వెలుతురుబాకు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వెలుతురుబాకు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, నవంబర్ 2026, సోమవారం

అమ్మ మనసులో మాట

 

వనజ తాతినేని ప్రసిద్ధ కవిత యేమిటో.. యీ చిత్రం చూసి చెప్పగలరేమో…చూడండి.

😊😊


అమ్మ మనసులో మాట" -వనజ తాతినేని. 


గది గోడల నిండా డెస్క్ టాప్ పైనా 

మొబైల్ స్క్రీన్ మీద

అన్నింటా నీ చిత్తరువులే

నువ్వు దూరంగా ఉన్న విషయాన్ని

అనుక్షణం గుర్తుచేస్తూ..


ఘడియ ఘడియకు నీ స్నేహితుల రాక పోకలతో

సందడిగా ఉండే మన వీధి

గంటకొకసారి హడావుడి చేసే నీ బండి సడి

హోరెత్తించే సంగీతపు అలజడి

ఇవ్వన్ని లేని ఇల్లంతా నిశ్శబ్దంతో మూగబోతుంది

నన్ను అకస్మాత్తుగా మూగదాన్ని చేసింది.


చిందరవందరగా ఉండే గది ఇప్పుడద్దంలా మెరుస్తూ

నాకు బోలెడంత తీరిక ఇచ్చింది

ఎప్పుడూ నీకిష్టమైన పదార్ధాలు మాత్రమే చేస్తూ

విసుక్కునే నాకు ఇప్పుడు ఖాళీగా ఉండే వంటపాత్రలు

నా మనసులో నిండిన శూన్యంలా వెక్కిరిస్తున్నాయి


ఎక్కడ అమ్మా అన్న పిలుపు విన్నా 

ఒక్కసారిగా పేగు కదిలినట్లు ఉంటుంది

అమ్మా! అని నువ్వు మార్దవంగా పిలిచినట్లే ఉంటుంది

ఇన్నాళ్ళు నా రెక్కల క్రిందనే పొదువుకుని

ఇప్పుడు రెక్కలు ఇచ్చి ఖండాంతరాలు దాటించాక

ఎన్ని మెయిళ్ళు ఎన్ని sms లు నిరంతరం ప్రవహించినా

మన మధ్య ఉన్న దూరాన్ని నాటికల్స్ మైళ్ళ దూరంలో 

కొలిచినంత తేలికగా చెప్పలేను కన్నా!

దృశ్య శ్రవణ పరికరాలకి లింకు

ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూస్తూ ఉంటాను 


మూసపోతల విద్యావలంబనలో 

విసిగివేసారిన ఉద్యోగ అన్వేషణలో

నీవు మనఃస్పూర్తి గాను వెళ్ళలేదు 

నేను ధనస్పూర్తిగాను పంపలేదు

నేటి యువతకిది బతుకు స్ఫూర్తి

ఎన్నటికి వచ్చెను ఎదురొడ్డి నిలిచే ఉద్యమ స్ఫూర్తి


మీ ఆలోచనలు కొత్త పుంతలు త్రొక్కి

శ్రమని మారకపు విలువతో లెక్కించుకున్నాక

మేధోసంపత్తి తరలి వెళుతుంటే అడ్డుకోలేని మరబొమ్మలం

వీర శివాజీలని పెంచి ఇవ్వలేకపోయిన అమ్మలం.


కడఊపిరి విడిచేవరకు 

కంటి పాపను కనురెప్పకాపాడినట్లు

బిడ్డకు అండ కావాలనే ఈ అమ్మ ఆశ

ఎందరో బిడ్డలకి దూరంగా ఉండాల్సి వచ్చిన

అమ్మలందరి మనసులో ఓమాట. 


(November 2010)


#వనజతాతినేని #vanajatatineni #poetry

#తెలుగుకవిత్వం #వనజవనమాలి 

#indianpoetrycommunity #womenpoetry