19, మే 2012, శనివారం

ఆదర్శ నాయకుడు

టక్ టక్  మంటూ  తలుపు కొడుతున్న శబ్దం.

లక్ష్మికి మెలుకువ వచ్చి  కళ్ళిప్పి  టైం చూసింది. రాత్రి సమయం ఒంటి గంట దాటింది.
ఈ సమయంలో ఎవరు వచ్చారో? అమ్మో! ఏ దొంగో అయి ఉంటే ? అయినా దొంగోడు దొరలా తలుపు కొట్టి లేపుతాడా ఏమిటీ ?అనుకుంది కానీ తలుపు తీయడానికి భయమేసింది. 

మళ్ళీ టక్ టక్ శబ్దం. ఇక తప్పదన్నట్లు లేచి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళింది. తలుపుకున్న  అద్దంలోనుండి బయటకి చూసింది.

భర్త కనిపించాడు. అమ్మయ్య ! ఈయన గారేనన్నమాట అనుకుని తలుపు తీసింది. "అయినా కాలింగ్ బెల్ కొట్టకుండా ఈ టక్ టక్ లు ఏమిటో?  బెల్ కొట్టకుండా 
అలా తలుపు కొడుతున్నాడంటే మందు మత్తులో ఉన్నాడన్నమాట"అని మనసులో అనుకుంది.

యెంతసేపు తలుపు కొట్టాలి, అప్పుడే గురకలు తీస్తూ నిద్ర పోతున్నావా!? అసలు మొగుడనేవాడు ఒకడున్నాడు,వాడింకా ఇంటికి రాలేదు. వచ్చాక కాస్త వేడి నీళ్ళు పెట్టి, భోజనం వడ్డించి,మంచి-చెడు చూద్దామన్న శ్రద్ద లేదు. యెంత సేపు ఆ టీ.వి చూడటం, సుష్టుగా తినేసి నిద్ర పోవడం,దానికే ఓ కష్టపడిపోతున్నట్లు బిల్డప్ లు అని దండకం మొదలెట్టాడు.వెంకట్.

"చచ్చాను.ఈ మనిషి మాములుగా లేడు" అనుకుని  మాట్లాడకుండా నిలబడింది. మరి అలాంటి సమయాల్లో కదిలితే తప్పు మెదిలితే తప్పని ఏళ్ళ తరబడి అనుభవంలో నేర్చుకున్న పాఠం.

" ఏమిటే,  అలా శిలా విగ్రహంలా నిలబడ్డావు..కాస్త నా మొహాన కూడు తగలెయ్యి" అరిచాడు.

"వడ్డిస్తాను మీరు కాస్త కాళ్ళు, చేతులైనా శుభ్రం చేసుకుని వస్తే! "అంది.

"ఏం కాళ్ళు చేతులు శుభ్రం చేయకపోతే పెట్టావా?" రెట్టించి అడిగాడు.

మరేం మాట్లాడకుండా ప్రిజ్ద్ లోనుండి గిన్నెలు తీసి టేబుల్ మీద పెట్టి,స్టాండ్ లో నుండి ప్లేట్ తీసి కూరలు వడ్డించింది లక్ష్మి.

ఏం కూర? అంటూ ప్లేట్ వైపు చూసి ముఖం చిట్లించాడు.

"ఎప్పుడూ  ఈ వంకాయ, బెండకాయ, దొండ కాయలేనా ? కాస్త నాన్-వెజ్ లు చేసి నోటికి రుచికరంగా వండి పెడతావేమోనని చూస్తాను. దేభ్యపు మొహం 
నువ్వూననూ  నీ వంటలూ" అని తిట్టడం మొదలేట్టేసాడు.

లక్ష్మికి కళ్ళలో నీళ్ళూరాయి. "ఏమన్నా..  కుళాయి త్రిప్పినట్టు కన్నీళ్లుకార్చేస్తావ్ , వీటికేం  తక్కువ లేదు అంటూ వేసిన మూడు కూరలని కెలికి సరిగా తినకుండానే ఆ ప్లేట్ లోనే చేయి కడిగి మంచానికి ఆడ్డం పడ్డాడు.

ప్లేట్ తీసి సింక్ లో పడేసి తలుపు వేసి హాల్లోనే సోఫాలో కూర్చుంది లక్ష్మి. ఆలోచనలతో సతమతమవుతూ తన స్థితి గురించి ఆలోచించుకోసాగింది .

వారానికి అయిదు రోజులపాటైనా  ఇదే స్థితిలో ఇంటికొచ్చే భర్తని చూసి వెగటు కల్గింది. పిల్లలు కూడా అలాంటి వాతావరణంలో పెరగడం ఇష్టం లేదు కానీ  అయినా తప్పదు . మనిషి అలవాట్లు, మనస్తత్వం నచ్చలేదని ఎక్కడికని పారిపోతాం? నాకు మొగుడు,వాళ్ళకి తండ్రి అని కసిగా అనుకుంటుంది.

ఏదో ప్రేవేట్ ఉద్యోగం చేస్తున్నాడు,వెనుక కాస్త మెరక భూమి ఉంది.పరవాలేదని మెచ్చి అక్షరాల పది లక్షలు డబ్బు, ఓ పాతిక ఎకరం పొలం ఇచ్చి ఈ మహానుభావుడికి ఇచ్చి కట్టబెట్టారు.

ఉద్యోగం చేయడం కాదు కదా, సలక్షణంగా ఏ పని చేయడం చేతనవని వెంకట్ టి .టి.డి.బాపతుగా తయారయ్యాడు.

ఖర్చుకు డబ్బులేనప్పుడల్లా మెరక భూమిని కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ, జల్సా చేస్తూ చోటా మోటా రాజకీయ నాయకుడి అవతారమెత్తి....ఓ..మూడేళ్ళ నుండి అభిమాన నాయకుడి వెంట ఓదార్పు యాత్రలకి తిరగడానికి  అలవాటు పడ్డాడు. ఓదార్పు యాత్రలు లేనప్పుడు చీట్ల పేక ఆడటం మామూలయిపోయింది.

చీట్లపేక ఆడటం కోసం దూర ప్రాంతాలకి వెళ్ళడం,రోజు ఇంటికి వస్తాడో లేదో తెలియకపోవడం కూడా మామూలైపోయింది.బెట్టింగ్ క్రీడలు, ప్రెవేట్  పంచాయితీలు, నోట్లతో ఓట్లు వేయించడం లాంటి పనులకి అలవాటుపడిపోయి ఒంటిమీద ఖద్దరు సిల్క్ చొక్కాకి చెమట పట్టడం అంటే ఏమిటో తెలియకుడా పోయింది వెంకట్ కి.

తన కష్టం -సుఖం చెప్పుకోవాలన్నా విని యెగతాళి చేసేవాళ్ళే!

" ఏమ్మా! ఎందుకంత కష్టాలు వెళ్ళ గ్రక్కుతావు ? చక్కని ఇల్లు,ఏ.సి గదులు,కార్లు, కాలుకందకుండా  సమకూర్చిపెట్టినా  కూడా కష్టంగా ఉన్నట్లు మాట్లాడతావు? అవి లేని వాళ్ళకి వాటి విలువేమిటో తెలుస్తుంది. అన్నీ నీకున్నాయి కాబట్టి ఇంకా ఏమిటో కావాలని కోరుకుంటావు"  అంటారు.

సొంతఇల్లు, కార్లు ఉంటే..కష్టాలు లేనట్లు గాబోల్సు అనుకుంటుంది లక్ష్మి. సంపదలు ఉన్నంత మాత్రాన  గుణగణాలు ఉండనవసరం లేదులే   నన్న భావన ఈ మనుషులకి ఎప్పుడు పోతుందో! అలా ఎపుడు ఆలోచించడం మానుకుంటారో !అనుకుంటూ ఉంటుంది.

కష్టపడే స్వభావం లేకుండా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకుని తింటూ, వ్యసనాలతో కాలక్షేపం చేస్తూ,అడ్డదారులలో సంపాదించి లోకానికి గొప్పగా కనబడేటట్లు ఉండటమే ఈరోజుల్లో గొప్ప విషయం కాబోల్సు.

ఇలా కాలక్షేపం చేసే మగవాళ్ళని ఖండించనైనా ఖండిస్తారా అంటే అదీ లేదు. ఆహా..ఓహో..అని భట్రాజు పొగడ్తలతో ముంచెత్తుతారు . చీ..  ఏం మనుషులో!? ఏ ఎండాకా  గొడుగు పడతారు మనసు నిండా అసహ్యం నిండుకుంది ఆమెలో.
అప్పుడప్పుడు లక్ష్మికి తన భర్త లాంటి వాళ్ళకన్న యాచకులు నయం అనిపిస్తూ ఉంటుంది కూడా!

యాచకులు అనగానే "కోటి" గుర్తుకొచ్చాడు. అతను కాయ కష్టం చేసుకుంటూ బ్రతికేవాడు.భార్య,ఇద్దరు పిల్లలు.అప్పుడప్పుడు తమ పొలంలో పనికి వచ్చేవాడు అతనికి అందరు అసహ్యించుకునే కుష్టు వ్యాది సోకింది.

జనమందరు అతనిని చూసి దూరంగా తొలగి పారిపోతూ అసహ్యించుకుంటూ ఉండేవారు. అతను  తన భార్య, పిల్లల అసహ్యానికి గురి అయ్యాడు. ఇంట్లో అతనుండటానికి కూడా ఒప్పుకోలేదు. కొద్ది రోజులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్శ తీసుకుని వ్యాధి  తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా  కుటుంబం దగ్గరకి రానివ్వలేదు.అతను ఆకలి తీర్చుకోవడం కోసమైనా కూడా ఒకరి దగ్గర చేయి చాచలేదు. తన మూడు చక్రాల కుర్చీలో కూర్చుని వెళుతూనే ఆకు కూరలు, ములక్కాయలు అమ్మడం మొదలెట్టాడు.అందరు అతని  దగ్గర కాయకూరలు కొనడానికి కూడా భయపడేవారు.అదేదో అంటూ వ్యాది అని భయపడేవారు.

ఒక సారి టీవి చానల్ లో కుష్టు వ్యాది గురించి,చికిత్చ గురించి, వ్యాది సోకిన వాళ్ళ పట్ల చూపించాల్సిన సానుభూతి,అర్ధం చేసుకునే తత్త్వం గురించి చెప్పడం చూసింది. ఆమెకి వెంటనే "కోటి' గుర్తుకు వచ్చాడు.

అతను ఆత్మ గౌరవంతో కష్టపడి సంపాదించుకుని బ్రతకాలి,తనని తానూ పోషించుకోవాలన్న తపన చూసి అతని దగ్గర కూరలు కొనాలని నిర్ణయించు కుంది.అందరికి కూడా అర్ధం అయ్యేటట్లు కుష్టు వ్యాది అంటువ్యాధి  కాదని,అతనివద్ద కూరలు కొనడం వల్ల వాటి ద్వారా వ్యాది లక్షణాలు ఒకరి నుండి ఒకరికి రావని ఒప్పించడానికి చాలా కాలమే పట్టింది.

దైర్యంగా లక్ష్మి కొనడం మొదలెట్టాక ఒక్కక్కరే "కోటి దగ్గర మునగ కాయలు కొనడం మొదలపెట్టేవారు. అతను ఆ ఊళ్ళో పెరటి తోటల్లో కాసే చెట్లనుండి కాయలు కొని ఊరంతా తిరుగుతూ వాటిని అమ్ముకునేవాడు. అలా అతనికి భుక్తి గడచి పోయేది. కొన్నాళ్ళకి కోటి భార్య కూడా అతనిని ఆదరించి ఇంటికి రానిచ్చింది.

లక్ష్మి ఒకసారి మునగ కాయలు కూర వండింది. మునగ కాయల కూర చాలా బాగుందని ముక్కలని వడేసి నమిలి నమిలి తిన్నారు . అందరు భోజనం చేసిన తర్వాత మాటల్లో కోటి గురించి అతని దగ్గర కూరలు కొనే సంగతి భర్త వెంకట్ కి చెప్పింది లక్ష్మి.

వెంటనే వెంకట్ సింక్ దగ్గరికి పరుగులు పెట్టి నోట్లో వ్రేళ్ళు పెట్టి మరీ బలవంతాన వాంతి చేసుకుని భార్యని అడ్డమైన కారు కూతలతో  అరగంట పైనే తిట్టి పోసాడు. ఇంకెప్పుడైనా వాడి దగ్గర కూరలు కొన్నావో ఆ కూరలతో పాటు నిన్ను బయటికి గిరాటు కొడతాను జాగ్రత్త!అని హెచ్చరించాడు.

అది కాదండీ!అంటూ చెప్పబోయింది అసలు వినిపించుకోలేదు. అతను వినకపోయినా సరే గాంధీ మహాత్ముడు లాంటి వారే కుష్టు వ్యాధిగ్రస్తులకి సేవ చేసిన విషయం గురించి పంతంగా చెప్పింది.

నేను గాంధీ గారంత గొప్పవాడిని కాదు. ఇంకోసారి ఇలాంటి విషయాలు నా దగ్గర చెప్పావంటే అడ్డంగా నరికేసి జైలుకి వెళతాను జాగ్రత్త ! అంటూ హెచ్చరించాడు.

లక్ష్మికి "కోటి " కి సాయం చేయలేకపోతున్నానే బాధ పట్టుకుంది.వెంటనే ఒక ఆలోచన వచ్చింది.

వెంకట్ అతని దగ్గర కూరలు కొనడం అయితేనే వద్దని అన్నాడు కానీ సాయం చేస్తాను అంటే వద్దని అనలేదు కదా అనుకుని..

"కోటి" ని, అతని భార్యని పిలిపించి ఒక విషయం చెప్పింది.

ఇదిగో..కోటీ నేను నీకు సాయం చేయాలనుకున్నాను మా ఇంటాయన నీ దగ్గర కూరగాయలు కొంటే  ఊరుకోనని చెప్పేశారు.అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను . నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన స్థలం పది సెంట్లు మీ ఇంటికి దగ్గరలోనే ఉంది కదా! ఆ స్థలం శుభ్రం చేసుకుని అందులో మునగ మొక్కలు నాటుకుని ఆ కాపుని అమ్ముకుని కాస్త నీ ఆధారాన్ని గట్టి చేసుకో! ఆ స్థలానికి నీటి సౌకర్యం ఉందని నీకు తెలుసు కదా అని చెప్పింది.

కోటి,అతని భార్య కన్నులలో కోటి కాంతులు మెరవడం చూసింది.

ఆ రోజు ఆమెకి తృప్తిగా అనిపించింది. భర్తకి ఆ విషయం చెప్పింది. విని మెదలకుండా ఊరుకున్నాడు వెంకట్. అమ్మయ్య ! ఏం గొడవ చేయ లేదు.అది చాలు అనుకుంది.

అలా జరిగిపోయిన విషయం తలచుకుని తన భర్త కన్నాకూడా కోటి ఆత్మవిశ్వాసం వేయి రెట్లు మేలనుకుంది.   అందరు అసహ్యించుకునే వ్యాది సోకినా భయపడక చికిత్చ తీసుకుని ఇంట్లో వాళ్ళు వేలివేసినట్లు చేసినా సరే మనో నిబ్బరంతో తట్టుకుని కష్టపడి బ్రతకాలనుకునే "కోటి" ని పోల్చి చూసుకుంది.

విలువలులేని రాజకీయ నాయకుల వెంట పెంపుడు కుక్కల్లా తిరుగుతూ, త్రాగుతూ అనువుకాని చోట అధి నాయకత్వాన్ని ప్రదర్శిస్తూ,ఇంట్లో భార్య దగ్గర గొప్పలు ప్రదర్శించే నాయకులు వాళ్ళ అవినీతీ సంపాదనలు, వాళ్ళ భోగాలు అన్నీ తలచు కుంటే అసహ్యం అనిపించాయి లక్ష్మికి .

అయినా ఆమె పెదవి విప్పి చెప్పలేదు. తన భర్త లాంటి వారు మారరు గాక మారరు. ఇక వాళ్లకి అనుగుణంగా ఇంట్లో ఉన్న మిగతా వారు మారాల్సిందే తప్ప  అని బాధగా అనుకుంటుంది.

ఆ మరుసటి రోజు జాతీయ కుష్టు వ్యాది నివారణా దినోత్సవం సందర్భంగా ఓ చానల్ లైవ్ ప్రసారం చేస్తుంది..

టీ వి చూస్తున్న పిల్లలు.. "అమ్మా ! డాడీ కనబడుతున్నారు టీవి లో.  
నువ్వు చూద్దువు తొందరగా రా..! అంటూ కేకలు పెట్టారు. గబగబా టీవి వద్దకు వచ్చి ఆ కార్య క్రమాన్ని లక్ష్మి ఆశ్చర్యంగా చూడసాగింది.

తన ఖాళీస్థలంలో బాగా ఏపుగా పెరిగి విరగబడేటట్లు కాసిన మునగచెట్లుని చూపిస్తూ.. "కోటి" ని చూపిస్తూ కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల మనం చూపాల్సిన ఆదరణ గురించి, వ్యాధి  పట్ల పెంపొందించుకోవాల్సిన అవగాహన గురించి చెపుతూ, తను తన ఖాళీ స్థలాన్ని అతనికిచ్చి మునగ చెట్లు నాటించడం దగ్గర నుండి అన్ని విషయాలలో శ్రద్ద తీసుకున్నానని గొప్పలు చెబుతూ అందరూ  "కోటి" దగ్గర కూరగాయలు కొని అతనిలోని ఆత్మ విశ్వాసాన్ని ప్రోత్స హించాలని,అసహ్యించుకాకూడదని, కుష్టు వ్యాధిగ్రస్తులు యాచించుకోకుండా చూడాల్సిన బాధ్యత  గురించి  గొప్పగా ఉపన్యసిస్తున్నాడు.  అప్పుడా  ఆ కార్యక్రమం లైవ్ వస్తుందని  అందరు చూస్తారనే విషయం తెలిసే వెంకట్ అలాటి ఏర్పాటు చేసుకున్నాడని అర్ధమయింది  లక్ష్మికి.

గాంధీ మహాత్ముడి ఆదర్శాలు తనలో బాగా ప్రభావం చూపాయని అందుకే'' కోటి" పట్ల పెరిగిన తన బాధ్యతని,ఆదరణ గురించి గొప్పగా చెప్పుకోవడం చూసి అసహ్యించుకుంటూ.

"అమ్మ నా మాయదారి మొగుడా! ఎన్ని జిత్తులు ఉన్నాయి నీ దగ్గర! కాబోయే రాజకీయ నాయకుడివి అనిపించావు కదరా" అనుకుంది పళ్ళు నూరుకుంటూ.
.

11 కామెంట్‌లు:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ ..
"ఆదర్శ నాయకుడు" గురించి భలే చెప్పారండీ..
మా వూరిలో కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి..
నాయకుల చిత్ర విచిత్ర విన్యాసాలు చూసే అదృష్టం కలుగుతుంది మా వూరివాళ్ళందరికీ ఈ ఎలక్షన్ పుణ్యమా అని :)

Hari Podili చెప్పారు...

pakka suitable to contemporary politician.funny and thought provoking.good.go ahead

జలతారు వెన్నెల చెప్పారు...

అతనికి మనసాక్షి అన్నది లేదా? ఇది కథా వనజగారు? నిజంగా జరిగిన సంఘటన ఆధారమా?

కాయల నాగేంద్ర చెప్పారు...

ఇలా జిమ్మిక్కులు చేసి ప్రజలను మోసం చేసేవాల్లనే 'అవకాశ నాయకులు' అంటారు.ఆమధ్య అన్ని రాజకీయపార్టీలు రోడ్ షోలని, ఓదార్పు యాత్రలని వందలాది మందిని వెంటేసుకుని తిరగడం అలవాటయి పోయింది. వాళ్ళ స్వలాభం కోసం వేలాది మందిని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు. అలాంటివాల్లకి, వారివెంట తిరిగే సోమరిపోతులకి ఈ కథ ఓ లాగుణపాఠం.

శ్రీనివాసరావు చెప్పారు...

వనజవనమాలిగారు
ప్రస్తుత రాజకీయాలగురించి సూడో నాయకులగురించి చాలా చక్కగా చెప్పారండి
ప్రజలకు ఎంతోకొంత మంచి చేసి ఓట్లు వేయించుకునే పరిస్తితి పోయి డాన్సులు వేసి దప్పులు కొట్టి వోట్లు అడుక్కునే పరిస్తితి మన నాయకులది
బాగా రాసారు కంగ్రాట్స్

హితైషి చెప్పారు...

ఎంత బాగా వ్రాసారు కథ. ఈ కథ ని పత్రికలకి పంపి ఉంటే చాలా బాగుండేది ఎక్కువ మంది చదివి ఉండేవారు.
ఇంత సూటి అయిన సంగతిని కుష్టు వ్యాది కన్నా భయంకరమైన రాజకీయ నాయకుల సోమరితనం డబ్బు,అధికార వ్యామోహాల పట్ల వారు చేసే పనులని సునిశితంగా విమర్శిస్తూ వ్రాసారు. చాలా బాగుంది మేడం. కట్టి లాంటి కథ. మీ ఆలోచనా విదానంకి మనసైన అభినందనలు.

పల్లా కొండల రావు చెప్పారు...

"అమ్మ నా మాయదారి మొగుడా! ఎన్ని జిత్తులు ఉన్నాయి నీ దగ్గర! కాబోయే రాజకీయ నాయకుడివి అనిపించావు కదరా.."అనుకుంది పళ్ళు నూరుకుంటూ..:)))))))))))

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు మీ స్పందనకి ధన్యవాదములు.
మన దేశం లో అన్ని పంటలు పుష్కలంగా పండుతాయి. అలాగే రాజకీయమనే పంట కూడా బాగా పండుతుంది..అనారు ఒక కవి.
రాజకీయం అనే ఒక వృత్తిని ఆచరిస్తున్న కొందరిని దృష్టిలో పెట్టుకుని వ్రాసిన కథ ఇది.
నగ్నాక్షరం.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

హరి పొదిలి ..గారు
ధన్యవాదములు.మీ స్పందనకి నా సంతోషం
@జలతారు వెన్నెల గారు. .:) నిజంగా ఆంధ్రదేశం అంతటా..నాకు ఆదర్శ నాయకులు కనబడుతున్నారు. ఏం చేద్దాం చెప్పండి.!?
అందుకే ఇలా వ్రాసాను..
మీ స్పందనకి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కాయల నాగేంద్ర గారు..
ఈ కథలో వెంకట్ లాంటి వాళ్ళని చూసి చూసి.. ఆవేశం ముంచుకొస్తుంది.. అందుకే ఇలా స్పందించాను.
ధన్యవాదములు.
@శ్రీనివాస రావు గారు..కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థ ని రాజకీయం వృత్తిగా తీసుకుని.. వెంకట్ లా ఉండేవారిని చూసి ఈ కథ కాని కథ .
మీ స్పందనకి ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

హితైషి.. ధన్యవాదములు. కథ బాగా నచ్చిందా!?
:))
ఎందుకో.. వ్రాయాలనిపించింది. పత్రికల్లో చూసే అంత ఓపిక లేదు అందుకే ఇలా..
కథని బాగా అర్ధం చేసుకున్నారు. థాంక్ యు!
@కొండలరావు గారు..
"అమ్మ నా మాయదారి మొగుడా! ఎన్ని జిత్తులు ఉన్నాయి నీ దగ్గర! కాబోయే రాజకీయ నాయకుడివి అనిపించావు కదరా.."అనుకుంది పళ్ళు నూరుకుంటూ.
ఈ మాటలు నాకు నవ్వు తెప్పించాయి. ధన్యవాదములు. .