31, మే 2012, గురువారం

"మై స్పేస్ " అమ్మలక్కల కబుర్లు 2



రండి రండి.. మళ్ళీ ..అమ్మలక్కల కబుర్లు మోసుకుని వచ్చాను.

ఈ రోజు ..మా కిట్టీ పార్టీ మెంబెర్స్ అందరం కలుసుకున్నాం.

నెల ఆఖరి రోజు కూడా పొదుపు చేయడం ద్వారా ఉన్న డబ్బుతో..ఎవరో ఒకరికి అవసరానికి  ఉపయోగ పడుతుందని.. ఇలా నేలాఖరి  రోజుకి ప్లాన్ చేసుకున్నామన్నమాట. ఇదీ  గొప్ప విషయమే అనుకుంటాను నేను.

సరే ..నాలుగు కొప్పులు ఒక చోట చేరితే కబుర్లే...  కబుర్లు కదా!

మొదటగా .. ఏం కూరలు చేసావు లలితా .!?.అడిగాను.

మావారు వూరు వెళ్ళారు. వెళ్ళిన వారు వచ్చేవరకు ఇంట్లో మనదే ఇష్టా రాజ్యం.
వారు ఉంటే అన్నీ వారికిష్టమైన కూరలే చేయాలి.వారానికి ఒక్క రోజయినా సరే నాకు ఇష్టమైన కూరలు చేసే వీలు లేదు అంది.

అదేమిటి..ఇంట్లో అందరికి ఇష్టమైనవి చేయాలి కదా!

మా ఇంట్లో అలా లేదు, వారికి అన్నీ వేపుడు కూరలు,రక రకాల ప్లేవర్స్ తో..రసం,చారులు కావాలి. నాకైతే కలగలుపు కూరలు,రోటి పచ్చడులు ఇష్టం. మా అత్తగారు మా పెళ్ళైన క్రొత్తలలో చెప్పారు." పోద్దస్తమాను కష్టపడే మగవాడికి వాళ్లకి ఇష్టమైన పదార్ధాలు వండి.. తృప్తిగా వడ్డించడం ఆడవారి ధర్మం " అని నేను అప్పటినుండి తు.చ తప్పకుండా పాటిస్తాను. పాటించకపోతే  నట్టింట్లో వినబడే సణుగుడు,గొణుగుడు ..లు వినలేక చావాలి... ఒకింత కసిగా చెప్పింది

నేను నవ్వి మీ అత్తగారు చెప్పిన మాట విన్నావు సరే ! మీ అమ్మ గారు చెప్పిన మాట గుర్తుకు రాలేదా !? అన్నాను. లలిత ముఖంలో ఆశ్చర్యం.

నేను నవ్వుతూ.. "భయపడకు.. భర్త,కుటుంబ సభ్యులు అందరు భుజించిన తరవాతే భుజించు.వాళ్ళు తిన్నతర్వాత ఏమి మిగిలి ఉండక పోయినా సరే అర్ధ ఆకలితో అయినా పడుకోవాలి కాని ..అందరికన్నముందుగా భుజించకూడదు అని చెప్పలేదా ? " అన్నాను.

"అవును ఇలాగే చెప్పింది. మీ అమ్మగారు ఇలాగే చెప్పారా?" అని బోలెడంత ఆశ్చర్యం ప్రకటించింది.

"అందులో ఆశ్చర్యం ఏముంది? అందరు చెప్పేది అదే కదా!,," అంది రమ ..ఆ టాపిక్ లోకి ఎంటర్ అవుతూ..

"నిజమే అందరు అలాగే చెపుతారు. కానీ.ఆమెకీ   కొన్ని ఇష్టమైనవి ఉంటాయి. ఆ వంటలు చేయడం వల్ల ఇంట్లో అందరు కూడా ఆ వంటలని అలవాటు చేసుకోవచ్చు అని కూడా అనుకోవాలి కదా! అలా అనుకోకపోవడం వల్ల 
మహిళలకి ఇష్టమైన తిండి సంగతి పెళ్లి తర్వాత మర్చి పోవడమే అన్నమాట!

నేను అయితే.. ఎవరికీ ఏ ఐటమ్స్ ఇష్టం అని చూడకుండా అన్ని రకాలు కలిపి వండి అక్కడ పడేస్తాను. ఇష్టమైతే తింటారు లేకపోతే.. నాలుగు తిట్లు. కాస్సేపు చిరాకులు పరాకులు,ఆరోపణలు ఉంటాయి అనుకోండి వాటిని లెక్క చేయను. రెండు మూడు కూరగాయలు కలిపి వండటం వల్ల వచ్చే రుచి..ఆ డీప్ ప్రయ్ లలో వస్తుందా చెప్పండి? అసలు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇంట్లో భోజనాల బల్ల దగ్గరే కనబడాలి.ఏక పక్ష నిర్ణయాలు అమలు జరగనివ్వడం ఎందుకు? కలసి బ్రతుకు తున్నప్పుడు ఒకరికి నచ్చినవి ఇంకొకరు తినడం కూడా అలవాటు చేసుకోవాలనుకోవడంలో తప్పు ఏముంది? ఆలోచించి చూడండి..అన్నాను

"అలా రుచులు,అభిరుచులు కలుపుకోవకపోతే చాలా ఇబ్బంది. ఒక ఇంట్లో ఎవరి టీవి వారికి ,ఎవరి ప్రిజ్ద్ వారికి,  ఎవరి వంట వారికి ఏర్పాటు చేసుకోవాలి అనేమో  .. పాపం! ఆడవాళ్లే వాళ్ళ వాళ్ళ  ఇష్టాలని చంపేసుకుని ఇంట్లో భర్త, పిల్లల  కోసం త్యాగాలు చేస్తారు. అందుకనే  వాళ్ళు ఇంటికి దూరంగా వెళ్ళినప్పుడు  ఆడవాళ్ళు ఇష్టంగా తమకి కావలసినట్లు ఉంటారనేది  సత్యం " అంది రమ.

"ఏమిటో జీవితంలో ఇంకొకరి ప్రవేశం కాగానే అన్నీ మారిపోతాయి.అనుకుంటే దిగులు వచ్చేస్తుంది."అంది సుజాత .ఆమెకి ఇంకా వివాహం కాలేదు. జాబ్ చేస్తుంది

"అలా భయపడాల్సిన అవసరం లేదు.ఇప్పుడు మగవాళ్ళు అంతా నేను మోనార్క్ ని అనడం లేదులే! వచ్చినా విడ అభిప్రాయాలని, అభిరుచులని కొంత  గౌరవిస్తున్నారు "చెప్పాను.

స్వర్ణ గారు అనే ఆవిడ ఇలా అన్నారు. "మార్కెట్ కి వెళ్లి కూరలు తేవడం అంటేనే ఎలర్జీగా చూసే మగవాళ్ళు కంచం ముందు కూర్చుంటే మాత్రం.. నాలుగైదు రకాలు కనబడాలి.ఇంట్లో వుండి వండి పెట్టడానికి కూడా ఏడ్చి చస్తారు..అని మాటలు పడాలి అదేంటో మరి . వంట చేయడం అంటే ఈజీ అయినట్టు .. చెప్పేస్తారు .

ఇంతలో లత గారు తాటి ముంజె లతో విచ్చేసి .."అందరూ  ఒక పట్టు పట్టండి.." అని మధ్యలో పెట్టేసారు. ఉదయమే తీసుకుని ప్రిజ్ద్ లో ఉంచడం చల్లగా ఉన్నాయి. అందరు తింటూ ఉండగా.. "ఏం టాపిక్ మొదలెట్టారేవిటి ఈ వేళ ? " అని అడిగారు.

ఆమె తూ.గో.జి. ఇక ఎవరైనా  ఆ జిల్లా వాళ్ళు కనబడ్డారంటే  గుంపులో నుండి విడివడి పోయి వాళ్ళ కబుర్లు వేరుగా ఉంటాయి. మా కృష్ణా జిల్లా వాళ్లకేమో మమ్మల్ని వాళ్ళు ఇన్సల్ట్ చేస్తున్నట్లు ఉంటుందనుకోండి. అయినా మనసులో శాంతం, శాంతం అనుకుని. ఏమండీ..తూ.గో & ప.గో వారు.. మేము వినవచ్చా అండీ మీ కబుర్లు అని  అంటాం.అలా సుజాత గారిని, లత గారిని విడగొట్టి మాలో కలిపేసుకుని మా కడుపు మంట చల్లార్చుకుంటాం...

"ఏముంటాయి వంటల కబుర్లు, కష్టాలు, మగవారిని ఆడిపోసుకోవడాలు ..మాత్రమే అయ్యాయి మీరు చెప్పండి క్రొత్త కబుర్లు ..అన్నాను.

"వంటలు సంగతి ఏముంది లెండి.. భార్య ఏ చీర కట్టుకోవాలి,ఎలాటి రంగు చీర చీర కట్టుకుంటే బాగుంటుందో..అనేది కూడా మా ఇంట్లో మా భర్త గారి ఇష్టమే! ఇదిగో..ఈ చీర నీకు బాగుంటుంది ఇలాటివే కట్టుకో..అని ఆర్డర్స్.

నాకు అలాటి రంగు చీరలి ష్టం లేదని అంటే.. " నా కోసం నాకిష్టమైన చీరలే కట్టుకోవాలి కాని..నీకు ఇష్టమైన చీరల్లో నిన్ను చూడటం నావల్ల కాదు, అదసలు నాకు నచ్చదు"  అని చెప్పేవారు.  మా అత్తగారేమో.. అబ్బాయికి ఇష్టమైనట్లు ఉండమ్మా!మగవాళ్ళు ఏదిష్టపడితే అందులోనే ఇమిడి పోవాలి లేకపోతే మనం చీర మార్చినట్లు..వాళ్ళు భార్యలని మారుస్తారు..అనేది" అని చెప్పారు ఆవిడ.

"యెంత అన్యాయం".. ఇది ఆడవారి కి చాలా అవమాన కరం .తినే తిండి,కట్టుకునే బట్ట గురించి కూడా భర్త  ఇష్టం ఏమిటి? స్త్రీలకి వాళ్ళకంటూ ఇష్టా ఇష్టాలు ఉండావా!?

ఒకవేళ ఇష్టాలు ఉన్నా పెళ్లి అవడం తోనే వాటిని భర్త కోసం మార్చేసుకోవాలా?

భర్త కోరిక మన్నిస్తే ఎప్పుడైనా ఒకసారి అతనికి నచ్చినట్లు ఉండటం పర్వాలేదు.జీవిత కాలం అతనికి మాత్రమే నచ్చేటట్లు ఉండాలనుకోవడం అహంకారం గా అనిపించడం లేదు...అంది రమ .
.
మంచి భర్త అంటే భార్య ఇష్టా ఇష్టాలని కూడా గమనించి..ఆమెకి నచ్చినట్లు ఉండే స్వేచ్చని కొంతైనా ఇవ్వకపోతే ఎలా!?

మనమందరం ఈ విషయంలో..మగవారికి వ్యతిరేకంగా మన నిరసనని తెలియజేద్దాం...అంటూ..ముక్త కంఠం..తో నిరసన తెలిపారు.
.
 అప్పుడు నేనొక విషయం  చెప్పాను . అసలు నా పెళ్లి అప్పుడు మా అత్తగారు పెట్టిన పట్టు చీరే నాకు నచ్చలేదు.లావెండర్ కలర్ పట్టు చీర. అది నా ఒంటికి  ఏ మాత్రం.. నప్పదు అలాటిది నాకామె ఆ చీరే కొన్నారు. నాకు నచ్చలేదని చెప్పేస్తాను అంటే.. మా వాళ్ళంతా..తప్పు అలా చెప్పకూడదు..వాళ్ళు పెట్టిన చీర కట్టుకోవడం ఆనవాయితీ ని నా నోరు నోక్కేసారు.నాకు నచ్చని ఆ చీర కట్టుకుని ..ఆ అసంతృప్తిని వెళ్ళ గ్రక్కుతూ సత్యనారాయణ వ్రతం దగ్గర కూర్చున్నాను. అప్పుడు తీసిన ఫోటోలలో ఆ అసంతృప్తి స్పష్టంగా కనబడుతుంది. అపుడు తప్ప ఆ చీరని నేను ఎప్పుడు కట్టనే లేదు.  వేలకి వేలు పోసి కొన్న చీర .కనీసం కట్టు కునేదాన్ని ఒక మాట అయినా అడిగి కొనాలి అన్న ఆలోచన రాకపోడం దురదృష్టం అని చెప్పాను నేను.

"పూలు పెట్టుకోవడం అంటేనే నాకు చాలా ఇబ్బంది. ఆ పూలు ఎక్కడ నలిగి పోతాయో అన్నంత జాగ్రత్తగా ఉండాలి. ఇదేమీ విడ్డూరమో!పూలు పెట్టుకోవడం ఇష్టం లేదన్న దానిని నిన్నే చూసాను అని అన్నా నేను పెద్దగా లెక్క చేసేదాన్ని కాదు." అని చెప్పారు దుర్గ అనే ఇంకొకరు.

మావారికి ఏఎన్నార్ లా ఇంత పొడుగు సైడ్ బార్క్స్ పెంచడం అలవాటు.అది ఆయనకీ ఇష్టం. నాకు అలా ఉండటం ఇష్టం లేదంటే ఆయన మార్చుకున్నారా? మార్చుకోలేదు. వాళ్ళు ఎలా ఉండాలనేది  మాత్రం వాళ్ళిష్టమనుకుంటారు. అది అహంకారం కాదు.అంది

భార్య ఇలానే ఉండాలి అని శాసించినట్లు ఉండడం తప్పు అంటాను. భర్త అంతరంగాన్ని గ్రహిస్తే భార్యే అతని కోరిక ననుసరించి.. మనస్పూర్తిగా ఉండటం వేరు బలవంతం చేయడం వేరు .

మా ప్రక్కింట్లో ఉండే ఒక జంట గురించి చెబుతాను వినండి భర్త కిష్టం అయినట్లు ఉండలేదని.. భార్యని తెగ తిట్టిపోయడం చేసేవాడాయన. ఆయనకీష్టమయిన చీర కట్టుకుంటేనే..ఆయనతో బైక్ పై ఎక్కిన్చుకునేవాడు.లేకపోతే..ఏమిటి సర్కస్ దానిలా తయారయ్యావు..సినిమాలో తైతక్కలాడే హీరోయిన్లా ఉన్నావు..అని మాట్లాడే వాడు. పాపం ఆమె కళ్ళనీళ్ళు కారుకుంటూ లొపలకి వెళ్ళిపోయేది.తర్వాత ఆమె ఎప్పుడు ఆయనతో బయటకి వెళ్ళడం మానేసింది. అని చెప్పింది..

ఆమ్మాయిలు..! మీరు అంతా ఒక విషయం మర్చిపోతున్నారు. మా కాలం లో ఇవన్నీ మాకు తెలిసేవా ఏమిటి..? ముతక చీరలు,జరీ చీరలు,పట్టు చీరలు అన్నీ కలిపి ..నాలుగైదు చీరలు తప్ప ఎవరికీ  అన్న్తకన్నా ఎక్కువుండేవి కావు. మీ కాలం వచ్చేసరికి మొగుళ్ళు స్వయంగా షాపులకి తీసుకెళ్ళి రక రకాలు కొని పెట్టి ఆ చీరలే కట్టుకోమంటే బాధపడి పోయి అవే బోలెడు కష్టాలు అయినట్టు చెప్పుకుంటున్నారు.మా కాలం లో అలా ఉండేదా!? పుట్టింటి వాళ్ళు కొని పెడితేనో, లేదా అత్తముండ దయ తలచి కొనిపెడితేనో. కట్టేవాళ్ళం. మా మీద మీరు నయం కదూ.. అన్నారు భానుమతి అనే మామ్మగారు.

అవును మామ్మ గారు..మీరు చెప్పినది నిజమే!  మీకు, మాకు ఒక తరం తేడా ఉంది. జనరేషన్ గ్యాప్ అంటారే  అదన్నమాట.

ఇక ఇప్పుడు మాకోచ్చే కోడళ్ళు,మా కూతుళ్ళు..ఉన్నారు చూడండి వాళ్ళు ఎలా కట్టినా నోరు మూసుకుని కూర్చునే కాలం వచ్చింది. "ఐ డోన్ట్ లైక్ ఇట్.".అంటే..మేము " యాజ్ యూ లైక్ !"అంటూఅడిగినంత డబ్బు ఇచ్చేసి నోరు మూసుకుని ప్రక్కకు వెళ్ళిపోయే రోజులు వచ్చేసాయి. ఏం చేస్తాం చెప్పండి? ఈ తరం వాళ్ళు ఇష్టాలు,ఆలోచనలు ఎలా ఉంటాయో! నని  చూచాయగా చెప్పి అక్కడ నుండి బయట పడటానికి రెడీ అయి లేచి నుంచున్నాను.

మొత్తానికి మేము తినే తిండి మీద, మేము కట్టుకునే బట్ట మీద మీ మగవాళ్ళ ఆధిపత్యం ఏమిటి.. అని అడిగేటట్లు.. జరిగిందన్నమాట ఈ రోజు టాపిక్.. అంది పద్మ...

అప్పుడేనా..వెళ్ళడం కాసేపు కూర్చోండి. అంటూ బలవంతం చేసారు.

నేను వింటేగా.. నా కాళ్ళకి రధ చక్రాలు ఉంటాయని.. వెనుక నుండి..మా రమ జోక్.. వాళ్ళ బుజ్జిపండు గాడి.. అలక అరుపులు.. వెహికల్ శబ్దంలో కలసి పోయి..ఇంటికి వచ్చి పడి...  ఇలా ఇక్కడ అక్షరాలలో .. ఆ కబుర్లు వెలిసాయి.

(మిత్రులకో చిన్న మాట . ఎప్పుడు పది మంది ఉండే మా కిట్టీ లో ఈ రోజు ముగ్గురు గైరు హాజరు.ఆ కబుర్లే ఇవి.ఆడవాళ్ళ కాలక్షేపపు కబుర్లలో ఏముంటాయనుకోవద్దు. బోలెడు విషయాలుంటాయి సిల్లీగా అనిపించే సీరియస్ విషయాలు వాళ్ళ రోజువారి కబుర్లలో కలబోసుకుని ఉంటాయి.వాటి గురించి చెప్పడమే..మై స్పేస్ ..ఉద్దేశ్యం.పురుషుల ఆలోచనలని వైఖరిని చెప్పడం మాత్రమే కాని వారిని దుయ్యబట్టం కాదు అని మనవి. 


(ఈ పోస్ట్ చదివి.. కొంత మందయినా కొంచెమయినా  ఆలోచించగల్గితే అదే పదివేలు అనుకుంటాను.)

ఓపికగా ఈ కబుర్లు చదివిన అందరికి ధన్యవాదములు.

10 కామెంట్‌లు:

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

కబుర్లు అంటూనే మంచి పాయింట్ లేవనెత్తారు.బాగున్నాయి మీ కబుర్లు.

జలతారు వెన్నెల చెప్పారు...

తూ.గో & ప.గో వారి కబుర్లు ఎలా వేరుగా ఉంటాయో చెప్పి తీరాలి వనజ గారు మీరు... హమ్మా!!
"కృష్ణా జిల్లా వాళ్లకేమో మమ్మల్ని వాళ్ళు ఇన్సుల్త్ చేస్తున్నట్లు " ఉంటాయన్నారు.. ఎలా అబ్బా? చెప్పండి తొందరగా , తెలుసుకోవాలని ఉంది. బాగున్నాయి మీ కబుర్లు!

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రవి శేఖర్ గారు.. పోస్ట్ లో ఆంతర్యం గ్రహించేసారు. :) ధన్యవాదములు.
@జలతారు వెన్నెల గారు ఇప్పుడే చెప్పేయాలా!? ఒక పోస్ట్ వ్రాయాల్సి ఉంటుంది. తీరిక చూసుకుని తప్పకుండా చెపుతాను. సరేనా! పోస్ట్ నచ్చినందుకు థాంక్ యు!

అజ్ఞాత చెప్పారు...

అంతా బాగుంది కానీ మా గోదారి వాళ్ళని ఆడిపోసుకుంటారా... హన్నా... :)

శ్యామలీయం చెప్పారు...

ఈ అసంతృప్తి అనేది మనషిలో దాదాపు ఒక సహజాతం. ఉన్న సదుపాయాలతోనూ పరిస్థితులతోనూ సర్దుకు పోవటమే ఉత్తమమనుకుంటాంగానీ అసంతృప్తి అనేది లేకపోతే ఇంకా యెలాగుంటో బాగుంటుందో లేదా ఇంకా యెలా బాగుండవచ్చునో అనీ తాపత్రయం ఉండెదా? అది లేకపోతే నాగరికతలో అభివృధ్ధి అనేది యెలా సాధ్యం అయ్యేది?

ఆడ్వాళ్ళకు అసంతృప్తికర గృహజీవితానికి బోలెడు నేపధ్యం ఉంది. కాని మీరే అన్నట్లు రోజులు మారుతున్నాయి. అసంతృప్తికి కారణాలు కారకాలు మారుతున్నాయి. కాని అసంతృప్తి అనేది అలాగే ఉంది.

ఇంట్లో వాళ్ళ కష్టసుఖాలు అర్థం చేసుకోవటం చేతకాని మగవారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

కాని పరస్పరం అవగాహన లేని దాంపత్యాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది!

అజ్ఞాత చెప్పారు...

:) :) :)

జ్యోతిర్మయి చెప్పారు...

బావున్నాయండీ మీ నెలాఖరి కబుర్లు...

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

'మహిళలు మహరాణులు ' నే
డహహా ! మగవాడు మగువ కను సన్నల లో
సహనము పాటించి మనక
సహజీవన యాన నౌక సాగని బ్రతుకుల్

బుధ్ధిగ మగవాడిప్పుడు
ప్రొద్దున్నే నిద్ర లేచి పూని కిచెన్లో
ఒద్దిక కాఫీ గలుపుక
తద్దయు పెండ్లాని కిచ్చి తరియించు కడున్ .

కూరలు తరుగుట లాదిగ
'పోరల' స్నానాదికములు , భోజన బాక్సుల్
కూరిచి స్కూలుకు విడుచుట
దారల 'తిట్లొక్క వైపు' తప్పవు పతికిన్ .

తల్లి చేతి వంట తనివార తిన్నట్టి
అర్భకుండు పెండ్లి యగుట తోనె
అసలు వంటరాని అర్థాంగి ధర్మాన
వంట వండి సతికి వార్చ వలసె .
----- సుజన-సృజన

శశి కళ చెప్పారు...

చాల బాగున్నాయి మీ కబుర్లు

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

puranapanda phani gaaru Thank you very much!!

@Shyamaleeyam gaaru ..mee spandanaki namassulu. dhaanyavaadamulu.

@ kashtEphalE gaaru dhanyavaadamulu.

@Jyothirmayi gaaru Thank you veruy much

@venkata rajarao lakkaakula gaaru..
manah poorvaka dhanyavaadamulu.

@ shashi kala gaaru Thank you very much!!
ఈ కబుర్లు పై స్పందించిన అందరికి మనఃపూర్వక ధన్యవాదములు. గో.జిల్లాల సంభాషణ లపై ఒక పోస్ట్ అవసరం అది చదివి.. మీ అందరి అభిమానం ఇంకాస్త పెంచుకుంటాను. దయచేసి వేచి ఉండండి.ప్లీజ్!
కరంట్ కష్టాలు వల్ల అందరికి వివరంగా ధన్యవాదములు తెలుప లేక ఇలా.. వచ్చాను. మన్నించండి. అందరికి మరీ మరీ ధన్యవాదములు.