ఆ దారిన నడచి వెళుతున్న కొందరు ఆ ఇంటి ముందు కొత్తగా వెలసిన బోర్డ్ ని చూసి ఆశ్చర్యపోయారు.
ఆ ఇంట్లో ఉన్న దంపతుల గురించి తెలిసినవారు కొందరేమో.. ఓహో. పిల్లలని పెంచుకోవాలనే ఆలోచన వచ్చినట్లు ఉంది కాబోలు అని అనుకున్నారు.
నెలలు గడచినా ఆ బోర్డ్ అలా ఆ ఇంటి బయట ఉన్న గేటుకి వేలాడుతూనే ఉంది.
ఒక పత్రికా విలేఖరి ఆ విషయం గమనించి.. వారి ఇంటిలోపలకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అతను లొపలకి ప్రవేశించగానే.. కృష్ణ కనిపించాడు. తెలుసుకోవాలనుకున్న విషయం గురించి కృష్ణ తోనే మాట్లాడిన తర్వాత గాని విషయం ఏమిటో..బోధపడింది.
ఆ పత్రికా విలేఖరికి చాలా ఆసక్తి కరమైన విషయాలు కూడా తెలిసాయి.
ఇది అనాధ శరణాలయమా..?అడిగాడు.
కృష్ణ నవ్వుతూ ..అవునో కాదో మీరే చెప్పాలి..అంటూ.. ఒక నెల క్రితం జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని ఆ విషయాన్ని చెప్పనారంభించాడు.
"పూజా.. కాస్త ఆ మూడ్ లో నుండి బయటకు వచ్చి నేను చెప్పిన విషయం గురించి ఆలోచిస్తావా? ప్లీజ్ !! అని సాధ్యమైనంత వేడుకోలుగా అడిగాడు.
"ఏమండీ.. నేను అసలు ఈ విషయాన్ని జీర్ణించు కోలేక పోతున్నానండి . ఈ ఇల్లు ముద్దులొలికే పాపల బోసి నవ్వులతో కళ కళ లాడాలని ఎన్ని కలలు కన్నాం. ఇలా ఆలోచించాల్సి వస్తుందని కలనైనా అనుకోలేదు. నా దురదృష్టం ఇలా ఉంది. నేను తల్లినయ్యే అవకాశం లేదని తెలిసిన తర్వాత అయినా కూడా మీరు నాపట్ల చూపుతున్న ప్రేమానురాగాలు నన్ను మరింత క్రుంగ దీస్తున్నాయి. నా బాధ్యతని నాకు గుర్తు చేస్తున్నాయి.
ఏమైనా ఈ ఇంటికి ఒక వారసుడు కావాలండి. మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బావుంటుంది. ఆ సంగతి మీరే ఆలోచించండి." అంది పూజ.
"ఏ పిచ్చీ! పిల్లలు లేనంతమాత్రాన పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలు కని పెంచి వారి ఉన్నతికి కారకమైన తల్లిదండ్రులకి వృద్దాప్యంలో ఆసరాగా నిలుస్తున్నారు.!? ఎవరి త్రోవ వారిది అన్నట్లు ఉంటున్నారు.
అలాగే అక్రమ సంతానం అని, ఆడపిల్ల పుట్టింది అని, లేదా అవకరాలతో పుట్టారని, పోషించలేని స్థితిలోనూ, పసి గుడ్డులని కూడా చూడకుండా చెత్త కుండీల లోను,మురుగు కాలవుల ప్రక్కనో, కదులుతున్న రైళ్ళలోనూ వదిలేసి వెళుతున్న కసాయి వాళ్ళని చూస్తే .. కన్నవాళ్ళు ఆనే పదానికే మచ్చ తెస్తున్న వాళ్ళని చూస్తే ...ఇంకా తల్లి-బిడ్డ అనుబంధానికి అర్ధం ఉంది అంటావా? అని అడిగాడు.
"నిజమే అనుకోండి .. కానీ మీరలా ఆలోచించడం నాకు సబబుగా లేదు.మీరు ఇంకో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తే తప్పులేదు,నాకసలు అభ్యంతరం కూడా లేదు "
"ఎందుకు ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తావు? నేను నిన్ను వదిలి మరో పెళ్లి చేసుకుంటాను ఆనే ఆలోచన నీకు ఎలా వస్తుంది? " కృష్ణ గొంతులో ఆక్రోశం.
పూజ నుండి మౌనమే సమాధానం అయింది.
" నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు" అడిగాడు మళ్ళీ .
"నాకు మీరు చెప్పిన విషయం నచ్చలేదండీ! ఎంత ప్రేమగా పెంచినా మన రక్తం పంచుకున్న బిడ్డలు అవుతారా?
పోనీ సరోగ్రేట్ మదర్ కోసం ప్రయత్నిద్దాం.! అలా అయినా ఒప్పుకుంటారా?" ఆశగా అడిగింది పూజ.
" నీ కోరిక నాకు అర్ధం అయింది..పూజా.. నా వారసుడిని ఇంట్లో ఎలాగైనా చూడాలి.. ఆ బిడ్డ ఈ ఇంట్లో పెరగాలి ఈ ఆస్తి పాస్తులను సంపూర్ణంగా అనుభవించడానికి పూర్తీ హక్కుదారుడు కావాలని నీ కోరిక అంతేనా? " అని అడిగాడు.
అవును అన్నట్లు.. భర్త ముఖం వైపు చూసింది.
దీర్ఘంగా నిట్టూర్చి.. అన్నాడు కృష్ణ.
"ప్రతి ఒక్కరికి తల్లి-తండ్రిగా మారాలనే కోరిక బలంగానే ఉంటుంది. దురదృష్టవశాత్తు అలాంటి అవకాశం లేనప్పుడు,మరో పెళ్లి చేసుకోవడమో లేదా ఎవరి బిడ్డనైనా దత్తత తీసుకోవడం తప్పుకాదు.
లేదా సరోగ్రేట్ మదర్ ద్వారా వారసుడు కావాలనుకోవడం తప్పు కాదు. అయితే .. ప్రేమాభిమానాలని,ఆస్తి పాస్తులని ఏ ఒక్కరికో పంచి.. వారిని మాత్రమే బిడ్డగా చూసుకుని మురిసిపోవడం కూడా
బాగుంటుంది.
కానీ నా ఆలోచన ఏమిటంటే.. మన ప్రేమాభిమానాలు, కోట్లాది రూపాయాల ఆస్తిపాస్తులు ఏ ఒక్కరికో కాకుండా.. ఇంకొక పది మందికి పంచ గల్గి.. ఆ పది మందిని పెంచుతూ వారికి ఆసరాగా నిలుస్తూ వారిలో మన ఆశలని,ఆకాంక్షల్ని చూసుకుంటే ఎంత బావుంటుంది అనుకుంటాను.
అనాధలుగా పిలవబడుతూ.. ఏ అనాధ శరణాలయాల లోనో పెరగవలసిన పది మంది పిల్లలు.. మనలని అమ్మ-నాన్నా అని పిలుస్తూ మన పిల్లలుగా గుర్తించ బడుతూ.. ఎదిగిన తర్వాత వారి కళ్ళలో వెలిగే కాంతులని చూస్తే కలిగే ఆనందం కి మనం వెలకట్ట గలమా? అందుకే మన ఆస్తులన్నిటి ని ఒక ట్రస్ట్ గా మార్చి ఆ ట్రస్ట్ నిర్వహణ భాద్యత చేపట్టి.. అనాధ శిశువులకి ఆసరాగా నిలుద్దాం. మనకి పిల్లలు లేరన్న విషయాన్ని మర్చిపోదాం. మన ప్రేమని పది మందికి పంచే భాగ్యం మనకి కల్గినందుకు ఆనందిద్దాం. సరేనా..అన్నాడు కృష్ణ.
"పది మంది చిన్నారుల తప్పటడుగులని ఆ ఇంటి ఆవరణలో ఊహించుకున్న పూజ కళ్ళల్లో ఆనంద దీపికలు.
అలా వెలిసినదే..ఈ ఇంటి ముందు వ్రేలాడ దీసిన బోర్డులోని విషయం.
ఇప్పుడు చెప్పండి!? ఇది ఇల్లో.. లేక అనాధ శరణాలయమో!? అని నవ్వుతూ ప్రశించాడు.
విలేఖరి ఆశ్చర్యంగా చూస్తూ మరికొన్ని వివరాలు అడగబోయాడు .
ఒక ఫోన్ కాల్ ని రిసీవ్ చేసుకుని.. "నేను వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఈ ఇంటి వారసుడు ని స్వయంగా తీసుకుని రావాలి" అని చెప్పాడు ఆ ఇంటి యజమాని కృష్ణ.
అప్పుడు..ఆ విలేఖరి.. నేను ఒక్క గొప్ప ఇంటిని.. మాత్రమే కాదు.. ప్రేమాభిమానాలు రాశి పోసుకున్న ఒక ఇంటిని ..అంటూ..
కాదు కాదు.. అమ్మ-నాన్న ల నిలయం ని చూస్తున్నాను. అంటూ గౌరవ భావం తో.. కృష్ణ వెంట తనూ వెళ్ళాడు.
4 కామెంట్‌లు:
యెంత చక్కటి ఆలోచన ...నీ అక్షరాల రూపంలో
ఇలాగా పిల్లలు లేని వాళ్ళు ఆలోచిస్తే యెంత బాగుంటుంది
నిజంగా మంచి ఆలోచనండీ...
ఇప్పుడు చాలా మంది పిల్లలు లేని వాళ్ళు ఇలాగే చేస్తున్నారు మాకు తెలిసిన వాళ్ళలో కూడా..
సామాజిక చైతన్యానికి తోడ్పడే మరో మంచి పోస్ట్ మీ కలం నుంచి..
అభినందనలు వనజ గారూ!
@శ్రీ
Shashi kala gaaru...
@Rajee garu..
@Sree gaaru..
all of you..Thanks a lot!
కామెంట్‌ను పోస్ట్ చేయండి