8, మే 2012, మంగళవారం

అమ్మని చంపేస్తాభారతి మహిళా మండలి వారు మరియు వృతి శిక్షణా సంస్థ వారు సంయుక్తంగా నగరంలో వొక కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు.

ఎప్పుడు వేదికల పైకి బాగా చదువుకుని వున్నత వుద్యోగంలో వున్న వారిని, రాజకీయ రంగంలో వున్న ప్రముఖుల్ని ముఖ్య అతిధులుగా ఆహ్వానించి సభలు నడిపేవారు.

ఈ సారి మాత్రం సమావేశాన్ని  విభిన్నంగా రూపొందించారు . అందుకు కారణం "మానస".ఆ సంవత్సరమే సెక్రటరీగా యెన్నిక కాబడ్డ ఆమెలో అభ్యుదయభావాలు యెక్కువ.అభ్యున్నతి చెందాల్సినది మధ్య తరగతి, పేదరిక వర్గాలని ఆమె నిశ్చితాభిప్రాయం కూడా. అందుకే మహిళ స్వయం సహాయక గ్రూప్ ల వారిని,వృత్తి విద్యలు నేర్చుకుని ఆర్ధిక స్వావలంబన చేకూర్చకున్న వారిని పిలిచి ఒక సమావేశం నిర్వహించి వున్నతవర్గాలకి చెందిన స్త్రీజాతి రత్నాలకి చూపించాలని కోరిక.

మహిళా దినోత్సవం అయిపోయింది.ఇక రానున్నది. మాతృ దినోత్సవం.ఆనాటి కార్య క్రమానికి   జిల్లా  కలెక్టర్ ని ముఖ్య అతిధిగా  ఆహ్వానించారు.అక్కడ వక్తలు అంటూ యెవరు  లేరు..

ప్రారంభోపన్యాసంలో జిల్లా కలెక్టర్ సందర్భోచితంగా "అమ్మ " గొప్పదనాన్ని చెపుతూ స్త్రీ లందరిలోనూ అమ్మతనం వుంటుంది. అమ్మకి ఓపిక ,సహనం యెక్కువ. కాబట్టే యింట్లో అన్ని పనులు చేసుకుంటూ కూడా బయట ప్రపంచంలోకి అడుగుపెట్టి చిన్న చిన్న పనుల ద్వారా ఆర్ధిక అభివృద్ధి సాధించుకుంటుంది.. అందుకు అభినందనలు అని చెప్పి ముగించగానే..

కార్యక్రమం నిర్వహిస్తున్న మానస మిగతా వారందరిలోను యెవరైనా సరే వచ్చి వారి అనుభవాలను,వారి మనసులోని మాటలను అందరితో పంచుకోవచ్చని చెప్పింది.

ఇద్దరు ముగ్గురు మహిళలు వారి వారి స్వవిషయాలు గురించి చెప్పి తాము సాధించిన మహిళ స్వావలంబన గురించి వల్లే వేసారు. వింటున్న వారికి నవ్వు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అదే చెబుతారు కాబట్టి. నిజంగా అవన్నీ పై పై మెరుగులే అని మానసకి తెలుసు.

 తర్వాత యింకొకరు మాట్లాడటానికి వేదికనెక్కిన ఆమె వైపు చూసింది మానస ముఖంలో ఆశ్చర్యం. ఎందుకంటే  ఆ అమ్మాయి. తన వర్క్ షాప్ లో పని చేస్తున్న అమ్మాయి. పేరు శ్రీలక్ష్మి. పేరుకు తగ్గట్టుగానే కళ కళ లాడుతూ చాలా చురుగ్గా వుంటుంది. నవ్వుతూనే ఆ అమ్మాయికి మైక్ అందించి యే౦ చెపుతుందా అని ఆసక్తిగా చూస్తుంది.

శ్రీ లక్ష్మి తనని పరిచయం చేసుకుంటూ ఇలా..

నా పేరు శ్రీ లక్ష్మి. నేను తొమ్మిదవ తరగతి వరకు చదివాను. ఇందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ అమ్మ గొప్పదనం గురించి చెప్పారు.అమ్మని అందరు పూజించాలి. ప్రేమించాలి కానీ.. మా అమ్మని నేను చంపేస్తాను, అవును నేను మా అమ్మని చంపేస్తాను, చంపేస్తాను ఆవేశంతో అరుస్తూ  చెప్పింది. వింటున్న మానస వులికిపడింది. శ్రీ లక్ష్మి లోని ఆవేశం అర్ధమై  వెంటనే  కుర్చీలో నుండి లేచి వెళ్లి ఆ అమ్మాయిని వారించి మైక్ తీసుకోబోయింది.

"ఆంటీ..నన్ను మాట్లాడనివ్వండి ఆంటీ..ప్లీజ్ " అని వేడుకుంది.
"శ్రీలక్ష్మి.. ఇది యిలాటి విషయాలు మాట్లాడుకునే వేదిక కాదమ్మా! నా మాట విను"

"లేదు ఆంటీ! ఇలాటి చోటనే చెప్పుకోవాలి. మా అమ్మ గురించి విని యింకొందరు అమ్మలైనా  అలా మారకుండా. వుంటారు, నన్ను చెప్పనివ్వండి.  కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ వేడుకుంది.

"మిసెస్..మానసా, ఆమెని  యెందుకు అడ్డు కుంటున్నారు?  మాట్లాడనివ్వండి. ఆ అమ్మాయి యే౦ చెప్పాలనుకుందో మనమందరం విందాం ..  వినడంలో యేమి నష్టం "..అని అన్నారు కలెక్టర్ .

"ఆ అమ్మాయి చెప్పాలనుకున్న విషయం చెప్పాలనుకుంటే చాలా సమయం పడుతుంది.మేడమ్ " చెప్పింది మానస.

" అవకాశం దొరికినప్పుడు వారి కష్టాలను చెప్పుకుంటారు  విందాం చెప్పనివ్వండి" అంది కలెక్టర్ .

శ్రీలక్ష్మి తిరిగి చెప్పడం మొదలెట్టింది.

కలెక్టర్గారు మీరు అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పారు, మీరు చెప్పినట్లు నేను మా అమ్మని నేనెప్పుడూ  అంత గొప్పగా చూడలేదు.నేను తమిళనాడు నివశించే ఓ తెలుగు కుటుంబంలో  పుట్టాను. మా తాతది చిత్తూరు. మా అవ్వది తమిళ నాడు. మా నాన్న, బాబాయిలు యిద్దరు, ఇద్దరు అత్తలు. నా చిన్నప్పుడే ఆంధ్ర  ప్రాంతానికి వచ్చేసాం. మా నాన్న పాండు,మా అమ్మ పేరు రమణ. మేము ముగ్గురుం ఆడ పిల్లలం. అక్క,నేను,చెల్లి. మా నాన్న సెంట్రింగ్  పని చేస్తాడు. తమిళనాడులో సరిగా పనులు లేవని పరిస్థితులు బాగోలేదని నాకు యెనిమిది యేళ్ళప్పుడు యీ వూరికి వచ్చేసాం. మా నాన్న పనికి వెళితే..మా అమ్మ యింట్లోనే వుండేది. మా అమ్మ మా చిన్నప్పటి నుండి యెప్పుడూ  కల్లు తాగుతూ, తూలుతూ వుండేది. మమ్మల్ని సరిగా పట్టించుకునేది. మా అవ్వ మమ్మల్ని సాకేది.

మా నాన్న యీ వూరికి వచ్చాక అసలు పని చేయడమే మానేసాడు.ఎప్పుడు రాజకీయనాయకుల వెంబడి తిరిగేవాడు. రౌడీ ముఠాల తగాదాలలో మా నాన్న వాళ్ళ నాయకుడి కోసం పోరాడి..ఆ దాడిలో కాలు పోగొట్టుకుని అవిటివాడు అయ్యాడు. అందుకు ప్రతిఫలంగా మాకు వూరిచివర కాలనీలో ఒక యిల్లుని వచ్చేటట్టు చేసారు.

మా నాన్న పనిచేయడు, మా అమ్మ పనిచేయదు.. ఇద్దరికీ మాత్రం తాగుడుకి మందు కావాలి. అక్క,నేను యిద్దరం బడి మానేసి..యిండ్లల్లో పాచి పనులు చేసి డబ్బు తెస్తే యిద్దరు నాకు కావాలనుకుంటే నాకు కావాలనుకుని కొట్టుకునే వాళ్ళు, తిట్టు కునే వాళ్ళు.ఆ డబ్బుని పంచుకుని నాటు సారా తో, గంజాయి కొనుక్కుని ఆ మత్తులో మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు కాదు. నరకం అంటే యేమిటో అక్కడే చూసాను. నేను వాళ్ళ దగ్గర వుండలేక మా అవ్వ దగ్గరకి వచ్చేసాను.

మా అమ్మ తన తాగుడి కోసం దొంగతనాలు కూడా చేసేది. మా నాన్న ఆమెని యే౦ చేయలేక పోయేవాడు. అలాంటి వాతావరణంలోనే మా అక్క పెరిగి.. ఓ ఆటో డ్రైవర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనికి కట్నం కావాలంటే.. మా అవ్వ-తాతే డబ్బు యిచ్చి దగ్గరుండి పెళ్లి చేసారు. మా యింటి నరకం నుండి అలా మా అక్క బయట పడి అదృష్టవంతురాలు అయింది.

మా అవ్వ దగ్గర పెరిగే నన్ను తొమ్మిదవ  తరగతి వరకు చదివించారు. మా అవ్వ నన్ను పెంచడం కోసం మా నాన్నకి డబ్బులు యివ్వడం కోసం పెద్ద పెద్ద యిళ్ళల్లో  పని చేసేది. నెలకి ఒక సారి మా అమ్మ-నాన్న వుండే  యింటికి  వెళ్లి తిండికి సరిపడా సరుకులు కొని యిచ్చి వచ్చేది. మా అవ్వ యిటురాగానే మా అమ్మ ఆ సరుకులన్నింటిని యెవరికో ఒకరికి అమ్మేసి సారా పేకెట్లు కొనుక్కుని తాగేసేది.

నేను తొమ్మిదివ తరగతి చదువుతూ వుండగా .. "ఈ మానసా మేడమ్  కుట్టు పనిలో వుచితంగా శిక్షణా కేంద్రం యేర్పాటు చేసారు. ఆ శిక్షణా కేంద్రంలో చేరమని మా అవ్వ సలహా యిచ్చింది.నేను చదువు మానేసి శిక్షణా కేంద్రంలో చేరి రంగుల అద్దకం,బాతిక్ డిజైన్,మగ్గం ఎంబ్రయిడరీ నేర్చుకున్నాను. మా మేడమ్  వర్క్ షాప్ లోనే పనికి చేరాను.నా పనితనానికి మెచ్చి యిప్పుడు  రోజుకి మూడు వందల రూపాయలు వేతనం యిస్తారు.

నేను యెప్పుడైతే పని చేస్తున్నానని  మా అమ్మ తెలుసుకుందో..అప్పుడే  వచ్చి నన్ను మా యింటికి  తీసుకుని వెళ్ళిపోతానని గొడవ వేసుకునేది. వారానికొక రోజు వచ్చి నా జీతం డబ్బులు యివ్వమని గొడవ పెట్టుకునేది. పుట్టిన తర్వాత నా మంచి చెడు చూడని మా అమ్మకి ఆ హక్కు యెక్కడిది.? ఆమె కూతురునని  చెప్పుకోవడానికే నాకు సిగ్గు వేసేది. మా యింటికి వెళ్ళాలన్న భయం వేసేది. రక రకాల మనుషులు,వింత వింత ప్రవర్తనలు చూడాల్సి వచ్చేది .

నా చెల్లెలు చదువు సంధ్యలు లేక పదిహేను యేళ్ళకే..ముప్పయి అయిదేళ్ళ పిల్లల తండ్రితో తిరిగి గర్భవతి అయింది. అతను పెళ్లి చేసుకుంటానని మా చెల్లెలు మెడలో తాళి కట్టాడు. అతని భార్య కేసు పెట్టింది. మైనర్ ని గర్భవతిని చేసినందుకు అతనికి శిక్ష పడే బదులు పోలీసు స్టేషన్లో ప్రేవేట్ తీర్మానం ఎనబై వేలుకి ఖరారయింది. మా అమ్మ లక్ష రూపాయలు అంటేనే కుదురుతుంది అంది. ఆ రోజు రాత్రి తాగి వెళ్లి పోలీస్ స్టేషన్ లో గొడవ చేసింది. ఏం జరిగిందో యేమో తెలియదు గంజాయి అమ్ముతున్న కేసు లో మా అమ్మ అరస్ట్ అయింది.

మా అవ్వ వాళ్ళు మా చెల్లెలుని మద్రాస్ పంపి అబార్షన్ చేయించారు. ఆ పిల్ల అక్కడ నెల రోజులు కూడా వుండక నేనక్కడ వుండను అని తిరిగి వచ్చేసింది.

ఏదో ఒక వ్యాపకం వుండాలని  చెప్పినాతో  కలసి వర్క్ షాప్ లోకి తీసుకుని వచ్చి వర్క్ నేర్చుకోమని కూర్చో పెట్టాను. నా చెల్లెలు దృష్టి పని నేర్చుకోవడం పైలేదు.సినిమాలు చూడటం,అందంగా వుండాలని యెబ్బెట్టుగా అలంకరించుకోవడం చేసేది. ఆ అమ్మాయి తలకి పని యెక్కదని అర్ధం అయింది. మా అమ్మ వచ్చి మా చెల్లెల్ని యింటికి తీసుకుని వెళ్ళింది.ఇప్పుడు నా చెల్లెలు..మా అమ్మకి కల్పవృక్షం. అయిదు వందల రూపాయలు నోట్లు తప్ప పదిరూపాయలు నోట్లు మచ్చుకైనా కనబడవు. అలా కొన్నాళ్ళు. ఆ తర్వాత కొన్ని నెలలకి నా చెల్లెలే మాయం అయిపొయింది. మా అమ్మే.. ఏ రెడ్ లైట్ యేరియాల వారికో అమ్మేసిందని చెప్పుకుంటారు అందరూ.

ఒక ఏడాదిపాటు మా అమ్మ మేము వుండే యింటివైపు తొంగి చూడలేదు. మళ్ళీ ఒక నెల క్రితం నావైపు కన్నేసింది. నన్ను తనతో పంపాలంటూ గొడవ చేసింది. నేను ఆరేళ్ళ నుంచి పనిచేసి బేంక్ లో దాచుకున్న డబ్బు, నా వంటి మీద వున్న బంగారపు చైన్,ఈ ఉంగరం,ఈ బుట్ట కమ్మలు.అన్నీ నా కష్టార్జితంతో కొనుక్కున్నవే. ఇప్పుడు నన్ను తీసుకుని వెళ్ళా లనుకుంటుంది ఈ వస్తువుల కోసం,నేను దాచుకున్న డబ్బు కోసమే! అవి అయిపోయిన తర్వాత నా చెల్లిని అమ్మేసినట్లు నన్ను యే  రెడ్ లైట్ యేరియా వాళ్ళకో నన్ను అమ్మేస్తుంది. అటువంటి దుర్మార్గురాలు మా అమ్మ.

నా కథ తెలిసిన మా మేడమ్  నాతోకలసి పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ యిప్పించారు. నాకు పద్దెనిమిది యేళ్ళు నిండాయి కాబట్టి నేను యెక్కడైనా వుండే యిష్టం నాకు వుంటుందని చెప్పి మా అమ్మ నోరు మూయించి పంపారు.కానీ మా అమ్మ వూరుకోకుండా .. రోజు తాగివచ్చి గొడవ చేస్తుంది.ఇలాంటి తల్లి యెక్కడైనా వుంటారా? పాము తన పిల్లలని కొరికి తింటుందని,పులి తన పిల్లలని తనే చంపి తింటుందని చెపుతారు.

కానీ నా తల్లి మనిషి రూపంలో వున్న పులి, పాము కన్న యెక్కువ. నేను వెళ్ళేదారిలో కాపలా వేయించి నన్ను కిడ్నాప్ చేయించాలని ట్రై చేసింది. నన్ను బలవంతంగా యెత్తుకు వెళ్ళాలని ప్రయత్నిస్తూనే వుంది. నాకు మా అమ్మ అంటే భయమేస్తుంది.ఎక్కడైనా తండ్రి అలా వుంటే.. తల్లి భాద్యతగా,ప్రేమగా పిల్లలని చూసుకుంటారు. కానీ మా అమ్మ తన వ్యసనాల కోసం బిడ్డలని బలి పెడుతుంది.ఇలాటి అమ్మలు యెక్కడైనా వుంటారా ? ఇలా వుండే  అమ్మల కన్న పుట్టగానే చెత్త కుండీలలో పారేసే అమ్మలే నయం. పీక పిసికి చంపే అమ్మలే మరీ నయం.

ఇలా పెరిగే ఆడపిల్ల బ్రతుకులు మాకు వద్దండి.మా నాన్న లాంటి అసమర్ధుడు వుండకూడదు.
మా అమ్మ లాంటి అమ్మ,రాక్షసి యెవరికీ  వుండకూడదు. అందుకే మా అమ్మని నేను చంపేస్తాను, చంపేస్తాను.ఏదో ఒక రోజు తప్పకుండా చంపేస్తాను.. ఆవేశంగా చెపుతూనే కన్నీళ్లు పొంగుకు రాగా అక్కడే కూలిపోయింది. అంతవరకూ ఆమె చెపుతున్నదానిని ఆశ్చర్యంగా ఆసక్తి గా వింటున్న అందరిలో కలకలం.

ఇలాటి అమ్మలుంటారా? యెంత దారుణం, అసలది తల్లేనా? అంటూ వ్యాఖ్యానాలు. కలెక్టర్ లేచి శ్రీలక్ష్మి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి భుజం పై చేయి వేసి వోదార్చారు.

మానస శ్రీలక్ష్మిని లేపి కుర్చీలో కూర్చోబెట్టి బాటిల్ తీసి నీళ్ళు త్రాగించింది.

ఆమె కొద్దిగా తెరుకోగానే మానస వేదిక ముందుకి వెళ్లి మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే ఆమెకి సంబంధించిన వర్క్ షాప్ లోనే శ్రీలక్ష్మి పని నేర్చుకుని ఆరేళ్ళు పాటు పని చేసింది కూడా. ఆమెకి శ్రీ లక్ష్మి గురించి ప్రతి చిన్న విషయం కూడా తెలుసు.

కుటుంబ వాతావరణం ఆరోగ్యకరంగా లేకపోయినా సరే, చిన్నతనం లోనే ఆ యింటినుండి వాతావరణం నుండి బయటపడి తనలో వున్న ఆసక్తి మేరకు శిక్షణా సంస్థలో చేరి శిక్షణ పొంది..నెలకు పదివేలు వరకు సంపాదించుకునే శక్తి,ఆత్మ విశ్వాసం,మంచి-చెడు విచక్షణ తెలుసుకునే అంతగా యెదిగిన క్రమాన్ని  వివరించి చెప్పింది. ఈ సారి చప్పట్ల వర్షంతో ఆ ఆవరణ అంతా మారు మ్రోగి పోయింది.

తన ముగింపు సందేశంలో శ్రీలక్ష్మిని వుద్ద్యేశించి కలెక్టర్ యిలా చెప్పారు.

'సమాజం నుండే కాదు,కుటుంబ సభ్యుల నుండి సాక్షాత్తు జన్మనిచ్చిన తల్లి నుండి తనని తానూ కాపాడుకునే శక్తి ఆ పిల్లకి వచ్చినందుకు మనం గర్వపడాలి.సమాజంలో అనేక రుగ్మతలు వున్నాయి. వ్యక్తుల వ్యసనాల్లో ఆడ-మగ తేడా వుండదని ఈ అమ్మాయి చెప్పినదే తార్కాణం.

 తల్లిదండ్రులలో యెవరు వ్యసనపరులు అయినా వాటి తీవ్రతకి బలి అయ్యేది ముందుగా వారికి పుట్టిన బిడ్డలే!

వ్యసనపరులై వారి జీవితాలని నాశనం చేసుకునే హక్కు తల్లిదండ్రులకి వుండవచ్చు. వారికి పుట్టిన బిడ్దల భవిష్యత్తుని నాశనం చేసే అధికారం వారికీ లేదు. ఇలాటి తల్లి దండ్రులు శిక్షార్హులు.

ఈ అమ్మాయి వ్యతిరేక పరిస్థితులో యెదిరించి నిలబడటమే అసలైన ఆత్మ విశ్వాసం. ఆ అమ్మాయికి చట్ట సంబంధమైన సహాయం లభిస్తుంది. ఆ తల్లి పై ఎఫ్ ఐ ఆర్ తయారు చేయమని యిప్పుడే ఆదేశిస్తాను.ఈ శ్రీలక్ష్మి కథ సమాజంలో చెడు ప్రవర్తన కల్గిన తల్లులందరికి వో గుణపాఠం కావాలి అని ముగించారు.

అక్కడే వున్న మీడియా వారు ఆద్యంతం ఆ సభా కార్యక్రమాన్ని రికార్డ్ చేసారు.


"కన్నతల్లి దుష్ట స్వభావ్వాన్ని చూసాను. అమ్మ కన్నా ఆదరణ చూపి శిక్షణ ఇచ్చి బ్రతికే ఆత్మ విశ్వాసం యిచ్చిన అమ్మతనం యిక్కడ చూసాను. మానస ఆంటీలా యెదిగి  ఆమెలా స్పూర్తిగా నిలవడమే తన లక్ష్యం అని చెప్పింది." .

మీడియా వారు శ్రీలక్ష్మిని చుట్టుముట్టి ప్రశ్నలు అడుగుతున్నారు. మీ తర్వాత స్టెప్ యేమిటీ..అని. వింటున్న మానసకి నవ్వొచ్చింది. చిన్న ఆచూకి దొరికితే చాలు కథలు ఆల్లేస్తారు. వరుస కథనాలు ప్రచారం చేస్తారు. ఇప్పుడు వీళ్ళ బారి నుండి యీ అమ్మాయిని కాపాడటం తల్లి బారి నుండి కాపాడటం కన్నా కష్టమైన పని అనిపించింది మానసకి.

33 కామెంట్‌లు:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా!"
నిజమేనండీ కంటేనే అమ్మ కాదు అమ్మ కన్నా ఆదరణ చూపి శిక్షణ ఇచ్చి..బ్రతికే ఆత్మ విశ్వాసం ఇచ్చిన మానస లాంటి వారు కూడా అమ్మలే..

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు..ఇది యదార్ధ సంఘటన. 90% వాస్తవాన్ని చెప్పాను. కథలలో జీవితాలు ఉంటాయి. అల్లిక కాదు కాబట్టేమో..యెంత ప్రయత్నించినా నాకు నాటకీయత రాలేదు.
శ్రీలక్ష్మి..వాస్తవ చిత్రం.
స్పందించినందుకు ధన్యవాదములు.

జలతారు వెన్నెల చెప్పారు...

వనజగారు, ఉంటారేమో ఇలాంటి వారు,కాని అరుదు కదండి? వ్యసనాలకు బానిస అయినప్పుడు మగావరి లాగ ఆడవారు కూడ మమతానురాగాలు లేకుండా ఇంత దారుణం గా ఉంటారనమాట! పాపం ఆ అమ్మాయిని
తలచుకుంటే బాధగా ఉంది.అండ గా నిలబడి చేయూత ఇచ్చిన మానాస లాంటి వారు లేకపొతే ఎమైపోయి ఉండెదో శ్రీలక్ష్మి. కాని I bleive these are isolated cases. ఎక్కడో కొద్దిమంది మాత్రమే ఇలా కడుపు తీపి లెని వారు ఉంటారేమొ అని నా అభిప్రాయం. మంచి పోస్ట్!

శ్రీనివాసరావు చెప్పారు...

వనజవనమాలి గారు
ఎందుకో ఈ పోస్ట్ కొంచెం కష్టంగా అనిపించింది
ఇటువంటి అమ్మలు చాలా తక్కువ % వుంటారేమో
ఒక అమ్మ కథ కన్నా ఒక వ్యసనపరురాలి కథ లాగేనే అనుకుంటేనే కర్రెక్టేమో !!!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు..ఒక విషయం నేను మీకు చెప్పాలి.
దాదాపు పడి సంవత్సరాలనుండి.. మధ్య తరగతి కన్నా దిగువ తరగతి వర్గం వారిలో అనేక సమస్యలు చూసాను. అలాటి స్త్రేల్లు జీవించడానికి చేసే పోరాటాలు చూసాను. వాళ్ళు జీవించి ఉండటం కూడా పోరాటమే! అలాగే మధ్య తరగతి వర్గాలలో స్త్రీలు..ఎప్పుడూ ఎవరేమి అనుకుంటారో..అన్న బెంగే తప్ప వారికి ఎమ్ కావాలో..ఎలా కష్టపడి సంపాదించుకోవాలో అని తెలుసుకోవాలనుకోకుండా ఎవరో వచ్చి తమ జీవితాలని బాగు చేయాలనే.. భ్రమలో,బాగు చేస్తారు అనే బ్రాంతి లో..
ఉండేవారు తప్ప ఆర్ధిక స్వావలంబన కోసం అయినా కూడా గడప దాటేవారు కాదు. . సోకాల్డ్ సొసైటీలో శ్రమ పడి బతకడం చిన్నతనం అనుకునేవారు.అర్ధ ఆకళ్ళతో అయినా బతికేవారు. వ్రుత్తి విద్యా శిక్షణా సంస్థలు వచ్చాక బయటకి వచ్చాక నేర్చుకుంటున్నారు. అక్కడ వారి వారి వ్యధలు,గాధలు విన్నదానిగా రోజుకొక పోస్ట్ వ్రాసిన రెండేళ్ళు వ్రాయ వచ్చు. అన్ని సంక్లిష్ట జీవితాలని సమీపంలో చూసాను.
ఆ కథల లో భాగమే ఈ రోజు వాస్తవ గాధ.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్రీనివాసరావుగారు..
నేను..ఓ.. అమ్మ కథ కన్నాకూడా వ్యసన పరురాలి కథ గానే చూసాను. కానీ శ్రీలక్ష్మి ఆవేదన గమనించారా!
అందుకేనేమో..అమ్మని చంపేస్తాను అంది. కొన్ని నిజాలు జీర్ణించు కోలేము. . నేను కూడా జీర్ణించుకోలేక పోయానండీ!

ఫోటాన్ చెప్పారు...

ఇలాంటి అమ్మలూ ఉంటారా?
మొదటి సారి వినడం.. :(

Maitri చెప్పారు...

Of course they exist.Not so very uncommon. I had witnessed many.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఇలాంటివే కొన్ని జీవితాలను చూసాను కానీ ఇంత దారుణమైనది ఇప్పుడే సూస్తున్నాం.

Jai Gottimukkala చెప్పారు...

శ్రీలక్ష్మి జీవితం కళ్ళకు కనిపించిన వాస్తవానికి ప్రతిరూపం. ఇంతటి కష్టాలను ఎదురుకొని బతుకు సాగిస్తున్న శ్రీలక్ష్మికి, అలాంటి వారికి చేయూతనిచ్చిన మానస గారికి, ఇంత గొప్ప విషయాన్ని వెలుగులోకి తెచ్చిన వనజ గారికి అభినందనలు.

Jai Gottimukkala చెప్పారు...

"వ్యసన పరురాలి కథ"

ఒక పాత పాటలో "దురలవాట్లతో బాధ్యత మరిచి చెడే నిరాశాజీవులు" అని విన్న గుర్తు. అలాంటి వారిని కవి దుర్మార్గులుగా కాక నిరాశాజీవులుగా ఎందుకు వర్ణించారో ఒక పట్టాన బోధ పడలేదు.

Sometimes life is not simple. Everyone concerned could be a victim unlike in movies where villians & victims are clearly demarcated.

శ్యామలీయం చెప్పారు...

శ్రీశంకరులు 'కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి' (చెడ్డవాడైన కొడుకుంటాడు కాని యెక్కడా చెడ్డదియైన తల్లి ఉండదు) అని అన్నారు. వారికి మాతృత్వంపైనగల విశ్వాసం అట్టిది.

వ్యసనం అనేది మనిషి యొక్క విచక్షణాజ్ఞానంపైన దెబ్బ కొడుతుంది. పితృత్వమాతృత్వమమకారాలనూ పరిహరిస్తుంది.

ఏ మద్యపానవ్యసం కుమార్తెలను కూడా అమ్ముకొనే విషాదకరస్థితిలోనికి ఒక తల్లిని నెట్టుతున్నదో అటువంటి మద్యపానంపైన వచ్చే రాబడి ప్రభుత్వాదాయంలో సింహభాగాన్ని సమకూరుసున్నది! ఆ దిక్కుమాలిన డబ్బుతో దొరతనాలు ప్రజాసంక్షేమకార్యక్రమాలు అమలు చేస్తున్నారట!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

పోటాన్,,గారు. మనకి సమాజంలో చాలా రుగ్మతలు, మరి కొన్ని కోణాలు ని సంపూర్తిగా చూసే అవకాశం ఉండకపోవచ్చు.
అమ్మ తనం అంగడి సరుకై .. పాషాణం అయిన సంఘటనలు చాలా ఉన్నాయి
స్పందించినందుకు ధన్య వాదములు.
@ కృష్ణ వేణి చారి గారు..మీరు కూడా గమనించి ఉన్నారు కదా! ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చిలమకూరు విజయ మోహన్ గారు..స్పందనకి ధన్యవాదములు.
@జై..గొట్టిముక్కల గారు. శ్రీ లక్ష్మి లాంటివారి కథలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులు బిడాలని తమ స్వంత ఆస్తిగా పరిగణించి తమ మాట వినడం లేదని నిలువునా కాల్చేసినవారు ఉన్నారు. అక్కడ వ్యసనాలు లేదా డబ్బు వ్యామోహం,లేదా చాందస వాదం కావచ్చు. ఏదైనా ఇలాటి వాస్తవ చిత్రాలు ని kaTOram గా ఉన్నా జీర్ణించుకోక తప్పదు'
అన్నట్టు ఒక విషయం చెప్పడం మరచాను. శ్రీలక్ష్మి కి ఒక మంచి అబ్బాయి తో మార్చి 1 న వివాహం జరిగింది. తల్లిదండ్రుల ప్రభావం ఆమె వివాహ జీవితం కి అద్దంకి కాలేదు. అర్ధం చేసుకునే సహృదయత లభించింది.అది చాలు కదా!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

శ్యామలీయం గారు..మీ ఆవేదన ని నేను గమనించాను. నా ఆవేదన అలాటిదే! నిజంగా ఈ ప్రభుత్వాలు సిగ్గులేని ,నీతి లేని,ప్రజల సంక్షేమం చూడని ప్రభుత్వాలు.
మీ స్పందనకి ధన్యవాదములు.

శ్యామలీయం చెప్పారు...

> శ్రీలక్ష్మి కి ఒక మంచి అబ్బాయి తో మార్చి 1 న వివాహం జరిగింది.

చాలా చాలా సంతోషం.

పల్లా కొండల రావు చెప్పారు...

పాము ప్రత్యేక స్థితిలోనే తమ పిల్లలను తింటాయి. అది ప్రకృతి ధర్మమే . కానీ ఈ వ్యసన పరురాలుని అమ్మ గా చెప్పడం అమ్మ పదానికే కళంకమవుతుంది. ఇలాంటి వారిని సమాజం నుండి వెలివేయాలి. సమాజం లో ఇలాంటివాళ్లు క్రింది వర్గాలలోనే కాకుండా ఉన్నతస్థానం లో ఉండేవాళ్లలో కూడా ఉంటూనే ఉంటారు. కానీ ఇలాంటి వాళ్లు మనుషులే కారు . ఇక అమ్మ ఎలా అవుతారు. సినీ కవి చెప్పినట్లు కంటేనే అమ్మ కాదని మానసమ్మ నిరూపించింది కదా? ఇలాంటి స్థితిలో ఉన్న వారికి ఆత్మ విశ్వాసం అందించడమే అన్నింటికన్నా ఉన్నతమైన చర్య అవుతుంది. అలా చేయూతినిచ్చి ఆర్ధికంగా , మానసికం గా స్వాంతన కలిగంచిన మానస గారికి , ఈ పోస్టు వ్రాసిన వనజ గారికి ప్రత్యేక అభినందనలు.

Jai Gottimukkala చెప్పారు...

@వనజవనమాలి:

"తల్లిదండ్రులు బిడాలని తమ స్వంత ఆస్తిగా పరిగణించి"

చాలా సరిగ్గా చెప్పారు. అసలు సమస్యకు కారణం ఈ రకమయిన mindset మాత్రమె. వ్యక్తిగత లక్షణాలు లేదా వ్యసనాలు లాంటివి ఎక్కువంటే సెకండరీ కారణాలు కావచ్చు.

"Your children are not your children. They are the sons and daughters of life's longing for itself".

శ్రీలక్ష్మి పెళ్లి వార్త విని సంతోషమేసింది. తాను అనుభవించిన కష్టాల దృష్ట్యా ఆమె తనకు పుట్టే పిల్లలను అత్యంత ప్రేమతో చూసుకొని చక్కటి పౌరులుగా తీర్చి దిద్దుతుందని నా నమ్మకం.

జ్యోతిర్మయి చెప్పారు...

అలాంటి పరిస్థితులలో కూడా మానసిక స్థైర్యం కోల్పోని శ్రీ లక్ష్మిని మెచ్చుకోవాలి. ఇలాంటివి జరుగుతాయని ఊహించడానికే కష్టంగా ఉంటుంది. మానస గారికి అభినందనలు. ఈ విషయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు వనజగారూ...

Meraj Fathima చెప్పారు...

అన్ని సమస్యల్లోకీ పెద్ద సమస్య "బీదరికం". బీదరికానికి ముఖ్య కారణం అధిక జనాభా. పేదరికం వల్ల నేర ప్రవృత్తి పెరుగుతుందని కాదు నా ఉద్దేశ్యం. ఎక్కడో చదివాను ఆకలి చివరి దశలో మనిషి మానసిక స్థితి మరో మనిషిని పీక్కుతినేలా చేస్తుందని. చాలా సమస్యలకు మూలకారణమైన అధిక జనాభాని నియంత్రించడానికి ప్రభుత్వాలు ఏవిధమైన పథకాలూ అమలు చేస్తున్నట్లు కనపడ్డం లేదు.
ఇక శ్రీలక్ష్మి తల్లి విషయానికి వస్తే ఇది సహజత్వానికి విరుద్ధమైన ప్రవృత్తి. ఇది ఒక అనారోగ్య మానసిక రుగ్మత కావచ్చు. ఇలాంటి వారికి ఆ కోణం లో సరైన సహకారం అవసరం అనుకుంటా.
వనజ గారూ, నాకెందుకో "మానస" లో మీరే కనిపించారు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కొండలరావు గారు నమస్తే! కుటుంబ సభ్యుల వేధింపు చర్యలు వాళ్ళ బాధ పడే ఆడ పిల్లలకి కాస్త చేయూత నిచ్చి బతకడం పై ఆత్మా విశ్వాసం నింపడమే "మానస" చేసే పని. లాభానష్టాతలతో పని లేకుండా ఓ..కర్తవ్యంలా చేసుకుపోవాలనే ఉద్దేశ్యం ఉంది. అది కొనసాగుతుంది. ఒకవేళ కుంతీ నడక నడుస్తున్నా మళ్లీ కొనసాగే స్థితికి తీసుకు వెళ్ళే మనోనిబ్బరం ఉంది. మానస మీ అందరి అభినందలు ఇంకా తన చుట్టూ పక్కల వారి అభినందనలు అందుకున్నప్పుడు..ఆత్మ సంతృప్తి తో.కూడిన దరహాసాలు వెళ్లి విరుస్తాయి.
ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జై ..గారు ఖలిల్ గిబ్రాన్.. చిల్డ్రన్స్ నాకు చాలా స్ఫూర్తి.
మీకు మానస గారి తరపున ధన్యవాదములు.

మాలా కుమార్ చెప్పారు...

ఇలాంటి అమ్మలుంటారని ఎప్పుడూ వినలేదు .

శ్రీలక్ష్మి పెళ్ళి వార్త విని సంతోషం కలిగింది . పోనీలెండి ఇక్కడైనా దేవుడు కరుణించాడు .

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జ్యోతిర్మయి గారు.. శ్రీలక్ష్మి లా అందరు దైర్యంగా ఉండాలని నా కోరిక. నేను చెప్పేది ఒక్కటే! డబ్బు తో సాధించలేని ఆత్మ సంతృప్తి.. మనతోటి వారికి చేతనైన సాయం చేయడంలో ఏంటో లభిస్తుంది.
మానస తరపున మీకు ధన్యవాదములు.
@మేరాజ్ ఫాతిమా..బీదరికం,అధిక జనాభా ,అవినీతి,నిరక్షరాస్యత ఇలాటి మూల కారణాలని మరచి రోడ్లు వెంట అభివృద్దిని చూసి దేశం బాగా అభివృద్ధి చెందింది అనుకునే స్థితిలో మనదేశం ఉంది. అసమానతలు,మతం,నాగరికత కూడా కారణాలు అనాలేమో!
కానీ ఇక్కడ శ్రీ లక్ష్మికి సమస్య తెచ్చింది,భయం కల్గించింది కుటుంబమే కదా! మానస ధన్యవాదములు అందుకోండి :))

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

buddha murali
to me
వనజ వాన మాలి గారు మానస గారికి అభినందనలు. ఇలాంటి అమ్మాయిలను ఆదోకోవాలంటే చాలా పెద్ద మనసు ఉండాలి . మానస గారికి అభినందనలు తెలియ జేయండి
( బ్లాగ్ లో కామెంట్ పోస్ట్ చేయడానికి రావడం లేదు )

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మురళీ గారు..నమస్తే! మీ కామెంట్ పబ్లిష్ చేసాను. మీకు గుర్తుందా..సర్..
ఆటో ఆపి మా వర్కర్ అమ్మాయి ఫోటోలు తీసుకుని వెళ్ళిన పోస్ట్. !
ఆ అమ్మాయే..శ్రీ లక్ష్మి. అప్పుడు తన అమ్మ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయించాలని ప్రయత్నం చేసింది. మీరు..పోలీస్ స్టేషన్కి వెళ్లి..ఓ..కంప్లైంట్ ఇవ్వండి ఎందుకైనా మంచిది అని సూచన ఇచ్చారు. అలాగే చేసాను.
ఈ పోస్ట్ ఇప్పుడు మీకు అర్ధమైంది అనుకుంటాను. ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

మాల గారు..ధన్యవాదములు. అవునండీ!ఆ అమ్మాయికి మంచిజీవితం లభించింది.గాడ్ ఈజ్ గ్రేట్!

Jai Gottimukkala చెప్పారు...

"బీదరికం,అధిక జనాభా ,అవినీతి,నిరక్షరాస్యత ఇలాటి మూల కారణాలని మరచి రోడ్లు వెంట అభివృద్దిని చూసి దేశం బాగా అభివృద్ధి చెందింది అనుకునే స్థితిలో మనదేశం ఉంది."

Wonderful slap on the face of "macro level intellectuals", thank you.

మానస గారి పరిచయం చేసినందుకు థాంక్స్. ఆవిడ గురించి వివరాలు (ఉ. బ్లాగు లేదా web site) చెబితే బాగుంటుంది. ఆమె చేసే పంచి పనులకు చేయూతనివ్వాలనుకునే వారికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జై గొట్టిముక్కల గారు.. మీరు.. నా మెయిల్ అడ్రెస్స్ కి మెయిల్ పంపి మీకు కావాల్సిన వివరాల కొరకు అడగవచ్చును. థాంక్ యు.

y.v.ramana చెప్పారు...

నాకీ పోస్ట్ బాగా నచ్చింది.

'మంచి అమ్మ' గూర్చి చదివీ, చదివీ విసుగొచ్చేసింది.
'చెడ్డ అమ్మ' గూర్చి అద్భుతంగా రాశారు.

శ్రీలక్ష్మి తల్లిది అచ్చమైన డ్రగ్ ఎడిక్ట్ కేసు. డ్రగ్ ఎడిక్ట్స్ ఆదాయం కోసం వ్యభిచారాన్ని ప్రోత్సాహించడం చాలాసార్లు జరుగుతుంది. అందుకే సభ్యసమాజానికి ఆ తల్లంటే అసహ్యం, రోత కలుగుతున్నాయి.

నాకయితే ఆవిడకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే మంచిదనిపిస్తుంది. (అది ఈ పోస్ట్ పరిధిలోకి రాకపోవచ్చు.)

శ్రీలక్ష్మి సమస్యలకి పెళ్ళితో శుభం కార్డ్ పడుతుందని (మన దేశం లో చాలా మంది ఆడవారికి మొగుడే సమస్య) ఆశిస్తున్నాను.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రమణ గారు .. మీ స్పందనకు నా ధన్యవాదములు
ప్రపంచంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మంచి అమ్మల్లో ఈ చెడ్డ అమ్మ " కి నిజంగా .మానసిక వైద్యం అవసరం. అని నాకు అనిపించింది.
మీరన్నట్లు..స్త్రీకి మొగుడే ..అసలు సమస్య.అలా అనుకుని పెళ్లి చేసుకోకుండా ఉండరు కదా! ప్చ్.. :(

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

Ravishekhar gaaru gaaru:(
Thank you veru much.