2, డిసెంబర్ 2011, శుక్రవారం

జాతర..

ఆ వూరు వూరంతా కోలాహొలంగా వుంది.. నాలుగేళ్ళకి వో సారి చేసుకునే పండుగ కాని పండుగ...గ్రామ దేవత
ఆరేటమ్మ జాతర. .



పొద్దున్నే వూరంతా పొంగళ్ళు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంటి దగ్గర యెవరి స్తోమతని బట్టి వారు కోడినో, పోట్టేలునో కోసి విందు భోజనాలు చేసుకోవడం ఆనవాయితీ..

ప్రతి యింటికి బంధువుల రాక, పిండి వంటల వాసనలు పొలిమేరదాటి మరీ చవులూరిస్తున్నాయి. మద్దేలకి మసాలా వాసనతో వూరంతా గుమాయిన్చేసింది.అందరు తిని తేన్చి కాస్తంత విశ్రాంతి తీసుకుంటుంటే.. పిల్లాజెల్లా సందడి జేస్తుంటే పొద్దు గుంకిన సంగతే మరచారు. చుక్కలు పొడవగానే దీపాలతో పాటుహడావిడిగా వూరంతా ముస్తాబు అయింది.

మసక సందేళ నాయుడు యింటి ముందు కారు ఆగింది. అందులోనుండి బిల బిల మంటూ అయిదు ఆరుగురు హడావిడిగా దిగబడ్డారు. వారికి నాయుడు పశువుల కొట్టంలో.. యెరువుల బస్తాలు,ధాన్యం బస్తాలు వేసుకోవడానికి కట్టిన రెండు గదులు ఖాళీగా వుండడంతో వారు అక్కడ విడిది చేసారు.

"ఒరేయ్.. శీను యెవర్రా వాళ్ళు.. ఆరుగురేడుగురు వున్నారు. మన కారులోనే యిక్కడికి వచ్చారు.ఏం పని యిక్కడ వాళ్లకి.. "అడిగింది హేమ. ఆమె ఆ ఊరి పెద కాపు నాయుడు కోడలు.

"అమ్మా! మీకు తెల్వదా? వాళ్ళు పేట నుండి వచ్చారు. రికార్డింగ్ డాన్సు వాళ్లంట.నాయుడు బాబే మాట్లాడి తీసుకోచ్చినాడట. ఈ ఒక్కరేత్రికి డాన్సు ఆడి నందుకే ముప్పైయేల రూపాయలంట." అన్నాడు శీను.

"అవునా, అంత డబ్బా!? అంది ఆశ్చర్యంగా అయినా రికార్డింగ్ డాన్సు అంటే పోలీసులు ఊరుకోరు కదరా" అంది.
"ఏమోనమ్మా..పోలీసోళ్ళు యీడకి రాకుండా వుండేట్టట్టు వాళ్లకి డబ్బు యిచ్చారంట " అన్నాడు. ఆమెకి యీ విషయాలు యేవి తెలియనందుకు వాడికి తెలిసినందుకు  కల్గిన ఆనందం ప్రకటిస్తూ..

"సరేలే! వాళ్ళకి యే౦ కావాలోనువ్వు చూసుకో వూరికూరికే పని వదిలేసి వూర్లో పెత్తనాలకి వెళ్లకు.నేను వచ్చిన చుట్టాలకి చేసి పెట్టడానికి, అందించడానికే వూపిరిసలపడం లేదు.మళ్ళీ వాళ్లకి కావాల్సినవి కూడా  నేను చూసుకోలేను అని వాడికి వాళ్ళకి కావలసినవి అందించే పని పురమాయించింది.

కాసేపటికే శీను వచ్చి "అమ్మా! ఆళ్ళకి కాసిని పాలు కావాలటమ్మా " అన్నాడు.

 "ఇప్పుడే కదరా "టీ " పెట్టి పంపాను. మళ్ళీ పాలు యేమిటిరా " అడిగింది విసుగ్గా..

"పసి పిల్ల వుంది అమ్మా! ఆ పిల్లకి పాలు పట్టాలంట." అని చెప్పాడు. "అయ్యో! పసి పిల్లలని కూడా వేసుకుని వచ్చారా? ఇప్పుడే యిస్తాను వుండు" అంటూ కాసిని పాలు కాసిచ్చింది.

కాసేపటికి ఆరేటమ్మ గుడి దగ్గర సన్నాయి మేళం మొదలయింది. "ఒరేయ్..త్వరగా పదండి. నాయుడు వచ్చినట్టు వున్నాడు.టెంకాయ కొట్టి తిరణాల మొదలెట్టేత్తారు.యెనక బడ్డామా మందు చుక్క చుక్క కూడా మిగలదు.".అంటూ తొందరపడ్డారు కొందరు


డప్పుల మోతతో కోలాటాల ఆటల, చిందులతో జాతర మొదలయింది. ఆరేటమ్మ అలంకారం చాలా అందంగా ఉంది. ..ఒక ట్రాక్టర్ ట్రక్కులో వేదిక అమర్చి ఆ వేదిక చుట్టూ విద్యుత్ దీపాల అలంకరణతో పాటు రక రకాల పువ్వుల దండలతో చుట్టూరా అలంకారం జేసి అమ్మవారి వుత్సవ విగ్రహానికి  వో గజమాలని వేసి చూడటానికి రెండు కళ్ళు చాలవన్నట్లు ఉంది.

ఊరేగింపు అప్పుడే మొదలైంది ముందుగా డప్పుల మోతతో చిందుల బృందం తరువాత అమ్మవారి విగ్రహం వున్నట్రాక్టర్ ఆ వెనుక మరొక ట్రాక్టర్ ట్రక్ లో జనరేటర్ ఆ వెనుక యింకో ట్రాక్టర్ అందులో చిలకలూరి పేట నుంచి పిలిపించిన రికార్డింగ్ డాన్సు గ్రూప్. వాళ్ళ రికార్డింగ్ డాన్సు కనిపించడానికి ఎత్తుగా కట్టిన వేదికపై  మైకు సెట్ లో వస్తున్న పాటకి అనుగుణంగా డాన్సు చేస్తున్న జంట.

అమ్మ వారి వూరేగింపు ముందుకన్నా మూడురెట్లు యెక్కువ మంది ఆ డాన్సు చేసే ట్రాక్టర్ ట్రక్కు చుట్టూనే జేరి వున్నారు ఈలలు వేసేది కొందరైతే.. ఆ డాన్సు చేసే అమ్మాయిలని చూస్తూ చొంగలు కారుస్తూ కొందరు, మరి కొంత వుత్సాహవంతులైతే చొరవజేసి ప్రశంసగా వారి బిగుతైన యెదపై రూపాయల నోట్లుని పిన్నీసు పెట్టి బహుకరిస్తున్నారు. వన్స్ మోర్ కొట్టినప్పుడల్లా అదే పాటకి తిరిగి డాన్సు చేస్తూ  ఆ జంట చెమటలు కక్కుతున్నారు.

బయట నుండి వచ్చిన నాయుడు కొడుకు తొందర తొందరగా స్నానం చేసి ఖద్దరు సిల్క్ బట్టలు ధరించి దట్టంగా సెంటు కొట్టుకుని బయటికి వెళ్ళాడు. అతను కూడా నిండా మద్యం సేవించి ఆ రికార్డింగ్ డాన్సు చేసే ట్రాక్టర్ చుట్టూతూ తిరుగుతూ ఈలలు వేస్తూ తూలుతూ వున్నాడు. తండ్రి ఆ వూరి కాపు అన్న గౌరవం కూడా కాపాడకుండా చదువు-సంస్కారాలు  అన్నీ మరచి వొళ్ళుమీద తెలియకుండా ప్రవర్తించడం చూసి మనసులోనే చీదరించుకుంటున్నారు. మరి కొందరైతే అతని భార్య  హేమ దగ్గరికి వచ్చి ఆ విషయం చెవిలో ఊది వెళ్ళారు.

హేమకి యే౦ మాట్లాడాలో అర్ధం కాలేదు. వారించడానికి ఆమె ఆ యింటి గడప దాటి వూరేగింపులోకి వెళ్ళలేదు. భర్త ప్రవర్తనకి ఆ వూరి వారి అందరి ముందు జరుగుతున్న అవమానానికి చాలా బాధగా వుంది ఆమెకి. పైగా ఇంటికి వచ్చిన చుట్టపక్కాలు చెవులు కొరుక్కుంటున్నారు.ఆమె వినడాన్ని గమనించి యేదో సరదాగా తిరుగుతున్నాడు లే! ఆ మాత్రం దానికే తప్పు పట్టాలా? పోనీయండిరా అని సర్దిచెపుతున్డటం చూసి హేమే ప్రక్కకు వెళ్ళిపోయింది ఆ మాటలు విననట్లు.

నాయుడు యింటి ముందుకి అమ్మవారి వూరేగింపు వచ్చింది. హేమ అత్తగారు బిందెతో నీళ్ళు పోసి  టెంకాయ ఇచ్చి అది కొట్టిన తర్వాత హారతి యిచ్చి కళ్ళకద్దుకుని హేమని పిలిచింది. భర్త ప్రవర్తన వల్ల మెదడు మోద్దుబారిపోయినట్లైన హేమ ఆ పిలుపు వినక మరోసారి అత్తగారు పిలిస్తే కానీ యీ లోకంలోకి రాలేదు. వెంటనే సర్దుకుని హారతి కళ్ళకద్దుకుని ఆరేటమ్మకి దణ్ణం పెట్టుకుని లోపలకి వచ్చి పడింది.

వీధి వాకిట్లో నిలుచుని యింట్లో  వున్న అందరు కాసేపు ఆ సరదాలని చూసి మహదానంద పడిపోతూ "ఓరి వీళ్ళ దుంపతెగ అచ్చం చిరంజీవి-రాధ వేసినట్లుగానే డాన్సు వేస్తున్నారు. డాన్సు లో యెంత ఆరితేరి పోయారు. అసలు సినిమా   యేక్టర్ లు యెందుకు  పనికి వస్తారు " అనుకుంటూ ప్రశంసలు యిస్తూ ఆశ్చర్యాలు వొలక బోస్తూ పదో యిరవయ్యో బహుమతిగా యిచ్చారు. తర్వాత వండిన వంటకాలని లొట్టలు వేసుకుని తింటూ కబుర్లులో పడ్డారు.

ఆడవాళ్ళందరూ కాసేపు ఆ మాట యీ మాట మాట్లాడుకుంటూ ఆలస్యంగా కానిస్తుంటే వాళ్లకి దగ్గరుండి వడ్డించి.. వాళ్ళందరికీ హాల్లో పరుపులు వేసి అన్ని సర్ది పెట్టేటప్పటికి అర్ధరాత్రి కావస్తుంది. ఆడవాళ్ళందరూ పడుకుంటే.. మగవాళ్ళు వాళ్ళని ఆకర్షించిన రికార్డ్ డాన్సు వైపు పరుగులు తీసారు.

హేమకి అన్నం తినబుద్ది కాలేదు. కళ్ళ ముందు  తాగి తూలుతున్న భర్త రూపమే గుర్తుకు వస్తుంది. తలనొప్పి ముంచుకొచ్చింది. వెళ్లి పడుకుంది. ఆలోచనల మద్య పసి పిల్ల ఏడుపు వినిపించింది. ఆ యేడుపు  పశువుల కొట్టంలో నుండి. ఆ రికార్డింగ్ డాన్సు వాళ్లకి చెందిన పసి పిల్లదిగా గుర్తించింది.  ఎంతకీ ఆ పిల్ల  యేడుపు ఆపడం లేదు. ఒక స్త్రీ గొంతు సమదాయిస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. పావు గంట గడచినా ఆ పసి పిల్ల యేడుపు ఆపడం లేదు. ఏదో కలవరం..లేచి వెళ్లి  "ఏమిటమ్మా పిల్ల అంతలా యేడుస్తుంది ..పాలు ఏమైనా కావాలా ?" అడిగింది.

"వద్దండీ, యిందాక మీరు యిచ్చిన పాలే అలాగే ఉన్నాయి పిల్ల పాలు తాగడం లేదు.జ్వరంగా వుంది "  అంది.

"అలాగా? యిక్కడ రెండు మైళ్ళు దాటి వెళితే గాని మందు బిళ్ళ దొరకదు. ఏది నన్ను చూడనీ " అంటూ.. ఆ పిల్ల నుదుటి పై చేయి వేసి చూసింది. ఆ పిల్ల వొళ్ళు విపరీతంగా కాలిపోతుంది. ఏడ్చి యేడ్చి కళ్ళు ముక్కు యెర్రబారి సొమ్మసిల్లి వుంది. "అయ్యో, చాలా జ్వరంగా వుందే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళడానికి యింటిదగ్గర కారు,బండి యేమి లేవు. ఇప్పుడెలా? నా దగ్గర క్రోసిన్ సిరప్  వొక్కటే ఉంది  అది  యిస్తాను. ఆ మందు వేయి" .అని చెప్పి

 "ఎప్పటి నుండి  జ్వరం ? "అడిగింది.

"తెలియదండీ"అంది ఆ అమ్మాయి. అప్పుడు అనుమానంగా "నీ బిడ్డ కాదా ఏమిటీ? "అని అడిగింది హేమ.

"కాదండీ, నాతో పాటు వచ్చిన రజని అనే అమ్మాయి పాప "అంది.

"అయితే ఇలా జ్వరం పెట్టుకుని యింత దూరం యీ పాపతో యెలా వచ్చారు, మీకసలు బుద్ధి ఉందా ? " కోప్పడింది.

ఆ అమ్మాయి మాట్లాడ లేదు. ఇంట్లోకి వెళ్లి సిరప్ తో పాటు టేబుల్ ఫ్యాన్ పట్టుకొచ్చి  ఆ పిల్లకి గాలి తగిలేటట్లు పెట్టి.. యిద్దరు కలసి సిరఫ్ తాగించారు. హేమ కాసేపు అక్కడే కూర్చుంది.

ఆ పసి పిల్ల కాస్త నెమ్మలంగా పడుకుంది అనుకున్నాక "తిన్నావా? "అడిగింది. "లేదండీ..తింటే..డాన్సు చేయలేము". అంది.

"ఎలా వచ్చారు ఈ వృత్తిలోకి ? అడిగింది ఆసక్తిగా ..

"మా నాన్న రికార్డింగ్ డాన్సు వాళ్లకి మేకప్ వేసేవాడు. ఆ డాన్సు వేసేవాళ్ళ ని  చూసి సరదాగా నేను స్టెప్ లు నేర్చుకున్నాను.తర్వాత మా అన్న కూడా యిదే పని మొదలెట్టాడు. అన్న స్నేహితుడు యిందులోకే వచ్చాడు చిరంజీవిలా వున్నాడని వాడినే మోజు పడి పెళ్లి చేసుకున్నాను. నాకిద్దరు పిల్లలు. ఇంటి దగ్గర అమ్మ చూసుకుంటుంది. ఆరుగురం కలసి వొకే ట్రూఫ్ కట్టాం. వచ్చిన దాన్ని అందరం కల్సి పంచుకుంటాం." చెప్పింది వివరంగా..

"మరి యింకో అమ్మాయి ? " అడిగింది..హేమ

"రజని నా!? పాపం ఆమెకి యెవరు లేరు. ఎవడినో ప్రేమించి పెళ్ళిచేసుకుని మా వూరికి వచ్చారు. మా యింటి ప్రక్కనే కిరాయికి వుండేవాళ్ళు. వాడు ఆమెని బిడ్డ తల్లిని చేసి మోసం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు యీ డాన్సు నేర్చుకుని మాతో చేరింది" ఒక్క నిమిషం నిశ్శబ్దం.

రజని అంటే చీకటి.ఈ అమ్మాయి జీవితం లోను చీకటి మిగిల్చి వెళ్ళిపోయాడు. అయినా అమ్మాయిలు అందరు ఆకర్షణకు లోనయి ప్రేమ పేరిట మోసపోవడం అలవాటయిపోయింది.కాస్త వివేకం కల వాళ్ళైతే  ఆ మోసాలని తట్టుకుని జీవితాన్ని  నిలబెట్టుకోగల్గుతారు. ఈ అమ్మాయి పర్లేదనుకుంటా ! గుడ్డిలో మెల్ల కాస్త  తట్టుకుని నిలబడింది. అయినా యీ కళ యేమిటో!  చూస్తూ చూస్తూ సమాజంలో పెద్దగా గౌరవం దక్కని యిలాటి వృత్తిలో జొరబడింది అనుకుంది.

అంతలోనే  యింకో విషయం గుర్తుకు వచ్చింది. చానల్స్ లో యిలా  డాన్సు వేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం తో పాటు పోటాపోటీగా సాగుతూ బహుమతుల్ని ప్రకటించడం, ఆ బహుమతుల్ని గెలుచుకోవాలని, ప్రధమ స్థానాలని కైవసం చేసుకోవడానికి పోటి పడుతుంటారు.వేదిక మారింది తేడా అంతే కదా!అనుకుంది మనసులో.

"అమ్మా! కొంచెం సేపు యిక్కడే ఉంటారా? ఊరేగింపు మొదలు పెట్టిన  దగ్గరనుండి రజని నే డాన్సు చేస్తుంది, నేను వెళ్లి ఆమెని పంపుతాను " అంది. హేమ యేమీ   మాట్లాడక పోయే సరికి  "పాపం తను పొద్దుటి నుండి యేమి తినలేదు కూడా.." జాలిగా చెప్పింది.

"సరే వెళ్ళు యీ ప్రక్క వీధిలోనే వూరేగింపు వున్నట్టు వుంది.". అని చెప్పింది.

ఆమె వెళ్ళాక వొక చిన్న నిట్టూర్పు విడిచింది. కొందరి జీవితాలు యెప్పుడు యే మలుపు తిరుగుతాయో చెప్పలేము యేమిటో యీ బ్రతుకులు ?  ప్చ్ ..అనుకుంది.

వెళ్లి పావు గంట దాటినాకూడా ఆ పసి పిల్ల తల్లి యింకా  రాలేదు. ఒకటే ఆవలింతలు గత రాత్రి కూడా సరిగ్గా నిద్ర లేక పోవడం వల్ల నిద్ర ముంచుకొస్తుంది. ఏమిటి నాకీ  కాపలా అని విసుక్కుని మళ్ళీ అంతలోనే కొంచెం సేపుకి యేమైంది లే అని సర్దుకుంది. అరగంట గడచినా పిల్ల తల్లి రాదు, వెళ్ళిన అమ్మాయీ  రాదు. ఇంతలోకి ఆ పసి పిల్ల లేవనే లేచింది. ఏడుపు ప్రారంభించింది.ఏంచేయాలో హేమకి తోచలేదు. ఎవరికి చెప్పి కబురు పంపాలన్నా వొక్క పురుగు కనబడలేదు. కాస్త బెరుకుగా,యిబ్బందిగా ఆ పిల్లని చేతుల్లోకి తీసుకుంది.వొళ్ళు కాలి పోతుంది. ఇచ్చిన మందు యేమి పని చేయలేదు అనుకుంటా అనుకుని

 తప్పని సరై ఆ పిల్లని భుజాన వేసుకుని యెప్పుడు వీధుల్లోకి అడుగుపెట్టని ఆమె వీధిలోకి నడిచింది. ఆ పిల్లని తల్లి దరికి చేర్చడానికి. ఇంట్లో ఎవరైనా చూస్తే తిట్లు తప్పవు అనుకుంది. ఆ లేబర్ వాళ్ళ పిల్లని నువ్వు యెత్తుకోవడం యేమిటీ? అసలు యే౦ చేయాలో యే౦ చేయకూడదో, మనమేమిటో మన అంతస్తు యేమిటో  మన పరువు యేమిటో లెక్క లేకుండా పోతుంది. సాయంత్రానికి నలుగురిని పోగేసి వాళ్లకి చదువు చెప్పడం చట్టుబండలు చెప్పడం అని కొంపంతా లేబర్ మయం చేస్తున్నావ్ అని అత్తగారు తిట్టడం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు యీ పిల్లని యెత్తుకుని బయటకి వెళ్ళడం చూస్తే..నా పని వుంటుంది అనుకుంటూ వొక అయిదు నిమిషాలు నడచింది యెదురుగా వస్తున్న వూరేగింపుని చూస్తూ ఆగింది.

ఆ పిల్ల తల్లి వేస్తున్న డాన్సు కి వూగిపోతూ ఈలలు వేస్తూ వెర్రి కేకలు పెడుతున్న జనం  ఆమెని కాసేపైనా ఆగనివ్వడం లేదు. ఆమె క్రిందకి దిగబోతుంటే మళ్ళీ స్టేజ్ పైకి వెళ్ళమని బలవంత పెడుతున్నారు.

హేమ భుజం పై ఉన్న పిల్ల గ్రుక్క పెట్టి ఏడుస్తుంది. ఏడుస్తున్న పిల్లని తల్లి చూసింది. అక్కడినుండి రాలేని పరిస్థితి.. చెమటలు క్రక్కుతూ ఆడుతున్న ఆమె మేకప్ చెదిరిపోయి మరకలు మరకలుతో యెబ్బెట్టుగా ఉంది. ఆమె పైకి
యెగపాకి మరీ నోట్లు దండలు వేస్తున్న పురుషులు. ఆ నోట్లు చూస్తూ ఆనందంతో తలమునకలై యింకా రెచ్చిపోయే పాటలు వేస్తూ అందుకు అనుగుణంగా బలవంతంగా స్టెప్స్ వేస్తున్న ఆమె.  ట్రూప్ వాళ్ళు యెవరూ కూడా పసి దాని యేడుపు పట్టించుకోవడంలేదు. ఆ పసిదాని యేడుపుకి ఆ పిల్ల తల్లి కళ్ళల్లో కన్నీటి కాలవలు చూసి తన హోదా మరచి గొప్పింటి కోడలు అన్న గౌరవం  ప్రక్కకి నెట్టి  హేమ గబగబా మనుషులని తోసుకుని ముందుకెళ్ళి గట్టిగా అరిచింది. "మీరసలు మనుషులేనా!? ఆ పసిది తల్లికోసం అలా జ్వరంలో..వెక్కిళ్ళు పెట్టి యేడుస్తుంటే వదలకుండా మీకు ఆ తల్లి తైతక్కలు కావాల్సి వచ్చాయా ? ముందు ఆమెని వదలండి "అని  గట్టిగా అనగానే మారు మాట్లాడకుండా అందరు పక్కకు తప్పుకున్నారు.

"అరగంట నుండి బతిమలాడుతున్నాను ఆమెని వదలండి అని వొక్కరు కూడా వినలేదు. ఏం చెయ్యాలో తెలియక అలాగే వున్నానండీ..క్షమించండీ."అని ఆ అమ్మాయి స్టేజ్ యెక్కుతూ..

క్రిందకు దిగివచ్చి హేమ చేతిలోని పిల్లని తీసుకుంది  పిల్ల తల్లి. హేమ  నడక మొదలెట్టింది.ఆమె వెనకాలే వస్తుంటే  "బుద్ధి లేదూ, యింత జ్వరం పెట్టుకుని పిల్లనేసుకుని యిక్కడికి వచ్చావు,ఆ పిల్లకి యేమైనా  అయితే ? " అంది కోపంగా.

ఆమె మాట్లాడలేదు.వాళ్ళు విడిది చేసిన గదుల దగ్గరికి వచ్చాక ఆ పసి దానికి మరోమారు సిరఫ్ తాగించేదాకా వుండి ఆమెకి కాస్త పెరుగన్నం తెచ్చి యిచ్చియిక నేను వెళ్లి పడుకుంటాను. తెల్లారగానే ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు అని చెప్పి వచ్చేసింది.

హేమ పడుకుంది కానీ నిద్ర రావడం లేదు. పక్క మీద అలాగే అస్థిమితంగా కదులుతూనే ఉంది. ఇక్కడ సౌకర్యాలు అంతే! ఆఖరికి ప్రాణాపాయం ముంచుకొచ్చినా వెళ్ళడానికి యెలాటి వాహన సౌకర్యం వుండదు.నట్టడవిలో వున్నటుంది. తన కొడుకుకి జ్వరం వచ్చినప్పుడు యిలాగే బాధ పడేది. అందుకేగా వాడిని తన చెల్లి దగ్గర  వుంచి యిక్కడ వొంటరిగా వుండాల్సి వస్తుంది. ఆస్తులని సమకూర్చుకోవాలంటే బిడ్డలని చదువుల పేరిట హాస్టల్ లో వదిలి వుండాల్సి రావడం యెంత భాదాకరం. నాకు యీ ఆస్తులు వద్దు, యేమి వద్దు. నా బిడ్డకి తల్లి ప్రేమ కరువు కానివ్వకూడదు.. ఏమైనా సరే యెవరు అడ్డుపడినా సరే తన బిడ్డని తన దగ్గరికి తెచ్చేసుకోవాలి అని అనుకుంది  ఆ  క్షణంలో.

ఇంతలో టప్పున కరంట్ పోయింది.అప్పుడే అయిదు గంటలు అయిందా ? అనుకుంటూ బయటికి వచ్చింది ప్యాన్ ఆగిన తర్వాత బయట చప్పుళ్ళు వినబడుతున్నాయి .దూరంగా మ్రోగుతున్న డప్పులు. ఇంకా వూరేగింపు పూర్తి కాలేదు అనుకుంటా టైం చూస్తే నాలుగు గంటలు అయినట్లు ఉంది..ఏమొచ్చింది ఈ కరంట్ వాడికి అప్పుడే కరంట్ తీసేసి చచ్చాడు అని అత్తగారు నిద్ర లేచి తిడుతూ ఉంది.

పాలు తీసే వేళ అవుతుంది. పెందలాడే పాలు తీసి ఆ పసి పిల్లకి కాసిని యిస్తే తాగుతుందేమో! ఎలా వుందో యేమో! జ్వరం తగ్గిందో, లేదో అనుకుంటూ బయటకి వచ్చింది..

పశువుల కొట్టంలో వున్న గదుల్లో నుండి యేవో గట్టి శబ్దాలు వినవస్తున్నాయి. అనాలోచితంగా అటు వెళ్లి  వేసి వున్న తలుపు నెట్టబోయి గబుక్కున ఆగిపోయింది.లోపలి నుండి భర్త గొంతు.

"ఏమిటే..బెట్టు చేస్తున్నావ్? ముప్పైవేలు వూరికే యిచ్చానుకున్నావా? పతివ్రత కబుర్లు చెప్పకు నోరుమూసుకుని నాతో రా " అంటూ అసహ్యంగా ఆమెని తిడుతూ బలవంతం చేస్తున్నాడు.

"ఏమండీ, నా మాట నమ్మండీ!నేను అటువంటి మనిషిని కాదు నన్ను వదిలేయండీ" అని ఆ అమ్మాయి వేడుకుంటుంది." ఏమిటే..యెంత బెట్టు చేస్తే అంత యెక్కువ వస్తాయి అనుకుంటున్నావా? యెంత కావాలె నీకు నీ ఊపులకి, నీషేపులకి యెంత కావాలన్న ఇస్తానే!ఇంకో పదివేలు కావాలా? నీ మొహాన అలాగే పడేస్తా! టైం వేస్ట్ చేయకు, త్వరగా రా " అంటూ..ఆమె మీద మీద కు వెళ్ళినట్లు ఉన్నాడు. ఆమె అతనిని వెనక్కి తోస్తూ విదిలించు కుంటున్న  చప్పుడు.

హేమ తలుపు   నెట్టింది. ఆ తలుపు రాలేదు. లోపల గడియ వేసినట్లు వుంది.మళ్ళీ గట్టిగా కొట్టింది. ఆ ఆమ్మాయి అతని నుండి విదిలించుకుని వొక్క ఉదుటున తలుపు తెరిచి బయట పడింది. హేమని చూసి నిర్ఘాంతపోయింది. అక్కడ నుండి వెళ్లి ఓ ప్రక్కన కూర్చుని యేడ్వసాగింది.

హేమకి కోపం కట్టలు తెంచుకుంది. చూరులోనుండి వేలాడుతున్న చెర్నాకోల కనిపించింది. అది తీసుకుని లోపలి వెళ్లి భర్తని యెడాపెడా వాయించేసి ఛీ..అంటూ మొహాన వుమ్మేసి వచ్చింది.

పని అమ్మాయి అచ్చమ్మ వాకిలి చిమ్ముతూ వుంది. " ఇంత పొద్దుటే మీకు కొట్టంలో యే౦ పనమ్మా? పురుగు పుట్ర ఉంటాయి, అసలే కరంట్ కూడా లేకపోయే" అని అడిగింది.

"ఏం లేదులే, ఆ పిల్లకి జ్వరంగా వుందంటే  తగ్గిందో లేదో అని కనుక్కుందామని వచ్చాను" అని అబద్దం చెప్పింది. ఆ ఆవేశంలోనే  గబా గబా పాలు పితికి బర బర శబ్దం అయ్యేలా బ్రష్ తో పళ్ళు తోముకుని కుంపటి రాజేసింది. కాఫీ డికాషన్ కి నీళ్ళు పడేసింది. ఆ నీళ్ళు లాగానే ఆలోచనలు మరిగిపోతున్నాయి. యెంత మంది చెప్పినా తను వినలేదు అని కాదు కానీ పట్టించుకోలేదు. భర్త అసలు స్వరూపాన్ని కళ్ళారా చూసింది..

ఒక స్త్రీని బలవంతం చేస్తూ అసహ్యం గా ప్రవర్తిస్తున్న అతనిని చూసి భరించ లేకపోయింది. అయినా యింకా కోపం తగ్గలేదు.. తమ గదిలోకి వెళ్ళింది.జరిగిన అవమానంకి తట్టుకోలేక అనుకుంటాను.గొణుక్కుంటూ ఆమెని అసహ్యంగా తిడుతూ మద్యం సీసా మూత తీసి అలాగే తాగేస్తున్న భర్తని చూసి భయం వేసి గబాల్న బయటకి వచ్చి తలుపు గడియ పెట్టింది.కాఫీ కలిపి తను తాగి ఆ రికార్డ్ డాన్సు ఆమె రజనికి యిద్దామని వెళ్ళింది. ఈ లోపు మసక మసకగా తెల్లారిపోయింది. ఊరేగింపు పూర్తయింది. దిగులుతో భయంతో జరిగిన అవమానం వల్ల నల్లగా ముడుచుకున్న మొహం పెట్టుకున్న ఆ పిల్ల తల్లి వద్దకు వెళ్లి కాఫీ యిచ్చింది. ఆమె మౌనంగా కాఫీ తీసుకుని తాగిన తర్వాత యెలాగోలా గొంతు పెగుల్చుకుని వొకింత అవమానం గానే అనిపిస్తూ ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకుని  "మమ్మల్ని క్షమించమ్మా!" అంటూ భర్త చేసిన పనికి క్షమాపణ చెప్పింది.

"మీరు యె౦దుకమ్మా క్షమాపణ చెప్పడం. నెల రోజుల నుండి వొకటే సతాయిస్తున్నాడు. పక్క వూర్లో తిరునాళ్ళకి యిలాగే వచ్చాం. అప్పుడు చూసినప్పటి నుండి..ఇదే తంతు. నేను కాదన్నా వదలడం లేదు. నాలుగు రోజుల నుండి మా వూరికి వచ్చి యిక్కడ రికార్డింగ్ డాన్సు చేయాలి అంటుంటే బాగా చేస్తున్నాం అని అడుగుతున్నారేమో అనుకుంటున్నారు మావాళ్ళు . అందుకే పాపకి బాగోకపోయినా నన్ను బలవంత పెట్టి తీసుకుని వచ్చారు. ఇలాటి వుద్దేశ్యం వుందనుకోలేదు.మేము నీతి జాతి వున్న వాళ్ళమే.! కాసులకి కక్కుర్తి పడి యే పని పడితే ఆ పని చేయలేము కదా అంది. జరిగిన విషయం మా వాళ్లకి చెపితే మీ ఆయన్ని వూరికే వదలరు.కానీ చెప్పదల్చుకోలేదు. మీ మొహం చూసి వూరుకుంటున్నాను" అంది.

హేమ మౌనంగా వినేసి వచ్చేసింది.

చుట్టాలందరూ మామగారితో కలసి. పక్కనే చేలో వున్న మోటార్ షెడ్ల వైపు వెళ్ళారు.


రికార్డింగ్ డాన్సు వాళ్ళ ట్రూప్ మొత్తం వచ్చి మేకప్లు కడుక్కుని గదుల్లో వున్న వాళ్ళ సామాను సర్దుకుని వాళ్ళకు రావాల్సిన డబ్బు కోసం ఎదురు చూస్తున్నారు.

హేమ వెంటనే తమ గదిలోకి వెళ్లి తాగి మత్తుగా పడి ఉన్న భర్తని దాటుకుని వెళ్లి బీరువాలోనుండి డబ్బు తీసుకువచ్చి యిద్దామనుకుని బీరువా తీస్తుంది ఆ చప్పుడుకి ఆమె భర్త లేచి వచ్చి అమాంతం ఆమె జుట్టు పట్టుకుని విచక్షణా రహితంగా అందిన చోటల్లా పిడిగుద్దులు గుద్దసాగాడు. యెంత బిగపట్టుకున్నా ఆమె నోట్లోనుంచి అమ్మా! అన్న అరుపు వ చ్చేసింది. ఆ భాదాకరమైన పిలుపు వినగానే ఆమె అత్తగారు యే౦ జరిగిందో అని పరుగెత్తుకుని వచ్చారు.

"ఒరేయ్ ! నీకు యే౦ మాయ రోగం మొచ్చింది రా? దాన్ని యె౦దుకలా  కొడుతున్నావు. ఇంట్లో చుట్టాలు కూడా వున్నారు.అది కూడా చూసేది లేదు. తప్పతాగి పరువు తీసింది చాలక దాన్ని గొడ్డుని బాదినట్లు బాదుతున్నావ్? వదులు." అంటూ హేమని విడిపించే క్రమంలో ఆమెకి రెండు దెబ్బలు తగలనే తగిలాయి.

"ఉండండి అత్తయ్యా! ఈయన  వొళ్ళు తెలియకుండా కనపడిన ఆడ వాళ్ళందరి పైనా అచ్చోసిన ఆంబోతులా పడుతుంటే మన కుటుంబం పరువు పోతుందే కాదు.ఈయన చేష్టలకి మనం వురివేసుకుని చచ్చే రోజు కూడా వస్తుంది.పెద్ద మొనగాడిలా పెళ్ళాన్ని కొట్టడం కాదు. నిన్ను నడిబజారులోకి లాగి కొట్టకుండా  చూసుకో! అయినా యేమిటి నీకు అంత మదపు చేష్టలు? ఆడవాళ్ళు అంటే ఆట బొమ్మలా!?నువ్వు యిష్టపడగానే అందరూ  నీకు లొంగి పోవాలా? నిన్ను యిష్టపడిన వాళ్ళతో నువ్వు యెక్కడన్నా వూరేగు. నిన్ను యిష్ట పడని వారిని బలవంతం చేస్తే వాళ్ళ వుసురు తగిలి చస్తావు.అదయినా తెలుసుకో!నా ఖర్మ కాలి నీకు పెళ్ళాన్ని అయినందుకు రోజు నేను యిలాటివి విని సిగ్గుతో చస్తున్నాను.ఏదో ఒక రోజు నిన్ను నా చేతులతో స్వయంగా చంపేస్తాను." అంది ఆవేశంగా..

విషయం అర్ధమైన అతని తల్లి  "ఛీ..నీ బతుకు తగలెయ్య " అని చీదరించుకుని బయటకి వచ్చింది..

"నన్నే కొడతావా? నీ అమ్మ నీ పని యిప్పుడు కాదే..తర్వాత చెపుతాను అని అసహ్యంగా తిడుతుంటే.. భరించలేకపోయిన హేమ మరోమారు కాళికలా "ఇంకోసారి నా అమ్మ అన్నావంటే నాలుక చీరేస్తా జాగ్రత్త! ఏం చేస్తావు. నన్ను కొట్టడం ఒకటే చేతనవును లేదా చంపడం చేస్తావు నీకు అంతకన్నా యే౦ తెలుసు ?అని చీత్కరించుకుని

కళ్ళు చుడుచుకుని జుట్టు సవరించుకుని డబ్బు తీసుకుని వచ్చి బయట యెదురు చూస్తున్న ట్రూప్ వాళ్ళకి యిచ్చేసి వాళ్ళని ప్రక్కన టవున్ లో దించి రమ్మని డ్రైవర్ శీనుకి చెప్పింది.

ఇంకా కారు రాలేదమ్మా! చిన్న బాబు వేసుకుని వెళ్ళాడు అని చెప్పాడు వాడు. కారు వచ్చే వరకు వాళ్ళు వేచి వుండక తప్పలేదు. ఈ లోపు నాస్టాలు తిని,కాఫీ తాగి వాళ్ళు విశ్రాంతిగా చేరగిల బడ్డారు.

అత్తగారు "వాళ్ళకేమన్న మాయరోగమా?ముప్పయివేలు పోసుకున్నారు. ఇంకా కార్లు మీద దించాలా?అన్నీ అలుసు యిచ్చి నేర్పుతావు..పెట్రోల్ యేమన్నా వూరికే వచ్చిందా? " అని గొణుగుతూ వుండటం వినబడింది. "అందరికి అన్నీ విలువైనవే.. ఆడదాని శీలం మాత్రం అతి చవక, తేలిక " అనుకుంది విరక్తిగా మనసులో..

ఇంతలో ఒక చుట్టాలావిడ తాను  రాత్రి ఆరేటమ్మని యేమి కోరుకుందో చెపుతుంది. మళ్ళీ ఈసారి తిరునాళ్ళ రోజులకి  అనుకున్నది జరిగితే మొక్కు తీర్చుకోవడానికి మళ్ళీ వస్తాను అంటుంది. హేమ నవ్వింది.ఏమిటే.." పిల్లా నవ్వుతున్నావు? ఆరేటమ్మని నమ్మవా నువ్వు"  అంది.

నమ్మడం అంటే అడిగింది హేమ . అసలు ఆరేటమ్మ గురించి ఒక కథ వుందమ్మా, చెపుతా విను అని పని అమ్మాయి అచ్చమ్మ చెప్పడం మొదలెట్టింది...

ఆరేటమ్మ గ్రామ దేవత..ఆమెని కొలిస్తే పాడిపంట బాగా వుంటాయట, పిల్లాపాప చల్లగా వుంటారని నమ్ముతారు. ఒకరి నమ్మకాన్ని నేను కాదనలేను కానీ.. ఒక మాట మాత్రం చెపుతుంటారు..ఆరేటిమ్మ సత్యం కల తల్లి అట. ఒక రోజు ధాన్యపు కళ్ళెం లో కాపలా కాస్తున్న రెడ్డికి కనబడిందని చెప్పుతుంటారు. అర్ధరాత్రి సమయంలోఆ రెడ్డికి చలి వేసి చుట్ట వెలిగించుకోవాలనుకుని అగ్గిపెట్టె కోసం జేబు తడుముకుంటే అగ్గిపెట్టె లేదంట.అప్పుడు ఆరేటి చుట్ట వెలిగించుకోవాలి నిప్పు పట్టుకురా! అన్నాడట. ఆ రెడ్డి మనుమరాలు పేరు ఆరేటి మనుమరాలిని పిలిచినట్టు .అలా యాధాలాపంగా అనుకోగానే ఆ గ్రామ దేవత ఆ రెడ్డి మనుమరాలి రూపంలో వచ్చి నిప్పు యిచ్చి వెళ్లిందంట. ఆ విషయంని తల్చుకుని తల్చుకుని  కథగా చెప్పుకుంటూ ఉంటారు. ఆరేటమ్మ గురించి అని చెప్పింది.
అందరు ఆసక్తిగా వింటున్నారు.

అలాగే యింకో కథ చెబుతారు. అందమైన ఒక బ్రాహ్మణ స్త్రీ ఆదివారం పూట ఆరేటమ్మ గుడికి వచ్చి పొంగలి పెట్టి తిరిగి వెళ్ళేటప్పుడు వొంటరిగా వెళ్ళడం గమనించిన యిద్దరు దొంగలు ఆమెని వెంబడించి ఆమె నగలు దోచుకుని.. ఆమె పై దురాగతం చేయబోతుంటే ఆరేటి నన్ను కాపాడమ్మా అని గట్టిగా కేకలు పెట్టగానే స్వయంగా ఆరేటమ్మ వచ్చి వాళ్ళని చంపి ఆమెని కాపాడినదట.అప్పటి నుండి వొంటరిగా అయినా కూడా భయం లేకుండా ఆరేటి గుడికి వెళుతుంటారు. అది ఆరేటమ్మ గొప్పదనం. అమ్మ పుట్టిల్లు బందరు అంట.అక్కడినుండి నిన్న అమ్మకి పుట్టింటి సారే కూడా తెచ్చారు అని చెప్పుకొచ్చింది

అది కథే కావచ్చు నమ్మకం కావచ్చు.కానీ ఆడది ఒక శక్తి స్వరూపిణి. చెడ్డ పనులు చేస్తే శిక్షించడానికి మాత్రం తయారుగా ఉంటుంది. మంచి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. అంతే కదమ్మా అంది హేమ వైపు చూస్తూ అంది అచ్చమ్మ.

హేమకి అర్ధం అయింది. జరిగిన విషయం అచ్చమ్మకి తెలుసు అని.

అందుకే కదా జాతర చేస్తారు అంది నర్మ గర్భంగా

"అవునమ్మా! రాత్రి కూడా జాతర బాగా జరిగింది కదా! " అంది.

"ఊరూరా గ్రామ దేవత వూరి వాళ్ళందరిని బాగా కాచి ఉంటుందో లేదో తెలియదు కానీ, మీ హేమమ్మ లాటి వారు వుంటే చాలమ్మా, అందరు బాగుంటారు " అంది రజని కృతజ్ఞతగా.
"అవునమ్మా! మా హేమమ్మ పేరే కాదు మనసు బంగారమే" అంది అచ్చమ్మ.

ఓ గంట తర్వాత కారు రాగానే వాళ్ళందరూ కారెక్కుతూ వుండగా ఆడవాళ్ళిద్దరూ వచ్చి హేమ చేతులు పట్టుకుని కళ్ళ నీళ్ళతో కృతజ్ఞతలు చెపుతూ "వెళ్ళో స్తామమ్మా" అంటుంటే హేమకి కన్నీళ్ళు వచ్చాయి  యె౦దుకో తెలియదు.

7 కామెంట్‌లు:

శశి కళ చెప్పారు...

వనజ గారు యెన్త చక్కగ వ్రాస్తారు.యెన్త మంచి భావాలు.
నిజంగా నిద్ర వస్తున్నా ఆపుకొని మొత్తం చదివెసాను.

జ్యోతిర్మయి చెప్పారు...

వనజ గారూ చాలా బాగా వ్రాసారండీ..జరుగుతున్న
కథలే కదూ ఇవి..ఆడవారిని అర్ధనగ్నంగా చూపిస్తున్న౦త కాలం ఇలాంటివి సహించక తప్పదేమో..హేమ లాంటి వాళ్ళుంటే ఇలా౦టివి కొంచెమైనా తగ్గుతాయేమో..

Shabbu చెప్పారు...

చాలా పెద్ద స్టోరి లాగా అన్పించింది, ఒక నవల చదిని ఫీల్ కలిగింది... మొదట్లో ఆ పాప గురించి చదువుతున్నసతసేపు చాలా ఎమోషన్ గా ఫీల్ అయ్యా చాలా బాధ కలిగింది. చదువుతూ చదువుతూ,,,, కొంత ఏడ్పుని ఆపుకున్నా,,,, నిజంగా చాలా బాదేసింది. Go Ahead but don't write long stories,,,,,
ఇంత పెద్ద స్టోరి రాయాలంటే చాలా సమయం పడుతుంది అదీ మీక్కూడా మంచి కాదు.,,,

Take Care,,,,


Shabbu, KNR

Shabbu, KNR

తెలుగు పాటలు చెప్పారు...

వనజ వనమాలి గారు ముందుగా మీకు దన్యవాదములు పోస్ట్ చాలా లాంగ్ వ్రాశారు నేను ఒక సాంగ్ రాసేటప్పటికే నక్షత్రాలు కనిపిస్తాయి మీ సహనానికి నా జోహారులు సహనానికి మరో రూపం స్త్రీ అంటారు మీరు మరో సారి ఋజువు చేశారు ఈ జాతర పోస్ట్ మీరు మాకు తెలియపరచటానికి.. మీరు అది వ్రాయటానికి ఎంత శ్రమించారో మీ ఓపికకు ధన్యవాదములు

హితైషి చెప్పారు...

meelo O... Manchi rachayithri ni choosaanu. chura katthi padhunu thaggaledhani maro maaru rujuvyndhi. mee kalamulo siraa badhulu vaasthavaanni nimputhu........
ituvanti saamaajika kadhalu marinni velugu choodaalani korukuntu...
Always BE BEST.

PALERU చెప్పారు...

నేను మీ విమర్శకుల జాబితా లో ముందు బెంచి లో ఉంటాను.:):) నిజానికి కధ బానే ఉంది కాని వాస్తవానికి ఒక అడుగు దూరం లో ఉంది అని నా అభిప్రాయం అంటే మరీ దూరం అని కాదు, ముగింపు సరిగా లేదని నా రెండో అభిప్రాయం,

నిజంగా ఇంత పెద్ద స్టొరీ రాయటానికి సహనం, ఓపిక, కధ, చదువరులు కావాలి :) చాలా బాగుంది.

శ్రేయోభిలాషి
RAAFSUN

హితైషి చెప్పారు...

ఈ కథ చదవడం పూర్తైన తర్వాత నాకు కన్నీళ్ళు వచ్చాయి ఎందుకో తెలియదు. కథ సజీవంగా ఉంది