31, జులై 2012, మంగళవారం

వంద !? ..ఇదిగో ఇంద !!.



వంద !? ..ఇదిగో ఇంద !!.

ఏమిటీ ఈ లెక్క అంటారా ? ఈ లెక్కకి ఒక తిక్క అయినా లేదు..ఊహు .లేదంటే లేదు.

వంద రోజుల్లో వంద పోస్ట్లు వ్రాయాలని సరదాగా అనుకున్నాను. బ్లాగ్ వ్రాయడం మొదలెట్టిన తర్వాత ..ఒకో నెలలో రోజుకొక పోస్ట్ వ్రాసాను. కానీ వంద రోజులు అంటే!?
భయం వేయలేదు కానీ సాధ్యమేనా !?అనుకున్నాను.

ఎందుకంటే.. మా వూరిలో ఆకు అల్లలాడితే చాలు.. పవర్ కట్. దానికి తోడూ వేసవి లో విపరీతమైన కరంట్ కోత. పైగా గృహిణిగా సమయం కేటాయించుకుని బ్లాగ్ వ్రాయడం అంటే కీ బోర్డ్ పై సామే!! కాగితం పై అయితే కొవ్వొత్తి పెట్టుకుని కూడా వ్రాసి పడేయవచ్చు. కానీ ఇక్కడ పప్పులు ఉడకలేదు. అందుకే రాత్రుళ్ళు మెలుకువతో ఉండి వ్రాసే దాన్ని.

మా అత్తమ్మ కి ఆరోగ్యం బాగోక ఇన్ పేషంట్ గా హాస్పిటల్ లో ఉన్నా.. నేను ఆమె ప్రక్కన ఉండాల్సి వచ్చినా బ్లాగ్ వ్రాయడం మానలేదు.

అలాగే మా చెల్లి.. ICU లో ఉన్నప్పుడు కూడా దిగులుని,ఒత్తిడిని తట్టుకుని బ్లాగ్ వ్రాసాను.

ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సి వచ్చింది అంటే..

ఒకోసారి ఏ పని చేయడానికి మనస్కరించ నప్పుడు , లేదా మొనాటనీ ఏర్పడినప్పుడు దానిని అధిగమించడానికి నాకై నేనే కొత్త లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందులో ..నాకొక లక్ష్యసాధన, మార్గం స్పురిస్తుంది.

నా లక్ష్యాలని చేరుకునే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు,ఆటంకాలు ఎదురైనా..వాటిని త్రోసిరాజని నా లక్ష్య సాధన ని చేరుకోవడంలో కొత్త ఉత్సాహాన్ని మూటగట్టు కుంటాను. ఆ విధంగా ఈ నాటికి నేను ఆనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను.

వంద రోజులు వంద పోస్ట్లు వ్రాయడంలో విజయం సాధించాను. ఈ మజిలీ లో ఎన్నో వొత్తిళ్ళు ఉన్నాయి.ఎన్నో పెయిన్స్ ఉన్నాయి.రోజుకొక పోస్ట్ వ్రాయాలని కూర్చుంటే.. సమయానికి విషయం తట్టేది కాదు.

ఖాళీగా ఉండి స్పురించిన విషయం వ్రాద్దామంటే కరంట్ ఉండేది కాదు.

ఈ వంద రోజులలో పెద్ద కథలు కూడా వ్రాసాను. అలాగే తీరిక చిక్కనప్పుడు.. ఒక పాట పోస్ట్ చేస్తే బావుంటుంది లే! అనుకునే దాన్ని.

ఒక పాట పోస్ట్ చేయడానికి ఎంతొ ప్రయాస పడాల్సి వచ్చేది. పాట కన్నా.. పోస్ట్ బెటర్ అనుకునేదాన్ని.

ఈ వంద పోస్ట్ లలోనే కాదు.. నా బ్లాగ్ లో పోస్ట్ లు అన్నీ వస్తు వైవిధ్యం ఉండేవిధంగా నేను శ్రద్ద తీసుకుంటాను.

నాకున్న జ్ఞాన పరిధిలో, నాకు వచ్చిన భాషతో.. చక్కగా ప్రజెంట్ చేయాలనే తపన నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నేను బ్లాగ్ వ్రాయడం ని సరదాగాను తీసుకోలేదు , ఆషామాషీగా ను తీసుకోలేదు.

సరదాగా అనిపించాలి అనుకుంటూ వ్రాసిన పోస్ట్ లలో కూడా..మంచి కంటెంట్ ఉండేలా జాగ్రత్త పడేదాన్ని.

ఒక స్త్రీగా.. నాకున్న సౌలభ్యం, గృహిణి గా ఉన్న భాద్యతలు,వృత్తి పరంగా తీరిక లభించని ఒత్తిళ్లలో కూడా నేను బ్లాగ్ వ్రాయడం అనేది నాలో ఓర్పుని,సహనాన్నిపెంచింది.

నేను వ్రాసిన ప్రతి పోస్ట్ ని చదివి నాకు సలహాలు సూచనలు అందించి,నన్ను అభినందించిన మిత్రులకి నేను మనఃపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తూ..

మునుముందు ఇలా వ్రాస్తానో లేదో!

కానీ ఈ వంద పోస్ట్ లు అవిశ్రాంతంగా వ్రాయడం అనేది.. నాకొక సవాల్ గా మాత్రమే కాదు అనేక అనుభవాలని మిగిల్చింది.

బ్లాగింగ్ కూడా అష్టమ వ్యసనం. నేను ఈ క్రమంలో వ్రాయడానికే సమయం ఎక్కువ కేటాయించాల్సి వచ్చింది కాబట్టి ..కొన్ని మంచి పోస్ట్ లని కూడా చదవలేకపోయేదాన్ని. చదివిన పోస్ట్ లకి బాగా నచ్చినప్పటికీ వ్యాఖ్య పెట్టె సమయం కూడా లభించేది కాదు.

ఈ బ్లాగ్ వ్రాయడం ఆనే ప్రక్రియ .. నాకున్న మంచి అలవాట్లని మార్చివేసింది. వాకింగ్ చేయడం ,పుస్తకాలు చదవడం కి గండి కొట్టింది. ఇకపోతే ఆత్మీయుల ఇంటికి వెళ్ళడం కూడా మానేయాల్సి వచ్చింది.

తర్వాత అనిపించింది..ఇంత చిన్న లక్ష్యానికే నేను అనుభవాలు ఎదుర్కొంటే .. పెద్ద పెద్ద లక్ష్యాలని అందుకున్న వారు.. ఎన్నెన్ని వొత్తిళ్ళు తట్టుకుని ఉంటారు, ఎన్ని అవాంతరాలు వచ్చి ఉంటాయి.అయినా వారు మొక్కవోని దీక్షతో ఆ లక్ష్యాలని అందుకుని ఉంటారు అనిపించింది.

ఏది ఏమైనా .. ఇది నాకు ఎదురైన ఒక అనుభవం.

ఆఖరిగా ఒక చిన్న మాట.

ఒక అజ్ఞాత వ్యాఖ్య నన్ను అమితంగా బాధపెట్టింది. "మహా మహులే బ్లాగ్ ని మూసేసుకున్నారు మీరు మూసేసుకోండి"అని ఉచిత సలహా ఇచ్చారు. వారికి మనఃపూర్వక ధన్యవాదములు.

మనం ఆనుకున్న లక్ష్యం నెరవేరుతుందా లేదా అన్నది చెప్పడం కూడా కష్టమే! ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో..ఎవరు ఊహించలేరు.

నేను వ్రాసిన ప్రతి కంటెంట్ నా ఆలోచనలని మధించి వచ్చిందే! నేను చదవడం ద్వారా, వినడం ద్వారా, చూడడం ద్వారా, నా అనుభవాల ద్వారా నాకు లభించిన జ్ఞానాన్ని నేను సంగ్రహించుకుని వ్రాయడం ద్వారా.. వ్యక్తీకరించినదే!ఒక పాటల సాహిత్యం,ఆడియో,వీడియో,కొన్ని చిత్రాలు తప్ప.

నాకు లభించిన సమయాన్ని బట్టి, నా ఆసక్తిని బట్టి.. ఇంకా ఎన్నో వ్రాసుకోవాలని నా కోరిక.

ఎప్పటికైనా నేను మనసు చెప్పిందే చేస్తాను. వ్రాస్తూనే ఉంటాను. నాకుగా నేను వద్దనుకునే దాక. కానీ ఏ ఒకరో చెప్పినంత మాత్రం చేత నా బ్లాగ్ ని మూసేయను.అది నా స్వభావానికి విరుద్దం కూడా. .

ఫ్రెండ్స్!! అల్ ఆఫ్ యు ..థాంక్స్.

29, జులై 2012, ఆదివారం

నివేదిత




ఈ మధ్య నేను సాహితీ నికేతన్ కి వెళ్లి కొన్ని బుక్స్ తీసుకురావాలని అనుకున్నాను. ఈ లోపు.. మా ఫ్రెండ్ రమ అక్కడికి వెళ్లి కాల్ చేసి నీకు ఏం బుక్స్ కావాలని అడిగింది. నేను సిస్టర్ నివేదిత గురించి బుక్ కావాలని చెప్పాను. ఎందుకంటే.. ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి.

నివేదిత
అంటే అర్ధం సమర్పణ.
సిస్టర్ నివేదిత ..ఎక్కడో విన్నట్టు ఉంది కదా! అందమైన వ్యక్తిత్వం కల ఇర్లాండ్ దేశపు యువతి. పదిహేడు సంవత్సరాలకే టీచర్ గా మారింది. ఇరువై అయిదు సంవత్సరాలకే ఒక పాఠశాల స్తాపించింది.
వివేవకనందుడి ప్రసంగం విని ఉత్తెజితురాలయింది . స్వామీజీ ఒక రోజు భారతీయ స్త్రీల గూర్చి చర్చిస్తూ ..మా దేశంలో అమ్మాయిలి ఇప్పటివరకు పాఠశాల ముఖం చూడలేదు. మహిళలు విద్యావంతులు అయ్యేవరకు మా దేశం ప్రగతి సాధించదు. అని మార్గరెట్ వైపు చూస్తూ అన్నారు. నావద్ద మా దేశపు అభివృద్ధి చదువుకోసం వివిధరకాల ప్రణాళికలు ఉన్నాయి. వారిని ఆ పనిలో నిమగ్నం చేయడానికి నువ్వు నాకు సహాయం చేస్తావా? అని అడిగారు.

తనపట్ల స్వామీజికి ఉన్న విశ్వాసానికి మార్గరెట్ ప్రభావితురాలయింది. ఆమె తనకు అంత యోగ్యతా ఉందా అని ఆలోచనలో పడగా ఆమె ఆలోచనలు తెలుసుకున్న స్వామీజీ ప్రపంచాన్ని మార్చేటందుకు నిన్ను నీవు సిద్దం చేసుకోవాలి. అప్పుడు నీతో పాటు మరికొందరు వస్తారు. నీ ఆత్మని మేలుకొలుపు అన్నారు.

బీదరికం,అంటరానితనం,ద్వేషం తదితర చెడు లక్షణాలతో నిండిఉన్న భారత దేశాన్ని ఆమె గమనించి ఆమె అక్కడికి పయనమయ్యారు.

1898 లో ఆమె కలకత్తాకి వచ్చారు. ఆమె తొందరగానే బెంగాలి జీవనం లో ఇమిడిపోయి.. బెంగాలి భాష నేర్చుకుని ఆ బాషా సాహిత్యాన్ని కూడా అర్ధం చేసుకున్నారు.

మార్గరెట్ ని ..ఆ తరువాత వివేకానంద రామకృష్ణ మఠానికి తీసుకుని వెళ్ళారు. ఆమెకి శారదా దేవి ఆస్సీస్సులు లభించాయి. తరువాత మార్గరెట్ హిందువుగా మారి పూజలు చేసారు. ఆమెని వివేకానందుడు ఆశ్వీర్వదించి "నివేదిత" అని నామకరణం చేసారు. పాశ్చాత్య సంస్కృతీ భారతీయ సంస్కృతిగా పరివర్తన చెంది..మార్గరెట్ నివేదిత అయింది.

ఆమె ఒక పాఠశాల ని ప్రారంభించారు.

ఇంటింటికి తిరిగి పెద్దలని ఒప్పించి బాలికలను కూడగట్టుకుని స్త్రీ విద్య కై పాటు పడ్డారు తర్వాత ఆమె సిస్టర్ నివేదిత గా ప్రాచుర్యం పొంది..ప్రజలకి సేవ చేసారు.

కలకత్తా లో ప్లేగు వ్యాది వ్యాపించి లక్షలాది ప్రజలు మరణిస్తుండగా.. ఆమె చలించి పోయి .. స్వయంగా రోగులకి సేవ చేసారు.

మురికి వాడలని,మూత్రశాలని శుభ్రం చేసారు. అది అక్కడి ప్రజలు గమనించి సిగ్గుపడి ప్రజలు ముందుకి వచ్చారు. అలా రోగుల సేవలోనే అలసి..ఆమెకి అనారోగ్యం సోకింది.

ఆమె ఇతరదేశాలకి వెళ్లి భారతీయ సంస్క్రతి ని గూర్చి గొప్ప గా ప్రసంగాలు చేసారు.

భారత దేశం గురించి..కొంతమంది క్రైస్తవ మతస్తులు ప్రపంచానికి చెడు గా చిత్రీకరించడం గుర్తించి.. వాస్తవాలని, భారత దేశం అంటే ఎలా ఉందొ..అన్న విషయాలని.. ప్రపంచ దేశాలకి తన ప్రసంగాల ద్వారా తెలియజేసింది.

అప్పుడు పాశ్చాత్యుల దోరణి మారింది. ఆమె నడుపుతున్న పాఠశాల లకి ధన సహాయం చేసారు.

వివేకానందుడి మరణం తర్వాత ఆమెకి ఇంకా భాద్యత పెరిగింది. స్వామీజికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె పూర్తిగా ఈ దేశ సేవలోనే నిమగ్నమైంది. స్వాతంత్ర్యం కోసం కూడా పోరాటం చేసేలా ప్రోత్సాహం ని అందించింది.

వందేమాతరం గీతం ఆమె నడుపుతున్న పాఠశాల ల లో ప్రార్ధన గీతం అయింది.

ఆమె రాట్నం వడికేవారు. నూలు బట్టలే ధరించేవారు.. అది బెంగాలి ప్రజలకి ఆచరణ అయింది. బెంగాల్ విభజన జరిగినప్పుడు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో నివేదిత స్వయంగా పాల్గొన్నారు.రబీంద్ర నాథ్ ఠాకూర్,గోపాల కృష్ణ గోఖలే, మహత్మా గాంధీజీ , బాల గంగాధర్ తిలక్ మొదలైనవారు ఆమెని తరచూ కలుస్తూండేవారు.

బెంగాల్ వరదలప్పుడు చాలా విస్తృతంగా పర్యటన చేసి సేవలు చేసారు. తీవ్ర అనారోగ్యం కి గురిఅయింది తన సంపద,నగలు అన్నీ బేలూరు మఠం కి సమర్పించింది. దాని ద్వారా ఒక నిధిని ఏర్పాటు చేసి..భారతీయ మహిళలకు జాతీయ శిక్షణ ఇవాలన్నది ఆమె కోరిక.

తర్వాత ఆమె కొద్దికాలానికే మరణించారు.

హిమాలయ సానువుల్లో ఆమె సమాధి చేయ బడింది. ఆ సమాధి మీద "భారత దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించిన సోదరి నివేదిత ఇక్కడ దీర్ఘ నిద్రలో ఉంది" అని వ్రాయబడింది.

ఆమె స్థాపించిన పాఠశాల పెద్ద సంస్థగా అవతరించింది. అక్కడ వేలాదిమంది భారతీయ యువకులు,మహిళలు జాతీయవాదం గురించి శిక్షణ పొందుతున్నారు.

ఒక పాశ్చ్యాత్య వనిత భారతీయ సంస్క్రతి పట్ల ఆకర్షితురాలాయి.. భారతీయ తత్వంలో ఇమిడి పోయి.. సేవా దృక్పదంతో.. తన జీవితాన్ని అంకితం చేసిన సిస్టర్ నివేదిత.. స్పూర్తికరం.

భారతజాతికి గర్వకారణం కూడా. ఆమెకి ఎటువంటి అవార్డులు,రివార్డులు లభించినా.. ఆమె అసలు పేరు మార్గరెట్ నోబుల్. ఈ రోజుకి బెంగాల్ ప్రజలకి సిస్టర్ నివేదిత ఆరాధ్య మైంది .

భారతదేశానికి సేవ చేయడానికి తర్వాత కూడా మరికొందరు వచ్చారు. కానీ వారు.. సేవ పేరిట మతాన్ని కూడా మోసుకునివచ్చారు. సేవ చేసారు. మతం ని జొప్పించారు.

అంతే కదా.. ! భారతీయత అంటే.. ఎవరు ఏం మోసుకుని వచ్చినా స్వీకరించింది. తన లో ఐక్యం చేసుకుంది.

సిస్టర్ నివేదిత గురించి చదవాలి అనుకుంటే "నివేదిత" పుస్తకం సాహిత్యనికేతన్..లో .. లభ్యం అవుతుంది.తప్పక చదవండి.

28, జులై 2012, శనివారం

ఆనంద దీపికలు

ఇచ్చట అనాధ శిశువులను స్వీకరించబడును. 

 ఆ దారిన నడచి వెళుతున్న కొందరు ఆ ఇంటి ముందు కొత్తగా వెలసిన బోర్డ్ ని చూసి ఆశ్చర్యపోయారు. 

 ఆ ఇంట్లో ఉన్న దంపతుల గురించి తెలిసినవారు కొందరేమో.. ఓహో. పిల్లలని పెంచుకోవాలనే ఆలోచన వచ్చినట్లు ఉంది కాబోలు  అని అనుకున్నారు. 

 నెలలు గడచినా ఆ బోర్డ్ అలా ఆ ఇంటి బయట ఉన్న గేటుకి వేలాడుతూనే ఉంది.

 ఒక పత్రికా విలేఖరి ఆ విషయం గమనించి.. వారి ఇంటిలోపలకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అతను లొపలకి ప్రవేశించగానే.. కృష్ణ కనిపించాడు. తెలుసుకోవాలనుకున్న విషయం గురించి కృష్ణ తోనే మాట్లాడిన తర్వాత గాని విషయం ఏమిటో..బోధపడింది. ఆ పత్రికా విలేఖరికి చాలా ఆసక్తి కరమైన విషయాలు కూడా తెలిసాయి. ఇది అనాధ శరణాలయమా..?అడిగాడు. 

 కృష్ణ నవ్వుతూ ..అవునో కాదో మీరే చెప్పాలి..అంటూ.. ఒక నెల క్రితం జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఆ విషయాన్ని చెప్పనారంభించాడు.

 "పూజా.. కాస్త ఆ మూడ్ లో నుండి బయటకు వచ్చి నేను చెప్పిన విషయం గురించి ఆలోచిస్తావా? ప్లీజ్ !! అని సాధ్యమైనంత వేడుకోలుగా అడిగాడు. 

 "ఏమండీ.. నేను అసలు ఈ విషయాన్ని జీర్ణించు కోలేక పోతున్నానండి . ఈ ఇల్లు ముద్దులొలికే పాపల బోసి నవ్వులతో కళ కళ లాడాలని ఎన్ని కలలు కన్నాం. ఇలా ఆలోచించాల్సి వస్తుందని కలనైనా అనుకోలేదు. నా దురదృష్టం ఇలా ఉంది. నేను తల్లినయ్యే అవకాశం లేదని తెలిసిన తర్వాత అయినా కూడా మీరు నాపట్ల చూపుతున్న ప్రేమానురాగాలు నన్ను మరింత క్రుంగ దీస్తున్నాయి. నా బాధ్యతని నాకు గుర్తు చేస్తున్నాయి. ఏమైనా ఈ ఇంటికి ఒక వారసుడు కావాలండి. మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బావుంటుంది. ఆ సంగతి మీరే ఆలోచించండి." అంది పూజ.

 "ఏ పిచ్చీ! పిల్లలు లేనంతమాత్రాన పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు కని పెంచి వారి ఉన్నతికి కారకమైన తల్లిదండ్రులకి వృద్దాప్యంలో ఆసరాగా నిలుస్తున్నారు.!? ఎవరి త్రోవ వారిది అన్నట్లు ఉంటున్నారు. అలాగే అక్రమ సంతానం అని, ఆడపిల్ల పుట్టింది అని, లేదా అవకరాలతో పుట్టారని, పోషించలేని స్థితిలోనూ, పసి గుడ్డులని కూడా చూడకుండా చెత్త కుండీల లోను,మురుగు కాలవుల ప్రక్కనో, కదులుతున్న రైళ్ళలోనూ వదిలేసి వెళుతున్న కసాయి వాళ్ళని చూస్తే .. కన్నవాళ్ళు ఆనే పదానికే మచ్చ తెస్తున్న వాళ్ళని చూస్తే ...ఇంకా తల్లి-బిడ్డ అనుబంధానికి అర్ధం ఉంది అంటావా? అని అడిగాడు. 

"నిజమే అనుకోండి .. కానీ మీరలా ఆలోచించడం నాకు సబబుగా లేదు.మీరు ఇంకో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తే తప్పులేదు,నాకసలు అభ్యంతరం కూడా లేదు " 

"ఎందుకు ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తావు? నేను నిన్ను వదిలి మరో పెళ్లి చేసుకుంటాను ఆనే ఆలోచన నీకు ఎలా వస్తుంది? " కృష్ణ గొంతులో ఆక్రోశం. 

పూజ నుండి మౌనమే సమాధానం అయింది. 

" నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు" అడిగాడు మళ్ళీ .

 "నాకు మీరు చెప్పిన విషయం నచ్చలేదండీ! ఎంత ప్రేమగా పెంచినా మన రక్తం పంచుకున్న బిడ్డలు అవుతారా? పోనీ సరోగ్రేట్ మదర్ కోసం ప్రయత్నిద్దాం.! అలా అయినా ఒప్పుకుంటారా?" ఆశగా అడిగింది పూజ. 

" నీ కోరిక నాకు అర్ధం అయింది..పూజా.. నా వారసుడిని ఇంట్లో ఎలాగైనా చూడాలి.. ఆ బిడ్డ ఈ ఇంట్లో పెరగాలి ఈ ఆస్తి పాస్తులను సంపూర్ణంగా అనుభవించడానికి పూర్తీ హక్కుదారుడు కావాలని నీ కోరిక అంతేనా? " అని అడిగాడు. 

 అవును అన్నట్లు.. భర్త ముఖం వైపు చూసింది. 

 దీర్ఘంగా నిట్టూర్చి.. అన్నాడు  కృష్ణ. "ప్రతి ఒక్కరికి తల్లి-తండ్రిగా మారాలనే కోరిక బలంగానే ఉంటుంది. దురదృష్టవశాత్తు అలాంటి అవకాశం లేనప్పుడు,మరో పెళ్లి చేసుకోవడమో  లేదా ఎవరి బిడ్డనైనా దత్తత తీసుకోవడం తప్పుకాదు. లేదా సరోగ్రేట్ మదర్ ద్వారా వారసుడు కావాలనుకోవడం తప్పు కాదు. అయితే .. ప్రేమాభిమానాలని,ఆస్తి పాస్తులని ఏ ఒక్కరికో పంచి.. వారిని మాత్రమే బిడ్డగా చూసుకుని మురిసిపోవడం కూడా బాగుంటుంది. కానీ నా ఆలోచన ఏమిటంటే.. మన ప్రేమాభిమానాలు, కోట్లాది రూపాయాల ఆస్తిపాస్తులు ఏ ఒక్కరికో కాకుండా.. ఇంకొక పది మందికి పంచ గల్గి.. ఆ పది మందిని పెంచుతూ వారికి ఆసరాగా నిలుస్తూ వారిలో మన ఆశలని,ఆకాంక్షల్ని చూసుకుంటే ఎంత బావుంటుంది అనుకుంటాను. అనాధలుగా పిలవబడుతూ.. ఏ అనాధ శరణాలయాల లోనో పెరగవలసిన పది మంది పిల్లలు.. మనలని అమ్మ-నాన్నా అని పిలుస్తూ మన పిల్లలుగా గుర్తించ బడుతూ.. ఎదిగిన తర్వాత వారి కళ్ళలో వెలిగే కాంతులని చూస్తే కలిగే ఆనందం కి మనం వెలకట్ట గలమా? అందుకే మన ఆస్తులన్నిటి ని ఒక ట్రస్ట్ గా మార్చి ఆ ట్రస్ట్ నిర్వహణ భాద్యత  చేపట్టి.. అనాధ శిశువులకి ఆసరాగా నిలుద్దాం. మనకి పిల్లలు లేరన్న విషయాన్ని మర్చిపోదాం. మన ప్రేమని పది మందికి పంచే భాగ్యం మనకి కల్గినందుకు ఆనందిద్దాం. సరేనా..అన్నాడు కృష్ణ. 

"పది మంది చిన్నారుల తప్పటడుగులని ఆ ఇంటి ఆవరణలో ఊహించుకున్న పూజ కళ్ళల్లో ఆనంద దీపికలు. అలా వెలిసినదే..ఈ ఇంటి ముందు వ్రేలాడ దీసిన బోర్డులోని విషయం. ఇప్పుడు చెప్పండి!? ఇది ఇల్లో.. లేక అనాధ శరణాలయమో!? అని నవ్వుతూ ప్రశించాడు.

విలేఖరి  ఆశ్చర్యంగా  చూస్తూ మరికొన్ని వివరాలు అడగబోయాడు . 

 ఒక ఫోన్  కాల్ ని రిసీవ్ చేసుకుని.. "నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఈ ఇంటి వారసుడు ని స్వయంగా తీసుకుని రావాలి" అని చెప్పాడు ఆ ఇంటి యజమాని కృష్ణ. 

 అప్పుడు..ఆ విలేఖరి.. నేను ఒక్క గొప్ప ఇంటిని.. మాత్రమే కాదు.. ప్రేమాభిమానాలు రాశి పోసుకున్న ఒక ఇంటిని ..అంటూ.. కాదు కాదు.. అమ్మ-నాన్న ల నిలయం ని చూస్తున్నాను. అంటూ గౌరవ భావం తో.. కృష్ణ వెంట తనూ వెళ్ళాడు.