30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

చరణ్ వాళ్ళమ్మ

పెళ్లి అనేది రెండు మనసులని కలిపే యేక తాళం మాత్రమే కాదు.రెండు కుటుంబాలని కలిపే వంతెన కూడా..అనిపించిన సందర్భం ఒకటి.


మరునాడు వుదయమే నిశ్చితార్ధం జరుగబోతుండగా  చరణ్ ఆ రోజు  వుదయాన్నే  కాబోయే అత్తవారింటికి వచ్చాడు. 

ఆ ఇంట్లో ఆశ్చర్యం. ఏమిటీ యీ   అబ్బాయి యిలా వచ్చాడు అని. మధ్యవర్తితో మాట్లాడిన విషయాలు కాకుండా యింకా  యేమైనా మాట్లాడాల్సినవి  వు న్నాయా? ఏం లిస్టు వినిపిస్తారో యేమిటో!గుండెల్లో గుబులు అమ్మాయి తల్లి దండ్రులకు.

అమ్మాయి పెళ్లి అంటేనే మధ్య తరగతి కుటుంబాలలో మోయలేని బరువు. ముందు అమ్మాయి చదువుకుని వుంటే  చాలు అంటారు.తర్వాత కట్నం యేమీ  అక్కర్లేదు,అయినా వాళ్ళ అమ్మాయిని  వాళ్ళు వొట్టి చేతులతో పంపుతారా యేమిటీ.?.  ఉన్నది యిద్దరేగా!  యెలాగూ ఆస్తి హక్కులు వచ్చాయి గా..మేము ప్రత్యేకంగా అడిగేది యేముంది అంటారు. తర్వాత మేము కట్న కానుకలు అడగలేదు కదా, పెళ్లి మాత్రం ఘనంగా  చేయాలి అంటారు. పెట్టుపోతలు,సారె,చీరలు అన్నీ ఘనంగా జరపాలి. లేకపోతే కట్నం యెలాగునూ  లేదు. మరీ యేమి పెట్టలేని బీదవారి అమ్మాయిని  చేసుకుంటున్నారని బంధుమిత్రులలో వెలితి పడాలి అంటారు. ఈ మాటకే అమ్మాయి తల్లిదండ్రులకి  పెళ్లి ఖర్చులు తడిసి మోపెడయి  లక్షలలో  కనబడతాయి.

ఇలా ఆలోచిస్తూ టిఫిన్,కాఫీ మర్యాదలు అయ్యాక .. చరణ్ యిలా అన్నాడు. "ఆంటీ.. మీ  అందరితోను  వొకసారి మనసు విప్పి మాట్లాడాలి.  పల్లవిని  కూడా పిలుస్తారా? 

పల్లవి వచ్చాక అందరు కూర్చున్నాక.. ఇలా మీతో మాట్లాడాలని రావడం మీకు భయం కల్గించవచ్చు. మొన్న పెళ్లి చూపులప్పుడు అంతా హడావిడి..యెక్కువ మాట్లాడలేకపోయాం. ఇప్పుడు అసలు విషయంలోకి  వస్తాను . 
మా కుటుంబంలో అందరు వ్యవసాయ దారులు,వ్యాపారాలు చేసుకునేవారే. మా కుటుంబం నుండి ఈ తరంలో..నేను అన్నయ్య మాత్రమే బాగా చదువుకుని యెల్లలు దాటి  వుద్యోగాలు చేస్తున్నాం. 

మా అన్నయ్యది ప్రేమ వివాహం అని మీకు తెలిసే వుంటుంది. వదిన కూడా వుద్యోగం చేస్తుంటుంది.  రెండు సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. మా వదిన వారి తల్లిదండ్రులు,బందువర్గం అంతా విద్యాధికులు. ఉద్యోగాలు చేస్తున్నవారు. 

వదిన అన్నయ్య పెళ్ళికి ముందు ప్రేమించుకుని  పెళ్లి నిర్ణయాలు తీసేసుకుని యింట్లో తెలియజేసారు. అందుకు  అమ్మ-నాన్న యేమి నోచ్చుకోనులేదు. మనఃస్పూర్తిగానే వొప్పుకున్నారు. అమ్మకి ఆడపిల్లలు లేకపోవడం వలన మా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కోడళ్ళకి యేమేమి చీరలు పెట్టాలి,యెలాటి నగలు చేయించాలి అనే వొక సుందరస్వప్నం వుంది. ఆమె కోరికకి ఆలోచనలకి అనుగుణంగానే.. తన వడ్డాణం ని పెద్ద కోడలికి యివ్వాలని నిశ్చితార్ధం చేసుకున్న రోజు వదినకి పట్టు చీరతో పాటు ఆ ఆభరణాన్ని ఆమెకి బహుమతిగా ఇచ్చింది. అమ్మ పెట్టిన చీర, వడ్డాణం తో సహా   మా వదిన కుటుంబంలో వారికెవరికి  అవి నచ్చలేదు. పైగా వాళ్ళు మాకు యే విదమైన  సారె , చీరల ఆనవాయితీలు లేవు అని తెలివిగా  తప్పించుకున్నా కూడా  మాది పల్లెటూరు కనుక లగ్న పత్రిక పంపారని చెప్పి తనే మిఠాయిలు తయారు చేయించి గిఫ్ట్లు కొని అందరికి పంచింది అమ్మ .

ఇక వివాహ సమయానికి కావాల్సిన బట్టలు కొనుక్కోవడానికి యెన్నో సార్లు వదినని పిలిపించినా ఆమె రాలేదు సరి కదా.. ఆమె తరపు వాళ్ళతో కలసి వెళ్లి తనకి కావాల్సిన చీరలు  కొనుక్కుని ఆ షాపింగ్ తాలూకు బిల్లుని అమ్మకి పంపించారు. పెళ్లి సమయంలో పెళ్లి కూతురికి కట్టే తలంబ్రాల చీరతో సహా  మంగళసూత్రం గొలుసు,నల్లపూసలు అన్నీ వాళ్ళే కొనుక్కుని అమ్మకి కనీస మర్యాద యివ్వకుండా చేయడం..మా అందరిని ఎంతో భాదించింది.ఏమైనా మాట్లాడితే.. అన్నయ్య ప్రేమ వివాహం చేసుకుంటున్నాడని  యిష్టం లేకనే వొంకలు పెడుతున్నారని అంటారని మౌనం వహించాము. 

అమ్మ ఎంతో..సెంటిమెంట్గా పెట్టిన వడ్డాణం కూడా పాత మోడల్ అని  పెళ్లి సమయానికి మార్చేసారు. అది మా నాన్న గారిని చాలా భాదించింది.తర తరాలుగా  కోడళ్ళకి బహుమతిగా ఇస్తున్న ఆభరణం అది. ఆఖరికి పెళ్లి సమయంలో అన్నయ్య కట్టుకునే బట్టలు తో సహా వాళ్ళే నియంత్రిన్చేసి మధు పర్కాలు బదులు షేర్వాని వేయించారు. ఒక్క మంగసూత్రం  మాత్రమే  మేము మా వదిన కోసం తయారు చేయించాం..అంటే ఆశ్చర్య పోవద్దు. 

పెళ్లి సమయంలో మా బందువర్గాన్ని పల్లెటూరి గబ్బిలాయాలని, వూరి వాళ్ళు అని, ముతక మనుషులని  నానా రకాల  మాటలతో , చిన్న చూపుతో బాధపెట్టారు. 

మూడు నిద్రలలో వొక్కరోజు తప్ప వదిన యిప్పటికి మా యింట్లో  నిద్రించిన రోజే లేదు. ఈ కాలపు అమ్మాయిలూ చాలా మంది అంతే! భర్త చదువు-సంద్యలు,ఆస్తి-పాస్తులు అన్నీ పెళ్లి అయ్యి  అవగానే  వాళ్ళకే సొంతం అయిపోవాలి.అతని కుటుంబం మాత్రం అవసరం లేదు అన్నట్టు వేరు చేసేసి,పక్కకు నెట్టేసి నిర్దాక్షిణ్యంగా కొంగుముడితో భర్తను కట్టేసుకుని వెళ్లిపోవాలి. పుట్టింటి వైపు బంధువులు కావాలి. అత్తింటి వారు అవసరం లేదు అన్నట్టు ఉంటారు. 

అన్నయ్య పెళ్లి అయిన తర్వాత ఒక నెలలోపే భార్య తీసుకుని విదేశాలకి వెళ్ళిపోయాడు. అమ్మ పోన్ చేసినప్పుడు 
 యెప్పుడైనా కోడలితో మాట్లాడతాను వొకసారి ..పోన్ యివ్వరా అంటే.. తన ప్రక్కనే  ఆమె వుండి కూడా లేదని చెప్పేవాడు.  ఒకసారి ఆమె మీ అమ్మ.. ఆమెతో నీకు మాటలుంటాయి కానీ నాకేం మాటలుంటాయి. నేను మాట్లాడను బాబు..అనడం అమ్మకి విన బడింది.అప్పటి నుండి ఆమె యెప్పుడూ కోడలితో మాట్లాడాలని అనుకోదు.

అమ్మతో నాకున్న సాన్నిహిత్యం వల్ల  అమ్మ మనసులో యేముందో నాకు తెలుసు. అందుకే..అమ్మ కి నచ్చిన అమ్మాయినే  చేసుకోవాలనుకున్నాను. నా యెంపిక కన్నా అమ్మ యెంపిక నాకు మంచిదవుతుంది అని నా అభిప్రాయం. అయిదుగురు మేనత్తల మధ్య మా అమ్మ ఆ యింటి  కోడలిగా యెన్ని భాద్యతలు మోసిందో యెన్ని మంచి చెడులుకి మధ్య వారధిగా   నిలిచిందో  మా మండువా లోగిలి చెపుతుంది. రెండు తరాల పెద్దవారిని రోగాలు నొప్పులు సాక్షిగా  అమ్మ స్వయంగా సేవ చేసి ముక్తులని చేసింది.  అలాటి మా అమ్మకి మంచి చెడు  విషయం తెలియంది కాదు. 

ఈ రోజు సాయంత్రం తన కాబోయే చిన్న కోడలకి వడ్డాణం,చీర  కొనుక్కోమని మీకు డబ్బు పంపాలని అనుకుంటుంది. దయచేసి ఆమెని అపార్ధం చేసుకోకండి. జరిగిన విషయాలతో అమ్మ మనసు నొచ్చుకుని యెవరి యిష్ట  ప్రకారం వారికి నచ్చినవి కొనుక్కుంటారు.మనది పాత తరం మనకి నచ్చినది వాళ్ళకి నచ్చాలని లేదుగా.. పట్టుదలకి పోయి మనమే తీసుకు వెళ్ళినా వాళ్ళు పెట్టుకోవడానికి యిష్టపడకపోతే..అదో బాధ.డబ్బుకి డబ్బు పోయే..మనస్సులో బేధాభిప్రాయాలు పెరుగుతాయి అంటుంది.  కాబట్టి  ఆమెని మీరు అర్ధం చేసుకుని అమ్మతోనే షాపింగ్ చేయించండి. ఆమెకి మనసులో వున్న  కోరికలని తీర్చుకునే ఆవకాశం ఇవ్వండి. పల్లవీ.. మీకు అమ్మ సెలక్షన్ నచ్చకున్నా సరే.. ఆమె యెంపిక  చేసినవాటిని  ఓకే చేయండీ! మీకు నచ్చిన వాటిని ముందు ముందు నేను కొనివ్వడానికి ప్రయత్నం చేస్తాను..అని చరణ్  వివరంగా చెప్పిన తీరుకి ..ఆ ఇంటిల్లపాది ముఖాల్లో చాలా సంతోషం కనిపించింది. 

పెళ్లి అంటే రెండు మనసులని కలిపే యేక తాళం మాత్రమే కాదు రెండు కుటుంబాలని కలిపే వంతెన కూడా.. 

చాలా విషయాల్లో భిన్నాభి ప్రాయాలు తలెత్తి ఆగర్భ శత్రువుల్లా మెలిగే వియ్యపురాళ్ళని  చూసాను నేను. అలా మన కుటుంబాలు వుండకూడదని  నా కోరిక. ఇక మీతో యిలా వచ్చి ఈ విషయం చెప్పినందుకు మన్నించాలి. అరమరికలు లేకుండా చెప్పడం మంచిదని చెప్పాను.. తప్పైతే క్షమించండి అన్నాడు. 

చాలా సంతోషం బాబు.మీ అమ్మ గారి గురించి మీ కుటుంబం గురించి విని వున్నాం. ఇప్పుడు మీ మాటల్లో మరింత  తెలుసుకున్నాం. మీకు యే విధమైన లోటుపాట్లు జరగకుండా అనీ సవ్యంగా జరుపుతాము. మిమ్మల్ని యే మాత్రం నొప్పించం..అంది పల్లవి తల్లి. 

అయ్యో..నేను మిమ్మల్ని యిలాగే చేయండి అని చెప్పడానికి రాలేదండి. ఒకరి మనసులో మాట యింకొకరితో అనుకుని పెళ్లి పనులకి  పూనుకోండి అని చెప్పడానికి మాత్రమే వచ్చాను అన్నాడు చరణ్.

"అలాగే బాబు.."అన్నారు పల్లవి తల్లిదండ్రులు. 

అతను అన్నట్టుగానే ఆ రోజు  మధ్యాహ్నానికి  బంధువు   వొకాయనతో..  డబ్బు పంపి కోడలికి యిష్టమైన నగ, చీర కొనుక్కోమన్నారండి అన్న విషయం చెప్పి పంపారు. 

మేము కొనుక్కోవడం యేమిటండీ.. కాబోయే అత్తగారు ఆమె కోడలికి యే౦ పెట్టాలనుకుందో.. అవన్నీ స్వయంగా యెంపిక చేసి కొని  పెట్టమనండి. ఆమెకి తెలియదా ఆమె కోడలికి యే౦ బాగుంటాయి అన్నది అని సర్ది చెప్పి  వచ్చిన బంధువుని  వెనక్కి పంపారు. 

మళ్ళీ   ఒక గంటలో..చరణ్ తల్లి నుండి పోన్.. అమ్మాయిని తీసుకుని షాపింగ్ కి రండీ అంటూ.
పల్లవి.. మీ యిష్టం అండీ..అయినా నాకు అంత బరువైన,విలువైన నగలు వద్దండీ అని చెప్పింది.
అమ్మాయికి యే౦ నగలు వున్నాయి " యే౦ లేవు..  యే౦ కావాలి అలాటి విషయాలతో..వో అరగంట మాట్లాడి అన్నీ  తెలుసుకుని కావాల్సినవి అన్నీ కొని తెల్లవారేటప్పటికి బ్లౌస్ తో సహా అన్నీ  రెడీ చేసి అందరిని ఆశ్చర్య పరిచారు.  చూసిన వారందరూ ఆమె సెలక్షన్ ని మనఃస్పూర్తిగా మెచ్చుకుంటుంటే.. యేమో అనుకున్నాను. మా అత్తయ్య గారి టేస్ట్ కి తిరుగు లేదు అంది పల్లవి. 

చూడ చక్కని ఎంపికతో.. సంప్రదాయంగా అన్నీ పెట్టి తాంబూలాలు మార్చుకుని పెళ్ళికి తేదీని నిర్ణయించుకుంటూ..  కళ్యాణమండపాలు అవీ బోలెడు ఖర్చు,ఆడంబరాలు, భోజనాల సమయంలో నిలబడి తినడాలు.వెనుక నిలబడి కాచుకు కూర్చోవడాలు సంతోషం లేకుండా చేస్తున్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయిని మా యింటికి  పంపితే   విశాలమైన స్థలంలో మా ఇంటిముందుపెళ్ళి చేసుకుంటాం అన్నారు. మీ ఆలోచన బాగుంది.నేను అమ్మ నాన్నలని వొప్పిస్తాను అని పల్లవి హామీ ఇచ్చేసి.. తల్లిదండ్రులని వొప్పించింది పెళ్లి ఖర్చులకి గాను కొంత డబ్బు  అమ్మాయి తరపు వాళ్ళు యిస్తారు ఆ డబ్బుని పుచ్చుకోవాలి  అన్న  మాట తీసుకుని ఆ  వొప్పందం  తోనే అమ్మాయి తరపు వాళ్ళు   పెళ్లి  జరపడమనే వేడుకని  చరణ్ వాళ్ళ పల్లెటూరికి మార్చేసారు. 

ఆ పెళ్ళిలో  పెళ్లి కూతురికన్నా  యెక్కువ అలంకరణతో..యెబ్బెట్టుగా విచిత్రమైన వస్త్రధారణతో వున్న పెద్ద కోడలిని  అందరూ విచిత్రంగా చూస్తుంటే.. సంస్కారం తెలియని నాగరికత తెలియని మూర్ఖులు అని తిట్టుకుంటా.. పల్లవిని చూసి మూతిముక్కు విరుస్తూ.. ఆపసోపాలు పడింది పెద్ద కోడలు. ఆమె తరపు బంధువులు పల్లవి పుట్టింటి వారిని కడు బీదవారుగా వర్ణించి పెళ్లి  చేసే స్తోమత కూడా లేదని హేళన చేయడం చూసి.. 

పెళ్లి అవుతుండగానే చరణ్ తల్లి  వొక విషయాన్ని ప్రకటించారు. 

ఈ పెళ్లి ఖర్చుకి గాను  పల్లవి తల్లిదండ్రులు అక్షరాల ఐదు లక్షల రూపాయలని బలవంతంగా తన చేతికి ఇచ్చారని ..ఆ మొత్తాన్ని వారి పేరిట ఒక అనాధ శరణాలయానికి విరాళంగా యివ్వడం జరిగిందని చెప్పారు. ఆ శరణాలయం నుండి అతిదిగా హాజరైన వ్యక్తి  వెంటనే.. వేదిక పైకి వెళ్లి ఆమెకి కృతజ్ఞతలు తెలుపుతూ.. 

పెళ్ళిళ్ళకి,పుట్టిన రోజులకి,శుభకార్యాలకి  స్తోమతని మించి ఖర్చు పెట్టడం అవి  మిగిలి పోయి చెత్త కుండీల పాల్జేయడం కన్నా కూడా  ఆర్తులకి, అన్నార్తులకి వుపయోగ పడే విధంగా పెద్ద మనసుతో వ్యవహరించాలని అభ్యర్ధించడం అందరిని ఆలోచింపజేసింది. 

ఈ పెళ్ళికి నేను వెళ్లాను.  చరణ్ తల్లి గారు మా వద్దకు వస్తూ ఉంటారు. ఆమె ఆలోచనా పరురాలే కాదు ఆచరణీయురాలు కూడా.   మీ  ఫోటో యివ్వండీ వొక  పరిచయం యివ్వాలి   అని అడిగితే నవ్వుతూ  సున్నితంగా తిరస్కరించి.. నా ఆలోచన పంచుకోవాలి కానీ నేనెవరు, యెలా  వుంటానో అందరికి చూపించడం ముఖ్యం కాదుగా అన్నారు. అందుకే ఆమె పేరు  చెప్పలేదు  కానీ  ఆమె పేరు చరణ్ వాళ్ళమ్మ. 
  

24, సెప్టెంబర్ 2011, శనివారం

కరిగి ప్రవహించిన పాట. ఆ పాట రచయిత జాలాది.


నెమలి కన్ను బ్లాగ్లో   మురళి  గారి లేడి చంపిన పులి నెత్తురు కథ  పరిచయం గురించి చదవగానే నాకు వెంటనే  "యాలో యాలో ఉయ్యాల"  పాట గుర్తుకు వచ్చింది.పాట రచయితా గుర్తుకు వచ్చారు.  

 ఎప్పటి నుండో పాటల రచయిత జాలాది గారి గురించి ఓ..మాట వ్రాయాలని అనుకుంటున్నాను.ఇంతలో..ఇలాను గుర్తుకు వచ్చింది. 

 జాలాది గారిని నేనొక  సభలో.. చూడటం తటస్థించింది.  సుద్దాల అశోక్ తేజ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచయితగా పురస్కారం   అందుకున్న తరుణంలో.. విజయవాడలో..వారికి ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.  ఆ కార్యక్రమంలో.. మా శబ్దాలయ మిత్రమండలి వారు భాగస్వామ్యం కూడా ఉంది. . ఆ సందర్భంలో.. జాలాది గారు ఒక ముఖ్య అతిధి.



జాలాది గారు  విచ్చేసారని రేడియో అనౌన్సర్ బి.జయప్రకాష్ గారు చెప్పడం .. మీరు వెళ్లి మాట్లాడండి అని చెప్పడం నాకు చాలా సంతోషం కల్గించింది . ఎందుకంటే జాలాది గారి పాటల గురించి చాలా సందర్భాలలో.. రేడియోలో అవకాశం వచ్చినప్పుడల్లా ప్రస్తావించు కోవడం  వల్ల జయప్రకాష్ గారు అలా నాకు చెప్పడం జరిగింది. సరే ! ఇదొక  మంచి అవకాశం అని నేను వారి దగ్గరకు త్వర త్వరగా వెళ్లాను. వారి అమ్మాయి విజయ కూడా నాకు పరిచయం ఉండటం మూలంగా.. వారితో మాట్లాడటం  చాలా సులువు అయింది.

వారిది స్పురద్రూపం అనవచ్చో అనకూడదో కానీ నల్లని రంగు. ఆజానబాహువు.   వారి స్వస్థలం దొండపాడు అయినా పశ్చిమ కృష్ణా జిల్లా యాసలో..మాట్లాడారు.  సర్ ..మీది నందిగామ !? అని అడిగాను. నాకు వారు తెలిసినప్పుడు  నందిగామలో ఉండే వారు . కాదమ్మా అంటూ..చాలా ఓపెన్గా, ఓపికగా ఆప్యాయంగా  చాలా విషయాలు చెప్పారు. అరగంటసేపు వారితో మాట్లాడినంతసేపు  వారు వ్రాసిన యాతమేసి తోడినా సాహిత్యమే నా మదిలో మెదిలింది. వారి బాల్యము,వారి రచనా వ్యాసంగం గురించి నేను చెప్పడం కన్నా   ఇక్కడ     లింక్లో చూడండి.

 "దేవుడే గెలిచాడు "చిత్రంలో.. "ఈ కాలం పది కాలాలు బ్రతకాలని" పాట దగ్గర నుండి..  "చల్ మోహనరంగ" చిత్రంలో..ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు, యాతమేసి  తోడినా, ఎలియాల్లో ఎలియాల్లో.. ఓలమ్మి తిరణాల గిలక, .    పుణ్యభూమి నాదేశం నమో నమామి,"సుల్తాన్" జనగణ జనయిత్రి నా భరతభూమి   వరకు ..ఎన్నో ఆసక్తి కర విషయాలు చెప్పారు. పాటలు గురించి తెలుసుకోవడం అంటే..నేను పాటలు వినడం ద్వారానే.. అదీ  ఒక్క ఆకాశవాణిలో..వినడమే నండీ..అని నేను చెప్పగానే ఆశ్చర్యపోయారు.

చూరట్టుక్కు జారతాది....చిటుక్కు చిట్టుక్కు వాన చుక్క (పల్లెసీమ),అలాగే దీపమేలా వెలిగేది నూనె లేనిదే..ఈ పాపలెలా   పెరిగేది నాన్న లేనిదిలే..(అత్తగారి పెత్తనం ),ముసి ముసి నవ్వులలోన (బ్రహ్మ) తల్లులారా తండ్రులారా (రేపటి పౌరులు) సందె పొద్దు అందాల్లున్న చిన్నదీ..ఏటిమీద  తానాలాడుతున్నదీ  ఉన్నదీ(తూర్పు వెళ్ళే రైలు) కాకమ్మ కాకి(వారాలబ్బాయి) ఇలా ఎన్ని పాటలు గుర్తు చేసుకున్నారో!

వారి  గీత రచనా వైభవం గురించి చెబుతూ.. జాలాది పాటలా..అయితే ఆ చిత్రం హిట్టే! అనేవారట. జే క్యూబ్ అని వ్యవహరించేవారట. అంటే జాలాది+జేసుదాస్+జయసుధ లేదా జయమాలిని..అని అట, అంటే.. అంత విభిన్నంగా సాహిత్యం అందించగలరని అనే ఉద్దేశ్యంతో.. ఇతరులు అన్నమాట, ఉన్నమాట.   నిజమే కదా..!  యాతమేసితోడినా ,అభినవ శశిరేఖవో ..రాసినట్లే .  చాలా  చిత్రాలలో క్లబ్ సాంగ్స్ కి వారు సాహిత్యం అందించారు. జానపద సాహిత్యం జాలాది పాటల్లో..చాలా హృద్యంగా ఉంటుంది. పల్లియ్యల్లో.. మన  ప్రక్కనే  ఉండి   ఎంకి-నాయుడు బావ  కలసి పాడుకున్నట్లే.. "ఆ మూడు ముళ్ళే యరో నూరేళ్ళ పక్కేయ్యరో.."ఎంత మంచి ప్రయోగమో!  నాకు అది యెంత ఇష్టమో..చెప్పలేను.   

అలాగే ముగ్గురు కృ ష్ణలకు కృష్ణ,కృష్ణంరాజు,బాలకృష్ణ కు  పాట రాసానని, మూడుతరాలకు పాట రాసిన ఘనత తనదే అని చెప్పారు. యెన్.టి.ఆర్ .హరి కృష్ణ . జూనియర్ యెన్ టీ.ఆర్ కు కూడా.. ఇంకొక విషయం ఏమిటంటే..ఆయన ఎవరికి పాట వ్రాయకుండా (మోహన్ బాబు చిత్రాలకు మాత్రమే వ్రాసే విధంగా) ఒప్పందం కుదుర్చుకున్నరటగా  అని అడిగితే..అంత లోతు వద్దమ్మా అన్నారు... మాట దాటేస్తూ..  కానీ ఒక దశకంలో..నిజంగా అలాగే వ్రాయడం జరిగిందట కూడా.

కానీ  ఒక ఆసక్తి కర విషయం చెప్పారు. "పెదరాయుడు" చిత్రంలో..ఓ.. పాట వారి రచన .కానీ చిత్రం విడుదలైనాక చూస్తే..వేరే వారి పేరు ఉందని .. అప్పుడు చాలా బాధ కల్గినదని చెప్పారు. ఆ పాట ఏదో..ఆయన రచనా శైలి తెలిసినవారు గుర్తించవచ్చు కూడా.. అతివల కందరికి  ఇష్టమైన పాట అది.

ఇంకొక విషయం ఏమిటంటే.. అలలు కదిలినా పాటే..కలలు చెదిరినా పాటే  ఏ పాట నే పాడను (సీతామాలక్ష్మి ) పాట వారి రచన కాదు ..ఆ పాట వేటూరి గారే  వ్రాసారని చెప్పారు.  ఒక్కసారి అయినా తీరిక చేసుకుని విశాఖ పట్నం  వెళ్ళాలి వారితో..ఇంకా  పాటల గురించి  చాలా చాలా మాట్లాడాలి అనుకున్నాను ఆ క్షణాన.

కొంచెం ఆలస్యంగా సభ ప్రారంభం అవడం మూలగా నాకు వారితో..మాట్లాడే అదృష్టం కల్గింది. తర్వాత సభలో.. వారు మాట్లాడేటప్పుడు "యాతమేసి తోడినా" పాట ఆయన గళం లో వినిపించారు. యెంత భావ గాంభీర్యం వేదన జనియించాయో..ఆ గళంలో.. నేను ఎప్పటికి మరువలేను.  ఆ పాటకి 10 నిమిషాల పాటు ఆడియన్స్ కరతాళ ధ్వనులు..

కొంతమంది స్త్రీల దుఃఖచ్చాయలు..  విపరీతమైన మేకప్ తో..కళా క్షేత్రం  అంతా తానే అయి తిరిగి అందరి దృష్టిని అమితంగా ఆకర్షించిన ఒక వనిత   అప్పటిదాకా చాలా హడావిడి చేసిన ఆ  వనిత  మేకప్ అంతా చెరిగిపోయేంతగా వెక్కి వెక్కి ఏడవడం ఒక విశేషం అన్నమాట.

ఇరువది అయిదు నిమిషాల ఆయన ప్రసంగాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం రికార్డు చేసినట్లు గుర్తు. ఆయన ప్రతి పాట జనరంజకమే! శ్రోతల హృదయాలలో..ముద్రించుకునే ఉంటుంది.

"సుఖీ భవ సుమంగళి ' మేజర్ చంద్ర కాంత్ లో.పాట వ్రాసి కన్నీరు పెట్టించారు. ఇప్పుడు వారు ఐదు  ఆరు రోజులుగా హాస్పిటల్ లో..కోమా స్థితి లో..ఉన్నట్టు   తెలుసుకుని.. చాలా బాధ పడుతూ.. ఇంకా ఆయన మస్తిష్కంలో..భావాలు కొట్టు మిట్టాడుతూ..పాట వ్రాయమని ప్రేరేపిస్తూ ఉన్నాయేమో..అన్నట్టుగా ఉంది నాకు.              
నాకు  ఇష్టమైన వారి పాటల్లో.. ఒకటి ఇక్కడ..


ప్రాణం ఖరీదు చిత్రంలో.. ఈ పాట

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు  (యాతమేసినా)
దేవుడి గుడిలోదైనా పూరి గుడిసేలోదైనా 
గాలి ఇసిరి  కొడితే ఆ దీపముండదు ఆ దీపముండదు  (యాతమేసి)

పలుపు తాడు మేడకేత్తే పాడి ఆవురా    
పసుపు తాడు మెడకేస్తే   ఆడదాయేరా (ప)
కుడితి నీళ్ళు పోసినా అది పాలు కుడుపుతాది 
కడుపు  కోత కోసినా అది మనిషికే జన్మ ఇత్తాది 
బొడ్డు   పేగు తెగిపడ్డ   రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం  తెలుసుకో (యాతమేసి ) 

అందరు నడిసోచ్చిన తోవ ఒక్కటే 
సీము నెత్తురులు పారే తూము ఒక్కటే(అందరు )

మేడ మిద్దెలో ఉన్నా చెట్టు నీడ తొంగున్నా   
నిదర ముదర  పడినాక  
పాడే ఒక్కటే వల్లకాడు ఒక్కటే 
కూత నేర్సినాళ్ళ కులం కోకిలంటరా          
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా  (యాతమేసి)



ఎన్ని పాటలో, ఎన్ని ముద్రలో!? విజయ ని (వారి మూడో అమ్మాయి)  కలిసినప్పుడల్లా ..  ఇలా  అనే దాన్ని   "ఎంతటి అదృష్టవతురాలివి.. అంతటి వారికి కూతురిగా పుట్టడమే కాదు మీ నాన్న గారి భావసంద్రాన్ని, ఆవేశాన్ని పుణికి పుచ్చుకున్నావని."  ..

ఇంత కన్నా ఇప్పుడేం చెప్పలేను...
మనిషి కి మరణం ఉంటుంది కానీ..భావాలకి కాదని 
సజీవ ఆలోచనల కి  వారి పాట ఓ.. ఆనవాలు అని.  
ఆలోచనల హిమం కరిగి ప్రవహించినవి  పాటలని .
ఆ పాటల  రచయిత జాలాది.,,అని.

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

నీ.... చరణ కమలాలు


నీ పదమును పూజింప ఒక పూవునైనా చాలు వనమాలీ!..అంటూ..

భక్తి భావమో, ఆరాధనా భావమో మోసుకుని వచ్చి నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

అలాగే.. ఈ విశాల ప్రపంచం లోకి అడుగిడుతూ..అంటూ.. అక్కడా నా పద ముద్రనే..చిత్రంగా  ఉంచాను.ఎందుకంటే బావిలో కప్పలా ఉండే నేను ఆ పాదంతోనే  ఈ అనంత ప్రపంచంలోకి..అడుగుపెట్టాను కదా!

ఏమిటీ..ఈ పాదాల అభిమానం అనుకునే ఉంటారు..కొందరికైనా  నచ్చిందో..లేదో!? అనుకునేదాన్ని అనుకుంటున్నారా?

అలా ఏం లేదు. ఇది నా బ్లాగ్ కదా! ఇతరులకి..నచ్చలేదని నాకు అత్యంత ఇష్టమైనవి ఒదులుకోలేను. (అలా అని ఇతరులకి ఇబ్బంది కల్గించడం ఇష్టం లేదు .నలుపు-తెలుపు లలో..ఎంతో ఇష్టం గా తీర్చి దిద్దుకున్న బ్లాగ్ రూపాన్ని చదువరులకి కష్టంగా ఉందని చెప్పడంతో..మార్చుకున్నాను.)

బ్లాగ్ చిత్రాలలో.. పాదాల చిత్రాలు..నా అభిమాన చిత్రాలు.
అలాగే..ప్రొపైల్ లో..శబ్ద చిత్రణం కూడా..నీ చరణం కమలం మృదులం పాట.. ఎంపిక చేసి పెట్టాను.

ఒకరిద్దరు అడిగారు..పాదాలు మీ హాట్ పేవరేటా ? అని.  అవుననుకోండి.
కానీ.. హాట్ పేవరేట్ అనే పదం కన్నా  "చరణ కమలాలు" అంటాను. ..
"కరయుగములు, చరణంబులు,
నురము, లలాటస్థలంబు, నున్నత భుజముల్
సరిధరణిమోపి మ్రొక్కిన
బరువడి సాష్టాంగమండ్రు పరమ మునీంద్రుల్"
నీ చరణం..

చరణాబ్జముల్ సకల భ  -  క్తి రహస్యము చాటి చెప్పు. ధీవరులకిలన్.
రుణాన్వితా! గొలుపవా! -  చరణంబులు కోరి పట్ట; సద్గురుఁడ! హరీ! 

 కరుణతో కూడుకొన్నవాఁడా!  సద్గురుఁడవైన  ఓ శ్రీహరీ!   భూమిపై గల ధీ వరులకు 
 శ్రేష్టమైన నీ పాద పద్మములు సమస్తమైన భక్తి యొక్క రహస్య  మార్గములను 
 చాటి చెప్పును. మేము నిన్ను కోరి పట్టుటకై నీ పాదములను సంప్రాప్తింపఁ జేయవా..అని
హరి పాదపద్మములకు ప్రణ మిల్లుతాము.

ఆ బృందావన  విహారి.. నల్లనయ్య అంటే నాకెంతో..ఇష్టం. అందుకే.. ఆ చరణ కమలాలను పూజింప ఒక పూవునైనా చాలు అనుకుంటాను.

నా పేరు కి అర్ధం కూడా..అదే కదా!

ఇక్కడ ఈ లింక్ చూడండీ! బ్రహ్మ కడిగిన పాదము..అందరికి..ఆ పాదమే కదా శరణ్యం.
http://vanajavanamali.blogspot.com/బ్రహ్మ కడిగిన పాదము.. ఇంత కన్నా నేను ఏం చెప్పగలను? అందుకే..హరి పాదానికి..ప్రణమిల్లుతూ..

"విరించి విష్ణించి సుపూజితాభ్యాం..విభూదిపాటీర విలేపనాభ్యాం.. నమో నమః శంకర పార్వతీభ్యాం.." 

అంటూ..అనుక్షణం మహాదేవుని స్మరణలో..పునీతం కావాలనుకునే ఆకాంక్ష కల్గిన నేను..

ఆ తల్లి చరణ కమలాలకూ        
మోకరిల్లుతూనే.. 

నా బ్రతుకు నడవాలి శివవామ భాగా
నీ పాదపద్మాల భ్రమరమ్ముగా
దివ్యగంధాల వెదజల్లు నీ పాదము
దేవి హరిచందనపు లేత పల్లవము
అని ఒక భక్తుడు .. ఆ అమ్మ పాద పద్మముల ముందు మోకరిల్లినప్పుడు పాడిన  గీతాన్ని..మనం చేసుకుంటాను.



చరణాలు కొలిచే నగుమోము జూచే
సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా... 


అని ఘనంగా కీర్తిన్చుకున్నా .. ఆ పాదమే కదా!... 

భరతుడుకు భరత వంశీయులకి..ఇప్పుడు భారతజాతికి..ఆదర్శప్రాయం. అలా ఆ పాద పదములకు మోకరిల్లుతూ..ఉంటాను.

ఈ పాదం పుణ్యపాదం..అంటూ..నటరాజ చరణ కమలాలకి..ఆత్మప్రణామాలు చేసుకుంటూ.. అనంత మైన అర్ధాన్ని అందించిన ఈ గీతాల ఆస్వాదనలో..రసా స్వాదనలో..

ప్రధమం ఆ భగవంతుని పాదపద్మములనే మనం దర్శించుకుంటే ..ఆయన అపార కరుణామృతాన్ని,ముక్తిని పొందుతామని చెపుతారు కాబట్టి.. ఆ చరణకమలాలకి   .. మోకరిల్లుతూ.. ఈ ఆర్తిలో..మమైకమైపోతూ..


ఈ  పాదం  పుణ్యపాదం  ఈ  పాదం   దివ్యపాదం
ఈ  పాదం  పుణ్యపాదం  ఈ  పాదం  దివ్యపాదం (ఈ )
ప్రణవ మూలనాదం    ప్రధమలోక  పాదం
ప్రణతులే    చేయలేని  … ఈ  ఈ  కరమేల   … ఈ  కరమీల …
ఈ  పాదం  పుణ్యపాదం … ధరనేలే    ధర్మపాదం …

మార్కండేయ  రక్షపాదం  మహాపాదం  ఆ …ఆ …
మార్కండేయ  రక్షపాదం … మహాపాదం …
భక్త  కన్నప్ప  కన్న  పరమపాదం  … భాగ్యపాదం …
భక్తకన్నప్ప  కన్న  పరమపాదం  … భాగ్యపాదం …
ఆత్మలింగ  స్వయంపూర్ణ  ఆ … ఆత్మలింగ  స్వయం  పూర్ణుడీ …
సాక్షాత్కరించిన  … చేయుతనీడిన  … అయ్యో   …
అందని  అనాధనైతి  … మంజునాధ …
ఈ  పాదం  పుణ్యపాదం
ధరనేలే    ధర్మపాదం
ప్రణవ  మూలనాదం    ప్రణయ  నాట్య  పాదం
ప్రణతులే  చేయలేని  … ఈ  ఈ  శిర   మేల  … ఈ  బ్రతుకేల   …
ఈ  పాదం  పుణ్యపాదం … ధరనేలే  ధర్మపాదం

భక్తీ  శిరియాలు   నేలిన   ప్రేమపాదం  ఆ …ఆ …ఆ …
భక్త  శిరియాలు  నేలిన  ప్రేమపాదం  బ్రహ్మ విష్ణులే   భజించే   ఆది  పాదం
అనాది  పాదం  … బ్రహ్మ    విష్ణు   లే    భజించిన  అనాది  పాదం
అన్నదాత  విశ్వనాధా    అన్నదాత  విశ్వనాదుడీ  …
లీల వినోదిగా   నన్నేలెగ  దిగిరాగా  అయ్యో
ఛీ   …ఫోమ్మంటిని … పాపినైతినీ …
ఈ  పాదం  పుణ్యపాదం  ఈ  పాదం  ధన్యపాదం
సకల  ప్రాణ పాదం    సర్వమోక్షపాదం
తెలుసుకోలేని … నా ఈ   తెలివేల  … ఈ  తనువేల    …
ఈ  పాదం  పుణ్యపాదం … ఈ  పాదం  … దివ్య  పా దం …
అలాగే మయూరి చిత్రంలో..ఈ పాట చూడండి ..

ఈ  పాదం  ఇలలోన  నాట్య  వేదం
ఈ  పాదం  నటరాజుకే  ప్రమోదం
కాల  గమనాల  గమకాల  గ్రంధం
ఈ  పాదం  ....

ఈ  పదమే  మిన్నాగు  తలకు  అందం
ఈ  పాదమే  ఆనాటి  బలికి  అంతం
తనలోనే  గంగమ్మ  ఉప్పొంగగా
శిలలోనే  అ  గౌతమే    పొంగగా
పాట  పాటలో  తను  చరణమైన  వేళ
కావ్యగీతిలో  తను  పాదమైన  వేళ
గానమే  తన   ప్రాణమై  లయలు  హొయలు    విరిసిన
ఈ  పాదం  ....

ఈ  పాదమే  ఆ  సప్తగిరికి  శిఖరం
ఈ  పాదమే  శ్రీ  భక్త  కమల  మధుపం
వాగ్గేయ  సాహిత్య  సంగీతమై
త్యాగయ్య  చిత్తాన శ్రీ  గంధమై
ఆ  పాదమే  ఇల  అన్నమయ్య  పదమై
ఆ  పాదమే  భరతయ్య నాట్య  పదమై
తుంబుర  స్వర  నారద  మునులు 
జనులు  కొలిచిన ఈ  పాదం  ....

ఆ పాద మనంత భావాన్ని..వేటూరి చెప్పినంత గొప్పగా ఎవరు   చెప్పగలరు? 


నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం అని..ఓ..ప్రేమికుడి..ఆరాధన అయినా .. 
చెలికాలి మువ్వల గల గలలు .. చెలికాని మురళి లో..సరిగమలు.. ఆ పాద మంజీరాల సవ్వడిలో..జత కలసిన హృదయ లయలే..కదా!

అంతెందుకు..చెరుకు వింటి వేలుపు..ఆ మన్మధుడు..ఆ పూల బాణాన్ని రతీదేవి పాదాల ముందే వేసాడట. 
ఆ పాండవ  మధ్యమముడు.. గురువు పాదపద్మముల ముందు బాణాన్ని వేసి కురుక్షేత్ర యుద్దాన్ని ఆరంభించాడట. 

శరణం నీ దివ్య చరణం.. అని వేడినవారికి..రిక్త హస్తాలు చూపబడవని..కదా అందరి నమ్మిక.

అప్పుడెప్పుడో..ఒక హిందీ చిత్రం చూసాను..  గుర్తుకురావడం లేదు.రైలు ప్రయాణంలో.. హీరో..హీరోయిన్ పాదాలను   చూసి  ప్రేమిస్తాడు.

అలాగే ఒక విషయం ఏమంటే.. మువ్వల పట్టీలను బహుమతిగా  ఇచ్చిన అబ్బాయిని అమ్మాయి ఎప్పుడు మరువదు కూడా..    


ఇన్ని చెప్పాను కదా ! ఇంకా మిగిలి ఉంది.

జన్మనిచ్చిన  తల్లిదండ్రుల చరణాలకు, విద్యా బుద్దులు నేర్పించిన సద్గురు చరణారవిందాలకు  మనం ఆజన్మాంతం రుణ పడే ఉంటాం.

అలాగే..తన తోడైనీడై నిలిచే..జీవిత భాగస్వామి చరణాలకి..ప్రేమతో..అనురక్తితో.. అనుసరించాలనే భావన నాది.

అందుకే.. చరణకమలాలు.. కి..అంకింత భావనతో..నేను..నా చిత్రాలు అన్న మాట.  

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

ఓ..కోయిలా..




చిలక మధుర ఫలాలను తింటుంది మనం నేర్పిన పలుకులని అందంగా పలుకుతుంది. నెమలి నాట్యం చేస్తుంది వర్షం వచ్చినప్పుడు మాత్రమే, చిలక పలుకులు గూడు  దాటవు, నెమలి ఆట అడవి దాటదు.

కానీ కోయిల వగరు మావిడి  చివురలును మాత్రమే తింటుంది.ఆ వగరు కి గొంతు రాచి పలుకుతుంది వేదనగా..ఆ ఆవేదనే మనకు..మధుర స్వరం గా వింటుంది.కోయిల పిలుపు   కొండలు-కోనలు  దాటి జనజీవన స్రవంతిలో..మనకు వినిపిస్తుంది. కోయిల స్వరాలని పంచమం అని ఉదహరిస్తారు కూడా. చాలా మంది సంగీతకారులు కోయిల స్వరాలని తమ స్వరకల్పనలో..సృష్టించారు, జతపరచుకున్నారు కూడా. ఇప్పుడైతే..కోయిల స్వరాలూ MP3   లో  చాలా తేలికగా మనకి లభ్యం.  

కోయిలమ్మ కూతకు పులకించని  మది ఉండదు. కూ అంటే..కూ అంటూ..జత కడతాం. రెచ్చ గొడతాము. కోయిల పిలుపే  కొనకు మెరుపు...కొమ్మెక్కి కూసింది కోయిలమ్మా,కు కు కూ కొమ్మే రెమ్మా  పూచే వేళ, కోకిల కోకిల కూ అన్నది., అంటూ కోయిల ఆటలని గుర్తు తెచ్చుకుంటాం. 

మా ఇంటి వెనుక అంతా తోటలు.. అక్కడ కాకి గూటిలో పుట్టి పెరిగిన  ఓ..కోయిల రెక్కలు విప్పి.గళం  ఎత్తి     పాడటం, ఎగరడం ప్రారంభించిది.. 

అంతే ..కాకులు..ఆ కోయిలని వెంటాడి మరీ గూడు వీడే  దాకా తరిమి కొట్టాయి. ఆ కోయిల పుల్లా పుడకా నోట కరుచుకుని వెళుతూ..రోజు నాకు కనబడుతూ  ఉంది..గూడు కట్టేసింది కూడా..  

నేను..ఆ కోకిలని ఫోటో తీయాలని.. రోజు ప్రయత్నిచడం..జరుగుతూనే ఉంది, నాకు ఆ కోయిల దొరకనే లేదు. నేను కెమెరా వేసుకుని తిరగడం మొదలెట్టగానే  జూమ్ కి కూడా అందనంత లోపలికి దాక్కుంటుంది.నేను  లోపలకి రాగానే.. బయటకొచ్చి షికార్లు   చేస్తుంది.. అలా నాతొ.. దోబూచులాడుకుంటుంటే..విసుగు వచ్చి..ఇలా నెట్ లో..పట్టుకున్నాను. మీరు చూడండీ! 

ఇలా కోయిలని చూడగానే నాకొక సరదా  సన్నివేశం గుర్తుకువచ్చింది కూడా!! 

ఒక నాలుగేళ్ల క్రితం గుంటూరులో..జరిగిన శతాధిక  కవి సమ్మేళనం  లో మా విజయవాడ వారు  దాదాపు ఇరవై మంది వరకు గుంపు గుంపు పాల్గొన్నాం.మా వంతు మొదటి నాలుగు ఆవృతాలలో అయిపొయింది. ఇక ఇతరుల కవిత్వం ని  ఆస్వాదించే పనిలో ఉన్నాం. 

తిరుపతి నుండి వచ్చిన "పుష్పాంజలి" మీ కోస్తా ఆంధ్రాలో..కాకులు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయి..సృష్టిస్తాయి అన్నారు.మేము..ఇదేమీ  పోలికబ్బా! అని ఆశ్చర్య పోతుండగానే ..ఆమె ఇలా కొనసాగించారు. అక్కడ చూడండీ.. ఒక కాకి..ఒక తబలా (సంగీత పరికరం) మీద వాలి  సంగీతాన్ని తన ముక్కుతో వాయిస్తున్నట్లు యెంత బాగుంది ..అన్నారు. మేము తెల్లబోయాము. వెంటనే అర్దమై.. హే.. హియర్ హియర్.. ఒన్స్ మోర్ హియర్ అని కేకలు పెట్టాం. 

ఆవిడ అది ప్రసంశ అనుకుని మళ్ళీ పునరుక్తి మొదలెట్టారు. అప్పుడు వెంటనే..నిర్వాహకులు హడావిడిగా వేదికపైకి పరుగులు తీసి..మేడం..అది కాకి కాదు కోయిల. కోయిల అలా ఉంటుంది..కనుగుడ్లు ఎర్రగా, తోక కాకి తోక కన్నా పెద్దగా,తోక చివర వెడల్పుగా ఉంటుంది అని చెప్పాక...ఆవిడా సరిదిద్దుకున్నారు. 

ఆవిడ మంచి కథారచయిత అని అవార్డులు అందుకున్నారట.కాకి కి కోయిలకి తేడా తెలియదా ?అని ప్రశ్నలు ఉదయించాయి అనుకోండి. కోయిలా! యెంత పని చేసావు?సీమ పరువు తీసావు అని ఇంకో..సీమ మిత్రుడు వాపోయి కోయిల మీద తప్పు రుద్దేసాడు. 

ప్రతి ఏడు కోయిల పిలుపు వినగానే..ఆ విషయం గుర్తుకు వస్తుంది. 

తొందర పడి ముందే కూసే కోయిలలు, శీతా కాలము కూసే కోయిలలు..మా చుట్టూరా ఉండనే ఉన్నాయి. ఇంకా..పల్లెతనాన్ని మాయం చేయలేదు..కొంత అదృష్టవంతులమే మేము అనుకుంటూ ఉంటాను కూడా..

ఇవండీ..కోయిల విశేషాలు.పాటలు బోలెడు ఉన్నాయి.  కొన్ని వినండీ..కొన్ని చూడండీ!!             .   

          
ఇక్కడ కోయిల మదురమైన స్వరాన్ని వినవచ్చు చూడవచ్చు కూడా ! ఈ లింక్ లో చూడండీ Bird Call of Koyal India video by Shirishkumar Patil - Bird Cinema - 

కోయిలలో..ఆడ-మగ తేడాలు వాటి స్వరాలూ గమనించండి.

ఇక్కడ మన తెలుగు పాటలు కొన్ని ఉంచాను. అవీ వినండీ,

కోయిల  పిలుపే  కోనకు

కుహు  కుహు  కుహు  కుహు  అని  పిలిచే  కోయిల  ఇంకా చాలా పాటలు ఉన్నాయి.ఇవి చాలనిపించి.. ఇక ఇంతే.. 

17, సెప్టెంబర్ 2011, శనివారం

ఈ హత్యలు ఆగేదెప్పుడు

ప్రేమించడం  నేరమా? 
తల్లిదండ్రుల పైశాచికత్వానికి  నిదర్శనంగా ఈ రెండు సంఘటనలు చూడండీ! కన్నవారు  బంధువర్గాలతో కలసి  దాడి చేసి ప్రాణాలు తీసేశారు.  వారికి ఎలాటి శిక్ష విదించాలో?
మానవ జాతి మృగాల కన్నా హీనంగా దాడి చేసి బలి తీసుకున్న వైనం.
బిడ్డలని కన్నామని  ప్రాణాలు తీసే అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇలాటి వారిని తీవ్రంగా శిక్షించే తీర్పు రావాలని కోరుకుంటూ..  

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-ఈ హత్యలు ఆగేదెప్పుడు  

13, సెప్టెంబర్ 2011, మంగళవారం

నాకు స్ఫూర్తి "పద్మకళ"

జీవితానికి..ఒక లక్ష్యం కావాలని..భావిస్తూ అందుకు అనుగుణంగా ఒకో మెట్టు ఎక్కుతూ.. ఎక్కిన మెట్టుపై నుండి జారి పడి పోకుండా..జాగ్రత్తగా గమనించుకుంటూ ఉన్నత శిఖరాలను..అధిరోహించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆఖరికి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు కూడా..

కొంత మందిని చూస్తే వారిలా..మనము ఉంటే బాగుండును అనిపిస్తుంది.. నాకు స్పూర్తిగా..నిలిచిన ఒకరి గురించి చెప్పబోతున్నాను. అసలు నేను ఈ బ్లాగ్ లోకం లోకి అడుగిడటానికి ప్రేరణ ఆమె మాత్రమే!

ఆమె గురించి చెప్పాలంటే.ఓ..నాలుగేళ్ళు వెనక్కి వెళ్ళాలి.

ఓ .నాలుగేళ్ళ క్రితం నాటి నవంబర్ పంతొమ్మిదవ తేది.. విజయవాడలో.. మహిళా దినోత్సవం సందర్భంగా .. మా" ఎక్స్ రే " సాహితీ విభాగం తరపున నేను ఓ..మహిళా కార్యక్రమం నిర్వహించాను.ఆ కార్యక్రమంలో .. విజయవాడ పరిసరప్రాంతాల లోని శక్తివంతమైన స్త్రీలు పాల్గొన్న కార్యక్రమం. '"మహిళలా-మజాకా" మహిళా సాధికారత క్రమంలో..స్రీలు ఎదుర్కొన్న, ఇంకా ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యల గురించి..వారి అనుభవాలు..తెలుసుకుంటూ..ఒక చర్చాకార్యక్రమం చేస్తున్నాను.

తొమ్మిది మంది అతిధులు..నవదుర్గలగా అభివర్ణిస్తూ సాగే ఆ కార్యక్రమంలో..
పత్రికారంగంలో..మహిళలు.. అనే అంశం గురించి..మాట్లాడటానికి చర్చలో..పాల్గొనడానికి జి.పద్మకళ హాజరుకావాల్సి ఉంది.కానీ ఆమె.. ఒక గంట ఆలస్యంగా వచ్చారు.

సరే..ఆలస్యంగా వచ్చినా చర్చలో..బాగా పాలుపంచుకుని ఎన్నో..విషయాలు ముచ్చటించారు . ఆ చర్చ ఆసక్తికరంగా నాలుగు గంటలు కొనసాగింది. ఒక జర్నలిస్ట్ గా..ఆమె వృత్తిలో ఎదురైనా సవాళ్ళని ఎలా ఎదుర్కున్నారో..వివరిస్తూ.. ఇంకా తనలోని..ఇంకొక పార్శాన్ని బయట పెట్టారు.

వనజ గారు..నాకు ఇక్కడ మన ఎక్స్ రే కార్యక్రమాల నిర్వాహకురాలుగా కాకుండానే..వేరేవిధంగా తెలుసు..
ఆమె ఒక శ్రోత..నేను ఒక ఆర్.జే. నేను.కృష్ణ వేణి ఎఫ్.ఎమ్ లో..ఆర్.జే గా కూడా చేస్తాను.అలాగే..ఒక స్కూల్ లో టీచర్ గాను పని చేస్తున్నాను అని నాకు షాక్ ఇచ్చారు..

నాకు అంతకుముందు ఆమె తెలిసిన రెండు సంవత్సరాల కాలంలో..ఎప్పుడు ఆ విషయం చెప్పలేదు. ఆమె..నాకు..మా "నెల నెలా వెన్నెల " కవిత్వం కార్యక్రమం లో ..పాలుపంచుకునే..కవయిత్రిగా తెలుసు..

ఆ రోజు..ఆమెలో..మూడు కొత్త కోణాలు బహిర్గతం అయ్యాయి.

ఒక జర్నలిస్ట్ గా..ఒక టీచర్ గా, ఒక ఆర్.జే గా పని చేస్తూ..సామాజిక సృహతో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం సాధారణ విషయం కాదు. ఇంట్లో ఇద్దరి పిల్లల తల్లిగా గృహిణి గా ఎన్నో భాద్యతలు నిర్వహిస్తూ.. తనలోని అసమానమైన ప్రతిభతో..వివిధ అంశాలపై వ్యాసాలూ వ్రాస్తారు.ఆమె ఏ వార్తా పత్రికలో పనిచేసినా..ఆమె శైలి విభిన్నం.

అలాగే..రేడియోలో..ఆమె ఆర్.జే గా ఎంతోమందిని అలరిస్తూ మంచి ఆర్.జే అనిపించుకుంటారు.
ఆమె హాట్ సీట్ లో..కూర్చుంటే..గంటలు నిమిషాల్లా గడచిపోతాయి అంటే అతిశయోక్తి కాదు. ఆమెకి..ఎన లేని అభిమాన గణం ఉంది.. ఈ రోజు మా కళ గారు వచ్చారు..అంటూ..ఫోన్ ఇన్ ప్రోగ్రాం లైన్స్ బిజి అయిపోతాయి.

ఇప్పుడు ఓ..కార్పోరేట్ స్కూలో..వైస్-ప్రిన్సిపాల్ గా చేస్తూ..ఇంకా ఓ..ప్రముఖ వార్తా పత్రికలో..విలేఖరిగా, ఆర్.జే గా. . చేస్తూ..ఇద్దరిబిడ్డ లని..స్వయంగా సంరక్షించుకుంటూ..

అంత పని ఒత్తిడిలో కూడా..ఆర్తుల గురించి తపన పడుతూ..కొన్ని సేవా కార్యక్రమాల్లో తనే స్వయంగా చేపట్టి..ఉత్తమ పౌరురాలిగా, మానవతా వాదిగా ఉండటం ఆమె సహజ శైలి.

ఆమె ఎవరో..కాదండీ.. మన అందరికి పరిచయం ఉన్న "తెలుగు కళ" కొత్తబంగారులోకం _తెలుగు కళ

ఆమె బ్లాగ్ లు నాకన్నా ముందు..మీ అందరికి పరిచయం.

ఆ రోజు సభ అయ్యాక ఆమె..నాకు తన గురించి చెబుతూ..బ్లాగ్ ఉందని చెప్పారు.

 ఆ విషయం గురించి  నేను పెద్దగా పట్టించుకోలేదు

తర్వాత తర్వాత పత్రికల్లోను అక్కడ అక్కడ బ్లాగ్ లోకం గురించి చదవడం,వినడం వల్ల ఆసక్తి కల్గినా కూడా నాకు తీరిక లేని పనులవల్ల.. ఇంట్లో ఆరు సంవత్సరాలగా ఉన్న కంప్యూటర్ దానికి నెట్ కనెక్షన్ ఉన్నా కూడా ఇటువైపు తొంగి చూడలేదు.

కానీ గత సంవత్సరం ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ.. నవంబర్ ఆఖరిలో..ఇలా బ్లాగ్ లోకం లోకి అడుగుపెట్టాను..

కళ గారిని చూస్తే..చాలా ఆశ్చర్యం కల్గుతుంది. అన్ని పనులు చేస్తూ కూడా..ఉత్సాహంగా ఉంటారు.ఎనర్జిటిక్ గా పని చేసుకుంటూ పోవడమే కాదు అన్నింటా ముందంజలో..ఉంటారు. కవిత్వం వ్రాస్తారు.

గత నెలలో..తల్లి-దండ్రులు అనే అంశంతో..
ఒక కవిత్వ కార్యక్రమం కి..హోస్ట్ చేసి..మంచి కవిత్వంతో..సామాజిక భాద్యతని.బిడ్డలగా..తమ కర్తవ్యాన్ని మరువ వద్దంటూ..చైతన్యంతో..పిలుపునిచ్చారు.

నాకు..ఆమె స్ఫూర్తి.

వనజగారు..మీరు బ్లాగ్ లోకం లోకి రండీ..అది..మీకు ఒక మంచి వేదిక. మీలోని కవయిత్రికి.. పాటల ఆసక్తికి..అక్కడ మీకు మంచి ఉత్సాహం అందుతుంది అని ప్రోత్సహించారు, ఆమెలోని ఎన్నో..ఉత్తమ గుణాలు నాకు ప్రేరణ. కష్టించి పనిచేయడం,కళాత్మకంగా ఆలోచించడం,అందరికన్నా ముందు ఉండటం,విభిన్నంగా నిరూపించుకోవడం లాటి ఉత్తమ లక్షణాలు అంటే ఇష్టం.

పద్మ కళగారు నాకు పంపిన వ్యాఖ్య ఇది.

వనజ గారికి బ్లాగ్ లోకానికి స్వాగతం ! మంచి భావుకత, సామాజిక అవగాహన, బాధ్యత గల మహిళలు కోకొల్లలుగా ఉన్న ఈ అందమైన లోకంలోకి తెల్లంచు నల్లచీర కట్టిన తెలుగు ఆడపడుచులాగా (మీ బ్లాగ్ డిజైన్ సుమండీ...) ౨౦౧౦ చివర్లో వచ్చారు. మీ సాహిత్యాభిలాష .. సంగీతపిపాస తీర్చుకునేందుకు ... బ్లాగరులను చక్కని టపాలతో అలరించేందుకు...... ౨౦౧౧ గొప్ప వేదిక కావాలని, నిరంతరాయంగా మీ బ్లాగ్ప్రయాణం కొనసాగాలని ఆకాంక్షిస్తూ.... నూతన సంవత్సర శుభాకాంక్షలతో....... తెలుగుకళ - పద్మకళ.

ఈ వ్యాఖ్య చూసి నాకు ఆనందం.

ఆమె బ్లాగ్ ..లింక్..ఇక్కడ ..ఇస్తున్నాను. వీలైతే..చూడండీ. కళ గారి కళలు ఇక్కడ చూడండీ.. http://telugukala.blogspot.com/ ఆమెకి..ఉన్న ఆకాంక్షలన్నీ నెరవేరాలని..మనఃస్పూర్తిగా ఆశిస్తూ ..
ఇంకా..నాలాటివారికి స్పూర్తిగా ఉండాలని..ఆకాంక్షిస్తూ.

బ్లాగ్ లోకంలోకి తీరిక చేసుకుని తప్పక రావాలని ఆమె ముద్ర అందరిని..అలరిస్తూ..ఆలోచింపజేయాలని ఆశిస్తూ..

12, సెప్టెంబర్ 2011, సోమవారం

రజనీగంధ

ఆ పూల రంగు, అందం మత్తెక్కించే పరిమళం.. 

సరిలేదు నీకెవ్వరూ ఓ..విరిబోణి..సరిలేరు నీకెవ్వరూ.. 
పారిజాతాలైనా, పొగడ పూలైనా మల్లెలైనా, జాజులైనా, సంపెంగలైనా, మొగలి పూలైనా అనుకుంటాను చచ్చేంత ఇష్టంతో..




రజనీగంధ,నిషిగంధ,లిల్లీ పూలు,ట్యూబ్ రోజ్ ఇలా ఏ పేరుతో..అయినా పిలవబడే పూల గాడమైన పరిమళం మనసును మైమరిపించేది... 
నాకు చాలా ఇష్టమైన పూలు..వాటి గాఢ మైన  పరిమళం ఆస్వాదించినప్పుడు..ఓహ్..చెప్పలేను. ఒక విధమైన మత్తు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

నా చిన్నప్పటి నుండి మా ఇంట్లో ఒక్క   కుదురు అయినా ఉండేది.ఇక ఆ దుబ్బులోనుండి ఒక నిట్టనిలువైన శీర్షం పైకి..రావడం మొదలైందా దాని వైపే నా చూపులు ఎప్పుడు మొగ్గ వేస్తుందా ఎప్పుడు పువ్వు వికసిస్తుందా? అని ఎదురు చూపులు. ఎవరు కోయడానికి వీలు లేదు సర్వ అధికారాలు నావే! 

అలా .. ఆ కుదురులని పుట్టింటి ఆస్తిగా రామాయణ,భాగవత, భగవద్గీత తెచ్చుకున్నంత గొప్పగా,పవిత్రంగా  తెచ్చుకుని మా తోటలో కాస్త కళాత్మకంగా నాటి మురిసి పోయాను. ఆ కుదురులన్ని పూసే కాలం వచ్చి పూస్తే పండుగే నాకు వాటి పరిమళాలను ఆస్వాదిస్తూ అప్పుడప్పుడు విన్న ఈ పాట ఎవరు వినకుండా పరమ రోతగా పాడుకున్నాననుకోండి. ఇప్పుడు మీరు చూడండీ..

ఎంత..అందం..ఎంత మధురం,ఎంత సౌరభం


గాలి గంధాన్ని మోసుకోస్తుందేమో..ఏమో కానీ వింత పరిమళాలని పోగేసుకుని ఓ తెమ్మెర అయి పలకరించి పులకరింపజేసి పోదూ! 

మా కృష్ణమ్మ ఒడిలోను, లంక పొలాల్లోనూ ఈ విరిబోణి విరగపూసి స్వామీ పాదాల చెంతనూ పూదండలోను స్వయంవరమాలికలోను,అలంకరణలలోను,   వేడుకలోను వేదనలోను నిలిచి
సాటిలేరు సరిలేరు నాకెవ్వరు అంటుంది.

ఈమెకి..పున్నాగపూలు..అక్క లేదా చెల్లెలు  ఏమో..! కార్తీకం   రాకుండానే.. పూసి తెల్లవారక ముందే రాలి నేలంతా చిక్కగా పరచుకుని..దారంతా ..సువాసనలు వెదజల్లుతాయి. వీటికి వ్యాపార లక్షణం రాలేదు ఎందుకో..అనుకుంటాను..ఇష్టంగా..ఖర్చు లేకుండా ఏరుకుని..దండలు..గుచ్చుకుంటూ..

ఏమైనా..ఈ పూల పరిమళం.. వెంటాడే గత జన్మాల జ్ఞాపకం.

11, సెప్టెంబర్ 2011, ఆదివారం

ఆకురాలు కాలం

నాకు బాగా నచ్చిన కవితా సంకలనం "ఆకురాలు కాలం"

ఆ సంకలనంలో.. అన్ని కవితలు ఎంతో..బాగుంటాయి. 

అందులోనుండి మచ్చుకి ఒక కవిత.

ఉద్యమ నేపద్యంలో ఉన్న తన చెలికాడు.. రాకని..అతని పోరాట పథాన్ని
అప్పుడప్పుడు చెప్పా పెట్టకుండా అతను వచ్చినప్పుడు ఆమెలో కల్గిన భావాన్ని 
నిర్దాక్షిణ్యంగా రాలిపోయిన వైనాన్ని..
ఆకురాలుకాలం రాకుండానే రాలిపోయిన నిజాన్ని..
యెంత బలంగా వ్యక్తీకరిస్తారో..మెహజబీన్.


                                             ఆకురాలు కాలం 

 -మెహజబీన్ 

అతనెప్పుడూ  అంతే 
ఒంటరిగా  రమ్మంటే  వసంతాన్ని  వెంట  తెస్తాడు

ఆరుబయట  ఆకుల  నిశ్శబ్దంలో
చెట్లు  కవాతు  చేస్తున్నాయి
ఆ  సెలయేటి  నీళ్ళల్లో
ఆకాశ  చిత్రం  ఘనీభవించింది 
చుక్కలు  కరిగి  రాలుతున్న  దృశ్యం
లీలగా  గుర్తుంది

వద్దు ...
నాకు  వెన్నెలా  వద్దు, పున్నమీ  వద్దు
సూర్యుడొక్కడు  చాలు

అతని  నిరీక్షణ లో  ఈ  నల్లని  రాత్రి  అలా
గడవనీ ...

అతనెప్పుడూ అంతే
వస్తూ  వస్తూ పాటల్ని  వెంట తెస్తాడు

అతని సమక్షంలో 
పోగొట్టుకున్న  బాల్యం  తిరిగి  ప్రవహిస్తుంది
శరీరం  అనుభవాల పాఠశాల అవుతుంది 
నేను  అతని గుండెల్లో దాక్కుని  పడుకుంటాను
ఝామురాత్రి
నిర్దాక్షిణ్యంగా  నన్ను  లేపి
మంజీరనాదాల్ని తూటాలు  
వెంటాడిన  వైనం
చెబుతాడు
అప్పుడు భయంగా  అతన్ని  
నా గుండెలోనే  దాచుకుంటాను

అతనిప్పుడు  లేదు
ఈ మధ్య  అర్ధాంతరంగా  వచ్చిన
ఆకురాలే  కాలానికి  ఎక్కడ  రాలిపడ్డాడో  ? 

10, సెప్టెంబర్ 2011, శనివారం

వాగ్భూషణమ్ భూషణమ్


ఇది   ఆకాశవాణి లో.. సంస్కృత  పాఠం ముందు వచ్చే శ్లోకం ఇది. 


వినడానికి యెంత మధురంగా ఉంటుందో!


సంస్కృతము నేర్చుకోలేదు కానీ ఈ..సుభాషితం వినడానికే కాచుకుకూర్చునేదాన్ని.


నేను తెలుసుకుని వ్రాసుకున్న అర్ధంతో ఆ శ్లోకం ని ఇక్కడ ఉంచాను.


నిజంగా చక్కని సంభాషణ అలంకారమే!

కానీ చక్కగా సంభాషణ నేరిపే వ్యక్తుల అంతరంగం కూడా సంస్కారవంతంగా ఉంటుందని నమ్మకం లేకుండా పోయిన రోజులివి.

అంతటా పయోముఖ విషకుంబులు.

ఇక పోతే.. ఇప్పటి కాలం చూస్తే బాడీ స్ప్రేలు,డియోడరెంట్స్ లేకుండానా!? అసలు కుదరదు. తెర మీద ఆడ వెంట మగ, మగ వెంట ఆడ పరిమళాల వాసనలకే మత్తెక్కి మైమరచి క్యూ లు కడుతుంటే విలేపనాలు వద్దంటే ఎలా? అసలు కుదరదు.



కస్తూరి మృగం, పురివిప్పిన నెమలి స్వభావ సిద్దంల గురించి మర్చిపోవడం మంచిది కదా!

ఇప్పుడు చక్కగా సంభాషించడం ఎలా? అలంకారం ఎలా చేసుకోవాలి? మానసిక స్థితిని బట్టి ఎలాటి విలేపనాలు వాడాలి? ఇవి ప్రత్యేక తరగతి పాఠాలు.పైన చెప్పిన సుభాషితం పొసుగుతుందా?

ఈ సుభాషితం అప్రయత్నంగా గుర్తుకు వచ్చింది. ఎప్పుడో వ్రాసుకున్నది తీసి ఇలా జత చేసాను.

"అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్  
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే " అని  భగవద్గీత..లో భగవంతుడు చెప్పిన విషయాన్ని..
"సత్యం బ్రుయాత్, ప్రియం బ్రుయాత్, నబ్రుయాత్ సత్య మప్రియం" అని వేద వాక్యము గుర్తుంచుకుంటే..  
అర్ధం చేసుకోగల్గితే మాటకి, మనిషికి విలువ అని తెలుసుకుందాం.
దయచేసి గమనించండి.
పైన నేను జతపరచిన శ్లోకం లో కొన్ని తప్పులు ఉన్నట్లు గమనించాను.
అది మార్చడం నాకు కొంచెం ఇబ్బంది.

సంస్కృత మూలం:

కేయూరాణి న భూషయంతి పురుషం  హారాః న చంద్రోజ్జ్వలాః
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతేऽఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం


9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

మర్యాద వారోత్సవాలు

చాలా రోజుల తర్వాత బసెక్కి ప్రయాణం చేయాల్సిన అవసరమొచ్చింది ఆమెకి. ఒకింత అయిష్టంగానే బస్టాప్ కి బయలుదేరింది.  అప్పుడే స్టాప్ లో ఆగి ఆగనట్లు ఆగి వెంటనే కదులుతున్న బస్ ని హడావిడిగా యెక్కేస్తూ  రెండు నిమిషాలకి వొక బస్ వస్తూనే వుంది అయినా అందరకీ  తొందరే ,వేగవంతమైన ప్రపంచం రాష్ట్ర రోడ్డు సంస్థ నడిపే బస్సుల్లో కనబడుతుంది అని.

బస్ అంతా కిక్కిరిసి వుంది. పిల్లలని చంకనేసుకున్న తల్లులు, తల్లులు కన్నా భుజాలపై  పుస్తకాల సంచుల భారాన్ని మోస్తున్న పిల్లలు, భుజానికి హ్యాండ్ బేగ్ తగిలించుకుని పై రాడ్ ని పట్టుకుని వ్రేలాడుతున్న వుద్యోగినిలు, స్త్రీలకి కేటాయించిన సీట్లలో దర్జాగా కూర్చుని చోద్యం చూస్తున్న పురుష పుంగవులు. ఇది రోజూ కనబడే పరిపాటి దృశ్యాలు. టికెట్ తీసుకుంటూ కండక్టర్ ని అడిగింది ఆమె. మేడమ్ ! యింతమందిమి ప్రయాసపడుతూ  నిలబడి  ప్రయాణం చేస్తుంటే లేడీస్ సీట్లు ఖాళీ చేయించరేమిటీ ?

రోజూ యిదే పరిస్థితి, మీ మాట  మేము వినేదేమిటీ  అన్నట్లు చూస్తారు. ఒకోసారి గంటల తరబడి మేము నిలబడి ప్రయాణం చేస్తూనే వున్నాం. పదినిమిషాలు  ఆమాత్రం నిలబడి ప్రయాణం చేయలేరా ఆకాశంలో సగమంటూ బ్యాగులు తగిలించుకుని వుద్యాగాలకి బయలుదేరినవాళ్ళు అంటూ నోరు పారేసుకుంటున్నారు. ఎంతమందితో వాదించగలం ? నా డ్యూటీ నేను చేయాలికదా ! మీరే అడిగి సీట్లు ఖాళీ చేయించుకుని కూర్చోండి అంటూ ముందుకు వెళ్ళింది లేడీ కండక్టర్.

ఆమె బస్ అంతా పరికించి చూసి స్త్రీల సీట్లలో కూర్చున్నవారిని సీట్లు ఖాళీ చేయమని అడిగింది. మనసులో తిట్టుకుంటూ లేచి సీట్లిచ్చారు కొందరు. కొంతమంది సర్దుకుని కూర్చున్నారు. మరొక సీట్ లో ఒక స్త్రీ -పురుషుడు కూర్చుని వున్నారు. భార్యాభర్తలు కాబోలు, వారిని విడదీయడం యెందుకులే  అని యెవరికి వారు  వూరుకున్నారు. అలాగే ఇరవై నిమిషాలు ప్రయాణం సాగింది. మధ్యలో సెల్ ఫోన్ల రొద. కారుతున్న చెమట వరద. ఇంట్లో చెప్పుకోవడానికి సమయం లేనట్లు ఆడంగుల సొద. అబ్బా .. నరకమంటే ఇదేనేమో.  డ్రైవర్ బాబూ .. తొందరగా పద పద ఆమె మనసులో విసుక్కుంది. వెహికిల్ మీద వెళితే పావు గంట పట్టే ప్రయాణం. ప్రతి స్టాపుకి ఆగి ఆగి ముప్పావు గంట పడుతున్న  ప్రయాణం యిది. ఛీ వెదవది ..అంతా ఆలస్యమే, అందుకే బస్ యెక్కనిది అని తనని తానే  తిట్టుకుంది.   

అంతలో షడన్ బ్రేక్ తో బస్ ఆగింది. చంకలో ఉన్న పిల్లతో సహా తల్లి పడిపోయింది. ఆమెని లేవదీసి దెబ్బలేమైనా  తగిలాయేమో నని చూస్తూ ..ఏమిటయ్యా ఈ షడన్ బ్రేక్ అని అరిచింది ఒకావిడ. ముందు రోడ్డు పై చూడండి. మూడడుగుల యెత్తు వున్న  డివైడర్ ని కూడా అవలీలగా దూకి యెక్కడ బడితే అక్కడ హఠాత్తుగా రోడ్డు దాటేస్తుంటే బ్రేక్ వేయక యే౦ చేయాలి. జనాన్ని గుద్ది చంపేస్తామా ? బుద్ధి లేదు  జనాలకి " అంటూ పైకి అని తర్వాత వినబడకుండా తిట్టుకుంటూ ఉంటూంటే సందట్లో సడేమియా అన్నట్లు అరవై యేళ్ళు పైబడిన వృద్దుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన బస్ లోకి యెక్కబోయాడు. ఎత్తుగా వుండే బస్ మెట్టు యెక్కలేక రాడ్ పట్టుకుని యెక్కడానికి ప్రయత్నించే లోపే బస్ కదిలింది. ఒక కాలు బయట ఇంకో కాలు లోపల  పెట్టి సర్కస్ ఫీట్లు చేస్తూ .. సరిగా యెక్కనీయకుండా యేమిటయ్యా ఆ తొందర  అని అరుస్తున్నాడు.  యేమిటండీ .. యెక్కనిచ్చేది, మీ యిష్ట ప్రకారం యెక్కడబడితే అక్కడ యెక్కేయడమేనా, మా ప్రాణాలు దీయడానికి బయలుదేరతారు అంటూ విసుగుతో కూడిన తిట్ల దండకం మొదలెట్టాడు డ్రైవర్. వృద్దులు,పిల్లలు యెక్కే౦దుకు తక్కువ యెత్తులో వుండే put board అవసరం గురించి అప్పటిదాకా మాట్లాడుకున్న  వారు కూడా ఆ  పెద్దాయనకి లేచి సీట్ యివ్వలేదు. ఆయనలాగే రాడ్ పట్టుకుని వ్రేలాడుతున్నాడు. అంతలో బస్ ఆగింది. యెవరు దిగుతారో సీట్ ఖాళీ అవుతుందా అని వెదుక్కు౦ది. భార్యభర్తలిద్దరూ కూర్చున్నారని అనుకున్న సీట్ లో నుంచి ఆ స్త్రీ లేచి నిలబడింది. అమ్మయ్య సీట్ దొరికింది అనుకుని ఆమె అటువైపు అడుగులేయబోయింది.

స్టాప్ లో  ఆమె ఒక్కతే బస్ దిగి వెళ్ళింది. అతను అలాగే సీట్ లో కూర్చుని వున్నాడు. వాళ్ళ వెనుక సీట్ లో కూర్చున్న వొకాయన బస్ కదలబోతుంది దిగరేమిటీ అనడిగాడు. ఈ రోజు కొంచెం పని వుంది. మార్కెట్ కి వెళ్లి పని చూసుకుని వస్తాను అన్నాడు. అప్పుడు అనుమానం వచ్చింది ఆమెకి. అప్పటివరకూ అతి ప్రక్కన కూర్చుని ప్రయాణం చేసిన ఆమె ఇతని భార్య కాదు. తోటి ప్రయాణికురాలు మాత్రమే అని నిర్దారించుకుంది. దిగి వెళ్ళిపోయిన స్త్రీ రూపాన్ని గుర్తుకుతెచ్చుకుంది. చాలా సాధారణంగా వుంది అయినా యెలాంటి బిడియం లేకుండా పరాయి పురుషుడి ప్రక్కన  గంటకి పైగా కూర్చుని ప్రయాణం చేసింది. బస్ లో మిగతా  వుద్యోగినులు అతని ప్రక్కన సీట్ ఖాళీగా వున్నా కూర్చుని ప్రయాణం చేసే సాహసం చేయలేకపోతున్నారని అనిపించి "ఇక్కడ వ్రేలాడుతున్న ఆడవాళ్ళ అవస్థ చూసైనా మీకు సీట్ ఖాళీ చేయాలనిపించడం లేదా అనడిగింది. కూర్చోమనండి, నేనేమైనా వద్దన్నానా ? మీరైనా కూర్చోవచ్చు అన్నాడు. అతని మాటల్లో వ్యంగ్యం గుర్తించి వోల్లుమండి పోయింది ఆమెకి. యెంత పొగరు వీడికి స్త్రీల పట్ల యింత చులకన భావమా ? మర్యాద వారోత్సవాలు జరిపి స్త్రీలకి కేటాయించిన సీట్లు వారికే ఇవ్వమని, స్త్రీలని గౌరవించమని చెవుల్లో శంఖం వూది మరీ చెప్పారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు . అవన్నీ శుద్ధ దండగ అని ఆలోచిస్తూ వుంది.

ఇంతలో ట్రాఫిక్ కి అంతరాయం కల్గింది. రెండు వైపులా వాహనాలు బారులు బారులుగా నిలిచిపోయాయి. ఏమిటా అన్న ఆసక్తితో బయటకి చూస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  మహిళలు జరుపుతున్న  ప్రదర్శన.  మహిళపై జరుగుతున్నా లైంగింక వేధింపులు ,ఈవ్ టీజింగ్ , వరకట్న వేధింపులు, మహిళా రిజర్వేషన్లు గురించి యెలుగెత్తి నినదిస్తూ సాగుతున్న ప్రదర్శన పట్టుమని వందమంది కూడా లేని లేమి తనం. మహిళా సమస్యల గురించి వేదికలెక్కి ఉపన్యసించే టపుడు అందరూ సమైక్య వాదులే,మాహిళాభివృద్ధి  కాంక్షించే వాళ్ళే ! కానీ వారితో నడవడానికి వొక్క పురుషుడు కానరాడు. ఇలా అంత రంగంలో తలపోస్తున్న ఆమెకు వెనుకనుండి స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. వీళ్ళకి వొళ్ళు బలిసి హద్దు అదుపు లేకుండా రోడ్డున పడ్డారు. ఇంట్లో మగవాళ్ళు చవటలు కాబట్టి ..అనుకుంటున్న మాటలు వొంటికి  కారం రాసుకున్నట్లు అనిపించింది.  బస్ లో సగానికి  పైగా మహిళలున్నా యెవరూ ఆమాటలు విననట్లే నటించారు. ఎవరెవరితోనో వాదన మనకెందుకన్నట్లు.

స్త్రీలు నిలబడి ప్రయాణం చేస్తున్నారు తప్ప పురుషుడి ప్రక్క సీటు ఖాళీగా వున్నా కూర్చునే సాహసం చేయరు. ఇందాకటి స్త్రీ పెద్దగా చదువుకున్నట్టు కూడా లేదు.అయినా యెంత సహజంగా దైర్యంగా కూర్చుని ప్రయాణం చేసింది. నాలాంటి వారికి యెన్నెన్ని సంశయాలు, యెంత బిడియం. రైల్లో అయితే పర్లేదు కానీ బస్ లో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ప్రక్కన కూర్చుని ప్రయాణం చేసే సాహసం స్త్రీలలో యింకా రాలేదు అపర్ణాసేన్ మిస్టర్ అయ్యర్ & మిసెస్ అయ్యర్ చిత్రంలో కూడా హీరోయిన్ వేరొక పురుషుడి ప్రక్కన బిడియపడుతూ కూర్చున్న వైనం గుర్తుకొచ్చింది అప్రయత్నంగా ఆమెకి.  పొరబాటుగా శరీరాలు తగిలనంత మాత్రానే అపవిత్రమయిపోతామన్న భయం స్త్రీలకి మాత్రమేనా ? లేక ఆ స్త్రీలకి సంబంధిన మగవాళ్ళది కూడానా అనుకుంటూ కాళ్ళు నొప్పి పుడుతున్నట్టు అనిపించి .. పురుషుడి ప్రక్కన ఖాళీగా వున్న సీట్లో టక్కున కూర్చుంది.

 ఆమె అలా కూర్చోగానే బస్ లో వున్న కొందరి చూపుల్లో ఆశ్చర్యం, నొసలు చిట్లించడం గమనించింది. కూర్చునే ముందు లేని ఆలోచన అప్పుడు కల్గింది ఆమెకి . ఎవరైనా తప్పు పట్టినా పట్టించుకోకూడదు అనుకుంది దృఢ౦గా . ఇంకో స్టాప్ రాగానే మరికొన్ని సీట్లు ఖాళీ అయ్యాయి. అయినా ఆమె అతని ప్రక్క నుండి లేచొచ్చి ఖాళీ అయిన సీట్లో కూర్చోలేదు.ఇలాంటి విషయాల వల్లే స్త్రీ చాలా వెనుకబడి వున్నారనిపించింది. ఏ వాన కురిసినప్పుడో , బంద్ ప్రకటించినప్పుడో, ట్రాఫిక్ జామ్ అయినప్పుడో త్వరగా యింటికి చేరాలని ఆదుర్దా  అవసరం వున్నప్పటికీ కూడా యెవరి వాహనంలో అయినా లిఫ్ట్ అడగాలంటే భయం. లిఫ్ట్ యివ్వాలన్నా సంశయం. ఆకాశంలో సగం అన్నది యెంత అబద్దం. మనం యెదిగింది యెక్కడ? కేవలం ఆలోచనల్లో మాత్రమేనా? ఆలోచనల్లోనే కాదు ఆచరణలో కూడా అన్నది యెవరో వొకరు దైర్యంగా నడిచి చూపాలి అనుకుని దైర్యంగా సర్దుకుని కూచుంది. బస్టాండ్ కి వచ్చి ఆగింది బస్. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు యెవరి తొందరలో  వారు . ప్రక్కన కూర్చున్న పురుషుడు కూడా వేరే సీట్లో కూర్చునే ప్రయత్నం చేయలేదు.

మళ్ళీ అనేక ఆలోచనలు. మనం నిజంగా నాగరికత సాధించామా, నాగరికత అనేది మన వేష భాష ల్లోనే కానీ, మన ఆలోచనల్లోనే కానీ ఆచరణలో మాత్రం శూన్యం అనుకుంటుండగా యెవరి పలకరింపుకో  వులికిపడింది.కాస్త పరిచయం వున్న మనిషే ! నవ్వి బాగున్నారా అని అడిగింది. మార్కెట్ కా అనడిగింది ఆమె. అవును అంది ..ప్రక్కన  యెవరూ .. అర్ధోక్తిలో ఆగింది ఆమె . మావారు కాదు అందామె. మరి ఆశ్చర్యంగా చూసింది . కొద్ది క్షణాల తర్వాత ఫ్రెండ్ ..ఆ ..అని అడిగింది. నా ప్రక్కన కూర్చున్నతను యెవరో చెపితే కానీ ఆ రాత్రికి ఆమెకి నిద్రపట్టదేమో అన్నంత యిదిగా అడుగుతుంటే  "కాదండీ .. నా తోటి ప్రయాణికుడు " అంతే అంది. ఆవిడ ముఖంలో మళ్ళీ టన్నుల కొద్దీ ఆశ్చర్యం. అంతలోకి మార్కెట్ రానే వచ్చింది.అందరూ దిగే పనిలో వున్నారు.ఆమె మాత్రం ఆఖరిన నిలబడి యెదురుగా కనబడుతున్న డిపో మేనేజర్  ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంది. ఎందుకమ్మా  నెంబర్ వేసుకుంటున్నారు అనడిగాడు డ్రైవర్. మీ మీద రిపోర్ట్ చేయడానికి కాదులే ! మర్యాద వారోత్సవాల ఫలితాలు గురించి చెపుదామని అని బస్ దిగిపోయింది ఆమె.


8, సెప్టెంబర్ 2011, గురువారం

ఆశలకి..

ఆశలకి... రెక్కలు ఉంటాయి కదా ! కొన్ని ఒంటరి ఆశలు,మరికొన్నిజంట ఆశలు,చాలా సామూహిక ఆశలు. ఆశ మనిషి శ్వాస. 

ఆశే లేకుంటే మనిషి మనుగడకి.. అర్ధం ఉండదేమో!

నిన్న ఒక జ్ఞాపకం,నేడు ఒక కల,రేపు అనేది ఆశ. మనిషి కి ఎన్నో..ఆశలు.  బహిర్గతం కాని ఆశలు ఎన్నో!  బహిర్గతం అయితే.. ఆకాశానికి..నిచ్చెనలు వస్తున్నాడని..యెగతాళి చేయరు.? రహస్య మైన ఆశలతో.. ఆశల పల్లకి..ఎక్కి..ప్రయాణం సాగిస్తారు. 

ఆసలు మనిషి జీవితమే.. ఆశల పల్లకి అట. కొందఱు..ఆ పల్లకి వెళుతుంటే..చూస్తూ..ఉండిపోతారట. మరి కొందరు ఆ పల్లకి మోసే బోయిలగా మిగిలిపోతారట. కొందఱు అదృష్ట వంతులు మాత్రం ఆ పల్లకి ఎక్కి కూర్చుని ప్రయాణించ గల్గుతారట. 

అసలు ఆశలు   పల్లకి ఎలా ఉంటుందంటారా? నేను చూసాను. ఇదిగో..ఇలా.


ఈ పల్లకిలో కూర్చోవాలని  ఎన్ని ఆశలు.. ముచ్చటగా ఉంది కదా ! 

సరే ఒక అమ్మాయి అయితే.. ఆకాశంలో..ఆశల హరివిల్లు.. ఆనందాలే పూచిన పొదరిల్లు.. అందమైన ఆ లోకం అందుకోనా..అంటుంది. ఆమెకి..ఎన్ని ఆశలో..కవి కలం కి నర్తించిన ఆమె ఆశలు..చూడండీ!



ఆశలకి.. ఆయుష్షు  ఉంటుంది. అస్పష్టమైన ఆలోచనలతో.. ఏవేవో.. కావాలని ఆశించడం.. ఆ ఆశలు నెరవేరక ఉసూరుమనడం.. ఈ సారి మెరుగైన ఆశలు పెట్టుకుని మెరుగైన ప్రయత్నాలు చేయాలని అనుకోవడం పరిపాటి.. "అంతా బ్రాంతి యేనా ఇక మిగిలేదింతేనా? ఆశా నిరాశేనా ?.. అంటూ.. విషాద గీతాలాపన చేసేవారికి.. ఓకే మాట.  నిరాశ అనే నేలమీద నిలబడ్డ మనిషికి..ఆశ అనే  ఆకాశ హర్మ్యం యెంత ఠీవిగా నిలబడి ఉంటుందో..చూడండీ.. అంటూ.."ఆశతో..జీవించడంలోనే అందమెంతో ఉందిలే"..అనే వేదవతి ప్రభాకర్ గారి "నవ్వుతూ బ్రతకాలిరా" గుర్తు చేస్తూ..ఉండటమే!



ఆశలకి రెక్కలుంటాయి.మితిమీరి ఎగరాలనుకుంటే రెక్కలు విరిగిన విహంగంలా..నేల కూలాల్సిందే.
అందుకే హద్డు ఎరిగి బుద్ది పెంచుకుని ఆశలు పెంచుకుంటే..బాగుంటుంది..అని చెపితే వింటారా? 


"కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం..అని ఆశ పడుతున్నారు..ఈ గుంపు మిత్రులు.. ఒకసారి విషయంలోనుండి అటువైపు దూకి..చూసొద్దాం రండీ..


బాబోయి.. ఇన్ని ఆశలా? అనుకోకండి.. అందులో..సగమైనా తీరాలని..నా ఆశ కూడా.. 
ఈ ఆశలకి అంతే లేదా.. ? 

ఆశలు ఉంటాయి అందరికి అవి ..కొందరికి అనుకుంటాను.కానీ.. "ఆశలకి కన్నీళ్లు ఉంటాయి" అని ఒక సరి క్రొత్త కోణం..వచ్చింది.మీకు తెలిస్తే అది..మీరు చెప్పండి.


ఇంతకీ..నేను చెప్పొచ్చేది ఏమిటంటే.. ఆశను బ్రతికించి.. తాను మరణించేవాడు మనిషి.

7, సెప్టెంబర్ 2011, బుధవారం

మరకత మణి స్వరాల హరివిల్లు

మరకత మణి  కీరవాణి.. స్వరాల హరివిల్లు.. లో.. ఒకే  చిత్రం రెండు భాషల్లో.. వైవిద్యభరితమైన గాయనీగాయకుల గళాలలో  వినండీ.. 

అలాగే  శ్రీ దేవి అరవింద స్వామి లను  చూడండీ.












  

5, సెప్టెంబర్ 2011, సోమవారం

వందనమాంధ్ర మహాజననీ ! వందనమాంద్ర జననీ నా?

 తెలుగు తల్లి


మహాంధ్ర జననీ    వందనమాంధ్ర  మహాజనని
సుందరతర పౌరాళి కావని 
వందనమాంధ్ర మహా జనని 
వరగోదావరి కృష్ణ పినాకిని 
ఝరీ సహస్రలు తుంగ భద్రలూ
నటియించిన చైతన్యము నీయది 
నటియించిన ఉద్దీపము నీయది 
వందనమాంధ్ర మహాజనని 
సుందరతర పౌరాళి కావని 
నన్నయ్య,తిక్కన,త్యాగ్రజులూ 
గోపన్నయ.క్షేత్రయ నీ ప్రియ పుత్రులూ 
రాజ రాజులూ, రుద్రమాంబలూ
రాయలు నీ పద సేవకు పాత్రులు 
వందనమాంధ్ర మహాజననీ
సుందరతర పౌరాళికావని 



మేము  చిన్నప్పుడు  స్కూల్లో గురువులు నేర్పగా నేర్చుకుని ఆలపించిన గీతం. 

మరి ఇప్పుడు.. ప్రజల ఆకాంక్షల మేర రాష్ట్రం తప్పనిసరిగా  ముక్కలైతే.. నేటి తరం పిల్లలు.. (తెలుగు పై..అపరిమితమైన ప్రేమాభిమానము లతో..) యేమని.. పాడుకోవాలో!

అయినా కవులకి    కొదవ ఏముంది? 

నిమిషములలో..వ్రాస్తారు  బాగానే ఉంటుంది..కానీ   మరొక సందేహం.. ముంచుకొస్తుంది.. 

అఖిలాన్ద్రంలో..నిర్మించి..అభిమానంతో తెలుగుతల్లి పేరు పెట్టుకున్న సెక్రటరేటియేట్ దగ్గరున్న
 ప్లై ఓవర్ సైతం..పేరు మార్చుకుని ఏ తల్లిగా కనబడుతుందో..!?

ఉర్దూ..తల్లిగా కనబడుతుందో..అని..సందేహంగా ఉంది.
ఇంకా చరిత్రలోకి..వెళితే.. 
ఏం పేరు ..దొరుకుతుందో..తల బద్దలు కొట్టుకున్నాఈ మట్టి బుర్రలోకి.. వెలగడం లేదు. అందుకే విదేశాలలో ఆనందంగా పాడుకుంటున్న వారిని..చూసి .. ఇంకా ఆనందం. ఇక్కడ  మేము  అలా  పాడుకున్నామా? ఆడపడుచులు అనికూడా చూడకుండా అక్షింతలు..వేసేరని భయపడి.. మేఘాలపై తేలి..అక్కడ వాలి..హాయిగా గ్రోలి...అందరం చూడాలనుకుని ఇలా తెచ్చాను.   మరి మీరు చూడండీ! 

4, సెప్టెంబర్ 2011, ఆదివారం

పీత కష్టాలు పీతవి

పీత కష్టాలు పీతవి 

మా ఇంటి బిడ్డలా తిరుగుతూ..నోట్లోనుంచి మాట రావడం ఆలస్యం ..జీ హుజూర్ అంటూ పనిపాటలకి సిద్దంగా ఉండే మా ప్రకాష్ కి ఓ..పెద్ద కష్టం వచ్చి పడింది. నిన్న నాకు ఓ అత్యవసర  పనిబడి పోన్..చేసి..ఒకసారి ఇంటికి..రా !అనగానే..నిమిషాల్లో..వచ్చి వాలాడు. ఈ లోపు తనకి పోన్ వచ్చింది. మాట్లాడి పెట్టేసాడు. 

ఏమిటమ్మా..చెప్పు ?అన్నాడు. నేను ఇలాగే బ్లాగ్ ముఖంలో పడి తన మాట వినిపించుకోలేదు. మళ్ళీ అతని పోన్ మోగింది. ఈసారి కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టి మాట్లాడుతున్నాడు.నేను ఆసక్తిగా చూస్తున్నాను. పోన్ పెట్టేసి.. ఏం చేస్తాం?  పీత కష్టాలు పీతవి..అన్నాడు. అంతకు ముందు నేను సీత కష్టాలు చెప్పలేదే? అన్నాను..హాస్యంతో..వాతావరణాన్ని తేలిక చేస్తూ.. 

అసలు విషయం ఏమంటే.. ప్రకాష్.. ఓ.. బార్బర్ షాప్లో..పని చేస్తూ.. దూరవిద్య లో.. మూడేళ్ళ క్రిందటే వేలుపెట్టి.. ఇంకా చదువుతున్నాడు...చదువుతూనే ఉన్నాడు. చదువు కన్నా స్నేయితాలు..జాస్తి.ఏకసంధాగ్రాహి. చక్కగా క్లారినెట్ వాయిస్తాడు.పాటలు పాడుతాడు.మిమిక్రీ చేస్తాడు. రోజుకొక సందర్భం సృష్టించుకుని అందంగా కవిత్వం ఒలికిస్తూ..పెద్ద పెద్ద ఎస్. ఏం .ఎస్ లని..ఓపికగా అందరికి పంపుతుంటాడు.మా వూరి ప్రెసిడెంట్  గారి వెంట..తిరుగుతూ మంచి పనులలో..ఓ చేయి వేస్తూ.. ఉంటాడు. అంత మంచి పిల్లాడికి  ..ఓ..కష్టం వచ్చి పడింది.

అందుకే పీత కష్టాలు అంటున్నాడు. తన వృత్తిలో..భాగంగా కన్నా.సేవా భావంతోనే.. వాళ్ళ షాప్ వరకు వెళ్ళలేని  వారికి ఇంటికి వచ్చి క్షురకర్మలు చేసి వెళుతూ ఉంటాడు. అలాగే ఈ రోజు ఆలా ఇంటికి వచ్చి హెయిర్ కటింగ్,షేవింగ్ చేసి వెళ్ళమని పోన్ ల మీద పోన్లు.  అతనేమో..రావడం కుదరదు బిజీ గా ఉన్నానని అబద్దాలు ఆడుతున్నాడు. ఎందుకు అలా అబద్దాలు వెళ్ళ  వచ్చు కదా! అని మందలించాను.  

కటింగ్ చేయమని అడిగేది ఎవరికో..తెలుసా? నిర్ధారిత హెచ్ .ఐ .వి. వ్యక్తికి అన్నాడు. అయితే ఏమవుతుంది..?వారి సామాగ్రి వారికే..ఇచ్చి రా..ఇతరులకి వాడవు కదా..!? అన్నాను. అసలు.. ఎప్పుడు..సరి క్రొత్త బ్లేడ్స్ వాడతాము. అలాగే కత్తెరలు లాటివి..రోజు స్టేరిలైజ్ చేస్తాం.షాప్లో..అలా ఇబ్బంది పడం. తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం. కానీ ఇంటికి వెళ్లి  అతనికి..కటింగ్,షేవింగ్ నేను చేస్తున్నాను అని ఆ నోటా ఈ నోటా ప్రాకితే.. భయం తో నా షాప్ కి ఎవరు రారు. అప్పుడు నా భుక్తి ఎలా? అన్నాడు. ఆలోచనతో.. నేను అవును కదా అనుకున్నాను.

ప్రభుత్వం ఎన్ని అవగాహన కార్యక్రమాలు రూపొందించినా ..జనంలో..ఇంకా ఎయిడ్స్ పట్ల..  పాజిటివ్ హెచ్ ఐ.వి వ్యక్తుల పట్ల ఏర్పడిన ఏహ్యభావం,భయం తొలగ లేదనడానికి  ఈ విషయం.. నిలువెత్తు నిదర్శనం.

హెచ్. ఐ.వి ఉన్న వ్యక్తీ ఒక టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడని కొందరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి  .. పిర్యాదు  చేస్తే..అతని చేత బలవంతంగా ఆ టిఫిన్ సెంటర్ ని క్లోజ్ చేయించారు.అతని బ్రతుకు తెరువుని..పోగొట్టారు. ఇది అన్నమాట ప్రజలలో..వచ్చిన చైతన్యం. అప్పుడు కొందరు జోక్యం చేసుకుని..అతనిని..పని మానిపించి..ఇంట్లో..కూర్చోబెట్టి అతని..భార్యతో..ఆ టిఫిన్ సెంటర్ నిర్వహింప చేస్తున్నారు.

అతను కొన్నాళ్ళకి  డిఫ్రేషన్ తో ఉరి వేసుకుని చనిపోయాడు. చస్తే చచ్చాడు ఎప్పుడైనా చచ్చేవాడే కదా..అనడం విన్నాను. బాధ కల్గింది.అప్పటికి మనమేమి..శిలేసుకుని ఉంటామా ఏమిటి అనుకున్నాను. ఈ బాధలు గాధలు లేని..ప్రపంచం ఎక్కడ ఉండును.. అక్కడకి..వెళ్లి .తలదాచుకుందుకు అని దిగులు పడ్డాను.

వాహనాలలో..నిశ్శబ్ద యుద్ధం పేరిట వీధి వీధినా తిరుగుతూ.. అవాయిడ్ ఎయిడ్స్పై. మొబైల్ అవగాహన కార్యక్రమాల ఫలితాలు..ఇవీ..అనుకున్నాను. సమాజం విసిరి పారేసిన వ్యక్తులు పై.. జాలితో..ఈ పోస్ట్. 
అన్నట్లు  ప్రకాష్ ఈ రోజు  రహస్యంగా వేకువనే..వెళ్లి..అతని తల బరువుని కత్తిరించి పడేసి..సేవ చేసి వచ్చానని పోన్ చేసి చెప్పాడు.అది ఒక మంచి విషయమే..కదా!