3, మార్చి 2013, ఆదివారం

రేగడి విత్తులు


ఈ రోజు నేను ఒక నవల పూర్తిగా చదివి తీరాలని పట్టుబట్టి కూర్చున్నాను

ఆ నవల పేరు "రేగడి విత్తులు"



 ఆ నవలని ఒక  వారం రోజుల క్రితం తిరిగి తిరిగి  చాలా ఇష్టంగా కొని తెచ్చుకున్నాను.

తానా  నవలల పోటీలో  రూ ॥ 1,20,000 లు బహుమతిగా గెలుచుకున్న మొదటి నవల.

ఈ నవలా రచయిత్రి    పైడి చంద్రలత

ప్రతి పుటలోను తెలుగు తనం ఉట్టిపడుతూ చదివిన దానినే మళ్ళీ ఇంకోసారి వెనక్కి వెళ్లి చదువుకుంటూ  దాదాపు పది గంటలు ఏకబిగిన ఆ నవలని చదివాను .

చాలా చోట్ల అరే ! మా కుటుంబం ఇందులో కనబడుతుందే అనుకుంటూ లీన మైన సందర్భాలు ఎన్నో!

నేను కదిలి కదిలి.. పోయి  దుఖించినప్పటి  తాలుకూ దృశ్యం చూడండి. దృశ్యం అని ఎందుకు అంటున్నానంటే అక్కడ వ్యవసాయం, భూమి తో ఏ చిన్న పాటి అనుబంధం ఉన్న వ్యక్తులైనా  అంతగా మమేకం కావాల్సిన రచనా భాగం  ఇది . అందులో నేను పూర్తిగా మమేకం అయిపోయాను

అదేమిటో ఇక్కడ చదవండి ..

రామనాధం తిన్నగా పొలం దగ్గరకి వెళ్ళాడు పున్నమ్మ అస్తికల మీద వేసిన మామిడి చెట్టు మహా వృక్షమై ఉంది
  ( ఈ దృశ్యమే నవల కవర్ పేజీ) రామనాధం మెల్లిగా వంగి మట్టిని చేతిలోకి తీసుకున్నాడు

ఈ మట్టి - ఈ రేగడి లోనే తన తల్లి ఒరిగింది ఈ రేగడి తల్లిలా లాలించింది ఈ రేగడి ఓ తండ్రిలా  తనకై పాఠాలు నేర్పింది ఓ  స్నేహితుడిలా  ఓదార్చింది దీనికి తనకి ఉన్న సంబంధం ఒక్క సంతకమేనా !? తన కొడుకు సులభంగా "అగ్రిమెంట్ రాసుకుందా మంటున్నాడు  ఏమని రాస్తాను అగ్రిమెంట్ ? తన ప్రాణాన్ని అమ్ముతాననా? తన తల్లిని ధారాదత్తం చేస్తాననా? తన తండ్రిని పరాయి పాలు చేస్తాననా?

రామనాదానికి చెంపలు తడి గట్టాయి

జంతు ప్రపంచానికి ఆవలగా మనిషి వేసిన మూడు అడుగులు .. బాష,వ్యవసాయం,లిపి అంటారు

ఈ నాటికి మనది వ్యవసాయ ప్రధాన దేశం వ్యవసాయమే జీవనాధారం  కానీ ఈనాడు మట్టిమీద మమకారం లేదు,వ్యవసాయం మీద ఆప్యాయత లేదు ఎక్కడ చూసినా వ్యాపార దృష్టి వ్యవసాయాన్ని వ్యాపార దృష్టితో చూస్తే ఎలా? ఓ ఏడు  ధనం కురుస్తుంది ఓ ఏడు కొట్టుకు పోతుంది  ఆటు పోట్లుకు తట్టుకు నిలబడితేనే రైతు

ఈనాడు వ్యవసాయ కుటుంబాల లోవారు డాక్టర్ లు  అవుతున్నారు ఇంజినీర్లు అవుతున్నారు వ్యాపారులు అవుతున్నారు వాళ్ళు ఏ  పని చేసినా వ్యవసాయం చేసినట్లే కష్టపడి పని చేస్తారు ముప్పై ఏళ్ళ నాడు నేను ఇక్కడ అడుగు పెట్టినట్లే ఎవడో ఒకడు రాకపోతాడా? ఈ గడ్డను బీడు కాకుండా కాపాడక పోతాడా? అంటూ ఆశావాదంతో అనుకుంటూ ఉంటాడు

ఆఖరికి  అదే పొలంలో కాపు సారా బట్టీలు పెట్టి ప్రక్కనే పచ్చగా ఉన్న పంటపై దాడి చేసి పంటని నేల  మట్టం చేసి వెళ్ళిన చోటనే .. రామనాధం ఆవేశం తో ప్రతిజ్ఞ బూనతాడు విత్తనాలతో ముడిచిన ఈ పిడికిలి దౌర్జన్యానికి లొంగదు నడిడ్డను ను వెతుక్కుంటూ వచ్చాం గని గడ్డను చేసాం మనల్ని మన గడ్డ మీదే నిలవనీయని విషాద పరిస్థితి వస్తే మరో నడిగడ్డ కు  పోదాం  ఈ భారత దేశంలో నదులకేం కొదువ ? ఈ గడ్డ  మనతో మమేకం చెందక ముందే మనం  మన గడ్డగా భావించాం మమేకం అయ్యాం తాద్యాత్మం చెందాం ఈ గడ్డ నుండి మానని వేరు చేసి చూస్తే పోరాటం తప్పదు మరో నడి  గడ్డను గని గడ్డ చేసేవరకు .. రామనాధం కంఠం ఖంగు మంటుంది

వాళ్ళు  మొక్కలని నాశనం చేసారేమో విత్తనాల్ని కాదు కదా! మళ్ళీ పొలం దున్ను కొత్త విత్తనాలు ఏద పెడదాం రేగడి విత్తులు విధ్వంసానికి లొంగవు రేగడి ఉన్నంత వరకు మబ్బు ఉన్నంత వరకు సూర్యుడు ఉదయిన్చినంతవరకు  విత్తులు మొలకెత్తు తూనే  ఉంటాయి

నా రేగడి విత్తులు చిరంజీవులు !

ఇది నవల ముగింపు

రెండు మూడు ప్రాంతాల బాష  కలసి ముప్పేటగా అచ్చు తెలుగు పదాలతొ.. ఈ నవల సరళంగా సాగి పోతుంది వ్యవసాయం లో వచ్చిన పెను మార్పులు, పంట భూములని వాణిజ్య పరంగా మార్చి వ్యవసాయం ని వాణిజ్యం చేసిన తీరు ముక్కారు పండే పంట పొలాలను చేపల చెరువులు రొయ్యలు చెరువులుగా మార్చడం క్రమేపి  వ్యవసాయం ని కనుమరుగు చేసే పరిస్థితులకి దారితీయడం లాంటి అనేక అంశాలు  ఈ నవలలో ఉన్నాయి

ఇంకా మన తెలుగు వారి  సంస్కృతి - సంప్రదాయాలు పెళ్లి ముచ్చట్లు , పాటలు , కొన్ని మూడాచారాలు అన్నీ ఉన్నాయి

హరిత విప్లవం కాస్తా జన్యు విప్లవంగా మారడం జన్యు విత్తనాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుకోవడం లాంటి విషయాలు ఎన్నో ఈ నవలలో కథ గా ఇమిడి పోయాయి .

రచయిత్రి వ్యవసాయమే వృత్తి  నేపధ్యంగా గల కుటుంబం నుండి వచ్చినందు వల్ల చాలా సునిశితంగా ఆలోచించి ఇతివృత్తంలో అనేక అంశాలని  జొప్పించి హృద్యంగా మలచగల్గారు .

ఒకటి రెండు సార్లు చదివితే కాదు,  ఈ నవల ని అనేక మార్లు చదవ గల్గితే ఇంకా చక్కని అనుభూతితో పరిచయం చేయ గలనేమో అనిపించింది కానీ ..

నా ఈ స్పందన  మీతో పంచుకుని  ఈ నవలని పరిచయం చేయాలని ఈ చిన్న ప్రయత్నం కొండని అద్దం  లో చూపినట్లు.

తప్పకుండా చదివి చెప్పండి  పుస్తక ప్రియుల అందరి దగ్గరా ఉండవలసిన నవల ఇది.

ఈ నవల  ఇచ్చట లభ్యం

విశాలాంధ్ర బుక్ హౌస్ (అన్ని ప్రదేశాలు)
ప్రభవ ప్రచురణలు (నెల్లూరు )
నవోదయ పబ్లిషర్స్ (విజయవాడ)

8 కామెంట్‌లు:

voleti చెప్పారు...

"రేగడి విత్తులు" మీద మీ భావోద్వేగ విశ్లేషణ, మీ కథ "ఆనవాలు" రెండూ బావున్నాయి.. వీలైతే రేగడి విత్తులు పుస్తకం కొనడానికి ప్రయత్నిస్తాను..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఈ కథని నేను ఇంత ఉద్వేగంగా పరిచయం చేయడానికి కారణం ఉంది ..

ఈ నవల ని పరిచయం చేయాల్సిన తీరు కూడా ఇది కాదు అని నాకు తెలుసు

సంప్రదాయ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, మెట్టిన నాకు ఇంట రైతుల కడగండ్లు తెలిసినవే ! వాణిజ్య పంటలు చేపల, రొయ్యల చెరువులు ప్రకృతి వైపరీత్యాలు అన్నీ అనుభవమైనవే ! ఆఖరికి వలస పోవడాలు మళ్ళీ అక్కడ నెగ్గలేక అమ్ముకోవడాలు అన్నీ బాధాకర అనుభవాలే! రియల్ ఎస్టేట్ ల మాయాజాలం లో చిక్కుకుని ఉన్న పొలాలని అమ్ముకుని పట్టణాల పంచన చితికి బతికి ఉండటం చాలా బాధాకరం

ఆ బాధలో నుండే నేను "ఆనవాలు " కథ రాసాను. తల్లికన్నా మిన్నగా భావించిన భూములని పరుల దారాదత్తం చేయడం కి మించిన బాధ వేరొకటి లేదు

అందుకే ఈ రేగడి విత్తులు ని ఇలా ఉద్వేగం తో పరిచయం చేసాను

నేను వ్రాసిన ఆనవాలు కథ ఈ క్రింది లింక్ లో కౌముది లో కూడా ప్రచురిత మైనది

http://vanajavanamali.blogspot.in/2013/01/blog-post_7241.html

Anil Atluri చెప్పారు...

పుస్తకం ఎక్కడ దొరుకుందో కూడా చెబితే బాగుంటుంది. ప్రచురణకర్తల చిరునామ పుస్తకంలో ఉంటుందేమో!

Bendalam KrishnaRao చెప్పారు...

విశాలాంధ్ర లో ఈ పుస్తకం అందుబాటులో వుంది

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

ఓలేటి గారు.. ధన్యవాదములు. తప్పకుండా చదవండి మీకు నచ్చుతుంది

@ అనిల్ అట్లూరి గారు సమాచారం పొందు పరిచాను ధన్యవాదములు

@ బెండలం కృష్ణా రావు గారు ధన్యవాదములు

SANJAY MENGANI చెప్పారు...

nenu challa rojula numdi try chestunanu e book kosam. kani ekkada dorakadam ledu. prints ayyipopyayi anni chepputunaru.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సంజయ్ గారు ... నవోదయ విజయవాడ వారి వద్ద లబ్యమవుతుందండీ ఫోన్ నెంబర్ 08662573500

SANJAY MENGANI చెప్పారు...

Thank you vanajamalli garu. i got the book from the said publisher. i have just started reading it.
Thank you once again.