29, ఆగస్టు 2019, గురువారం

లవ్ జె జగద్ధాత్రి ముద్ర


కొందరు రచయితలూ కవులు రచనలలోనే కాదు జీవితం జీవించి చూపడంలో కూడా ప్రేమైక స్వభావమే. ఆ ప్రేమ కోసం లోకం గీసిన సరిహద్దురేఖలను చెరిపేసి తమకు కావాల్సిన విధంగా జీవించి చూపుతారు. వద్దనుకుంటే తేలికగా జీవితాన్ని ముగించుకుంటారు. అది వారి ముద్ర ఆమె కవితలో చిన్న భాగం ఇక్కడ ..

పురాతన ధాత్రి
ఒకనాడు జన్మించింది
అందరికీ తెలిసినట్టుగానే ,
చాలా కాలం క్రితం
ఈ పురాతన ధరణి మరణించాల్సిందే .
కనుక వేడి గాలులను రేగనివ్వండి ,
నీలి కెరటాలను తీరం తాకనివ్వండి ;
ఎందుకంటే ప్రతి ఇరు సంధ్యలూ
ఇక నీవు చూడలేవు
శాశ్వతంగా.
అన్నీ జన్మించినవే
ఏవీ తిరిగి రావు మరల
ఎందుకంటే జన్మించినవన్నీతప్పక మరణించాల్సిందే!


"ప్రేమంటే శరీరంతోనో, హృదయంతోనో వేరు వేరుగా జీవించడం కాదు. దూరంగా వున్నప్పటికీ వొకరి మనసు స్పందిస్తే రెండో వారికి గుండె మెలిపెట్టినట్లు వుండటం" అని ఆమెకి అనుభవమై వొడలెల్లా కన్నీటి సంద్రమే.

ఆ సంద్రంలో ఆ క్షణంలోనే ఆమె మునిగిపోవచ్చు. - నేను వ్రాసిన కథ "రాతి హృదయం " నుండి ఈ వాక్యం.

ఈ బ్లాగ్ లో పదే పదే చదవడం చూసాను.ఎవరో ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారనుకున్నాను. కానీ అనుమానం రాలేదు. జరగాల్సింది జరిగిపోయాక యిప్పుడనిపిస్తుంది.. అయ్యో ..అని. ఆమె తన ధాత్రి బ్లాగ్ నుండి ఆ కథను పదే పదే చదివారని తెలిసింది.

 సాహితీ లోకం గురించిన తెలిసిన వారందరికీ విశాఖ జగతి గారు తెలిసే వుంటారు. జగమెరిగిన జగతి జగద్దాత్రి అనుకోవచ్చు. అందరిని ప్రేమగా పలకరించే ఆమెను మర్చిపోవడం కష్టం. సహచరుడు రామతీర్ధ గారు మరణించాక కల్గిన వొంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయం తెలియగానే షాక్ అయ్యాను

ఆమెతో ఫేస్బుక్ లో కాకుండా వ్యక్తిగతంగా మూడు నాలుగుసార్లు వ్యక్తిగత సంభాషణ జరిగిందినేనెవరో ఆమెకు పరిచయం లేకపోయినా నా  కవిత "నా ఏకాంతంలో నేను" అనే poem translate చేసారు. "మర్మమేమి" కథ తీసుకున్నారు. Translate చేయడానికని. ఈ మధ్య రేపటి టీచర్లుఅనే కథ రాసారు share చేసి Tag చేయబోతే Facebook deactivate చేసి వుంది. Call చేస్తే తీయలేదు. కొద్దిరోజులకు facebook కి మళ్ళీ వచ్చారు. నేను మంజు యనమదల కలిసి ఆమె దగ్గరకు వెళదామనుకున్నాము. ఇంతలో యిలా..  ఒంటరితనం అంత భయంకరం యింకోటి లేదు. 😞😢

జగద్దాత్రి చనిపోయిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం  గురించి అనేక సంగతులు బయటకు వచ్చాయి. అవన్నీ నాకు తెలియక ముందు యెలాంటి ఫీలింగ్ వుందో తెలిసిన తర్వాత అదే ఫీల్ నాకు. నేను జడ్జ్ చేయను. కానీ moral policing చేస్తూ యెన్నెన్నో వ్యాఖ్యానాలు. అసహ్యమేసింది మనిషి చనిపోయాక కూడా వ్యాఖ్యానించడం చూసిఒంటరితనం భరించలేక చనిపోయారు అని  అంటే అదే బాధ. ప్చ్. ఒంటరితనం వేయి కొండచిలువులు కలసి చుట్టేసిన ఊపిరాడనితనం. అందరూ జీవించడానికి రకరకాల కారణాలు వెదుక్కుంటారు ఆమె జీవించడానికి కారణమే లేదు అనుకుని ఉండవచ్చు. కవులు రచయితలు సున్నిత మనస్కులు అని నిరూపించారు 😥


ఈ కల్లోల ప్రపంచంలో రకరకాల బాధలు. మనవి కాకపోయినా యేదో బాధనాలుగైదు రోజులుగా నాలో  అలాంటి  బాధే! మనసు కృంగకుండా ప్రశాంతంగా వుండటాన్ని సాధన చేస్తున్నా.. ఆమె గురించి సానుభూతిగా వ్రాసిన మాటలు చూసి మెసెంజర్ ద్వారా కొన్ని వివరాలు అందించారు ఇద్దరు వ్యక్తులు. ఆ వివరాలు చూసిన తర్వాత కూడా ఆమెపై నా అభిప్రాయమేమీ మారలేదుకూడా!   తర్వాత నా ఆలోచనలు నాణేనికి రెండో వైపు అనుకుంటూ ..ఇలా వ్రాసుకున్నాను.

ఉబుసుపోక కాదు యీ మాటలు రాస్తున్నది. నా ఆలోచనలను వ్రాస్తున్నా! జరిగిన తప్పిదంలో పురుషుడిని వదిలేసి స్త్రీని మాత్రమే జడ్జ్ చేయడం నాకు నచ్చలేదు.

ఒకప్పుడు నా మధ్య నా భర్త మధ్య జరిగిన ఒక సంభాషణ గుర్తు చేసుకుంటున్నాను.

"ఒక పురుషుడు హటాత్తుగా చనిపోతే ప్రియురాలు కూడా వెంటనే చచ్చిపోతుంది అతనంటే అంత ప్రేమ. భార్య కావాలంటే పొర్లుగింతలు పెడుతూ గుండెలు బాదుకుంటూ యేడుస్తుంది కానీ .. అని నా భర్త.

వెంటనే.. "భార్యకు అనేక భాధ్యతలుంటాయి వాటిని వదిలేసి భర్త తో పాటే మరణించడానికి ఆ ప్రేమ అనేది అతను ఆమెకు ఏనాడైనా యిస్తే కదా.. ఆ భాధ్యతలేమిటో అతనికి తెలిస్తే కదా " అన్నాను నేను.

ప్రేమ తెలియకపోయినా పర్లేదు బాధ్యత మాత్రం అందరికి తెలిసి ఉండాలి.

ఆ బాధ్యత లేకుండా వ్యక్తిగత ఆనందం కోసం ప్రాకులాడిన వారికి అయిన వాళ్ళెవరూ మిగలరూ..సమాజమూ వారిని అర్ధం చేసుకోదు. రాళ్ళుచ్చుకుని వెంటబడి మరీ కొడుతుంది.

మనుషుల వ్యక్తిగత వివరాలు తెలియకుండా నాకు తెలిసిన వారు యిలా మరణించినవారు రెండు జంటలున్నాయి. ప్రియురాలు చనిపోయాక కొన్నాళ్ళకు ఆ పురుషుడు చనిపోవడం వొకటి అయితే రెండవది పురుషుడు చనిపోయాక అతని ప్రియురాలు విరక్తితో వొంటరితనంతో ఆత్మహత్య చేసుకోవడం.

కారణాలు ఏవైనా .. ఇలాంటి సహజీవనాలలో స్త్రీ ని వొక్కరినే తప్పు పట్టడం భావ్యం కాదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఎవరెవరో అవాకులు చెవాకులు పేలిన మాటలు వింటున్నా బాధేస్తుంది. అప్పుడిలా అనుకుంటాను.

స్త్రీలకూ వొక విజ్ఞప్తి మీ చదువులు ఆర్ధిక స్వావలంబనలూ దైర్యాన్ని ఒక్కటే కాదు విజ్ఞతను కూడా యివ్వాలి. ముఖ్యంగా మీరు తల్లిదంద్రులైతే మీరు మరింత బాధ్యతగా ఉండాలని గుర్తెరగాలి తప్ప సమాజానికి సవాల్ విసిరి బ్రతుకుతున్నాం అని గొప్పగా బోర విరుచుకుని నడిచి కడకు అనామకులుగా కడతేరిపోకూడదు. మరో రాజేశ్వరి కాకూడదు అని అనుకోవాలి అని

 ఈ విషయం అర్ధమైనా సరే అనుచితంగా కామెంట్స్ చేయకండి ప్లీజ్.. సానుభూతి చూపుతూ కూడా మనం ఆలోచించవచ్చు. పాఠాలు నేర్చుకోవచ్చు అని సున్నితంగా హెచ్చరించాను. అయినా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే వున్నారు. సరే ఒకరి అభిప్రాయాన్ని మనం మార్చలేం. ఎవరి అభిప్రాయం వారిదిగతంలో ఇలాంటి అనుభవంతోనే "జాబిలి హృదయం " కథ వ్రాసాను. ఆసక్తి ఉంటే యీ లింక్ లో చదువుకోవచ్చు.

జగతి జగద్ధాత్రి గురించి నా స్పందనను చూసిన మరికొందరు మెసెంజర్ లలో ఫోన్ కాల్స్ లో విపరీతంగా చెప్పుకున్నారు. ఆ విషయం నాకు తెలిసి నవ్వుకున్నాను. మనుషులకు ఎంతసేపు సమాజాన్ని వేలెత్తి చూపించే పని మాత్రం 24*7 కావాలి. సమాజానికి కళ్ళెం వేసి నడిపించడం మావల్ల కావాలి అన్నట్టు వుంటాయి వారి మాటలు. సంస్కృతీ సంప్రదాయం వివాహ వ్యవస్థ అనైతికం అంటూ మూకుమ్మడిగా గళాలు విప్పడం మొదలెడతారు.

నేను శుద్ద సంప్రదాయవాదినే. కానీ ఇతరుల జీవితాలను నిర్దేశించాలనో కట్టడిచేయాలనో అనుకోను. వేష భాషలందు ఆధునికంగా వుంటాను. మూఢాచారాలను నిరసిస్తూ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా నిలబడుతూ... స్త్రీ పక్షపాతిగా వుంటూనే పురుషులను సమానంగా గౌరవిస్తాను.

ప్రతి వ్యక్తికి వ్యక్తి స్వేచ్ఛ వుంటుంది. ఆ స్వేచ్ఛతో వారు బ్రతకడం వల్ల ఇతరులకు యేమి హాని జరగదు. జరగనంత వరకూ ఎవరి బ్రతుకు వారిని బ్రతకనివ్వాలి తప్ప ముల్లు కర్రతో వెనుక పొడవడం సమంజసంకాదు. జగద్దాత్రి ఆమె వ్యక్తిగత ఆకాంక్షలకు వ్యక్తిస్వేఛ్చకు ప్రతీకగా నిలిచారు. ఆమె నిర్ణయాలకు ఆమె జవాబుదారీ. యిష్టమైనట్టు జీవించడం మరణించడం ఆమె హక్కు. 

మీ అభిప్రాయం మీకున్నట్లే ఎదుటివారికి వారి అభిప్రాయాలుంటాయి. మీ అభిప్రాయమే సరైనది అనుకుంటూ యితరులను బాధ పెట్టకూడదు. సమాజం మొత్తాన్ని right track పై నడిపించాలనుకునే మితిమీరిన ఆశ నాకు లేదు ఇతరులకు వుండకూడదని భావిస్తాను.

మాటల ద్వారా పరోక్ష వ్యాఖ్యానాల ద్వారా ఒక మనిషిని బాధకు గురిచేసేంత కుసంస్కారం వుండకూడదు. అది మరీ పాపం.

పాండిత్యం వున్న వాళ్ళు పండితులు జ్ఞానం వున్న వాళ్ళు గురువులు కావచ్చు. కానీ హృదయ సంస్కారం వున్నవాళ్ళు అన్నీ కాగలరు.

ఓం శాంతి శాంతి శాంతి.

జగద్ధాత్రి  గురించి నా స్పందనతో  పాటు ఆమె మరణం తర్వాత విన్న వ్యాఖ్యానాలను ఇక్కడ ఉదహరించాను. ఇది నివాళి కాదు. ఆమె పై నా అభిమానం యిలా వుంది, లోకం తీరు యిలా వుంది అని చెప్పడమే నా వుద్దేశ్యం.
రామతీర్ధ తో తనకున్న అనుబంధం యేమిటో "ఆ కిటికీ " అనే కవితలో వ్రాసుకున్నారు. అది చదివాక కూడా మనం వారి బంధాన్ని ఆమోదించలేని కుసంస్కారం నెలకొని వుంటే మనం నిత్యం చూస్తున్న అనేకానేక బంధాల బోలుతనాన్నికూడా  గర్హించాలి అని నా అభిప్రాయం. 

ప్రేమమూర్తి జగతి జగద్దాత్రి గురించి ఆమెకు ఎంతో సన్నిహితురాలైన "సాయిపద్మ" వ్రాసిన నివాళి క్రింద క్లిప్పింగ్ లో చూడవచ్చు. 
జగద్దాత్రి బ్లాగ్ ఈ లింక్ లో .. ఆమె వ్రాసుకున్న వ్రాతలు రచనలు ఇక్కడ కొన్ని చూడవచ్చు.



25, ఆగస్టు 2019, ఆదివారం

ముగింపు వాక్యం



నీలాంజన అనే ఫ్రెండ్ ఉంది. నాతోపాటు సంస్థలో పనిచేసేది. బాగా చదువుకుంది ఎందుకో అప్పట్లో వివాహం చేసుకోలేదు యాబై రెండేళ్ళ వయస్సులో వొక రచయితను పెళ్ళి చేసుకుంది. మీ వూరులోనే వుందట.. ఈసారి నేను వచ్చినప్పుడు నన్ను ఆమె యింటికి తీసుకెళ్ళాలి అంది ఉమ ఫోన్ లో మాట్లాడుతూ.
"రచయితా, అతని పేరేమిటి ?" ఆసక్తిగా అడిగింది హేమ.
"ఏదో పేరు. నోట్లో ఆడుతుంది కానీ బయటకు రావడంలేదు. లెక్చరర్ గా చేసి రిటైర్ అయ్యాడంట. భార్య చనిపోయిన తర్వాత అరవై యెనిమిదేళ్ళ వయస్సులో ఈమెని పెళ్ళి చేసుకున్నాడు" అంది.
“ఆమెలా చేసుకుంది అంత వయస్సాయనను. గట్టిగా వున్నన్నాళ్ళు వుండి ఆఖరికి యేదో వొక ఆధారం దొరికితే చాలనుకుని కాటికి కాళ్ళు జాపుకున్న వాడిని చేసుకుంటారు. ఏం బలహీనతో యేమో, వయసు పెరిగే కొద్ది వొంటరిగా బ్రతకలేమన్న భయం ప్రవేశిస్తుందేమో మరి" విసుక్కున్నట్టు అంది హేమ.
"నువ్వన్నది నిజమే, ఎమ్ ఏ చేసింది. ఆంగ్లం హిందీ మీద మంచి పట్టున్న మనిషి. మంచి ప్రసంగాలు చేసేది. ఆమె మాట్లాడుతుంటే హాలంతా పిన్ డ్రాప్ సైలెన్స్. ఊపిరి పీల్చుకోకుండా 45 నిమిషాలు, సమయమిస్తే యింకా యింకా మాట్లాడేది. సడన్ గా ఆ రచయితను పెళ్ళి చేసుకుని గృహిణిగా స్థిర పడింది. ఆ పెళ్ళి కూడా బంధువులు కుదిర్చి చేసారంట. తమ్ముళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల మధ్య బాగానే ఉండేది. తర్వాతెందుకోవుండలేకపోయింది. ఒకసారి వెళ్లి చూసి రావాలి నువ్వు తీసుకెళ్ళాలి తప్పదు అంది.
"ముందు నువ్వు నీ కొలువుకి సెలవులిచ్చి రావమ్మా, కనీసం పది రోజులైనా వుండాలిక్కడ, లేకపోతే వూరుకోను" అంది హేమ.
*****************
"సరేలే .. నీ వుద్యోగం ఎలా వుంది?. బాగానే సంపాదిస్తున్నావ్. బరువులు తగ్గాయి. ఇక పెళ్ళి చేసుకోరాదు ఈ రోజుల్లో అమ్మాయిలకు భలే డిమాండ్ వుందిలే. అదే అబ్బాయిలైతే ముప్పై దాటితే పెళ్లవడం కష్టంగా ఉంది" అంది హేమ
"సుఖంగా వున్న ప్రాణానికి పెళ్ళి ఆలోచన యెందుకులే ? ఇప్పుడీ వయసులో చేసుకుని సాధించేదేముంది చెప్పు? చేసుకోదల్చుకుంటే సంస్థలో మాతోపాటు పనిచేసేవాళ్ళనే చేసుకుంటాను. ఆలోచనా విధానం దగ్గరగా వుంటుంది. కాస్త సేవ చేసేందుకు అనుమతి వుంటుంది."
"అయితే ఆలోచనలు కలిస్తేనే పెళ్ళి చేసుకుంటానంటావ్,"
"ఎక్కడో అయినవాళ్ళకు దూరంగా మెయిడ్ గా పనిచేసే బదులు మంచి స్థితిపరులైన రెండో సంబంధం వాడిని చేసుకుని సుఖపడటం నేర్చుకో అని అమ్మ గొడవ పెడుతుంది. రెండు మూడు సంబంధాలున్నాయి కూడా. నా మనస్తత్వం నాకు తెలుసు ఆలోచనలకు ముల్లు గుచ్చుకుంటే పోట్లాడతాను. అదే మనసుకు గుచ్చుకుంటే నొచ్చుకుని దూరంగా జరుగుతాను. ముడుచుకుని ఒంటరినై పోతాను. నాలాంటి వాళ్లకి పెళ్ళి అవసరమా ?"
"నీకవసరం లేదేమో కానీ లోకానికి అవసరం. రెండో పెళ్ళి చేసుకునే పురుషుల క్యూ చెంతాడంత వుంటుంది. పాపం వాళ్ళ పై జాలి చూపిస్తావని చెపుతున్నా" అని కొంటెగా అంది హేమ
"మరీ చిన్నపిల్లవైపోతున్నావ్" అంటూ హేమ వీపుపై గట్టిగా చరిచింది.
"ఆడదానికి పెళ్ళి అనే వల పడటానికి వయసుతో పనేమీ లేదులే. 80 యేళ్ళు వచ్చాక కూడా పెళ్ళి సంబంధాలు వస్తాయి. అంత డిమాండ్ వుంది, దిగులు పడకు" అంది హేమ మళ్ళీ కొంటెగా .
ఉమకి ఆ మాటల్లో లోతు అర్ధమై ఆపకుండా నవ్వింది.

 "ఇలాగే నవ్వు. నీ నవ్వు చూసి ఎవరో వొక బాలా కుమారుడు యేదో వొకనాడు నిన్నెత్తుకుపోయి తన వంటగదికి పట్టమహిషిని పడక గదికి వేశ్యను చేస్తానంటాడు చూడు" అంది హేమ.
"ఆ ఊబి లో నేనెప్పుడూ పడనులే కానీ , వొకసారి నీలాంజన దగ్గరకు వెళ్ళి వద్దాం ప్లీజ్ ప్లీజ్ .. ."
"ఎందుకు తన అనుభవాలు చెపుతుందని, తెలుసుకోవాలనే ఆసక్తి కదూ నీకు. మొత్తానికి గ్రౌండ్ వర్క్ బాగానే చేస్తున్నావ్ అయితే త్వరలో పప్పన్నం పెడతావ్" అంది.
"అదేమీ కాదులే చాలా సంవత్సరాలైంది చూసి. మంచి మనిషి. వెళ్ళాలి తప్పదు" అభ్యర్ధనగా చూసింది ఉమ..
తను తెచ్చిన నీలాంజన నెంబర్ కు ఫోన్ చేస్తే గుర్తుపట్టి సంతోషంగా మాట్లడింది. ఇంటికి రమ్మని ఆహ్వానించి పదేళ్ళకి పైగానే అయిందిగా నన్ను చూసి గుర్తు పడతావో లేదో నాకు శరీరమంతా సొరియాసిస్ వచ్చింది అని చెప్పింది.
"అయ్యో అలాగా" అని ఊరుకుంది ఉమ
నాలుగు రోజుల తర్వాత వీలు చూసుకుని నీలాంజన చెప్పిన అడ్రెస్స్ కి చేరుకొని కాల్ చేస్తే మూడు రోజులనుండి హాస్పిటల్ లో ఉన్నాం. భర్తకి బాగోకపోతే హాస్పిటల్ లో జాయిన్ చేసాను అని చెప్పింది.
హాస్పిటల్ వివరాలు తెలుసుకుని యిద్దరూ అక్కడికి వెళ్ళారు.అతను ఐ సి యూ లో వుంటే ఆమె కారిడార్ లో పడిగాపులు పడుతూ కనిపించింది.
"ఎలా ఉండేవారు నీలాంజన. మిమ్మల్నిలా చూస్తానని యెన్నడూ అనుకోలేదు" అంది ఆమెని సానుభూతిగా చూస్తూ.
"రెండేళ్ళ నుండే ఇలా మొదలైంది'' అంది విచారంగా.
విపరీతమైన మానసిక వొత్తిడి వుంటేకూడా సోరియాసిస్ వస్తుందని డాక్టర్స్ చెపుతుంటే వింది హేమ. ఆమె కూడా ఆ జాబితాలో మనిషని గ్రహించేసింది.
"మీరు కష్టంలో వున్నారు. రాకూడని పరిస్తితుల్లో వచ్చినట్టున్నాము క్షమించండి" అంది హేమ.
"పర్లేదండీ అభిమానం ఉండబట్టేగా వెతుక్కుని మరీ వచ్చారు. ఉమ కూడా యెక్కువ రోజులు ఉండటానికి వీలవుతుందో లేదోనని రమ్మన్నాను".
"మీ వారి వయస్సు మరీ అంత మీద పడలేదు ఇంకొంత కాలం జీవిస్తే మంచి సాహిత్యం వస్తుందేమో ఆయన కలం నుండి" అంది.
"ఒకపుడు మీలాగానే నేను భ్రమపడినదాన్నేనీళ్ళ గురించో ఆడదాని కన్నీళ్ళ గురించో పన్నీరు గురించో ఆకట్టుకునే కథలు వ్రాయగలరు కానీ భార్యను బాధించని వాళ్లుంటారా” అంది నిర్లిప్తతంగా.
గాలి జొరబడని హాస్పిటల్ కారిడార్ లో వరుస కుర్చీలలో కూర్చుని తన మనసు ఉక్కపోతని స్నేహితురాలు ఉమ ముందు దూసిపోసింది నీలాంజన.
"రెండో పెళ్ళి చేసుకునే పురుషుడు చెప్పే అతిశయాల ముందు.. సినిమా పాటల్లో ప్రేమికుడు పాడే అతిశయాలు కూడా పనికిరావనుకో.".
హేమకు ఆమాట వింటుంటే ప్రియా ప్రియా చంపొద్దె అనే పాట గుర్తుకొచ్చి పెదవులపై నవ్వులు విరబూసాయి.
నీలాంజన చెప్పుకుపోతుంది అలాంటి మాటలకు కళ్ళు మూసుకుపోయి తమకి తాము అన్యాయం చేసుకుంటున్నారు ఆడవాళ్ళూ. ఈయన విషయానికే వస్తే రచనలు ఆదర్శంగా ఉంటాయి కదా, మనిషి కూడా అలాగే ఉంటాడనుకున్నా, మొదటి పరిచయం గుడిలో. నా అవివాహ జీవితాన్ని గురించి మాట్లాడి జీవితాన్ని పండ బెట్టుకోవాలి కానీ యెండ బెట్టుకోకూడదు అని చెప్పాడు. నీ సంపాదనకు అలవాటు పడ్డ మీ వాళ్ళు పెళ్ళి చేసే ఆలోచన వున్నట్టు లేదు. నువ్వు బిడియాలను వొడకట్టేయాలి. కావాల్సినదానికొరకు పెదవి విప్పాలి అని ఉద్బోధ చేసాడు. తరచి చూసుకుంటే కొన్ని మాటలు సత్యానికి దగ్గరగా అవును కదా అనిపింపజేసాయి. ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాను. నిలువునా పూచిన కొమ్మనై అతని దరి చేరాను. అతనేమో తన శృంగార యజ్ఞంలో నేనొక సమిధను అనుకునేవాడు. అతను నాకు గొడుగయ్యాడు అనుకున్నా . ఆయనేమో నాకు పైటయ్యాను అనుకునేవాడు. ఇంకా తానొక దీనజన బంధువును అనికూడా చెప్పుకునేవాడు. వివాహానికి పూర్వం గుండెల్లో పెట్టుకుని దేవతలా పూజించుకుంటాను అని వాగ్ధానం చేస్తారు కానీ నరకంలో దేవతలుండలేరు అని పురుషులు యెప్పటికి తెలుసుకోలేరు" అంది ఆవేదనగా.
మనిషికి అణువణువునా అహంకారమే.. ఏ పని స్వతంత్రంగా చేయడానికి వీలులేదు. ఏ చిన్న పని చేయబోయినా నిన్నెవడూ చేయమన్నాడు అనడం పరిపాటి. అతను తాగకుండా కాఫీ తాగడాన్ని కూడా తప్పు పట్టేవాడు. రెండుపూటలా కూరేమి చేయమంటారు అని అడిగి చేయాలి. అతను సంతృప్తిగా తిని చేయికడిగాక తుడుచుకోవడానికి నాప్కిన్ అందించి వక్కపలుకులు అందించాక కానీ భోజనానికి కూర్చోకూడదు. కంచాలు కంచాలు లాగిస్తూ కూర్చోకుండా.. త్వరగా రా, కాళ్ళు పట్టాలి అనేవాడు.
వింటున్న హేమ ముఖం చిట్లించింది. ఉమ యింకా చెప్పమన్నట్టు ఉత్సాహంగా చూసింది
పెళ్ళి చేసుకుని నాలుగేళ్ళైనా తన పెన్షన్ వివరాలలో నామిని కాలమ్ లో భార్యగా నా పేరు వ్రాయించడానికి యేవో కుంటి సాకులు చెప్పేవాడు. అడిగినవారికి అడగనివారందరికీ ఈ వయస్సులో పెళ్ళి చేసుకోవడానికి పెద్ద కారణమేమిలేదు. ఒక అభాగ్యురాలికి నీడనిచ్చి నా తర్వాత కూడా కాస్త డబ్బులొచ్చే యేర్పాటు చేద్దామని యిలా చేసాను అనేవాడు. ఈ వయసులో నాకు పెద్ద కోరికలేమి వుంటాయ్, అన్నీ ఆమెతోనే కడతేరి పోయాయి అనేవాడు కాస్త వైరాగ్యం నటిస్తూ. అతని అభ్యుదయపు కబుర్లు విని “విన్నావు కదమ్మా, ఆయన్ని బాగా చూసుకో పిల్లాజెల్లా కూడా లేరు మనసులో మాట చెప్పుకోవడానికి నాలుగురోజులుండి రావడానికి” అని అనేవారు ఆ వచ్చినవాళ్ళు.
నేనే ఆఫీస్ చుట్టూ తిరిగి వివరాలిచ్చి నామిని పేరుగా ఎంటర్ చేసుకుని వస్తే నీకు అన్ని తెలుసే. బాగానే పనులు చేయించుకోవడం తెలుసు. లంచంగా యేమిచ్చావ్ ముద్దా కౌగిలా.. అని అసహ్యంగా మాట్లాడేవాడు. తరచూ నా ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కనివ్వను నీకు, అనాధశరణాలయానికి రాసేస్తాను అనేవాడు. రచయితలు కూడా ఇలాగ వుంటారా అని ఆశ్చర్యపోయేదాన్ని అని వాపోయింది నీలాంజన.
"రచయితల్లోనే పైత్యం ఎక్కువ కనబడుతుందిపుడు. సంప్రదింపు మార్గాలు సులువయ్యాక ఓ రాయేసి చూద్దాం అనుకోవడం మొదలెట్టారు. నా అనుభవంలోకి వచ్చిన ఇద్దరు ముగ్గురు గురించి చెపుతాను వినండి"..
"పత్రికలో వచ్చిన కథ బాగుంది అంటూ వొకతను ఫోన్ చేసాడు. అతను కూడా వొక రచయిత అంట. బోలెడంత లిస్ట్ చెప్పాడు. అందులో నేను చదివినవీ వున్నాయి. అందుకనే అపుడు కాస్త యెక్కువగా మట్లాడాల్సివచ్చింది. కొన్నాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసాడు కథల గురించే అన్నాడు. వ్యక్తిగత వివరాలు అడిగాడు. విడో ని అని పిల్లలు దూరదేశాల్లో వున్నారని చెప్పాను. దాచుకోవాల్సింది వుందని తర్వాత తెలిసింది. మళ్ళీ కొన్నాళ్ళకు ఫోన్ చేసి విడోవర్ అని.. మీకు అభ్యంతరం లేకుంటే వొక విషయం అడుగుతాను అన్నాడు కాస్త సంస్కారంగా. అడగండీ అనగానే మిమ్మలను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. కోపం తన్నుకొచ్చింది. వాడికి నా వాసం గ్రాసం గురించి యేమైనా చెప్పానా? ఎంత దైర్యం? తమాయించుకుని క్షమించండి నాకలాంటి ఆలోచన లేదు అని సున్నితంగా ఫోన్ పెట్టేసాను. వాడు తర్వాత కూడా ఫోన్ చేస్తూనే వున్నాడు. బ్లాక్ లిస్ట్ లో పెట్టేసా."
"అలాగే ఇంకొకతను పేరు చెప్పనులే, గవర్నమెంట్ సర్వీస్ లో వున్నాడు. సాహితీ ప్రియుడైతే మనసారా అభినందిచకమానం. కానీ ఆ ముసుగేసుకుని వేటాడేరకం. ఏదో వొక సాహిత్యకార్యక్రమంలో చూసి వివరాలు సేకరించాడు. మిమ్మలను చదివాను. ఓ పిల్ల తెమ్మెర తాకితే చాలు మీ చూపులను గుర్తుకు తెచ్చింది అంటూ పైత్యం వెళ్ళగక్కాడు. కవి కదా మరి. మరొకరోజు మన వేవ్ లెంగ్త్స్ కలుస్తున్నాయి. మిమ్మలను చూసే కొలది నాకేదో Spirit inject అవుతుంది. నా జీవితకాలమంతా వెతుకుతున్నా యిటువంటి వ్యక్తికోసం. మీరు ఊ అంటే ప్లాట్ కారు అన్నీ యేర్పాటు చేస్తాను. మనసైనపుడు కలుస్తూవుంటాను అని రహస్య నెంబరు నుండి మెసేజ్ పెట్టాడు. అసహ్యమేసింది. ఇలా మీ యేర్పాటులలో మీరుంటే మీ భార్య తనకు వేవ్ లెంగ్త్స్ కలిసే వాళ్ళ కోసం వెతుక్కోవచ్చు జాగ్రత్తండీ.. అన్నాను. ఈ చిత్తకార్తె కుక్కల సొంగలు ఫోన్ ద్వారా యిలా కారుతూ వుంటాయి. ఆడది వొంటరిగా వుంటుందని తెలిస్తే చాలు పడకగదికో వంటగదితో పనికొస్తుందని చిత్తచాపల్యమో నాలుక చాపల్యమో గుర్తుకొస్తాయి యిలాంటివాళ్ళకు" అని కసి తీరా తిట్టింది హేమ .
కాసేపు మౌనం రాజ్యమేలింది.
చెవి ప్రక్కన తలానించి చిన్నగా ఇలా జరిగిందని నాకెప్పుడూ చెప్పలేదే? అంది ఉమ.
"నువ్వు మంచి మనిషివి అనిపించలేదు అందుకే చెప్పలేదు" అంది హేమ నవ్వుతూ వాతావరణాన్ని తేలిక చేయాలని. 
మళ్ళీ కొనసాగిస్తూ ...ఇంకొకరి అనుభవం కూడా చెపుతున్నా వినండి. ఆమె తొలిమలిగా కథలు వ్రాస్తున్నరోజులు. ఆమె వ్రాసిన కథకు మంచి పేరు వచ్చింది. ఒక సాహిత్య భాంధవుడు ఆమెను కలిసి మట్లాడాడు. మీరేదో వార్షిక కథల సంకలనాలు వేస్తారటగా. అందులో నేను వ్రాసిన కథ వేయడానికి అవకాశం వుంటుందా అని అడిగిందట. అప్పటికి అతను నవ్వి వూరుకున్నాడు. మర్నాడు ఆమె పని చేస్తున్న ఆఫీస్ నెంబర్ కి ఫోన్ చేసి .. నీ కథను తీసుకుని డిన్నర్ కు రా ... మంచి చెడ్డా మాట్లాడుకుందాం అన్నాడట. ఇదేమిటి ఇలా అంటున్నాడు. కనీసం ఫ్యామిలీతో కలిసి రా అని అనకుండా వొంటరిగా రమ్మంటాడేమిటీ కథను గురించి నాతో చర్చించేది ఏముంటుంది.. అ కథపై అప్పటికే వేదికలపై బోలెడంత చర్చ జరిగింది అనుకుని అనేక అనుమానాలతో వెళ్ళకుండా వుండిపోయింది. అప్పుడే కాదు తర్వాతెప్పుడూ కూడా ఆమె కథ ఆ సంకలనాలలో రాలేదు అని చెప్పింది.
అంతలో "పిన్నీ.. ఏవో మెడిసన్ కావాలి అంటున్నారు. వెళ్ళి పట్టుకొస్తాను" అంటూ వచ్చింది వొక యువతి. నీలాంజన హ్యాండ్బేగ్ తెరిచి కొంత డబ్బు ఆమెకి యివ్వబోయింది. భలేదానివి పిన్నీ! ఈ మాత్రం నేను ఖర్చు పెట్టకూడదా? నువ్వు తొందరపడి నగలు అమ్మేసి డబ్బులు తెచ్చావు. ఆయన అదృష్టం అది. జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన మీరిద్దరూ కూడా కర్పూరంలా కరిగిపోయే గుణం వున్నవారు” అని లి్ప్ట్ వైపు అడుగులు వేసింది.

"అదేంటి? మీ వొంటి మీద బంగారం అమ్మేసారా? "ఆశ్చర్యపోయింది ఉమ.

"మరి ఏం చేయను. ఎటిఎమ్ కార్డ్ కనబడుతున్నా ఏమీ చేయలేకపోయాను పిన్ నెంబర్ కూడా తెలియదు".. అంది నిస్సహాయంగా..

"ఎవరామె, ఏమవుతుంది మీకు? మళ్ళీ ఉమ ఆరా.

"పెంపుడు కూతురు. మొదటి భార్య చెల్లెలి కూతురు. బెంగుళూరులో వుంటుంది. వుద్యోగానికి సెలవు పెట్టి వచ్చింది. మా పెద్దమ్మను కూడా క్షణక్షణం యిలాగే సాధించి పెట్టేవాడు. పుణ్యాత్మురాలు జబ్బు చేసి యీ బాధలనుండి విముక్తి పొందింది అంటుంది యెపుడూ."
అసలేం జరిగిందంటే పది రోజుల కిందట బేగ్ కి బట్టలు సర్దుకుని వెళ్ళిపోయాడు. అభిమాని నడుపుతున్న వృద్ధాశ్రమంలో ప్రశాంతంగా బ్రతుకుతానని. వేసుకునే మందులు కూడా చేతిలో పెడితే కాని మింగని ఆయనకు వేడి వేడిగా రుచికరంగా యెవరొండి పెడతారక్కడ? గంట మోగినపుడు వెళ్ళి కూర్చుని తినిరావడం సౌకర్యాలు లేకపోవడం చూసి విసుక్కుంటుంటే యిక్కడ యిలాగే వుంటాయ్. మీకిష్టమైతే వుండండి లేకపోతే దయచేయండి అన్నాడట ఆ శిష్యుడు కమ్ అభిమాని. వెంటనే పెట్టె సర్దుకుని వచ్చేసాడు. నేను వివరాలేమీ అడక్కుండా మాములుగానే వేణ్ణీళ్ళు పెట్టి స్నానం చేస్తుంటే ఒళ్ళు రుద్ది.. గబగబా వంట చేసి వడ్డించాను. తిని త్రేపుతూ అక్కడిలా జరిగింది అని చెప్పి.. మళ్ళీ నీ పాపిష్టి చేతి కూడు తినాలని నాకు రాసి పెట్టి వుంది. అందుకే వచ్చానన్నాడు.

పన్నెండేళ్ళలో యెన్నడూ యెదురుమాటాడని యెప్పుడూ వొక మాట కూడా అనని నేను కడుపు మండి “మరి యెందుకు వచ్చారు? ఆ బేరేజీ యెక్కి కృష్ణలో దూకేపని కదా” అన్నాను. నావైపు క్రోధంగా చూసి వేలు చూపిస్తూ “నువ్వెవరవే నన్నుచావమని చెప్పడానికి ? చెప్పడానికి కూడా అర్హత వుండాలి అది తెలుసుకో ముందు " అని అంటూ చొక్కా తొడుక్కుని కిందకి వెళ్ళారు. కాసేపటి తర్వాత వచ్చి పడుకున్నారు. నేను పుస్తకం చదువుకుంటూ హాలులో పడుకున్నాను. ఓ గంట గంటన్నర తర్వాత మందులిద్దామని గదిలోకి వెళితే నురగలు క్రక్కుతూ కనబడితే కంగారు పడి అంబులెన్స్ కు ఫోన్ చేసాను. ప్రక్కనే కొత్త నిద్రమాత్రల సీసా ఖాళీగా కనబడింది.

ఆయన తమ్ముళ్ళకు ఫోన్ఆ చేసాను. ఆత్మహత్యా ప్రయత్నం చేసాడని చెప్పుకుంటే మనకే నగుబాటు అలా అని చెప్పకు. ఊపిరి అందడంలేదు అని చెప్పు. వెనక ముందు మేము వస్తాం అన్నారే కానీ వొక్క తమ్ముడూ రాలేదు. మరొకసారి ఫోన్ చేస్తే ఆయనేమన్నా తక్కువాడా! పిల్లల్లేరు ఆస్తిలో భాగం యెందుకు, చిన్నాచితకవాళ్ళం, మా పిల్లలకు వుంటుంది అంటే విని వుదారం చూపాడా? పైగా నా వాటా వాళ్ళకెందుకివ్వాలని అసహ్యంగా మాటలు జారిన అహంకారి. ఎలాగూ పోతే రావాలిగా, అప్పటికి వస్తాంలే అన్నారు.

“పురుషులందు రచయిత పురుషులు వేరు కాదయా. అందరూ ఆ దుంపలో వాళ్ళే! కాకపోతే కొంతమంది మరీ దురద దుంప లాంటి వారు ఈయన లాగా” అంది హేమ.

”కట్టుకున్న వాడు ఎలాంటి వాడనేది కాదు, మగవాడితో ముడిపడిన ప్రతి ఆడదాని కథ కంచి కెళ్ళని కథే కదా.. కాటికెళ్ళేదాకా వాడి చుట్టూరే తిరుగుతూ వుంటుంది” నిర్వేదంగా అంది నీలాంజన.

ఉమను ఎలాగోలా పెళ్ళికి ఒప్పించమని వాళ్ళమ్మ చెప్పిన విషయాన్నియింతటితో మర్చిపోవాలనుకుంది హేమ

ఆ సాయంత్రానికి నలుగురు డాక్టర్ల మూడు రోజుల విశ్వప్రయత్నం తర్వాత అతనిప్పుడు సేఫ్. మీరెళ్ళి చూడొచ్చు అన్న డాక్టర్ మాట నీలాంజన కళ్ళలో వెలుగురేఖను గీసింది.

నీలాంజన భర్తను చూడటానికి వెళ్ళబోతుంటే నువ్వు కూడా వెళ్ళు అని ఉమ వైపు చూసి సైగ చేసింది హేమ.

"ఇలాంటి దుర్మార్గుడిని చూడాటానికి అసహ్యమేస్తుంది. నేను వెళ్ళను కానీ నువ్వెళ్ళు" అంది ఉమ గుస గుసగా .
వడి వడిగా నడిచి నీలాంజనతో పాటు హేమ కూడా లోపలకి వెళ్ళింది. కళ్ళు మూసుకునే వున్నాడు ఆమె భర్త. నీలాంజన అతని చేతిమీద అరచేతిని ఆన్చి నెమ్మదిగా కదిపింది. అతను కళ్ళు తెరచి ఎదురుగా వున్న ఆమెని చూడగానే . "... డా, నన్నెందుకు బతికించావే హాయిగా చావనీయకుండా, నీ చేతి పాపిష్టి కూడు తినడానికా" అన్నాడు క్రోధంగా.

సెలైన్ పెట్టబోతున్న నర్స్ బాటిల్ వదిలేసి గిరుక్కున తిరిగి ఆమె వైపు చూసింది. ఆక్రోశంతో ఒకవిధమైన కీచు గొంతుతో ఆమె అరిచిన అరుపు ధబ్ మన్నసెలైన్ బాటిల్ శబ్దంతో పాటు కలిసిపోయింది. తర్వాత ముఖాన చేతులుంచుకుని గట్టిగా యేడుస్తూ గోడని ఆసరాగా చేసుకుంది నీలాంజన.

“కొన్ని భావ ప్రకటనలను రికార్డ్ చేయడానికి భాష సరిపోదు” బాధగా అనుకుంది హేమ.

*********0********

24, ఆగస్టు 2019, శనివారం

రోజు వారి ఆలోచనలు కొన్ని...



రోజు వారి ఆలోచనలు కొన్ని...
వచ్చే పండగ కోసం సరిగా నిద్రపోని గత రాత్రి ఇవాళ త్వరగా పడకేసింది అలసిన కనురెప్పలపై మస్కారాలా పూసుకున్న సంతోషాన్ని తుడవకుండానే.
****
వాన వాసన వాన శబ్దం యెరిగి వుండటానికి ఓ ఏడాది వయసు చాలునేమో బిడ్డకు
తలపులవానలో తడిసి ఆరడమంటే యేమిటో మీద పడుతున్న ముదిమిలో కూడా తెలియకపోవడమన్న దురదృష్టం ఇంకొకటి లేదు మనిషికి.
******
లిఫ్ట్ లో నుండి ఘాటైన పరిమళం ఏ అదుపు ఆజ్ఞ లేకుండా వంటింటిదాకా జొచ్చుకుని వచ్చినట్టు మనుషులు రాలేరు కదా.. గుండెలో అడుగుల సడి ముద్రింపబడితే తప్ప.
******
దేహంపై యవ్వనం చిగురులు తొడుగుతుంది ఏ చినుకుకూ తడవకుండానే. రాలే కాలానికి జడివానక్కూడా యెన్నిమార్లు తడిసినా రానేరాదు పాపం!
23/08/2019. 11:10 PM.

21, ఆగస్టు 2019, బుధవారం

కొత్త బాటలో నేను




నేను రచయితను. నా ఆత్మ స్థైర్యాన్ని యెవరూ దెబ్బతీయలేరు.

ఒక పత్రిక వారి నుండి ఏడు కథలు తిరిగివచ్చాక కూడా నేను రచనలు చేయకూడదు అని అనుకోను..
ఈ మాటలు వెనుక ... చాలా వుంది. అది యేమిటంటే...తిరిగివచ్చిన ఏడవ కథ గురించి చిన్న వివరణ..

రచయితల పాత్రలతో కథలు రాస్తే పత్రికలు యెందుకని ప్రచురించవు? రచయితలు అందరూ కథలలో నెగెటివ్ పాత్రలు కాదగని వుత్తమోత్తమలు అయిపోతారా? నీరు గురించి పన్నీరు గురించి కన్నీరు గురించి కరుణ రసాత్మక కథలు రాసి పాఠకలోకంలో ఆహా ఓహో అనిపించుకున్న రచయితల ముసుగులో గోముఖ వ్యాఘ్రాలు వున్నాయని యెందరికి తెలుసు. ఏం రచయితలు ఆకాశం నుండి వూడిపడ్డారా..? మాములు మనుషుల్లాగానే వారిలోని నెగెటివ్ అంశాలు గురించి ఇంకా అనేకమంది రచయితల వాచాలత గురించి రచయితలు పెట్టే గృహహింస గురించి కథలు వ్రాయకూడదా... అవి సామాజిక ఇతివృత్తాలు కాదా? నాకు సందేహాలున్నాయి.

పత్రికల ఎడిటర్స్ కొంతమంది కథలను ప్రచురించడంలో అతిప్రేమ కొంతమంది రచనలను తిరస్కరించడంలో అత్యుత్సాహం .. ఏమిటీ వైపరీత్యం. ఒక పత్రిక ఒక రచయిత వ్రాసిన కథలను పదే పదే తిప్పి పంపడం.. యెందుచేత? ఆ పత్రికకు ఏడు కథలు పంపితే .. కథలన్నీ తిప్పి పంపితే ఆ కథలలో నాలుగు కథలు వేరొక పత్రికల్లో ప్రచురింపబడితే.. దానికి అర్దం యేమిటి? కాస్త బాగానే ఆ రచయిత వ్రాస్తున్నట్లు అర్దమే కదా! వేరు వేరు ఒంకలు చెప్పి.. కథలు తిప్పి పంపడంలో ఔచిత్యం వారికే తెలియాలి.

వారికి యిష్టమైతే పర్సనల్ మెయిల్ ఐడి ద్వారా వెళ్ళిన కథలు.. కేవలం పదిహేను రోజులలో పత్రికలలో ప్రచురితం. ఇష్టం లేని వారి రచనలు సంవత్సరం అయినా డస్ట్బిన్ పరం. ఈ పత్రికల వారి తీరు గర్హనీయం. రచయితలు గొంతు విప్పాలి. రచయితలకు కనీస గౌరవం యివ్వకుండా నిర్లక్ష్యధోరణి ప్రదర్శించడం మానుకోవాలి.

రచయితలూ స్పందించండి.. ఈ సాహిత్య రాజకీయాలను ఖండించండి. పత్రికలకు చందాలు కట్టడం ఆపేయండి.

ఇష్టానుసారంగా ప్రచురించుకునే రచనలు చదవాల్సిన అవసరం లేదు. పట్టుకుని వేలాడాల్సిన పని లేదు. వేదికలు మనమే సృష్టించుకోగలం. ..
 — 

feeling positive.
అందుకే ..ఈ నిర్ణయం ..పత్రికలు తిప్పి పంపిన కథలను యిక్కడ ప్రచురిస్తాను. 

వర్షం కురుస్తున్న రోజు తెరల వెనుక నిలబడి.. అబ్బ .. ప్రకృతి యెంత ఆహ్లాదంగా వుంది వాన ఆగినాక వచ్చే ఎండ మధ్య విరిసిన ఇంద్రధనస్సు యెంత బాగుంది అనుకుంటూ ఆహ్లాదపడిపోతుంటాం. ఆ వర్షం కురిసిన రోజు బీదాబిక్కి కట్టుబట్టలతో రోడ్డునపడి తలదాచుకోవడానికి చిన్న నీడ లేక ఆకలికి తాళలేక చావు రాక నిస్సహాయ స్థితిలో బ్రతకాల్సి రావడమనేది పాపమో శాపమో ... తెరలు తీసి అదే మనసు తెరలు తీసి చూడలేని మనుషులకు అర్ధం కాదు.అదిగో అలాంటి స్థితిలో వున్న వాళ్ళ ఆక్రోశాన్ని ఆవేదనను వెల్లడించే కథలు. అవి నీటి కథలు, కన్నీటి కథలు, పొడారిన బతుకు కథలు మధ్యతరగతి స్త్రీల మందహాస కథలు.
మొత్తం 12 కథలు వున్నాయి. ఇక్కడే ప్రచురిస్తాను ... ముగింపు మాత్రం ఇవ్వను .. పుస్తక రూపంలో వచ్చాక ముగింపు చదువుకోవాల్సిందే మరి.
Beyond the blinds.. శీర్షికన ... ప్రతి ఆదివారం ఒక కథ ..
25/08/2019 న ... మొదటి కథ .... "ముగింపు వాక్యం " తో ..మొదలు ...
tagవర్షం కురుస్తున్న రోజు తెరల వెనుక నిలబడి.. అబ్బ .. ప్రకృతి యెంత ఆహ్లాదంగా వుంది వాన ఆగినాక వచ్చే ఎండ మధ్య విరిసిన ఇంద్రధనస్సు యెంత బాగుంది అనుకుంటూ ఆహ్లాదపడిపోతుంటాం. ఆ వర్షం కురిసిన రోజు బీదాబిక్కి కట్టుబట్టలతో రోడ్డునపడి తలదాచుకోవడానికి చిన్న నీడ లేక ఆకలికి తాళలేక చావు రాక నిస్సహాయ స్థితిలో బ్రతకాల్సి రావడమనేది పాపమో శాపమో ... తెరలు తీసి అదే మనసు తెరలు తీసి చూడలేని మనుషులకు అర్ధం కా

20, ఆగస్టు 2019, మంగళవారం

మాట ప్రియం ..




మాటే ... దేనికైనా మూలం. తీయని పలుకుల మధ్య నిండుకుండ విషం కూడా కప్పెట్టేయవచ్చు. అసలు మనుషుల మధ్య మాట లేకపోతేనే కష్టం . గల గల మాట్లాడే వారు హఠాత్తుగా మౌనం వహిస్తే బెంగ . ఆ మాటకి మౌనం తాళం ఎందుకయిందో తెలిస్తే ..మనసుకి బాధ. మనుషుల వైఖరిపట్ల విముఖత. మౌనాన్నే ఆభరణంగా ధరిస్తే బావుంటుంది కదా ..అని ఆలోచన . వ్రాత పాతదే ..

ఆ మాట గురించి వొక కథ వ్రాస్తే ... ప్రచురణ కోసం యెదురుచూసి యెదురుచూసి వొక ఉదాసీనత అలముకున్నాక యేదో వొకనాడు మధ్యాహ్నం పూట గాఢమైన నిద్రలో వుండగా ఫోన్ కాల్ ద్వారా లేపి మరీ చెపితే ఆ భావాతీతమైన క్షణాన్ని అక్షరాలలో వర్ణించడం అంత సులువుకాదు. సంతోషమో విచారమో ..యేదో తెలియని స్థితి .. సరే ..మొన్న  ఆదివారం ప్రచురింపబడింది  .. "మాటల దారం " కాస్త చదవడానికి ప్రయత్నించండి. వేలిముద్రలు వ్యాఖ్యలు అభిప్రాయాలు చెప్పకపోయినా పర్లేదు .. 


ఈ కథ వెనుక కథ ..

నేను గత సంవత్సరం USA వెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళు మా బంధువులు ఫ్రెండ్స్ కాకుండా.. నేను ఇతరులతో మాట్లాడిన మాటలు.. మా అబ్బాయి ఇంటిప్రక్కనున్న పొరుగు మనిషి .. హాయ్ అని పలకరిస్తే మళ్ళీ తిరిగి విష్ చేసాను. ఒకరోజు బయటకు వెళుతుంటే ఒక బాలుడు కనబడ్డాడు. అయిదారేళ్ళు ఉండవచ్చు. ఆ పిల్లాడిని చూసి ..ఈ పిల్లాడు మన తెలుగు వాళ్ళబ్బాయి లాగా వున్నాడు అని మా కోడలితో అన్నాను. అ పిల్లవాడు ముందుకు నడుస్తున్నవాడల్లా ఆగి వెనక్కి తిరిగి చూసి "వ్వాట్ " అన్నాడు. నేను "నథింగ్" అని చెప్పి నవ్వుకున్నాను.మా అబ్బాయి ఇంటి చుట్టుప్రక్కల చాలామంది మన ఆంధ్రులు ఉండేవారు. కానీ ఎవరూ ఎవరితో మాట్లాడరు. చుట్టుప్రక్కల ఎవరెవరు వున్నారా, యేమిటీ అని అన్నీ గమనిస్తారు కానీ తెలియనట్లు నటిస్తారు. అమెరికా వాళ్ళలా ప్రవర్తిస్తారు. అవసరం లేకపోతే మాట్లాడరు. ఆరు నెలల కాలంలో నేను ఇతరులతో మాట్లాడిన మాటలు ఆ రెండే. షాపింగ్ కి వెళితే అక్కడ స్టాఫ్ పలకరించేవాళ్ళు హాయ్ అంటే ఒక మాట అది తక్కువ హౌ ఆర్ యూ అంటే ఇంకో మాట ఎక్కువైన మాట. ఇంతే ! మనుషులతో మాట్లాడకుండా మూగవాళ్ళలా చిన్న చిరునవ్వు ముఖానికి అంటించుకుని చూస్తూ ఏళ్ళకు యేళ్ళు ఎలా బ్రతికేయగల్గుతారో ఏమిటో ! మనమధ్య కూడా అలాంటి వాతావరణమే ప్రబలిపోతుంది. ఎవరూ మనుషులతో మాట్లాడటం లేదు. నేను ఎక్కువ మాట్లాడేది పలకరించేది నా చుట్టూ వున్న చిన్న పిల్లలను . వాళ్లకి లెక్కలేసుకోవడం రాదు కాబట్టి హాయిగా మాట్లాడతారు. ఇక ఇవాల్టి విషయానికి వస్తే .. నా కథ యిలా నా ఆలోచనల్లోనుండే కాదు వాస్తవంలో నుండి పుట్టిన కథ. అక్షరమంత అబద్దమైనా లేదు. మాటలు కావాలి. ఆ మాటలను కలిపే మనుషులే దారంగా కావాలి. ఆ మాటల దారం మనుషులను పూలలా కలిపి ఉంచాలి అని నా ఆకాంక్ష.  ఈ కథకు నాకు స్ఫూర్తినిచ్చిన  .. ఈ "రమ" అనుభవాలు కూడా యీ కథకు మూలం.
పసుపుపూల వనం ముందు పచ్చని మనసు "రమ" ఈవాల్టికే కాదు నా ..స్నేహజీవితంలో వొకానొక నాయిక. రమ నేనూ ఇద్దరం కలిసిన photos వుండాలి..వెతికి చూస్తాను. ప్రస్తుతానికి .. ఇలా ..






18, ఆగస్టు 2019, ఆదివారం

మాటల దారం

మాటల దారం - వనజ తాతినేని

ఇంట్లో మనుషులు మనుషులతో కాకుండా గ్రూఫ్ ల్లోనూ గోడలపైన మాట్లాడుకునే  రోజులివి. మనుషులు మనసులతో మాట్లాడుకుంటున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది.  ప్రస్తుతం మనసుమాట ప్రక్కనపెట్టి  మనషుల కోసమే  మరీ  కరువాసి పోతున్నానేను .   చేతిలో వున్న పుస్తకం చూస్తే రమ చప్పున గుర్తుకొచ్చింది.  ఏలూరు రోడ్ లో వున్న సాహిత్య నికేతన్ కి వెళ్ళి  స్వంత డబ్బుతో పుస్తకాలు కొనుక్కెళ్ళి అందరికి అభిమానంగా పంచి  చదవమని ప్రోత్సహిస్తుంది. అలాగే మా అబ్బాయికివ్వమని యిచ్చిన పుస్తకం యిది. నేను నా కొడుకు దగ్గరకు ప్రయాణమవుతున్నప్పుడు వచ్చి  రెండు మూడు రోజులుండి వస్తువులు సర్దటంలో సాయం చేసి నేను బయలుదేరాకే తను యింటికి బయలుదేరింది. 


ప్రతి మనిషి నుండి యేదో వొకటి నేర్చుకోవడం నాకలవాటు.నాకొక కొత్తచూపునిచ్చిన మిత్రురాలు రమ.మమ్మల్ని కలపడానికి చిన్నపాటి అభిరుచి కారణమై వుండొచ్చుకానీ వూడల్లా దిగిపోయిన స్నేహానికి కారణం మరొకటి వుంది. అది మా ఆలోచనా విధానం అని తర్వాత అర్ధమవుతూ వచ్చింది నాకు. అప్పటికప్పుడు  తనతో మాట్లాడాలనిపించింది.సమయం చూస్తే అక్కడ అర్ధరాత్రి దాటి వొక గంటే అయింది.  మరో రెండు గంటలు వేచి చూడటం దుర్భరంగా అనిపించినా రమతో స్నేహం గుర్తుకుతెచ్చుకుంటే హాయిగా వుంది ఆ క్షణంలో.   


కాళ్ళు కడుక్కుని లోపలి వస్తూ  గాయం యెలా  వుంది జ్వరం తగ్గిందా అంటూ వొంటిపై చెయ్యేసి చూసి కాలు పట్టుకుని చూసి ఇంత లోతు గాయాలైతే జ్వరం రాక యేమొస్తుంది అంది. కళ్ళల్లో నీరు ఉబికింది. ఆ మాత్రం అయినవాళ్ళు నలుగురు  అరకిలోమీటరు దూరంలో వున్నా కూడా ఆత్మీయంగా పలకరింపుకి నోచుకోని   కడుపేదరాలిని. 


ప్రొద్దున్నే  తను ఫోన్ చేసినప్పుడు  మా మాటల్లో బంధువుల యింటికి వెళితే అక్కడ కుక్క కరిచిందని, వస్తూ వస్తూనే యాంటీ రేబిస్ ఇంజెక్షన్ చేయించుకుని వచ్చానని తెల్లవారేటప్పటికి వొళ్ళు నొప్పులతో బాటు జ్వరం బాగా వచ్చిందని  అన్నాను. ఎవరున్నారు యింట్లో   అనడిగింది. అత్తగారు అప్పుడే వెళ్ళిపోయిందని చెప్పాను. చెప్పిన మూడుగంటలకి రమ  నా ముందు ప్రత్యక్షమైంది. వాళ్ళ వూరుకి మా పట్టణానికి మూడు గంటల ప్రయాణ సమయమన్నది నేనెలా మరువగలనూ!  "మనసెలా వొప్పిందీ యిలా వున్న మనిషిని వొదిలేసి  యెలా వెళ్ళింది" అనంటూ  బాధపడింది. అయిదు రోజులుంది. సేవలు  యేమి చేసిందనేది లెక్క కాదు. అదొక తోడు అంతే.


“ఇవాళ రైల్వే స్టేషన్ లో  కొంతమందిని చూస్తే అసహ్యం వేసింది “ అంది రమ. 


ఎందుకు అన్నట్లు చూసాను.  


“ముద్ద ముప్పావల, కాదు కాదు ముప్పై రూపాయలుగా తినేవాళ్ళు తిని జీర్ణించుకునేవాళ్ళు తమ ముందు దీనంగా చెయ్యిచాచిన వాళ్ళని తుస్కారంగా చూసినా పర్వాలేదు కానీ  తూటాల్లాంటి మాటలతో యెగతాళి చేయడం బాధ కల్గిస్తుంది “ అంది.


“కష్టపడి సంపాదించి  దారినపోయే పిల్లులకు రోజూ రెండు పాల పేకెట్లు పాలు పొసే నీ మనసంత మనసు వుండొద్దూ..  అందరికీ” అన్నాను. 


“ఏమిటో కొందరిలా అంత కఠినంగా నేనుండలేను, మొదట్లో అమ్మ కూడా గొడవ చేస్తుండేద. రాక్షసిలా అరిచేదాన్ని. ఇప్పుడు వాళ్ళకీ ఆ దయా  గుణం అబ్బి రెండు రూపాయల రేషన్  బియ్యాన్ని కట్టెలపొయ్యి ముట్టించి వూది వూది  దగ్గు వస్తున్నా సరే లెక్కచేయకుండా అన్నం వొండి  వీధి కుక్కలకి పెడుతున్నారు, పక్షులకి వేస్తున్నారు”  అని చెప్పింది..


రమ ను చూస్తే నాకెంతో అబ్బురం. మనిషి మాటల్లో కాదు చేతల్లో కనబడుతుంది. ప్రేమ విఫలమై బ్రతుకు బండయినా  కానీ స్వచ్ఛంగా స్పందించే మనసు తనది. భావపురి వాళ్ళది.  ఊరి చివర ఆర్టీసీ బస్టాండ్ పక్క సందులో చివరింట్లో చుట్టూ ఎలుకలు తవ్వేస్తున్న ప్రహరీగోడల మధ్యలో యజమాని ప్రక్క పోర్షన్లో వుంటూ    జీవితాన్ని జీవించడమెలాగో తెలిసిన మనిషి. ఏళ్ళ తరబడి బలవంతంగా భర్త  యిచ్చిన విడాకుల  బరువును మోస్తున్న రెండో  అక్క, అక్కుపక్షి లాంటి అమ్మతో కలిసి జీవిస్తుంది. ముందు గదిలో రెండు కుట్టు మిషన్లు పెట్టుకుని బట్టలు కుడుతున్నట్లే మనుషులనూ మాటల దారంతో కుట్టుకుంటూ వెళుతుంది.  అవసరమైనచోట నిర్మొహమాటంగానూ   సమాజంతో  స్నేహంగా మిత్రులతో ఆప్యాయంగా, తోటి ప్రాణులపట్ల కరుణగా అమ్మంటే  ప్రాణంగా ఇతరులకు సాయంగా ఉండే అబ్బురమైన మనిషి.  తీరిక చేసుకుని  అప్పుడప్పుడూ ఏదో స్వచ్చంద సంస్థ లో కార్యకర్త గా పని చేస్తూ వుంటారు అక్క చెల్లెళ్ళు. మనుషుల మధ్య కులాల మతాల గోడల్ని బద్దలుకొట్టి మరీ యింటికి ఆహ్వానించి  యిన్ని టీ నీళ్ళిచ్చి   వేళకి వెళితే ఆదరంగా పచ్చడి మెతుకులైనా ఆప్యాయంగా పెట్టే మనుషులు.


ఏళ్ళ తరబడి మోస్తున్న కుటుంబ భారానికంటే యెక్కువ మానసిక వేదనని కల్గించిన అమెరికా బావని పచ్చని పెళ్లిపందిరిలో బంధుమిత్రుల సమక్షంలో కాలర్ పట్టుకుని గిర గిరా త్రిప్పుతూ ప్లాస్టిక్ కుర్చీ యెత్తి  కొడుతూ ఉగ్ర స్వరూపం ప్రదర్శిస్తే ఆశ్చర్యపోవడం నా వంతే కాదు ప్రైమ్ టైమ్  వార్తలలో తెర ముందు కూర్చున్న ప్రేక్షకులది కూడా.  


 “వాడి డబ్బు మదం, అంగబలం చూసి భయమేయలేదా “ అనంటే.. " సైనికుడిని ప్రేమించిన మనసు నాది ఆ మాత్రం  ధైర్యంగా వుండొద్దూ" అంటుంది. అంతలోనే దిగులు పడుతుంది. కులం వేరని మా బండది నా ప్రేమని పెళ్లిని చెడగొట్టింది అని రెండో అక్కని తిడుతుంది . 


తనకన్నా రెండు నిమిషాలు చిన్నవాడైన తమ్ముడు అయినవాళ్ళ   చెప్పుడు మాటలు విని అనారోగ్యంతో వున్న తండ్రికి వైద్యం చేయించలేక    యిల్లు వదిలేసి వెళ్ళినా ఆడదాన్నని బెదిరిపోకుండా కుటుంబానికి యజమానిగా నిలబడిన తన దైర్యం చూస్తే ముచ్చటేస్తుంది. ఆ తమ్ముడే ఆస్తులు సంపాదించుకుని పెళ్ళిచేసుకుని పిల్లలను కని వాళ్ళకు యే  లోటూ లేకుండా చూసుకుంటూ తల్లి అనారోగ్యం పాలైతే రిక్త హస్తాలతో వచ్చి నిలబడి బంధువుల దగ్గర నాకు వాళ్ళేమిచ్చారు నేను వాళ్ళకివ్వడానికి అని అంటుంటే విని వెళ్ళేటప్పుడు చార్జీలకని జేబులో డబ్బులు పెట్టిపంపిన  రమ చూపు యెంత తీక్షణమైందో! అప్పుడు ఆమె చూసిన చూపు ఆ తమ్మునికి సిగ్గుచేటు అనిపించడం తేలికగానూ  జీర్ణించుకోవడం కష్టంగాను వుండాలి కదా అనుకున్నాను. 


“మనుషులను చూసే దృష్టి. మారాలి. కార్లు వున్నవాళ్ళకు తలనొప్పి అన్నా పరామర్శించడానికే పరిగెత్తే జనం అదే రక్తస్పర్శ కల్గిన నా అన్న వాళ్ళు యెవరూ లేని కడు పేదరాలను పట్టించుకున్న పాపానపోరు. ధనం వెంట పరుగులు. ఎవరెక్కడ స్పందించాలో యెంత  స్పందించాలో  యెంత  మృదువుగా మాట్లాడాలో ఆకట్టుకునేలా సమాధానమెలా చెప్పాలో  అన్నీ తరగతులకు హాజరై మరీ నేర్చుకుంటున్నారు. మనుషులను సహజంగా సాధారణంగా స్వభావసిద్దంగా బతికే స్వేచ్ఛను దూరం చేసుకుంటున్నారు “ అంటుంది కోపంగా. నిజం కాదని నేనలా అనగలనూ!


ఆర్దికంగా యెంత యిబ్బంది వున్నా డబ్బు వున్నప్పుడు పెళ్ళి రాదుకదా అని అప్పు తీసుకుని బాబాయి కూతురు పెళ్ళికి వెళ్ళాను. బాబాయి పిన్ని  సంతోషంగా పలకరించి బాగానే మర్యాదలు చేసారు. పెళ్ళికూతురే యెవరో తెలియదన్నట్టుగా చూసింది తప్ప అక్కా బాగున్నావా! అని పలకరించకపోయింది. సాఫ్ట్‌వేర్ వుద్యోగం చేసి లక్ష రూపాయలు సంపాదిస్తే గొప్ప కాదు.   ఆ పిల్ల ప్రవర్తన గుర్తొస్తే ములుకులా గుచ్చుకుంటూనే వుంటుంది అని చెప్పింది ఒకసారి. 


మాటేగా వారధి. అదికూడ తెలియని వాళ్ళతో సంబంధాలు యేమి వుంటాయి. మానవ సంబంధాలు యెవరికి కావాలి. ఆర్ధిక సంబంధాలో రాజకీయ సంబంధాలో తప్ప..  మా పెద్దక్క  భర్త పెద్దగా చదువుకోలేదు ఆర్జితమే తప్ప యే కోశానా  అభిమానం చూపడం తెలియని మనిషి. బేంక్  లావాదేవీలు యేవీ తెలియదు కాబట్టి  హడావిడిగా వూరు నుండి ఫోన్ చేస్తాడు బేంక్ దగ్గరికి  రా రమ్మని. ఆ  లోన్లు పని అదీ  పూర్తయ్యేటప్పటికి నాలుగుగంటలు పట్టినా బేంక్ యెదురుగా టీ కొట్టు కనబడుతున్నా టీ తాగుదాం రామ్మా అని పిలవడు ఒక్కడే వెళ్ళి తాగి వస్తాడు. అలాంటి  ఆయనకు కూడా సమయానికి చేసిపెట్టిన టిఫిన్ వుంటే డబ్బాలో పెట్టుకుని వెళుతుంది రెండో అక్క . తనే టీ కొట్టు కెళ్ళి ఆయనకూ టీ పట్టుకెళ్ళి యిస్తుంది. ఎప్పుడూ   జేబును గట్టిగా పట్టుకుంటాడు.డబ్బంటే అంత తీపి ఆయనకు. ముందస్తు సూచనలు కనబడ్డా డబ్బు ఖర్చు అవుతాయని వెనుకాడితే   కేన్సర్ ముదిరిపొయ్యాక ప్రాణం మీద తీపితో  లక్షలు ఖర్చుపెట్టినా ప్రయోజనం లేకపోయింది.  చూసే దానికి ఇవన్నీ  చిన్న విషయాలు లాగానే కన్పిస్తాయి కానీ యివే మనుషుల గుణాన్ని తెలియజేస్తాయి అని చెప్పింది మరొకసారి. 


 ఒకసారి  ఆమెతోపాటు వాళ్ళింటికి వెళ్ళింది తను. అతిధి మర్యాద కన్నా ప్రేమ యెక్కువ కనబడిందక్కడ. నేలపై బొంత పరుచుకుని ముగ్గురు  అక్క చెల్లెళ్ళులా పడుకుంటే... పక్కనే వాళ్ళింట్లో వున్న వొకే వొక చిన్న నవ్వారు మంచంపై వాళ్ళమ్మ. అందరూ పడుకుని మాట్లాడుకున్న మాటల్లో  పడుతున్న  కష్ట నిష్ఠూరాలను విప్పి చెప్పుకుని  మనసులను  తేలికపరుచుకున్నాం.  నాలుగున్నర  గంటల కన్నా ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకుని బుట్ట పట్టుకుని రెండు పర్లాంగుల దూరంలో ఉన్న పాలబూత్ కి  వెళుతుంటే  దట్టంగా కురుస్తున్న ఆ మంచులో రమతో కలిసి  నడిచింది తను కూడా.  తెల్లని చుడీ దారు ధరించి తెల్లని పొగమంచులో కలిసిపోయే రమని గుర్తించడానికి ఒకటే మార్గం  తల మీదుగా  చుట్టుకున్న ఆకుపచ్చని చున్నీ.   


సందుమూల మెయిన్ రోడ్ లో ఉన్న కిరాణా షాపు అతన్ని  "ఏమయ్యా ప్రకాష్ మీ లక్ష్మి ఎలా ఉంది, లేచి తిరుగుతుందా" అని పలకరిస్తుంది.  షాపు ముందు శుభ్రం చేసుకుంటున్న అతను పనాపి   "పర్వాలేదక్కా కాస్త లేచి నిలబడుతుంది" అని సమాధానమిచ్చి  "ఎక్కడికి వెళ్ళారు నాలుగు రోజులనుండి కనబడటం లేదు" అని ప్రశ్నించాడు. మా స్నేహితురాలికి కుక్క కరిచి జ్వరమొస్తుంటే తోడుగా వుందామని వెళ్లాను అంది. "ఇప్పుడెలా వుంది ఆమెకి" అనంటాడు ఆదుర్దాగా. పర్వాలేదు. ఇదిగో ఆమె ఈమె అంటూ ప్రక్కనున్న నన్ను చూపించింది. ముందుకు నడుస్తూ " లక్ష్మి అంటే ప్రకాష్  పక్కింటి వాళ్ళ ఆవు దూడ. ఏదో జబ్బుచేసి నిలబడే ఓపిక కూడా లేకపోతే   కటిక వాడికి అమ్మేస్తుంటే అతనికి డబ్బులిచ్చి ఆ ఆవుదూడని కొన్నాడు.  ఇంకో మనిషిని తోడుగా తీసుకుని మోటార్ సైకిల్ పై పెట్టుకుని  గుంటూరు హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం చేయించాడతను. చచ్చిపోయే దానిని బ్రతికించాడు" అని చెప్పింది. అప్రయత్నంగా ఓసారి వెనక్కి తిరిగి చూసాన్నేను. 


ఇంకొంచెం ముందుకెళుతుంటే  పెద్దాయనొకరు వాకింగ్ కి వెళుతూ  యెదురైనారు   "బాబాయి గారూ మంచు దట్టంగా కురుస్తుంది. వచ్చేపోయే  వాహనాల లైట్లు కూడా కనబడటం లేదు కాస్త ఎండెక్కినాక వెళ్ళేపనిగా" అంటుంది. "వచ్చావమ్మా రమా, నోరారా పలకరించే వాళ్ళు లేక నోరు మూగబోతుందనుకో. నువ్వు మాత్రం ఇంత మంచులోనే బయలుదేరావెందుకూ .. పిల్లులు అప్పుడే కాళ్ళకి చుట్టుకుంటున్నాయా పాల కోసం" అన్నాడాయన.  "వాటి కోసమనే యేముందిలెండి  అమ్మ కి కూడా కావాలిగా" అంది  మొహమాటంగా. "నీకు భూతదయ యెక్కువమ్మా, పిచ్చితల్లి యెలా బతుకుతావో యేమిటో " .. అనుకుంటూ ముందుకు వెళ్ళాడాయన. 


పాల బూత్ దగ్గరికి వెళ్ళి   శుభోదయం చెప్పి "గణేష్   నేను లేని నాలుగు రోజులు ఇంటిదగ్గర పాలు యిచ్చినందుకు ధన్యవాదాలు" అంది. "పర్వాలేదులే అక్కా "అన్నాడు . "ఇదిగో నువ్వడిగిన పుస్తకం"అంటూ  బుట్టలో నుండి  తీసి  అందించింది . పుస్తకం విలువ యివ్వబోతే "భలేవాడివి నువ్వు డబ్బులిస్తావని తెచ్చి యిచ్చానా"  అని కోపగించుకుంది. "ఆ నల్లకుక్క యెలా వుంది కాలు కట్టుకున్నట్లేనా?" అని ఆరా తీస్తుంది. "తగ్గినట్లుంది అయినా అదిక్కడ నుండి పోనట్టు వుంది నేను చేసిన సేవ రుణం తీర్చుకోవాలనేమో" అని అన్నాడతను.  "కుక్కకి ఏమైంది ?"అని అడిగాను. "వీధికుక్క , ఏ బండో  ఎక్కి వుంటుంది. కుంటుతూ నడుస్తుంటే చేరదీసి కట్టు కట్టాడు. కొంచెం దయ చూపిస్తే విశ్వాసంగా ఉంటాయి జంతువులు. మనుషులకే విశ్వాసం వుండదు " అంది.   



మనుషులు ఇలా కూడా వుంటారా అని అనిపించింది . ఆ మాటే అంటే  "మనిషికి మనిషికి అడ్డుగోడ కట్టుకుని జీవించడం మానేస్తున్నారు. కేవలం నటిస్తున్నారు. మేము ఇలాగే వుంటాం. ఇలాగే పలకరించుకుంటాం. ఓ చిన్న నవ్వు పడేసి పని వున్నట్టు హడావిడిగా వెళ్లిపోవడమో కాస్త డబ్బు సంపాదించేటప్పటికీ వాళ్ళెవరో మాకు తెలియదన్నట్టు చూడటమో చేస్తారు కొంతమంది మనుషులు. కష్టం వచ్చినప్పుడు కాస్త మనిషి సాయమో ఆపదలో  అప్పు యిచ్చి   మనిషిమనిపించుకోవడం  ధర్మం కదా" అంది. ఆ రోజు తనతో కలిసి నడిచిన నాలుగు పర్లాంగులు మనిషి అంటే యేమిటీ మనుషుల మధ్యన వేసుకున్న వంతెన యెటువంటిదన్నది నాకర్ధమైంది.  తను నాపట్ల మాత్రమే అలాంటి స్నేహాన్ని వ్యక్తపరిస్తే కేవలం కృతజ్ఞతగా వుండేదాన్ని. ఆమె చుట్టూ అల్లుకున్న స్నేహాలు మనుషులు మాటలను చూస్తే గొప్ప గౌరవభావం నాకే  కాదు యెవరికైనా  యేర్పడుతుందనేది సత్యం.  


సాయంత్రం వాకింగ్ కి వెళుతూ అయిదు లీటర్ల కేన్ తో నీళ్ళు నింపుకుని వెళ్ళి  యెండిపోయిన చెట్లకి పోసి   వాటిని బ్రతికించినట్లే   సిమెంట్ బెంచీలపై కూర్చున్నయెండిపోయిన వృద్దులకూ  మాటల తడితో కాస్త జీవం పోస్తుంది. నిత్యం వీథిలో నాటిన  మొక్కలకు నీళ్ళు పోస్తుంది.  పూజకి పూలు కోసుకు వెళ్ళే వాళ్ళది చూసి నవ్వుకుంటారు.మీ నవ్వులే రేపటి పువ్వులు అంటుంది. కసుక్కున గుచ్చుకోవడం అంటే అర్ధం కాని వాళ్ళు మళ్ళీ నవ్వుకుంటారు.  యెందరో స్నేహితులు పరిచయస్తులు. తాను వాలంటీర్ గా పనిచేస్తున్న  స్వచ్చంద సంస్థ  రాష్ట్రం వేరు పడినప్పుడు   వేరు పడిపోయినా వాళ్ళు పిలిస్తే చాలు వెళ్ళిపోయేది. తన అవివాహ జీవితం గురించి వెకిలితనంతో వ్యాఖ్యానించినా సర్దుకుంది కానీ కులరాజకీయాలు ఆహారపు అలవాట్లతో విడదీసి చూడటం మనుషులను వెలివేసినట్లు చూడటం  జరిగేపటప్పటికీ  మనసుకి కష్టం కలిగి పక్కకు తప్పుకుంది. సంస్థ తరపున పనిచేయడం  మానేసినా ఆ మనుషుషులందరూ తనవాళ్ళే అన్నట్లు  వాళ్ళకు తన చేతనైన విధంగా చేసే మాట సాయాలు చిరు సహాయాలు. తన చుట్టూ వుండే ప్రపంచమే వేరసలు. అదొక మానస ప్రపంచం. చేసిన సాయాలు వ్యర్థం కావులే అంటే తిరిగి ప్రతిఫలం ఆశించి నేను చేయడంలేదు అంటుంది.


ఎన్నోసార్లు నా  కష్టంలో సుఖంలో నా యింటి మనిషై నిలబడటం మాత్రమే కాదు తన మనసు బాగోలేనప్పుడు పని వొత్తిడిలో అలసిపోయినప్పుడల్లా  నా దగ్గరకొచ్చి పడుతుంది. వినకోరిన హిందీ పాటలు వినిపించి  తన అనుభవాలని చెప్పించుకోవడం నాకిష్టం. అప్పటిదాకా విన్నపాటలని ఈల పాటలో పాడి నన్ను అబ్బురపరిచేది.  ఏవేవో పాత  పాటలు అడిగితే వాటిని వెతికి  డౌన్లోడ్ చేసి మెమరీ కార్డ్ లోకి యెక్కించకపోతే అలిగి కూర్చుండటం చూస్తే ఫక్కున నవ్వుకోవడం నావంతయ్యేది. చాలాసార్లు దేశంలో ఆమెతో  కలసి పర్యటిస్తూ  ఆమెంటే యేమిటో  బాగా అర్దం చేసుకోగల్గాను.మనుషుల్లోనూ  తోటి ప్రాణుల్లోనూ   దైవత్వాన్ని దర్శిస్తూ యెన్నో అగాధాలను పూడ్చేస్తూ జీవన ప్రయాణం చేస్తూ వుంది. తోటి మనుషుల పట్ల కొంచెం ఆత్మీయత ఇతర ప్రాణులపై పిడికెడంత దయ కురిపించలేనివాళ్ళు కనీసం పక్క  మనిషిని  పలకరించకుండా  వెళ్ళిపోవడం,  అదే మనుషులు వారికి అవసరమైతే చాలు అమాంతం యెలా  ప్రేమలు వొలకబోస్తారో చూస్తుంటే  రమకి తెలియకుండా వీడియో తీసి ఆమె సాధారణ జీవితంలో అసాధారణను ప్రపంచానికి పరిచయం చేయాలనిపిస్తుంది.   


మా ప్రక్కింటామె చెల్లెలింటి గేటు తెరుస్తుంటే "ముండకి  యేమి  అవసరం వచ్చిందో కోడల్ని వేసుకుని మరీ  వచ్చింది"అని అనబడటం  వినబడిందట. ఇక ఆ అక్కకు చెల్లెలు ముఖం చూడాలనిపిస్తుందా! ఇవి రక్తసంబంధాల బోలుతనం. చిన్న విషయాలుగా అనిపించే పెద్ద  పెద్ద అవమానాలు. అగాధాలు. మనుషులు ఆ అగాథాలలో పడిపోకుండా కాపాడేది మాటనే స్పర్శమణి యే  కదా. ఆ మాట వెనుక వున్న మనిషి గుణమే కదా!మాటే కదా  మనుషుల మధ్య వంతెన. మాటే కదా మనుషులను కలిపి కుట్టే దారం. 


ఇలా రమ గురించి జ్ఞాపకాలు తవ్వుకుంటూ  కాస్తంత ఆత్మీయంగా మాటలు పంచుకోవాలనుకునే కదా నేనూ ఓ మనిషిని వెతుక్కుంటున్నానిపుడు అనుకుంటూ .. సమయం చూస్తే  దేశ కాలమానం ఉదయం నాలుగున్నర. ఆ సమయానికి   దట్టమైన మంచులో  తెల్లని చుడీదారులో ఆకుపచ్చ చున్నీ కప్పుకుని ఊరుతో  మాట్లాడటానికి వెళుతున్న రమ దృశ్యంలా  కనబడింది నాకళ్ళకి. ఏ మాత్రం స్వార్ధం లేని మాట కూడా వినబడింది. 


ప్రజాశక్తి ఆదివారం సంచిక స్నేహ లో ప్రచురితం (18/08/2019)