22, జనవరి 2012, ఆదివారం

కథా జగత్ - కథా విశ్లేషణ -3

కథా విశ్లేషణకి నేను ఎంచుకున్న మరో కథ అవశేషం -చంద్రలత   ఈ లింక్ లో కథ చదవవచ్చు.

ఆంధ్రుల అచ్చమైన షడ్రుచుల పచ్చళ్ళ రుచిని పరిచయం చేస్తూ పచ్చళ్ళ తయారీ లోకంలోకి మనని తీసుకువెళ్ళి మనం మరచిన మన మూలాలని పరిచయం చేస్తూ మహిళలు ఆర్ధిక స్వావలంబనని నిలువు టెత్తు  అద్దంలో చూపించి  ప్రపంచీకరణ నేపధ్యంలో మనం మనం కాకుండా అవశేషంగా మిగిలిపోయే దుస్థితికి తీసుకువెళ్ళే పన్నాగాలను చక్కగా వివరించి చెప్పిన కథ  ఇది. 

ముందుగా.. నేటి తరానికి మన సంప్రదాయ ఆహారం ఏమిటో మర్చి పోయేదశలో  కేవలం బర్గర్లు, పిజాలు, సాఫ్ట్ డ్రింక్స్ ఇవే రాజ్యం ఏలుతున్న తరుణంలో చవులూరించే రకరకాల పచ్చళ్ళ లోకంలోకి వెళ్లి రుచి చూసి వచ్చేసామా !?(నేనైతే  రాలేదు ఇంకా అక్కడే ఇన్నాను) తర్వాత పని పాట లేక  లేదా చిన్న పాటి ఆర్ధిక ఆధారం లేక బిడ్డల పై ఆధార పడే అవమాన స్థితిలో ఉన్న ఒంటరి మహిళల  ఆర్ధిక స్వాలంబనకి పచ్చళ్ళ తయారీ ఎలా ఊతమైనదో.. తెలుపుతూ.. ఉన్న చైతన్యం ఉంది ఈ కథలో 

ఆ పచ్చళ్ళని మార్కెటింగ్ చేసుకునే దశలో వారికి కల్గిన అవమానాలని , కుటుంబ సభ్యులనుండి     వచ్చిన వత్తిడులని.. తట్టుకుని ఎలా నిలద్రోక్కుకోగల్గారో చెప్పడం కళ్ళకు కట్టినట్లుగా  ఉంది. 

నిజంగా మహిళా గ్రూప్ల ద్వారా తయారీ అయిన వస్తువులని మార్కెటింగ్ చేసుకునే సదుపాయాలూ అంతంత మాత్రంగానే ఉన్న దశలలో మహిళలు ఆశాజనకంగా ఎలా ముందంజ వేయగలరు? అలాగే పురోగవృద్ది ఎలా సాధ్యం?  ఆ అడ్డంకిలన్నిటింటిని  అధిగమించి ఆత్మవిశ్వాసంతో..తల ఎత్తుకునే  వేళ నడ్డి విరిచేసే కోర్టు ఉత్తర్వు. 

సంప్రదాయ వ్యవసాయరీతులని నాశనం చేసుకుని అధిక ఉత్పత్తుల కోసం నవీన వ్యవసాయ పద్దతులని ఎప్పుడైతే ఆశ్రయించామో  అప్పుడే మనం పండించే పంట సంకరమైపోయింది. అలాగే చీడ పీడా పెరిగిపోయాయి. 
మితిమీరిన ఎరువులవాడకం, క్రిమి సంహారక మందుల వాడకం మూలంగా మనకి తెలియకుండానే మనం పుట్టు రోగాల పాలు అవుతున్నాం.  అధిక దిగుబడి అవసరార్ధం తెలివిగా విదేశి విత్తనాలు మన పంటపొలాల్లో తిష్టవేసాయి.
మనం పండించే పంటల ద్వారా తయారీ అయ్యే ఉత్పత్తులన్నిటికి విదేశి నాణ్యతా ప్రమాణాలుకి సరి పోవడం లేదన్న నెపం వెనుక ఏముందో చదువుకోని  రైతుకు..ఆ పంటలని కొని పచ్చళ్ళ తయారీకి ఉపయోగించిన మహిళకి ఏం తెలుసు? 

ఆరోగ్యానికి  అమితంగా హాని చేసే క్రిమి సంహారక మందులని ప్రభుత్వం ఎందుకు నిషేదించడం లేదు? చిన్న సన్నకారు రైతులకి.. క్రిమి సంహారక మందులు వాడకుండా కంపోస్ట్  ఎరువులు తయారు చేసుకోవడం, సస్యరక్షణా చర్యలు చేసుకోవడం లాంటి అవగాహన ఎంత వరకు ఉంది? ప్రత్యేక వ్యవసాయ క్షేత్రాలు ఏర్పరచుకొని అంతర్జాతీయ   ప్రమాణాలకి అనుగుణంగా పంట పండించే సాంకేతిక నైపుణ్యం అందుబాటులో ఉంటుందా? వస్తుందా? 

ఒకవేళ అలాటి వ్యవసాయ క్షేత్రాల నిర్వహణలో పండించిన పంట ఉత్పత్తులు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయా?  అసలు ప్రభుత్వాలు రైతుకి గిట్టుబాటు ధరలు కల్పిస్తాయా?  ఈ దేశంలో వ్యవసాయం చేయనీయకుండా కార్పోరేట్ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పే  దుష్ట ఆలోచనలతో..బహుళజాతి సంస్థలు ఈ నేలపై కాలూని  క్రమ క్రమేణా    మన పంటలని, మన ఉనికిని నాశనం చేసే పన్నాగాలు రూపొందుతున్నాయని పాపం పచ్చళ్ళు పట్టుకునే వాళ్లకి ఏం తెలుసు? 

 మన మొక్కలపైనా మన కాయలపైనా ఆఖరికి మన సమస్త ప్రకృతి  సంపద పైనా పేటెంట్ హక్కులని సంపాదించుకుని వాళ్ళకి కావాల్సినది వాళ్ళు తయారీ చేసుకోవడానికి మన నేల,మన జనాన్ని అడ్డంగా ఉపయోగించుకునే కుట్రలలో భాగమని పాపం పచ్చళ్ళు తయారే చేసిన మహిళలకి ఏం తెలుసు? 

 ఆరోగ్యాన్ని నాశనం చేసే అవశేషాలు ఉన్న పంటల ఉత్పత్తులని మనం ఎగుమతి చేసి..నేరారోపణని     ఎదుర్కుంటున్నాం.  చీడ పీడలు లేని రానీయని వాళ్ళ  ఏ బి.టి విత్తనాలో కొనుక్కుని మన పంటనో,మన వంకాయనో,మన మామిడి కాయని ఆఖరికి మనని మనం కోల్పోయి  మనం అవశేషం గా మిగులుతామో..అన్న ఆలోచనని మన కళ్ళ ముందు ఉంచిన ఈ కథ.. నాకు నచ్చిన కథ. కేవలం కథలోని పాత్ర..  "వీసెడంటే ఎంతఅని బ్రౌన్ నిఘంటువులు శబ్ద రత్నాకరాలు,  మరొక ప్రక్క తెవికీలు తెగ వెతికేస్తున్న "సంజీవ" పాత్రకి వాళ్ళ బాబాయి లాటి వారికి మాత్రమే అర్ధమయ్యే కథ ఇది.

అయితే ఈ కథ..చేరవలసిన   చోటుకి చేరుతుందా అనేది మాత్రం పెద్ద ప్రశ్న.  
ఈ దేశంలో వ్యవసాయం చేసుకునే చిన్నపాటి రైతులకి పురుగు మందు అవశేషాలు ఉంటే ఆ పంటకి నాణ్యత లేనట్లే అని తెలిసే అవకాశం ఉందా? ఒకవేళ  అలా  తెలిసినా జాగరూకత వహించే విధంగా నాణ్యమైన  విత్తనాలు లభించడం, చీడ పీడలు లేని  అనుకూల వాతావరణ పరిస్థితులు కానీ..ఉన్నాయా? 

అసలు మన రైతుల జీవితాలు అన్నీ బహుళజాతి సంస్థల గుప్పిట బిగించే కాలం ఎంతో దూరంలో లేవు  అనిపించేలా ఉన్న ప్రభుత్వ విధానాలు గురించి ప్రజలకి చెప్పేదెవరు? 

అవసరం ఉన్న వద్దకు ప్రవహించని జ్ఞానం పుస్తకాలో కథలుగా చదువుకుని అర్ధం  చేసుకున్న వాళ్ళు దిగులు పడటం మాత్రమే ఈ కథలో నాకు కనిపించింది.

నిరక్షరాస్యులు, అవగాహన లేని వ్యవసాయదారులవద్దకు ఈ కథలోని అంశాన్ని  తీసుకుని వెళ్ళగల్గినట్లు వ్రాసి ఉంటే  ..ఇది చైతన్యవంతమైన కథ అయి ఉండటానికి నూటికి నూరు శాతం అర్హత ఉన్న కథ. అలా వ్రాయగల్గిన మంచి కథా రచయిత కూడా చంద్రలత గారు. 

4 కామెంట్‌లు:

కాయల నాగేంద్ర చెప్పారు...

మంచి కథను పరిచయం చేసారు. మీ విశ్లేషణ చాలా బాగుందండీ! మొదటి బహుమతి ఈ విశ్లేషణకు రావాలని కోరుకుంటున్నాను.

PALERU చెప్పారు...

i came back:):)

Kottapali చెప్పారు...

విశ్లేషణ బావుంది. ఐతే ఒక కంక్లూజన్ లో మీరు పొరబడ్డారని నాకు అనిపిస్తోంది. వ్యవసాయదారులు, ఉత్పత్తి దారులూ కథలు చదివి చైతన్యం పొందరు. వారిని చైతన్య పరచవలసిన పద్ధతులు మార్గాలు వేరే ఉన్నాయి. ఇటువంటి కథలు - కథలద్వారా చైతన్యం పొందే మనవంటి వారి కోసమే.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

naaraayana swaami gaaru..నిరక్షరాస్యులు,అవగాహన లేని వ్యవసాయదారులవద్దకు ఈ కథలోని అంశం తీసుకుని వెళ్ళ గల్గినట్లు వ్రాసి ఉంటే ..ఇది చైతన్యవంతమైన కథ
మీరు పైన నేను చెప్పినదానిని ఒకసారి గమనించ గలరు. వేరొక పాత్ర ద్వారా పురుగు మందుల అవశేషాలు లేకుండా..పంట పండించాల్సిన అవసరం యెంత ఉందొ..నిరక్షరాస్యులకి వ్యవసాయం చేస్తున్న వాళ్లకి తెలియ జెపుతూ..వాళ్లకి అవగాహన పెరిగివిధంగా తెలియజేయాలి అన్న ఆలోచన ఉన్న పాత్ర ఉండాలి. అలాగే మనని అవశేషం గా మిగల్చడానికి పన్నాగాలు పన్నుతున్న వారి మీద పోరాడాలి. అలా కథని వ్రాసి ఉంటె.. ఇది నూటికి నూరు పాళ్ళు మంచి కథ ..అని చెప్పాను.

మన దేశంలో వ్యవసాయం చేస్తున్నవారికి సేంద్రియ వ్యవసాయ పద్దతుల మీద అంత అవగాహన లేకపోవడం,విచ్చలవిడిగా రసాయనాలు వాడటం వల్ల..ఆ ఉత్పత్తులని వాడే మన ప్రజలకి అది అనారోగ్య హేతువే కదండీ. ఈ విషయం చెప్పడానికి ఒక పాత్ర లేకపోవడం కథలో లోపం అని నేను అనను.కానీ అలా చెప్పగల్గి ఉంటే ఈ కథ చాలా చాలా చాలా మంచి కథ అన్నాను.
ఓపికగా విశ్లేషణ చదివి మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదములు.