13, అక్టోబర్ 2026, మంగళవారం

మమేకం


 అబద్దాలను బాగా నమ్మించగలను అని విశ్వాసం నాకు; 

వీలైనంత గొప్పగా నటించాను, కానీ ఏం లాభం!? 

ఒక్క చూపుతో అబద్ధాల కోట గోడలు 

కూల్చేసావు నువ్వు

అబద్దం తన సమాధిని తానే వెదుక్కుంది.  


**********


ఈ రాత్రి వొంటరిది 

నువ్వు రావు మృత్యువూ రాదు

నా ఆత్మ ఇళయరాజా సంగీత సరస్సులో 

మునిగి తేలుతుంది.

బాధ తోనా ఆనందం తోనా!?

ప్రేమ విషం పుచ్చుకోరాదు యెవ్వరూ.


************

చిగురించని వృక్షం  


కొన్ని జన్మలకు వాస్తవంలో కన్నా ఊహల్లోనే యెక్కువ ఆనందం

నా ఊహలకు ఆలంబన నువ్వు.

నీ ఊహలక్కూడా ఆలంబన యెవరో

అయివుంటారులే! 

ఆ సంగతి నాకు చెప్పకు. నేను కాక మరెవరో అయితే 

మొదలంటా నరికిన వృక్షంలా కూలిపోతాను. 

మళ్ళీ మరోమారు చిగురించలేను కూడా! 




11, అక్టోబర్ 2026, ఆదివారం

శ్రద్ధ సూత్రం / జాణతనం

 


శ్రద్ధ సూత్రం


మన ప్రేమ గమ్యాన్ని చేరుకుంటుందో లేదో కానీ 

ప్రయాణం మాత్రం సాఫీగా సాగిపోతుంది 


మన ప్రేమ వృక్షం యెన్నటికీ వాడిపోదు 

శ్రద్ధగా యెరువు వేసి నీరు పెడతావు నువ్వు

శ్రద్ధ సూత్రం నీకు బాగా తెలుసు. 


************

జాణ తనం 


సమాధానం దొరకని కుతూహలం నువ్వు

గాఢంగా  కోరుకునే తెలివి తక్కువ దాన్ని కాదు నేను. 

దేనినైనా గట్టిగా పట్టుకుంటే ఉక్కిరి బిక్కిరై 

సందు వెతుక్కుంటుంది అని తెలుసు.

నువ్వు లభించే భాగ్యం కొరకే అబ్బింది యీ జాణ తనం. 





#జాణతనం #శ్రద్ధసూత్రం #వనజతాతినేని #vanajatatineni #vanajavanamali 

కలహం/ అద్దంలో చందమామ


కలహం - వనజ తాతినేని 

మన అహాన్ని ప్రక్షాళనం చేయడానికే కలహం వస్తుంది 

ప్రేమలో మలినాలు వుండకూడదు 

అప్పుడప్పుడు ఉత్తుత్తి గా కలహించుకుందాం రావోయ్! 

నీ ఔన్నత్యంలోని రహస్యం నాకు తెలుసులే!


**********

అద్దంలో చందమామ  -వనజ తాతినేని 


ఇవాల్టి కలహం రంగు ఏమిటో.. అని యోచిస్తున్నా 

ఆ పొడవు జుట్టు స్త్రీ యెందుకు నిన్ను పదే పదే చూస్తుంది 

మతిమాలి మత్తు నవ్వు రువ్వావా యేమిటి?

నీకు కావలి కాయలేక డస్సిపోతున్నాననుకో

నువ్వు అద్దంలో చందమామవి అని వారికి తెలియదు లే! 





 

చిత్రాలు :Meta AI సహకారంతో.