాడితే అల్లుడితో మా అమ్మాయిని చాలా ముద్దుగా పెంచుకొన్నాము, దానిని చూడకుండా ఉండలేము అని మాట్లడితె సరి. ఆతరువాత అల్లుడి సంపాదన మిగతా వారితో పోలుస్తూ వాడిని వెర్రి వెంగళ్లప్పను చేసి లతప్ప లాగా కొత్త అల్లుడిని వెదుకుతారు.