9, జనవరి 2026, శుక్రవారం

గాలిమేడలు

  గాలి మేడలు. - వనజ తాతినేని 


ప్యాక్టరీ పెద్ద గేటు ముందు రోడ్డుకి ఇటువైపున చెట్టుకింద నిలబడుకుని వుంది ఆమె.  చంకలో పసి బిడ్డ కూడా వుంది. పక్కనే వున్న బడ్డీ కొట్టు అతను రెండు నిమిషాలకు ఓ సారి ఆబ కళ్ళతో ఆమెను పరిశీలనగా చూస్తున్నాడు.


గంటలు గడుస్తున్నాయి ఆమె చూపంతా గేటు లోపల నుండి బయటకు వస్తున్న వారిని చూస్తూ  తాను ఓ చెట్టులాగానో కరెంట్ స్ధంబం లాగానో నిలబడే వుంది.  చుట్టూ ఊర కుక్కలు తిరుగుతున్నాయి. ఆమెను చూసే వారికి ఏవో తప్పుడు సంకేతాలు అందుతున్నట్టున్నాయి.


ఫ్యాక్టరీ కి దూరంగా వున్న  బస్తీకి కిరాయికి వెళ్ళిన టాక్సీ ఖాళీగా తిరిగొస్తూ ఆమెను చూసి స్లో అయింది.. సిటి లోకి వెళుతుంది కారు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. కారు ఆగిపోయింది అక్కడే. డ్రైవర్ దిగి బడ్డీ కొట్టులో డ్రింక్ బాటిల్ కొన్నాడు. కుక్కలను దూరంగా తోలాడు.  కారులోకి యెక్కి కూర్చున్నాడు. మరో  గంట గడిచింది. కారు డ్రైవరు  ఆమె దైర్యం చూసి ఆశ్చర్య పడ్డాడు కూడా! ఆమె తపస్సు చేస్తున్న వ్యక్తి లా గేటులో నుండి వస్తున్న వాహనాలను పట్టిపట్టి చూస్తుంది.


బడ్డీ కొట్టు మూసుకుంది.  అతను వెళుతూ వెళుతూ  “ ఓ అమ్మాయ్! ఇక ఇక్కడ వుండటం అంత మంచిది కాదు, చుట్టుపక్కల ఇళ్ళల్లో దీపాలు కూడా  ఆపారు. ఇక వెళ్ళిపో” అన్నాడు కసురుకున్నట్టు. 


ఆమె టాక్సీ దగగ్రకు వచ్చింది. అందుకోసమే కూర్చుని వున్న  అతను డోరు తీసి ఎక్కమన్నాడు.. 

ఆమెను చూస్తూ.. “మీరు ఎవరి కొరకో ఎదురుచూస్తున్నట్టు వున్నారు” ఆన్నాడు. 

ఆమె మాట్లాడలేదు.  కీచుమన్న ఒడిలో బిడ్డను గుండెలకు దగ్గరగా హత్తుకుంది. అడ్రస్ అడిగాడు. జంక్షన్ దగ్గర అని  చెప్పింది.  జాగర్తగా ఇంటి దగ్గరే దించాడు. మా ఇల్లు నీకెలా తెలుసు అన్న సృహ లేని ఆలోచనల్లో వుంది ఆమె.  డబ్బు తీసుకుంటూ ఆమెను మరింత పరిశీలనగా చూసాడు.దీపంలా వెలిగే పోతుంది కానీ అందులో దిగులు చీకటిలా కమ్మేసింది. 


కారు డ్రైవరు.. మనసులో అనుకున్నాడు. 

“అంతు చిక్కకుండా పోయిన అతని కోసం వెతుకున్నావా తల్లీ

అతని కోసం ఒళ్ళు మరిచి ఇల్లు విడిచి వచ్చేసినావా?

జీవితం బాగుంటుందని గాలిమేడలు కట్టుకున్నావా?

ఇప్పుడు ఒడిలో బిడ్డ కూడా తోడైంది. మోజు తీరాక మొహం చాటేసాడేమో వాడు” 


మరుసటి రోజు ఆమె మళ్ళీ అక్కడే కనబడింది. కనబడవచ్చు అనే అనుమానంతోనే అక్కడక్కడే తిరిగింది కారు. అతని ఊహ నిజమైంది. ఆమె ఎదురుచూసి చూసి కళ్ళు కాయలు కాచాయి అన్నట్టుగా వుంది. అతను  ఆమె కోసం ఓపిక చేసుకున్నాడు.  

కానీ  ఆమె ఎదురు చూస్తున్న అతను రాలేదు. సన్నగా కురుస్తున్న వర్షం పెద్దది అవుతుంది. ఆమె వెంట తెచ్చుకున్న గొడుగు వెనక్కి వాల్చి మరీ గేటు వైపు చూస్తుంది. ఈ రోజు ఊర కుక్కలతో పాటు  మరి కొందరు మనుషులు తూలుతూ  వొంటరిగా నిలబడ్డ ఆడదాని వాసన పసిగట్టి అక్కడే తారట్లాడుతున్నాయి. అశ్లీలంగా వాగుతున్నాయి.  కారు డ్రైవరు కారు దిగి వచ్చి ఆమె పక్కనే నిలబడ్డాడు. బడ్డీ కొట్టు అతను ఆశ్చర్యంగా చూసి.. “ తెలిసిన మనిషేనా ఏమిటి? కాపాలాగ నిలబడ్డావ్” అన్నాడు. అతను మాట్లాడలేదు. ఆమె మాట్లాడలేదు.


పదకొండు గంటలు దాకా చూసి చూసి  ఆమె కారెక్కి కూర్చుంది. అప్పటికే వర్షం ఆమెను సగం తడిపేసింది. ఇంటి దగ్గర దింపుతూ..” రేపు కూడా వెళతారా ఆ మనిషిని వెతుకుతూ. రేపు ఆదివారం” అన్నాడు. ఆమె మాట్లాడకుండా డబ్బులు సీట్ లో పెట్టి దిగిపోయింది. 


ఎందుకైనా మంచిది అని ఆదివారం కూడా ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాడు. ఆ రోజూ అక్కడే నిలబడి వుంది. అదే సమయం అదే ఎదురుచూపులు. బడ్డీ కొట్టతను జాలిపడి వాచ్ మెన్ పిలిచి ఆమెకు కావాల్సిన మనిషి గురించి సమాచారం అడిగి తెలుసుకోమని చెప్పాడు. అతను ఏం చెప్పాడో విన్న ఆమె మౌనంగా కారు ఎక్కి కూర్చుంది. 


“ఛీకట్లో వున్న బస్టాప్ ల దగ్గర ఊరి చివరల ప్రాంతాలకి సరిగ్గా బస్ లు షేర్ ఆటోలు నడవని చోట.. నేను కారు తిప్పుతూ వుంటా! కిరాయి ఎక్కువ వస్తుందని కాదు, ఆడవాళ్ళకు అండగా వుండి వారి ఇళ్ళకు వారిని క్షేమంగా చేర్చాలని. మీరు ఎంత ప్రమాదకరమైన ప్రాంతంలో నిలబడ్డారో మీకు  తెలియదు. రావాల్సిన మనిషి రావాలనుకుంటే వస్తాడు, మీరెందుకు అంతలా వెదకడం” అని కూడా అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. రోడ్డునే చూస్తున్న ఆమె  కళ్ళల్లో నీలినీడలు.


మధ్యలో  కారు ఆపి రెండు చపాతీలు పన్నీరు కూర ప్యాక్ చేయించుకుని వచ్చాడు.  

ఆమె ఇంటి దగ్గర దిగి.. “ఇక ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్లాల్సిన పని లేదు” అంది. డబ్బు సీట్ లో పెట్టింది. 


“మీరు బాధలో వున్నారు, వండుకుని ఏం తింటారో కూడా నమ్మకం లేదు, ఈ చపాతీలైనా తినండి. బిడ్డ జాగ్రత్త” అన్నాడు. ఆ పొట్లం అందుకుని ఇంటి తలుపు తెరిచి లోపలికి వెళ్ళిపోయిందాకా చూసి గాని బయలుదేరలేదు అతను. రోజూ చీకటి బడ్డాక  ఆ దారిన వస్తూ పోతూ..ఆ ఇంట్లో వెలుగుతున్న దీపాల కాంతిని చూస్తూ.. ఆ తల్లి పిల్లా బాగున్నట్టే! అదే కావాలి అనుకున్నాడు. 


నాలుగు రోజుల తర్వాత  మిట్ట మధ్యాహ్నం పూట దవాఖాన దగ్గర బస్టాప్ లో నిలబడుకుని వున్నది..పసిడి బొమ్మలాగున వుండే ఆ తల్లి ముఖం నీరసించి పోయింది జ్వర తీవ్రతతో ఒళ్ళు వణుకుతోంది కళ్ళు ఎర్ర బడినాయి. చంకనున్న పసి బిడ్డ ముఖం లేత తోటకూర కాడలా ఒడిలిపోయింది. 


కారు  ఆపి డోరు తెరిచి నిలబడ్డాడు. ఎక్కి కూచుంది. 

“మందులు తీసుకున్నారా” అడిగాడు.

“ఒకటి ఇచ్చినారు, మరో రెండు కొనాలి.” 

మెడికల్ షాపు ముందర ఆపి మందుల చీటీ తీసుకుని పోయాడు. 

“వైరల్ ఫీవర్ అండీ.. యాంటీబయాటిక్స్ పెట్టిండ్రు” అన్నాడు షాపతను. 

మొత్తం ఇయ్యి అన్నాడు మళ్లీ! మందులతో పాటు. బ్రెడ్ పేకెట్ రెండు బిస్కెట్ పాకెట్స్ తీసుకున్నాడు. పాల పేకెట్ తీసుకుని ఇడ్లీ పొట్లం కట్టించుకుని వచ్చాడు. 

ఇంటి దగ్గర  కారు ఆపి.. మందులు శ్రద్ధగా వేసుకోండి . మీ ఇంటాయన వస్తాడ్లే, దిగులు పెట్టుకోకండి.,ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి అని విజిటింగ్ కార్డు ఇచ్చాడు. 


“ఇప్పుడు డబ్బులు లేవు, తర్వాత ఇస్తా” గొణిగింది ఆమె. హేయ్! పర్వాలేదులే! మనుషులం గందా! ఈ పాటి సాయాలు చేసుకోకుంటే యెట్టా! అన్నాడు. కృతజ్ఙతగా చూసింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.


మర్నాడు ఉదయాన్నే పాల ప్యాకెట్లు, టిఫిన్ పొట్లం,  కూరగాయలు పండ్లు తీసుకుని వచ్చి గుమ్మం ముందు పెట్టి ఆమెకు వొంట్లో ఎలా వుందో అజ కనుక్కొన్నాడు ఆ కారు డ్రైవరు.. అట్టా వరుసగా వారం రోజులు గడిచాయి. ఎనిమిదో రోజు గుమ్మం లో  మగ మనిషి ఉన్నాడు. చేతిలో సంచి గుమ్మంలో పెట్టి వెనక్కి తిరిగాడు కారు డ్రైవరు.

 

“నీ యమ్మ ఎవడే వాడు నేను రాని రెండు నెలల్లోనే ఇంకొకడిని తగులుకున్నావా? “ జుట్టు పట్టుకుని ఈడ్చి ఆమెను కొడుతున్నాడా మనిషి.. 


గిరుక్కున వెనక్కి తిరిగి విసురుగా గుమ్మం దాటి లోపలికి వెళ్ళాడితను. కొడుతున్నతని కాలర్ పట్టుకున్నాడు. ఇతన్ని చూసిన ఆ మనిషి కంగు తిన్నాడు. 


“ఇదే మాదిరిగా నా చెల్లిని మోసం చేసి కొట్టి చంపి ఆమె  ఉసురుపోసుకున్నావు కదరా! నీ మాయ మాటలు చెప్పి ఇలా ఎంతమందిని ఆగం చేద్దాం అని అనుకుంటున్నావు” అని లాగి చెంపలు వాయించాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది  విషయం విన్నదీ అసాంతం.


“అమ్మా! వీడొట్టి దగుల్బాజీ! ఇంపోస్టర్!!  వీడికి ఇంతకు ముందే పెళ్ళైంది. భార్య  పిల్లలు వున్నారు.. అది దాచి పెట్టి సిటీకి చదువుకోవడానికి వస్తున్న నీలాంటి అందమైన పల్లెటూరి ఆడపిల్లలకు వల వేసి.. పెళ్ళి చేసుకుని ఈ ఇంట్లో కాపురం పెడతాడు. నీకు ముందు వీడి మోసానికి నా చెల్లి బలైపోయింది. ఇదిగో ఇప్పుడు వీడు మాట్లాడిన మాటలకే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. తర్వాత వీడి వలలో నువ్వు పడ్డావ్! వీడిని నమ్మి ఈ సిటిలో బతకలేవ్ కానీ,మీ ఊరికి పోయి తల్లిదండ్రుల పంచన చేరుకో. నేనే తీసుకుని పోయి దిగబెడతాను రా!” 


ఆమె ఆలోచిస్తుంది. ఇక్కడే వుండి ఈ మోసగాడి పని పట్టాలా? లేక అభిమానం చంపుకుని అమ్మ నాన్న ని క్షమించమని వేడుకోవాలా అని.


“ఏమ్మా మాట్లాడవు” అని అడిగాడు అతను. 


ఇతని నుండి పారిపోతే నిన్ను నన్నూ కూడా బలహీనులమని అనుకుంటుంది లోకం. మనం బాధితులుగానో ఎస్కేపిస్ట్ లు లాగానో మిగలకూడదు. ఇతని అంతు చూడాల్సిందే!  దవడ పిడికిలి బిగించింది. ఇవేమి తెలియని పసిపిల్ల నిద్రలో చిద్విలాసంగా నవ్వుకుంటుంది. . 





కామెంట్‌లు లేవు: