24, అక్టోబర్ 2013, గురువారం

సోలః సింగార్


Mohra  చిత్రంలో  నాకిష్టమైన  "Na  kajre ki dhar Na  Mothian  ki  haar  "   పాట  వింటున్నాను .

Singaar tera yovan, yovan hi tera gehna అన్న సాహిత్యం వినగానే సోలః  సింగార్  గుర్తుకు వచ్చింది 

అసలు సోలః  సింగార్ ఏమిటీ అని  చూస్తే  స్త్రీల  అలంకరణలో భాగాలైన ఇవన్నీ గుర్తుకు వచ్చాయి . కొన్ని తెలుసుకోవడానికి  గూగులమ్మ సహాయం చేసింది .

మన భారతీయ సంప్రదాయంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది . వివాహ సమయానికి ముందు వివాహ సమయంలోను , వివాహం తర్వాత అనేక ఆనవాయితీ లు ఉన్నాయి .

వివాహ  సమయంలో  ఎక్కువగా అందరి దృష్టి  వధువు పైనే ఉంటుంది. వధువు యొక్క రూపురేఖలుతో పాటు ఆమె ధరించిన వస్త్రాలు, ఆభరణాలు , అలంకారం పైనే ఆసక్తి చూపుతారు .

వధువు అలంకరణ  పూర్తీగా ఉండాలంటే  పదహారు విధాలుగా ఉండాలని పూర్వీకుల కాలం నుండి నిర్ణయించారు . ఉత్తర,  దక్షిణ భారత దేశ వివాహ పద్దతులలో కొద్దిపాటి తేడాలున్నప్పటికీ వధువు అలంకరణ అంతా  అన్నిచోట్లా ఒకే విధంగా ఉంటుంది . "సోలః సింగార్" గా అభివర్ణించే ఈ అలంకరణ ఇలా ఉంటుంది .

ముందుగా వస్త్ర సాంప్రదాయం . మన దక్షిణాది ప్రాంతంలో పట్టుచీర జాకెట్  ధరిస్తారు. ఉత్తరాదిన లేహంగ చోళీ ధరించి  అందంగా డిజైన్ చేయబడ్డ  మేలిముసుగు ని కప్పుతారు.

వధువు ముఖం చూడగానే మనకి కనిపించే ముఖ్యమైన అలంకారం నుదుటన ధరించే తిలకం . మన ప్రాంతాలలో "కళ్యాణ తిలకం " ని దిద్దుతారు . ఉత్తర భారతంలో "బింది" లేదా బిందియా అని వ్యవహరిస్తూ ఉంటారు . ఈ బిందీ ఎరుపు రంగులో ఉండి శుభ చిహ్నంగా ఉంటుంది.

ఇక మూడవది కన్నుల కాటుక "కాజల్ " అని వ్యవహరిస్తారు . కళ్ళకి కాటుక ఇచ్చే అందం ఇంత అని చెప్పనలవి కాదు.  ఇప్పుడంటే కాటుక పెట్టుకోకపోవడం ప్యాషన్ , అయినప్పటికీ మేకప్ లో భాగంగా "ఐ "లైనర్ వాడటం మామూలైపోయింది . అలాగే కనురెప్పలు మరింత నల్లగా,దట్టంగా ,పొడవుగా కనబడటానికి "ఐ లాష్ " ఉపయోగించడం చేస్తున్నారు     కాటుకని స్త్రీల అలంకారంలో చాలా ముఖ్యం అని ఒప్పుకోవాల్సిందే మరి .

ఇక నాలుగవది .. ముక్కెర .  స్త్రీ జీవితంలో వివాహం తర్వాత ధరించే ముఖ్య చిహ్నం .  సంప్రదాయ ముక్కెర ముక్కు  నుండి   రింగుల లింక్ ల ద్వారా చెవి వరకు సాగుతూ  ఉంటుంది . . ఇప్పటి తరం అయితే వారి వారి అబిరుచిని బట్టి ముక్కెరని , లేదా పుడకని ధరిస్తున్నారు .

ఇక ఐదవ అలంకారం బంగారు ఆభరణం  "పాపిట బిళ్ళ " ఉత్తర భారతంలో ఈ ఆభరణం ని "మాంగ్ టిక్కా"    గా వ్యవహరిస్తారు . జుట్టుని రెండు భాగాలుగా విడదీసిన నిలువు పాపిడి పొడవునా నుదుటిపై వ్రేలాడుతూ వధువుకి వింత శోభని కల్గించే అలంకారం ఇది .

ఆరవది కర్ణాభరణం.... వ్రేలాడే జుంకీలు ధరిస్తారు .

.ఏడవది "హారం" మెడకి ధరించే బంగారు ఆభరణం ఇది . ఇది చాలా ప్రత్యేకంగా తయారుచేయించుకుంటారు .

 ఎనిమిది ..  గాజులు ..  మన సంప్రదాయంలో కుడి చేతికి 21 గాజులు,ఎడమ చేతికి 19 గాజులు ధరిస్తారు . వధువు ధరించే గాజులు రంగు రంగుల  మట్టి, మెటల్  గాజులతో పాటు బంగారు గాజులు తప్పనిసరిగా ధరిస్తారు .  " "చుడియాన్"  గా వ్యవహరించే  ఈ గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు .

తొమ్మిదవ  అలంకారం " బాజు బాండ్ "  అంటారు . మన వాళ్ళు  'అరవంకీ" అని అంటారు. లేదా "భుజ కీర్తులు" అని కూడా అంటారు .

పదవది..  అంగుళీయకాలు  లేదా  వేలి ఉంగరాలు .  విడి విడిగా అన్ని వ్రేళ్ళకి ధరించడం  లేదా  అన్ని వ్రేళ్ళకి ధరించిన ఉంగరాల నుండి గొలుసుల ద్వారా  ముంజేతి వరకు  సాగి బ్రాస్లెట్ లా అలంకరించుకునే ఆభరణం .. దీనిని "అరసి" గా వ్యవహరిస్తారు .

పదకొండు  మెహందీ ..  ఎండిన గోరింట పొడిలో   నిమ్మ పులుసుని  చేర్చి వధువు కాళ్ళకి, చేతులకి చక్కని డిజైన్స్ తో  గోరింటని ఎర్రగా పూయిస్తారు.  ఈ అలంకరణ పూర్తయిన తర్వాతనే మిగతా అలంకరణ చేస్తారు . మన ప్రాంతంలో   అదివరకు   పారాణి  పెట్టి వారు. ఇప్పుడంతా మెహందీ డిజైన్స్ సాధారణం అయిపోయింది  .

పన్నెండవది.. నడుమకి ధరించే ఆభరణం .. "వడ్డాణం"

.పదమూదవది. కేశాలంకరణ.    అభ్యంగ స్నానంచేయించి  సాంబ్రాణి తో ఆరబెట్టి  వింత పరిమాళాలని వెదజల్లే కేశాలని అందంగా ముడి గా అమర్చి  ఆ ముడిని పూలతోను, ఆభరణాలతోనూ అలంకరింపజేస్తారు. మన ప్రాంతంలో "పూల జడ " చాలా ఫేమస్ . ఇప్పుడు ముత్యాల జడలు , బంగారు జడలు కూడా చోటు చేసుకుంటున్నాయి .

 పద్నాలుగవది .. కాళ్ళకి ధరించే కడియాలు , లేదా "పాయల్ " మువ్వల పట్టీలు . వధువు నడుస్తున్నప్పుడు చిరు ధ్వనులు చేస్తూ శుభసూచకంగా నిలుస్తాయి.

పదిహేనవది   తాంబూల సేవనం చేసి .. పరిమళద్రవ్యంని జల్లుకుని సువాసనలు చిందిస్తూ ఉంటారు .

పదహారవది ... వివాహానికి ముందు  బుగ్గన చుక్క  వివాహం తర్వాత సిందూర్, మట్టెలు  ధరించడం .ఆనవాయితీ

ఈ పదహారు అలంకరణలు (సోలః సింగార్ ) చేసుకున్న మన భారతీయ స్త్రీ  సౌభాగ్యవతిగా, ఇంటికి దీపంలా కళ కళ లాడుతూ ఉంటారు .



ఇదండీ .. సోలః  సింగార్ . కొన్ని తెలిసిన సంగతులు ,కొన్ని తెలియని సంగతులు ఆసక్తిగా తెలుసుకుని ఇలా ఒక పోస్ట్ వ్రాసేశాను . :)



22, అక్టోబర్ 2013, మంగళవారం

చలం "ఊర్వశి "



వెళితే వెయ్యేళ్ళు  వెదుకుతావ్ ! చలం ఊర్వశి  పురూరవుడితో అన్న మాటలివి . ఒక స్త్రీ పురుషుడితో అన్న ఈ మాటలు బాగా నచ్చాయి

"పురూరవ" చలం విరచిత రేడియో నాటకం  వింటున్న ప్రతిసారి ఏవో కొత్త అర్ధాలు స్పురిస్తాయి. చలం రచనలు కూడా అంతే! పాఠకులు  వారి రచనలు పరిచయం లేకున్నా సరే ...  ఆయనేదో విచ్చలవిడి శృంగారం  గురించి వ్రాసాడట . ఆ పుస్తకాలు చదవడం దండగ అనేమాట ఎక్కువ వింటాం .

అసలు చలం రచనలు అందరూ చదవతగినవి కాదా ? అనే అనుమానంతోనే చదవడం ప్రారంభించి .. కొంత విసుగు తోచి అక్కడ పడేయడం మళ్ళీ చదవాలనిపించడం చదివినదే చదువుతూ ఆలోచించడం మొదలెడతాం .

మిగతా రచనల గురించి ప్రక్కన పెడితే  పురూరవ  గురించి నేను చదివి, విని  తెలుసుకున్న దానికన్నా .. నాకు  చలం   విరచిత "పురూరవ ' బాగా   నచ్చింది . పురూరవ ని నవలా రూపంలో చదవలేదు,. రేడియో నాటకం వినడం మాత్రమే  జరిగింది.



 చంద్రవంశం లో ప్రసిద్దుడైన పురూరవ చక్రవర్తి గురించి ఇంద్ర లోకంలో చెప్పుకోవడం విన్న ఊర్వశి  అతనిపై మోహం పెంచుకుని అతనిని తలపులలో నింపుకుని నాట్యం సరిగా చేయని కారణంగా గురువు భరతముని చేత శపిం పబడి   పురూరవుడిని వెదుక్కుంటూ మనుష్య లోకంకి  వస్తుంది.  ఈ రేడియో నాటకం ఇక్కడ నుండి ప్రారంభం అవుతుంది.

. పురూరవుడిని దగ్గరికి వెళ్లి  బిడియం లేకుండా తన ప్రేమని తెలియజేస్తుంది . అతని  తిరస్కారానికి గురయి  వెళ్ళిపోతుంది . వెళ్ళిన ఆమె కోసం వనమంతా , గుహ గుహ వెదుకుతాడు. ఆమెని కాంచి సంతోషపడతాడు

 "నీ అవసరాన్ని నీకు గుర్తించేటట్టు  చేసేందుకు...  నేను వెళ్ళిపోయాను    ".నువ్వెవరో నీకు తెలిపేందుకే వచ్చాను" అని

  "  స్త్రీ ముందు మోకరించటం నేర్చుకొని  నువ్వు ఏం  తెలుసుకున్నావ్ ? ఏం జీవించావ్ ? ఎంత అల్పుడివి నువ్వు " అంటుంది

ప్రేమంటే నీం తెలుసు    . నీ దృష్టి . విశాలం కాకుండా ఉంటుందా ?నిజంగా ప్రేమిస్తే....  

బలీయమైన , అజేయమైన ప్రేమ బంధం వల్ల  కాకపొతే  ఎందుకు నిన్ను వరిస్తాను ... అంటుంది పురూరువుడితో

ఎప్పటికి  గ్రహించవలసింది ... ఇంకొకరు చెప్పడం వల్ల ఎన్నడూ అర్ధం కాదు, క్రమంగా కాలంలో సొంత  అనుభవం  బోధించాల్సిందే ! మాటలతో నేర్చుకునే విషయాలు  చాలా అల్పం . ఎదుగు  విశాలంగా.. తెలుస్తాయి .  .
 తెలియడమంటే అర్ధం  ఏమిటి ?  అనుభవించే అర్హత కలగటం   అనుభవంతో తప్ప వికాసం  లేదని సూత్రమే  లేకుంటే  ఈ ప్రపంచమే అనవసరం ఆ అనుభవాన్వేషనే   మీ లోకంలో ఖేదానికి అసలు కారణం అంటూ అసలు నిజం బోధిస్తుంది

 స్వేచ్చా ప్రణయం గురించి, ఆనందం గురించి, స్త్రీ లాలిత్యం గురించి  ఇలా ఎన్నో విషయాలని పురూరవుడికి బోధిస్తుంది.    పురూరవుడి కోరిక మీదట అతనితో కలిసి రాజ్యానికి వచ్చి అతనితో కలసి  జీవిస్తూ తన ఆజ్ఞ కి బందీని చేస్తుంది  పురూరవుడు   భార్యని పోగొట్టుకుని ,రాజ్యాన్ని తనయులకి అప్పగించి  ఆమెతో కలసి వనాలకి వెళ్లి  తన్మయత్వంతో  మునిగిపోయి .. ఇరువురు  ఆత్మ సంయోగం ని అనుభవించాక .. ఊర్వశి  ఆజ్ఞా ని ధిక్కరించి వెళ్ళిన పురూరవుడికి  తనవేరో చెప్పి   ఆతనిని వీడి  ఈ లోకం నుండి నిష్క్రమిస్తుంది.

ఈ రచన చాలా చాలా నచ్చింది . ఊర్వశి  పాత్ర ని మలచిన తీరు  చాలా నచ్చింది .

పురుషుడు యుద్దంలో చూపే నేర్పు , రౌద్రం , శౌర్యం యుద్ధం చేయనప్పుడు కూడా కనబడకపోతే అవన్నీ నీలో చాలా అల్పం అన్నమాట . లేదా నేను చాలా అందురాలిని అన్నమాట ..

ఈ హర్మ్యాలు ,ఈ వనాలు వీటిని నిర్మించిన నీ  సౌందర్య భావం, ఐశ్వర్య వైభవం నీలో కాక వాటిల్లో కనబడితే నిన్నెవరు ప్రేమిస్తారు ?  తమ భర్తలలో ఈ విశాలత్వం ,దర్పం, ఘనత కనబడకనే స్త్రీలు భర్తలని కాక వారి ఐశ్వర్యాలని, వారి కీర్తి ప్రతిష్టలని  ప్రేమిస్తారు అన్న నిజం చెపుతూనే .. కార్య శూరత్వం  మనిషికి నైతికాభి వృద్దిని ఇవ్వాలి అప్పుడే నీవు జయించిన చక్రవర్తుల కిరీట మణులు నీ కళ్ళల్లో  మెరుస్తాయి..  అని ధర్మబోధ చేస్తుంది .

స్త్రీలు అనవసరమైన బేల తనం ప్రదర్శించి మగవాడిని బందీని చేయడం కన్నా ఆత్మాభిమానం ,జ్ఞానం కల్గి ఉండటమే గౌరవం కల్గి ఉంటుందని చెప్పడానికి ..ఇలా అంటుంది ..  

 " స్త్రీలలో వుండే హాని లేని నటనలు, గౌరవించడాలు, చనువులు,వగలు, ప్రణయ కోపాలు ఇవన్నీ నాకు తెలియక కాదు; ఇన్నేళ్ళూ వాటిననుభవించి అంతకన్నా గౌరవమైన ఉజ్జ్వలమైన ప్రేమకి అర్హుడివైనందునే నా స్నేహార్హత కలిగింది నీకు. నిన్ను లాలించడానికి కాదు; నిన్ను కాల్చి, కరిగించి, శుభ్రపరచి దేవత్వాన్ని ఇవ్వడానికి శపించారెవరో నన్ను"  - అని చెపుతుంది 

ఇక చలం రచనలలో కనబడే కవిత్వానికి ఇది ఒక మచ్చు తునక .. 

ఎంతకూ రాని కాంతి కై మౌనంగా పూరెక్కలమీద కన్నీరు కార్చే రాత్రి వలె నా విరహంలో నేనే అణగి పోతాను. 
_ అంటుంది  ఊర్వశి.

ఎన్నో సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వింటూ క్రొత్త అర్ధాలు ఏవో స్పురింపజేస్తూ ఉండే ఈ నాటకం మీరూ వినండి . 
 విని ..  ఊర్వశి  పాత్ర ద్వారా స్త్రీ అంతరంగాన్ని ఉన్నతంగా చెప్పిన చలం గారి పై విపరీతమైన అభిమానం పుట్టుకొస్తుంది .

జీవితానుభావం అనంతం , నిరంతర సుందర ప్రయాణం , ఎప్పుడూ చివరనేది లేని ఆనంద అనుభం .. పురూరవ  పాత్ర ద్వారా చెప్పించిన .. ఆ మాటలు  నిజంగా ఎవరికీ వారు అనుభవ పూర్వకంగా  తెలుసుకోవలసినవే!

(ఈ పోస్ట్ లో చిత్రం గూగుల్  సేకరణ  రాజా రవివర్మ చిత్రం ఇది )

21, అక్టోబర్ 2013, సోమవారం

పరువు హత్యలు

హాయ్ ఫ్రెండ్స్ .. బావున్నారా? 

వ్రాయడానికి బద్ధకం ఎక్కువైంది . వ్రాసేందుకు విషయాలు అయితే చాలానే ఉన్నాయి.  ఈ మధ్య కాస్త మిత్రులతో కాలక్షేపం  ఎక్కువైంది . అనేక మంది అనుభవాలు విన్నాను .

బాగా కదిలించిన ఒక సంఘటన .కరీంనగర్ ప్రాంతంలో జరిగిందని విన్నాను.

వేర్వేరు కులాలకి సంబంధించిన యువతీ యువకుల ప్రేమని ఆమోదించని పెద్దల దురహంకారాన్ని ప్రదర్శించి వారిని గదులలో పెట్టి హింసకి గురిచేసారట. అవకాశం దొరికే దాకా వేచి చూసి పెద్దలని  ధిక్కరించి  పెళ్లి చేసుకుని అదే వూరి మధ్యలోఇరువురు కలసి విషం  త్రాగి  చావు కూడా వారిని విడదీయలేదని  చెపుతున్నట్లుగా   ఆత్మ హత్య చేసుకుని మరణించారు .

ఆ తర్వాత ఆ పెద్దలు వారిరువురి కాయాలకి కలిపి చితినంటించి తర్వాత వారి జ్ఞాపకారం సమాధులని కట్టి సంతాప సభ ఏర్పాటు జేసి విందు భోజనాలు పెట్టి వీలైనంత కన్నీరు కార్చారట. ఇలా ప్రేమికులు మరణించకుండా ఉండాలంటే అసలు ప్రేమ జోలికి పోకూడదు అని తీర్మానించి .. ఆ వూరి మధ్యలో రచ్చబండ దగ్గర , వీధుల్లో  అక్కడక్కడా " ప్రేమిస్తే ప్రాణాలు తీస్తాం, జాగ్రత్త " బోర్డులు పెట్టారంట .  

ఈ విషయం వింటే అసహ్యం వేసింది . బిడ్డల పట్ల తల్లి దండ్రులు  వ్యవహరించే తీరులో నియంతృత్వం కనబడుతుంది . యుక్త వయసులో ఉన్న బిడ్డల ప్రేమలు పెళ్ళిళ్ళు పట్ల వారికి విముఖత ఉండటం సహజమే ! కానీ సున్నితంగా వ్యవహరించాల్సిన ఇలాంటి విషయాలలో మూర్ఖంగా వ్యవహరించి  వారిని నియంత్రించాలని అనుకోవడంతో యువతీ యువకులు ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు . ఇలా వెళ్ళే వారిలో మైనర్ బాలికలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది . వారిని ఇంటికి  తీసుకు వచ్చి పరువు  పోయిందన్న కారణంతో వారిని హత్య చేయడానికి కూడా  తల్లిదండ్రులు వెనుకాడటం లేదు. పరువు హత్యలు పేరిట చేస్తున్న హత్యలలో ఉన్న పరువు ఏ  పాటిదో  అర్ధం చేసుకోవడం కష్టంగా ఉంది .

పుట్టుక  మరణం మధ్య   మిగిలిన ముప్పాతిక జీవితం ఎలా గడపాలో అన్న నిర్ణయం తమంతట తాము తీసుకుంటే .. పెద్దలు ఎలా నిరంకుశంగా వ్యవహరిస్తారో తెలుసుకుంటూ కూడా ప్రేమ అనే ఊబిలో పడి పెద్దల చేతిలో పరువు హత్యల కి గురవడం ఉత్తరాది రాష్ట్రాలలోనే కాదు  .. మన రాష్ట్రం లోను మొదలయ్యాయి .

"చందు" అనే తమ్ముడు ఈ విషయం చెప్పాక .. " ప్రేమిస్తే ప్రాణాలు తీస్తాం, జాగ్రత్త " ఇలాంటి సన్నివేశం  మన తెలుగు సినిమాలలో ఇంకా కనబడలేదు .. ఎందుకని ? అని అడిగాను .

  ఎప్పుడో వచ్చే ఉంటాయి మనం చూడలేదు అంతే! అని .. "అక్కా .. ఈ విషయం నీ బ్లాగ్ లో వ్రాయి . సినిమాలలో కన్నా బయట ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి .  పెద్దవాళ్ళు మారరా? ప్రేమించుకున్నవాళ్ళు చావాల్సిందేనా ? అని బేతాళ ప్రశ్న  వేసాడు .  :)