బండబారిన నీ మొరటు పాదాలు నా మొజాయిక్ బండలపై మురికి ముద్రలు వేశాయని ఆగ్రహించిననాడు
ఆ పాదాలే ముళ్ళు రాళ్ళు ఉన్న బాటలో నడచి నాకు పూల దారి పరచాయని .
కాఠిన్యం చూపే నీ చూపుల కరకు దనానికి బలి అయ్యానని నిరశించిన నాడు
యెర్రని నీ కనుల జీరలలో రక్తాశ్రువలని జారకుండా ఉబికి పట్టావని
చెళ్ళున చరచినట్లున్న నీ మాటలు తూటాల లా గుచ్చి చంపెస్తాయని ద్వేషించిన నాడు
ఆ గుండెల్లో దాగున్న కరుణా మృతాన్ని కప్పి పెట్టావని
ఒంటరి తనపు రాకాసికి నన్ను వదిలి వెళ్ళిన రాత్రుళ్ళని అసహ్యించుకుంటూ ఎదిగిన నాడు
నన్ను వీపున మోస్తూ నన్ను కంటికి రెప్పలా కాపాడావన్న నిజాన్ని
నాకు పాల బువ్వలు తినిపించడానికి,నాకు జ్ఞానం దుప్పటి కప్పడానికి
ఆకాశం పైకప్పు క్రిందనే శ్రమించి విశ్రమించిన నీ అసిధార వ్రతాన్ని ..
నేను ఎలా మరువగలను ..ఓ..తండ్రిగా నీలా నేను మారిన తరుణాన
నా కూతురిలో నన్ను చూసుకున్న ఒకానొక రోజున
నా కళ్ళకు కమ్మిన పొరలు విడిపోయాక .
ఎన్నాళ్ళకో గుర్తించిన మహత్తర క్షణాల లో
కంటికి కనబడని దయార్ద్రతని,
అణువూ అణువూ నిండిన
ప్రేమామృతం ని చవి చూడాలనుకుంటూ
అర్ధం చేసుకోవడానికి చేయని ప్రయత్నాన్ని
నిసిగ్గుగా ఒప్పుకుందా మనుకుంటూ ..
ప్రేమగా నీ కట్టేబారిన ముతకబారిన కాయంలో
ఇంకా ఆరని ప్రేమ తడి ని వేదుక్కోవాలునుకుంటూ
వెళ్ళిన నాకు "అమ్మ" ఒంటరితనంలోనే
శాశ్వతంగా విశ్రమించిన దృశ్యంలోఆవరించిన నిస్సత్తువ
ఆమె పార్ధివ దేహం ని దహించిన అగ్ని కీలలలో
అహంకారమే కాదు అజ్ఞానం కాలి బూడిద యింది ..
కార్చే కన్నీళ్ళలో .. హృదయం ప్రక్షాళనం అయింది.
"అమ్మ" మాత్రం సజీవమై ఉంది.. నిత్య సంజీవని గాను ఉంది.
ఇప్పటి నా అడుగుల్లో బండ బారిన పాదాలే సాక్షిగా ..
12 కామెంట్లు:
తండ్రిగా మారి తన కూతురిలో మళ్ళీ అమ్మను చూసుకున్నాక కాని అమ్మ విలువ తెలుసుకోలేకపోయాడనమాట! చాలా బాగుంది వనజ గారు!
"నేను ఎలా మరువగలను ..ఓ..తండ్రిగా నీలా నేను మారిన తరుణాన
నా కూతురిలో నన్ను చూసుకున్న ఒకానొక రోజున"
అమ్మ విలువ తెలుసుకున్న బిడ్డ వేదనను చక్కగా చెప్పారండీ ..
అద్భుతంగా ఉంది!
చాలా బాగుంది వనజ గారు..!!
బొమ్మ కూడా చాలా బాగుంది :))
జలతారు వెన్నెల గారు @ రాజీ గారు @ చిలమకూరు విజయమోహన్ గారు @ పోతాస్ గారు..అమ్మ పై మీ స్పందనకి ధన్యవాదములు .
బాగుంది. అమ్మ ను గురించి ఎంత వ్రాసినా తక్కువే. అయినా అమ్మను గురించి వ్రాయాల్సిన గుర్తు చేయాల్సిన రోజులే ఇవి.
<>
అహంకారమే కాదు అని మార్చండి.
"అమ్మ" మాత్రం సజీవమై ఉంది.. నిత్య సంజీవని గాను ఉంది.
చాలా బాగా చెప్పారు అమ్మెప్పుడూ నిత్య సంజీవినే
:(:(
పల్లా కొండల రావు గారు.. ధన్యవాదములు.
శ్రీనివాస్ పప్పు గారు.. ధన్యవాదములు.
"అమ్మంటే" తన రెక్కల పై బిడ్డలని ఉన్నత శిఖరాలకి చేర్చే వాహకం .. కదండీ! బిడ్డలు ద్వేషించినా..ప్రేమించేది అమ్మ.
కవితకు అమ్మ ప్రాణవస్తువు.
హిమశిలాసదృశం అమ్మ మనసు.
మంచు పొరల నడుమ నిక్షిప్తమైన కరుణ,ప్రేమ నిత్య పారదర్శకం.అమ్మ విశ్రాంతి భౌతికం.అమ్మ ప్రేమ అవిశ్రాంతం.చక్కటి కవతనందించారు వనజగారు.
బాలు.. అమ్మ కవిత చూసి. విచారం ముంచుకొచ్చింది ..ప్చ్.. ఎమ్ చేద్దాం. ఎక్కడ ఉన్నా అమ్మ దీవెనలు నీకు తప్పక ఉంటాయి. సరేనా!
@ సి ఉమా దేవి గారు.. మీ వ్యాఖ్య కవిత్వంలా అందంగా మనసుకు హత్తుకునేలా ఉంది. ధన్యవాదములు.
కవితలు వ్రాయడం లో మీకు మీరే సాటి.చాలా బాగుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి