5, జూన్ 2012, మంగళవారం

"కిన్నెరసాని "

కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై అది విరుల తేనే చినుకై
కూనలమ్మ కునుకై అది కూచిపూడి నడకై
పచ్చని చేల పావడ కట్టి
కొండమల్లెలే కొప్పున పెట్టి
వచ్చే దొరసాని మా వన్నెల దొరసాని
... ఇది పాటల తోటమాలి వేటూరి.. కలం రసరమ్య వర్ణన కూడిన నడకలు.
ఎవరా "కిన్నెరసాని"
తెలుగు వారందరికీ అత్యంత ప్రియమైన తెలుగింటి పూబోణి. విశ్వనాద కావ్య నాయిక
వారు వర్ణించి నంత కడు రమణీయంగా ఉంటుందా!?
నేను ఓ..ఎనిమి ఏళ్ళ క్రితం కే టి పి ఎస్ .(కొత్త గూడెం ధర్మల్ పవర్ స్టేషన్ ) కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తున్న మా అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అనుకున్నమాట.
గుండాల కి దగ్గరలోనే మా అన్నయ్య వాళ్ళ నివాసం.
ఎప్పుడెప్పుడు "కిన్నెరసాని"డామ్ ని చూద్దామా అని ఒకటే ఆత్రుత. సాయంత్రం అవకముందే తొందరగా వెళ్ళాలని ఒత్తిడిచేసి..జీప్ లొ బయలు దేరాం.

అక్కడ కి వెళ్ళాక కిన్నెరసాని డామ్ పై కి వెళ్లి అంత మనోహరమైన జల సౌందర్యాన్ని,చుట్టూ ఉన్న పచ్చని అడవిని చూసి మది సంబరంతో పరుగులే తీశాను.
మా అన్నయ్య ..ఊరుకోమ్మా ! అందరు చూస్తున్నారు .ఏమిటి చిన్న పిల్లలా ఆ పరుగులు,గంతులు అని అనలేక అనలేక ..మా మేన కోడలని మందలించడం చూసాను.
"ప్రణవి'! ఈ సారి మీ నాన్నగారు లేకుండా ఇక్కడకి వద్దాం. అని నేను నా మేనకోడలు రహస్యంగా చెప్పుకుని...మా అన్నయ్యకి తోడుగా మా వదినని వదిలేసి డామ్ పై నడచుకుంటూ ఓ..కిలోమీటర్ దూరం పైనే పరుగులు తీస్తూ..అలుపు వచ్చినప్పుడు కాస్త ఆగి.. డామ్ లొపలకి దిగి కాళ్ళు చేతులు కడుక్కోవడం,నీళ్ళు చిమ్ముకోవడం చేస్తున్నాం.

అంతలో అమ్మా లొపలకి దిగ వద్దు..మొసళ్ళు ఒడ్డుకి వచ్చి ఉంటే ప్రమాదం అని హెచ్చరించాక..కాస్త మా ఆటవిడుపు చర్యలకి విరామం ఇచ్చి.. కాస్త గంభీరం అయిపోయాం. అలా ఆది పాడి అలసి కొన్ని ఫోటోలు తీసుకుని చీకటి పడుతూ ఉండగా అక్కడ సంచరించడం ప్రమాదమని చెప్పడంతో ఇక వెళ్ళక తప్పదనుకుంటూ అక్కడి నుండి తిరిగి వచ్చేసాం.

అనంతమైన సౌందర్యం.ప్రకృతి సంగీతం..నీటి అలల సవ్వడి..అరకొర మానవుల సవ్వడి.. వేరసీ యా దృశ్యం ఇప్పటికి నా కనుల ముందు కదలాడుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఆటవిడుపుగా వెళ్ళాలనుకుంటే చప్పుమని గుర్తొచ్చే ప్రదేశం కిన్నెరసాని. అక్కడ అభయారణ్యం ఉంది. ఎన్నో జంతువులూ ఆ అరణ్యం లో స్వేచ్చగా తిరిగే టప్పుడు మనం చూసే ఏర్పాటు కూడా ఉంది.

నేను తర్వాత చాలా సార్లు కిన్నెరసాని వెళ్లాలని ప్రయత్నించాను కాని వెళ్ళలేకపోయాను. కిన్నెరసాని చూసిన తర్వాత మరువ నాన్నా మరువలేము. నేను స్వయంగా చూడనప్పుడు కూడా కిన్నెరసాని పై ఒక గొప్ప అనుభూతి భావన ఉండేది. అది నిజం అయింది.

కిన్నెరసాని ని చూసిన తర్వాత విశ్వనాథ వారు కిన్నెరసాని ని వర్ణించిన తీరులో ఎంత భావ గంభీరం,ఎంత సౌందర్యం దాగి ఉన్నాయో కదా! అనిపించింది.

ఇక కిన్నెర సాని గురించి చెప్పాలంటే..


విశ్వనాధ సత్యనారాయణ గారి సొంత ఊరు కృష్ణా జిల్లా నందమూరు.అక్కడ వ్యవసాయం చేయడం అచ్చిరాక భద్రాచలం దగ్గర కాటా పురం లొ భూములు కొని అక్కడ వ్యవసాయం చేసేవారట. అక్కటికి వెళ్ళాలంటే బొగ్గుట్ల నుంచి నడచి "గుండాల"మీదుగా కాటా పురం వెళ్ళాలి అట. అలా తండ్రి వెంట నడచి వెళుతూ కిన్నెరసాని వాగుని చూసారట. వారికి ఆ పరిసర ప్రాంతాలు బాగా నచ్చి కిన్నెరసాని పాటలు అనే కావ్యం వ్రాయడానికి ప్రేరణగా నిలిచింది అని చెపుతారు.

"అసువు లీ దేహమందు ఉన్నంత వరకు
నేను విడలేను కిన్నెరసాని వాగు
నా మనసుని లాగుకోన్నది,లోక
దివ్య మొహనముగా పాడి తెలుగు పాట "
అని ఖండ కావ్యంలో విశ్వనాధ వారు అన్న మాటే కిన్నెరసాని పాటలు అయింది.

కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి గేయ కావ్యాలలో మణి మకుటాయమానమైనది "కిన్నెర సాని పాటలు"

కిన్నెర పాటలు కావ్యంలో ఎనిమిది భాగాలు ఉన్నాయి

అవి..కిన్నెర పుట్టుక,కిన్నెర నడకలు ,కిన్నెర నృత్యం,కిన్నెర సంగీతం,కడలి పొంగు ,కిన్నెర దుఖం,గోదావరి సంగమం కిన్నెర వైభవం.

అసలు ఎవరా కిన్నెరసాని ! ?

ఆమె ఓ..తెలుగింటి కోడలు ఉద్విగ్న హృదయ. ఆమె అత్త మూర్ఖురాలు.ఇంటి పెత్తనం అంతా ఆమెదే!ప్రతి చిన్న విషయానికి కోడలిని నిందించేది

కిన్నెర కి ఆమె భర్తకి మధ్య అరమరికలు లేకపోయినా తల్లి మాటని ఎదిరించలేక మౌనగా ఉండిపోయేవాడు.
అత్త పెట్టిన ఆరళ్ళకు ఓర్చుకోలేక కిన్నెర ఇల్లు విడిచి బయలుదేరింది. ఆమె వెనుక అతను బయలుదేరాడు.
ఆమె వినదు. అలా వెళుతూ వెళుతూ నదిగా మారిపోతుంది..భార్య నదిగా మారడం చూసి అతను కొండగా మారిపోతాడు.

అక్కడ కవి అటు తల్లికి ఇటు భార్యకు చెప్పలేక బండలా పడి ఉన్నాడు కాబట్టి అతను కొండలా మారిపోయాడు అని

కిన్నెర సున్నితమైన హృదయం ఉద్వేగం కలది కాబట్టి నదిగా మారింది.అని వర్ణించడం జరిగింది.

భర్త కొండగా మారడం చూసి ఆమె బాగా శోకించింది మాములుగా మారమని ప్రాదేయపడుతూ ఆ కొండ చుట్టూ తిరుగుతూ వేడుకుంటుంది భర్త ప్రేమ అన్ని గుర్తు తెచ్చుకుని ఇంకెప్పుడు అలా నడుచుకోనని పశ్చాతాపం వ్యక్తపరుస్తుంది. కిన్నెర దుఖం కూడా తనలోని ప్రవాహం లోనే కలసి పోతుంది.

నాకు మల్లె నీవు నది వోలె పారరా

జలముగా ఇద్దరం కలసి పోదామురా
కెరటాలు కెరటాలు కౌగిలిద్దాం రా..

ఓ..నాదా! నాలాగే నీవు నది లాగా మారిపో,ఇద్దరం కలసి పోదాం.తరంగాలు తరంగాలుగా కౌగాలించుకుందాం ..అని వేడుకుంటుంది.

కిన్నెరసాని "విప్రలంబం" ఇక్కడ వర్ణితం

వలదన్న కొద్ది నా పదం లొత్తుచు నీవు
తెలచి కౌగింటిలో తేర్చుకంటూనీవు..
అని గతించిన తమ శృంగారాన్ని కిన్నెర కిన్నెర స్మృతి పథంలోకి తెచ్చుకుంటూ దుఖిస్తుంది.

వద్దనే కొద్ది నీవు నాపాదాలు ఒత్తుతావు. నమస్కారం చేస్తూ కౌగిలిలో చేర్చుకున్నావు అని గుర్తుచేసుకుంటుంది.


భార్యకి భర్త పాదాలు అంటి నమస్కారం చేయడం ఏమిటి అనుకోకండి.

కుపిత నాయికని ప్రసన్నం చేసుకోవడానికి నాయకుడు అనుసరించే మార్గాలలో "నతి" నమస్కారం ఒకటి.
ముక్కు తిమ్మన కూడా పారిజాతాపహరణం ప్రబంధం లొ లొ "నతి " గురించి వర్ణించారు. ఆ లక్షణాలు ఈ కిన్నెర నడకల లొ విశ్వనాధ వారు పరిచయం చేసారు..

నీ యందు తప్పింక నేను చెయ్యను లేర

ఆన వెట్టితిలేని అడుగు దాటాను లేర
ఇక జన్మలో కోపమింత పొందాను లేర!
ఓ..నాదా ఇక నేను తప్పు చేయను .నువ్వు ఆజ్ఞాపించాకుండా ఒక్క అడుగు కూడా బయటకి వేయను ఇక ఈ జన్మలో ఇంట కోపాన్ని ఎప్పుడూ తెచ్చుకోను ..అని చెపుతుంది.

ఇక్కడ విశ్వనాధ వారిలో సాంప్రదాయవాదం కనబడుతుంది. "భర్త అనుజ్ఞా లేకుండా భార్య బయటకి వెళ్లకూడదని వెళితే కష్టాలు ఎదురవుతాయని చెప్పడమే ఉద్దేశ్యంగా కిన్నెర నడకలు లొ ఈ మాటలు కిన్నెర చేత చెప్ప బడినట్లు విమర్శకుల అభిప్రాయం.


ఆయన సమకాలీనులు చలం,మరి కొందరు ప్రవచించిన అతివల స్వేచ్చ కి విశ్వనాధ వారు ఆమోదయోగ్యం కాదని చెపుతారు.

తానూ నదిగా మారిన తర్వాత తన భర్త రాయిగా మారిన తర్వాత కిన్నెర పలవించి పలవించి ఆగిపోయింది భర్త పాషాణ రూపుడై పడిన ప్రదేశంలో వదల లేక వదల లేక గల గలా తిరిగింది బిగ్గరగా విలపించినట్లు ధ్వనించింది తన వియోగాన్ని భర్త ఒర్చుకోలేదని గ్రహించింది అటువంటి ప్రేమ కల్గిన భర్త తోడి కాపురాన్ని ఇలా చేసుకున్నానని బాధపడింది భర్త రాయిగా పడిఉన్న గుట్టను తన కెరటాలతో కౌగలించుకుంది పైన పడి ఏడ్చింది.

నదిగా మారిన ఆమె అక్కడే ఉండటాన్ని గమనించి జలదేవతలు..ముందుకు ప్రవహించమని తొందర పెడతాయి. ఆమె పతి గుట్టని వదలి వెళ్ళలేక వెళుతూ ఉంటుంది. సముద్రుడు ఆమెని తనలో కలుపుకోవాలని ప్రయత్నిస్తాడు .అప్పుడు గోదావరి మాత కిన్నెరని తనలో కలుపుకుని ప్రవహిస్తూ భద్రాద్రి రాముడి పాదాలను తడుపుతూ ముక్తిపథంలో సాగుతుంది
స్థూలంగా "కిన్నెర సాని" కథ ఇది.

ఏమైతేనేం.. విశ్వనాధ వారు "కిన్నెరసాని పాటలు" అనే కావ్యాన్ని 1917 లొ వ్రాయడం ప్రారంభించి 1927 లొ ప్రచురించారు.


ఈ కావ్యం లొ కొన్ని భాగాలని విశ్వనాధవారు స్వయంగా పాడి వినిపించి ప్రజలని మంత్రముగ్ధులని చేసేవారట.

ఏ సభలకి వెళ్ళినా ఈ విషయం పైన ఉపన్యసించడానికి వెళ్ళినా సరే ముందుగా కిన్నెరసాని పాటలు పాడమని పదే పదే అభ్యర్దిన్చేవారట.

అది ఈ కిన్నెరసాని పాటలు గేయ కావ్యానికి ఉన్న రమణీయ చతురత.
విశ్వనాథ వారికి వారి రచనలలో రామాయణ కల్పవృక్షం అంటే అత్యంత ఇష్టం అయితే.. సాహితి ప్రియులేమో..కిన్నెరసాని పాటలని ఎక్కువగా ప్రేమించేవారట.
కిన్నెర నడకలలో వర్ణన ఎలా ఉంది అంటే..

గడియలోపల పేద కాల్వగా గట్టింది
అడవి తోగుల రాని అన్నట్లు తోచింది.

కొబ్బరిపాలు వాకాలు కట్టినట్లయ్యే
వెయ్యవులోకసారి పిడికినట్లై పోయే

తేలి తారకలు వెంట వెలుగులా నిలిచింది
తలిరు పూవులా వెంట తావిలా తోచింది
తెనుగు పాటల వెంట తీపిలా తోచింది. ..

పదుపు కట్టిన లేళ్ళ కదుపులా తోచింది
కదలు తెల్లని పూల నది వోలె కదిలింది
వడలు తెల్లని త్రాచు పడగలా నిలిచింది ..
అంటూ వర్ణించారు .
విశ్వనాథ సత్యనారాయణగారు ఈ కథా కల్పనపై ఏ ఇతర ప్రభావం లేదని చెప్పినప్పటికీ కొందరు సాహితీవేత్తలు చెప్పినట్లు పోలికలు ఉన్న కథలు ఉన్నాయి.

వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడి చెల్లెలు కౌశికి తన అన్న ఆశ్రమంలో తపస్సు చేసుకుంటుంటే సోదర ప్రేమతో ఆ ఆశ్రమ సమీపంలో నదీ రూపంలో ప్రవహించడం (2 )రామరాజ భూషణుడు రచించిన వసుచరిత్రలోని శుక్తిమతి అనే నది కోలాహలుడనే పర్వతం నాయకానాయకులు కావడం (౩)ఆంగ్ల కవిత్వంలో షెల్లీ వ్రాసిన ఎరితూజా (ARETHUSA ) (4 )ఆదునిక కవుల్లో అబ్బూరి రామకృష్ణారావు గారు వ్రాసిన "నదీ సుందరి..ఇలా అయిదు పోలికలు అని చెపుతూ ఉంటారు.

ఇది కిన్నెరసాని పాటలు ..గురించి స్థూలంగా.

సాహితీ ప్రియులు ఇంకా వివరంగా ఈ కావ్యాన్ని చదవాలనుకుంటే "కిన్నెరసాని నడకలు " చదివి తీరాల్సిందే!
తీపి తేనెల తెనుగు పాట విశ్వనాథ వారి సంప్రదాయ కవితా ఒరవడిని తెలుసుకుని తీరాల్సిందే!

(ఈ వ్యాసం వ్రాసేటప్పుడు డిగ్రీ చదివిన నాటి పాఠ్య భాగం ని గుర్తుంచుకుని వ్రాయడం జరిగింది. కిన్నెర నడకలు మాత్రమే చదివాను. ఇక పూర్హి కావ్యం చదివితే ఎంత బాగుండునో అనుకుంటాను. ఏవైనా తప్పులు దొర్లి ఉంటే ఏదైనా పొరబాట్లు ఉంటే గమనించిన విజ్ఞులు మన్నించాలి.)









"సితార" చిత్రంలో ఈ "కిన్నెరసాని " పాట వినేయండి



(ఈ పోస్ట్ లో జత పరచిన చిత్రాలు గూగుల్ చిత్రాలు నుండి సేకరణ)

14 కామెంట్‌లు:

ఫోటాన్ చెప్పారు...

వనజ గారు..!!
టపా బాగా నచ్చింది నాకు.
సితార పాట నాకు చాలా ఇష్టమైన పాట,
కిన్నెరసాని గురించి ఇంత కథ వుందని నాకు తెలియదు.:)

భాస్కర్ కె చెప్పారు...

chaala bhagundiandi,kinnerasani.

సి.ఉమాదేవి చెప్పారు...

వివరణ వేరు,విపులీకరణ వేరు.మీ పోస్ట్ రెండవకోవ లోకి చెందుతుంది.చక్కగా చిన్నప్పుడు నాన్ డిటయిల్డ్ క్లాసులో ఉన్నట్టు అనుభూతి కలిగించారు. అందుకు తగ్గట్టు పాట పుష్పానికి తావి అబ్బినట్లుంది.

అజ్ఞాత చెప్పారు...

ఆనందమానందమాయే.

శ్యామలీయం చెప్పారు...

చాలా బాగా వ్రాసారు.

రసజ్ఞ చెప్పారు...

చక్కని పరిచయం. కిన్నెరసాని పాటలు, గేయ సంపుటి చాలా ఇష్టం. వీటికి అడవి బాపిరాజు గారి చిత్రాలు మరింత వన్నె తెచ్చాయనిపిస్తుంది!

జలతారు వెన్నెల చెప్పారు...

కిన్నెరసాని గురించి పాట వినడమే తప్ప ఇంక ఎమీ తెలియని నాకు, మీ టపా చాలా విషయాలు తెలిపిందండి వనజ గారు.. ధన్యవాదాలు మీకు

రామ్ చెప్పారు...

వనజ గారు, నన్ను మాత్రం మరోసారి కిన్నెరసాని తీసుకవెళ్ళి, అక్కడే వోదిలేసారు మీ టపా తో. అస్సలు కిన్నేరేసాని ఒక అద్భుతం దానిలో వేటూరి గారి బాణీలు వింటుంటే, కళ్ళ ముందు కిన్నెరసాని ప్రవాహం ... ఆ పక్క లేళ్ళ పార్క్.. మరో పక్క అద్దాల మేడలు, మళ్ళీ వెళ్ళాలని వుంది.... మంచి టపా రాసినందుకు ధన్యవాదాలండి.....

జ్యోతిర్మయి చెప్పారు...

నీళ్ళు చూస్తేనే మనసు నిలవదు..ఇక అలా కొండలనడుమ కిన్నెరసాని...బాగా వర్ణించారు. ఫోటోలు చాలా బావున్నాయి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పోటాస్..గారు కిన్నెరసాని ..నచ్చినందుకు ధన్యవాదములు.
@ ది ట్రీ భాస్కర్ గారు..ధన్యవాదములు.
@ సి.ఉమా దేవి గారు..మీ వ్యాఖ్య కి చాలా సంతోషం. ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలె ..గారు కిన్నెరసాని ..నచ్చినందుకు ధన్యవాదములు.
@ శ్యామలీయం గారు..ధన్యవాదములు.మీ వంటి వారికి ఈ పోస్ట్ నచ్చడం చాలా సంతోషం కల్గించింది.
@ రసజ్ఞ గారు..మీ వ్యాఖ్య కి చాలా సంతోషం. ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల ..గారు కిన్నెరసాని ..నచ్చినందుకు ధన్యవాదములు. ఇంకా వివరంగా చదవడానికి ప్రయత్నించండి.
@ రామ్ గారు..ధన్యవాదములు.కిన్నెరసాని డాం..ఈ పోస్ట్ నచ్చడం చాలా సంతోషం కల్గించింది.మళ్ళీ ఒకసారి వెళ్లి రండి. ఆగస్ట్ లో వెళితే రెండు కళ్ళు చాలవు.డిసెంబర్ అయితే కన్నుల పండుగే అనుకోండి.
@ జ్యోతిర్మయి గారు..మీ వ్యాఖ్య కి చాలా సంతోషం. ధన్యవాదములు.ఈ సారి ఇండియా కి వచ్చినప్పుడు కిన్నెరసాని కి వెళ్ళడానికి ప్లాన్ చేయండి. నేను మీతో కలుస్తాను.:) నీళ్ళతో అల్లరి చేసేద్దాం.సరేనా!

అజ్ఞాత చెప్పారు...

కిన్నెరసాని పాటల్లో తెనుగు తేటదనాన్ని చదివాక కూడా విశ్వనాథది పాషాణపాకం అనే వారిని ఏమనాలో నాకు అర్ధం కాదు. మీ కిన్నెరసాని ముచ్చట్లు బాగున్నాయి.

అజ్ఞాత చెప్పారు...

ఇప్పుడే చదవడం జరిగింది.ఎంత miss అయ్యాను. మీరు రాసిందే చదవాలనిపిస్తుంది. నేను చిన్నప్పుడు మా మేనమామ గారింట్లో పుస్తకం ఉండేది...కాస్త చదివిన జ్ఞాపకం....కానీ అప్పటికి అర్థం చేసుకునే తెలివి లేదు.మా తాతగారికి ఆయన మంచి స్నేహితులని మా అమ్మమ్మ చెప్పేది.
మంచి పోస్ట్.ఆనందంగా....భారంగా అనిపించింది చదవగానే.