5, ఫిబ్రవరి 2014, బుధవారం

కొన్ని వాక్యాలు

కుంకుడుకాయలో  గింజ నలక్కుండా  కుంకుడు కాయ కొట్టడం చాలా నేర్పుతో కూడిన పని. అలా చేయగల్గే నేర్పరితనం ఉంటే  సంసారం బాగా చక్కదిద్దుకుంటారని .. మా నానమ్మ చెప్పేది. 

 గింజ నలక్కుండా కుంకుడుకాయ కొట్టడం నేర్చుకోకుండానే పెళ్లి చేస్తే ఎలా నానమ్మ ? అనే కోణంగి ప్రశ్న పుట్టుకొచ్చేది కూడా :)  

పెద్దలు చెప్పిన విషయాలు గుర్తుకువచ్చినప్పుదు  కొన్ని వాక్యాలు ఆలోచింపజేస్తాయి. ఇసుర్రాయి లో పడిన గింజ నలక్కుండాను, గింజ పగలకుండా కుంకుడు కాయ కొట్టడం రెండూ  కష్టమా ? అంటే కష్టమేనేమో .కూడా ! 

 కనబడకుండా ఆడవారి మనసు  నొప్పిస్తూ జీవిత కాలం నెట్టేసే మగ వారిని చూస్తున్నప్పుడల్లా  ఇసుర్రాయిలో  గింజ  గుర్తుకొస్తూ ఉంటుంది.  ఎందుకు   అపహాస్యంలో, అభద్రతలో ఆడపిల్లల బ్రతుకులు ఉన్నాయని గుబులు పుడుతుంది .

తల్లిదండ్రులు జన్మనిస్తారు. త్వరగా పెళ్ళి చేసి భాద్యత తీరిందనుకుంటారు. అల్లుడిగా వచ్చేవారికి ఎన్ని ఆస్తులున్నాయా అనే తప్ప ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నాయో.. ఆలోచించరు . డబ్బుంటే చాలనుకుంటారు. అదే ఆని సమస్యలకి పరిష్కారం చూపుతుందని అనుకుంటారు. ఇసుర్రాయిలో గింజలా నలిగిపోతారు ఆడపిల్లలు. ప్చ్ ..

ఇంకా చెప్పాలంటే ప్రేమ పెళ్ళి లాంటి ఉచ్చులలో పడకుండా పరువుగా పెళ్ళి చేసేసి కుటుంబ గౌరవం కాపాడుకున్నట్లు అవుతుందని తొందరపడి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. కులం, మతం పట్టింపులు ఉంటే  ఆర్దిక అసమానతలు ఉంటే  పిల్లల్ని విడదీసి గొంతు నొక్కి పాశవికంగా హత్య చేసే వాళ్ళు ఉన్నారు . వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉండదు .తల్లిదండ్రులు సోదరుడు భర్త ,బిడ్డల చేతుల్లో కేంద్రీకృతమై జీవత్శవంగా   బ్రతికేస్తారు.   

ఆడపిల్లలకి చాలా వరకు కష్టాలు పెళ్ళితోనే మొదలవుతాయి . మొగుడు పెళ్ళాన్ని పాలించేవాడు ,సాధించే వాడుగా  మారిపోతాడు. అమ్మాయి అమ్మ అవుతుంది. అమ్మ అమ్మాయి గురించి ఆలోచిస్తుంది   . 
పట్టణ ప్రజలను మినహాయించి మిగిలిన గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారందరినీ  పరిశీలిస్తే వారందరూ అమ్మాయిలని కాలేజీ ముఖమైనా చూడకుండా పెళ్ళి చేసేస్తున్నారు . 

ఆడపిల్లల మనసులో దాగున్న అనేక కోర్కెలు నెరవేరక,లభించిన జీవితంతో సరిపెట్టుకోలేక అసంతృప్తికి గురై నిస్తేజంగా బ్రతుకు వెళ్ళదీస్తూ ఉన్నారు .చాలా మంది   పైకి కనపించినంత నాగరికంగా  ఏమి లేరు  ప్రజల మూఢ విశ్వాసాలు కొన్ని అలాగే ఉన్నాయి . ముఖ్యంగా కట్న కానుకలు సమస్య మాసిపోనేలేదు. అలాగే మగ పిల్లలు కావాలనుకునే సంస్కృతీ మారలేదు. కుటుంబంలో సాంప్రదాయం పేరిట అనేక ఆంక్షలు అలాగే ఉన్నాయి . భర్త ఎంత అనుచితంగా ప్రవర్తించినా ఎదురు ప్రశ్నించనే కూడదు . స్థిర ఆస్తులు ఎన్ని ఉన్నా .. స్వంతంగా ఖర్చు పెట్టుకోగల ఆర్ధిక స్వాతంత్ర్యం ఉండదు . ఇంటి పనులు, వంట పనులు భారం అనుకునే స్థితి వచ్చింది కూడా తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉండటం వలెనే! ఇంట్లో ఉన్న టీవి మాధ్యమం ద్వారా ప్రపంచంలో జరిగే  అన్ని విషయాలు తెలుసుకుంటూ తామున్న పరిస్థితికి బేరీజు వేసుకుని విరక్తి చెంది పిల్లల పెంపకంలోను నిర్లక్ష్యం వహిస్తూ .. పెంకితనం తోనూ, గయ్యాళి తనం తోనో .. పురుషులని సాధిస్తారంటే ఆశ్చర్యం కల్గుతుంది.  ఇతరులతో పోల్చుకోవడం, నాగరిక జీవనం పై ఆకాంక్ష లాంటివి చోటు చేసుకుంటాయి . 

చదువు, ఆర్ధిక స్వాతంత్ర్యం స్త్రీకి  జీవితాన్ని తీర్చి దిద్దుకునే సంయమనంని ఇవ్వడమే కాదు  అధిక లాలసతో, తెంపరి తనంతో  జీవితాన్ని నాశనం చేసుకునే దైర్యాన్ని ఇస్తున్నాయి .సాంఘిక భద్రత  కరువైపోయి ఆడపిల్లలకి మాన ప్రాణ రాక్షణ కరువైపోతుంది కుటుంబ హింస, సామాజిక హింస రాజ్య మేలుతున్నాయి ఇంకా ఇంకా చెప్పాలంటే సమానస్థాయి విద్యావంతులై ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్ళనే చిన్న చూపు కూడా ఇంకా మిగిలే ఉంది స్వాభిమానం తో బ్రతకాలనుకోవడం నేరంగా పరిగణించే కాలంలోనే ఉన్నాం . తనకంటూ స్వంత ఇష్టం ,వ్యక్తిత్వం , తనకి నచ్చినది ఎంపిక చేసుకునే స్వేచ్చ కూడా లేని పంజరంలో పక్షిలా బ్రతికే వారు ఉన్నారు . ఇవన్నీ అధిగమించి పురుషునితో దీటుగా ఉన్నత స్థానంలో కూర్చున్నా.. నీకేం తెలుసు ? మాకు నచ్చినట్లు చేస్తాం అనే పురుష పుంగువుల  అహంభావం ఉండనే ఉంది. అజ్ఞానంతోనూ ..  అహంకారం తోనూ రెండు విధాలుగా  నాశనం  అయిపోతున్న ఆడ కూతుర్లుకేమి  కొదవలేదిప్పుడు . లింగ  నిష్పత్తితో  బేరీజు  వేసుకుని భయపడటం  కన్నా చాలా విషయాలలో స్పష్టతకి  రావడం అవసరమనిపిస్తుంది.

ముందుగా ఇంట్లో  ఉన్న అవరోధాలని  దాటగల్గి స్వావలంబన  దిశగా అడుగులు వేస్తే  సమాజంలో అవరోధాలని  అందరూ  కలసి చేధించగల్గడం  సులువవుతుంది .

(ఈ పోస్ట్ చదివేవారికి చాలామందికి ఆడపిల్లల చదువులు పట్ల వ్యతిరేకత లేకపోవచ్చు . స్త్రీ పురుష సమాన విద్య ఉద్యోగ అవకాశాలు ఉండవచ్చు . అవి లేని వారి గురించి ఆలోచిస్తూ వ్రాసిన పోస్ట్ ఇది. అనవసర వ్యాఖ్యానాలు వలదని మనవి ) .  

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

తెలుగు వెన్నెల. కామ్ లో నేను వ్రాసిన కథ.

ఓ  తల్లి కన్న కొడుకుని చేజేతులా చంపుకుంటుందా? మాతృత్వం  మసకబారిపోతుందా ?

కన్న  కూతురిపై  ఓ..తండ్రి  అత్యాచారయత్నం.

ఇలాంటి శీర్షికలతో  వార్తలు చూస్తుంటాం . కారణాలు  ఏమిటా  అని ఆసక్తి కనబరుస్తాం . లోకం  పాడైపొతుందని  బాధపడిపోతుంటాం

అలాంటి  వార్తల వెనుక కొన్ని సంఘటనలుంటాయి.  ఆ తల్లి హృదయం  ఎందుకంత  కాఠిన్యంగా మారింది ? లాంటి  ప్రశ్నలకి .. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలకి .. అడ్డం పడుతూ ఈ కథ ..

తెలుగు వెన్నెల. కామ్  లో  నేను వ్రాసిన కథ. సంపెంగ సేవలో   ఈ లింక్ లో చదవండి 

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

Love for life

అమ్మాయి..  అలా సరదాగా సినిమాకి వెళ్ళి వద్దాం  పద.. తొందరచేసింది నా  ఫ్రెండ్

సినిమాకా !? అయిష్టంగా ముఖం పెట్టాను.

నువ్విలా అంటావని తెలుసు అయినా ఎక్కడో ఆశ. అసలు ఇల్లు కదిలి బయటకి రావా? ఎప్పుడూ చదవడం చదవడం తప్ప ఇంకేమి ఉండదు. బయట ప్రపంచంతో సంబంధం వద్దా? పోట్లాటకి తయారయింది.

చదువుతున్న పుస్తకాన్ని ప్రక్కన పెట్టి..  ఇంతకీ ఏమిటి నీ ఆరోపణ ? అడిగాను

ఆరోపణ కాదమ్మాయి! ఎప్పుడు మనుషులతో కలవవు. ఒక వేడుక లేదు వినోదంలేదు నీకు నలుగురితో కలసి ఆనందంగా మెలగడమే తెలియదు. ఒంటరితనమనే శిక్ష విధించుకుని జీవితంలో ఎన్నిటినో కోల్పోతున్నావ్. బయటకి వెళదామని ముస్తాబై కూడా ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుంటావ్, ఎవరికీ అర్ధం కాకుండా తయారయ్యావ్. నీలో మార్పు తీసుకువద్దామని ప్రయత్నించి ప్రయత్నించి విఫలమవడం తప్ప ఏం మార్పు కనబడటంలేదు .. కొంచెం కోపంగా, నిసృహగా అంది .

నేను ఆనందంగా లేనని ఎవరు చెప్పారు? అసలు ఆనందం అంటే ఏమిటి? సినిమాలకి  వెళ్ళడమా!? ఆ రెండుగంటల అసహజవాతావరణంలో నేనుండలేను.  సినిమా చూడటమంటే  మీలా వినోదం కాదు అదొక పెద్ద శిక్ష నాకు. అలాగే విందులకి,వినోదాలకి అంటావా? అక్కడ ఆర్భాటాలు ప్రదర్శించే వాళ్ళే తప్ప ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళే ఉండరు. అది నాకు నచ్చదు. వేసుకున్న నగలు, కట్టుకున్న చీరలని  బట్టి పలకరింపుల మధ్య నేనిమడలేను బంధుమిత్రులని కలిసామన్న సంతోషం  లేకుండా  వారి ప్రవర్తన ముల్లులా మనసుని గుచ్చుతుంటుంది. అలాగే    హాయిగా మెత్తని క్రేప్ చీర కట్టుకుని మనింటిలో స్వేచ్చగా మసలుతూ  ఒక రోటి పచ్చడి,చారన్నంతో తిన్న తృప్తి  ఆ విందులలో నాకు కనబడదు నిజాయితీగా చెప్పాను.

ఏమో.. నువ్వేన్నైనా చెప్పు నిన్ను నువ్వు అందరి నుండి వెలివేసుకుని అంతర్ముఖి వై బతుకుతున్నావ్, నువ్వలాగే ఉండు. నేను నీలా కాదు  జీవితంలో కాస్త సరదాసంతోషం ఉండాలి. సినిమాకి వెళ్ళి  వస్తానంటూ వెళ్ళిపోయింది.

తనలా వెళ్ళగానే ప్రక్కన పెట్టిన పుస్తకాన్ని అందుకుని ..ఈ జనాలు ఎందుకిలా ఆనందాన్ని వెతుక్కుంటూ పరుగులు తీస్తారు ?  ఆనందం వెతుక్కోవడం వేరు. తామున్న స్థితిలోనుండే ఆనందాన్ని పొందటం వేరని ఎందుకు తెలుసుకోరు? .స్వగతంలో అనుకున్నాను .

ఓ.నాలుగైదు రోజుల క్రిందట  నాతొ చదువుకున్న ఇద్దరి బ్యాచ్ మేట్స్ ని చూసాక.. అసలు ఆనందాన్ని అనుభవించడమంటే ఏమిటో ఎరుకైంది.  .. అంతస్తులు, కొలతలు ,చట్రాల మధ్య తమని తాము బంధించుకున్న మనుషుల అసంతృప్త జీవన విధానానికి - స్వేచ్చగా సరళంగా బేషజాలు లేకుండా ఆనందంగా ఉండటం ఎలాగో నిరూపణగా నిలిచిన వేరొకరి జీవన విధానానికి ఉన్న తేడా స్పష్టంగా అర్ధమయ్యాక ..

 కొన్ని నెలల క్రితం నేను వ్రాసుకున్న మాటలు.. చాలా అర్ధవంతంగా అనిపించాయి నాకు చాలా సంతోషం కల్గింది . . ఆ మాటలు ఇదిగో ఇలా....


అసలు నేటి బంధాల్లో బలమెంత?
ప్రపంచంలో ఆడదే కరువైనట్టు ఏరి కోరి చేసుకున్నాను ఈవిడ గారిని. ఇది భార్య కాదు ...బ్రహ్మ రాక్షసి.
- ఓ భర్త ఆవేదన.
ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో వీడికి భార్యనయ్యాను. ఓ ముద్దా...ముచ్చటా..లేదు
వీడు మనిషి కాదు వ్యసనాలకు చిరునామా. వీడికన్నా జంతువులు నయం.
- ఓ భార్య ఆవేదన.
ప్రపంచంలోనే స్నేహం చాలా చాలా గొప్పది.కానీ నాతో స్నేహం చేసినవారందరూ నన్ను అవసరానికి వాడుకుని అవసరం తీరాక ముఖం చాటేశారు. స్నేహం అన్న మాట వింటేనే కంపరం పుడుతోంది .
- ఓ స్నేహితుడి ఆవేదన.
మధురమైనది...అమరమైనది ప్రేమ అలాంటి ప్రేమ పేరు చెప్పి నన్ను మోసం చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేసి జీవితాంతం నాకు మనోవేదనను మిగిల్చి తన సంతోషం తాను వెతుక్కుని వెళ్ళిపో(యింది)యాడు.
నిజమైన ప్రేమకు ఈ లోకంలో విలువ లేదు.
- ఓ ప్రేమికు(రాలి)డి ఆవేదన.
నిజం చెప్పాలంటే ఒక మనిషి తన జీవిత కాలంలో సగం సమస్యలు తన ఆలోచనలవల్లో,తన ప్రవర్తనలవల్లో ''కొని'' తెచ్చుకొనేవే.
ఈ ప్రపంచంలో ''అవసరం'' కోసం ఎదుటివాడిని మోసం చేసేవారికన్నా...
తమ వారి మీదున్న ''అక్కసు''తో తమను తాము మోసగించుకునే వారే ఎక్కువ.
ఇద్దరు వ్యక్తులు (భార్య/భర్త, ప్రేమికులు,స్నేహితులు) కలిసి జీవనం సాగించాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది ''నమ్మకం''.
నేడు ఎంతమంది భార్యాభర్తల్లో/స్నేహితుల్లో/ప్రేమికుల్లో తమ వారిని పూర్తిగా నమ్ముతున్నారు??
మనం చదువుద్వారా సంపాదించిన జ్ఞానం,స్వతహాగా ఉన్న తెలివితేటలు మనకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యనుండి బైటపడటానికి ఉపయోగపడాలి.
దురదృష్టం ఏమిటంటే మనకున్న జ్ఞానంతో,తెలివితో సమస్య'లను తెంపుకోవడం కన్నా తెచ్చుకోవడమే ఎక్కువైపోతోంది.
ముక్కు,మొహం తెలియని పరాయి వారు పలకరిస్తే పళ్ళికిలించుకుని ముఖంలో చాటంత చిరునవ్వు తెచ్చుకుని మరీ పలకరిస్తాం
వారి తరపునుండి మనకు ఏదైనా కష్టమో,నష్టమో కలిగినా క్షమించేసి
వారి దృష్టిలో చాలా ''మంచివాళ్ళం'' అయిపోవడానికి ప్రయత్నిస్తాం.
అదే
జీవితాంతం కలిసి ఉండాల్సిన వారితో మాత్రం ఒక నియంతలా ప్రవర్తిస్తుంటాం
.''మన''వారి దగ్గరకొచ్చేసరికి ఎక్కడలేని రాక్షసత్వం బైటికొచ్చి విలయతాండవం చేస్తుంటుంది.
అస్సలు
''మనసు'' విప్పి మాట్లాడం.
పరాయి వారికిచ్చే ప్రాధాన్యతలో పదోవంతు ప్రాధాన్యత మనవారికిచ్చినా బంధాలు బలపడవా??
మనసు మెచ్చిన క్షణం ''నచ్చినోళ్ళు''
మనసు నొచ్చిన క్షణం ''సచ్చినోళ్ళు''
అయిపోతుంటారు మనవాళ్ళు.
ఇలా క్షణానికోసారి మనసు మారిపోతుంటే బంధాలకు బీటలు వారవా??
మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
మనం ఒకరిని ప్రేమించేది....
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికా?
పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా?
పొద్దస్తమానం శత్రువుల్లా పోట్లాడుకోవడానికా?
మాట,పట్టింపులకు ప్రధాన్యత ఉండదో
అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.
అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.
తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు 
వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.
పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజంలో  దొరకరు
 సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!
ఆలోచించండి ..ఫ్రెండ్స్. 
మన సంతోషం మన చేతుల్లోనే కదా ఉంది.