31, జనవరి 2026, శనివారం

నీవూ నేనూ ఊహల్లో…

 



నీవూ నేనూ ఊహల్లో..     - వనజ తాతినేని. 


నీ కథలో నువ్వు శ్రీరామ చంద్రుడివి

నా కథలో నేను జానకి ని

నా కథలో నువ్వు లేవు

నీ కథలోనూ నేను లేను

మన ఇరువురి కథలూ కలిసింది లేదు.


మనమిద్దరం ఆ ఒడ్డున ఒకరు ఈ ఒడ్డున ఒకరు కూర్చుని.. 

ఇద్దరు బాల్యస్నేహితుల్లా ఖాళీ అగ్గిపెట్టెలకు 

దారం వాహకంగా చేసుకుని సరదాగా కబుర్లు విరజిమ్ముకుంటాం.

నదిపై రహస్యంగా అనుబంధపు వంతెన నిర్మించుకుంటాం.

మనని చూసి మన పిల్లలు హాయిగా నవ్వుకుంటారు. 

వారి మానసిక కుటుంబంలో మనకి కొత్త సభ్యత్వం ఇచ్చేస్తారు. 


జీవితాన్ని మధించగా వచ్చిన హాలాహలం మింగిన వాళ్ళం 

అమృతం కోసం ఎదురు చూస్తామా? 

భూమిని గునపాలతో తవ్వి పోసినప్పుడు కనబడని

లంకె బిందెలు అంజనం వేసి చూస్తే కనబడతాయనుకుంటామా? 

చంద్రుని వెన్నెల కిరణాలు చంద్రకాంతి శిలలను కరిగిస్తాయని 

గుడ్డిగా నమ్ముతామో కానీ చాపల్యంతో రేగుపండ్ల కోసం 

వెలగా మంచి ముత్యాలు వొదులుకుంటామా? 

నిరంతరం ఇతరులను మెప్పించడానికి చేసే ప్రయత్నం లో.. 

మనకు మనంగా ఏం మిగులుతున్నామని? లెక్కలు తేలవు

తమస్సు ఉషస్సు భేదం తెలియని బధిరులం కాము

ఎందుకీ.. వృధా ప్రయాస అని కూడా అనుకోము.


మర్యాదల సరిహద్దులు దాట లేని

నేనొక మెటానోయా   (Metanoia)

నువ్వొక ఐసోలోఫిలియా(Isolophilia)

తోడు నీడ అర్థాలు మారిపోతున్న కాలం ఇది.

అయినా.. ఏదో విముఖత మరేదో కొత్త ఆశ. 

తెగనీయక, ముడి పడనీయక, కనుమరుగుగాక.


మన మధ్య 

ఆఖరి చూపు ఆఖరి మాట ప్రాప్తం వుంటాయో లేదో! 

ఏదో ఒకనాడు శక్తి ఉడిగి గుండె ఆగి  కళేబరం శిథిలమైపోతుంది.

ఎప్పుడో.. తెలిసాక ఏం చేయగలం చెప్పు? 

నాలుగునాళ్ళు కన్నీరు కార్చడం తప్ప. 


మన జీవయాత్ర ముగిసే లోగా..  

హృదయ కవాటాల్లోకి వెలుగుల్ని వెదజల్లిన మాటలు

గుండె గొంతుకను కోటి గొంతులు చేసి వినిపించిన పాటలన్నీ 

మూగబోకముందే.. ఇదే ఆఖరి లేఖ అన్నంత ఇదిగా 

 అనేక సంగతులతో నాలుగు ఉత్తరాలు  రాసుకుందాం.

రహస్యంగా రాసుకుని పోస్ట్ చేయని లేఖలు

చేరవలిసిన చోటుకు చేరకుండానే పెట్టెలోనో రహస్యపు అరల్లోనో దాగి 

అటుపిమ్మట ముక్కలై పోవడం ఏం బావుంటుంది చెప్పు? 


నేనేమో మాక్సీం గోర్కీ రాసిన ప్రణయ పత్రాలు కథలో “టెరెసా” లా కాకుండా

నువ్వేమో ఎడ్మండ్ జలో రాసిన ఆఖరి ఉత్తరం లోని “డేనియల్” లా కాకుండా

మనసంతా విప్పి ప్రేమ లేఖలు రాసుకుందాం. 

తప్పకుండా మనదాకా చేరేదాక జాగ్రత్తలు తీసుకుందాం.

ప్రతిరోజూ నాలుగు ముద్దలు రసానుభూతి అన్నాన్ని భుజిద్దాం.

బతుకు తీపి పంచుకుందాం. 


ఒక లేఖ లో …

రావోయ్, నా కనురెప్ప మాటుగా కలలో జీవించి పో అంటాన్నేను. 

నువ్వు ఇరవై ఏళ్ల కోడెకారు పిల్లాడివి అయిపోతావ్.  

నువ్వేమో, రా.. పిల్లా!  నా గుండె కింద నవ్వులు రువ్వుతూ అల్లరి చేసిపో! 

అనడంలో  నేను పదహారేళ్ళ పడుచు పిల్లని అయిపోతాను. 

.  

మరో  ప్రేమ పత్రంలో   

వానకి తడుస్తున్న పక్షి పిల్లను తల్లి రెక్కతో జవురుకుని 

డొక్కలోకి పొదువుకున్నట్టు నన్ను నీ హృదయంలోకి పొదువుకుంటావు.

నేనేమో.. నా ఒడిలో నీ తలని వుంచుకుని 

సుతి మెత్తగా మర్దన చేస్తూ జోల పాట పాడతాను.

అలా ఊహల్లో లేఖల్లో జీవిద్దాం. 

కాలానికి కాస్త కవిత్వాన్ని బహుకరించి పోదాము. 

దృశ్యం అంతా …నీవూ నేనూ ఊహల్లో..

గాలికి ఊగుతున్న  గుత్తుల గులాబీలా వుంది కదా! 

రాయడం ప్రారంభించు, ఎదురుచూపు గుమ్మానికి వ్రేలాడదీసెను.

 

***********************End***********************


పుట్ నోట్స్.. *ఐసోలోఫిలియా (Isolophilia) *మెటానోయా (Metanoia) ఎడ్మండ్ జలో (ఫ్రెంచ్ రచయిత) రాసిన “ఆఖరి ఉత్తరం” కథ. మాక్సీం గోర్కీ రాసిన “Her Lover” ప్రణయ పత్రాలు కథ.




 





30, జనవరి 2026, శుక్రవారం

మాట విలువ

 


ఇలా నిండా పూచిన మామిడి చెట్టును చూడగానే… “మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే! మాటలు రాని మూగ మనసు పాడెనులే” అనే పాట అప్రయత్నంగా గుర్తుకొస్తుంది. 

లోకంలో సుందరమైన విషయాలు చాలా వున్నాయి. 

అందులో నిజాయితీ గా నిరాడంబరంగా పలికే మాటలు కూడా ఒకటి. ఆ మాటలు పక్షుల పాటల వలె హృదయం నుండి దుముకుతాయి. ఆ మాటల్లో అర్థం కాని క్లిష్టత గాయ పరిచే వాడితనం వుండకూడదు. మాట సొబగులు అద్దుకున్నంత మాత్రాన అందంగా వుండదు. మన పెదవుల నుండి మన భావనల నుండి వెలువడే మాట, రాసే విషయం వివేకంతో నియంత్రించబడాలి. అప్పుడే ఆ మాటలను పలికే పెదవులు, రాసే వ్రాతలు అందంగా అనిపిస్తాయి. 

మాటలు వచ్చినంత మాత్రాన సరికాదు. ఆ మాటకు మృదుత్వం ముఖ్యం. మనం వేటగాళ్ళం కాదు. ఎప్పుడూ మాట అనే  బాణాలతో  ఇతరులను గాయపరచడానికి. 

గాయబడితే మనుషులు దూరంగా జరుగుతారు. నటించడం వేరు స్వభావం వేరు. రెండింటిని ఎదుటివారు గుర్తించగలరు. 

నా దృష్టిలో అందమైన పెదవులు అంటే సదా చిరునవ్వులు చిందించే లిప్ స్టిక్ వేసుకున్న పెదవులు కాదు. అందంగా వుండి ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడే పెదవులు కాదు. హృదయపూర్వకంగా మాట్లాడే మాటలు, మాటలో మృదుత్వం ధ్వనించే మాటలు, ఉచ్చరించే పెదవులు. 

మాటలు రావడమే యోగ్యతా కాదు. బాగా రాయగలమని విర్రవీగడం యోగ్యతా కాదు. 

ప్రకటనాశక్తి ఒక యోగం. అది అందరికీ సంప్రాప్తించదు. దానిని సరైనరీతిలో ప్రదర్శించడం మర్చిపోవద్దు. 

శుభోదయం మిత్రులారా!

29, జనవరి 2026, గురువారం

నువ్వు వస్తావని




 నువ్వు వస్తావని.. -వనజ తాతినేని 

#sketch

నువ్వు వచ్చే ముందే సూచనలిస్తావ్ 

పోలీస్ వేస్ వచ్చే ముందు అలర్ట్ హారన్ వినిపించినట్లు. 

వందకుపైగా నారింజ వయెలెట్ కలనేత రంగుల పరాదాల మధ్య నుండి పైపైకి తేలుతూ వస్తుంటావ్ కదా! అసలు మానవులకు రంగులను కలలను పరిచయం చేసింది నువ్వే కదూ! నువ్వంటే నాకు చాలా ఇష్టం. రోజూ వచ్చే వాడే కదా! ఏం ప్రత్యేకత ఉంటుంది నీ చాదస్తం కాకపోతే అనే వెక్కిరింపుల మధ్య నిన్ను కన్నార్పకుండా అబ్బురంగా చూస్తూ ఉంటాను. నువ్వో చైతన్యం. మహోజ్వలంగా వెలుగుతూ ప్రాణులకు శక్తిని ప్రసాదించే విశ్వ మిత్రుడివి. నిను ఆరాధించని వారెవరని!?


అందుకే.. నీ ప్రతి రాకను నేనొక ఉత్సవం చేయాలని కాచుకొని కూర్చుంటాను. ఇనుడా! 

నువ్వు దట్టమైన అరణ్యాల దారుల నుండి సంగీత కచేరీల మధ్య అడవి పువ్వులు వికసించినట్టు వస్తావా లేక జనారణ్యంలో శబ్ద కాలుష్యం మధ్య మసకల ముసుగు వేసుకుని వస్తావో 

లేక పచ్చని పంట చేల మీదుగా బంగారురంగు కాంతిని వెదజల్లుతూ వస్తావో..

ఎడారి ఇసుక తిన్నెలపై ఎర్రగా పెళ పెళ లాడుతూ వస్తావో.. 

లేక బూడిద రంగు నల్లరంగు మబ్బుల మధ్య దోబూచులాడుతూ వస్తావో నాకెలా తెలుస్తుంది 

నిన్ను వర్ణించడానికి కాగితం కలం పట్టుకుని తయారుగా వుంటాను. 

కాలుగాలిన పిల్లి లా ఇంట్లోకి బయటకి తిరుగుతూ వుంటాను. మిష్టర్ సూర్యా! 

ఇంకా రావేమిటి? ఉష కౌగిలి నుండి బయటపడి త్వరగా రావయ్యా!

ఇక్కడ  మంచుతెరల మధ్య చల్లగాలిలో  వణికిపోతున్నాయి ప్రాణులు అని పదేపదే విసుక్కుంటాను. 

నా పిచ్చి కానీ నేనెంత మొత్తుకున్నా నువ్వు రావాలనుకున్న  సమయానికే వస్తావ్

 పసుపు పచ్చని చట్రంలో నారింజ రంగుబంతిలా ముద్దొచ్చే నిన్ను నిలువు గా తీయాలా అడ్డంగా  బంధించాలా.. 

సినిమాటిక్ లో తీస్తే బాగుంటావా.. 

పానో మోడ్ లో బాగుంటావా

ఎక్స్ పోజర్ తగ్గించాలా పెంచాలా 

మాములు వీడియో చాలా? స్టాండర్డ్ చిత్రం సరిపోతుందా? 

ఏమిటో, గజిబిజి ఆలోచనలు. నేను ఇలా తికమకపడుతుంటే నువ్వు గుంభనంగా నవ్వుకుంటూ.. పైకి పైకి పోతూ వుంటావు. 

సరే.. ఇవాళంటే తప్పించుకున్నావ్ రవీ!  రేపు ఎక్కడికి పోతావ్ నాకు చిక్కకపోతావా? అయినా ప్రయత్నిస్తే..

సాయంత్రం చెరువులో నారింజ ఎరుపు కలగలిసిన వర్ణంలో చిక్కుతావ్ లే ఆర్కుడా! 

నీలాకాశంలో నుండి మా ఊరి పసుపుతోటల మధ్య నెమ్మదిగా కుంగుతూ రంగులన్నీ మూటలు గట్టుకుని దొంగిలించుకుని పోయి ఛాయ కు ఇస్తావ్..లే! నాకు తెలుసులే! పో.. నువ్వు లేకపోతే నాకేం బెంగ లేదు. 

నేను చీకటితో  కూడా సావాసం చేస్తుంటాను. ఆ విషయమేమిటో నీకు చెప్పాలా!? 

చెప్పను పో!  చీకటితోనే చెబుతా!

నీ పగటి కథలన్నింటినీ  రాత్రి పొతికలో దాచి పెట్టి వుంచుతాను. 

ఎప్పుడో నా మూడ్ బావున్నప్పుడు వినిపిస్తాను సరేనా! కొందరికి వీడ్కోలు చెప్పలేం, నీక్కూడా! 

మళ్ళీ రేపొక కొత్త కథ సిద్ధం చేసి వుంచుతాను.. వినడానికి తయారుగా వుండు. లవ్ యూ మిత్రమా! 🌅🎈🙏

28, జనవరి 2026, బుధవారం

Don’t Shoot a message

 Don’t Shoot me a message.. 


బాధాకరమైనప్పటికీ ఇది నిజం

విషయం నొప్పి కలిగించేది అయినప్పటికీ 

నిజం ఇదే! 

అవును , నువ్వు నాకు ప్రియమైన వ్యక్తి వే! 

కానీ ఎక్కడ నిలుచుండి పోవాలో కూడా 

నాకు బాగా తెలుసు.

నా స్థానం, నా పరిమితులు, నేను దాటకూడని 

హద్దులు యేమిటో కూడా నాకు తెలుసు.

అందుకే నేను నిన్ను వెంబడించను,

నా భావాలతో నిన్ను ఇబ్బంది పెట్టను, 

నీపై నన్ను గురించిన ఆలోచనా భారం మోపను.

కేవలం దూరం నుండి చూస్తూ నిశ్శబ్దంగా  ఆరాధిస్తాను.

బహుశా ఏదో ఒక రోజు ఈ భావాలు 

మసకబారిపోవచ్చు, పోకపోవచ్చు కూడా!

కానీ ప్రస్తుతానికి… 

ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా 

నా హృదయాన్ని భావాలను అనుభూతి 

చెందడానికి అనుమతిస్తాను

బాధాకరమైనది అయినప్పటికీ ఇది నిజం. .



26, జనవరి 2026, సోమవారం

ఆకాశం దించాలా..

 చిత్రం :  భక్త కన్నప్ప (1976)

సంగీతం :  ఆదినారాయణరావు/సత్యం

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల

పల్లవి:

ఆకాశం దించాలా.. నెలవంక తుంచాలా  సిగలో ఉంచాలా... ఆ... 

ఆకాశం దించాలా.. నెలవంక తుంచాలా  సిగలో ఉంచాలా... ఆ... 

(ఈ ఆకాశం దించడం అనేది పురుషుల ఊతపదం అనుకుంటా, పైగా నెలవంక తుంచలా సిగలో ఉంచాలా అని కూడా అడుగుతారు. అరవీర శూరులు మన చలన చిత్ర హీరోలు. వారికి తగినట్టు రాసే.. మన తెలుగు గీత రచయితలు మాత్రమే కాదండీ.. ఈ మధ్య ఆంగ్ల కవిత్వంలో చదివాను. ఆ కవి ఏమన్నాడంటే … ఆ గిరులను తరులను తవ్వి తెచ్చి నీ కొప్పు చుట్టూ ఉంచుతాను అంటాడు. ఓరి నీ… ఇనుప లవ్వు పాడుగాను అని నవ్వుకున్నాను.)

ఆమె: చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు సాలు

ఆకాశం నా నడుము.. నెలవంక నా నుదురు సిగలో నువ్వేరా... ఆ... ఆ…

(పాపం! కథా నాయికకు తెలుసు, అందుకే ఇలా అంటుంది. నా చెక్కిలి నువ్వు పట్టుకున్నప్పుడు కల్గిన గిలిగింత చాలు. ఆ ఆకాశం నా నడుము(ఇక్కడ దర్శకుడు బాపు గారు హీరోయిన్  నడుముని  విల్లులా వంచేసాడు. నెలవంక ఏమో నా నుదురు, సిగలో రహస్యంగా తురిమింది నిన్నే కదా అంటుంది.)

చరణం 1:

పట్టుతేనె తెమ్మంటే  చెట్టెక్కి తెస్తానే... తెస్తానే...

మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే... తీస్తానే…

(అంటాడు కోయ వీరుడు.. కానీ నాయిక దయ గలది గావున ఇలా అంటుంది.)

ఆ... పట్టుతేనె నీకన్నా  తియ్యంగా వుంటుందా..

మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా… 

అని. 

అ: అంతేనా అంతేనా…

(అని అంటాడు గొప్పగా తెస్తానని  చెప్పినవన్నీ తేవడం తప్పిపోయినందుకు లోలోన సంతోషపడుతూ.)

అవును అంతేరా... ఆ...

ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా... ఆ... 

ఆకాశం అంచుల్లో. భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా... ఆ... 

(అకాశం అంచుల్లో  భూదేవి ఎప్పటికీ కలవదు. కలిసినట్టు కనబడతాయి. Optical illusion.  అవి క్షితిజ సమాంతర రేఖలు. కానీ కవుల కల్పనలో ఆకాశాన్ని భూమిని కలిపేసి కౌగిట్లో కరిగించేసారు.) 

చరణం 2:

అ: సూరీడు ఎర్రదనం సిందూరం చేస్తానే... చేస్తానే...

కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే... దిద్దేనే…

(నాలుగు బాణాలు వేసి ఆమెని కదలకుండా చేసాననుకుని మరీ కోతలు కోసేసాడు. సూరీడు ని నుదుట బొట్టుని చేస్తానన్నాడు. కరిమబ్బు నల్లదనం తెచ్చి కాటుకగా పెడతానన్నాడు.)

(ఆమె అంటుంది.. ఓ అబ్బాయ్, ఇదిగో నిన్నే.. అవన్నీ ఏం  వద్దులే, నువ్వు సింధూరం  తెద్దామని అక్కడికి ఎగిరేలోపు అది తెల్లగా విభూది అయిపోతుంది. కరిమబ్బుని బాణంతో గురి చూసి కొట్టినా నీరే కారుతుంది కానీ కాటుక రాదు. నా అలంకరణ సంగతి నే చూసుకుంటాలే కానీ)

ఆ... నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూరీడు

నీ కంటి చల్లదనం  నా నీడ నా గూడూ

(నన్నేలుకునే సూరీడా! ఇలా వచ్చి నన్ను హత్తుకో   నీ ఒంటి వెచ్చదనమే చాలు.నా నీడగా గూడుగా  వుండే నువ్వు నెమ్మదిగా సంతోషంగా చల్లగా  వుంటే చాలు. నేను చల్లగా వుంటాను అంటుంది. ఆలుమగలు ఇద్దరూ అవసరమైనప్పుడు కుంపటి పక్కన వున్నట్టు వుండాలి, చల్లని పందిరి కిందా వుండట్టు ఉండాలి. అంతే కదా.. )

అంతేనా అంతేనా…

(అంటున్నాడు అతగాడు ఏమీ ఎరగనట్టు.)

అవును అంతేరా... ఆ…

(అంటుంది ఆమె. ఓ ప్రేమికా! నీకు అన్నీ తెలిసికూడా ఆ అమాయకత్వం ప్రదర్శించడం ఏమిటి? ఆ సంగతి నీకు తెలుసునని నాకు తెలియదనుకున్నావా ఏమిటి? అనుకుంటుంది మనసులో  నవ్వుకుంటూ.)

అ: మెరిసేటి చుక్కల్నీ మెడలోన చుట్టాలా

తలంబ్రాలు పొయ్యాలా...ఆ…

(మళ్ళీ పైత్యకారు  మొదలెట్టాడు. మెరిసేటి చుక్కలని తెచ్చి నక్షత్ర హారం చేసి మెడకి పెట్టాలా లేక  తలంబ్రాలు పొయ్యాలా.. అని అడుగుతాడు.) 

ఆ: గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు

(అవేమీ వద్దు , నీ గుండెలో గువ్వలాగా నేను కాపురం వుంటే చాలు లే అంటుంది.)

ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా

కౌగిట్లో కరిగేరా... ఆ…

నేనైతే ఏమంటానంటే..  నువ్వు చెట్టెక్కి పడ్డావంటే.. ఏ కాలో చెయ్యో విరిగితే నేను సేవలు చేయలేను అందును. తేనె తింటే నాకు ఎలర్జీ వల్ల ముక్కు ధారాపాతం కాబట్టి అంత శ్రమ వద్దులే, మానుకో . ఇక  మిన్నాగు మణి వుంటదో లేదో తెలియదు కానీ పుట్ట తొవ్వితే పాములు బయటకు వస్తాయి, నాకు పాములంటే చచ్చే భయం, వద్దులే అందును… ఇలా పాటంతటికి కామెంట్ రాయాలి. కానీ వద్దు. మరీ వాచ్యంగా వుంటుంది. హ హ హ హ 🤣🤣😇

పాట వింటూ ఎంజాయ్ చేయండి. శుభరాత్రి. 🎧🎧🎧






25, జనవరి 2026, ఆదివారం

కొత్త కవిత ..

 నా కొత్త కవిత  “నీవూ నేనూ ఊహల్లో”  

ది ఫెడరల్ తెలంగాణ డాట్ కమ్ లో 

ఆదివారం మేటి కవిత గా ప్రచురితం. 

తప్పకుండా చూడండి. ఎడిటర్ గారికి ధన్యవాదాలు 🙏

ఈ కవిత లో ఉదహరించిన అంశాలకి 

పుట్ నోట్స్.. 

*ఐసోలోఫిలియా (Isolophilia) 

*మెటానోయా (Metanoia)

ఎడ్మండ్ జలో  (ఫ్రెంచ్ రచయిత) రాసిన “ఆఖరి ఉత్తరం” కథ. 

మాక్సీం గోర్కీ రాసిన “Her Lover” ప్రణయ పత్రాలు  కథ. 

ఈ లింక్ లో  కవిత చదవండీ.      నీవూ నేనూ ఊహల్లో

#వనజతాతినేని #vanajatatineni  #hilights #follower #poetry #thefedaraltelangana


24, జనవరి 2026, శనివారం

గాయాల గానం




గాయాల గానం   - వనజ తాతినేని.


ఇవాళ దుఃఖం పలుకరించింది. గాయాల సలపరం

ఎన్నో పురాతన దుఃఖాలను తవ్వి తీసింది.

కాలం గాయాలను మాన్పుతుందని ఎవరైనా అంటే 

గాయం లోపల ఓ అగ్నిపర్వతం దాగి వుంది అంటాను.


గాయం చెద రేగినట్టు రేగుతూనే వుంటుంది.

అది ఎన్నటికీ అదృశ్యం కాదు. 

ప్రతి గాయం ఒక విస్ఫోటనం

శకలాలు శకలాలుగా శరీరాన్ని తాకిన గాజు పలక

శరం లా గుచ్చి రంపంతో  పర పరా కోసిన అటవిక క్రీడ  


మానిపోయిన మచ్చల పై  తడిమి చూస్తే గాయం లోతు అందకపోవచ్చు

నది లోతు ఎంతో మనకు తెలుస్తుందా, అంతే! 

పోనీ నది కింద ఉన్న భూమి లోతు నదికి తెలుస్తుందా?  

నదిని దాటడానికి తెప్ప సాయం తీసుకున్నట్టు 

గాయానికి గాయానికి మధ్య వంతెన వేసి

జీవితాన్ని దాటడానికి యత్నిస్తున్నా.


గాయపడినప్పుడు కల్గిన బాధ నొప్పిని కూడా 

సృజనాత్మకంగా చిత్రీకరించే వుంటాను. 

పనిముట్టు మనదే అయినప్పుడు రూపాలకు ఏమి కొదవ ? 

తుఫానులా పలకరించి పోయే గాయాల జ్ఞాపకం మంచిదే!


గాయాలు చేసిన మనిషిని క్షమించేసి వుంటాను

ఆ గాయాల గుర్తు మాత్రం  మాసిపోదు. 

మనుషుల ముఖాన్ని గాయంతో పోల్చుకుంటాను 

ఆసరా తెచ్చుకుని మరీ గాయపరిచాడు కనుక.

గాయం నా పాత సహచరుడు.

నా నడక అతను చేసిన గాయాల జ్ఞాపకాలే! 


ఉంగరంలో పళ్ళ మధ్య  చక్కని బిగింపుతో  

కూర్చున్న వజ్రంలా నాలో మాయని గాయం

గాయ గేయంలో లయ తూగు బరువు  

అన్నీ సరిగ్గా అమిరాయి.  రుజువు కావాలా?

నా మణికట్టును పట్టుకుని నాడి ని చూడు. 

గాయాలు ప్రవహిస్తున్న సవ్వడి వింటావ్. 

వినబడని పాట అది.


నాకుగా.. నేనేం మిగల్లేదు. గాయాలుగా మిగిలాను.

 గాయాలపై పూలు పూయడం చూసారా ఎవరైనా! 

జీవన మకరందాన్ని ఆస్వాదించేది ఎలా?

గాయం నా జీవన గానం, యానం.  

గాయం నాలో జ్వాల, నా జీవశక్తి 

మానడానికి పట్టే సమయం నా జీవిత కాలం.


(18/01/2026 ఆదివారం ధి ఫెడరల్ తెలంగాణా డాట్ కామ్ లో ప్రచురింపబడింది)