27, జులై 2012, శుక్రవారం

వస్త్ర దానం

ఈ రోజు నేను వస్త్రదానం చేసాను కానీ అసలు పైసా కూడా ఖర్చుకాలేదు.

ఇలా నేను ప్రతి రోజు వస్త్ర దానం చేస్తూనే ఉన్నాను. కానీ నాకు ఏమాత్రం ఖర్చు కావడం లేదు.

మన భారతీయుల సంస్కృతిలో ఒక భాగం దానం చేయడం ఆనే ఆనవాయితీ ఉండనే ఉంది. దానాలలో .ప్రతి దానం కి కూడా దేనికదే ప్రత్యేకత కల్గి ఉంది . అందుకే అన్ని దానాలు శ్రేష్టమైనవే !


మీ అందరికి నేను దానం చేయమని చెప్పబోయే దానం కి..మీకు కూడా నాకు లాగానే పైసా కూడా ఖర్చు కాదు.

ఆశ్చర్యపోకండి .. అది ఎలా అంటే..


మీ ఇంట్లో.. సూర్యోదయం తో పాటు పోటీపడి ముంగింట్లో పడే దిన పత్రికలు ఉన్నాయిగా..

సినిమాపేజీని చూడండి. కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటనలలో అందమైన అమ్మాయిలకి శరీరాలని దాచుకోవడానికి వస్త్రాలు కరువయ్యాయి అట.


పాపం వారిని చూస్తుంటే.. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు .. కృష్ణా..కృష్ణా..అని ద్రౌపది ఆక్రందనతో పిలుస్తున్నట్లు నాకు వినబడుతూ ఉంటుంది.


నేనేమో..వెంటనే కృష్ణావతారం లోకి పరకాయ ప్రవేశం చేసి.. వారికి అభయ హస్తం చూపించి వస్త్రదానం చేస్తుంటాను.


కాసేపు వారిని నిండైన భారతీయ వస్త్రధారణలో చూసుకుని మురిసి ముక్కలై ..దానం చేసినందువల్ల లభించిన సంతృప్తి తో. అలా కనులు మూసుకుంటాను


కాసేపటికి నాకల చెదిరిపోతుంది.


ఇదండీ పైసా ఖర్చు లేని వస్త్రదానం .

ఇంటిల్లపాది చదివే వార్తాపత్రికలలో.. స్త్రీలకి సంబంధించింది అని చెప్పు కునే పేజీలలో.. మీరు సన్న బడాలను కుంటున్నారా ? ఫలానా హెర్బల్ టీ తాగండి.


మీరు సన్నగా ఉన్నామని బాధ పడుతున్నారా? పలానా లేహ్యం తినండి.


మీ జుట్టు ఊడిపోతుందా? పలానా చోట ట్రీట్మెంట్ తీసుకోండి. గంటలో బట్ట తల మీద వెంట్రుకలు మొలిపించడం సాధ్యం అంటారు.

అబ్బబ్బా. ఏది నమ్మి చావాలి.?. పత్రికలో వచ్చే వార్తలలోనే విశ్వసనీయత ఉండదు. ఇక ప్రకటనలలో ఏ పాటిదో..మనకి తెలియదా..?


సినిమా పేజీలలో ఒక నలుగురు అందగత్తెలకు తక్కువ కాకుండా దేవతా వస్త్రాలకు కొంచెం తక్కువగా ప్రేక్షకుడి కంటే ముందు పాఠకుడి మతి పోగొడతాయి.


అందుకనేమో..మా ఇంటి ప్రక్కన ఉన్న ఒక అమ్మాయి .. ఉదయం లేచి లేవగానే పేపర్ వాళ్ళాయన చూడకముందే ... తాను చూసిన .. అశ్లీల చిత్రాలకు స్కెచ్ పెన్ తో వస్త్ర దానం చేసి ప్రశాంతంగా పేపర్ పక్కన పెట్టి రోజు వారి కార్యక్రమాలను చేసుకోవటానికి రెడీ అవుతుంటుంది. అలాగే వీక్లీస్ లో అమ్మాయిల చిత్రాలని చూసినా అలాగే చేస్తుంటుంది.


అది ఒక మానసిక వ్యాది అని అనుకోవచ్చునేమో.. కానీ.. అలాటి అశ్లీల చిత్రాలు ప్రచురించే పత్రికల వారికి కనీస బాధ్యత లోపించిన విషయం సుస్పష్టంగా అయితే కనబడుతుంది కదా!


నాకు మాత్రమే కాదు..ఇలాంటి ప్రకటనలు చూసినప్పుడు కొందరికైనా ఒక ఇరిటేషన్ అనేది ఏర్పడుతుందేమో..అని ఆలోచిస్తూ... ఉంటాను.


ఈ రోజు దినపత్రికలో విడుదల కాబోయే రెండు చిత్రాలకి సంబంధించిన ప్రకటనలు చూసి. నాకు తక్షణం వస్త్రదానం చేయాలనే కోరిక గల్గింది.


ఆఖరిగా ఒక మాట.. ఒక తెలుగు హీరొయిన్ గురించి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఒక మాట అంది.


"ఆ హీరొయిన్ బట్టలు కట్టినా, కట్టకపోయినా..నిర్మాతకి తడిసిమోపెడయ్యే ఖర్చు మాత్రం ఖాయం." అని


నిజమే కదా!

అదండీ .. విషయం.

12 కామెంట్‌లు:

రవిశేఖర్ హృ(మ)ది లో చెప్పారు...

మీరు చెప్పిన అంశం నిత్యం అందరు అనుభవిస్తున్నదే!దానికి మీ పరిష్కారం చాలా విభిన్నంగా ఉంది.అందరు దీనిని ఆచరించి ఆ దృశ్యాల బారినుండి చిన్నపిల్లలను రక్షించాలి.

జలతారు వెన్నెల చెప్పారు...

I like your vastradaanam concept vanaja gaaru

జీడిపప్పు చెప్పారు...

LOLL హెడ్డింగ్ చూసి ఏదో సామాజిక సేవ అనుకున్నా. స్వాతిలాంటి సకుటుంబ సపరివార బూతుపత్రికలో అయినా పర్లేదు కానీ న్యూస్‌పేపర్లలో కూడా కళామందిర్ వ్యాంపులు దర్శనమిస్తుంటే.. హతవిధీ!!

అన్నట్టు నిజజీవితంలో ఒంటికి అతుక్కుపోయే పొట్టి డ్రస్సులేసుకొనే అమ్మాయిలు, బెత్తెడు బ్లౌజు, లో-హిప్ చీరల ఆంటీలకు ఏమి దానం చేస్తారేంటి :)

http://100telugublogs.blogspot.com

.

అజ్ఞాత చెప్పారు...

:)

శ్రీ చెప్పారు...

ఎక్కడో జోక్ చదివాను వనజ గారూ!
హీరోయిన్ బట్టలకి రిబ్బన్లు తెప్పించాదట నిర్మాత...:-)
చిత్రాలకి వస్త్రదానం కాన్సెప్ట్ బాగుంది...
అందుకే కుటుంబమంతా కలిసి చూసేలా ఉండటం లేదు ఇప్పటి సినిమాలు...
మంచి పోస్ట్...
@శ్రీ

Praveen Mandangi చెప్పారు...

నేను కూడా టైటిల్ చూసి అలాగే అనుకున్నాను "పాత బట్టలు పని మనుషులకి ఇచ్చెయ్యడం" అని. చిన్న పిల్లల చేత అర్థ నగ్న దుస్తులు వెయ్యించి డాన్స్‌లు చెయ్యించే 'ఆట‌' కార్యక్రమం మా ఇంటిలో నేను తప్ప ఇతరులు సకుటుంబ సమేతంగా చూసేవాళ్ళు. విచిత్రమేమిటంటే మన కుటుంబాలలో స్త్రీలెవరికీ అలాంటి దుస్తులు వేసుకునే ధైర్యం ఉండదు. కానీ సినిమాలలో నటీమణులు అలాంటి దుస్తులు వేసుకుంటే ఇది కల్చర్ అని justification ఇచ్చుకుంటారు.

స్వాతి పత్రిక గురించి జీడపప్పు గారు మాట్లాడారు కాబట్టి చెపుతున్నాను. స్వాతి పత్రిక అభిమానులు చెప్పేదేమిటంటే "స్వాతి పత్రిక వల్ల మధ్య తరగతివాళ్ళకి సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడే ధైర్యం వచ్చేసిందట, ఇది శుభ పరిణామమట!" వాళ్ళు చెప్పినది ఎంత వరకు నిజమో తెలుసుకోవడానికి నేను కొన్ని సార్లు నలుగురు చూస్తుండగా సెక్స్ గురించి మాట్లాడాను. కొంత మంది తిట్టారు, కొంత మంది నవ్వుకున్నారు. సమరం గారి సలహాల పేజ్‌లో ఒకడు తాను తన మేనత్త వరసైన ఆవిడని కలిసాను అని వ్రాస్తే ఆసక్తిగా చదివేస్తారు. కానీ నిజ జీవితంలో ఎవడైనా అలా మాట్లాడితే నవ్వుతారు. ఇదంతా చూస్తోంటే నేను భూమి మీదే ఉన్నానా లేదా ఇంకో లోకంలో ఉన్నానా అనే డైలెమా (ఏమీ అర్థం కాని స్థితి) కలుగుతోంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

వనజవనమాలి గారూ మీ ఆలోచన బాగుందండీ..

Praveen Mandangi చెప్పారు...

టైటిల్ "వస్త్ర త్యాగం" అని పెట్టాల్సింది. ఎందుకంటే "దానం" అంటే ఇవ్వడం అని అర్థం. "త్యాగం" అంటే వదులుకోవడం అని అర్థం. ఐదు లక్షల పారితోషికం కోసం ఐదు వందల రూపాయల చీర త్యాగం చేస్తారు కదా మన నటీమణులు.

Praveen Mandangi చెప్పారు...

స్కెచ్ అంటే స్కెచ్‌పెన్ అనా, నేను ఏదో అనుకున్నాను. అందుకే ఆ అమ్మాయి కూడా వస్త్రాలు విప్పుతోందేమో అనిపించి అదేమిటి అనే సందేహం వచ్చింది.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రవి శేఖర్ గారు..మీ స్పందనకి ధన్యవాదములు.
మనలో కొంతమంది అయినా.. వార్తాపత్రికల దృష్టికి ఈ విషయం తీసుకుని వెళితే బాగుంటుంది .
@జలతారు వెన్నెల గారు .. :) థాంక్ యు !
@ జీడిపప్పు గారు..LOL భలే చిక్కు ప్రశ్న వేసారండి..:)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

కష్టేఫలె గారు ధన్యవాదములు.
@ శ్రీనివాస్ (శ్రీ)గారు.. మీరు చెప్పిన విషయం తో ఏకీభవిస్తున్నాను.:) థాంక్ యు!!
@ ప్రవీణ్ గారు మీ అభిప్రాయానికి చాలా చాలా ధన్యవాదములు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

రాజీ గారు.. ధన్యవాదములు..