
వంద !? ..ఇదిగో ఇంద !!.
ఏమిటీ ఈ లెక్క అంటారా ? ఈ లెక్కకి ఒక తిక్క అయినా లేదు..ఊహు .లేదంటే లేదు.
వంద రోజుల్లో వంద పోస్ట్లు వ్రాయాలని సరదాగా అనుకున్నాను. బ్లాగ్ వ్రాయడం మొదలెట్టిన తర్వాత ..ఒకో నెలలో రోజుకొక పోస్ట్ వ్రాసాను. కానీ వంద రోజులు అంటే!?
భయం వేయలేదు కానీ సాధ్యమేనా !?అనుకున్నాను.
ఎందుకంటే.. మా వూరిలో ఆకు అల్లలాడితే చాలు.. పవర్ కట్. దానికి తోడూ వేసవి లో విపరీతమైన కరంట్ కోత. పైగా గృహిణిగా సమయం కేటాయించుకుని బ్లాగ్ వ్రాయడం అంటే కీ బోర్డ్ పై సామే!! కాగితం పై అయితే కొవ్వొత్తి పెట్టుకుని కూడా వ్రాసి పడేయవచ్చు. కానీ ఇక్కడ పప్పులు ఉడకలేదు. అందుకే రాత్రుళ్ళు మెలుకువతో ఉండి వ్రాసే దాన్ని.
మా అత్తమ్మ కి ఆరోగ్యం బాగోక ఇన్ పేషంట్ గా హాస్పిటల్ లో ఉన్నా.. నేను ఆమె ప్రక్కన ఉండాల్సి వచ్చినా బ్లాగ్ వ్రాయడం మానలేదు.
అలాగే మా చెల్లి.. ICU లో ఉన్నప్పుడు కూడా దిగులుని,ఒత్తిడిని తట్టుకుని బ్లాగ్ వ్రాసాను.
ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సి వచ్చింది అంటే..
ఒకోసారి ఏ పని చేయడానికి మనస్కరించ నప్పుడు , లేదా మొనాటనీ ఏర్పడినప్పుడు దానిని అధిగమించడానికి నాకై నేనే కొత్త లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందులో ..నాకొక లక్ష్యసాధన, మార్గం స్పురిస్తుంది.
నా లక్ష్యాలని చేరుకునే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు,ఆటంకాలు ఎదురైనా..వాటిని త్రోసిరాజని నా లక్ష్య సాధన ని చేరుకోవడంలో కొత్త ఉత్సాహాన్ని మూటగట్టు కుంటాను. ఆ విధంగా ఈ నాటికి నేను ఆనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను.
వంద రోజులు వంద పోస్ట్లు వ్రాయడంలో విజయం సాధించాను. ఈ మజిలీ లో ఎన్నో వొత్తిళ్ళు ఉన్నాయి.ఎన్నో పెయిన్స్ ఉన్నాయి.రోజుకొక పోస్ట్ వ్రాయాలని కూర్చుంటే.. సమయానికి విషయం తట్టేది కాదు.
ఖాళీగా ఉండి స్పురించిన విషయం వ్రాద్దామంటే కరంట్ ఉండేది కాదు.
ఈ వంద రోజులలో పెద్ద కథలు కూడా వ్రాసాను. అలాగే తీరిక చిక్కనప్పుడు.. ఒక పాట పోస్ట్ చేస్తే బావుంటుంది లే! అనుకునే దాన్ని.
ఒక పాట పోస్ట్ చేయడానికి ఎంతొ ప్రయాస పడాల్సి వచ్చేది. పాట కన్నా.. పోస్ట్ బెటర్ అనుకునేదాన్ని.
ఈ వంద పోస్ట్ లలోనే కాదు.. నా బ్లాగ్ లో పోస్ట్ లు అన్నీ వస్తు వైవిధ్యం ఉండేవిధంగా నేను శ్రద్ద తీసుకుంటాను.
నాకున్న జ్ఞాన పరిధిలో, నాకు వచ్చిన భాషతో.. చక్కగా ప్రజెంట్ చేయాలనే తపన నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నేను బ్లాగ్ వ్రాయడం ని సరదాగాను తీసుకోలేదు , ఆషామాషీగా ను తీసుకోలేదు.
సరదాగా అనిపించాలి అనుకుంటూ వ్రాసిన పోస్ట్ లలో కూడా..మంచి కంటెంట్ ఉండేలా జాగ్రత్త పడేదాన్ని.
ఒక స్త్రీగా.. నాకున్న సౌలభ్యం, గృహిణి గా ఉన్న భాద్యతలు,వృత్తి పరంగా తీరిక లభించని ఒత్తిళ్లలో కూడా నేను బ్లాగ్ వ్రాయడం అనేది నాలో ఓర్పుని,సహనాన్నిపెంచింది.
నేను వ్రాసిన ప్రతి పోస్ట్ ని చదివి నాకు సలహాలు సూచనలు అందించి,నన్ను అభినందించిన మిత్రులకి నేను మనఃపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తూ..
మునుముందు ఇలా వ్రాస్తానో లేదో!
కానీ ఈ వంద పోస్ట్ లు అవిశ్రాంతంగా వ్రాయడం అనేది.. నాకొక సవాల్ గా మాత్రమే కాదు అనేక అనుభవాలని మిగిల్చింది.
బ్లాగింగ్ కూడా అష్టమ వ్యసనం. నేను ఈ క్రమంలో వ్రాయడానికే సమయం ఎక్కువ కేటాయించాల్సి వచ్చింది కాబట్టి ..కొన్ని మంచి పోస్ట్ లని కూడా చదవలేకపోయేదాన్ని. చదివిన పోస్ట్ లకి బాగా నచ్చినప్పటికీ వ్యాఖ్య పెట్టె సమయం కూడా లభించేది కాదు.
ఈ బ్లాగ్ వ్రాయడం ఆనే ప్రక్రియ .. నాకున్న మంచి అలవాట్లని మార్చివేసింది. వాకింగ్ చేయడం ,పుస్తకాలు చదవడం కి గండి కొట్టింది. ఇకపోతే ఆత్మీయుల ఇంటికి వెళ్ళడం కూడా మానేయాల్సి వచ్చింది.
తర్వాత అనిపించింది..ఇంత చిన్న లక్ష్యానికే నేను అనుభవాలు ఎదుర్కొంటే .. పెద్ద పెద్ద లక్ష్యాలని అందుకున్న వారు.. ఎన్నెన్ని వొత్తిళ్ళు తట్టుకుని ఉంటారు, ఎన్ని అవాంతరాలు వచ్చి ఉంటాయి.అయినా వారు మొక్కవోని దీక్షతో ఆ లక్ష్యాలని అందుకుని ఉంటారు అనిపించింది.
ఏది ఏమైనా .. ఇది నాకు ఎదురైన ఒక అనుభవం.
ఆఖరిగా ఒక చిన్న మాట.
ఒక అజ్ఞాత వ్యాఖ్య నన్ను అమితంగా బాధపెట్టింది. "మహా మహులే బ్లాగ్ ని మూసేసుకున్నారు మీరు మూసేసుకోండి"అని ఉచిత సలహా ఇచ్చారు. వారికి మనఃపూర్వక ధన్యవాదములు.
మనం ఆనుకున్న లక్ష్యం నెరవేరుతుందా లేదా అన్నది చెప్పడం కూడా కష్టమే! ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో..ఎవరు ఊహించలేరు.
నేను వ్రాసిన ప్రతి కంటెంట్ నా ఆలోచనలని మధించి వచ్చిందే! నేను చదవడం ద్వారా, వినడం ద్వారా, చూడడం ద్వారా, నా అనుభవాల ద్వారా నాకు లభించిన జ్ఞానాన్ని నేను సంగ్రహించుకుని వ్రాయడం ద్వారా.. వ్యక్తీకరించినదే!ఒక పాటల సాహిత్యం,ఆడియో,వీడియో,కొన్ని చిత్రాలు తప్ప.
నాకు లభించిన సమయాన్ని బట్టి, నా ఆసక్తిని బట్టి.. ఇంకా ఎన్నో వ్రాసుకోవాలని నా కోరిక.
ఎప్పటికైనా నేను మనసు చెప్పిందే చేస్తాను. వ్రాస్తూనే ఉంటాను. నాకుగా నేను వద్దనుకునే దాక. కానీ ఏ ఒకరో చెప్పినంత మాత్రం చేత నా బ్లాగ్ ని మూసేయను.అది నా స్వభావానికి విరుద్దం కూడా. .
ఫ్రెండ్స్!! అల్ ఆఫ్ యు ..థాంక్స్.