15, మార్చి 2013, శుక్రవారం

నీలి మొగ్గ



నీలి మొగ్గ

గుప్పిట నుండి  ఇసుకలా కాలం జారిపోయింది 
జీవితం చేజారి పోయినట్లు  

 కొందరికి అంతే ! 
కావాలని పోగోట్టుకోక పోయినా పోతూనే ఉంటుంది 
జీవితం అంటే... 
ఒంటి  చేత్తో నింగి  కెగరడం
 శిధిల స్వప్నాలను మోసుకుంటూ  
తిరగడం  అయితే కాదు కదా !

కొందరంతే ! వెదికినా దొరకనంత గా దోచేసుకుని వెళ్లి పోతారు  
వేరెవరకి  ఇవ్వ లేనంతగా... నిస్సహాయతని నింపి వెళతారు     
దొరికేది ఏదైనా పోయింది ఎన్నటికి తిరిగి రానిదే  కదా ! 

పోగొట్టుకోవడం అనే అలవాటులో 
శూన్యం నింపుకున్న కళ్ళల్లో ఎప్పుడైనా 
అప్రయత్నంగా కారే కన్నీళ్ళు పోయిన దాని కోసం కాదు   
మళ్ళీ  మళ్ళీ మనసెక్కడ గాయ పడుతుందో నని 
   
బరువు గుండె మేఘాన్ని బాధ తెమ్మెర తాకినట్లు 
ఉన్మత్త తాకిడికి మనో ఆవరణ మంతా ధ్వంసమైనట్లు 
ఉలికులికి  పడుతూ ఉంటుంది. 

చిత్త ప్రవృ త్తుల  దాడులకి నలిగిపోయిన
ముగ్ద  మనోహర  ఈ  మొగ్గ   
వెంటాడే  నీలి నీడల ఉచ్చులని  తప్పించుకుని  
నడత నడక  మార్చుకుంటూ   
నేల రాలిన ఆశలని  మిణుగురుల వెలుగు లో ఏరుకుంటూ  
నవ్యోద్దీపనం గావించుకుంటుంది   


కాస్తో కూస్తో మిగిలిన నికార్సైన మనుగడతో  
కాసిని కలలు,  కూసిని కన్నీళ్ళు 
జీవితపు అక్షయ పాత్రలో  మిగిలిన  మెతుకుల్లా...  
అవి తన  కోసమే కాదు ఇతరుల కోసం 
పంచడానికి  ఉన్నాయనుకున్నపుడు 

పోయింది ఏదో తిరిగి దొరికినట్లు  
ఓ తీగ కొస చేతికందినట్లు 
ఓ ఆశ శ్వాసిస్తున్నట్లు   
ఓ ఉమ్మెత్త పుష్పించినట్లు 
ఈ నీలి మొగ్గ వికసించుతూ  

12 కామెంట్‌లు:

జలతారు వెన్నెల చెప్పారు...

Simply superb!!! ఇలా మీరు మాత్రమే రాయగలరు.

అజ్ఞాత చెప్పారు...

జలతారు వెన్నెలగారి మాటే నా మాట

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"కొందరికి అంతే !
కావాలని పోగోట్టుకోక పోయినా పోతూనే ఉంటుంది..."

నిజమేనండీ "నీలి మొగ్గ" చాలా బాగుంది...

హితైషి చెప్పారు...

సమాజం చేసిన అతి క్రూర వినోద వృత్తి అమాయక యువతులని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించడం. వారిపై సానుభూతి చూపిస్తూ ఎంతో మంది కవిత్వం వ్రాస్తారు. కానీ మీలా ఇలా ఎవరు మాత్రం వ్రాయలేరనిపిస్తుంది. ఆశతో ఎందుకు జీవించాలో చెబుతుంది ఈ కవిత. హాట్స్ అఫ్ యూ వనజ గారు.

చెప్పాలంటే...... చెప్పారు...

enta baavundante vanaja gaaru maatalu levu cheppadaaniki sooooNice...............

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు .. మరీ మరీ ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టే ఫలే మాస్టారూ .. హృదయపూర్వక ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు థాంక్ యు సో మచ్

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వైష్ణవి గారు విధి వంచితులుగా మిగిలిన కొందరిని చూస్తే అందరికి ఏహ్యభావం. వారు అలాంటి జీవితం లో ఉండిపోవాలని ఉండరు అందరిలా బ్రతకాలని కోరుకుంటారు. వారికి జీవితం పై ఆశ ఉంటుందని చెప్పడమే నా ఉద్దేశ్యం
వారిని అసహ్యించుకోవడం లేదా సానుభూతి చూపించడమో కాదు కావాల్సింది. ఆశ తో జీవించడం ఉండాలి కదా! ఒక నీలి మొగ్గ నీ చూసి ఈ కవిత్వం పుట్టింది .

మీకు నచ్చినందుకు ధన్యవాదములు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మంజు గారు కవిత నచ్చినందుకు ధన్యవాదములు .

సామాన్య చెప్పారు...


వనజ గారూ నీలి మొగ్గ ని కిందికీ పైకీ ఎన్ని సార్లు చదివానో చెప్పలేను ,చాలా నచ్చింది .చాలా దిగులు కూడా వేసింది . ''అప్రయత్నంగా కారే కన్నీళ్ళు పోయిన దాని కోసం కాదు మళ్ళీ మళ్ళీ మనసు ఎక్కడ గాయ పడుతుందో అన్నట్లు భీతిల్లుతుంది '' -- ఈ వాక్యాలు నాకు చాలా దగ్గరగా వచ్చాయి .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సామాన్య గారు "నీలి మొగ్గ " మీ మనసుని తాకినందుకు సంతోషం. ధన్యవాదములు

కానీ నీలి మొగ్గ ల గురించి తలచుకుంటేనే ఆవేదన ముంచుకొస్తూ ఉంటుంది

వ్యధాభరిత జీవిత వాస్తవ "నీలి మొగ్గ " గురించి నేను వ్రాసిన కవనం ఆశాజనకం గా ఉండటమే కాదు" నీలి మొగ్గ " కూడా అలాగే ఆశాజనకంగా జీవితం సాగిస్తుంది