4, నవంబర్ 2013, సోమవారం

డిస్ లైక్ ఎఫ్ బి


ఒక వ్యక్తి తెలియని వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే .. వారు ఆ రిక్వెస్ట్ ని తిరస్కరించి .. ఈ వ్యక్తీ ఎవరో నాకు తెలియదు అని రిపోర్ట్ చేస్తే ..  facebook వారిని బ్లాక్ లో ఉంచుతుందని ఈ రోజు ఒక క్రొత్త విషయం తెలిసింది .

ఈ మధ్యనే రెండు దఫాలుగా facebook ఫ్రెండ్స్ లిస్టు ని వడపోసి  నిక్కమైన మిత్రులనుకున్నవారిని  ఉంచాను . రోజుకో నాలుగైదు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు వచ్చి పడుతున్నాయి .  అన్నిటిని నిశితంగా చూసి  ఆలోచించిన తర్వాత కాని వారిని  నా ఫ్రెండ్స్ లిస్టు లోకి  ఆమోదిస్తూ ఆహ్వానం పలుకుతున్నాను. . అనాలోచితంగా కొంత మందిని మన స్నేహితుల లిస్టు లో చేర్చుకోవడం వల్ల ఒక చిన్న చేదు అనుభవాన్ని   చవిచూసాను మరి . ఆ విషయం ఏమిటంటే ..   ..
మేడమ్.. మా వర్కర్స్  పిలుపు . ఇదిగో ఇలాగే ఈ ఇంటర్నెట్ తో మమేకం అయిపోయానేమో .. వినిపించుకోలేదు .

వర్క్ జరుగుతున్న ప్రక్కనే చైర్ వేసుకుని కూర్చుని పేపర్ చదువుకుంటున్న మా నాన్న గారు .."అమ్మాయ్ ! ఎవరో వచ్చారు చూడు " అని గట్టిగా పిలిచారు .

నేను నాతోపాటు నాకు ఇంటి పనులలో, కస్టమర్స్ వచ్చినప్పుడు చీరలు చూపడం, చక్కగా మడతలు వేసి సర్దడంలో సాయంగా ఉండే అమ్మాయి ఇద్దరం వరండాలోకి వచ్చాము.

ఎదురుగా అపరిచిత ముఖం, చూస్తున్న మాకు ఆశ్చర్యం . ఎందుకంటే సాధారణంగా నా కస్టమర్స్ అందరూ స్త్రీలే ఉంటారు . ఎదురుగా ఉన్నది పురుషుడు. ఏదో అడ్రెస్స్ వెతుక్కుంటూ వచ్చారు కాబోల్సు అనుకుంటూ ..

"చెప్పండి ?"   అన్నాను నేను

చేస్తున్న వర్క్  శారీ పైనా ? అని అడిగాడతను  
ఓహో.. ఈ రోజు  ఈ పురుషపుంగవుడు నా మైండ్ తినడానికి వచ్చినట్టు ఉన్నాడనుకుని .. "కాదండి" ఓన్లీ బ్లౌస్ మాత్రమే" అని చెప్పాను .

 "ఇంత హెవీగా  వర్క్ చేయిస్తున్నారు .  మీ  స్వంతానికా ? "  చిరాకు పుట్టించే ప్రశ్న.

కొంచెం విసుగ్గా ముఖం పెట్టి .. ‘కాదండీ కస్టమర్ ఆర్డర్ పై చేస్తున్నాం’. చెప్పాను .

‘ఇంత హెవీగా ఎలా వచ్చింది రెడీమేడ్ వర్క్ పీస్ తెచ్చి అటాచ్ చేస్తున్నారా?’

‘కాదండి ..ఆ డిజైన్ ని  అలా హెవీగా  కనిపించేటట్లు  చేయడమే  ఈ బెంగాలి వర్కర్స్ చేసేపని’అన్నాను

వర్కర్స్ తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే వారు రెండు పొడి మాటలలో సంభాషణ ముగించేవేసారు . అతను నిలబడి వర్క్స్ చూస్తున్నాడో , లేక అనేక అనుమానాలతో అక్కడే ఇబ్బందిగా నిలబడి ఉన్న నన్ను చూస్తున్నాడో అర్ధం కాలేదు .

మా నాన్నగారు ప్రశ్నార్దకంగా చూస్తున్నారు . నేను వచ్చినతనితో మాట్లాడేది లేనట్లు లోపలి రాబోయాను.

మళ్ళీ ప్రశ్న "మీరు శారీస్ సేల్స్ చేస్తారా?"

"లేదు"  టపీమని అబద్దం  చెప్పి లోపలి వచ్చి .. " అవును.. ఈ శాల్తీని  ఎక్కడో చూసినట్లు ఉంది " అనుకుని గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేసాను .

వెంటనే గుర్తుకు వచ్చేసింది ..ఈ ముఖం facebook లో చూసాను  అని గుర్తుకు వచ్చి ఇతనిది ఎక్కడో కదా ! ఇలా మా ఇంటి ముందు ఏమిటీ? అనుకుంటూ అనుమానంతో  బయట గేట్ దగ్గరికి వెళ్లి చూసాను .

నా సహాయకురాలు అతను ఎంబ్రాయిడరీ గురించి తెలుసుకోవడానికి వచ్చినట్లు లేదు మిమ్మల్నే చూస్తూ కనిపించాడు, మీకు అతను తెలుసా ? అని అడిగింది

లేదే ! అదే నాకు అనుమానంగా ఉంది . పైగా మా నాన్న గారు గమనిస్తున్నారు .. మనకి తెలిసిన బాపతు అయితే కాదు అని బయటకి  దృష్టి సారించి చూస్తే... మా ఇంటికి కొంచెం అవతలగా నిలబడి ఫోన్ చేసుకుంటూ కనిపించాడు .

నేను లోపలకి వచ్చేసి .. వెంటనే  facebook ఓపెన్ చేసి చూసాను . సందేహం లేదు అతనే !  నేను వేసిన పోస్ట్ లకి అతిగా కామెంట్ చేస్తున్నాడని అన్ ఫ్రెండ్ ని చేసి పడేసాను . అంతకు ముందు కూడా నాకు అతని నుండి కాల్ వచ్చింది . నా నంబర్ ఎలా తెలుసనీ అడిగాను . అందుకు సమాధానం లేదు . "కవిసంగమం"  ప్రచురించిన కవితలలో నా కవిత ఉంది అప్పుడు అడ్రెస్స్ తో పాటు మొబైల్ నంబర్ కూడా  ఇవ్వల్సినదిగా కోరడంతో  నంబర్ ఇవ్వడం జరిగింది  ఆ కవిత చదివి చాలా మంది ఆ నంబర్ కి కాల్ చేసి అభినందించడం,నేను చాలా సంతోషించడం జరిగింది .

అలాంటిది వేరొకరు ఇలా నా నంబర్ తెలుసుకుని పదే పదే కాల్ చేయడం నాకు నచ్చలేదు . అతను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేసాను . ఒకసారి కాల్ చేసి  "మేడమ్.. మా ఆఫీస్ పనుల వల్ల నేను విజయవాడ వస్తున్నాను . మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి వస్తాను ' అని అడిగితే "సారీ అండీ ..నేను మీరు వచ్చే రోజు ఊర్లో ఉండటం లేదు .  మా మరిదిగారు విదేశాలు నుండి వచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలసి వేరే పోగ్రాం ప్లాన్ చేసుకున్నాం " అని చెప్పి సున్నితంగా తిరస్కరించాను . అతనేదో సాహిత్య సేవకుడేమో కూడా, మీ రచనలు వేస్తానంటూ ఒకటే ఫోన్స్, ఇక భరించలేక ఆ నంబర్ ని బ్లాక్ చేసేసాను .

ఇవన్నీ గుర్తు చేసుకుంటూ  "ఇప్పుడు ఈ వెధవ వెతుక్కుంటూ ఇంటిదాకా వచ్చాడు . కొంచెమైనా సంస్కారం లేకుండా "  అని తిట్టుకున్నాను .

అందుకే మా స్త్రీలు వ్యక్తిగత వివరాలు, చిరునామాలు ఇవ్వడానికి వెనుకాడతారు అనుకున్నాను  బ్లాగర్ గా పరిచయం అప్పుడు కూడా నేను చిరునామా ఇవ్వడానికి భయపడలేదు . భయపడటం నా లక్షణం కాదు . అడ్రస్ తెలిసినంత మాత్రాన , ఫోన్ నంబర్స్ తెలిసినంత మాత్రాన ఇలా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ వ్యక్తిగత పరిచయాలు కోసం ప్రాకులాడతారా?  అనుకుంటాను. ఎదుటివారు సంస్కారవంతులుగా ఉండటం చేతకానప్పుడు వారిని ఎలా ఫేస్ చేయాలో, ఎలా త్రుంచి వేయాలో కూడా నాకు తెలుసు.

నాకింకో అనుమానం నా లాగా  ఇంకొందరిని కూడా అతను అలా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు కూడా ! తమ రచనలు ప్రచురిస్తారని స్త్రీలు ప్రలోభ పడతారా? నాకైతే అసహ్యం  వేసింది . ఇలాంటి అనుభవం నాతోపాటు మరికొందరికి ఉండవచ్చు . నాతోపాటు కాస్తో కూస్తో వ్రాయ గల్గిన అందరి ఫ్రెండ్స్ లిస్ట్ లోను అతను ఉన్నాడు.  నేనైతే అతని ప్రవర్తన నచ్చడం లేదని  అతనికి చెప్పి మరీ బ్లాక్ చేసేసాను .

 ఆన్ లైన్ స్నేహాలలో ముఖ్యంగా  మన  అభిప్రాయాలు, మన ఆలోచన విధానం, స్పందించే  మనసు  వీటిని బట్టే  ఒక అభిప్రాయం ఏర్పడుతుంది తప్ప వ్యక్తిగత పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించేవారి  పట్ల   అసహ్యం కల్గుతుందన్నది నిజం

ఇలాగే వ్యక్తిగత పరిచయాలు పెంచుకుని ఫోన్ నంబర్స్ ఇచ్చుకుని సోషియల్ నెట్వర్క్స్ లో  జరిగే విషయాల గురించి  చర్చించుకుని .. ఒకరి గురించి మరొకరు మూడవ వ్యక్తి దగ్గర చెప్పుకుని అవి వారి నుండి వీరికి,  వీరి నుండి వారికి చేరి ఆ చేరవేసే వ్యక్తి పురుషుడు  అని తెలిసి  ఆశ్చర్య పోయాను అటువంటి విషయాలు  facebook లో జరిగాయి ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ అసహ్యకరంగా తిట్టుకున్న కొందరిని చూస్తే భయం, అసహ్యం రెండు కల్గాయి నాకు  నా ఫ్రెండ్ ఒకరు ఇలాంటి గొడవల వల్ల అకౌంట్ డీయాక్టివేట్ చేసుకుంది .  ఆమె నన్ను పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు . "జాగ్రత్తమ్మా" అని

నేను నీలా అంత ఓపెన్ గా ఉండను ఎక్కడ ఎలా ఉండాలో  అలా మాత్రమే ఉంటాను, మితిమీరితే తోకలు ఎలా కత్తిరించాలో నాకు తెలుసులే అని నవ్వేసాను కాని .. ఈ విషయం ఆమెకి చెప్పే సమయం రాలేదు

అటువంటి పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం కూడా .

అలాగే  పర్సనల్ చాట్ చేయడం కూడా  ఇబ్బందికరం వీలైనంత చాట్ కి దూరంగా ఉండండి .. ఎంత మంచి స్నేహమో అయితే తప్ప స్వవిషయాలు పంచుకోకండి

ఎవరైనా ఇబ్బందికరంగా కామెంట్ చేస్తే ఆ కామెంట్ ని తొలగించేయండి , నిర్మొహమాటంగా హెచ్చరించండి , వారి తీరు మార్చుకోకపోతే బ్లాక్ చేసేయండి .  

ముక్కు ముఖం తెలియని వ్యక్తుల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే .." నో" చెప్పేయండి.

మీ వాల్ పై ఎవరూ పోస్ట్ చేయకుండా సెట్టింగ్ మార్చుకుని జాగ్రత్త పడండి.

రచనలు ప్రచురిస్తాం , జాబ్స్ ఇప్పిస్తాం , మా ప్రాంతాలకి వస్తే  మమ్మల్ని సంప్రదించండి ఎటువంటి సాయం కావాలన్నా మమ్మల్ని అడగండి లాంటి మాటలు  గురించి  ఆలోచించకండి.

ఎవరి పనులు వారు చేసుకుని ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది .  ఎటువంటి ప్రలోభాలకి లోను కావద్దు .

ఫ్రెండ్స్ ..తస్మాత్ జాగ్రత్త. facebook లోను , ఇక్కడ  కూడా ఉన్న ఫ్రెండ్స్ కి కొంత మందికి  చాలా విషయాలు తెలుసు.  దుష్టులకి దూరంగా ఉండండి . మీ మానసిక శాంతిని పోగొట్టుకోకండి. లైక్స్ ఇవ్వలేదని ,కామెంట్స్ పెట్టడం లేదని దూరంగా తోసేసేవారిని మీరే మీ లిస్టు నుండి తీసి పడేయండి.  లైక్ చేయకపోతే దాడి  చేసే మనస్తత్వం ఉన్నవారితో అసలు ఫ్రెండ్షిప్ చేయకండి   పోయేది ఏమి లేదు ఒక  ఆన్ లైన్ స్నేహం అనే ముసుగు తప్ప .

బాహ్య ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో  ఆన్ లైన్ స్నేహాలలోను అవే ఉన్నాయి .  ప్రాంతీయ తత్వం, కులం, మతం తమ వారే గొప్ప వారు అనే భావనలు  ఇలా చాలా ఉన్నాయి . అనకాపల్లి  నుండి ఆస్టిన్ వరకు లేదా విజయవాడ నుండి వాషింగ్టన్ వరకు  ఇలాగే ఉన్నారు . కాకపొతే దారులే మారాయి అంతే !

3, నవంబర్ 2013, ఆదివారం

కార్తీకంలో చంద్రోదయం ..

కార్తీకం  వచ్చేసిందోచ్.. గతంలో ..నేను పరిచయం చేసిన పాటే! కొంత వివరణ తో.. ఇలా మళ్ళీ .. 


శరదృతువు లో వచ్చే కార్తీక మాసం అంటే అందరికి ఇష్టం కదా !  . శరదృతువు లో అంతకు మునుపు వర్ష ఋతువు తాలాకు నల్లటి మేఘాల స్థానే తెల్లని మబ్బులు తేలికగా కదిలిపోతూ .. చంద్రునితో దోబూచులాట ఆడుతున్నట్లు ఉంటుంది కార్తీకంలో  కురిసిన  వెన్నెలయితే  చల్లగా ఉంటుంది  అలాంటి వెన్నెలని ఇష్టపడని వారంటూ ఉండరు . అలాంటి ఆహ్లాదకర వాతావరణంలో ఒక మంచి పాటవింటే బావుంటుంది.సమయానికి తగిన పాటైతే మరీ బావుంటుంది  అయితే  నాకిష్టమైన పాట... చంద్రోదయం చంద్రోదయం పాట

పాట... వినేద్డామా?



ప్రేమమందిరం చిత్రంలో... పాట ఇది... జయప్రద... అక్కినేని.. ఈ పాటలో... చూడచక్కని.. జంట.. పాట..  ఈ సాహిత్యం... అపురూపం. వేటూరి  గారి కలం జాలువార్చిన నిండు పున్నమి వెన్నెల సంతకం.

వెన్నెల, వేణువు.. ఎవరికి.. ఇష్టం ఉండవు.. చెప్పండీ..!.. అలాగే.. నాకు.. ఈ పాటంటే మరీ  ఇష్టం. . పాటలు.. వినడం నాకు.. వ్యసనం.. అందునా... మంచి సాహిత్యం- సంగీతం మేళవించిన... పాటలకి... నేను.. బానిసని. ఆహార,నిధ్రలని మరచి మరీ.. వింటాను., అదీ... యుగళ గీతాలని.. మరీ మరీ.. వింటాను..  అందరూ నువ్వసలు పాటలు వినేందుకే పుట్టి ఉంటావని..  కాసిని నవ్వుతాలు మాటలు, మందలింపులు  పట్టించుకోకుండానే.. ఇలా అంటూ ఉంటాను   దేనికైనా.. మనసుండాలంటారు కదా... మనసున్న కన్నులకే తెలుస్తుంది... అంట.. ఇక్కడ.. చెవులు అనాలేమో..!!  వేటూరి గారు తెలుగు నుడికారం ,అచ్చు తెనుగు పదాలని అందంగా అమర్చి వ్రాసిన యుగళ గీతమిది . 

.ప్రేయసి ప్రియులు ప్రకృతిలో మమేకమైన వేళలో .. నిండు.. పున్నమి వెన్నెలలో... రెండు.. మనసులు కలసిన.. తరుణంలో... ప్రపంచం ని.. మరచి... విహరించడం .. ఆ అనుభూతిని.. జీవితంలో.. ఒకసారి అయినా.. చవిచూడటం .. ఆ నిండిన అనుభూతిని.. మనసు పొరలలో... పదిలపర్చుకోవడం ఎవరికైనా.. మధురాతి.. మధురం కదా ! 

పెద్దల  కట్టుబాట్లు  సడలించుకుని ఒక జంట   మబ్బులా కమ్మిన తమ ఎడబాటుని చెరిపేసుకుని మనసులు ముడివేసుకుని కన్నులు కలబోసుకుంటే కార్తీకమే కదా ! ఏకాంతంలో  వారి ఆత్మీయ కోగిలిలో చంద్రోదయం కాకుండా ఉంటుందా ..చెప్పండి?  

వారివురు కలసిన వేళా నింగి నేల కలసి  తాళాలు వేసినట్లు వారిరువురు కలసి అలసి సొలసిన వేళ కడలి నది మేలమాడుకున్నాయి. ఆ రాత్రివేళ పూసిన పున్నాగలు సన్నాయి పాడాయి ఆ  చూపులలో..  చెప్పలేని మూగ బాసలున్నాయి.వారిరువురిలో రేగిన  అలజడి..  పెదవి పెదవి కలబడితేనే కాని ఆగదన్నట్లు అప్పుడప్పుడే  నిద్రలేచిన పొద్దులో  వారి తనువుల కలయికలో ఆనంద చంద్రోదయం అయినది .. .

నవరసాలలో రసరాట్టు శృంగారం అంటారు . సకల ప్రాణ కోటి కోరుకునేది . సకల ప్రాణ కోటిలో ఉత్తమ శ్రేణికి చెందినవాళ్ళం అనుకునే మానవులు ఆ రసాన్ని మనసారా,ఉదాత్తంగా ఆస్వాదించాలి. బాహ్య ప్రపంచం నుండి విడివడి ఆత్మలు సంయోగం చెందినట్లు మమేకం కావాలి ఈ పాట  సాహిత్యం ఇలాగే ఉంటుంది  

 పారశీక కవితా సంప్రదాయంలో స్త్రీని సూర్య బింబంతో పోల్చడం ఆనవాయితీ అయితే  వేటూరి గారు తన ముందు తరం  కవుల నుండి   స్త్రీని చంద్ర బింబం తో పోల్చడంని ఆనవాయితీగా పుణికి పుచ్చుకుని  ఈ పాట సాహిత్యంలో స్త్రీని జాబిలితో పోల్చారు . కౌగిలితో గల జాబిలితో ..అని ఇక్కడ వ్రాయడం జరిగింది వారిరువురు   చుక్కలు కాంచని నేరాలు ఎన్నో చేసేసారు . ఆమె విరహంతో  ప్రియునికి కాటుక తో ఉత్తరం వ్రాస్తే ఆ ఉత్తరంలో  ప్రేమ లోని గాడతతో పాటు చిలిపి తనం గోచరించిన ఆ ప్రియుడికి  ఆనాటి  పున్నమి వెన్నెల  తగలగానే జ్వరం వచ్చిందని చెప్పడంలో వింతేమి లేదు కదా ! 

తూరుపున ఉదయించిన సూరీడు  తొందర తొందరగా పడమటికి చేరి అక్కడే స్తిరబడి .. రేపటిని మర్చిపోతే .. తొందరపడి విరిసిన పూలపాన్పుపై   ఆ విరులూ ఆవిరులై నిట్టూర్పు విడుస్తున్నప్పుడు విరిసిన చంద్రోదయం ఎంత బావుంటుంది . "విరులావిరులౌ .. నిట్టూర్పులలో ...చంద్రోదయం .. చంద్రోదయం.".. ..  వాహ్హ్వా..అదే వేటూరి సాహిత్యం  ఆ పదాల గారడీ అది.   ఎవరికైనా ఆ ఆకర్షణలో పడకుండా ఉండటం సాధ్యం కాదేమో!   

వినండి.. తడిసి... ముద్ధయిపొండీ .! పున్నమి.. వెన్నెల అయితే .. ఈ.. పాట వింటేనే ...జ్వరం రావాలనే.. అంతగా....మమేకం అయిపోవాలని.. ఆశిస్తూ...  


ఈ పాట సాహిత్యం : 

మబ్బులు విడివడి.. మనసులు.. ముడివడి..
కన్నులు కలసిన కార్తీకంలో...
కౌగిలి బిగిసిన ఏకాతంలో... చంద్రోదయం.. చంద్రోదయం..

నీవు నేను కలసిన వేళ.. నింగి నేల.. తాళాలు...
కలసి అలసి సొలసిన వేళ..కడలి నదుల మేళాలు.. ..
పూచిన పున్నాగ పూల సన్నాయి..
చూపులలో.. మూగ బాసలున్నాయి... (2 )
ఇద్దరి అలజడి.. ముద్దుల కలబడి..
నిద్దర లేచిన పొద్దుల్లో... చంద్రోదయం చంద్రోదయం.

చేరి సగమయ్యే.. కౌగిలిలో.. దిక్కులు కలసిన తీరాలు..
కౌగిలిలో గల జాబిలితో... చుక్కలు.. చూడని నేరాలు...
కన్నుల కాటుక చిలిపి.. ఉత్తరాలు..
పున్నమి వెన్నెల తగిలితే.. జ్వరాలు... (2 )

తూరుపు త్వరపడి.. పడమర స్తిరబడి...
విరవిరలాడిన విరి.. పాన్పులలో ...
విరులావిరులౌ .. నిట్టూర్పులలో ...
చంద్రోదయం .. చంద్రోదయం... ..

ఇంత చక్కని తెలుగు పాటకి వన్నెలద్దిన  పద గురువు వేటూరికి, సంగీత వినీలాకాశంలో...చందమామ.. కే.వి. మహదేవన్ కి... నీరాజనం.

ఈ చంద్రోదయంని  ఇక్కడే.. ఈ కార్తీకపు ఆ వెన్నెల కెరటాలలో.. తడిసి ముద్దయి. తనివితీరా ఆస్వాదించండి..

1, నవంబర్ 2013, శుక్రవారం

నీటిపై ప్రయాణం

నీటిపై ప్రయాణం
ప్రయాణీంచిన  దూరాన్ని తలచుకుంటే  భయమేస్తుంది
ఎవరో నెట్టేసినట్లు వెనుతిరిగి చూడకుండా
నాకేం కావాలో, ఇతరులకేం ఇవ్వాలో తెలియకుండానే
కరిగిన  కాలాన్ని చూస్తే దిగులు ముంచుకొస్తుంది

తప్పిదాలు పలక మీద వ్రాసిన అక్షరాలయితే
ఎంత బావుండును
చేసిన వాగ్దానాలు శిలాక్షరాలుగా నిలిచి
హెచ్చరించినా బావుండును

దారిపొడవునా నిలిచిన మైలురాళ్ళు
తరిగే దూరాన్ని గుర్తు చేసినా బావుండును
నడచినదారంతా  మటు మాయమై
తొలి అడుగులో  నిలిపితే మరీ బావుండును

ఆశా నిహతి నింపుకున్న
నీ గుండెని అడిగి చూడు...
నీ నిట్టూర్పు నడిగి చూడు
చేయాల్సిన ప్రయాణం సంగతేమిటో...

నిశ్శబ్దం ఒక యుద్ధమయితే
అందులోకి జారిపోవడం నిత్యనూతనమయితే
అస్ఫష్టంగానయినా గోచరించని సత్యమేదో
ఇంకా మిగిలి ఉంటుందంటే
నీ ప్రయాణం ఇంకా మొదలెట్టలేదన్నమాటే !
నీటిపై నడిచొచ్చిన  గురుతులేవి లేనట్లన్నమాటే
నీకింకో జీవిత ప్రయాణాన్ని ముందుంచినట్లే!