31, జులై 2012, మంగళవారం
వంద !? ..ఇదిగో ఇంద !!.
వంద !? ..ఇదిగో ఇంద !!.
ఏమిటీ ఈ లెక్క అంటారా ? ఈ లెక్కకి ఒక తిక్క అయినా లేదు..ఊహు .లేదంటే లేదు.
వంద రోజుల్లో వంద పోస్ట్‌లు వ్రాయాలని సరదాగా అనుకున్నాను. బ్లాగ్ వ్రాయడం మొదలెట్టిన తర్వాత ..ఒకో నెలలో రోజుకొక పోస్ట్ వ్రాసాను. కానీ వంద రోజులు అంటే!?
భయం వేయలేదు కానీ సాధ్యమేనా !?అనుకున్నాను.
ఎందుకంటే.. మా వూరిలో ఆకు అల్లలాడితే చాలు.. పవర్ కట్. దానికి తోడూ వేసవి లో విపరీతమైన కరంట్ కోత. పైగా గృహిణిగా సమయం కేటాయించుకుని బ్లాగ్ వ్రాయడం అంటే కీ బోర్డ్ పై సామే!! కాగితం పై అయితే కొవ్వొత్తి పెట్టుకుని కూడా వ్రాసి పడేయవచ్చు. కానీ ఇక్కడ పప్పులు ఉడకలేదు. అందుకే రాత్రుళ్ళు మెలుకువతో ఉండి వ్రాసే దాన్ని.
మా అత్తమ్మ కి ఆరోగ్యం బాగోక ఇన్ పేషంట్ గా హాస్పిటల్ లో ఉన్నా.. నేను ఆమె ప్రక్కన ఉండాల్సి వచ్చినా బ్లాగ్ వ్రాయడం మానలేదు.
అలాగే మా చెల్లి.. ICU లో ఉన్నప్పుడు కూడా దిగులుని,ఒత్తిడిని తట్టుకుని బ్లాగ్ వ్రాసాను.
ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వాల్సి వచ్చింది అంటే..
ఒకోసారి ఏ పని చేయడానికి మనస్కరించ నప్పుడు , లేదా మొనాటనీ ఏర్పడినప్పుడు దానిని అధిగమించడానికి నాకై నేనే కొత్త లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందులో ..నాకొక లక్ష్యసాధన, మార్గం స్పురిస్తుంది.
నా లక్ష్యాలని చేరుకునే క్రమంలో ఎన్ని ఒడిదుడుకులు,ఆటంకాలు ఎదురైనా..వాటిని త్రోసిరాజని నా లక్ష్య సాధన ని చేరుకోవడంలో కొత్త ఉత్సాహాన్ని మూటగట్టు కుంటాను. ఆ విధంగా ఈ నాటికి నేను ఆనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను.
వంద రోజులు వంద పోస్ట్‌లు వ్రాయడంలో విజయం సాధించాను. ఈ మజిలీ లో ఎన్నో వొత్తిళ్ళు ఉన్నాయి.ఎన్నో పెయిన్స్ ఉన్నాయి.రోజుకొక పోస్ట్ వ్రాయాలని కూర్చుంటే.. సమయానికి విషయం తట్టేది కాదు.
ఖాళీగా ఉండి స్పురించిన విషయం వ్రాద్దామంటే కరంట్ ఉండేది కాదు.
ఈ వంద రోజులలో పెద్ద కథలు కూడా వ్రాసాను. అలాగే తీరిక చిక్కనప్పుడు.. ఒక పాట పోస్ట్ చేస్తే బావుంటుంది లే! అనుకునే దాన్ని.
ఒక పాట పోస్ట్ చేయడానికి ఎంతొ ప్రయాస పడాల్సి వచ్చేది. పాట కన్నా.. పోస్ట్ బెటర్ అనుకునేదాన్ని.
ఈ వంద పోస్ట్ లలోనే కాదు.. నా బ్లాగ్ లో పోస్ట్ లు అన్నీ వస్తు వైవిధ్యం ఉండేవిధంగా నేను శ్రద్ద తీసుకుంటాను.
నాకున్న జ్ఞాన పరిధిలో, నాకు వచ్చిన భాషతో.. చక్కగా ప్రజెంట్ చేయాలనే తపన నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే నేను బ్లాగ్ వ్రాయడం ని సరదాగాను తీసుకోలేదు , ఆషామాషీగా ను తీసుకోలేదు.
సరదాగా అనిపించాలి అనుకుంటూ వ్రాసిన పోస్ట్ లలో కూడా..మంచి కంటెంట్ ఉండేలా జాగ్రత్త పడేదాన్ని.
ఒక స్త్రీగా.. నాకున్న సౌలభ్యం, గృహిణి గా ఉన్న భాద్యతలు,వృత్తి పరంగా తీరిక లభించని ఒత్తిళ్లలో కూడా నేను బ్లాగ్ వ్రాయడం అనేది నాలో ఓర్పుని,సహనాన్నిపెంచింది.
నేను వ్రాసిన ప్రతి పోస్ట్ ని చదివి నాకు సలహాలు సూచనలు అందించి,నన్ను అభినందించిన మిత్రులకి నేను మనఃపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తూ..
మునుముందు ఇలా వ్రాస్తానో లేదో!
కానీ ఈ వంద పోస్ట్ లు అవిశ్రాంతంగా వ్రాయడం అనేది.. నాకొక సవాల్ గా మాత్రమే కాదు అనేక అనుభవాలని మిగిల్చింది.
బ్లాగింగ్ కూడా అష్టమ వ్యసనం. నేను ఈ క్రమంలో వ్రాయడానికే సమయం ఎక్కువ కేటాయించాల్సి వచ్చింది కాబట్టి ..కొన్ని మంచి పోస్ట్ లని కూడా చదవలేకపోయేదాన్ని. చదివిన పోస్ట్ లకి బాగా నచ్చినప్పటికీ వ్యాఖ్య పెట్టె సమయం కూడా లభించేది కాదు.
ఈ బ్లాగ్ వ్రాయడం ఆనే ప్రక్రియ .. నాకున్న మంచి అలవాట్లని మార్చివేసింది. వాకింగ్ చేయడం ,పుస్తకాలు చదవడం కి గండి కొట్టింది. ఇకపోతే ఆత్మీయుల ఇంటికి వెళ్ళడం కూడా మానేయాల్సి వచ్చింది.
తర్వాత అనిపించింది..ఇంత చిన్న లక్ష్యానికే నేను అనుభవాలు ఎదుర్కొంటే .. పెద్ద పెద్ద లక్ష్యాలని అందుకున్న వారు.. ఎన్నెన్ని వొత్తిళ్ళు తట్టుకుని ఉంటారు, ఎన్ని అవాంతరాలు వచ్చి ఉంటాయి.అయినా వారు మొక్కవోని దీక్షతో ఆ లక్ష్యాలని అందుకుని ఉంటారు అనిపించింది.
ఏది ఏమైనా .. ఇది నాకు ఎదురైన ఒక అనుభవం.
ఆఖరిగా ఒక చిన్న మాట.
ఒక అజ్ఞాత వ్యాఖ్య నన్ను అమితంగా బాధపెట్టింది. "మహా మహులే బ్లాగ్ ని మూసేసుకున్నారు మీరు మూసేసుకోండి"అని ఉచిత సలహా ఇచ్చారు. వారికి మనఃపూర్వక ధన్యవాదములు.
మనం ఆనుకున్న లక్ష్యం నెరవేరుతుందా లేదా అన్నది చెప్పడం కూడా కష్టమే! ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో..ఎవరు ఊహించలేరు.
నేను వ్రాసిన ప్రతి కంటెంట్ నా ఆలోచనలని మధించి వచ్చిందే! నేను చదవడం ద్వారా, వినడం ద్వారా, చూడడం ద్వారా, నా అనుభవాల ద్వారా నాకు లభించిన జ్ఞానాన్ని నేను సంగ్రహించుకుని వ్రాయడం ద్వారా.. వ్యక్తీకరించినదే!ఒక పాటల సాహిత్యం,ఆడియో,వీడియో,కొన్ని చిత్రాలు తప్ప.
నాకు లభించిన సమయాన్ని బట్టి, నా ఆసక్తిని బట్టి.. ఇంకా ఎన్నో వ్రాసుకోవాలని నా కోరిక.
ఎప్పటికైనా నేను మనసు చెప్పిందే చేస్తాను. వ్రాస్తూనే ఉంటాను. నాకుగా నేను వద్దనుకునే దాక. కానీ ఏ ఒకరో చెప్పినంత మాత్రం చేత నా బ్లాగ్ ని మూసేయను.అది నా స్వభావానికి విరుద్దం కూడా. .
ఫ్రెండ్స్!! అల్ ఆఫ్ యు ..థాంక్స్.
లేబుళ్లు:
అనుభూతుల పుష్పగుచ్చం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
22 కామెంట్లు:
వనజవనమాలి గారూ..
వంద రోజులలో వందపోస్టులు రాసి మీరు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు అభినందనలండీ..
మీరెప్పటికీ ఇలాగే ఎన్నో మంచి విషయాలు మీ బ్లాగ్స్ ద్వారా మాకు చెప్పాలని కోరుకుంటున్నాను..
మీరు 100 పోస్ట్ లు ఏకబిగిన వ్రాసినందుకు ముందుగా మీకు అభినందనలు.మీ పోస్ట్ లలో మీ శైలి లో ఓ రకమైన పట్టుదల,వ్రాయాలన్న బలమైన సంకల్పం కనిపిస్తుంటాయి.అలాగే విభిన్న అంశాలను మీరు ఎన్నుకునే తీరు కూడా ఎంతో వైవిధ్య భరితంగా ఉంటుంది.కానీ మీరన్నవిషయం కూడా నిజమే!ఈ బ్లాగులకు సమయం కేటాయించటం కూడా కష్టంగా ఉంటుంది.మీ ఆశయాలకు అనుగుణంగా వ్రాస్తూ ఉండండి.
అందుకోండి అభినందన మందారమాల .....
వనజ గారు వంద ఇదిగో ఇంద అని అంటే.... మాకు ఇస్తున్నారేమో అనుకున్నాను.
వంద రోజుల్లో వంద పోస్ట్‌లు .. సూపర్...
ఏమైనా అనుకోండి .. మొదటికన్నా మీ రచనా శైలి పదునెక్కింది
అందుకోండి విజయాల వాడ విజయవాడ వారి నుండి అభినందనలు.
అవును మీరు చెప్పింది నిజం.మీరు ఎన్నుకున్న లక్ష్యం చాలా కష్టం.అయినా అప్పుడప్పుడు బ్లాగ్ వ్రాస్తే కొంచెం రిలీఫ్ గా ఉంటుంది కాని రోజు వ్రాయటం సామాన్యం కాదు.
అదీ కూడా వస్తు వైవిద్యం తో...అభినందనలు
అభినందనలండి, నిజమే టపాలు రాయడం చాలా కష్టమైన పనే, నాలుగు లైన్ల కవిత, టైపు కొట్టాలంటే తలకిందులైపోతాను నేను, మీరు రాసిన పెద్దపెద్ద కధలు చూసినప్పుడు అనుకుంటాను, ఎంత ఓపికో కదా, అని.
రాయండి, రాస్తూ వుండండి, మీ కోసం, మనందరి కోసం.
ప్రతినకు ప్రతిభ తోడైతే ప్రవహించిన పదిపదులు మీ పోస్టులు.అభినందనలు.
మీరు వంద పోస్టులు వ్రాసి, విజయం సాధించినందులకు అభినందనలు. ఇలా మరెన్నో క్రొత్త క్రొత్త లక్ష్యాలని చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
నిజమే.. సప్త వ్యసనాల తర్వాత పుట్టే అష్టమ వ్యసనం ఈ బ్లాగులు రాయడం... కాని మనది ఒక కుటుంబం.. అన్నా చెల్లి, అక్కా తమ్ముళ్ళ మించిన బంధం.. ఇలాగే కొనసాగిద్దాం సరదాగా మనలో మనమే కామెంట్లు చేసుకుందాం అదొక ఆనందం..
మొదటి సంవత్సరం బాగా మధనపడేదాన్నిబాగా అడిక్ట్ అవుతున్నాను అని తరువాత అడ్జస్ట్ అయిపోయాను .మొనాటనీ నుండి తప్పక తప్పిస్తుంది ఈ బ్లాగు :)
"ఈ బ్లాగ్ వ్రాయడం ఆనే ప్రక్రియ .. నాకున్న మంచి అలవాట్లని మార్చివేసింది. వాకింగ్ చేయడం ,పుస్తకాలు చదవడం కి గండి కొట్టింది".100%true.
Good job and congrats. We should control our blog, not the other way.
అన్నట్టు కొంతకాలం క్రితం నేను రాసిన "బ్లాగు మూసేస్తున్నా - Shame on You! " పోస్టు గుర్తొచ్చింది
http://jeedipappu.blogspot.in/2009/02/shame-on-you.html
>>ఒకోసారి ఏ పని చేయడానికి మనస్కరించ నప్పుడు , లేదా మొనాటనీ ఏర్పడినప్పుడు దానిని అధిగమించడానికి నాకై నేనే కొత్త లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటిని అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందులో ..నాకొక లక్ష్యసాధన, మార్గం స్పురిస్తుంది.>>
బాగా చెప్పారు వనజ గారూ..లక్ష్యసాధనలో మీ పట్టుదల చూసి ముచ్చటేస్తుంది. అభినందనలు
స్వానుభవమున చాటు నా సందేశమిదే!బ్లాగు మొదలెట్టిన మొదటి రోజునుంచి వంద రోజుల్లో నూట రొండు టపాలు రాశా అదో తుత్తి. :)
బాగా చెప్పేరు.
ఎప్పటికైనా నేను మనసు చెప్పిందే చేస్తాను. వ్రాస్తూనే ఉంటాను. నాకుగా నేను వద్దనుకునే దాక. కానీ ఏ ఒకరో చెప్పినంత మాత్రం చేత నా బ్లాగ్ ని మూసేయను.అది నా స్వభావానికి విరుద్దం కూడా. .
మీరు చెప్పిన మాట ఎప్పటికి గుర్తుపెట్టుకోండి. మొరిగేవాళ్లని పట్టించుకోవద్దు..మీ బ్లాగు మీ ఇష్టం.. కష్టమైనవాళ్లు రాకుండా ఉంటారు..
కీప్ గోయింగ్.. నచ్చినప్పుడు మెచ్చినపని చేయండి..
వంద రోజులలో వందపోస్టులు పూర్తి చేసినందుకు అభినందనలు వనజ గారు!
మనసుకు నచ్చిన పని చేసుకుంటున్నప్పుడు కలిగే ఆనందం కోటిరూపాయలిచ్చినా రాదు.
మన బాధ్యతలను క్రమం తప్పకుండా నిర్వహించుకుంటూ, మిగిలిన కాస్త సమయాన్నీ మనకు ఇష్టమైన పని చేసుకుంటే మనలని మనం మన బాధ్యతలకు మళ్ళీ ఛార్జ్ చేసుకుంటున్నట్టే.
మీ పట్టుదలకు, నిర్వహణా సామర్ధ్యానికి నివాళులర్పిస్తూ,
వంద రోజుల్లో వంద పొస్టులకు వందకు మించిన అభినందనలు...
వనజవనమాలి గారు చిన్న సలహా . ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని నోట్ చేసుకోవడానికి చిన్న నోట్ బుక్ ఒకటి వెంట ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి ఇది బహుశా యండమూరి అనుకుంటా ఎక్కడో రాశారు . మంచి సలహా కానీ అమలు చేద్దామని చాలా సార్లు అనుకున్నా అమలు చేయలేదు . అప్పుడప్పుడు నేను జేబులో విజిటింగ్ కార్డ్ , బిల్లులు ఉంటే వాటిపై కూడా రాసుకుంటాను
వంద రోజుల్లో వంద పోస్ట్‌లు అన్న దీక్ష విజయవంతంగా పూర్తి చేసిన వనజక్కగారికి నా హృదయపూర్వక అభినందనలు :-)
ఇంత పని ఒత్తిడిలో ఇన్ని పోస్ట్ లు రాశారంటే అదేం అంత సులువైన పని కాదు; పెద్ద ప్రయాసే! ఈ విజయం వెనుకవున్న మీ కృషి, పట్టుదల ఎంత గొప్పదో అని నెలకొకపోస్ట్ అయినా రాయలేని నాలాంటి వారికే అర్థం అవుతుంది.
గత వారం మీ ఐదువందో పోస్ట్ కి వ్యాఖ్యరాయలేకపోయాను :( వ్యాఖ్య రాసినా రాయక పోయినా మీ బ్లాగుమీద నాకున్న అభిమానం మీకు తెలిసుకదా అన్న #Over confidence# వల్లే నేను కామెంట్ రాయలేదు కాబోలు! రోజూ చదవలేక పోయినా విసిట్ చేసిన రోజు మిస్ అయిన అన్నీ చదివేస్తుంటాను. మరో సారీ మీ అచ్చీవ్మెంట్ కి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
"కానీ ఏ ఒకరో చెప్పినంత మాత్రం చేత నా బ్లాగ్ ని మూసేయను"
Wonderful spirit. Hats off to your determination.
మీరిలా రికార్డుల మీద రికార్డులు స్థాపించాలని...
మనసారా కోరుతూ...
బ్లాగ్ మిత్రుడు....@శ్రీ
బ్లాగ్ మిత్రులారా! నా బ్లాగ్ పోస్ట్ ని చదివి ఓపికగా, వీలు చేసుకుని మరీ స్పందించి.. మీరు అందించిన అభినందనలకి, మీ ప్రోత్సాహానికి మరీ మరీ ధన్యవాదములు.
అనారోగ్యం వల్ల నేను అందరికి పేరు పేరునా ధన్యవాదములు తెలుపలేక పోతున్నాను. మన్నించండి.
అందరికి మరోమారు ధన్యవాదములు.
.....మీ వనజ వనమాలి
Congrats.
కామెంట్‌ను పోస్ట్ చేయండి