16, మే 2012, బుధవారం

అక్షయ అక్షర తూణీరం


ది పెన్.. ఆల్వేస్ ..ట్రూత్ ... లసంత  విక్రమ తుంగేఅక్షయ అక్షర తూణీరం


మనం..చూస్తున్నవన్నిఒకోసారి నిజమే కావచ్చు..
మనం చూడనివి అన్నిఅబద్ధం కాకపోవచ్చు..
జాతుల వైరంలో .. జ్ఞాతుల దాడిలో..
విరిగిన పాళీల సాక్షిగా..


శ్వేతశకటం ఒకటి స్వైరవిహారం చేసి
నాణానికి రెండోవైపును చూపుతున్న
కలాల కుత్తుకలను.. నులిమివేసింది..
ఆ..రావణ కాష్టంలో నిజాల నిగ్గులో..
లోకమే నివ్వెరపోయింది..

కలలోకూడా.. వెంటాడుతున్న
దృశ్య మాలికలు ఎన్నెన్నో..
విస్ఫోటనాల మధ్య ప్రాణాలు అరచేతపెట్టుకుని
పరుగులు తీసిన అమాయకపు జీవులు..
ఊచ కోతలో నేలకొరిగిన పులుల శౌర్యపరాక్రమాలు ..
రక్షణ పేరిట బంధవిముక్తి పేరిట
బందొలదోడ్డిలాంటి నిర్భంధ  శిబిరాలలో..
జీవచ్చావాలుగా  ..మగ్గుతున్న పౌరులు ..

హింసకి హింసే జవాబుగా..
విరామ చిహ్నాలపై సైతం..
రాజ్య హింస నగ్నీక్రుతై .
కరాళ నృత్యం చేసి ..
పులిని మట్టి కరిపించి..
ఆధిపత్యం సాధించింది..
ఎంతైనా రాజసింహం కదా..!

ఒక జాతిని అణచివేసి జాతి కృతమైన వైరం
సమసిందని సంబరపడుతూ..
రక్తసిక్తమైన నేలను ముద్దాడిన
నృపాలుడు వద్ద గాయాలను
మాపగల మంత్రదండం ఉండేనా..?
శిధిలమైన జీవితాలమీద
నవ నిర్మాణంకి పూజాదికాలు నిర్వహించటం ఏల.!?
 మత్స్య న్యాయం అమలుజరిగే చోట
శాంతి ప్రవచనాలు పలుకనేల.!?
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు లేదు..

ముందు వెనుకగా జాతి జాతికొక..
నాయకుడు జనియిస్తాడు.
అతనిని అణచేందుకు
అధినాయకుడు తయారుగా ఉంటాడు..
మన వీక్షనని బట్టి వారి స్థానాలు మారుతుంటాయి.
సమతాభావం లోపించిన సమాజంలో..
మనకి నిత్యం కనిపించే దృశ్యాలు ఇవే..
చరిత్రని తిరగతోడితే
మనకు నేర్పిన అనుభవ పాఠాలు ఇవే..

అభాగ్యుల పాలిట అండ ఉండేందుకు
ఒక నాయకుడు కావాలి..
అన్యాయాలను ప్రశ్నించేందుకు
ఒక గళం కావాలి..
వర్తమానంకై పరుగులు తీసే
ఒక మానవీయ హృదయం కావాలి..
గాలిలో ధూళిలో.. కలసిన అ త్యాగాలు ..
ఆ జాతికి సంకల్ప బలం కావాలి..
బడబానలంని దాచుకున్న
ఆ దేశాన్ని చూసి ప్రపంచమే చైతన్య దీప్తం కావాలి..

ఆ చీకటి నిజాలను వెలుగెత్తి చాటడానికి ..
సహస్రాక్షుడైన పాత్రికేయ ఇంద్రుడు కావాలి.
ఎల్లెడలా...అతని కలం..
అక్షయ అక్షర తూణీరం కావాలి..
విశ్వజన నీరాజనాలు అందుకునే
అతని కలం అండ మనకు కావాలి ..

(లసంత  విక్రమా తుంగే  మరణం , తర్వాత ప్రభాకరన్ కాల్చివేత తరువాత స్పందించి వ్రాసిన కవిత)

12|12|12.(కవి సంగమంలో)

14 వ్యాఖ్యలు:

Hari Podili చెప్పారు...

వనజవనమాలి గారు!


అలా చంపడం తప్పే!

స్వతంత్ర దేశం కావాలని కోరటం కూడా తప్పే!!

ఖలిస్తాన్ కావాలంటే మనమిచ్చేస్తామా?!

కాశ్మీర్ ను అపాకిస్తాన్ కు వదులుకున్దామా?

సియాచిన్ గ్లేసియర్ ను చై(హై)నా కు దారపోద్దామా?!

చంపడమనేది తప్పే?

అయితే లాడెన్ విషయమేంటి?
సద్దాం హుసేన్ ,ఖలిస్తాన్ నాయకుడు(పేరు గుర్తుకు రావడంలేదు) రీసెంట్ గా ఇంకొక నియంతను కూడా చంపారు, ఈ చంపడాల విషయమేమిటి?

కసబ్ను, గురు ను వదిలేద్దామా?!!!

మనము చేతకానివాళ్లము కాబట్టి ఈదేశంలో ఏదైనా జరిగి పోతోంది. ఈ విషయమై-చేతకానివాళ్ళు మన పాలకులు- అనే నా పోస్ట్ ను చదవగలరు,reply ఇవ్వగలరు

ధన్యవాదాలతో
-హరి

పూర్ణప్రజ్ఞాభారతి చెప్పారు...

//అభాగ్యుల పాలిట అండ ఉండేందుకు
ఒక నాయకుడు కావాలి..
అన్యాయాలను ప్రశ్నించేందుకు
ఒక గళం కావాలి..
వర్తమానంకై పరుగులు తీసే
ఒక మానవీయ హృదయం కావాలి..
గాలిలో ధూళిలో.. కలసిన అ త్యాగాలు ..
ఆ జాతికి సంకల్ప బలం కావాలి..//

పక్క ఫ్లాటు వాడు ఎవరో తెలియకుండా ఏళ్ల తరబడి జీవితాలు సాగిస్తున్న జీవులున్న కాలం ఇది. అయ్య చచ్చాడని ఆశ్రమం వాళ్లు ఫోను చేసిన సమయం దొరకని వాచీలున్న వారసుల కాలమిది. కంప్యూటరు, సెల్లు, బైకు, వెనకాలో చిన్నది ఉండడమే ఆశయంగా ఉన్న కుర్రలున్న కాలమిది.. అండ, గళం, హృదయం అర్థాలు లేని పదాలుగా మారిన కాలమిది.. . కాస్త నేటి కాలంలోకి రండి.

pragnabharathy.blogspot.in

వనజవనమాలి చెప్పారు...

Hari podili
@పూర్ణ ప్రజ్ఞా భారతి గారు..
ఈ కవితకి వివరణ ఇవ్వాల్సి ఉంది.నేను ఉగ్రవాదాన్ని,తీవ్రవాదాన్ని ,లేదా వేర్పాటు వాదాన్ని సమర్దించలేదు.
శ్రీలంకలో ఏం జరిగిదో అందరికి తెలుసు.
కానీ అక్కడ సింహళీయులు జరిపిన దాడిలో శ్రీ లంక తమిళులు ఎదుర్కొన్న పరిస్థతి ఎవరికి రాకూడదు. అమాయకులైన ప్రజలపై సైన్యం చేసిన దాడి,అకృత్యాలు లోకానికి తెలియనవి కాదు.
ఆమెస్తీ ఇంటర్నేషనల్ కి దొరికిన ఆధారాలు చూసి లోకం నివ్వెర పోయింది.
ఒక వాదాన్ని అణచివేయడానికి అమాయక ప్రజలపై జరిగే దాడిని ఉన్నది ఉన్నట్టు తెలిపే ఒక చానల్ పై,పత్రికలపై శ్రేలంక ప్రభుత్వం దాడి చేసి,నియంత్రణలు విధించి..అన్యాయంగా నిర్భందించి..తర్వాత చంపి.. బయట పడేసేది. అలా 16 జర్నలిస్ట్ లని పొట్టన పెట్టుకుంది శ్రీలంక ప్రభుత్వం. "లతాంగ విక్రం సింఘే " ఓ..చానల్ అధిపతి.జర్నలిస్ట్. సైన్యం చేస్తున్న అక్రుత్యాలని లోకానికి చెబుతున్నందుకు అతనిని హెచ్చరించి,బెదిరించి,విఫలమై,ఆఖరికి అతని కిడ్నాప్ చేసి(శ్వేత శకటం ) తరువాత అతిక్రూరంగా హింసించి , చంపి బయట పడేసారు. అందుకు కారణం ప్రభుత్వమే అని శ్రీలంక ప్రజలకి,లోకానికి తెలుసు.
"కలం "నిజాలు రాస్తుందని జర్నలిస్ట్ లని అందరిని చంపుకు పోవడం న్యాయమా!?
శ్రీలంక ప్రజల పై దాడిని మనం సమర్దిద్దామా?విరామ చిహ్నాలపై బాంబుల వర్షాలు కురిపించి..అమాయకుల ప్రాణాలని బలి తీసుకోవడం న్యాయమా ! అవన్నీ వ్రాసిన కలం ని కుత్తుకని తెగ కోయడం న్యాయమా!
ఏదో ఒక రోజు ప్రభుత్వం తనని చంపడం ఖాయమని "లతాంగ విక్రం సింఘే "కి తెలుసు, తెలుసు నట. అందుకే ఒక పాఠాన్ని వ్రాసి ఉంచారట. అతని భార్య అతనికి మరణానంతరం లభించిన అవార్డ్ సభలో (ఏదో ఆంతర్జాతీయ ఆవార్డ్ గుర్తు లేదు) చదివి వినిపించారు.
తరవాత మాన హక్కుల సంఘాలు ఆ విషయాన్ని నిర్ధారించాయి.
అందుకే మనం చూస్తున్నవని నిజాలు కాకపోవచ్చు. చూడనివి అన్నీ అబద్ధాలు కాకపోవచ్చు..అని వ్రాసాను.
నేను ఒక పెన్ పవర్ గురించి వ్రాసాను,ఒక నాయకుడు కావాలని వ్రాసాను. సమస్య ఏదైనా ప్రభుత్వాలని ప్రశ్నించే గళం కావాలి కదా..!
"అక్షయ అక్షర తూణీరం: ".. ఉండాలి కదా!
మానవీయ కోణంలో ఒక జాతి పై జరిగిన దాడికి,కొన్ని కలాల కుత్తుకలని తెగకోసిన తీరుకి స్పందించి వ్రాసుకున్న కవిత .. ఇది.
ధన్యవాదములు.
Hari గారు మీరు వ్రాసిన పోస్ట్ చదువుతాను.
ప్రజ్ఞా భారతి గారు..మీరు అన్నట్లు ..ఉండలేక పోబట్టే ఈ స్పందనని అక్షరం లో వ్రాసాను. ధన్యవాదములు.
ఇప్పటికి అన్యాయాల్ని ప్రశ్నించే నాయకుడు,నాయకరాలు ఉన్నారు...లేనిదే ..అంతా సర్వ నాశనమే నండీ!

Hari Podili చెప్పారు...

వనజవనమాలి గారు,
మీ ఆవేదన, మీలోని మానవత్వం,ప్రశ్నించే మనస్తత్వం,
సమాజం పట్ల మీ భాద్యత ఇవ్వన్ని కరక్టే.
అయితే తప్పు జరిగితే దాన్ని అంతమొందించటం తప్పుకాదు కదా!
ప్రశ్నించే గళము కావాల్సిందే!అయితే అది మంచి కోసమై ఉండాలి.న్యాయబద్దంగా ఉండాలి.
మంచికోసం, పదిమందికోసం గర్జించే గళాలను తుదముట్టించడం మానవాళి ఉన్నప్పటి నుండి ఉందన్నది
నా భావన .MIGHT IS RIGHT అనే ఆటవిక న్యాయం
ప్రస్తుతము కొనసాగుతోంది.
అయితే ఈ ఆటవిక న్యాయాన్ని ఎదిరించిన మంచివాళ్ళు,నిజాయితీ పరులు, సంఘసేవకులు
ఏమయ్యారో-ఒక్కసారి నా "ఇంకెంత మందిని చంపుతారు" పోస్ట్ ను చదవగలరు,reply ఇవ్వండి.
రీసెంట్ గా కలకత్తాలో ఏమయింది? అన్యాయంగా ఓ
ప్రొఫెసర్ ని అభాసుపాలు చేసారు. ఇదీ ప్రస్తుత -నేటి భారతం.

హితైషి చెప్పారు...

హృదయం ద్రవించింది. కొన్ని దృశ్యాలు నేను చూసాను.మీ కవితలో ప్రతి లైన్ వాస్తవ చిత్రం లా ఉంది.
వేదన నిండిన ఈ వ్రాతలు పెన్ పవర్ ని బాగా చెప్పారు.నిష్పక్షపాతంగా ఉండాల్సిన పాత్రికేయ విలువలని గురించి బాగా చెప్పారు.
చాలా చాలా బాగుంది.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

కవిత చదివేసరికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి! ఈ టాపిక్ మీద తెలుగులో ఎవరైనా కవితలు రాస్తారని నేను ఊహించలేదు.

కామెంట్లు కూడా నెమ్మదిగా చదివాను. ఎవరి అభిప్రాయాలు, కోణాలు వారివి.

ఏ పక్షం న్యాయంగా, ఏ పక్షం అన్యాంగా పోరాడుతున్నారన్న విషయం పక్కనపెట్టేద్దాం. బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రతి యుద్ధంలోనూ అమాయకులైన ప్రజల మరణాలే ఎక్కువ జరుగుతాయి :(


ఇరు పక్షాల్లోనూ సున్నిత భావం కలిగిన వారుంటే ఇలాంటి యుద్ధాలే రావు!

ఇంతటి లైన్స్ రాయాలంటే మీ హృదయం ఆ విషాదానికి ఎలా విలవిలపోయిందో అర్థమవుతుంది..
...
ఒక జాతిని అణచివేసి జాతి కృతమైన వైరం
సమసిందని సంబరపడుతూ..
రక్తసిక్తమైన నేలను ముద్దాడిన
నృపాలుడు వద్ద గాయాలను
మాపగల మంత్రదండం ఉండేనా..?
శిధిలమైన జీవితాలమీద
నవ నిర్మాణంకి పూజాదికాలు నిర్వహించటం ఏల.!?
మాత్చ్య న్యాయం అమలుజరిగే చోట
శాంతి ప్రవచనాలు పలుకనేల.!?
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు లేదు..
...

వనజవనమాలి చెప్పారు...

భాస్కర్ గారు..మీ స్పందనకి ధన్యవాదములు.
నేను ఈ కవిత వ్రాయాల్సి వచ్చినప్పుడు.. నా మనసులో భావనకి తగ్గ భాష అందక వ్యక్తీకరణకి చాలా సమయం తీసుకుంది.
రాజ్యానికి పోరాటానికి మధ్య అమాయక ప్రజలు ఎలా ఇక్కట్లు పడ్డారో,చాలా మంది ప్రజలు కాందిశీకులుగా మారారో..ఎప్పుడు యుద్ద వాతావరణం అలముకుంటుందో.. ఎప్పుడు వారి మూలాలకు వారు దూరం అవుతారో..తెలియని పరిస్థితుల మధ్య వారి జీవనం,సైన్యం దాడులు ,వారిపై అకృత్యాలు ఇవన్నీ ఎన్ని చేదు నిజాలు.? వాళ్ళందరూ బ్రతికి ఉన్న జీవశ్చవాలు.
జనజీవనం అస్తవ్యస్తమైన అణచివేతకి కారణమైన జాతుల వైరం యెంత విషాదం!?
బలవంతుడు బలహీనుడి పై చేసే దాడి మాత్రమే కనబడింది నాకు. శ్రీలంక తమిళులు దుస్థితి చెప్పడానికి "పాత్రికేయ ఇంద్రుల అవసరం చాలా ఉంది. అక్షయ అక్షర తూణీరం కావాలి"
మెనీ థాంక్స్. కవితలోని వేదనని అర్ధం చేసుకున్నారు. మీకు అర్ధమైనందుకు ధన్యవాదములు.సామాజిక సృహ తో కవిత్వం వ్రాసినప్పుడు ఆ కవిత్వం కి మీ స్పందన లాంటి స్పందన అవసరం ఎంతైనా వుంది.
వర్తమాన కాలంలో ఎవరు మైనారిటి ప్రజలు అవుతారో.. ఎవరు ఊహించలేం! కానీ బలహీనుల పరిస్థితి 100 %ఇలాగే ఉంటుందని మాత్రం చెప్పగలను.

వనజవనమాలి చెప్పారు...

హితైషి.. ఈ పోస్ట్ కి మీ స్పందన చాలా సంతోషం.
నా కవితలలో నాకు నచ్చిన కవిత ఇది. ఏ కవితని యెంత భావావేశంతో,హృదయ స్పందనతో వ్రాసానో అది నాకు బాగా నచ్చిన కవిత అవుతుంది ఆ కవిత ఇది.
థాంక్ యూ వేరి మచ్!!.

Hari Podili చెప్పారు...

@అవినేని భాస్కర్ గారు
"ది పెన్ పవర్ .." మీ కామెంట్ చూసాను.
కామెంట్లు కూడా చదివాను ,ఎవరి అభిప్రాయాలు,కోణాలు
వారివి అని వ్రాసి మీ హుందా తనాన్ని చాటుకున్నారు.
అమాయకులైన ప్రజలను, తమిళులను,విలేఖరులను చంపడాన్ని నేను సబబు అని చెప్పలేదు.ఆ మాటకొస్తే
మానవత్వమున్న ఎవారు దాన్ని సపోర్ట్ చెయ్యరు. ప్రస్తుత society లో prevail అవుతున్న MIGHT IS RIGHT అనే విషయాన్నీ చెప్పాను.
అన్యాయాలను,అరాచకాలను ప్రశ్నించే వారిలో నెనూ
ఒకన్ని.నా అభిమతమే అది.అసలు నా బ్లాగ్ పేరే అది.
cantwedoanything, మనము ఏమీ చేయలేమా.....? అని
అయితే మనము అడిగే దాంట్లో కూడా న్యాయబద్దత
ఉండాలనేది నా అభిమతము.
ఖలిస్తాన్ నాయకున్ని చంపినందుకు ఇందిరా గాంధీ ని
assassinate చేసారు.ఖలిస్తాన్ నాయకున్ని చంపడం తప్పా?
అమాయకులు చనిపోవటం అనేది చరిత్రలో ఎక్కడ చూసిన తెలుస్తుంది.క్రీ.శ. నుండి నేటి వరకు తీసుకుంటే,తెలంగాణా agitation లో చనిపోయిన దాదాపు ఏడు వందల మంది కూడా అమాయకులే.
నా ఉద్దేశ్యం ఏంటంటే న్యాయసమ్మతమైన వాటికోసం
పోరాడితే ,వాటికి ప్రజల సపోర్ట్ ఎల్లేప్పుడు ఉంటుంది,
ఎప్పటికి ఉంటుంది.
మనము ఏమీ చేయలేమా అనే నా బ్లాగ్ లోని పోస్ట్
లన్ని చదివి మీ అభిప్రాయాలు తెలుపగలరు.

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

@Hari Podili గారూ,

ఈ టపాకి మొదటి వ్యాక్య రాసినవారు మీరే! మీ వ్యాక్యలో "అలా చంపడం తప్పే!" అన్న మొదటి వాక్యం చదివాను. నచ్చింది! మీ మనసు అక్కడే అర్థమైంది; మీరు ఎంత సున్నితపు మనస్తత్వంగలవారో. మిమ్ముల్నీ, మీ భావాల్నీ ఎక్కడా వ్యతిరేకించలేదు. మీరే చెప్పినట్టు "Might is Right" అనే ఆటవిక న్యాయం కొనసాగుతుందన్నదే వాస్తవం.

ఎవరి అభిప్రాయాలు వారివి అని రాసినందుకు అర్థం ఏమిటంటే, తమిళ బ్లాగు ప్రపంచంలో ఈ విషయం మీద చాలా చర్చలు జరుగుతుంటాయి. నేనూ కొన్నిట్లో పాల్గొంటాను. కొందరు పులులని తప్పుబడుతారు, కొందరు ఒప్పంటారు, మరికొందరు మాత్రం తమిళుల గుండెల్లో ఆక్రోషం పెంచాలి, యోధులవ్వాలి, యుద్ధం చెయ్యాలి అనే రీతిలో రెచ్చగొట్టేరీతిలో రాస్తారు. నేను ఈ రెచ్చగొట్టే రచనలను వ్యతిరేకిస్తుంటాను. ఈ విషయంపై తమిళ బ్లాగు ప్రపంచంలో వాదించి వాదించి నాకు విసుగుకూడా వచ్చేసింది. అమాయక ప్రజల్ని ఒక పక్షం వారు రెచ్చగొడుతున్నారు, మరో పక్షం వారు చంపేస్తున్నారు! ఇద్దరు చేసేదీ తప్పే అన్నది నా భావన.

మీరూ మీరూ బలాబలాలు తేల్చుకోడానికి అమాయక ప్రజల్ని బలియ్యద్దు అన్నదే నేను చెప్పొచ్చే పాయింట్.


మీ బ్లాగు అలా ఓ సారి తిరిగొచ్చాను; కుదిరినప్పుడు పోస్ట్‌లవి చదివి వ్యాక్యలు రాస్తాను. మన పరిచయం ఆనందదాయకం కావాలని ఆశిస్తున్నాను. నెనర్లు.

the tree చెప్పారు...

balaheenudu vetadapaduthune vuntadu

Hari Podili చెప్పారు...

@ అవినేని భాస్కర్ గారు,
అమ్మయ్యా! యిప్పుడు happyగా ఉంది.,సబబుగా అర్థం
చేసుకున్నారు,
మీ స్పందనకు ధన్యవాదాలు.

మీరూ మీరూ బలాబలాలు తేల్చుకోడానికి అమాయక ప్రజల్ని బలియ్యద్దు అన్నదే నేను చెప్పొచ్చే పాయింట్.
మీ అభిప్రాయముతో నేను ఏకీభవిస్తున్నాను.
కారణం ఎంత గొప్పదైన /మంచిదైన -చంపడం- పరిష్కార మార్గం కాదని నా అభిప్రాయము.And at the same time దేశంకోసం ఎంత గొప్పవారైన (convicts అయితే)వదలకూడదనేది కూడా నా అభిప్రాయమే!
నేను కూడా మీలాగే- ఆనందదాయకం కావాలని-కోరుకొనుచున్నాను.
మీ బ్లాగ్ చూసాను.అందులోని-money is yours but.....-నాకు super గా నచ్చింది.దీన్ని గురించి
అందులోనే కామెంట్ పెట్టాను చూడండి.
very glad to meet you thru the blog and thanks to వనజవనమాలి గారు.-హరి

Hari Podili చెప్పారు...

@the tree గారు!
మీరన్నది వంద శాతం ఒప్పు.
అందుకే శ్రీశ్రీ గారు ఊరకే అనలేదు
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయనత్వం-అని

వనజవనమాలి చెప్పారు...

Bhaskar gaaru..Once again Thank you very much!!

@ Hari podili gaaru Thank you very much.
@ the tree gaaru Thank you very much!!!