23, అక్టోబర్ 2019, బుధవారం

హృదయానికి లంకె ..

కొన్ని యుగళగీతాలు చూస్తుంటే ... నిత్య యవ్వన మనస్కులై ఉన్నట్టు ఉంటుంది. గతకాలంలోకి మనసెళ్ళి కూర్చుంటుంది. ఈ పాటను చూస్తుంటే కూడా అంతే ! 
"చరిత్రహీన్ " చిత్రంలో ఈ పాట  చిత్రీకరణ, సాహిత్యం సంగీతం అన్నీ బాగుంటాయి.. అందుకే .. యీ స్వేచ్చానువాదం .

పల్లవి:  మనసు మనసుతో కలవడానికి  ఏదో ఒక  కారణం ఉండాలి
 కారణం లేకుండా ఏమీ జరగదు, కాబట్టి దానికి ఒక కారణం ఉండాలి

1: మనమింకా  ఒకరికొకరు అపరిచితులమే 
  కానీ ఎవరైనా మన వైపు చూస్తే, మనము  ఒకరినొకరు సంవత్సరాల తరబడి   తెలుసునని  అనుకోవచ్చు
 హో హో హో
మన  ఇద్దరి మధ్య ఉమ్మడిగా ఏదో  వుంది ఉండాలి
లేకపోతే మనమిద్దరూ ఈ ప్రదేశంలో మరియు  ఇలాంటి వాతావరణంలో ఎందుకు ఉంటాము 

2: నువ్వు నేను  ఒకరినొకరు ప్రేమిస్తున్నామనడంలో సందేహం లేదు
 కేవలం రెండుసార్లు కలిసామో లేదో  తర్వాత మాకు  నిద్రకరువైపోయింది 
హో హో హో
 మనం  ఒకరినొకరు లేకుండా రోజులు ఎలా గడపబోతున్నాం
 ఒంటరిగా ఒక రాత్రి కూడా గడపడాన్ని  ఇప్పుడు  ఊహించలేము
మనసు మనసుతో కలవడానికి  ఏదో ఒక  కారణం ఉండాలి
 కారణం లేకుండా ఏమీ జరగదు, కాబట్టి దానికి ఒక కారణం ఉండాలి

3: తెలుసా యెక్కడి నుండి వచ్చావో నీవు, నేను  యెక్కడ నుండి వచ్చామో తెలుసు 
ఒకరి నేపధ్యం ఒకరికి తెలియదు  హృదయాల  చిరునామా మాత్రం తెలుసు 
యెలా కలిసామో పిచ్చోళ్ళు లాగా
బహుశా .. మన యిద్దరిదీ వొకే గమ్యం అయివుంటుంది. 
లేదంటే మన కలయిక జరిగేది కాదు  

మనసు మనసుతో కలవడానికి  ఏదో ఒక  కారణం ఉండాలి
కారణం లేకుండా ఏమీ జరగదు, కాబట్టి దానికి ఒక కారణం ఉండాలి

दिल से दिल मिलने का कोई कारण होगा बिना कारण कोई बात नहीं होती वैसे तो हम दोनों एक दूजे से हैं अभी अनजाने कोई अगर देखे तो कहे, बरसों के हैं मीत पुराने कुछ है तुम में हम में, वर्ना इस मौसम में फूलों की ऐसी बारात नहीं होती हो ना हो हम तुम में प्यार है, शक इस में नही है कोई दो ही मुलाकातों में निगोड़े नैनों ने निंदिया खोयी ऐसे दिन बीतेंगे, कैसे दिन बीतेंगे अब तो बसर एक रात नही होती जाने कहा से आये हो तुम, हम आये कहा से जाने तुम को खबर ना हम को पता दिल कैसे मिले दीवाने शायद हम दोनों का एक ही रस्ता होगा वर्ना हमारी मुलाकात नहीं होती  


 వీడియో ఇక్కడ చూడండి ... 



పైన లింక్ లో యూ ట్యూబ్ లో కూడా చూడవచ్చు .. 

16, అక్టోబర్ 2019, బుధవారం

పేరులోనే వున్నది..

చిగురించిన శిశిరం కథ ప్రచురణకు రాకమునుపు ఆ.. కథకు నేను పెట్టిన పేరు .. రాతి హృదయం. అసలు ఈ కథ “చేరేదెటకో తెలిసి” అనే కథకు సీక్వెల్ గా రాసిన కథ. కొద్ది గంటల్లో విరామం తీసుకోకుండా వ్రాసిన కథ. ఆదివారం సంచికలో ప్రచురణకు అనుకూలంగా దాదాపు 1500 పదాలకు కాస్త అటునిటుగా కుదింపబడిన కథ. ఈ కథకు రాతిహృదయం అనే టైటిల్ కన్నా “చిగురించిన శిశిరం” అని పెడితే బావుంటుంది అని సూచిస్తే సరేనన్నాను. ఎందుకంటే మంచి మంచి కథలు వ్రాసి నిత్యం యెన్నో కథలు చదివి పాఠకుల నాడిని గ్రహించగల్గిన వారి అనుభవం కదా..! ఇతివృత్తానికి తగినట్టు అని వారి అంచనా నిజమవుతుంది


ఇక యీ  కథ ప్రచురితమయ్యాక వచ్చిన స్పందన చూసి ఉబ్బితబ్బిబ్బైపోయాను. ఇన్నాళ్ల తర్వాత యీ  వారంలో కూడా నిర్మల్ నుండి ఒక హెడ్మాష్టర్ గారు ఫోన్ చేసి అభినందించి నేను మర్చిపోలేని కథ అందించారమ్మా.. మీరు నాకన్నా చిన్నవారు. కానీ మీ పాదాలకు నమస్కరించాలని వుందమ్మా అన్నారు. ఒకోసారి ప్రశంసలు కూడా యిబ్బంది పెడతాయి. కథలు వచ్చినప్పుడల్లా మెసేజ్ పెట్టండి అని అభ్యర్దన. నెంబరు సేవ్ చేసుకున్నాను. ఫోన్ తీయగానే యదాలాపంగా మాట్లాడుతూ పేరు సరిగా వినం కదా... మీ పేరు సర్.. అని అడగలేకపోయాను. 😞 ఈ సారి కనుక్కోవాలి.
ఇకపోతే ఈ కథ వచ్చాక ఇదే పేరుతో రెండు కథలు వచ్చాయి. అదేమిటో కథలకు పేరు పెట్టుకునే టపుడు  తనిఖీ చేసుకోరా..! నేను కథకు పేరు పెట్టేటపుడు అంతకుముందు యెవరైనా ఆ పేరు పెట్టారో లేదో చూసుకుని మరీ పెడతాను. కాస్త పొయటిక్ గా వుండేటట్లు జాగ్రత్త పడతాను. పేరులో పెన్నిధి వుందంటారే అలాగన్నమాట. కథకైనా కవితకైనా వ్యాసానికైనా శీర్షిక, ఎత్తుగడ, ముగింపు ప్రాణం. అవి బాగుండకపోతే అంతగా పాఠకులను ఆకట్టుకోవని నా అనుభవం కూడా! 
నా కథల టైటిల్స్ కు అభిమానులున్నారు.  ప్రముఖ రచయిత్రి చంద్రలత ... ఫోన్ చేసి కథల గురించి మాట్లాడుతూ టైటిల్స్ గురించి ప్రత్యేకించి అభినందించారు. ఈ మధ్య "పూలమ్మి " టైటిల్ కూడా మరొక చోట కనబడింది. ఇతివృత్తాన్ని బట్టి శీర్షిక పెట్టడంలో సగం విజయం లభించినట్లే అనుకుంటాను. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ వుంటాను. ముందు టైటిల్స్ అనుకుని వ్రాసిన కథలు వున్నాయి. అట్లాంటా  వున్న శారద గారు, తిరుపతి లో వున్నా విజయ కుమార్ గారు నా కథల టైటిల్స్ కు పెద్ద అభిమానులు.
ఈ మధ్య వ్రాసిన "నీట చిత్తరువు " టైటిల్ అర్ధం కాని  ఎడిటర్ కూడా వున్నారు . నీటి చిత్తరువు అంటే వాటర్ కలర్స్ తో వేసిన చిత్రమా అని అడిగారు కూడా ! నా తలకాయ అనుకుని నీటి చిత్తరువు కాదండీ .."నీట చిత్తరువు " అంటే నీటిలో కనిపించే చిత్రం అని వివరించాల్సి వచ్చింది. సరే .. ఎలాగూ వాళ్ళు ఆ కథ ప్రచురణకు అంగీకరించలేదనుకోండి. 
ఇప్పటికి తొంబై అయిదు కథలు వెలువడ్డాయి. ఇరవై ఆరేళ్ళ క్రితం రాసుకున్న "జాతర" కథ తర్వాత "వేకువ పువ్వు " అనే కథ వ్రాసాను. ఆ వ్రాసుకున్న ప్రతి కనిపించలేదు కానీ ..కథ గుర్తుంది . మళ్ళీ వ్రాస్తున్నాను. పంతొమ్మిదేళ్ళ క్రితం వ్రాసిన కథానిక "బంగారు " ..ఇలా తొంబై అయిదు  కథలు ఈబ్లాగులో ..మీరు బ్లాగ్ తెరిచిన తర్వాత కిందికి చూస్తూ  కుడివైపున ..ఒకచూపు వేస్తే ... నా కథలు శీర్షికలో అన్ని కథల లంకె లు వున్నాయి. హాయిగా చదువుకోవడానికి నేను శ్రద్ధ తీసుకుని అలా లంకెలు యిచ్చాను. పత్రికలలో వచ్చిన కథలన్నింటిని రెండుమూడు రోజులుగా పిడిఎఫ్ ఫైల్ లోకి మార్చి వుంచాను. ఆ లింక్స్ కూడా ఇవ్వగలను. 
ఇంకా మెదడులో సంక్లిప్తమైన బ్లూ ప్రింట్ లో వున్న అనేకానేక కథలు వున్నాయి . ఓ అయిదు కథలున్నాయి కానీ నాలుగు నెలలుదాకా వాటిని పంచుకునే ఉద్దేశ్యం లేదు . పత్రికలకు పంపే ఆలోచన లేదు . బ్లాగ్ లో రాసిన టపాలలో చాలా అచ్చుతప్పులున్నాయి. వాటన్నింటిని సరిచేసుకోవాలి ముందు. అప్పుడు హడావిడిగా వ్రాసేసాను. కొంత తెలియక తప్పులు వ్రాసేసాను. అజ్ఞానం అలా వర్ధిల్లింది. ఏమైనా ... సహృదయంతో చదివిన మిత్రులందరికీ నమస్సులు. ధన్యవాదాలు.  
నా కథా ప్రయాణం గురించి ఎవరూ నన్ను అడగలేదు. పత్రికలలో పరిచయానికి నాకంత ఉత్సాహం లేదు అనేదానికన్నా ..అసలు అడిగినవారు లేరు. నా కథా ప్రయాణం గురించి నేను చెప్పుకోవడమే తప్ప. నాకు పత్రికలలో పనిచేసేవారిలో స్నేహితులు లేరు. అలాగే నాకొక కోటరీ (గుంపు ) లేదు. నేను వారిని పొగుడుతూ ఉంటే బదులుగా వారొచ్చి నను పొగుడుతూ వుంటారన్నమాట. అందుకు నేనెప్పుడూ దూరం కాబట్టి ... ఎంత ప్రశాంతంగా జరిగిపోతున్నాయో రోజులు.  :) 
మళ్ళీ చెపుతున్నాను ..పేరులోనే పెన్నిధి వుంది ..అనుకోవాలి అనుకుంటుంటే .. పేరులో ఏముంది అన్నారు ఒకరు. ఇదంతా కూడా చెప్పాలిప్పుడు.  :) 
పేరు ఉచ్చరించినప్పుడు వెలువడే వైబ్రేషన్స్ పాజిటివ్ గానూ నెగిటివ్ గానూ కూడా వుంటాయట. శబ్దం కూడా లయాత్మకంగా అర్ధవంతంగా వుండటం వల్ల  వీనులవిందుగా వుంటుంది కదా ! 
నా పేరు పెట్టేటప్పుడు కూడా ..మా అమ్మ చాలా శ్రద్దగా నా పేరు పెట్టారంట. నా  పేరులో వున్న మూడక్షరాలు. హల్లులే కదా ! హల్లులు పలకాలంటే అచ్చులు సహాయం లేకుండా పలకడమే కుదరదు కదా ! నా వరకు నా పేరంటే చాలా యిష్టం కూడా ! 
వనమున జనియించినది , నీటిలో జనియించినది ... నీలి కమలం   



14, అక్టోబర్ 2019, సోమవారం

తండ్రి ప్రణవమై.. తల్లి భ్రమరమై.. శ్రీ గిరి శిఖరాన.



శ్రీశైలం అనగానే క్షణంలో మనసు అక్కడ వాలిపోతుంది. ఇంటి దగ్గరనుండి బయలుదేరినప్పుడు నుండి మాత్రమేనా .. కాదు ప్రయాణానికి నాంది పలికినప్పుడే ..మనసెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి స్వామి దీవెన తీసుకున్న భావన కల్గుతుంది. అది నాకు నూతన శక్తిని ప్రశాంతతను మొక్కవోని ధైర్యాన్ని యిస్తుంది.

ఇక శరీరమెళ్ళి శ్రీ గిరి పర్వతంపై శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం ముందు నిలబడుతుంది.ధూళి దర్శనం కోసం పరుగు పరుగున క్యూ లైన్ లో నిలబడుతుంది.

ఆ గోపురం  క్రింద నుండి లోనికి అత్యంత ఇష్టంగా  ప్రవేశించి ధ్వజస్తంభాన్ని భక్తితో తాకి నందీశ్వరుడి ప్రక్కగా వెళుతూ "నందీశ్వరాయ నమస్తుభ్యం, సాంబానంద ప్రదాయక ,మాహాదేవస్య   సేవార్ధం  అనుజ్ఞాoదాతు మర్హనీ" అని భక్తిగా నమస్కరించుకుని ఆయనను దాటేదాకా  ఆ సుందర మూర్తిని చెక్కిన శిల్పుల చేతిలో ఉలి విన్యాసాలను ప్రశంశించుకుంటూ భక్తిభావం అంకిత భావం లేకపోతే రాతికి ఆ సౌందర్యత్వాన్ని వీరత్వాన్ని ప్రాణత్వాన్ని తేగలరా అనుకుంటూ వీరమండపంలోకి ప్రవేశిస్తాను.  వీరమండపాన్ని చూస్తూ ఇదిగో యిక్కడే కదా భక్తితో కాళ్ళు చేతులను తెగనరుక్కుని స్వామికి సమర్పించుకుంది అలాగే ఇంకొందరు  ఆఖరికి ప్రాణాలను కూడా వీరభక్తితో స్వామికి సమర్పించుకుంది అని తలపోస్తాను. వొళ్ళు జలదరిస్తుంది కూడా.

ముందు తల్లిని దర్శించుకోవాలంట అని పెద్దవాళ్ళు చెప్పిన మాటను గుర్తుకు తెచ్చుకోనట్టే నటిస్తూ తండ్రిని చూసుకోవాలని ఉవ్విళ్ళూరుతాను .  పసి బిడ్డపై తండ్రి కురిపించే  ప్రేమను అనురాగాన్ని తలపించే ఆయన స్పర్శను చెప్పలేని శాంతిని నెమ్మదిని కల్గిస్తుంది. ఆ స్పర్శను  ఆ దీవెనను పొందేదాకా  మనసు పడే ఆరాటం  ఆ ఉద్విగ్నత యిక్కడ అక్షరాలలో చెప్పలేను. ఆ స్పర్శను  అణువణువునా అనుభవించి   గాఢ అనుభూతిని చెంది మైమరుపుతో ఆనందాశ్రువులతో వెనుదిరిగి చూస్తూ మసక మసక గా కనిపిస్తున్న ఆ రూపానికి నమస్కరించుకుంటూ మరల ఎప్పుడు ఈ భాగ్యం కల్గిస్తావు తండ్రీ అనుకుంటూ బయటకు వచ్చేస్తాను. తర్వాత స్వామి వెనక్కి వచ్చి  ధ్వజ స్థంభంకి సమీపంగా కుడిపక్కగా కాసేపు కూర్చుంటాను. బడి లోపలకి  వదిలేసి వెళ్లిన తండ్రిని తలుచుకుని పిల్ల బెంగపడినట్లు బెంగపడుతూ ... కాసేపు గోపుర కలశంపై  ఆ పై  ఎగిరే  తూనీగలను పావురాలను చూస్తూ మనసుకు శాంతి పొందుతాను.


ఆ తర్వాత అమ్మ దర్శనం కోసం కొంచెం పైకి వెళ్ళాలి కదా! పైకి ప్రాకుకుంటూ వెళ్ళిన పసిపిల్లలా నిదానంగా అక్కడికి వెళతామా ... ఎంత చల్లని తల్లి. హడావిడి ఏమీ లేకుండా .. తన చల్లని చూపులతో తడిమి.. రా ..రమ్మంటూ పిలిచి  ఆపైన అక్కునజేర్చుకుంటుంది అక్కుపక్షిలాంటి యీ మానవ దేహాన్ని.  ఆ పరిష్వంగానికీ  సంతసించి .. పులకించి .. అమ్మ పాదాలకు కదా ముందు నమస్కరించుకోవాల్సించింది. అదేమిటి అమ్మను ఇలా హత్తుకున్నాను అని స్ఫురణకు  తెచ్చుకుని "అమ్మా మన్నించు... నీ పాద ధూళిని శిరస్సున ధరిస్తున్నాను తల్లీ, నీ అనంతమైన కరుణ నీడు మిక్కిలి ప్రేమతో  నన్ను నా  బిడ్డలను  నా చుట్టూ వున్న సర్వ ప్రపంచాన్ని చల్లగా కాస్తున్నఅమ్మవు అమ్మలును గన్న అమ్మవు  కదమ్మా"  అనుకుంటూ అక్కడి నుండి చిన్నగా కదులుతూ ..బయటకు వచ్చి నీకు ఎడమ పక్క ఉన్న దేవ గన్నేరు చెట్టును చూడటం అక్కడ కూర్చోవడం కాసిని పూలు యేరుకుని ఆ పూల సౌందర్యాన్ని చూస్తూ పరిమళాన్ని ఆఘ్రాణించాలని మోహపడి మళ్ళీ వెంటనే ... నీ పూజకు పూసిన పూలు కదా యివి అనుకుంటూ గుండెలకు హత్తుకుంటాను. ఈ క్షణాన నా హృదయపుష్పమే నీకు సమర్పించితిని తల్లి అనుకుంటాను.

తర్వాత యెవరూ అభ్యంతర పెట్టకపొతే నీ వెనుకకు వెళ్ళి  గుడి ప్రాకారానికి మధ్యలో  నువ్వు మా అందరిని కరుణించడానికి ఆసీనమైన వెనుక భాగాన రాతి కట్టడాన్ని చీల్చుకుని వచ్చే భ్రమర నాదాన్ని వొంటి చెవి ఆనించి వినడానికి ఉత్సుకత చూపుతాను. నీ దర్శనమైతే తేలికగా యిస్తావుగాని తల్లీ ..నిన్ను అసాంతంగా చేరుకోవడం అంత సులభమా తల్లీ .. ఎన్ని వ్యామోహాలను విడనాడాలి. ఎంత  ఏకాగ్రత కల్గిన చిత్తం ఉండాలి మరి . అంత దుర్లభమైన దారిలో  నేనున్నాను కాబట్టి తేలిగ్గా కరుణించే నాయనను వేడుకోవడం నా అతితెలివి కాదనుకుంటాను. అమ్మంటే క్రమశిక్షణ కదా అనుకుంటాను. ఎంత చల్లని తల్లివైనా క్రమశిక్షణ క్రమశిక్షణే అంటున్నట్టు ఉంటావు కదా నీవు. నీ సామీప్యాన్ని వొదిలి బయటకు వస్తానా,  తమ  ఝుంకారాలనూ వినిపిస్తూ అక్కడే సంచారం చేస్తున్న అనేకానేక భ్రమరములు... వాటితో పాటు నేను సంచరిస్తూ .. మళ్ళీ సాయంత్రానికి నీ దర్శనం కోసం  ఆలోచన చేస్తూ ముందుకు కదులుతాను. మళ్ళీ రేపటి దర్శనం కోసం అనుమతులకై వెతుకులాడతాను.

నా ప్రతి దర్శనానుభవమూ ..నాకొక ఉత్తుంగ తరంగమే!  నా తండ్రి  ప్రణవమై  నాతల్లి భ్రమరమై ... శ్రీ గిరి శిఖరమున ఆసీనులై వుండి తమ కరుణామృత దృక్కులను పంచభూతాలలో ఎనిమిది దిక్కులలో ప్రసరిస్తున్న క్షేత్రం ... నాకత్యంత యిష్టమైన నెలవు. మానసిక దర్శనం చేసుకుని ... ఇలా ఆ భావనను అక్షరీకరించడం కూడా వారి దయాశీస్సులే కదా!

శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామియే నమః. ఓం నమఃశివాయ

ఓం నమః శంభవే చ  మాయో భవే చ   నమః శంకరాయ చ  మయస్కరాయ చ  నమఃశివాయ చ శివతరాయ చ నమః





.ఓం నమః శివాయ  🙏🙏🙏