24, మే 2012, గురువారం

మై స్పేస్ ..అమ్మలక్కల కబుర్లు



అయ్య బాబోయ్! ఏమి ఎండలండీ!? రోళ్ళు పగిలే ఎండలు..అంటారు కదా ! అలా.. అన్నమాట.
ఓ..వెచ్చని సాయంత్రం పవర్ కట్ అయిన సమయాన ..మా వరండా సాక్షిగా అమ్మలక్కల ముచ్చట్లు మొదలేట్టాము.ఇలా ముచ్చట్లు మొదలయ్యాయి.

వేసవి తాపం తీర్చే పానీయాలు ఉండగా, గంగా శీతల పవనాలు ఇలాటివేవేమో ఉండగా వేసవి అంటే భయం ఏల అనుకునే అమాకపు రోజులు కి కాలం చెల్లిపోయింది.

రోజుకి ఓ..మూడు సార్లు స్నానాదులు, ఓ..ఆరు సార్లు చెమట స్నానాలు..ఉష్..లు, అబ్బ బ్బ ఏమి కరంటు కోత..చంపుతున్నాడు దొంగ సచ్చినాడు.. అని తిట్లు..

అంతేనా!? రాత్రి సమయాలలో ఎప్పుడు టప్ మని పోతుందో తెలియని అనిశ్చితి. వెదవది జీవితానికి ఒక సెక్యూర్డ్ లేకుండా పోయింది. కరంటు పోయిందా కాస్తంత గాలి పోసు కుందామని ఇంటి బయటకి వస్తామా!?
దోమలు వీర విహారం చేస్తుంటాయి. కాస్త వాటికి రక్త దానం చేస్తూ ..ఎలాగోలా ప్రాణాలు ఉగ్గబట్టి ఒక రోజు బ్రతికాం అనిపించుకుని ..భూపాల రాగం ని నీరసంగా ఆస్వాదిస్తూ సూర్యోదయం కోసం ఎదురు చూసి ఓ..రోజు గడిపేసి ..సూర్య నారాయణా ! ఏమిటయ్యా నీ ప్రతాపం!? చచ్చి పోతున్నాం కాస్త కరుణించి..మబ్బుల మాటున దాక్కో కూడదా!అని వేడుకుంటూన్నాం.

అమ్మాయ్ ! అలా చీరలు కట్టుకుని గాలి పోసుకోక ఏమి బాధ పడి పోతావ్?? నాకు లాగా నైటీ వేసుకోరాదు..అని నా వైపు ఓ..జాలి చూపు విసిరి ఉచిత ..సలహా పడేసింది మా వీధిలో డెబ్బై ఏళ్ళ మామ్మగారు..

అబ్బే! నైటీ,నైట్ డ్రెస్ లు లాంటివి నాకు అసలు అలవాటు లేదండీ ! నా ఒంటికి అలాటివి అసలు సరిపడవు. అన్నాను.

"మాకు మాత్రం అలవాటు ఉందా ఏమిటీ! చీరల బరువు మొయ్యలేక వీటి అలవాటు పడ్డాం" గాని అంది.
'
అవును మరి..ఒళ్ళు బరువుని మోసుకోవడమే కష్టంగా ఉన్న రోజుల్లో ఇంకొక బరువు అనిపించే అయిదున్నర మీటర్ల చీర ,ఆరు గజాల చీర నిజంగా బరువే కదండీ!

అందుకే నోట్ల కట్టంత బరువుతో చేనేత చీరలు కొనుక్కుని "ఉప్పాడ చీర" లని ఎక్కడో చిటారు కొమ్మన తగిలించాం కదా అన్నాను.

అవునమ్మాయి! ఏముంది..ఆ ఉప్పాడ చీరలో ..? అన్ని వేలకి వేలు పోసి కొంటున్నారు అంది .

ఏముంది అంటే? నాజూకు తనం,పనితనం,మానవ శ్రమ,సహజ మైన రంగులు ..అంతేనూ.అన్నాను దీర్ఘం తీసి.

బంగారం చూస్తే చుక్కలు చూపిస్తుంది.మెడలో గొలుసు వేసుకోవాలన్న భయం వేస్తుంది. ఈ కరంటు కోతల్లో..బయటకి, లొపలకి మారుతూ ఉంటే.. ఏ దొంగోడు జొరబడి దోచేస్తాడో..లేకపోతె. మెడలో నుండి పుట్టుక్కున్న లాక్కు పోతాడో అన్న భయం పట్టుకుంది అంది.

అవును నిజం నిజం అన్నాను.

అసలు ఇప్పుడు బంగారం ఎవరు వేసుకుంటున్నారు లెండి ? వన్ గ్రామ బంగారు నగలు అసలు వాటికన్నా ధగ ధగలాడుతూ మురిపిస్తున్నాయి. అవి చాలు. అయినా ఆ ధరలు చూస్తే మన మధ్య తరగతి వాళ్ళు కొనగలిగే టట్లు ఉందా ..ఏమిటీ? అంది.. ఇంకొక ఆవిడ.

అవును .. మీరు చెప్పినట్లు అసలు ఆభరణాలు ఎవరు వేసుకుంటున్నారు అండీ! మెడలో ఒక్క నగయినా లేకుండా ఆఖరికి పుస్తెల తాడు కూడా లేకుండా సింపుల్ గా నేక్లేస్స్ లతో కనువిందు చేసిన మన మహిళా మణులు ఇప్పుడు చేతులు నిండా గాజులు వేసుకుని చెవులకి భారీగా వేలాడే పోగులు పెట్టుకుని, మెడలో ఏమి వేసుకోకుండా..శంఖం లాంటి మెడ అందాన్ని నగ్నంగా చూపుతున్నారు. మీరు గమనించ లేదా ఏమిటీ!? పైగా పోద్దస్తమాను తెలుగు,హిందీ సీరియల్స్ ని మిక్స్ చేసి మరీ చూస్తుంటారు అని అడిగాను.

"చూస్తున్నాను. అదేమీ దిక్కుమాలిన ప్యాషనో..మెడలో తాళి లేకుండ తిరుగుతారు.పెళ్ళయిన వాళ్ళో తెలియదు,కాని వాళ్ళో తెలియదు అయినా ఆడవాళ్ళకి పతి భక్తీ తగ్గి పోయింది. అదివరకు మెడలో తాళి తీసేవారా? అంది ఆవిడ.

తాళి తీసి పడేసినా పాపిటలో సింధూరం చెపుతుంది కదా!పెళ్లి అయినట్లు ఇంకా అర్ధం కానిది ఏముంది ?అడిగాను.

ఏమోనండీ! ఈ ఎండల చిరాకు కి మెడలో గొలుసు తీసి లోపల పెడతానా..!అప్పుడే మా ఆయన అడుగుతుంటారు.

"ఏమే !కాస్త నేను బతికి ఉన్నాను అన్న గుర్తుకైనా ఆ మెడలో గొలుసు ఉంచవే.. మన బంధువుల్లో ఎవరైనా వచ్చి ఇప్పుడు ఇలా కొత్తగా నిన్ను చూస్తే నేను కాలం చేసాను అనుకుంటారు. లేదా నువ్వేడైనా కొత్త మతం పుచ్చుకున్నావని అయినా అనుకోగలరు అంటారు.

అయ్యో! నేను పుణ్య స్త్రీనండి. చేతుల నిండా గాజులు,ముఖాన ఇంత కుంకుమ బొట్టు తో ఇలా సింగారంతో కనబడుతుంటే అలా ఎలా అనుకోగలరు?

ఏమిటో..ఈ సంప్రదాయాలు, గుర్తులు విసుగుపుట్టిస్తారు. ఇవన్నీ అలంకరణలో భాగాలు అని తెలుసుకోరు ఏమిటో!అంది మరొక ఆవిడ. అయినా మంగళ సూత్రాలు,నల్ల పూసలు ,కాలికి మెట్లు,నుదుట కుంకుమ ఇవి పెట్టుకుంటేనే స్త్రీ మూర్తులు లేకుంటే కాదా ఏమిటీ?
చీర కట్టుకోవడం లేదు,ఫేంట్ ,షార్ట్ ,షర్ట్ వేసుకుని కూడా మంగళ సూత్రం వేసుకోవడం లేదని అంటే ఏం చెపుతాం చెప్పండి?అలంకారమో,బరువో, బరువులా అనిపించే బాధో..ఏమని చెప్పడం? ఇష్టం లేకపోయినా మోయక తప్పదు. అది మంగళ సూత్రమైనా, కుటుంబ బరువైనా కూడా! అని నిట్టూర్చడం చూస్తే ..
ప్చ్..ఏం బాధలు? అనిపించక మానదు.

ఏదో విసుగుతో మీరు ఇలా అంటున్నారు కాని మీ వారు.. ఏదైనా నగ కొనిస్తాను అనగానే వెంటనే షాపింగ్ కి పరుగులు తీయరు.!. ఆభరణాలు,నగలు ఎవరికి చేదు చెప్పండి? అందుకే మగవారు ఓ..చీరో,లేదా ఓ..నగో కొని ఇచ్చి అయిస్ చేసేస్తారు. అన్నారు మరొకరు..

ఆడవాళ్ళకి ఆభరణాలు అందునా బంగారు ఆభరణాలు ఒంటి మీద ఉండటం అంటే.. అది వారి ఆస్తిగా భావించే వాళ్ళు అంట. పూర్వపు రోజుల్లో ఆడవాళ్ళకి ఆస్తి హక్కు,వారసత్వపు హక్కు లేక పోవడం వల్ల ఒంటిమీద ఉన్న ఆభరణాలే ఆస్తిగా పరిగణించే వారట. స్త్రీ కి ఏదైనా కష్టం వచ్చినప్పుడు,అత్యవసర సమయాల లోను ఆమెకి ఆధారంగా ఉంటాయని బంగారు ఆభరణాలు పెట్టేవారట.ఇప్పుడు అయితే ఆభరణాలు వద్దు..చదువే అసలైన ఆభరణం అని తెలుసుకుంటున్నారు. అది చాలు కదండీ! అన్నాను నేను.

అవునండీ! అమ్మాయిలూ ఉంటే నగలు,చీరలు అని కొనకుండా ఆ డబ్బుతో చదువులు చెప్పిస్తే అంతే చాలు. తర్వాత జీవితాంతం భర్త కొని పెట్టేదాకా ఎదురు చూడ కుండా వాళ్ళే ఏం కావాలంటే అవి కొనుక్కుంటారు అంది

అయ్యో.. ! అని నెత్తి కొట్టుకున్నాను. ఇది మహిళల ఆలోచనా తీరు . ఈ నాటి మా వెచ్చని సాయంత్రపు కబుర్లు.
ఇలా ఉబుసు పోక కబుర్లుతో.. ఉహూ ..కాదు కాదు.. ఎవరి ఆలోచనా పరిధి ఏమిటో..తెలిపే కబుర్లుతో..ఈ సాయంత్రం గడచి పోయింది.

అచ్చు ఇలాంటి కబుర్లు చెప్పుకోవాలంటే.. పురుష ప్రపంచం వినకుండా అచ్చు ఆడాళ్ళ కబుర్లే చెప్పు కోవాలంటే,మగ వాళ్ళని తిట్టు కోవాలంటే ఆడువారికి . ఓ..స్పేస్ ఉండాలి..కదా!

అలాంటి స్పేస్ ఒకటి సృష్టించుకున్న అమ్మలక్కల కబుర్లు అప్పుడప్పుడు చెపుతూ ఉంటాను ..సరేనా..అండీ! ఇప్పటికి ఉంటాను మరి.

13 కామెంట్‌లు:

sandeep చెప్పారు...

ఆడవాళ్ళ ముచ్చట్లు ఎదుటి వాళ్ళ మీద, పక్కన వాళ్ళ మీద చెప్పుకోకుండానే అంత తేలికగా అయిపోతాయంటారా??? :):)

జలతారు వెన్నెల చెప్పారు...

విజయవాడ , ఎండలు రెండిటికీ విడదీయరాని అనుభందమాయే! ఎండల దగ్గర మొదలయ్యి చీరలు, అభరణాలు కబుర్లు వింటుంటే...ఇక్కడ పార్టీల లో స్త్రీలు చెప్పుకునే కబుర్లు రాయలని ఉందండీ! బాగుంది వనజగారు!

రసజ్ఞ చెప్పారు...

భలే ఉన్నాయి మీ కబుర్లు! సరిగ్గా మా ఇంటి చుట్టుప్రక్కల అమ్మలక్కలంతా కలిసి చెప్పుకున్నట్టే ఉన్నాయి ;) మీకు ఉప్పాడ చీరలు ఇష్టమా అండీ? అమలాపురం దగ్గర "విలస" చీరలు ప్రముఖమయినవి. నాణ్యత, ధర తక్కువ, వేసవికి మంచి నేస్తాలు అని మా వాళ్ళూ, చుట్టుప్రక్కల అందరూ వేసవి వస్తే అవే కొంటారు రోజు వారీకి.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

డెబ్బై ఏళ్ళ మామ్మగారు..నైటీ :)
వేసుకుని నాలుగు గోడల మధ్య ఉంటే పరవాలేదు.కొంతమంది వీధుల్లోకి,కిరాణా కొట్ల దగ్గరకు కూడా అలానే వస్తుంటారు :(

అజ్ఞాత చెప్పారు...

:)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

సందీప్ గారు.. అయిదారుగురు ఆడవాళ్ళు కలిస్తే అనేక రకాల ముచ్చట్లు ఉంటాయి.ఒకరి మీద ఒకరు చెప్పుకోవాలంటే మాత్రం వీళ్ళు ఎవరికి వారు విడిపోయి ఏఇద్దరో కలసి నప్పుడు మాత్రం ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారు..అప్పటిదాకా కనబడేవి ఇలాటి కబుర్లే!
:).
Thank you very much!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

జలతారు వెన్నెల గారు ! మీ పార్టీ కబుర్లు తప్పకుండా వ్రాయండి.ఆసక్తి గా ఉంది. :))
@రసజ్ఞ థాంక్ యు వేరి మచ్. "విలస"చీరలు పరిచయం లేదు . అడిగి తెలుసుకుంటాను. ఉప్పాడ చీరలు ఖరీదు బయపెడుతున్నాయి .ఇంట్రెస్ట్ అంత లేదు రసజ్ఞ . కాసువాల్ ముచ్చట్లు అంతే!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

చిలమకూరు విజయ్ మోహన్ గారు.. నైటీ లలో బామ్మలని,అమ్మాలని చూడ లేక చచ్చి పోతున్నామండి! ఇక రోడ్డు ఎక్కే నైటీ భామలని చూస్తే..నాకు కోపం. చీర యెంత సంస్కారమో అర్ధం చేసుకోలేని వారిని చూస్తే నాకు బాధ.. థాంక్ యు!
పురాణ పండ ఫణి గారు.. ఆడవారి ముచ్చట్లు నవ్వు తెప్పించేవే ! కానీ నిజాలు,చురుక్కుమనిపిస్తాయండి. :) థాంక్ యు వేరి మచ్!!

Meraj Fathima చెప్పారు...

వనజ గారూ , ఆడవాళ్ళ కబుర్లు ఒక్కోసారి చాలా ప్రమాదాన్ని సృస్టిస్తాయి , అసూయ , ద్వేషాలు చోటుచేసుకుని ఒకరిని ఒకరు నిందించు కునేలా చేస్తాయి , అందరి విషయంలో కాదు సుమండీ , మీ వంటి వివేకము విద్య ఉన్నవారు , ఈ సమావేశాలను ప్రయోజనకారిగా చేయవచ్చు ఏమంటారు

శశి కళ చెప్పారు...

భలే ఉన్నాయి మీ కబుర్లు...ఏమిటో ఈ జాబ్ లు వెంట పరుగులతో ఇలాంటి అమాయక కబుర్లు మిస్ అయిపోతున్నాము,అయినా చదువే ఆస్తి ఆడవాళ్ళకు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

meraj fhatima గారు ..మీరు చెప్పినట్లు ఆడవారి కాలక్షేపపు కబులు ఒకోసారి చాలా ఇబ్బందులు తెచ్చి పెడతాయి. కానీ నేను చాలా జాగ్రత్తగా ఉంటాను.ఎక్కడవి అక్కడ వదిలేస్తే ..చాలా హాపీగా ఉండవచ్చు. అది నా అనుభవం
ఆడవాళ్ళ ముచ్చట్లలో నిజాలు,కొత్త ఆలోచనలు చాలా ఉంటాయి. అవి ఇంకా ఉన్నాయి వేచి చూడండి.
అవును .."మై స్పేస్ " లో మీకు చోటుంది. థాంక్ యు!
@శశి కళ .. వచ్చేయండి..త్వరగా వచ్చేయండి. మీ కబుర్లు..సరదా గా,హాయిగా ఉంటాయి. స్వాగతం "మై స్పేస్"
థాంక్ యు వేరి మచ్.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

పక్కింటి పడతి కట్టిన
చక్కటి జలతారు చీరె చాలు స్త్రీలకున్
అక్కసు పుట్టించి , నింద
లెక్కిడి కసిదీర్చుకొనగ - ఇంత అసూయా ?

ఔరా ! హింసానందము !
నేరము లెంచడమె గాక నెలతల మీదన్
వేరే పని యేముందిక
మారేదెన్నడు ? మహిళకు మహిళ సపోర్టై .

----- సుజన-సృజన

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

వెంకట రాజా రావు లక్కకుల గారు.. మీరు చెప్పినండి నిజమే నండీ!
ఇక పై "మై స్పేస్ " లో చాలా విలువైన విషయాలు ఉంటాయి. తప్పు ఒప్పులన్ యెంచ మహిళ లకి పాడి అగున్ !!
:)
ధన్యవాదములు.