10, డిసెంబర్ 2010, శుక్రవారం

రాత్రి..ఓ అంతరంగ రహస్యం



రాత్రి.. ఓ అంతరంగ రహస్యం


  • -వనజ తాతినేని 


 ఏ పర్వత సానువులు పై  కురిసిన

చినుకు చినుకు

ఝరీ..ప్రవాహమై సాగినట్లు


ఏ..హిమవత్పర్వతముల నుండో

కరిగిన మంచు

 జీవనదిగా ప్రవహించినట్లు


ఏ తెల్లని మబ్బులో

గుంపులు గుంపులుగా కొండ కోనలపై

హంసల వలె నడయాడినట్లు


ఏ మింటిని  వదిలిన

శరంలా భ్రమరం

    పువ్వుని ముద్దాడినట్లు


  ఆ నీలాల నింగి

జలతారు పరదాతో

 తనను తాను అలంకరిందుకున్నట్లు


ఏ కోనేటి కలువనో చూసేందుకు

తొంగి చూసిన చంద్రుడికి నీటి తళతళలో

 తన రూపు చూసి తానే మురిసి నట్టు


 వికసిత పరిమళాలను తనలో ఇముడ్చుకుని

 పిల్ల తెమ్మెర లోకాన గర్వంగా ఊరేగినట్లు


 ఏ గిరి శిఖరాన్నో తాకి ఇనబింబం ఎర్రబడినట్లు


రాత్రి తన కన్నులకు కాటుకని

 గాఢంగా  అద్దుకున్నట్లు

 

తన నుండి ఉద్భవించిన

 రేరాజు ని  అందుకోవాలని

 కడలి కెరటాలతో ప్రయత్నం చేస్తున్నట్లు


  ఒక సౌందర్య దేవతని చూసిన

 నక్షత్రం జారి ముక్కు కి నత్తు అయినట్లు


 శిశిరకాంత నగ్నంగా

తనను తాను అలంకరించుకుని

 సిగ్గుతో మోముని వాల్చినట్లు


ప్రకృతి ప్రకృతిలో లీనమైనవేళ

 నీ గురించిన తలపులతో

 నీ ఊసుల దుప్పటి కప్పుకుని

లోకం అంతా నిదురించిన వేళలో 

నన్ను నీలో దర్శించుకుంటున్నా


మనసు మనసుతో మాట్లాడేది

రాత్రి సమయంలోనే  కదా


  రాత్రి ఓ అంతరంగ రహస్యం.

 ఆ రహస్యాన్ని చేధించే విలుకాడా

కనుమూతపడక ముందే రా

రాత్రిని కరగనీయగా రంగుల కలలా   


రాత్రి ఓ అంతరంగ రహస్యం


(ఫిబ్రవరి 2009) 


  
  





8, డిసెంబర్ 2010, బుధవారం

దేహాన్ని కప్పండి!.

     





||  దేహాన్నికప్పండి  ||

చిన్ని పాపా! 
నిన్ను తెర మీద చూసుకోవాలనుకున్న
ఆత్రుత కల్గిన తల్లి ఉంటే..
నీకు ఈస్ట్రోజెన్ 
సూది మందు ఇవ్వడం మొదలుఅవుతుంది..

నిన్ను కాసులని పండించే 
పంటభూమి అనుకునే 
తండ్రి ఉంటే నీ శరీరం 
లైపోసక్షన్  ఆపరేషన్లకి సిద్దం చేయ బడుతుంది. 
ఎందుకంటే.. ఏ తెర మీదైనా  
ఆడతనం నిరూపణకి ఆ రెండూ ముడిసరుకులు మరి. 

అర్భకత్వం  దేహానికిచ్చి..
అల్పత్వం మనసుకి లేకుండా..
ఉదార హృదయంతో అంతా  పరిచేసి 
పాకుడు రాళ్ళపై పైకి ఎగబ్రాకుతూ 
దేహం అడవిలో
పిచ్చ్ది మొక్కల్లా పెంచుకున్న యవ్వన సంపదంతా.. 
సంకోచం లేకుండా అచ్చాదనంటూ లేని.. 
కెమెరా  కళ్ళకి చిక్కి గంగవెర్రులెక్కిస్తే అది 
దర్శకుడి కళాదృష్టి  అయికూర్చుని..
వ్యాకోచాలు మొదలైతే.. 
తల్లి, చెల్లి,పిల్ల.. అన్ని మరచి.. 
నేర ప్రవృత్తికి కొత్త ఊపిరి పోస్తున్నాయి.. 
రసిక హృదయులకీ ఇల్లు నచ్చక 
అంగడి బొమ్మలకై వెదుకులాడుతున్నాయి ..

ప్రకృతిలోని వేయి పూవులన్నీ తెచ్చి. 
ఒక్క చీరలో చుట్టి..దేహాన్ని చుట్టాలనుకున్నది.. 
వ్యాపార రహస్యమైనా.. 
ఏ ప్రారంభానికో  విచ్చేసిన తార
ఆ చీర బహుమతిగా కొట్టేసి
త్రీ పీస్ మిడీ, డీప్ నెక్  లేదా బ్యాక్   ఫ్రీ  బ్లౌస్ చేసేసి  
తెరపై  నాయకుడి చేతి నడుం పట్టులో నలిగిపోతుంటే
సంప్రదాయమైన పట్టు వెలవెలా పోతుంది  

ప్రపంచం అంతా
పువ్వులాంటి అబల  నడుమ చుట్టేగా తిరుగుతుంది..
సంప్రదాయాన్ని  గరికలా మిగిల్చి 
మనం నాగరికతని వెతుకుతున్నాం..  

నాగరికత హై టెక్  పార్టీలలోనూ..
ర్యాంప్  షో పిల్లి నడకల్లోను..  
నట్టింట్లో తెరపై కాదు కనిపించేది. 

నాగరికతని నేర్చుకున్న ఆది మానవుడిని  అడగండి.. 
మునిమాపు వేల గడ్డిమోపు తలకెత్తుకుని వెళుతూ..
బడిపిల్లని చేతబట్టుకుని వెళుతున్న
పల్లెతల్లిని అడగండి. 

" మెదడు  అంతా.. మన్నేనా
హృదయం అంతా.. బండేనా . 
అయినా శరీరం అంతా..
స్వరజతులే ఉండాలా 
మీటితే ఎప్పుడు పడితే అప్పుడు.. 
అలరిస్తూనే ఉండాలా
మద్యంలాగా.. మగువ కూడా.
తయారు చేసుకున్న వస్తువా!? 

నాగరికత భ్రమలో   
అనాగరికతకి  నిలయమైపోకండి.. 
మనకే సొంతమైన లంగా -వోణీని 
ఫ్యాషన్  అని వక్రీకరించకండి 
ఫిజిక్  టైట్.. పరవళ్లుతో
దేహసంపదని బజారున పడవేయకండి.. 

పల్చని జార్జెట్ చీరల్లో..  
బొడ్డుక్రింది మడతల్లో
అందాలు ఆరబోయకండి 
నైట్ గౌన్.. మోతలో
ఆరుగజాల మన సంస్కృతిని .. 
మరుగున పడనీయకండి.. 

పడతులూ భామలూ
అత్తమ్మలూ అమ్మలూ 
అమ్మమ్మలూ బామ్మలూ  
పైటని చుట్టండి
దేహాన్ని కప్పండి! దేహాన్ని కప్పండి!!  

ఒక స్నేహం కోసం





(జీవన ప్రయాణంలో ప్రతి మిత్రుడూ/మిత్రురాలు  అవసరమే)
ఈ స్నేహం కోసం  యే ఒక్కరి కోసమో కాదు  నా స్నేహ  ప్రపంచాన్ని పరిపుష్టి చేసిన (లింగ వివక్ష లేకుండా ) మిత్రులందరికీ ....

కాలగమనంలో ఆంక్షల పరిధిలో
మనుషులెంత దూరమైనా
మమతలు మాసిపోనివ్వనిదే స్నేహం.
అదే నిజమైన  స్నేహం..

గుండెలనిండా గూడుకట్టుకున్న
జ్ఞాపకాలని వెలికి తీసి..
ఆ పరిమళాలని ఆస్వాదిస్తావని
ఎన్నటికి  తరగని ఆ స్నేహ మాధుర్యాన్ని
గుర్తుకు తెచ్చుకుంటావనే ఆశ తో

నీ హృదయాన్ని తట్టి లేపుతున్న..
ప్రియ నేస్తాన్ని  మరచితివా మిత్రమా.. ?

ఎన్నటికి వీడని  ఆ.. స్నేహ హస్తపు వెచ్చదనాన్ని
పంచిన మమతల చల్లదనాన్ని
ఎంధరెంధరిలోనో భూతద్దంలో వెదికినా
కాన రాని స్థితి
ప్రపంచమంతా  వో.. వైపున్నా
నీవు నాకున్నావనే ఆలోచనే..
నాకు వేయి ఏనుగుల బలం

నా వెనుకనుండి స్ఫూర్తి నిచ్చి
నన్ను నడిపించే  ప్రియ మిత్రమా !
నీవు నా ఆలోచనలో తోడుంటే చాలు.
ఏటికి ఎదురీదగలను
కెరటాలకు తలవంచనూగలను..

వృత్తిలో భాద్యతలలో తలమునకలై ఉన్నా
 నీ ఆలోచనల్లో  రవంత చోటు ఇచ్చి
తంత్రీ నాదం ద్వారానైనా
పలకరించు ప్రియ మిత్రమా
హృదయ వీణని మీటగా