అమ్మ మనసులో మాట -వనజ తాతినేని
గది గోడల నిండా డెస్క్ టాప్ పైనా
మొబైల్
స్క్రీన్ మీదా
అన్నింటా నీ చిత్తరువులే
నువ్వు దూరంగా ఉన్న విషయాన్ని
అనుక్షణం
గుర్తుచేస్తూ..
ఘడియ ఘడియకు
నీ స్నేహితుల రాక పోకలతో
సందడిగా ఉండే మన వీధి
గంటకొకసారి హడావుడి చేసే నీ బండి సడి
హోరెత్తించే సంగీతపు అలజడి
ఇవ్వన్ని లేని ఇల్లంతా నిశ్శబ్దంతో మూగబోయింది
నన్ను అకస్మాత్తుగా మూగదాన్ని చేసింది.
చిందరవందరగా ఉండే గది
ఇప్పుడద్దంలా మెరుస్తూ
నాకు బోలెడంత తీరిక ఇచ్చింది
ఎప్పుడూ నీకిష్టమైన వంటలే చేస్తూ
విసుక్కునే నాకు ఖాళీగా ఉన్నవంటపాత్రలే తోడిప్పుడు
నా మనసుని ఆవరించిన శూన్యం
దిగులుతో బరువెక్కిన జ్ఞాపకాన్ని
వెక్కిరిస్తుంది
ఎక్కడ అమ్మా అన్న పిలుపు విన్నా
ఒక్కసారిగా పేగు కదిలినట్లు ఉంటుంది
అమ్మా! అని నువ్వు
మార్దవంగా పిలిచినట్లే ఉంటుంది
ఇన్నాళ్లూ నా రెక్కల క్రిందనే పొదువుకుని
ఇప్పుడు రెక్కలు ఇచ్చి ఖండాంతరాలు దాటించాక
ఎన్ని మెయిళ్ళు ఎన్ని sms
లు నిరంతరం ప్రవహించినా
మన మధ్య ఉన్న దూరాన్ని నాటికల్ మైళ్ళ దూరంలో
కొలిచినంత తేలికగా చెప్పలేను కన్నా!
దృశ్య శ్రవణ పరికరాలకి లింకు
ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూస్తూ ఉంటాను
మూసపోతల విద్యాభ్యాసంతో విసిగి
ఉద్యోగ అన్వేషణలోవేసారిన
నీవు మనఃస్పూర్తి గానూ వెళ్ళలేదు
నేను ధనస్పూర్తితో
పంపనూ లేదు
నేటి యువతకిది జీవిత లక్ష్యం
వస్తుందా ఎప్పటికైనా ఒక నవీన మార్గం
మీ ఆలోచనలు కొత్త పుంతలు త్రొక్కి
శ్రమని మారకపు విలువతో లెక్కించి
మేధోసంపత్తి తరలి వెళుతుంటే
అడ్డుకోలేని
మరబొమ్మలం
వీర శివాజీలని పెంచి ఇవ్వలేకపోయిన అమ్మలం.
కడఊపిరి విడిచేవరకు
కంటి పాపను
కనురెప్పకాపాడినట్లు
బిడ్డకు అండ కావాలనే ఈ అమ్మ ఆశ
ఎందరో బిడ్డలకి దూరంగా ఉండాల్సి వచ్చిన
అమ్మలందరి మనసులో ఓమాట
3 కామెంట్‌లు:
అమ్మ మనసులో ఓ మాట... మీ కవిత బాగుందండి! మీ మదిలో మెదిలే భావాలకు ఎంత బాగా అక్షర రూపంలో చిత్రించారో!
"ఎక్కడ.. అమ్మా!... అన్న పిలుపు విన్నా ..
ఒక్కసారిగా పేగు కదిలినట్లు ఉంటుంది.."
.
.
"నాట్స్ మైళ్ళ దూరంలో..కొలిచినంత తేలికగా చెప్పలేను నాన్నా!
దృశ్య శ్రవణ పరికరాలకి లింకు..
ఎప్పుడు పడుతుందో ..
అని ఎదురు చూస్తూ ఉంటాను"
Hats off!!
వనజ గారు కలం వ్రాసిన
ప్రతి అమ్మ మనసు మాట ఇది.
తల్లికీ, బిడ్డకీ దూరం పెంచే
శ్రమ సంబంధాలలో మార్పులు రావాలి.
అందుకు అమ్మలు సైతం ఆలోచించాలి.
జిజియాబాయిలా అయినా, గోర్కీ అమ్మలా అయినా
అమ్మలలా వీరమాతలయితే మంచి సమాజం ఏర్పడడం మరెంతో దూరం లో ఉండదు.
మీ అబ్బాయికోసం వ్రాసినా సమాజానికి మంచి సందేశం ముఖ్యంగా తల్లులందరికీ ఇది ఓ సందేశమే.
Chaalaa baagundi...really heart ♥ touching:)
కామెంట్‌ను పోస్ట్ చేయండి