4, మే 2012, శుక్రవారం

సత్యం - శివం -సుందరం



ఓ.. ఆరేళ్ళ క్రితం భూమిక లో ..ప్రచురింపబడిన నా కవిత ఇది.
నేను బ్లాగ్ మొదలెట్టిన తొలిరోజుల్లో పోస్ట్ చేసాను. అప్పటికి ..నా బ్లాగ్ అందరికి షేర్ చేయకపోవడం వలన.. అందరికి ఈ కవిత పరిచయం లేదు. అందుకే..ఇప్పుడు.. ఇలా షేర్ చేసుకుంటున్నాను.

సత్యం - శివం -సుందరం


విఫలమైన రెండు పార్శ్వాలకు 
చిరునామాని నేను
నాతి చరామి అని దగా చేసినా
అనుకోని అతిధిలా వచ్చి
కొండంత ప్రేమని కఠినశిలలా మార్చి
దిగాలుతో కుదిపేసినా
జీవచ్చవాన్ని   కాలేదు కానీ..
మళ్లీ మళ్లీ వసంతం వస్తుందంటే..
నమ్మని మోడుని నేను..

అదేం చిత్రమో
రాతిలోనూ  రాగాలు పలికించగల
వైణికుడు ఉంటాడని
ప్రేమ సంజీవనితో బ్రతికిస్తాడని 
భావ ఉద్వేగాల ఉప్పెనలో
ఆలోచనాతరంగాలతో..
జీవనతీరాలు సృశించుకుని
ఆకర్షణకి తావే లేని..
అంతరాలు తెలియనివ్వని 
ఆత్మబంధువు అవుతాడని ఊహించనేలేదు. .

ప్రాణ హితుడా !
నేను  నిర్మిచుకున్న చట్రం నుండి..
నేనే వెలుపలకి వచ్చానో..
నువ్వే లోపలకి జోచ్చుకుని వచ్చావో !

వద్దు వద్దు అనుకుంటూనే..
హృదయపు వాకిళ్ళు తెరచి
ఎదను చిగిర్చుకుంటూ
గంపెడాశతో చిగురంత ప్రేమని ఆహ్వానించానే !

పది శరత్కాలాలు ఎక్కడో.దాక్కుని
హఠాత్తుగా మళ్ళీ నాకోసమే అన్నట్టు
వెన్నెల నింపుకుని వచ్చిన చంద్రుడా
నాకొక రక్షణ కవచమై నిలిచావే..!

ప్రేమ పాత్రని వొంపి 
రోజుకొక చుక్కా చుక్క రుచి చూపిస్తూ
జవసత్వాలు నింపావే
ఎన్నెన్ని దీర్ఘ రాత్రాలు..
ఎవరికి చెప్పని సంగతాలు
నీ స్నేహ పరిష్వంగంలో కరిగి
నా.. ఆవేదనని తేలిక పరిచాయో
నా ఆలోచనా సహచరుడా
ఎన్నెన్ని కలలు వాస్తవాలు అవుతాయని..
పచ్చబొట్టంత గాఢంగా నీ ముద్రని ధరించి..
హృదయ భాండాగారంలో నిక్షిప్తం చేసుకున్నానో!

హఠాత్తుగా ఏ సంశయాలు వేధించాయో 
చేసుకున్న వాగ్దానాలు భంగపడ్డాయో
అపనమ్మకం ముంచెత్తిందో
దూరంగా జరుగుతూ నీవు 
దూరం ఊహించని నేను
వేరొకరి నీడనే కాదు నా నీడని కూడా
నేను ద్వేషించి

జీవనగమనంలో 
ఎవరి గమనానికి అడ్డు తగలని బాటసారినై
ఎవరిని తిరిగి..ప్రశ్నించని  మౌన శతఘ్నినై 
లోకానికి వెల్లడించుకోలేని
అముద్రిత విషాద సంచికనై
శరీరాన్ని కాపాడుకున్నంత భద్రంగా
మనసుని కాపాడుకోలేకపోయానని 
కుములుతూ
ప్రతిక్షణం  నీ వలపు
నా తలపుని తాకిన వేళ
నా హృదిపై
ఒక బాధావీచిక పయనించి వెళుతుంది..
కనుకొనకులనుండి
ఒక చుక్క నిర్వేదంగా నిలిచింది
"ఒంటరి " అయి అచ్చు నాలా!

జీవితాన్ని ప్రేమించుకోవడం
జీవనాన్ని ప్రేమించడం
ఇతరుల ప్రేమని ఆశించకుండా 
ఉండటం  అవసరమని
దశాబ్దాల నా అనుభవం  నొక్కి చెప్పింది..
సత్యం ..శివం.. సుందరమై .

5 కామెంట్‌లు:

జ్యోతిర్మయి చెప్పారు...

అంతులేని వేదన కనిపిస్తోంది మీ కవితలో...

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"జీవితాన్ని ప్రేమించుకోవడం
జీవనాన్ని ప్రేమించడం
ఇతరుల ప్రేమని ఆశించకుండా ..
ఉండటం .. అవసరమని..
దశాబ్దాల నా.. అనుభవం .. నొక్కి చెప్పింది.."

కవితలో ఎంతో వేదన వున్నా ఈ చివరి మాటలు మాత్రం చాలా నచ్చాయండీ..
ఆశించి బాధపడటం కంటే ఆశించకపోవటమే మంచిదేమో కొన్ని సార్లు..

జలతారు వెన్నెల చెప్పారు...

కదిలించిందండి కవిత వనజ గారు. చాలా బాగుంది.

సి.ఉమాదేవి చెప్పారు...

మీ అక్షరవిన్యాసము పేర్చిన పదసోపానము మరల మరల చదివించింది.మనిషి తనను తాను తెలుసుకున్నపుడు మౌనతపస్సే పరిష్కారాన్ని సూచిస్తుంది.అదే మీ కవితలోని చివరిపాఠం.

హితైషి చెప్పారు...

VERY STRONG FEELINGS EXPRESS about Women heart pain.
Look like Last four lines.
Every one follow up this words.