31, డిసెంబర్ 2012, సోమవారం

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.


తెలుగు భాష పై మమకారం ఉన్నవారికి.. మాతృ భాషని.. ప్రేమించే అందరికి..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ..
బ్లాగ్ ముఖంగా... ఆంగ్ల నూతన సంవత్సర  శుభాకాంక్షలు.

 భ్రమించడం సూర్యుడి లక్షణం ..భాషించడం బ్రతుకు లక్షణం.
ఎవరికైనా మాతృ భాష  అందం.
భాషతో ముడి పడిఉన్న బ్రతుకులోని భావమందం.

బ్రతుకుని, భాషని విడదీయడం అపరాధం.
భాషే బ్రతుకైతే అది తరతరాలకి అరగని సుగంధం.
బహుభాషా కోవిదులు భాసిల్లును
బ్రతుకులో కన్నులపండుగగా..

మానవత్వం భాష తెలియనివారి బ్రతుకు అందరిలోదండుగ.

తమ బ్రతుకే భాషకే మలిచారు.. కొందఱు మహనీయులు.
భాషనే బతకడం కోసమే రాజకీయం చేస్తున్నారు కొందఱు నాయకులు.

 అన్నింటికీ మించి మాతృభాష వాడుక మనకి అందం.
పరాయి భావనలో ఎప్పుడైనా..ఎక్కడైనా అది  మనలని కలిపే ఏకైక బంధం.

మన మాతృ భాషని ప్రేమిద్దాం.
మన భాషని దేదీప్యమానంగా శోభిల్లజేసుకుందాం.
తెలుగు వారిగా గర్విద్దాం .

  ఈ తెలుగే కదా మనలని అందరిని కలిపింది. ఈ తెలుగు వెలుగు  తో.. మన ఉనికిని కాపాడుకుందాం. ఈ ఆంగ్ల సంవత్సర ఆరంభంతో ..

            ..

29, డిసెంబర్ 2012, శనివారం

స్త్రీలపైనే అత్యాచారాలు ఎందుకు?





డిల్లీ లో జరిగిన అత్యాచార సంఘటన తో దేశం అట్టుడుకి పోతుంది.  భావి భారతం అంతా కాముక భారతం గా మారనుందా ?

తగ్గుతున్న బాలికల సంఖ్యా , పెరుగుతున్న వికృత కోర్కేలా?

మానవ  జాతి చరిత్రలో  స్త్రీ  పై అనాదిగా జరుగుతున్న అతి హేయమైన అత్యాచార ఘటనలకి అంతం లేదా!? నానాటికి ఎక్కువైపోతున్న ఈ పరిస్థితుల్లో ఆడదానిగా పుట్టడమే శాపంగా పరిగణించాలి  ఏమో!

అసలు స్త్రీలపైనే అత్యాచారాలు ఎందుకు?  బలహీనురాలు అనా..? లేక అహంకారమా!?

మన వార్తా పత్రికలూ  నిత్యం జరుగుతున్న అత్యాచారాల సంఖ్య ని  ఇతర దేశాల సంఖ్యలతో..పోల్చుకుని  మన దేశమే నయం అనుకుని  సంతృప్తి పడుతున్నట్లే కనిపించింది నాకు.

ఇదెక్కడ దిక్కుమాలిన పోలికో నాకు అర్ధం అయి చావలేదు. అదేమన్నా అభివృద్ధి సూచకమా.. వాళ్లతో మనం పోల్చుకుని తృప్తి పడటానికి తగ్గితే బాధ పడటానికి.

భారత దేశంలో స్త్రీలకి లభించే గౌరవం ఏపాటిదో.. వార్తా పత్రికలలో  పతాక శీర్షిక స్థాయిలో కనబడుతుంది. నిరంతర ప్రసారాలలో స్క్రోలింగ్ లో కళ్ళకి కట్టినట్లు కనబడుతుంది.కనుమరుగవుతుంది. పురుష అహంకారుల నోళ్ళలో బబుల్ గమ్ లా నలుగుతున్నది.పోలీస్ స్టేషన్ ల సాక్షిగా మరో సారి అత్యాచారంకి గురి అవుతున్నది. న్యాయ స్థానంలో వందల పైళ్ల  మధ్య నలిగిపోతుంది.

స్త్రీ జాతి పై అత్యాచారాలు పెరగడానికి గల కారణాలని నాకున్న పరిశీలనా దృష్టి తో చెప్పదలచాను.
అది అందరికి సబబుగా అన్పించక పోవచ్చును. నేను చెపుతున్నది నా అభిప్రాయం మాత్రమే.

సుమారు పదేళ్ళ క్రితం ఓ.. ట్రెండ్ తో  ప్రేమ పేరిట  యువతని తప్పు దారి పట్టించడం   మొదలైంది అంటే సినిమా రంగం పై విరుచుకు పడినట్లు ఉంటుందేమో.. కాని అది ముమ్మాటికి నిజం.

అతి శక్తివంతమైన మీడియా సినిమా.  ఆ సినిమాలకే సంబంధించి  కార్యక్రమాలు ప్రసారం చేస్తూన్న టీవి మాధ్యమం కూడా తక్కువేం కాదు.

అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటున్నఈ రెండు జన జీవనం పై అతి నిశబ్దంగా తన ప్రభావాన్ని  చూపుతున్నాయి  సందేశం మాట అటు ఉంచి అక్కడ కనిపిస్తున్నవి అశ్లీల దృశ్యాలు, అశ్లీల సంభాషణలు వయసుతో సంబందం లేని ముదురు ప్రేమలు.. ఇవే కనబడుతూ ఉంటాయి.

నాగరికత పేరిట  స్త్రీలు  యొక్క  వస్త్రధారణ  కూడా ఒక ప్రేరకం గా మారుతుంది. అది గమనించడం మంచిది.

ఇక పెరిగిన  టెక్నాలజీ పుణ్యమా అని బూతు చిత్రాలు అరచేతుల్లో రాజ్యం యేలుతున్నాయి. పదే  పదే ఆ దృశ్యాలు చూస్తూ కామంతో కళ్ళు మూసుకు పోయి తల్లి,చెల్లి,కూతురు తేడా లేకుండా పోతుంది.


అత్యాచారాలు పెరగడానికి కారణం ఏమిటంటే తల్లి దండ్రుల ప్రేమరాహిత్యం,పెరిగిన వాతావరణం,  నైతిక విలువలు  నేర్పించని విద్య,వ్యక్తిగత దురలవాట్లు, మత్తు మందులు,మద్యం ప్రభావం, పరిస్తితు లు అనుకూలించడం..  లేదా అనుకూలంగా మలచుకోవడం,చెడు ఆలోచనల ప్రభావం తో పాటు, ప్రేరేపించే అంశాలు కూడా దోహదం చేస్తున్నాయి.

పల్లె పట్టణం ఎక్కడైనా సరే అత్యాచారాల శాతం పెరగడానికి     స్త్రీ జాతి అనుకూలంగా వారికి దొరకడం. లేదా ఒంటరిగా ఉన్న వారిపై చూపు పడటం, బలహీనంగా ఉన్న వారిపై మృగత్వాన్ని చూపడం. చదువు సంస్కారం ఇవన్నీ ఉన్నా కూడా కళ్ళు మూసుకు పోయి అత్యాచార యత్నంకి  ఒడి గడుతున్నారు.

వాళ్ళు జరుపుతున్నది అత్యాచారం అని తెలిసినా కూడా భయ  పడనీ నేర ప్రవృత్తి, విచక్షణా జ్ఞానం ని కూడా తలెత్తనివ్వని మధాంధ కారంతో కూరుకు పోతున్న వారిని కఠిన శిక్షలు విధించి మిగిలిన వారికి శిక్ష భయం కల్గించడం కూడా  శాశ్వత పరిష్కారం అని చెప్పలేం.

స్త్రీ ఇష్టా ఇష్టం తో పని లేకుండా వావి వరుస వయస్సు తారతమ్యం లేకుండా అతిక్రూరంగా ,కిరాతకంగా,  హేయంగా జరిపే  ఈ చర్యపై కారణాలు కాదు వెదకవలసింది.బూతద్దం లో చూడటం కాదు కావాల్సింది.

ప్రేరేపించే అంశాలని  గుర్తించి మూలాలని కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అత్యాచారం నెరిపిన వారిని కఠినంగా   శిక్షించడంతో పాటు,  మధ్య పాన నిషేధం,  సెన్సార్ బోర్డ్ కఠిన మైన ఆంక్షలు విధించడం, దృశ్య ప్రసారాల్లో నియమ నిబందనల తో పాటు, అశ్లీల చిత్రాల ప్రదర్శన కి కఠిన నియమాలు అవలంభించడం తో పాటు.. మెమరీ కార్డుల ద్వారా అశ్లీల చిత్రాల వ్యాప్తి అడ్డుకోవడం పై దృష్టి సారించాలి.

అలాగే.. స్త్రీలు కూడా ఒంటరిగా వెళ్ళాక పోవడం మంచిది. వస్త్ర ధారణ విషయంలో ఇష్టా ఇష్టాలని ప్రక్కన బెట్టుకుని నిండుగా బట్టలు ధరించి, సాధ్యమైన విధంగా సమూహంలో ఉంటూ ఉండాలి. సంస్కార వంతమైన సభ్య సమాజంలో మనం లేం  కాబట్టి  పువ్వు లాంటి వారు..ముళ్ళ పాలు కాకుండా కాపాడుకోగల్గాలి తప్పదు.

దుష్టులుకి దూరం  ఉంటూ తమని తాము కాపాడుకునే విద్యలు నేర్చుకోవాలి తప్పదు.
మంచిగా చెపితే విననప్పుడు దండన తో.. కాపాడుకోవడం తప్పు కాదు.

అంతకి మించి మరో దారి లేదు.   స్త్రీ కామ్య వస్తువు కాదు,భోగ వస్తువు కాదు,వ్యాపార వస్తువు కాదు.. చైతన్యం నింపే  మానవి.

గతంలో నేను వ్రాసిన పోస్ట్.. లింక్ ఈ క్రింద ఉంది చూడండి. ఇంకా కొన్ని వివరంగా వ్రాసి ఉన్నాను.

ఇది ఒక విష వలయం.పిల్లలని కాపాడుకోవడం...ఎంత కష్టం?


27, డిసెంబర్ 2012, గురువారం

కంట్రీ ఉమెన్ కూతురు



అమ్మాయిల  స్వేచ్ఛా భావన,   వారికి ఇష్టమైన వస్త్రధారణ వల్ల  ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుంటారో..ఈ కథలో చదవండి.

కంట్రీ ఉమెన్ కూతురు (కథ)

నేను ఈ మధ్య నా   స్నేహితురాలి ఇంటికి చిన్న వేడుకకి వెళ్ళాను. ఆ  రోజు  నా  స్నేహితురాలి  పుట్టిన రోజు. తను ఒక కాలేజ్ లో లెక్చరర్ గా పని చేస్తుంది. తన కొలీగ్స్ ని కూడా ఆ వేడుకకి పిలిచింది.
వాళ్ళందరి  మధ్య  నేనెందుకు అంటే  వాళ్ళ కంటే నువ్వే నాకు ముఖ్యమే అని కాళ్ళకి బంధం.  ఇక వెళ్ళక తప్పదు కదా! వెళ్ళాను కూడా.

నా ఫ్రెండ్ కి  ఇరవైయేళ్ళ వయసున్న అమ్మాయి ఉంది.ఆ అమ్మాయి అంటే ఇంట్లో అందరికి చాలా మురిపెం. అంత వయసు వచ్చినా తండ్రి మెడ  చుట్టూ  చేతులువేసి తండ్రి ఒళ్లో కూర్చోవడం అస్తమాను డాడ్  డాడ్ అంటూ పిలుస్తూ  వాళ్ళ అమ్మకసలు విలువే లేనట్లు జోక్స్ వేయడం చూస్తే నాకెందుకో అక్కడ అంతగా ఉండబుద్ది కాలేదు. ముళ్ళ మీద కూర్చునట్లు కూర్చున్నాను.

సరే  నా స్నేహితురాలికి చిన్న పాటి పనులు చేసి సాయం చేద్దామన్నా అప్పటికే ఆమె పనులు అన్నీ చేసుకుని ప్రెష్ అవడానికి లోపలకి వెళ్ళింది. తను ఇచ్చి వెళ్ళిన టీ సిప్ చేస్తూ నా స్నేహితురాలి కూతురి తో మాట్లాడుతున్నాను. పక్కనే ఆ అమ్మాయి  ఆమె తండ్రి ఉన్నారు.

ఇంతలో అతని ఫ్రెండ్స్ ఇద్దరు కుటుంబాలతో  సహా వచ్చారు. నేను లేవబోతే పర్లేదు, మీరు కూర్చోండి అంటూ..ఆడవాళ్ళు ఇద్దరు నా ప్రక్కన మగ వాళ్ళు అతని ప్రక్కన   సోఫాలో సెట్ అయ్యారు.  పరిచయాలు చేస్తూ నా గురించి చెప్పారు. "రమ్య చిన్నప్పటి స్నేహితురాలు. నగరంలో ఒక మానసిక వైద్యశాలని నడుపుతున్నారు అని చెప్పగానే నన్ను కాస్త ఆశ్చర్యంగా  చూస్తూ ఉండటం గమనించాను.
నా స్నేహితురాలి కూతురు.. ప్రక్కనే ఉన్న మోడా   వేసుకుని వాళ్ళకి దగ్గరలోకి  లాక్కుని కూర్చుంది.

నా స్నేహితురాలి కూతురు  మెడిసన్ చదువుతుంది.  వచ్చిన వాళ్ళు ఆ అమ్మాయి చదువు విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. అప్రయత్నంగానైనా వాళ్ళ చూపులు ఆ అమ్మాయి మెడ నుండి క్రిందికి దిగాయి వాళ్ళ చూపు ఆనిన చోట అనాచ్ఛాదిత శరీర భాగాలు. నా ఫ్రెండ్ కూతురు సల్వార్ కమీజ్  వేసుకుంది   కానీ డీప్ కటింగ్ వల్ల అవసరం ఉన్న చోట బట్టలు లేకుండా చూడటానికి ఇబ్బందిగా ఉంది. వాళ్ళ నాన్న  స్నేహితుడి చూపు పదే  పదే  అక్కడే ఆగుతుంది. నా స్నేహితురాలి భర్త ఆ విషయం గమనిస్తున్నాడు.

నాకు సిగ్గుగా అనిపించి మనం లోపలకి వెళదాం రామ్మా! అని లేచాను. ఆ పిల్ల ఆ మాట పట్టించుకోకుండా ఇంకా మాట్లాడుతూనే ఉంది. 

నేను నా ఫ్రెండ్ రూమ్లోకి వెళ్ళిపోయాను. అప్పటికే తను తయారై పోయింది. "రమ్య ఒక మాట చెపుతాను ఏమి అనుకోవుగా ?" అడిగాను.
 "అయ్యో! అదేమిటే నువ్వేమైనా చెపితే నేనెప్పుడైనా అభ్యంతరం చెప్పానా , చెప్పు " అంది.

"వెంటనే నీ కూతురు డ్రెస్ మార్పించు. నలుగురిలో అలాటి డ్రెస్ బాగోలేదు " అన్నాను.

"నేను చెపుతూనే ఉంటాను..అయినా వినదు.దానికి వత్తాసు వాళ్ళ నాన్న కూడాను. మన కాలంలో  అప్పుడు మనకెలాగు స్వేచ్ఛ లేదు ఇప్పుడు మన పిల్లలైనా స్వేచ్ఛగా  వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఉండనీయి అంటారు". అని చెపుతూనే ..

"స్వీటీ! ఒకసారి లోపలి రా" అని కూతురిని పిలిచింది. ఆ అమ్మాయి విసుక్కుంటూనే లోపలకి వచ్చింది.

“ఆ డ్రెస్ అంత బాగోలేదు,ఇంకో డ్రెస్ వేసుకోరాదు” అని చెప్పింది అనునయంగా.


"నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది, ఇదే  డ్రెస్ తో ఉంటాను.. అయినా బర్త్ డే  నీది కాని నాది కాదుగా" అని వెళ్ళిపోయింది.

రమ్య నా వంక నిస్సహాయంగా చూసింది. తర్వాత రమ్య అతిధి మర్యాదలో మునిగిపోయింది.

కాసేపటికి చిన్న కేక్ కటింగ్  కార్యక్రమం.

"ఇప్పుడు మమ్మీ కోసం ఒక పుట్టినరోజు పాట పాడాలి, ఆంటీ! మీరు పాడండి"అని  నన్ను అడిగింది.

దానికేం భాగ్యం ! అంటూ అహో!ఒక మనసుకి నేడే పుట్టిన రోజు..అని మా రమ్య కి ఇష్టమైన పాట ని మొబైల్ లో ప్లే చేసాను.

నా స్నేహితురాలు ముఖం వికసించింది.  అదే గొప్ప కానుక అని మురిసి పోయింది.

 "మీకొక విషయం తెలుసా! ఈ రోజే రమ్య కృష్ణ పుట్టినరోజు కూడా . అమ్మ, రమ్య కృష్ణ సేమ్ ఒకే  తేదిన ఒకే సంవత్సరం పుట్టారు” అని చెప్పింది స్వీటి.

అవునా !?  ఆశ్చర్యపోయారు అందరూ .

“మరి మా మమ్మీ చూడండీ అప్పుడే అమ్మమ్మలా ఎలా ఉందో ?రమ్య కృష్ణ చూడండి ఎలా ఉందో ?” పోలిక పెట్టింది.

"నీకు రమ్య కృష్ణ అంటే ఇష్టమా? "అడిగాను నేను.

“చాలా ఇష్టం” అని కళ్ళు విప్పార్చుకుని చేతులు పెద్దగా చాచి యెంత ఇష్టమో చూపించి చెప్పింది.

నటనా,లేక,అందమా? అడిగారు మిగతావారు ఆసక్తిగా.

“ఇవి రెండు కాదు శిల్పం లాటి ఆమె ఫిజిక్ “ అంది. ఎస్,ఎస్..మాకు అంతే! అన్నారు  మిగతా వారు గుడ్డెద్దు చేలోపడినట్లు.

"రమ్య కృష్ణలా మీ అమ్మ లేదని నీకు బాధా లేక మీ అమ్మలా రమ్య కృష్ణ లేదని బాధా ?" కొంచెం కోపం గా అడిగాను.

"ఆంటీ..మీకు కోపం వద్దు. నిజానికి రమ్య కృష్ణ కంటే మా అమ్మ చాలా అందంగా ఉంటుంది కదా " ప్రశ్న ఇబ్బందికరమే. అయినా వాస్తవం ఒప్పుకుంటూ..

"నిజమే" అన్నాను నేను.

“కానీ  మా అమ్మ  చూడండీ  ఆ డ్రెస్ సెన్స్ చూడండీ. అమ్మమ్మ లా  ఉంటుంది”  అంది.

 అలా అని ఊరుకోలేదు రమ్య . అంతే కాదు మా అమ్మ కొలీగ్స్ కి మా అమ్మ కి తేడా చూడండి. అంది ఆరోపణ గా..

"ఎప్పుడైనా అమ్మ నా కాలేజ్ కి వస్తే నా ఫ్రెండ్స్ చేసే కామెంట్స్ కి నాకు చిన్న తనంగా ఉంటుంది.ఆవిడ  మీ అమ్మా? మీ అమ్మమ్మ అనుకున్నాం అంటారు. తన స్టైల్ మార్చుకోమన్న మార్చుకోదు  మమ్మీ వొట్టి  కంట్రీ ఉమెన్"  అని చెప్పింది కాస్త బాధతో  ..

కరక్ట్ గా ఆ అమ్మాయి మంచి విషయం లోకి వచ్చింది.ఇలాంటప్పుడే  బ్రెయిన్ వాష్ చేయాలి అనుకున్నాను.

"సరే, ఇప్పుడు మీ అమ్మ అధునాతనంగా కనిపించాలి  అంతేనా..!?"

"అవును"  కచ్చితంగా అన్నట్లు చెప్పింది.

"అందుకు మీ నాన్న ఒప్పుకోవాలిగా " అన్నాను.

"డాడీ ఎప్పుడూ   ఓకే నే" అమ్మను అందంగా చూడటం ఆయనకు మాత్రం ఇష్టం కాదా" అంది.
 "సరే ఈ సారి మీ అమ్మని నాగరికంగా మార్చే బాధ్యత నాది సరేనా ! " అన్నాను

ఆ తరువాత కబుర్లు తోటి డిన్నర్ ముగించి అందరు వెళ్ళినా కాసేపు అదనంగా కూర్చుని నేను బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆ పిల్ల వాళ్ళ అమ్మని మార్చే సంగతి గుర్తుచేసింది.

నన్ను బయటకి సాగనంపటానికి వచ్చి "ఆదేమిటే! డ్రెస్ సెన్స్ గురించి   తనకేదో మంచి మాటలు చెపుతావనుకుంటే నన్ను మార్చుతానని చెపుతున్నావ్ "అని అడిగింది..రమ్య.

"అందులో భాగమే ఇది కూడా ".అని హామీ ఇచ్చాను .

ఒక నెల తర్వాత నేను,మా రమ్య కలసి స్వీటీ వాళ్ళ కాలేజ్ కి వెళ్ళాం.

వెళ్ళే ముందు తనని ఒక బ్యూటి పార్లల్ కి తీసుకువెళ్ళి ఐ బ్రోస్ ట్రిం చేయించడం,తన చక్కటి ఒత్తైన జుట్టుని కట్ చేయించాకుండానే నానా అవస్థలు పడి స్టైల్ అయిన హెయిర్ స్టైల్ వేయించడానికి నా తల ప్రాణం తోకకి వచ్చింది.

ఒక బ్లౌస్  ని డీప్ నెక్ పెట్టి కుట్టించి చాలా పల్చటి జారిపోయే  చీరని కట్టించి అలవాటులేని వస్త్రధారణతో అది తెగ అవస్థలు పడుతుంటే బాగా జాలిపడి నీ కూతురిని మార్చాలంటే ఇంతకన్నా వేరే మార్గంలేదు   అని  నచ్చజెప్పి రోడ్డుమీద నడవడానికి తెగ సిగ్గుపడుతుంటే ఆటో   పిలిచి ఎక్కేసి యెన్ టి ఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలో దిగాం.

లోపలోకి నడుస్తూ ఉంటే.మా రమ్యని కళ్ళు తిప్పకుండా   చూస్తున్న కొంత మందిని గమనించాను. ఒక వైటు కోటు తొడుక్కున్న కుర్రాడు ఈల వేయడం చూసి నవ్వుకున్నాను.

మేము లోపలికి నడుస్తూ ఉండగానే ఒక పింక్  టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి ఎదురైంది. ఆ టీ షర్ట్ పై.. రెండు ఎర్రటి ఆపిల్స్ ఎదపై వచ్చేటట్లు ముద్రించి ఉన్నాయి. ఆ క్రిందనే  టేస్ట్ మీ ! అనే కొటేషన్ కూడా ఉంది.
ఎదురుగా వస్తున్న ఒక కాలేజ్ కురాడు ఆ అమ్మాయికి  తన శరీరంతో డాష్ ఇచ్చి మరీ ఆ అమ్మాయిని పడవేసి వెంటనే ఆమె ఎదపై చేయి వేసి "యాపిల్స్ తీసుకుంటాను టేస్ట్ మీ అంటున్నాయిగా " అని  అసభ్యంగా ప్రవర్తించాడు.

చుట్టూర  ఉన్నవారు ఏం జరిగిందో అర్ధం చేసుకునే లోపు అతను బై అంటూ వెకిలిగా నవ్వుకుంటూ అతని ఫ్రెండ్స్ తో కలసి బైక్ పై వెళ్ళిపోయాడు.  ఇదంతా కూడా బయటకి వస్తున్న నా ఫ్రెండ్    కూతురు  స్వీటీ చూస్తూనే ఉంది.

యాపిల్స్ టీ షర్టు వేసుకున్న అమ్మాయి ఏడుస్తూ వెంటనే అక్కడినుండి వెళ్ళిపోయింది.

నా ఫ్రెండ్ కూతురు వాళ్ళ అమ్మని కొత్త అవతారంలో చూసి కొంచెం కూడా స్పందించలేదు.  అలా జరగడం చూసి షాక్ లో ఉందేమో పైగా తల్లిని అవతారంలో  చూసి జీర్ణించు కోలేకపోయింది అనుకుంటాను.

 " ప్లీజ్ ఆంటీ,అమ్మని నేను ఇలా చూడ లేకపోతున్నాను. మీరు వెంటనే ఇంటికి వెళ్లి పోండి "చెప్పింది.

అందుకోసమే చూస్తున్న మేము  వెంటనే ఇంటి కి  వచ్చి పడ్డాం. .

ఇంటికి వచ్చీ రాగానే అలవాటు లేని  కొత్త అలంకారాలు అన్నీ పీకి పడేసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది మా రమ్య.

"అయినా అదేం పోయే కాలమే వాడు అలా చేసాడు" అని  కాలేజ్ లో జరిగిన దానిని గుర్తుచేసుకుని నోరు నొక్కుకుంది.

"మీ లాటి బాధ్యత గల గురువుల స్థానంలో ఉన్నవాళ్ళే చెప్పాలి దానికి పరిష్కారం "అన్నాను తీవ్రంగా..
కాలేజ్ లో చదువుల తో పాటు నైతిక విలువలు, సంప్రదాయాలు, వస్త్రధారణ   గురించి మీరసలు పిల్లలకి వివరిస్తున్నారా? యెంత సేపు మార్కులు, రాంక్ లు గోల తప్ప"  అన్నాను తీవ్రంగా..

"నిజమే, అకస్మాత్ బందులు, సమ్మెలు వీటితో సిలబస్ త్వరగా అవజేయాలి అన్న ఆలోచన తప్ప వాళ్లకి కౌన్సిలింగ్ చేసే అవకాశాలు మాకు ఎక్కడ ఉంటాయి.?" అంది.

"మనసుంటే మార్గం ఉంటుంది.అయినా మహిళా కళాశాలగా పేరు పొందిన మీ కాలేజ్ పిల్లల  వస్త్రధారణ మీరు గమనించడం లేదా ? నీ కూతురే కాదు..ఆ వయస్సు ఉన్న పిల్లందరూ.. కుడి ఎడంగా అదే రకం. ఫిజిక్   టైట్ డ్రెస్ లు, శరీర సౌష్టవం ప్రదర్శించుకునే విధంగా తయారు అవుతున్నారు. మీరు పెట్టిన డ్రెస్ కోడ్ తరగతులు జరిగే కాలం లోనే! ఎక్కడన్నా   చూడు అశ్లీల  వస్త్ర ధారణే ! మగవాళ్ళు దాన్ని అలుసుగా తీసుకుంటున్నారు.."  అంటుండగానే మా రమ్య కూతురు కాలేజ్ నుండి వచ్చేసింది.

ఏమిటి ఆంటీ! మా అమ్మకి క్లాస్ తీసుకుంటున్నారు? అని అడిగింది. "ఇప్పుడు నీకు కూడా క్లాసు తీసుకోవాలి" సీరియస్ గా  అన్నాను.

"తప్పదా..!? "అడిగింది..

"పది మందికి  చెప్పగల్గే గురు స్థానంలో ఉన్న మీ ఆమ్మ మాటే   నువ్వు వినకుండా తేలికగా తీసి పారేస్తున్నావ్!   నా మాట వింటావని నాకు నమ్మకం లేకపోయినా చెపుతాను. ఇప్పుడు చెప్పేదంతా
మీ యువ తరం అమ్మాయిల డ్రెస్ సెన్స్ గురించే చర్చ "

మాకు దగ్గరలో కూర్చుని ఇక క్లాస్స్ తీసుకోవడమే మీ పని అన్నట్టు చూసింది స్వీటీ .

"ఇందాక జరిగిన   సంఘటన చూడు. మగ పిల్లలు అడ్వాన్స్ అవడానికి మీరు ఎలా అవకాశం ఇస్తున్నారో! అందం అనేది శరీరాన్ని ప్రదర్శించుకోవడంలో రాదు. అలా ప్రదర్శించుకోవడం అనేది.. అమ్మాయిలలో కానీ మహిళల్లో కానీ ఒక జాడ్యం. మగ వారిని ఎలా ఆకర్షించాలి  అనే తాపత్రయమో లేక మగవారికి తాము విచ్చలవిడి తనానికి అంగీకారమే అన్న సూచన ఇవ్వడానికో లేక అందంగా లేమనుకుంటారనే ఆత్మ నూన్యతా భావం తోనో ఉంటూ మగవారిని ఆకర్షించడానికి  శరీరాన్ని బహిర్గతం చేసుకున్నట్లు ఉంటుంది. రేపు నీకు  పెళ్ళై భర్తతో  ఇలాటి వస్త్ర ధారణ తో తిరుగుతుంటే నా భార్య   అందంగా  ఉంది అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు తప్ప నా భార్య సెక్సీ గా ఉందని చెప్పుకోవడానికి ఇష్టపడతారా  చెప్పు? " అన్నాను.

స్వీటీ మౌనం గా ఉంది.

"ఆఖరికి నీవు అమితంగా ఇష్టపడే ఐడియల్ షి రమ్య కృష్ణ భర్త తో సహా " అన్నాను నొక్కి చెపుతూ..

తెర మీద స్త్రీలని చూసి వారిని మీరు అనుకరించే విధంగా డ్రెస్ చేసుకోవడం, చీర కట్టినా కటి ప్రదేశం పై కట్టడం,జాకెట్ ఉండి  లేనట్లు తాడు లాగితే పుట్టుక్కున తెగిపోయేటట్లు ఉండటం,  జుట్లు విరబోసుకోవడాలు   అంతా యెంత అసహ్యం గా ఉంటుంది? చీర కట్టి ఎలా అశ్లీల ప్రదర్శన చేయవచ్చో నడి రోడ్లో నిలువెత్తు బొమ్మల సాక్షిగా చూపుతున్న షో రూమ్ల వ్యాపార నైపుణ్యాలు,చూస్తుంటే అసహ్యం కలగకుండా మీరు ఆమోద ముద్ర వేస్తుంటే యెంత నొచ్చుకుంటున్నామో! అమ్మల్ని అధునాతనంగా   చూడాలనుకున్న మీ వెర్రి మొర్రి కోర్కెలు.. దిగులు పుట్టిస్తున్నాయి. అలాగే మాధురి దీక్షిత్ కూడా ఆశ్చర్య పోయేలా గృహిణుల వీపు ప్రదర్శనలు గురించి ఎంతైనా చెప్పవచ్చు మీలో ఒక్కరన్నా ఆలోచించగల స్థితిలో ఉంటే అన్నాను "ఏదో ఆవేశం పూనినట్లు.

స్వీటి అలాగే మౌనంగా వింటుంది. ఇనుము వేడి మీద  ఉన్నప్పుడే సమ్మెట దెబ్బలు కొట్టి   మనకి కావాల్సిన విధంగా తీర్చి దిద్దుకోగలం అనుకుని మళ్ళీ కొన సాగించాను.

అసలైన  అందం  అంటే  ఆత్మ  విశ్వాసం  అని, వ్యక్తి కి  వన్నె తగ్గని ఆభరణం వ్యక్తితత్వం అని తెలుసుకోవాలి.  అందంతో కాదు మీకున్న తెలివితేటలతో,శక్తియుక్తులతో, సమర్దతా నైపుణ్యంతో మగవాళ్ళని ఆకర్షించగల్గినప్పుడు మీరు గొప్ప క్రింద లెక్క తప్ప శరీరాలు ఆరబోసుకుని  మాత్రం కాదు.  ఎంతో ఉన్నతమైన చదువులు చదువుతున్న మీకీ పాటి సంస్కారం లేదని తెలివితేటలూ లేవని నేననుకోను అన్నాను దీర్ఘంగా, ఆవేశంగా.

రమ్యా నా ఆవేశాన్ని విస్తుపోయిచూస్తుంది. నేనిలా కఠినంగా మాట్లాడతానని అనుకోలేదు కాబోలు ..తన కూతురు ఎలా స్పందిస్తుందో ..తర్వాత ఎలా కామెంట్ చేస్తుందో ..అని కించిత్ బెంగ కూడా వేసింది ఆమెకు. నా వైపు మొహమాటంగా చూసింది.

"నీ లాంటి పిల్లలకి తల్లి దండ్రులు చెప్పలేక మిమ్మల్ని ఆ వస్త్ర ధారణలో చూడలేక, బయటికి వెళితే ఎలాటివి ఎదుర్కుంటారో అన్న భయంతో యెంత అలమటిస్తారో మీకేం  తెలుసు? నీ స్థానం లో నా కూతురు ఉన్నా ఇలాగే చెపుతాను. చొరవచేసి  ఇంత తీవ్రంగా చెపుతున్నందుకు ఏమి అనుకోకు స్వీటీ " అన్నాను.

"ఈ మంచి నీళ్ళు తాగు" అందించింది రమ్య.

"మేము కంట్రీ వుమెన్స్  అని   అనుకున్నా  పర్లేదు మరి మీ తరం వాళ్ళు ఎదుర్కొంటున్న  అవమానాలు సంగతి ఏమిటో చెప్పు? "అన్నాను.

"సారీ..ఆంటీ.. ! నేను ఇప్పుడు ఏమి మాట్లాడ లేను" అని లోపలకి వెళ్ళిపోయింది.

మా రమ్య నాచేతిని తన చేతిలోనికి తీసుకుని ఆప్యాయంగా నొక్కింది. ఇంకాసేపు ఉండి  నేను వచ్చేసాను.

ఆ రోజు రాత్రి రమ్య నుండి కాల్

"గ్రాండ్ సక్సెస్" అని అరిచింది.

 "ఏమిటే నీ కేకలు, హడావిడి"అడిగాను.

నా కూతురు భోజనాల బల్ల వద్ద  "అమ్మా ! నువ్వు ఎప్పుడు నీలాగే ఉండు,నిన్ను ఎప్పుడు కంట్రీ ఉమెన్ అని యెగతాళి చేయను అంది. అలాగే వాళ్ళ డాడీతో రేపు తనని షాపింగ్ కి తీసుకువెళ్ళమని అడుగుతుంది. ఉన్న డ్రెస్ లలో   ఒక్క డ్రెస్ కూడా వేసుకోవడానికి పనికి రాదనీ, కొత్త డ్రెస్ లు కొనివ్వమని అడుగుతుంది.. అని చెప్పింది  రమ్య సంతోషంగా."అలాగే నీకు తన తరపున ఒక రిక్వెస్ట్ చెప్పింది వాళ్ళ కాలేజ్ లో నువ్వు కౌన్సిలింగ్ తరగతులని ప్రత్యేకంగా నిర్వహించాలని అది తన కోరికని చెప్పమంది"  అంది.

"అలాగే నా పని  అదే  కదా." అన్నాను చాలా సంతోషంగా . 

పాద ముద్రలు

ఒక మధ్య వయస్కుడు మరణించాడు.

అతని భార్య తనని అన్యాయం చేసి పోయాడు అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. చూసిన వాళ్లకి అయ్యో పాపం..! అని అనిపించడం సహజమే కదా!

సరే తర్వాత జరగవలసిన కార్యక్రమాలు అన్నీ జరిగిపోతుండగా .. మరణించిన అతని భార్య ఆకాశంలోకి లోకి చూస్తూ ముందు ముందుకు నడచి వెళుతుంది.. కొందరు ఆమెని ఆపడానికి ప్రయత్నిస్తున్నా ఆగకుండా ఆకాశంలోకి చూస్తూ తిరుగుతుంది.

ఆమెకి మతి చలించింది. సందేహం  లేదు  అనుకుని.. ఏమ్మా..ఏమిటీ వెతుకుతున్నావ్? అని అడిగారు.

అప్పుడు ఆమె అలా చెప్పింది.

భర్త అడుగు జాడల్లోనే నడవమని   చెప్పారు కదా! నేను అలాగే నడుద్దామని మా వారి పాద ముద్రలు కోసం వెదుకుతున్నాను ఎంత వెదికినా కనబడటం లేదు. నేను ఏం పాపం చేసానో!  అంటూ..మళ్ళీ తలబాదుకుని ఏడుస్తుంది.

ఇదంతా వింటున్న ఒకాయన ..ఇలా అన్నాడు.

మీ ఆయనకీ నీ మీద ప్రేమ ఎక్కువ లేమ్మా ! నువ్వు ఆయన వెంబడే నడుస్తావని అనుమానం వచ్చీ ఆ పాద ముద్రలు కనబడకుండా తుడిచేసుకుని వెళ్ళాడు అని చెప్పాడు.

అంతే నంటారా!? అని .. ఏమండీ ..మీరెంత మంచివారండీ ..అంటూ మళ్ళీ రాగం మొదలెట్టింది.

పాపం ..ఆయన అక్కడైనా సుఖంగా బతుకుతాడు.ఈమె పీడా లేకుండా అని ఒకరు రహస్యంగా అన్నారు.

అది వినబడిన ఆమె ఇలా అనుకుంది. పొతే పోయాడు. నేను ఇప్పుడైనా సుఖంగా బతుకాతాను అనుకుంది మనసులో రహస్యంగా.



(అయ్యో ! ఇలా పాద ముద్రలు వదలకండి. అనుసరిస్తే యమ డేంజర్ ).. ఈ వ్రాత సరదాకేనండోయ్ !

25, డిసెంబర్ 2012, మంగళవారం

" హమారే ఔరత్ మహాన్ "


ఓ.. నా ప్రియాతి ప్రియమైన  భారత దేశ సోదరీ మణు ల్లారా! ముక్కు పచ్చలారని పసి పాపల్లారా! యువతుల్లారా! గృహిణి ల్లారా ! బామ్మలారా! 

 మీకు అసలు చదువుసంధ్యలు వద్దనే వద్దు. ఒంటరి ప్రయాణాలు వద్దు. ఎప్పుడూ జన సమూహంలోనే ఉండండి.అన్నదమ్ములతో కూడా కలసి తిరగవద్దు. వారిని కూడా మీ బాయ్ ఫ్రెండ్ అని  నమ్మిన్చేస్తారు.

 మీరు ఏ మతంకి చెందినవారు  అయినా సరే  మీ ఒంటి నిండా బట్టని చుట్టుకోండి గాలి కూడా జొరబడనంతగా వేసుకోవాలని మర్చి పోకండి. అన్నట్టు మీ దగ్గర కారం మూటలు తీసుకు వెళ్ళకుండా అడుగు కూడా బయటకి కదపవద్దు..

అలాగే మీ ఒరలలో చురకత్తులు పెట్టుకోవడం మర్చి పోకండి. దబ్బనాలు,గుండు సూదులు మీ పర్సు లో నిత్యావసరాలు అని గుర్తు పెట్టుకోండి. 

మగ కుక్కలు శరీరం పై పడి  నాకకుండా  మైలు తుత్తం  పూత పూసుకోవాలి   (చనుబాలు మాన్పడానికి అప్పుడెప్పుడో చేసినట్లు) ఇంకా చెప్పాలంటే పూర్వకాలంలో శరీరం లోని అంగాలకి   అనుమానం జబ్బుతో పురుషులే రక్షణ కోసం తాళాలు  పెట్టేవాళ్ళ ట . అదేదో.. మనమే ఏర్పాటు చేసుకుంటే పోలా!?   ఆలా చేతకాకపోతే  మహిళా కండోమ్స్ కూడా వెంట బెట్టుకుని తిరిగితే  బావుంటుంది. (అత్యాచారం చేసేవాడికి మీ నుండి రక్షణ కల్పించడానికి)

మీరు ఇలా గనుక చేయ గల్గితే ఈ దేశానికి బోలెడంత నిశ్చింత. పాలకులకి ఈ నాన్సెన్స్ ఉండదు. చట్టానికి బోలెడంత పని భారం తగ్గుతుంది. న్యాయ స్థానంలో మూలుగుతున్న కేసులు ఒక కొలిక్కి వస్తాయి. 

ఇంకో ముఖ్య మైన విషయం ఏమంటే ఆడజాతి దైర్యాన్ని,త్యాగాలని మీడియా 24 గంటలు ప్రసారం చేసి
 "హమారే ఔరత్ మహాన్ " అని కీర్తి పతాకం వేసి విశ్వ వినువీధుల్లో ఊరేగిస్తారు. ఆ పేరు ప్రతిష్ఠ  కోసం అయినా మీ పై జరిగే దాడులకి ,అత్యాచారాలకి పెదవి విప్పకండి. పెదవి విప్పకండి. 

దిన పత్రికల్లో రోజు వచ్చే న్యూస్ న్యూసెన్స్ ని వీలైనంత తగ్గించి వారికి పని భారం తగ్గించండి.  భరించండి. మాన ప్రాణాలని పోగొట్టుకుని బ్రతికి ఉంటే అవమానాలని దిగ మింగండి. అదే అదే ఈ జాతికి మీరిచ్చే గౌరవం .మీ త్యాగం అని మరువకండి.

ఇంతకన్నా ఇంకా నేనేం చెప్పగలను.!!??  

వర్ధమాన భారతమా ! స్త్రీలపై  వేల అత్యాచారాలు, వందల హత్యలతో దినంబు  వర్ధిల్లు.

(ప్రస్తుత పరిస్థితులకి వగచి )

24, డిసెంబర్ 2012, సోమవారం

బ్లాగ్ లలో ఆడాళ్ళు ఏం వ్రాస్తారు? వీళ్ళకి బ్లాగ్ ఎందుకు..?

ఓ..ప్రశ్నకి ..నా సమాధానం


నేను ఎందుకు వ్రాస్తున్నాను అంటే..!?   మరొకసారి ఈ విషయం పంచుకోవాలనిపించింది. .. ఇది కూడా ఒక  పాత పోస్ట్.. 

మన మనసులోని భావాలు కొందరితో  మాత్రమే పంచుకోగలం. అలా పంచుకోలేని భావాలను వ్రాసుకోవడం తప్ప ఏమి చేయజాలము. ఆ వ్రాసుకోవడం కూడా చేయలేక పోతే... ఏదో తెలియని అనిశ్చితి. 

స్వీయ అనుభవాల్ని, మన ఆలోచనలని,నేర్చుకున్న జ్ఞానాన్నినలుగురితో పంచుకోవాలి కదా! పంచుకుంటే పెరిగేది జ్ఞానం. మనిషి పుట్టిన దగ్గరనుండి నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవాలంటే ప్రశ్నించాలి కదా!

ప్రశ్నించడమంటే.. కొందరికి నచ్చదు.  ఎందుకని నచ్చదు అంటే.. ? జెండర్  సేన్సిటివిటి .నిజం! ఎంతో  సున్నితనైన ఆలోచనలు, గాఢమైన అనుబంధాలు ఉన్న కుటుంబ సభ్యులకి  కూడా..ఆడవాళ్ళూ ప్రశ్నించడం .నచ్చదు. 

ఆడవాళ్ళ ఆలోచనలు గడ్డిపరకలతో సమానం. ఆడవాళ్ళూ ఇప్పటికి చీరలగురించి, కుటుంబాల గురించి మాట్లాడుతూనే ఉండాలి  ప్లస్  ఇంకా ... మాట్లాడుతున్నారు. మాట్లాడుతూనే ఉన్నారు  

ఆడవాళ్ళు  అంతకన్నా ఎదగడం అసంభవం  అనే భావన కొందరి పురుషులది, మరి కొందరి  ఆడవాళ్లది కూడా.

జీవితంలో.. వాటికీ భాగం ఉన్నప్పుడు  మాట్లాడితే తప్పు ఏమిటి? ఇన్ క్లూడింగ్ వాటితో ..సహా.. స్త్రీలు చాలా తెలుసుకుంటున్నారు. వాటి గురించి చెప్పుకోవడానికి... ఒక వేదిక కావాలి..  ఆవేదిక లో.. భాగం  బ్లాగ్ కూడా.. 

గుండు సూది తయారి నుండి.. అంతరిక్ష ప్రయాణంలో వరకు.. స్త్రీ పని భాగస్వామ్యం లేకుండా..ఏ పని జరగడం లేదు. అయినా.. ఇంట్లో మాత్రం ఆడవారు మాట్లాడటంని, ప్రశ్నించడం నిషిద్ధం. 

తాతల తరం నుండి, తండ్రుల తరం నుండి,సహోదరుల తరంలోనూ, ఆఖరికి కడుపున పుట్టిన బిడ్దల నుండి కూడా  ఆజ్ఞాపించడం హక్కుని చేసుకున్న వాళ్ళ తీరుని ప్రశ్నించడానికి..  అయినా నేను వ్రాస్తాను.

బయట మాత్రం సంస్కారం  ముసుగు వేసుకుని స్త్రీల అభివృద్ధిని నోటితో.. మెచ్చుకుని నొసటితో వెక్కిరించడం  చేసేవాళ్ళని చూస్తూ..భరించగలగటం ఎంత కష్టం ?. మీ మెదడు మోకాలిలో ఉంది .. మీ తెలివితేటలు ఇంతే! అని హేళన చేసినట్లు ఉండే వారికి సమాధానం చెప్పటానికే నేను వ్రాస్తాను.

చదుకుని ఇంటా-బయటా చాకిరీ చేసే మహిళలకి  ఎన్నెన్ని హర్ట్స్,పెయిన్స్ ఉంటాయో! ప్రపంచంలో.. మనిషికి మనిషికి ఉండాల్సిన  సంబంధం గురించి  కుటుంబ సభ్యుల మద్య  ఉన్న అనుబంధం  గురించి కన్నా ఎక్కువ ఆలోచించాలి. ఇల్లు ఆడవారికి.. భద్రతే కాదు ఇంకో కోణంలో జీవిత ఖైదు కూడా.. స్వేచ్చా భావన లేని నరక కూపంలో.. మగ్గే  స్త్రీలని చూసాక వాళ్ళ గురించి వ్రాయాలనుకోవడం తప్పు కాదే!?  ఆడవాళ్ళని భద్రత పేరిట సంప్రదాయాల పేరిట ఇతరులతో కలవనీయకుండా.. గిరి గీసి కూర్చోపెట్టే.. పెత్తందారితనం గురించి ప్రశ్నించడం , అన్నీ తెలుసుకోవాలనుకోవడం తప్పు ఎలా అవుతుందీ? 

మన కన్నా ముందు ఎంతో మంది సహృదయులు  మహిళల పట్ల సానుభూతితోనో .. లేదా సమాజ అభ్యున్నతి  ఆకాంక్షించో.. స్త్రీల  తరపున  వకాల్తా  పుచ్చుకుని వ్రాసి..నడచి  ఒక బాట చూపారు. తర్వాత.. మనుషులుగా జీవించడం నేర్చుకున్న స్త్రీలు వాళ్ళ గురించే కాదు.. ప్రపంచంలో జరిగే అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకుని వ్రాయడం మొదలెట్టారు. అందుకే  కథ, కవిత, వ్యాసం , గల్ఫిక , నాటిక,నవల, పద్యమో,గద్యమో  ఏదో ఒకటి వ్రాస్తున్నప్పుడు వాళ్ళకి  వ్రాసే స్వేచ్చ కూడా లేని  వెనుకబాటుతనంని మనం ప్రశ్నించడం తప్పు ఎలా అవుతుందో.? 

నాకు నేనే  అర్ధం కానప్పుడు.. నా ఆలోచనలని.. కాగితాలపై.. వ్రాయడం తప్పు అయిందని  అన్నప్పుడు  నేను ప్రశ్నించాను. అరువు గొంతుకలతొ..జీవన పర్యంతం ఎలా బ్రతకగలం?. "'ఎదురు తిరిగితే పోయేది ఏమి లేదు ఎనకబాటుతనం తప్ప" అన్న డైలాగ్ గుర్తుకోస్తున్నప్పుడు.. వ్రాస్తూ ఉంటాను. ఇంకా ఏమి  వ్రాయనే లేదు.( ఎందుకు ఈ.. బ్లాగుల రాత? ఏముంది  అందులో.. అవహేళనకి  స్పందించి..)

నా.. కవితలు చూసినప్పుడు.. చాలా మంది.. స్త్రీల పక్షపాతిని అని తీర్మానించాక .. అలా  అన్నవారివి పాషాణ హృదయాలని నిర్ధారించుకుని.. సమస్యని.. స్త్రీ పురుషుల భేదంతో చూడకూడదు  ఇద్దరు సమానమే.. అలా చూడటమే మనిషితనం +మానవత్వం కూడా  అనిపించుకుంటుందని చెప్పటానికి మళ్ళీ వ్రాసాను. అలాగే.. ఇప్పుడూ వ్రాస్తాను.

నా కోసమే కాదు నా ఆలోచనలని హర్షించేవారి  కోసం కూడా..నేర్చుకుంటూ.. వ్రాస్తాను.  ఇష్టం అయితే చూడండీ! లేదంటే  మానేయండీ!!! స్త్రీల తెలివితేటల మీద చిన్న చూపు ఉన్న వారికోసం వ్రాయాలి కనుక వ్రాస్తాను.అందుకే .. నా..ఈ.. వ్రాత.  

23, డిసెంబర్ 2012, ఆదివారం

ప్యాసా దిల్

ఏ మలుపులో అయితే వదిలేసి వెళ్ళావో..
అక్కడే ఇంకా ..అక్కడే కూర్చుని ఉన్నాను.
ఆలోచిస్తూనే ఉన్నాను
అంత క్షమించరాని తప్పు ఏం  జరిగిందా ..
అని ఆలోచిస్తూనే ఉన్నాను.
ప్రతి క్షణం నీ పరోక్షంలో తపిస్తూనే ఉన్నాను.
నాకు తెలుసు నీకు ప్రేమ లేదని
ద్వేషం మాత్రమే  ఉందని..
గాయం ఎంత లోతైనదంటే
గురి పెట్టిన లక్ష్యమే నా హృది.
ఒకమారు.. నా మాట విను
నా ఈ హృదయాన్ని మండించకు
అసలే దప్పిక గొని ఉన్నాను.
ఆహ్లాదాన్ని పంచేందుకు కాకపోయినా
దశాబ్దాలుగా మేలుకుని ఉన్న
ఈ కళ్ళను నిద్ర పుచ్చడానికైనా రా..
నీవు  నడచి వెళ్ళిన దారి వైపే చూస్తూ
తుది శ్వాస విడిచానా...
అయినా కళ్ళు తెరుచుకునే ఉన్నాయి.
ఇక ఇంతకన్నా ఏమి ఎదురు చూస్తాను.!?
తెరచి ఉన్న ఈ కన్నులు  నా ఆత్మకి ప్రతీకలు




(పిడికెడంత  ప్రేమ కోసం..జీవన పర్యంతం వేచి చూసిన ఓ..స్త్రీ మూర్తికి అశ్రు నివాళులతో..)

21, డిసెంబర్ 2012, శుక్రవారం

ప్రియమైనవి

జీవితంలో ప్రతి క్షణం ..  ఏదో ఒకటి నేర్చుకోవడం లో కరిగి పోతే ఎంత బావుండును అనిపిస్తూ ఉంటుంది. 

అలా కాలాలు కరిగిపోతే ..అనుభూతులకి తావెక్కడ!? అని కూడా దిగులు వేస్తూంది.

అసలే ధనుర్మాసపు రోజులు. మంచులో తడిసి ముద్దయిపోతూ.. మనషులే  కాదు.. మనసు కూడా 

 మనసుతో.. మనకి కల్గిన ఒకో అనుభూతిని అక్షరంగా మలిస్తే ఎలా ఉంటుందంటే.. 

ఇదిగో..ఇలా .. చాలా ఇష్టంగా..

ఒక ప్రభాతం  వస్తుంది నీ జ్ఞాపకం ని వెంటబెట్టుకుని వస్తూ.. 

ఒక ప్రభాతం  వెళ్ళిపోతుంది నీ జ్ఞాపకాన్ని తీసుకుని వెళుతూ..

నేను ఎలాంటి ప్రభాతం  కోసం నిరీక్షిస్తున్నాను అంటే ..

అది వస్తూ వస్తూ తనతో.. నిన్ను కూడా తీసుకురావాలని. 

అనుకుంటూ.. 

మళ్ళీ తరచి చూసుకుంటాను.

ఇంతగా.. 

రాని  వాళ్ళ కోసం  అంతగా  ఎదురు చూడటం 

ఎందుకు  ?

ఎందుకు ..జరుగుతుంది ?

ఎవరి కోసమో ఎదురు చూసే పరిస్థితి ..ఎందుకు కల్గుతుంది..?

బహుశా ఈ ప్రపంచంలో కొన్ని కొన్ని వస్తువులు ఎప్పటికి ప్రియంగానే ఉంటాయి.

దొరకని వాటిపై ఎందుకు ప్రేమ కల్గుతుందో !

అది ఏమిటంటే ...  ఇవిగో.. అవే ఇవి. 




                                                (నగర జీవనంలో దొరకనిది ...ప్రియమైనవి )

20, డిసెంబర్ 2012, గురువారం

కన్నీటికి స్వేచ్ఛ


ఈ కళ్ళకి ఎంతటి బలీయమైన  కోరిక 
ఎవరినో చూడాలని..
ఈ చెవులు ఎంతగా తపించి పోయాయి
ఎవరిదో  ఎదసడిని వినాలని..
ఎన్ని ఘన  సమయాలు కరిగిపోయాయి
ఎవరినో చూడాలని ..
ఎంతగా కలవర పడుతుంది  హృదయం 
ఎవరి ప్రేమలోనో అనుభూతి చెందాలని.. 
ఎంతగా ఆరాట పడుతున్నాయి చేతులు 
ఎవరినో సృశించాలన్న ఆశతో..
ఎంతగా అలమటిస్తున్నాయి నాజూకైన  పాదాలు 
ఎవరితోనో కలసి ప్రేమదారులలో నడవాలని ..
ఈ నిరీక్షణకి  తెరదించి 
ఈ కన్నీటికి  స్వేచ్ఛను ప్రసాదించు తండ్రీ !!
ఇప్పుడిక ఆతను  రానే రాడు !!!!!


19, డిసెంబర్ 2012, బుధవారం

పాట.. పూదోట - గండు తుమ్మెద






హర్షాతిరేకంతో
నా..మనసు.. ఉప్పొంగినప్పుడు.. 
చిరుజల్లులా.. వచ్చి.. 
పులకరింపజేసేది....పాట.

మండుటెండలో..సైతం 
వెన్నెలవానలో..  తడుస్తున్నట్టు.. 
అనుభూతి.. కల్గించేది.. పాట 

నింగిలో..విహరిస్తున్నా
నేలమీద పయనిస్తున్నా
వాయు తంత్రాలు మీటి
రవళిoప  చేసేది.. పాట.

గాఢ  నిద్రలో
కలలసంధ్రపు..ఒడ్డున ఉన్న
నన్ను.. అలలా.. తాకి 
మేలుకోల్పేది.. పాట. 

ఎవరు.. పలకరించని..వేళ
మౌనపంజరంలో
నేను..బంధీనై.ఉన్నప్పుడు
పలకరిందేది 
మనసు పాడే..మౌనమైన..పాట

నేను.. అనుభవించే.. 
వేదనా..రోదనా నిరాదరణలో
వోదార్పునిచ్చేది  ..పాట.

అమ్మలా.. లాలించేది.. 
అణువణువునా.. సేధతీర్చేది.  

స్వరాల హరివిల్లు..తో.. 
రసరమ్య .గీతికా..వర్ణాలు.. తో..

జీవనాన్ని.. 
రంగుల..మయం ..చేసింది. ..పాట.. 

పాట.. పూదోటలో..
నేను..ఓ' గండు..తుమ్మెదని....


18, డిసెంబర్ 2012, మంగళవారం

పూలమ్మి



తెల్లవారు ఝామున నాలుగు గంటలయినా కాకముందే నిద్ర లేచింది మల్లి.

గబా గబా వాకిలి చిమ్మి ముగ్గు పెట్టి పళ్ళు తోముకుని ముఖం కడుక్కుని రాత్రి వేళనే డబ్బు  లెక్కపెట్టుకుని ఉంచిన గుడ్డ సంచీని తీసుకుని బొడ్లో దోపుకుంటూనే పూల బుట్టని తీసుకుని   బస్ స్టాప్ వైపు పరిగెత్తింది అప్పటికే బస్సు ని స్టార్ట్  చేసి.. కదల్చకుండానే కదిలి వెళ్ళిపోయే దృశ్యాన్ని కనుల ముందు పెట్టె నేర్పరేమో.. ఆ డ్రైవర్ ..కావాలని ప్రయాణికులని హడావిడి పెడుతున్నాడు.

అచ్చంగా అలాంటి దృశ్యం చూసినప్పుడల్లా  నాకు చావలేక బతుకీడుస్తున్న ప్రభుత్వాల మాదిరి కనబడతాయి .

"మల్లి " వస్తుంది. కాస్త ఆగండి డ్రైవర్ గారు !  అని రిక్వెస్ట్ చేసాను.

"రోజూ  బస్ కదిలే సమయం తెలుసు కదా! ముందొస్తే ఏం పోతుంది. ఆదరా బదరా పరుగులు పెడుతూ మమ్మల్ని విసిగిస్తారు"  అన్నాడు  బస్ డ్రైవర్

"ఆడవాళ్ళు  పనులు చేసుకుని బయలుదేరాలి కదండీ.. పాపం ఆ  ఇబ్బందిని మనం గమనించాలి"  అన్నాను నేను.

నేను ఆ బస్ కి కండక్టర్ని. నేను చెపితే ఆగాలి కాబట్టి ఆగాడు . మల్లి బస్ ఎక్కగానే తన చేతిలో ఉన్న బుట్టని బాయ్ నెట్ పై పెట్టి సీట్ కోసం వెదుక్కుంటుంది.

 నీకు బుద్ది  ఉందా? నిన్ను ఈ బుట్ట ఇక్కడ పెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పాను. తీసేయి..అంటూ చీత్కరించాడు  డ్రైవర్
నేను కల్పించుకుని "వెనక్కి వెళ్లి  బుట్ట అక్కడ పెట్టుకో.. అక్కడికి వచ్చి టికెట్ తీసుకుంటాను "అని చెప్పాను. మల్లి ఆ బుట్ట తీసుకుని..సీట్లలో  కూర్చున్న  ప్రయాణికులకి తగలకుండా జాగ్రత్త పడుతూ.. నెత్తిమీద పెట్టుకుని బస్ వెనుక భాగం కి వెళ్లి పోయింది.

రైల్వే స్టేషన్ కి బయలుదేరే మొట్ట మొదటి బస్ కాబట్టి ఆ బస్ 365 రోజులు కిక్కిరిసే ఉంటుంది మూడు సూపర్ ఫాస్ట్ ట్రైన్ లని , ఇంకా ముంబై ,కలకత్తా వెళ్ళాలంటే ఆ బస్ ని అందుకోవాల్సిందే. అందుకే ఆ బస్ కరక్ట్ టైం కి బయలు దేరాలి. లేకపోతే  ప్రయాణికులు గొడవ పెడతారు.

అయినా మల్లి మీద సానుభూతితో.. వారానికి ఒక సారి అయినా మల్లి ఆలస్యంగా  వచ్చినా  సరే ఆమె వచ్చే వరకు బస్ ని ఆపి పెడతాను నేను. కేవలం ధన సహాయం చేయడం, అన్నదానం చేయడం, విద్యాదానం చేయడం లాంటివే దానం అనుకుంటారు కానీ నాకైతే అవసరమైనప్పుడు మాట సాయం చేయడం, సాటి మనుషులపట్ల దయ,కరుణ చూపడం సేవ  చేయడం కూడా అలాంటి దానాలకన్నా  తక్కువకాదేమో ననిపిస్తుంది   మల్లి నాకు తెలిసిన మనిషి.ఎలా అంటే..ఓ..సాటి మనిషిగా పరిచయం అంతే..

మల్లి నిజంగా పువ్వు లాగానే ఉంటుంది. పువ్వులాగా నవ్వుతూనే ఉంటుంది.  నిదానంగా మాట్లాడుతుంది.భర్త చనిపోయాడో,లేదా వదిలేసి వెళ్ళిపోయాడో తెలియదు.. కాని తల్లి తో కలసి ఉంటుంది. ఇద్దరు పిల్లలు. రోజు తెల్లవారుఝామునే   లేచి ఈ బసెక్కి   పూల మార్కెట్ కి వెళ్లి హోల్సేల్  మార్కెట్ లో  కేజీల లెక్కన పూలు కొనుక్కుని మూటలు  కట్టుకుని మళ్ళీ బస్ లో వేసుకుని ఏడుగంటలకల్లా ఇంటికి చేరుకుంటుంది. ఇలా చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారి దగ్గర లగేజ్ వేసుకున్నందుకు నేను టికెట్ కొట్టక పోయినా బస్ డ్రైవర్లు  మాత్రం పదికో ఇరవై కో ఆశ పడి ..మూట లు వేసుకోనిస్తారు. నేను డ్యూటిలో ఉన్న రోజు డ్రైవర్ కి డబ్బులు ఇవ్వకుండా లగేజ్ టికెట్ కొట్టి ఆమెకి ఓ..పది రూపాయలు మిగిల్చి పెడతాను.

 మల్లి పూల బస్తాలు వేసుకుని వచ్చి ఇంటి పనైపోయిన తర్వాత విశ్రాంతి  అనేదే లేకుండా పూలు మాలలు కట్టం తో పాటు..ఇండ్లలో  ఖాళీగా ఉండే ఆడవాళ్ళకి పూలు ఇచ్చి  మాల కట్టించుకుని  మూరలలెక్కన లెక్క కట్టి డబ్బు ఇచ్చేసి..  సాయంత్రం పూట మల్లి, ఆమె ఇద్దరు   పిల్లలు కలసి  వీధులెంట  తిరిగి ఆ పూలని  అమ్ముకుంటూ ఉంటారు. అదే వాళ్లకి జీవనోపాది.

పూలు అమ్ముడు పోని రోజు ఏదైనా ఉంటే ఆ  రోజు వాళ్ళు నలుగురూ పస్తులు ఉండాల్సిందే!

మల్లి రోజు వారి  ఖాతాలు పెట్టుకుని పూలు అమ్మడానికి మా కాలనీ లోకి వస్తూ ఉంటుంది. పూజ కోసం మా ఆవిడ కూడా పూలు కొంటూ ఉంటుంది. నిత్యం కొంటూ ఉంటాం కాబట్టి.. కాస్త తక్కువ ధరకే పూలు ఇచ్చి వెళ్ళిపోతుంది. చిల్లర లేదని తర్వాత ఇస్తామని చెప్పినా ఎదురు మాట్లాడదు . నెలకి ఒకసారి ఇస్తామన్న మాట్లాడదు . అన్నింటికీ  తల ఊపడమే..   సమాధానం అన్నట్లు ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టే.. ఆమెకి డబ్బు ఎగవేసే వారు ఉంటారు.  "మరీ అంత ధరా? రోజు కొంటున్నాం కదా అని .. ఈ కాలనీలోకి ఎవరు వచ్చి అమ్మరని తెలిసి మరీ ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నావ్.ఇలాగైతే నేను నీ దగ్గర పూలు కొనేదే లేదు" అని మా ప్రక్కింటి ఆవిడ  అప్పుడప్పుడు అరిచే మాటలు వినబడుతూనే ఉంటాయి.

మా ప్రక్కింట్లో ఉండే రావు గారు  బల్ల క్రింద చేయి పెట్టి బాగా  డబ్బు కూడ పెట్టిన వ్యక్తి. ఉన్న పిల్లలిద్దరూ విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఒకటికి నాలుగు ఇళ్లు .వాటిపై వచ్చే అద్దె డబ్బులు, పెన్షన్ అన్ని కలిపి నెలకి ఒక లక్ష రూపాయలు  కళ్ళ జూస్తారు .  పెరిగిన పాపం పోయెందుకేమో.. నిద్ర లేచింది మొదలు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. అట్టహాసంగా పూజలు చేయిస్తూ ఉంటారు. ఇంట్లో భజనలు పెడుతూ ఉంటారు. కాని సాటి మనిషికి చిన్నపాటి సాయం చేయరు.కాకిని కూడా ఎంగిలి చేత్తో విదిల్చరు. మల్లి కి కూడా సరిగా డబ్బులు ఇవ్వకుండా కాపీనం చూపిస్తారు అని చెపుతూ ఉంటుంది మా ఆవిడ .

పూలు కొంటుంటే డబ్బు ఖర్చు అవుతుందని ఏడ్చే బదులు వాళ్ళకున్న ఖాళీ స్థలంలో మొక్కలు పెంచుకుని..ఆ పూలు వాడుకోవచ్చు కదా అనుకుంటాను నేను. ఈ మధ్యనే ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో రేకులతో  రెండు గదులు  వేసి.. ఒకరికి అద్దెకి ఇచ్చారు. ఆ అద్దెకి ఉంటున్న వాళ్ళు ఇంటెడు చాకిరీ చేస్తే కాని బయటికి వెళ్ళకూడదని ఆంక్షలు ,. ఏమైనా అంటే మాకు పని చేస్తావనే కదా..  తక్కువ అద్దెకి ఇచ్చాం అనేవాళ్ళు.

మా ప్రక్క ఇల్లే కాబట్టి అప్పుడప్పుడు రావు గారితో మాటలు తప్పవు నాకు. ఒకటి రెండు మాటలుతో  ముగించి  వేరే పని ఉన్నట్లు జారుకుంటాను. లేకపోతే  విరామం ఇవ్వకుండా..  ఆయన ఉద్యోగ విషయాలు, ఆయనకీ ఉన్న పలుకుబడి గురించి డబ్బా గొడుతూనే ఉంటాడు.

ఎందుకో రెండు రోజుల నుండి రావు గారు కనబడలేదు. హమ్మయ్య! ఏ కొడుకు దగ్గరకో విదేశాలకి వెళ్ళి ఉంటాడనుకుని ఊపిరి పీల్చుకున్నాను. ఓ..ఆర్నెల్లు  పాటు  అయినా ఆయన బెడద  తప్పుతుందని కూడా  సంతోషించాను. .

నేను అలా అనుకున్నానో లేదో వెంటనే రావు గారు కనబడ్డారు. ఎప్పుడు ఆయనే ముందు మాట్లాడే వారు. ఈ సారి ఎందుకో మాట్లాడ లేదు. నేనే పలకరించాను.  " ఏం..సార్ ..! కనబడటంలేదు. ఊర్లో లేరా..? అని అడిగాను.

"ఉన్నాను . కొంచెం హెల్త్ ప్రాబ్లం "అని చెప్పి  గబా గబా లోపలకి వెళ్ళిపోయారు.

లోపలికి  వచ్చి  మా ఆవిడతో .."ప్రక్కింటి రావు గారికి ఏదో అనారోగ్యం అంట..ఏమైంది.? " .అడిగాను ఆసక్తిగా.

 అలా అడగడం ఎందుకంటే వంట ఇంటి గోడ ప్రక్క అటు వైపు ఇటువైపు నిలబడి మా ఆవిడ, రావు గారి ఆవిడ గంటల తరబడి ముచ్చట్లు పెడుతూ ఉంటారు. అలా అయినా విషయం  మా ఆవిడకి తెలిసి ఉంటుంది కదా అన్న నా ఆసక్తి కూడానూ..

అప్పుడు..మా ఆవిడ నాకు దగ్గరగా వచ్చి రహస్యం చెపుతున్నట్లు చెప్పింది.

" అనారోగ్యం కాదు ఏమి కాదు. వాడొక ముసలి నక్క . పొట్టంతా  విషమే! కూతురి వయసున్న ఆడవాళ్ళని కూడా దొంగ చూపులు చూసి చొంగ కార్చుకుంటాడు. మొన్న ఆయన భార్య ఊరెళ్ళి నప్పుడు .. పూలు ఇవ్వడానికని  మల్లి వస్తే..ఆమెతో..అసభ్యంగా మాట్లాడు అంట. .పోనీలే చితకార్తే కుక్క అనుకుని పూలు ఇచ్చి వెళ్ళిపోయింది . మళ్ళీ తెల్లవారి డబ్బులిస్తానుండు  ..అని గుమ్మలో నిలబెట్టి  ఉంచి లోపలి వెళ్లి ఇంటి చుట్టూరా తిరిగివచ్చి మల్లిని లోపలి కి నెట్టి తలుపులు మాసాడంట

 పాపం మల్లి..గట్టిగా అరిస్తే పరువు  పోతుందని అరవకుండా గొంతు అదిమి పెట్టుకునే.. పూల మాలని  తెంపే బ్లేడ్ తీసుకుని చేతికందినట్లు ఎడా పెడా కోసేసి బయట పడింది. పూల బుట్ట అక్కడే పడేసి  గబా గబా వచ్చి మనింట్లో కొచ్చి పడి ఒకటే ఏడుపు.

"అమ్మా. వాడికేం రోగం వచ్చిందమ్మా ! నా తండ్రి ఈడు మనిషి. ఒకసారి మంచితనంగా చెప్పి చూసా ..వినలేదు. రోజూ వాళ్ళ ఆవిడ చూడకుండా సతాయిస్తా ఉంటాడు. నేను డబ్బు కోసం ఆశ పడే మనిషి నైతే  పొద్దస్థమాను కష్టపడి ఈ పూలమ్ముకుని ఎందుకు బతుకుతానమ్మా.. నన్ను పూల పక్కలమీద పడుకోబెట్టేవాళ్ళు ఉంటారు.

ఏదో పూలు అమ్ముకునేది..కదా! నాలుగు డబ్బులు పడేస్తే పువ్వుని నలిపినట్టు నలిపేద్దామ్  ..అనుకునే మనుషులమ్మా వీళ్ళంతా .

ఒకడు కన్ను గీటు తాడు.ఇంకొకడు..పూలన్నీ నేనే కొంటాను..రాత్రికి వచ్చేయి అంటాడు.

ఆడ పుట్టుక పుట్టిన పాపానికి .. ఈ చిత్తకార్తే కుక్క ముండా కొడుకులకి లోకువైపోయాను. నన్ను వదిలేయ్..అయ్యా.. ! అంటే వినలేదు. బలవంతం చేయబోయాడు.  పూలు కట్టే చేతులు కదా.. పువ్వులా ఉంటాననుకున్నాడు.  ఈ చేతులు దారాన్ని  పువ్వుల కుత్తుకకి బిగించిన చేతులు కూడానమ్మా... ఆ దారంతోనే ఉరి వేద్దునూ.  పాపమంటుకుంటుందని బ్లేడు తీసుకుని.. బరికేసినా.." అని  చెప్పింది..అంటూ సీన్ మొత్తం కళ్ళకి కట్టినట్లు వివరించేసింది  మా ఆవిడ.

నాకైతే  ఆ సమయమప్పుడు  మల్లి ఎలా ఉంటుందో.. ఊహించుకుంటే..  భలే సంతోషం వేసింది. పువ్వులా ఉండే మల్లి   ఉగ్ర రూపం కనులముందు మెదిలింది. "ఆ ముసలి నక్కకి తగిన శాస్తి జరిగింది". అన్నాను.

"ఇంతకీ రేపు  ఊరెళ్లిన   రావు గారి భార్య  వస్తే  ..ఒళ్ళంతా ఆ గాయాలు ఏమిటని అడిగితే  ఏం  చెపుతాడో.. !? మా  ఆవిడ ఆసక్తి.

"నిమ్మ చెట్టు క్రిందకి  వెళ్లాను. చెట్టుపై పాము  కనబడింది.. భయపడి గబగబా రాబోయాను. ప్రక్కనే ఉన్న కొమ్మకి తగులుకున్నాను. నిమ్మ ముళ్ళు గీరుకున్నాయి అని చెపుతాడు లే!" అన్నాను.

"భలే ఊహించారండీ మీరు " అని  వెంటనే.. "మీకు గాని  ఇలాంటి అనుభవం ఏమైనా ఉందా!?   నా వైపు  అనుమానంగా చూస్తూ  అడిగింగి మా ఆవిడ.

శ్రీ రామచంద్రా..! అంటూ.. పూజా మందిరం వైపు తిరిగి చేతులు జోడించాను నేను.


16, డిసెంబర్ 2012, ఆదివారం

మై డియర్ ఇగో..





నీ శత్రువు ఎక్కడో ఉండరు. నీలోనే ఉంటారు.

శత్రువుని గుర్తించడం ఏల !?

నిన్ను అతిశయంగా పొగిడి.. నీవు చేరుకున్న శిఖరాల పై నుండి నిన్ను క్రిందికి త్రోసి సంబరపడి పోయే శత్రువును  గుర్తించ గల్గే నేర్పు నీలో లేనప్పుడు .. నువ్వు మొదటి అడుగులోనే ఉంటావు.
అది నీ మొదటి తప్పు.

నీలో లోటు పాట్లును చెప్పే హితులను నువ్వు ద్వేషిస్తే, నిర్లక్ష్యం చేస్తేనూ .. ఎన్నటికి ఎదగలేవు.
అది నీ రెండో తప్పు

ఎదుగుతున్న వారి ని.. నువ్వు చాలా గొప్ప. నీతో సరిసమానం ఎవరు కాలేరు. ఎవరు లేరు అంటే చాలు .. సాధించిన దానికే సంతృప్తి పడి విజయ గర్వంతో విర్రవీగుతూ.. ఆ తర్వాత పని చేయడం మానేస్తారు
అది తెలుసుకోలేక పోవడం అన్నది  మూడో తప్పు.

నిన్ను నీవు తెలుసుకోలేకపోవడం .. ఆత్మ విమర్శ చేసుకోలేకపోవడం అన్నది.. అది నాలుగో తప్పు

ఈ నాలుగు ఉంటాయని ఊహించకపోవడమే..  మనలో ఉన్న అహం  వీటిని గుర్తించక పోవడమే ..ఐదో..తప్పు.




15, డిసెంబర్ 2012, శనివారం

మనసుతడి






      మనసుతడి

ఊపిరి ఉండగానే  కాటికి చేర్చిన
కొడుకులున్న తల్లిని  చూసి
మనసు  తడి ఆరనివ్వకండి  .. 

అమ్మ పొత్తిళ్ళలో.
ఒదిగి ఉండాల్సిన పసి పాప 
మురుగు  కాల్వలో మృతజీవిగా మారిన వైనం చూసి
మనసు తడి ఆరనివ్వకండి.. 

రక్త మోడుతున్న సాటి చోధకులని 
చూసి చూడనట్లు వెళ్ళిపోతూ..
మానవత్వపు దారిద్ర్యంతో..
మనసు తడి ఆరనివ్వకండి..

ఏ ప్రకృతి వైపరీత్యాలకో ,వికృత వైషమ్యాలకో..
బలి అయి  ఉన్నచోట  ఉండలేక
శరణార్ధులుగా ఉన్నవారిని చూసి
మనసు తడి ఆరనివ్వకండి.. 

స్వార్ధపు నిచ్చెనె లు ఎక్కి ..  
సాటివారి ఫలాలను  దోచేస్తే .. 
ప్రక్కవాడి గొడవ మనకెందుకులే అని 
మనసు తడి ఆరనివ్వకండి.. 

మనసు తడి ఆరితే  మనిషిగా..అంతరించినట్లే..!!

మనసు తడి జీవనదిలా..
ప్రవహిస్తూ ఉండాలి.. 
కర్కశం అందులో పునీతం కావాలి.....
     

14, డిసెంబర్ 2012, శుక్రవారం

ఇంటి పేరు

ఇంటి పేరు  - వనజ తాతినేని

నేను గర్వంగా భాసించే నాపేరు కన్నా

ముందు  దిష్టి పిడత నా ఇంటి పేరు

ఫలానా వారి అమ్మాయినని మాత్రమే 

నాకు గుర్తింపునిచ్చిన ఇంటి పేరు..

పాశాలన్ని తెంచి నన్ను

ఆడనుండి ఈడకి నిర్దాక్షిణ్యంగా నెట్టిసి 

బలవంతంగా లాక్కున్న కర్కశి అది   

మంచి పేరుని మాత్రమే తెమ్మన్న 

పేరాశ మహమ్మారి ఇది  



క్రొంగొత్తగా నా పై బడ్డ పెనిమిటింటి పేరు

ఎన్నో బరువులని బాధ్యతల్ని

మోయాల్సిన మెడమీది కాడి అది 

పెదవి విప్పక అన్ని భరించమన్నరాకాసి అది 

నన్ను మేల్కొనీయకుండా

చీకటిలో ఉంచి నాఆలోచనా మ్రొగ్గలని నలిపేసి  

నా  కన్నాముందే నా ఉనికిని చాటేసే 

మూర్చరోగి మెడలో బిళ్ళ అది 



ఒక ఇరుసులో బిగించి అరిగేదాక  

తిరగాలిసినదేనని తీర్మానించినట్లుంటుంది 

నాకెంతో  బరువనిపించినది  

నేను మోయలేనిదది 

ఆడదో ఈడదో లేకుండా

ఏదో ఒకటి ఉండకుండా

వదిలిందుకోవాలని ఉంది

అది లేకుండా నేను లేనా

నాళాలు తెగేలా ప్రశ్నించాలని ఉంది



పైగా ఇప్పుడు కొత్తగా నన్ను

తోటి మనుషులనుండి విడదీస్తుంది.

మూలాలను ద్వేషించలేదు కానీ 

మనిషిని ఎదగనివ్వని మూలాలు 

వద్దనేవద్దని తెంపరితనం నిండుకుంది 

ఎదగాలని ఉంది

నిరూపించుకోవాలని ఉంది

నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది

నేనొక వస్తువునో సంస్థనో భూమినో కాదని 

 పితృస్వామ్య చేవ్రాలు నా బతుకు పత్రాలపై 

బలవంతంగా లిఖించ వద్దని నిరసిస్తుంది. 


(ఓ.పదేళ్ళ క్రిందటి కవిత)

13, డిసెంబర్ 2012, గురువారం

కమ్మర కట్ట ..అంటే




ఈ వ్యాఖ్య ||బ్లాగాడిస్తా|| రవి గారి బ్లాగ్ లో ఇతరులు వెలిబుచ్చిన సందేహం మరియు.. ఒక చిన్న ముచ్చట గురించి.  ఠపా కి విరుద్దమైన వ్యాఖ్య అవుతుందేమో అన్న అనుమానం తో.. వ్యాఖ్య నా బ్లాగ్ లోనే పోస్ట్ చేసుకుంటూ..

కమ్మర కట్ట ..అంటే .. జీడిబిళ్ళలు లాంటిందే..! బెల్లం బాగా ముదురు పాకం రానిచ్చి అందులో పుట్నాలు పప్పు (చెనా దాల్) ని బరకగా పట్టి అందులో కలిపి ఉండలు చుడతారు. అవి చాలా గట్టిగా ఉంటాయి. ఒక కమ్మర కట్ట ఇస్తే చాలు!  రెండు గంటలు వరకు పిల్లలు ఏమి అడగరు. అలాంటి వంటకం అది. చాలా రుచిగా ఉంటుంది.

కోస్తా జిల్లాలలో జీడి ఉండలని నువ్వుపప్పు వేసి చేస్తే.. నెల్లూరు, రాయలసీమ ప్రాంతంలో పుట్నాల  పప్పు,కొబ్బరి లతో ఎక్కువ చేస్తారు. కమ్మర కట్ట లో బెల్లం పాళ్ళు ఎక్కువ. ఎందుకో కమ్మర కట్ట చూడటానికి కాఫీ పొడి రంగులో ఉంటుంది. ముదురు పాకం కాబట్టి..అలా రంగు మారిపోతుంది.

రవి గారు ..మొన్ననే (సండే ) నేను అనంతపురం వచ్చాను. నీళ్ళు లేని పెన్నమ్మని చూసాను. పెన్నఅహోబిలం వెళ్లి అక్కడ తుంగభద్ర గలగలలు విని పులకించి పోయాను. చాలా బావుందండి.కొంత నచ్చనిది అపరిశుభ్రం కూడా. .
పెన్న అహోబిలం విశేషాలు గురించి మరో పోస్ట్ లో వ్రాస్తాను

పాతదే! కొత్తగా ముస్తాబై మీ ముందుకు

ఈ రోజు నా ఈ బ్లాగు రాతలని చదువుకుంటూ పోతుంటే ..ఇదిగో..ఈ పోస్ట్ నాకు బాగా నచ్చింది.

మీరే కదా..వ్రాసుకున్నారు.. మళ్ళీ నచ్చడం నచ్చక పోవడం ఏమిటీ..అనుకునేరు. మనం వ్రాసిన వాటిలో మనకి బాగా నచ్చిన పోస్ట్లు అనుకోవచ్చును కదా..అలా అన్న మాట.

పాత రాతలే! మళ్ళీ ఒకసారి పేరు మార్చి.. ఇలా తీసుకుని వచ్చాను.

నేను  గొప్ప అంటే నేను గొప్ప  అనుకుంటూ రోజు వాదులాడుకుంటూ.. కించ పరచుకుంటూ  ఉండే  భార్య భర్తలు ఎలా ఉంటారో..ఏమి తెలుసుకోవాలో.. అని ఆలోచిస్తూ వ్రాసిన ఈ పోస్ట్ ..మళ్ళీ చదువుకుంటూ వుంటే నాకు బాగా నచ్చేసింది.

మీకు నచ్చితే చదవండి.. ఓకే..ఫ్రెండ్స్.! నచ్చకుంతే..వదిలేయండి ప్లీజ్. ఎందుకమ్మా..పాత పోస్ట్ లతో చంపుతావ్ అని తిట్టుకోవద్దు ..ప్లీజ్!


" వనూ స్ డైరీ విత్ వనమాలి "(జిలేబీ కి అనుకరణ)


వను  వారు  ఇలా అనుకుంటున్నారు..

ఈ రోజు బ్లాగ్ పోస్ట్ లో  ఏం వ్రాసుకోవాలి? అలవాటు అయిపోయి.. చేతులని కీ బోర్డ్  రా రమ్మని పిలుస్తున్నాయి. ఏం తోచి  చావడం లేదు..వనమాలీ.. అలా చోద్యం చూస్తూ. మందస్మితంతో.. అక్కడ నిలబడి వీక్షించక పొతే కాస్త సాయం చేస్తే మీ సొమ్ము ఏం పోయిందో ? అసలు నాకు తెలీయక అడుగుతాను  మీరు నన్ను ఎందుకు ఈ బ్లాగ్ లోకంలోకి నెట్టినట్లు.. ? నేను హాయిగా పుస్తకాలు చదువుకుంటూనో.. స్నేహితులతో..ముచ్చట్లు పెట్టుకునో..లేదా .."వను స్ ..డైరీ విత్ వనమాలీ ..అంటూ.. వ్రాసుకుంటూనో ఉండేదాన్నికదా!. ఇప్పుడు కలం పట్టుకుని  వ్రాత వ్రాసి ఎన్నాళ్ళ వుతుందో !

అయినా ..వేటూరి వారు ఒక పాటలో చెప్పినట్టు.. నేనేమంత గొప్పదాన్ని.. అంట? ఉద్యోగాలు చేస్తున్నామా? ఊళ్లు యేలుతున్నామా? నార్మల్లీ హౌస్ వైఫ్. మెదడులో గుజ్జు  ఉండదు.అంట్లు తోముకుంటూ,బట్టలు ఉతుక్కుంటూ,పిల్లా జెల్లా ని సర్ది.. హాయిగా టీవి సీరియల్ చూస్తున్నామని, పేపర్లో విశేషాలకి  అలవాటయి అదే ప్రపంచంలో బ్రతుకుతున్నామని అనుకుంటారు. మేము వ్రాసే విషయాలు ఏముంటాయి.. ? కాస్త  నవ్యంగా  వ్రాయడానికి  ఏదైనా  సలహా ఇవ్వవచ్చుగా ..అంది  వను.

బాప్ రే ! వను! (మా వనమాలికి నేను "వను" ని ) ఇంత ఏకధాటిగా మాట్లాడిన మిమ్ము చూస్తుంటే..మాకు గీతోపదేశం సమయమందున..అష్టాదశ  అధ్యాయాలని .. మేము  అర్జునుని తో..ఇలా  ఏక ధాటిగా బోధించి ఉండలేదే..!?అని విచారం కల్గినది  అని అన్నారు. "హాస్యంగా

మీ హాస్యం కొంచెం ఆపండి మహాశయా!  వనమాలీ అని పేరు ఉన్నంతనే..మీరు..ఆ మురళీ లోలుడు అయిపోతారా? నేనేమో భామని అవుతానా?  కొద్దిగా కినుకుగా అడిగింది..వను
మీకు ఏమి తక్కువ.. ప్రేమలో రాధ కి,భక్తిలో రుక్మిణికి , అభిమానంలో (అహం అంటే ఇంకేమైనా ఉందా?) భామ కి సరి సాటి..అన్నారు వనమాలి

లోలోపల మురిసి పోతూనే అంత మునగ చెట్టు ఎక్కించ వలదు లెండి. మీరు అన్న రీతిన మేమెక్కడ? మీరు ఎక్కడ. ? మీరు అసలే  లీలా వినోదులు. తగవులు పెట్టి చూచి తరించెదరు. మీ బుద్ది యుగాలు   మారినా మారలేదు..అంది వను

యుగాలు అయితే నేమి.. మేము మేమే ! మీరు మీరే కదా!..దేవి. అన్నారు వనమాలి. .
అక్కడ ఆ పోలిక కి కడుపు  మండింది వనుకి

ఆహా.. మేము  ఏమి గొప్ప కాకుండే! మీరుమాత్రం  ఎలా గొప్పఅయిఉండును.. ? . అని అంది కత్తులు నూరినట్లు.
మీతో.. ఇదే సుమా చాలా చాలా చిక్కు. మేము చెపుతున్నది  సరిగా వినరు  ఒకవేళ విన్నా  సరిగా అర్ధం చేసుకోరు.మీతో వేగి వేగి నా తల గిర్రున తిరుగుతున్నది.  మీతో వాదన తెగక తల బొప్పి కడుతున్నది. ఆ ప్రభావం మా పై పడి..మా రాచకార్యాలు సరిగా సక్రమంగా జరగకుండే!.. హతవిదీ..అంటూ.. రెండు చేతుల మధ్య ..శిరస్సు ఉంచుకుని చటుక్కున కూలబడ్డారు.

ఆ స్థితిలో పతి దేవుని చూసి హృదయం ద్రవింపగా.. వనమాలీ మన్నించవలెను.
అసలే   అఖిల భారతమందున.. పురుషులు  కొంగ్రత్త చట్టములను చూసి..అగ్గి మీద మొక్క జొన్నల్లా..పేలిపోతున్నారు. వారిని కాస్త సాంత్వన  పరచకుంటే.. తేత్రా యుగం నందు సీతమ్మలా అగ్గిలో దూకి ఆత్మ  త్యాగం చేసేటట్లు ఉన్నారు..కాస్త వారిని సాంత్వన పరచే విధంగా నాలుగు మాటలు చెపుతారని..అడుగుదామనుకునే లోపునే..మనకి అలవాటైన వాగ్వివాదం మొదలయింది.
 మన్నించండి.. .వనమాలీ.. అంది వను.

ఆ మాటకి కాస్త ఉపసమనం పొంది..అది కాదు..వను..ఇప్పుడు మేము చెప్పేడు విషయం శ్రద్దగా వినుడు.
ఇప్పుడు.. కలియుగమున పురుషులకి చెప్పవలసినది ఏముంది? తేత్రాయుగమును వదిలివేయుడు. ఆ యుగమును  దాటి  ద్వాపర యుగమున..ఈ వనమాలి..అష్ట భార్యలతో,పదుహారు వేల మంది గోపికలతోను కూడి..అనేక కష్టముల పాల్బడి నను .. నా స్వభావ సిద్దమగు..ఆనందమునే..అందరికి అందించి..అందరివాడిని అనిపించుకుంటిని. అయినను..నన్ను ఆదర్శంగా తీసుకోకుండా..ముందు యుగమునందు ఆదర్శ పురుషుడిగా నడచిన శ్రీ రాముని ని ఆదర్శం చేసుకుని..భారతీయ వివాహ చట్టములు ఏర్పడి ఉండవచ్చును.

అదే  తరుణమున సీతమ్మ కష్టములు ని పరిగణలోకి తీసుకుని ..స్త్రీలకి కొంత అనుకూలముగా చట్టములు చేసి ఉండవచ్చును.
ఇంకో విషయం చెప్పేడు వినుడు.. కలియుగ దైవం అయిన మేము దేవేరిని వదిలి పద్మావతిని చేపట్టి..ఇద్దరి నడుమున నలిగి శిలనయితిని. అందుకే పురుషులకి అన్ని యుగాలయందును ను ఏక పత్నీ వ్రతం శ్రేష్టం అయినది అని చెప్పుచుంటిని.

అటులనే.. స్త్ర్రీలని ధనం  కోసమును,సేవలు చేయుట కోసమును వివాహం ఆడుట తగదని చెప్పుచూనే..వారికి పురుషులతో సరి సమానంగా..అస్త్ర,శస్త్రవిద్యల యందును.చతుష ష్టి   కళలు నేర్చుకోనుడు ఆసక్తులపై..నిషేదములు వలదని చెప్పు చుంటిమి. అయినను.. మా పురుషులు స్త్రీలని తక్కువ స్థాయిలో జూచు చుండబట్టే   ఈ అభిప్రాయ బేదములు తలెత్తి.. యున్నవి.

పతి అర్ధభాగం తానే  అగునట్టి ఉమయునూ, హృదయమున ప్రతిష్టించుకున్న మీరును, నాలుకపై నుండు..వాగ్దేవినూ..స్త్రీ మూర్తులే కదా!మీ మువ్వురు భర్త అంతరంగ మెరిగి మసలుకోనలేదా! ఇప్పుడు స్త్రీలు కూడా అలాగే పతి మనసెరిగి ప్రవర్తించెదరు  అనుటలో సందేహం వలదు.

స్త్రీ-పురుష బేధం రాకుండా.. పాలునీళ్ళులా కలసి యుండెడి మాట మరచి ఒకరిపై మరొకరు విద్వేషములు పెంచుకొనుట ఎలా?  విద్యలు,కొలువులు,బిడ్డలా ఆలనా పాలన గృహ నిర్వహణ అన్నీ సమముగా చేసుకుని..అందరు సుఖముగా ఉండు..యోచన చేయ వలెనని..మా మాటగా చెప్పుచూ ఒక టపా వ్రాయుడు..అని చెప్పి విశ్రమించిరి.

అటులనే..వనమాలీ..మీ మాట నేను ఎపుడైననూ  జవదాటితినా  ? మీరు నేను వేరు కాదు..మీ మాటే..నా మాట కూడాను అంది సంతోషంగా వ్రాయడానికి ఉపక్రమిస్తూ..

 (జిలేబి వారలకు-జన్బునాధాన్ కృష్ణ స్వామీ అయ్యర్ వారలకు అనుకరణగా.. వ్రాసే సాహసం తో..క్షమాపణలతో.. )

11, డిసెంబర్ 2012, మంగళవారం

కాలమా !




కాలమా!!
నన్ను కరిగిస్తావు!
నువ్వు కరిగిపోతావు!!

గడచిన వ్యధలు,అవమానాలు
అగౌరవాలు, అసహ్యక్రియలు..
అన్నీ నీ ఘనవిజయాలని..
మిడిసిపడతావా..?

 కాదననులే!
వాటి రహస్యాలన్నీ
మరి నీకే తెలియాలి.

నిన్ను నేను గాఢoగా ..
విశ్వసించ బట్టేకదా ..

చీకటిలో చిన్న ప్రమిద తో..
అజ్ఞానాన్ని  అక్షరంతో..
నిశ్శబ్దాన్ని శ్రవణంతో..
నిస్సహాయతలో చేయూతతో..

మునకలో నావని..
ఎడబాటులో..
ఎదలభాషని తోడు చేసుకుని
లోని తీవ్రతలని..
గుండె నిబ్బరంతో..తట్టుకుని
లోపాలని పూరించుకుని ..

నన్ను నేను  కొల్పోయినచోటనే...t
పునర్నిర్మించుకుంటాననే ఆశతో..
ఎవరి కోసం ఆగని నీతో..కలసి
కొత్త ఊపిరి పోసుకుంటూ
నేను..  పరువులు తీస్తున్నాను ..
    
(2002  AIR  VZA లో వినిపించిన  నా కవిత )

10, డిసెంబర్ 2012, సోమవారం

అసిధార ..రండి రండి..



అసిధార ..గారు..ఓ..మారు ఇటువైపు చూసి వెళ్ళండి...ప్లీజ్!!

మీకు మనసారా ధన్యవాదములు. ఎందుకంటారా..?  అజ్ఞాత గా  వచ్చి అన్యోపదేశం చేసి వెళ్ళారు కదా! అందుకు మీకు ధన్యవాదములు.

మార్చి మాసంలో మీరు  నా బ్లాగులో వ్రాసిన మూడు కామెంట్స్ ని నేను ప్రచురించలేదు. మీ ప్రొఫైల్ సరిగా లేని కారణంగా.

అయినా మీరు వ్రాసిన కామెంట్స్ నేను మర్చిపోలేదు. గాయపరచడం వేటగాడి లక్షణం అయితే.. గాయం ని పూడ్చుకుని మళ్ళీ పైకి ఎగిరే ప్రయత్నం చేయడం..పక్షి లక్షణం.

మీరు తెలుగు బ్లాగులలో నలుగురు మాత్రమే అసలు సిసలైన బ్లాగర్లు అని నొక్కి వక్కాణించారు.నేను నిన్ననే విన్నాను. మరో రెండు రోజులలో తెలుగు బ్లాగరుల దినోత్సవం జరుపుకుంటాము అని. నాలువేల అయిదు వందల పైనే  తెలుగు బ్లాగులు ఉన్నట్లు విన్నాను. {సరి అయినదో..కాదో మరి}

అంతమంది బ్లాగర్స్ ఉండగా.. మీరు మీకు నచ్చిన వారి పేర్లు మాత్రమే  సూచించి.. వాళ్ళే బ్లాగర్స్ మిగిలిన వాళ్ళు కాదు అంటే.. మిగతావారు ఒప్పుకుంటారా? ఒకసారి మళ్ళీ మీరు ఉదాహరించిన వారి పేర్లు ని  మళ్ళీ ప్రకటించండి.

మీరు.. నా బ్లాగ్ చూస్తారో లేదో తెలియదు. కానీ మారు పేరుతొ ప్రొఫైల్ సృష్టించుకుని వచ్చి.. నన్ను ఎద్దేవా చేసి వెళ్ళారు. మీ మాటలకి నొచ్చుకుని.. నేను కామెంట్స్  ఆప్షన్ వద్దనుకున్నాను. తర్వాత మళ్ళీ కామెంట్స్ ఆప్షన్ ని  ఓకే.. చేసాను. అందుకు కారణం మీ వ్యాఖ్యలే!

నిజంగానే  మీరన్నట్లు నేను పెద్ద బ్లాగర్ని ఏమి కాదు. ఎదో ఉబుసుపోక వ్రాసుకుంటూ ఉంటాను. కామెంట్స్ విషయంలో నేను చాలా మంది బ్లాగర్స్ మనసులోమాటని, కొందరి బ్లాగర్స్ వైఖరిని విమర్శించాను. అందుకు వివరణ ఇచ్చాను. ఆ పోస్ట్ లో నేను చేసిన వ్యాఖ్యలకి ఈ రోజు కట్టుబడి ఉంటాను.

అసలు గొప్ప బ్లాగర్స్ అని మీరు ఎలా లేక్కించగలరు ..చెప్పండి? వ్రాసిన పోస్ట్ లా? లేక పేజ్ హిట్స్?
లేదా విజిట్ చేసిన తోటి బ్లాగర్స్ సంఖ్యా? లేక వచ్చిన వ్యాఖ్యలా? ఎలా లేక్కిస్తారో..చెప్పి పుణ్యం కట్టుకోండి. నాకు అసలు ఆవిషయం పై అంతా అజ్ఞానమే! నేను అయితే రాంక్ ఆధారంగా ఏమో..అనుకుంటున్నాను.

మీరు అనవసరంగా నా బ్లాగ్లో జొరబడి నాకు మేలు చేసారు. అది ఏమిటంటే..నన్ను ఎద్దేవా..చేయడం వల్ల  మీకు సంతృప్తి కల్గిందేమో..కాని..నాకు ఆ వ్యాఖ్యలు చాలా ఉపయోగ పడ్డాయి. నేను సీరియస్ గానే బ్లాగింగ్ చేస్తున్నాను.రెండు సార్లు ఇండీ బ్లాగర్ 80 రాంక్ ఒకసారి.. 79  రాంక్ ఒకసారి  లో నిలిచి ఉన్నాను.

అలాగే ఒక లక్షా పదునెనిమిది వేలకి పైగా పేజీల వీక్షణ అక్షరాల 60 ,416 బ్లాగర్స్ నా బ్లాగ్ ని విజిట్ చేసారు.  603 పోస్ట్లు  ఉన్నాయి.మీరు ఉదాహరించిన నలుగురు బ్లాగర్స్ ఖచ్చితంగా నేను సాధించిన రాంక్  కన్నా తక్కువలోనే ఉన్నారు.

ఈ విషయమని ఉదహరించడం ఎందుకంటే.. వాళ్ళ కన్నా నేను గొప్ప బ్లాగర్ ని అని చెప్పడానికి కాదు సుమా..!

బ్లాగ్ వ్రాసుకోవడం పదుగురు మెచ్చితే గర్వంగా ఫీల్ అవడం  నిరంతరం వ్రాయకపోతే రాంక్ దిగజారడం అనేవి "వైకుంఠపాళీ " ఆట లాంటివి. మీరనుకున్న గొప్ప బ్లాగర్లు ఆగస్టు మాసంలో నాకన్నా వెనుకబడే ఉన్నారు.ఆగష్టు లో ఇండీ బ్లాగర్ హైయ్యెస్ట్ రాంక్ 83..అయితే నా బ్లాగ్ రాంక్ 80.నేను ఆరోగ్యం బాగోలేక 15 రోజులు వ్రాయలేకపోతే మరుసటి నెలలో 73 కి జారిపోయాను. అలా ఉంటాయి మరి బ్లాగ్ రాంక్స్ అని అర్ధం అయి మళ్ళీ ప్రయత్నించాను.

ఎవరు ఎప్పుడూ..ఒకే స్థాయిలో ఉండరు .అందరికి బ్లాగులకి అంటి పెట్టుకునే తీరిక ఉండదు. అందరికన్నా.. మిన్న అయిన జ్ఞాన సముపార్జన ఉండదు. వినడం,చదవడం,సేకరించడం,వ్రాయడం..వీటివల్లనే లభ్యం అవుతుంది."అపరిమిత జ్ఞానానికి పరిమితులు లేవు" అని మీరు తెలుసుకుంటే బావుంటుంది. ఇంకెప్పుడు ఎవరిని ఇలా ఎద్దేవా చేయకుండా ఉంటే  బావుంటుంది అన్న ఉద్దేశ్యంతోనే ఈ పోస్ట్ వ్రాస్తున్నాను. 

అందరం అక్షరంతో..ప్రయాణం సాగించడానికి వచ్చినవారమే! మీకు నచ్చినవాళ్ళే  వట వృక్షాలు..అని
మిగతావారందరూ.. గడ్డిపోచలుగా .. తీసి పారేయకండి అని మనవి. మీకు బాగా నచ్చిన బ్లాగర్స్  నలుగురిలో ఇద్దరు ఇండీ బ్లాగర్ సభ్యులు కారు కూడా.

మీరు ఉదాహరించిన నలుగురు బ్లాగర్స్ వ్రాసే విషయాలు నాకు బాగా నచ్చుతాయి.నేను కామెంట్స్ కూడా పెడుతూ ఉంటాను. అనవసరంగా మీరే మీ దురభిమానాన్ని ప్రకటించుకున్నారు. :):)

నేను మీపై ద్వేషంతో.. ఈ పోస్ట్ వ్రాయడం లేదు. నాకు పట్టుదలని పెంచిన మీకు మనసారా ధన్యవాదములు తెలుపుకుంటూ..

ఇకపై వ్రాస్తానో..వ్రాసుకుంటూ ఉంటానో.. కూడా తెలియదు. మీకు ఒక సమాధానం ఇవ్వాలనుకున్నాను. ఇస్తున్నాను..అంతే!

అసిధార గారు.. మీకు నచ్చినట్లు నా బ్లాగ్ ఉండక పోవచ్చు.కానీ ఈ బ్లాగులో.. సజీవ మైన జ్ఞాపకాలు ఉన్నవి.ప్రశంసలు  పొందిన కవితలు ఉన్నవి. మదిని మీటి వెళ్ళిన రచనలు ఉన్నాయి.. అని నేను గర్వంగా చెప్పుకోగలను. అది.. అతి విశ్వాసంగా మీకు కనబడితే అందుకు నేను ఏమి చేయలేను. మీరు నా బ్లాగ్ ని గుర్తించక పోవడం వల్ల కూడా నాకు వచ్చిన బాధ ఏమి లేదు. అయితే నాలో ఉన్న extra -ordinary ని వెలికితీసుకునే కసి రగిలించిన మీకు  మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదములు.

{ద్వేషించే శత్రువునైనా మెచ్చుకోమన్నారు కదండీ! అందుకే మీకు మనసారా ధన్యవాదములతో ఈ పోస్ట్)

(తోటి బ్లాగ్ మిత్రులకి నొచ్చుకునే విధంగా ఉంటె క్షమించండి.  కొన్ని వ్యాఖ్యలకి నేను నొచ్చుకుని  వ్రాసుకున్న పోస్ట్  ఇది.. ఒక అజ్ఞాత కి నేను ఇచ్చే సమాధానం మాత్రమే! ముమ్మాటికి ఇక్కడ గొప్ప,చిన్న బేధాలు ఏవీ లేవని చెప్పడమే నా ఉద్దేశ్యం కూడా)

8, డిసెంబర్ 2012, శనివారం

పంటి క్రింది రాయిలా ...

వ్యాపార ప్రకటనలు చూడటం మనకి క్రొత్త ఏమి కాదు.  ప్రపంచంలో ఏ విషయం అయినా వ్యాప్తి చెందటానికి,వస్తువు  ఉనికి చాటి చెప్పుకోవడానికి ప్రకటన చాలా అవసరం. 

అసలు మనకి ఎన్ని వస్తువులు రకరకాల పేర్లుతో మన ముందుకు వస్తున్నాయి అని తెలిపేది ప్రకటనలే కదా! ప్రకటనలని వ్యతిరేకిస్తే ఎలా ..అని నాకు నేనే అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

టీ.వి. చూస్తే... అసలు కార్యక్రమం కన్నా నాకు ఈ ప్రకటనలే బాగా నచ్చిన సందర్భాలు ఎక్కువ.  కొన్ని సెకనుల కాలంలో మనకి కనిపించి మయామయ్యే ప్రకటనలలో ఎంత క్రియేటివిటి ఉంటుందో..కదా !

అలాగే  అతిశయోక్తంగా  ఉన్న ప్రకటనలు చూసి చూసి విరక్తి వచ్చి.. రిమోట్ తీసుకుని నేలకి విసిరి కొడదామనుకున్న కోపం ని తమాయించుకుని .. ఛీ ఛీ.. పవర్ కట్ ఉండినా బాగుండును. వెదవ టీ .వి పెట్టకుండా ఉందును అనుకుంటాను.

సరే ..మన తెలుగు దిన,వార పత్రిక,మాస పత్రికలలో కూడా  వ్యాపార ప్రకటనలు ఏమైనా తక్కువా!? అక్కడా..అవే!

నేను చదవటం మొదలెట్టిన దగ్గర నుండి చూస్తున్నాను.. రోజుకు..గంట ఇంగ్లీష్ నేర్చుకోండి,..అనే ప్రకటన ఏమిటో..ఆ ప్రకటన చూసి చూసి ఇంగ్లిష్ నేర్చుకోవడం అంటేనే విరక్తి పుట్టింది అంటే నమ్మండి.

ప్రముఖ దేవాలయాలలో సేవా వివరాలు,రీటా కొబ్బరి నూనె ప్రకటనలు చూసి చూసి మొహం మొత్తి ఉన్నాను. ప్రకటనలు చూసి దేవుడు అక్కడమాత్రమే  ఉన్నాడు అని అనుకున్నఅమాయకత్వం లో నుండి బయట పడి  అక్షరం ద్వారా లభించిన జ్ఞానంతో.. ఎక్కడైనా ఉన్నాడు అని తెలుసుకునేటప్పటికి ..ఓ.. పదేళ్ళు గడచిపోయాయి.
అలాగే రీటా  ఆయిల్ కలపకుండాను  కొబ్బరి నూనె రాసుకోకుండాను కూడా  జుట్టు పెరుగు తాయి  అని తెలుసుకోవడానికి ఇంకొన్ని ఏళ్ళు పట్టింది. 

సరే ప్రకటనలు సర్వ వ్యాప్తి..అనుకుని ప్రకటనలపై కొన చూపుకూడా పడకుండా  గెంతి గెంతి కథలు, కవితలు, పుస్తక విశేషాలు మాత్రమే  చదువుకోవాలని  సమాధాన పడి  మనకి కావాల్సింది మనం తీసుకుని తతిమాది వద్దనుకోవడం అలవాటు చేసుకున్నాను చూడండీ! అది ఎంత గొప్ప విషయం అనుకున్నారు. అసలు అక్కడే మొదలయింది.నాకు జ్ఞానం  రావడం అన్నది. 

 "సముద్రం ముందు మనం నిలుచున్నాం. సముద్రం నుండి గవ్వలు, ఆల్చిప్పలు,మనం వద్దనుకుని విసిరి పారేసిన వస్తువులు, మణులు,మాణిక్యాలు ..లాంటివి ఏవేవో..వస్తూ ఉంటాయి. మనకి కావాల్సింది మనం తీసుకోవడంలోనే విజ్ఞత ఉంటుంది." అన్నగొప్ప విషయం  అర్ధమవడానికి   ఇతోధికంగా సాయం చేసిన ప్రకటనలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను కూడా!

కానీ అప్పుడప్పుడు పంటి క్రింది రాయిలా ఇబ్బంది పెట్టె ప్రకటనలు, అజ్ఞానం ని పెంచి పోషించే  ప్రకటనలు, 10 వేలు నుండి పదికోట్లు సంపాదించండి అనే ప్రకటనలు చూస్తూ ఉన్నప్పుడు.. పాఠకుల జ్ఞానం కన్నా ప్రచురణకర్త ల అజ్ఞానం కనబడుతుంది. 

ఆ..ప్రకటనలు ఎలాటి వంటే.. వైజయంతి మాల ధరించండి..మీకు  ప్రేమలో విజయం లభిస్తుంది. ఒక రూపాయి  పెట్టుబడి తో కోట్లు సంపాదించండి., ఆ దేవాలయంలో పూజ చేయించండి..మీకు పట్టిన దోషాలు నివారణ చేసుకోవచ్చు, యంత్రం వేయించుకోండి.. శుభం జరుగుతుంది.. లాంటి ప్రకటనలు..కనబడుతూ ఉంటాయి. పత్రికల నిర్వహణకి ఆదాయవనరులు సమకూర్చుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు  సరే వాళ్ళ బాధలు వారివి. కాదనలేం.! ఇక  రంగు రంగుల రాళ్ళు ,రత్నాలు, వజ్రాలు,వైడూర్యం ధరించడం లాంటి  ప్రకటనలు సైంటిఫిక్  రీజన్ లతో ఊదరకోడుతూ మన కళ్ళని,చెవులని,ఆలోచనలని పాడుచేస్తూనే ఉన్నాయి. ఎవరి పిచ్చి వారికి ఆనందం.  
ఎవరి నమ్మకాలు,ఎవరి విశ్వాసాలు వారివి కాదనలేం.

అజ్ఞానం ని  పారద్రోలే అక్షరం చెంత ..ఇలాంటి మానసిక దౌర్భాల్యంని   పెంచే ప్రకటనలు రావడం విచారకరం అనిపిస్తూ ఉంటుంది 

కానీ   మూఢ నమ్మకాలని  ప్రోత్శాహించే ప్రకటనలు వేసేముందు ఎడిటర్స్  ఆలోచిస్తే బావుంటుంది. ఈ ప్రకటనలు..పంటి క్రింది రాయిలా ఉంటున్నాయి అంటే అతిశయోక్తి కాదు. 

 (ఒక చక్కని మాస పత్రిక అందులో కొన్ని ప్రకటనలు చూసినప్పుడల్లా.. నాకు ఇలా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ స్పందన.)

5, డిసెంబర్ 2012, బుధవారం

ఎన్ని మార్లు విన్నా...




ఎక్కడ అమ్మా..అన్న పిలుపు విన్నా .. నా బిడ్డ అమ్మా.. ! అని పిలిచినట్లే ఉంటుంది.

నిన్న 600 వ పోస్ట్ లో  ఉంచిన పాటలో ఒక చిన్న పిల్లవాడు.. అమ్మా! అంటూ పిలుస్తూ కనిపించాడు.
నేను వెంటనే .. తొలిసారి  ఆ పిలుపు విన్న  అపురూపమైన రోజులోకి వెళ్ళి పడ్డాను.

తల్లికి మాతృత్వం కన్నా..గొప్ప హోదా ఏదైనా ఉంటుందా ..చెప్పండి.?

నాకైతే అంతే!

 ఇప్పుడు  చెప్పబోయే విషయం ఏమంటే ..  తన ప్రాణమైన బిడ్డ గురించి ఓ..తల్లి ముచ్చట్లు..

  ఆ బిడ్డ సుమారు పది  నెలల వయసు ఉన్నప్పుడు ఎప్పుడూ .నీళ్ళ వైపు చేతులు చూపించేవాడు. వారి వ్యవసాయ భూమిలో దక్షిణం  నైరుతి భాగంలో ఇల్లు ఉండేది. ఈశాన్యభాగంలో  భూగర్భ జలంని పైకి తోడే బోరు బావి ఉండేది. 5 హార్స్ పవర్ మోటార్ ఉండేది. కేవలం నలబై అడుగుల లోతు  నుండే  5 ఇంచ్ పైపు నిండుగా పుష్కలంగా నీళ్ళు బయటపడుతుంటే.. చుట్టూరా అయిదు ఆరు అడుగుల వైశాల్యంలో రెండు అడుగుల లోతులో చిన్నకుంట ని తలపిస్తూ.. ఉండే ఆ వైపు వెళ్లాలని చేయి చూపిస్తూ ఉండేవాడు.

 పనులు చేసుకుంటున్నప్పుడు  బాబు ఆ వైపు వెళ్ళే ప్రమాదం ఉందని..  ఇంకా బాబుని ఎత్తుకుని ఆడి పించడా నికని  ఒక చిన్న అమ్మాయిని ఇంట్లో పెట్టుకున్నారు. ఆ అమ్మాయి పేరు గీత . ఆ అమ్మాయి కూడా బాబుని  పెద్దగా మోసేపనిలేకుండా అమ్మే బాబుని  చూసుకునేది .  ఆ అమ్మాయిని అందరూ గీతా ..గీతా అని పిలుస్తూ ఉంటె ..బాబు కూడా గీతా  అని పిలిచే వాడు. అత్త,తాత, అమ్మ అనకుండా.. గీతా అన్న మాట వచ్చేసింది.  ఇంకా గుండు ,గుండు అని కూడా అంటున్నాడు. బాబు  నన్నెప్పుడు  అమ్మా..అని పిలుస్తాడో..అన్నట్లు ఎదురు చూసేది అమ్మ.

రెండు బక్కెట్లు వేడి నీళ్ళు పోసినా నిద్ర పోడు .. . నిద్రపోతేనే కదా బలం అని అనేది  అత్తమ్మ.  బాత్ రూమ్లో స్నానం చేయించి బయటకి తీసుకు వస్తుంటే.. మోటార్ బావి దగ్గరున్న నీళ్ళ వైపు వెళ్లాలని ఏడ్చేవాడు. అక్కడికి తీసుకుని వెళ్లి రెండు నిమిషాలు నీళ్ళలో దింపి నీళ్ళతో ఆడించి తీసుకు వస్తుంటే అక్కడే ఉండాలని ఏడ్చే వాడు. ఆ ఏడుపు ఆపడానికి మళ్ళీ ఏ ట్రాక్టర్ సీట్ లోనే కూర్చోబెట్టాలి.

అలా ఒకరోజు మోటారు బావి దగ్గర ఉన్న నీళ్ళ కుంటలో కాసేపు ఆడిపించి ఇంట్లోకి తీసుకువచ్చి ఎంత మాయ చేసిననా ఏడుస్తూనే ఉన్న "చంద్ర బాబు" ని తీసుకు వెళ్లి ట్రాక్టర్ సీట్ లో కూర్చో పెట్టి.. ఒంటికి పౌడర్ వ్రాస్తుంది అమ్మ.

అబ్బాయిని మాయ చేయడానికి పౌడర్ పోసి వాడుకునే స్టీల్  డబ్బా మూత  తీసి  ట్రాక్టర్ బాయ్ నెట్ మీద బొంగరంలా తిప్పి వదిలింది. ఆ మూతకి  ఉన్న మరబోడిప  ఆధారంగా ..అలా బొంగరంలా ఒక నిమిషం పాటు తిరుగుతూ ఉండిపోయింది.ఏడుస్తున్న బాబు టక్కున ఏడుపు ఆపేసి దానివకే చూస్తూ ఉండి పోయాడు. బాబు ఆసక్తి చూసి అమ్మ మళ్ళీ  పౌడర్ డబ్బా మూత ని అలాగే తిప్పివదిలింది. . అలా తిరుగుతూ తిరుగుతూ  స్థలం చాలక  ట్రాక్టర్ బాయ్ నెట్ పై నుండి క్రిందికి పడిపోయింది

అమ్మ .. అరె పడిపోయింది  అనుకుంటూ ఉండగానే ..బాబు..నోటి నుండి ..అమ్మా.. అనే పిలుపు అమ్మకి వినబడింది. వంగి ఆ మూత ని తీయ బోయిన అమ్మ..అలా సంభ్రంగా ఆగిపోయింది.. బాబు..మళ్ళీ అమ్మా..అది అది.. అంటూ.. పిలుస్తూ దాని వైపు చేయి చూపించాడు. అమ్మ వెంటనే .. బాబుని ట్రాక్టర్ సీట్లో నుంచి తీసుకుని ..హృదయానికి హత్తుకుని ముద్దులు కురిపించింది.

బాబు నన్ను అమ్మా..అని పిలిచాడు..అని సంబరంగా అందరితో.. చెప్పింది ఆ రోజంతా..

 తన చిన్నప్పటి ముచ్చట్లు, తన చిలిపి  పనులు,అల్లరి, ఇలాంటి విషయాలు వినడమంటే బాబుకి చాలా ఇష్టం.
అమ్మ ప్రక్కన పడుకుని ..ఇంకా చెప్పు..ఇంకా చెప్పు ...ఏమి అనేవాడిని అని అడుగుతుంటాడు. అమ్మ చెపుతూ ఉంటుంది.

నేను మాటలు చెప్పిన రోజు ,నడిచిన రోజు,స్కూల్ కి మొదటి సారి వెళ్ళిన రోజు.. ఇలాంటి ముచ్చట్లు అన్నీ వ్రాసి ఉంచు.. నా పిల్లలకి నేను చెప్పాలి అంటూ ఉంటాడు.బాబు. అమ్మ అలాగే అంటుంది.

కానీ "అమ్మ" కి ముఖ్యమైన రోజు .."అమ్మా!" అని పిలిపించుకున్న రోజే కదా!

ఆ అమ్మని నేనే.   బిడ్డ ... " మా  చిరునవ్వుల చంద్రుడు"

అందుకే ఆ అపురూప క్షణాలని గుర్తు చేసుకుంటూ...  '"అమ్మా " అన్న పిలుపు కన్నా వేరొకటి మిన్న కాదు..నాన్నా..!

చిన్ని.. బంగారం .. !

ఈ అమ్మ .. నీ కోసం వ్రాసుకున్న కవిత..  అమ్మ మనసులో ..ఓ..మాట. 

బాబు ఫోటో ఎడిట్ లో తయారు చేసుకున్న చిత్రం ఇది. తను యు .ఎస్  వెళ్ళే ముందు   సిస్టం పోల్దర్స్ లో  జాగ్రత్తగా సేవ్  చేసుకుని  ఉన్న ఈ చిత్రం అమ్మకి కనబడింది . ఇదిగో.. ఇలా ఉంది ఆ చిత్రం. అర్ధమైన అమ్మకి...
కనుచెమరింతలు.


4, డిసెంబర్ 2012, మంగళవారం

ఆధీ రాత్ కో (600)


నాకు బాగా నచ్చే నటిమణి... భాను రేఖ గణేషన్. భారతీయ  చలన చిత్ర  సీమలో.. గ్లామరస్ హీరోయిన్ గా.. పేరు గాంచి..ఎవరకి అనుకరణ సాద్యం కాని  మేకప్ తో.. అరవైలలో..కూడా అందులో..సగం వయసు ఉన్నట్లు భావించేటట్లుగా .ఉండగలగటం.. ఆమె ప్రత్యేకత. ఆ రహస్యాన్ని  చేధించడం ఎవరితరం కాదు ..అన్నట్లు..ఆమె విజయ దరహాసం..ఆమెకి ఉన్న ఆభరణం.



సలాం యే ఇష్క్ మేరిజాన్.. అని నయనాలతోనే ఎన్నో..భాష్యాలు  చెప్పినా..  యే కహా ఆగయే హమ్..అని.. అమితాబ్ జీ తో..నటనలో.. జీవించినా.. నీలా   ఆస్మాన్ హో గయా..అని.. విషాదాన్ని ..గుండెల్లో దాచుకున్నా.. ఇన్ ఆన్కొంకి మస్తీ...అని ఉమ్రావ్  జాన్... గా చెరగని ముద్ర వేసినా ఆమె కామే సాటి. ఎన్ని ముద్రలో..ఆమెలో. 
వసంత సేన గా ఆమె నటనలో..జీవించిన ఈ..పాట నాకు చాలా  చాలా ఇష్టం .. ఆ పాటని పరిచయం చేస్తున్న నీ ఈ 600 వ పోస్ట్ అయి విశేషత సమకూరాలని ఈ ప్రయత్నం 

"ఉత్సవ్" చిత్రం లో.. ఈ పాట.. ఎందుకో.. చెప్పలేను.. లతా జీ మరియు ఆశా భోంస్లే  .ఇరువురి  గళ మాధుర్యం కావచ్చు..  పాట సాహిత్యం కావచ్చు. 1985 . ఫిలిం ఫేర్ అవార్డు లు.. మూడింటిని కైవసం చేసుకున్న చిత్రం. లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సమిష్టి  స్వరాలూ..ఈ..పాటలో.. వినేటపుడు  ..మనకి.. మనసుని ఉయ్యాలలూపుతాయి. ఈ చిత్రం సంస్కృత కావ్య ఆధారంగా  6 వ శతాబ్దం నాటి  మృచ కటిక తో..ఈ చిత్రం రూపొందించారని..విన్నాను. ఈ..పాట ని రేడియోలో.. వినడమే బాగుంటుంది..నాకు. కానీ..మనం వినాలనుకున్నప్పుడు..రాదు  కదా !  అందుకే  అప్పుడప్పుడు  ఇలా చూడాలి కదా! చాలా రోజులనుండి ఈ పాటకి అనువాదం  చేయాలనుకుని .. ఇప్పుటకి  కుదిరింది.  .    


ఈ పాటకి అనువాదం

మనసు ఎందుకో ..  ఊగిసలాడుతుంది
ఊగిసలాడుతుంది అర్ధ రాత్రి 

లతలు విరబూస్తున్నాయి.
లతలు సువాసన వెదజల్లుతున్నాయి అర్ధరాత్రిలో ||2||

ఎవరు వేణువు ఊదారు అర్ధరాత్రిలో
ఎవరు వేణువు ఊదారు అర్ధరాత్రిలో
వారే కనురెప్పలను ..దొంగిలించారు అర్ధరాత్రిలో


మనసు ఎందుకో ..  ఊగిసలాడుతుంది అర్ధ రాత్రి
లతలు సువాసన వెదజల్లుతున్నాయి అర్ధరాత్రిలో

పాదాలకు అలంకరించ బడిన ఆభరణం ఘల్లుమంది విను..
ఘల్లుమన్నది ఘల్లుమన్నది..అర్ధరాత్రి వేళలో

దానిని ఆహ్వానించు  ఆపకు
ఆపకు రానివ్వు.. రానివ్వు ఆపకు.. అర్ధరాత్రి సమయంలో

సిగ్గువేసింది ..అర్ధరాత్రిలో
సిగ్గు వేసింది అర్ధ రాత్రిలో

సింధూరం ధరించకుండానే నిద్రపోతావా అర్ధరాత్రిలో

లతలు సువాసన వెదజల్లుతున్నాయి అర్ధరాత్రిలో
మనసు ఎందుకో ..  ఊగిసలాడుతుంది అర్ధ రాత్రి

మాటలు చెప్పుకుంటూనే గడుస్తుందా..ఏం ? అర్ధ రాత్రి.
మాటల మనసు కళ్ళు తెరుచుకుంటాయి అర్ధరాత్రిలో ||2||

మేము ఈ వెన్నెలను సేవించాము (ఆస్వాదించాము ) అర్ధరాత్రిలో ||2||

చంద్రుడు కళ్ళలోకి వచ్చాడు..అర్ధరాత్రిలో

 లతలు సువాసన వెదజల్లుతున్నాయి అర్ధరాత్రిలో

రాత్రి కూనీ రాగం తీస్తూ ఉంటుంది అసంపూర్ణం అయిన విషయం గురించి..

అసంపూర్ణమైన విషయాలే ప్రియమైనవి..అర్ధరాత్రిలో.
అసంపూర్ణమైన విషయాలే ప్రియమైనవి..అర్ధరాత్రిలో.

రాత్రి  ఎలా పూర్తి అవుతుంది అర్ధ రాత్రిలో
రాత్రి  ఎలా పూర్తి అవుతుంది అర్ధ రాత్రిలో

రాత్రి మొదలవుతుంది అర్ధ రాత్రిలో

मन क्यों बहका रे बहका आधी रात को
 बेला महका हो
 बेला महका रे महका आधी रात को 
किसने बँसी बजाई आधी रात को
जिसने पलकें हो
जिसने पलकें चुराई आधी रात को
मन क्यों ...
बेला महका रे महका आधी रात को

झाँझर झमके सुन \-३
झमके आधी रात को
उसको टोको न रोको, रोको न टोको, टोको न रोको, आधी रात को
ओ लाज लगे रे लगे आधी रात को \-२
बिना सिन्दूर सोऊँ आधी रात को
बेला महका रे महका आधी रात को
मन क्यों ...

(बात कहते बने क्या आधी रात को
 आँख खोलेगी बात आधी रात को) \-२
हमने पी चाँदनी आधी रात को \af-२
चाँद आँखों में आया आधी रात को

बेला महका रे महका आधी रात को
मन क्यों ...

(रात गुनती रहेगी आधी बात को
 आधी बातों की प्रीत आधी रात को) \-२
रात पूरी हो कैसी आधी रात को \-२
रात होती शुरू है आधी रात को

मन क्यों ...
बेला महका रे महका आधी रात को
मन क्यों ...


2, డిసెంబర్ 2012, ఆదివారం

గమనం - గమ్యం

"విహంగ" లో.. నా కవిత    ఈ లింక్ లో 

స్త్రీమూర్తిలోని మాతృ హృదయం ఇగిరిపోయిన వేళ
డబ్బు కోసం తమ పాపలని అమ్ముకునే తల్లులు 
మనిషిలోని
మానవత్వం మంటగలసి
దానవ రూపంలో అభం-శుభం తెలియని
పసిపిల్లలపై అరాచకాలు
పైసల బేరంలో లాభాలార్జించే
అంగడి బొమ్మలుగా మారిపోతున్న అబలలు
వరకట్నపు వేధింపులతో.
అతివకి అత్తింట్లో మృత్యు వేదనాభరిత లోక
సాక్షాత్కారాలు
విషపు స్రావాలు  పుక్కిలి పట్టి
ప్రేమ పేరిట వంచించే పురుషుల పాలిటబడి
సమిధలవుతున్న పడతులు
                 
పతనమైన మానవత్వపు చివరి అంచున నిలబడి
కన్నీరు మున్నేరు అవుతున్న మగువా?
నీ పయనం ఎటు వైపు!?
అఖిలవిశ్వంలో
అర్ధభాగపు ప్రగతి మాదేనంటూ..
ఎలుగెత్తి చాటుతూ..
ఆర్ధిక స్వాతంత్ర్యపు స్వావలంబనలో
హక్కులపోరాటంలో
విశ్రాంతి ఎరుగని యోధురాలివా?
నాగరికత వెల్లవేసుకుని
వలువలూడి నేలజీరాడినట్లు 
మాన మర్యాదలు లుప్తమై ..
కనకపు సింహాసనంపై అందాల రాణివై 
వెలుగొందాలని ఆకాంక్షతో
అజ్ఞాన అంధకారంలో..మునిగి తేలుతున్నావా?  
నీ జాతి మనుగడ మృగ్యమై పోతుంటే..
అది గుర్తించ జాలక
సమానత్వపు బావుటా ఎగరవేయాలని
నీ మహత్తు గొప్పదని ఎంచి
పైకెగురలేక చతికలబడ్డావా .?
కబళించిన కరాళ దంష్ట్రలను తుదముట్టించి
బంధించిన శృంఖలాల్ని చేదించి 
                                            జ్వలితవై, ప్రజ్వలివై,దేదీప్యవై వెలుగొందు*