వన్య - వనజ తాతినేని #sketch
ఓయ్.. వన్య! వన్య!! ఎక్కడ వున్నావోయ్
పలకవేల? అసలే మా నగరం విశాలమైనదే కాకుండా రేయంబవళ్ళు రద్దీగా వుంటుంది. జాగ్రత్త!!
ఈ రణగొణ ధ్వనుల మధ్య నా పిలుపు వినబడుతుందా?
ఈ మౌనమేల, పోనీ కోపమా!
అతిధి సత్కారాలు బాగా చేయలేదేమో నన్న నింద నాపై పడనీయకోయ్
మధువును సిద్ధపరిచాను. ఆరగించడమే ఆలస్యం కరుణించి కనబడవోయ్..
*********
ఏటి గట్టున పచార్లు చేస్తున్నావా లేక
లంక భూముల్లో నిత్యం విరబూసే పూల తోటల్లో సంచారం చేస్తున్నావా?
నావ నెక్కి షికారు కొడుతున్న కొత్త దంపతుల సరాగాలను చూస్తూ
సిగ్గులొలుకుతూ అక్కడే ముడుచుకుపోయావా?
నది మధ్య వల వేసి నింపాదిగా రేడియోలో జనరంజని
పాటలు వింటూన్న జాలరికి సహ శ్రోతవి అయ్యావా? కాస్త ముందుకెళ్ళి
ఇసుక తిన్నెలపై పవళించి విలాసంగా వేణువు ఊదుకుంటున్న మువ్వ గోపాలుడిని చూసి వచ్చావా?
నది వొడ్డున బండరాయిపై కూర్చుని కూనిరాగాలు తీస్తున్న పడుచుపిల్ల గుండెగదిలో ఎవరున్నారో తొంగిచూస్తున్నావా? తీరంలోని తడి ఇసుకపై ఆమె చేస్తున్న కూచిపూడి నృత్యం వీక్షించావా?
ఆ పదాభినయనం నిను ఆకట్టుకుందా? మీ బ్యాలెట్ పోలె అంత బాగుందా?
ఎలాగు పుష్యంలోనే వచ్చావు గనుక నీకు నమ్మకం వున్నా లేకపోయినా కాస్త పుణ్యం మూటగట్టుకోవడానికి మా ఆంధ్ర మహా విష్ణువుని దర్శించి రాకపోయేవా?
మా రాయలు రచించిన ఆముక్తమాల్యద కావ్యానికి ప్రేరణ నిచ్చిన తావును చూసొచ్చావా? చూసింది చాల్లెద్దూ అనుకుంటూ..
వెనక్కి వస్తూంటే మా పచ్చని పొలాలపై వీచే మంద్రమైన గాలి నిన్ను సేదదీర్చే వుంటుందిలే!
*****************
నగర సంచారం చేసి అలసిపోయి నది ఒడ్డుకు చేరావా మళ్ళీ?
సరిగంగ స్నానాలు చేసి నీలాల కురుల నుండి ముత్యాలు జారుతుండగా రాయంచలా నడిచి వెళుతున్న ఆమెను చూసి విభ్రమ చెందావా?
రివ్వున ముందుకు పరుగులు తీసి వెనుదిరిగి చూసావా!
ముఖానికి పచ్చని పచ్చి పసుపు పూసుకుని నుదుటిపై యెర్రని కుంకుమ దిద్దుకున్న నడి వయసు స్త్రీ సౌందర్యాన్ని కాంచి మూర్ఛపోయావా?
ఆమె పెదవుల మధ్య విరిసిన చందమామ తునక లాంటి
దరహాసాన్ని చూసాకైనా నీ సౌందర్యదాహం శాంతించిందా?
ఆమె ముందు మోకరిల్లాలనిపించిందా లేదా?
పోనీ…అరకన్నులతో సిరివెన్నెల కురిపిస్తూ పరామర్శించిన
ఆయననైనా గుర్తు పట్టావా లేదా? అదిగో కనబడే ఆ కొండైనా విజయుడి విల్లంబులపొదిలో చేరిన పాశుపతాస్త్రం కథ చెప్పలేదా?
అయ్యయ్యో! ఊపిరాడనీయకుండా ఇన్ని ప్రశ్నలు వేసి విసిగించానా?
మన్నించు సఖీ! త్వరగా ఇంటికి వచ్చేయ్!
*************
ఎక్కడో ఓల్గా తీరం నుండి మా కృష్ణా తీరానికి అతిధిగా విచ్చేసావు.
మా నగరం తన అందాలతో నీకు కనువిందు చేసిందా?
ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదా?
సౌందర్యం ఏ ఒక్కరి సొంతం కాదని.
ఏటవతలకు వెళ్ళి నీకొక కానుక తెచ్చి వుంచాను.
అది ఏమిటా అనుకుంటున్నావా?
అందమైన మంగళగిరి జరీ చీర పట్టుకొచ్చానోయ్,
కట్టుకోవూ… సింగారించుకుని నాకు చూపియ్యవూ
మధువు విందు చాలులే, నా కెందుకీ చీరలు? అని విసుక్కుంటున్నావా?
నా ఒళ్ళంతా రంగు రంగుల చీరలు. ఏ నేతకాడు నేయలేని అందమైన చీరలు
నా చీరల రంగులను రేఖలను దొంగిలించడం మీ మానవులకు అలవాటు కదా!
నేను వెళ్ళొస్తా .. ఎప్పుడైనా మనసైతే మళ్ళీ వస్తా,
నాకసలే చిత్తచాపల్యం అని నీకు తెలుసుగా! బై.
ఇష్ట సఖి! వన్య…. వన్య ఇంకొన్నాళ్ళు వుండవూ! ప్లీజ్!!
బతిమాలుతూ వుండగా మెలుకువ వచ్చేసింది. 😊❤️
*****************
*వన్య అంటే రష్యన్ భాష లో సీతాకోకచిలుక
*బ్యాలెట్ పోలె రష్యన్ నృత్యాలు. .


కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి