7, డిసెంబర్ 2010, మంగళవారం

అమ్మ మనసులో మాట




అమ్మ మనసులో మాట -వనజ తాతినేని 

గది గోడల నిండా డెస్క్ టాప్ పైనా 
మొబైల్ స్క్రీన్ మీదా
అన్నింటా నీ చిత్తరువులే
నువ్వు దూరంగా ఉన్న విషయాన్ని
అనుక్షణం  గుర్తుచేస్తూ..


ఘడియ ఘడియకు 
నీ స్నేహితుల రాక పోకలతో
సందడిగా ఉండే మన వీధి
గంటకొకసారి హడావుడి చేసే నీ బండి సడి
హోరెత్తించే సంగీతపు అలజడి
ఇవ్వన్ని లేని ఇల్లంతా నిశ్శబ్దంతో మూగబోయింది
నన్ను అకస్మాత్తుగా మూగదాన్ని చేసింది.

చిందరవందరగా ఉండే గది 
ఇప్పుడద్దంలా మెరుస్తూ
నాకు బోలెడంత తీరిక ఇచ్చింది
ఎప్పుడూ నీకిష్టమైన వంటలే చేస్తూ
విసుక్కునే నాకు  ఖాళీగా ఉన్నవంటపాత్రలే తోడిప్పుడు
నా మనసుని ఆవరించిన శూన్యం  
దిగులుతో బరువెక్కిన జ్ఞాపకాన్ని వెక్కిరిస్తుంది

ఎక్కడ అమ్మా అన్న పిలుపు విన్నా
ఒక్కసారిగా పేగు కదిలినట్లు ఉంటుంది
అమ్మా! అని నువ్వు మార్దవంగా పిలిచినట్లే ఉంటుంది

ఇన్నాళ్లూ నా రెక్కల క్రిందనే పొదువుకుని
ఇప్పుడు రెక్కలు ఇచ్చి ఖండాంతరాలు  దాటించాక
ఎన్ని మెయిళ్ళు ఎన్ని sms లు నిరంతరం ప్రవహించినా
మన మధ్య ఉన్న దూరాన్ని నాటికల్ మైళ్ళ దూరంలో
కొలిచినంత తేలికగా చెప్పలేను కన్నా!
దృశ్య శ్రవణ పరికరాలకి లింకు
ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూస్తూ ఉంటాను

మూసపోతల విద్యాభ్యాసంతో విసిగి 
ఉద్యోగ అన్వేషణలోవేసారిన 
నీవు మనఃస్పూర్తి గానూ  వెళ్ళలేదు 
నేను ధనస్పూర్తితో పంపనూ లేదు
నేటి యువతకిది జీవిత లక్ష్యం
వస్తుందా ఎప్పటికైనా  ఒక నవీన మార్గం

మీ ఆలోచనలు కొత్త పుంతలు త్రొక్కి
శ్రమని మారకపు విలువతో లెక్కించి
మేధోసంపత్తి తరలి వెళుతుంటే 
అడ్డుకోలేని మరబొమ్మలం
వీర శివాజీలని పెంచి ఇవ్వలేకపోయిన అమ్మలం.

కడఊపిరి విడిచేవరకు 
కంటి పాపను కనురెప్పకాపాడినట్లు
బిడ్డకు అండ కావాలనే ఈ అమ్మ ఆశ
ఎందరో బిడ్డలకి దూరంగా ఉండాల్సి వచ్చిన
అమ్మలందరి మనసులో ఓమాట    

1, డిసెంబర్ 2010, బుధవారం

ఏవేవో కలలు కన్నాను

Posted by Picasa

కలలు   కనడం   అందరి  హక్కు... 
మధురమైన కలలు కనడం ఆ కలలు నిజం  అయ్యేవరకు శ్రమపడటంలో ఎంత ఆనందం ఉంటుందో .. అది  అనుభవంలోకి  వస్తే కానీ చెప్పలేము.

నాకు ఈ పాటంటే  చాలా చాలా ఇష్టం  ఎంత ఇష్టమంటే చెప్పాలంటే మాటలు చాలవు. ఆకాశమంత  అంటే.. కోతలు కోస్తున్నాను అనుకుంటారేమో! నిజం .. అంత ఇష్టం.

 ఈ పాట “జ్వాల” చిత్రం లో వుంది. కధానాయిక  “రాధిక”  పై చిత్రీకరించారు. ఈ చిత్రంలో ఆమె జీవితం ఓ విషాద సంచిక 

కానీ.. ఈ పాటలో భావం  గాలివాటు బతుకులో ఎదురొచ్చిన ఆపదల్లో ఆదుకుని  ఆమెకు క్రొత్త జీవితాన్ని  అందిస్తే ఆ పేద  మనసు.. అతనిలో కలసి కరిగేందుకు  కలలు కంటూ ఆ ఆశ తోనే జీవించడం ఏ మనిషికైనా  ఎంత మధురమో ఆమె మనసు  విప్పి  చెపుతుంది.

ఆ పేద మనసు ఏ కాన్కలు ఇవ్వలేనంటూ  నీకు నేను బానిసై.. నాకు నువ్వు బాసటై  సాగిపోయే వరం చాలంటుంది..

కలకూజితుం  “ఎస్ .జానకి” గళ మాధుర్యం “ఇళయరాజా”  సంగీతం ఈ పాటకి  వన్నె తెచ్చాయి.. 

పదకర్త .. మైలవరపు గోపి. ఎన్నో మంచి పాటలు వ్రాసారు ఆయన. మరిన్ని పాటలు మరలా పరిచయం చేస్తానులెండి.  
“అబ్బ!ఎంత మంచి  రైటర్ ఈయన” అని అంటారు చూడండి.

   70 లలో, 80 లలో  90 లలో ఎన్నో మంచి పాటలు ఉన్నాయి.. పంచుకునేందుకు ఎవరైనా ఉంటే  తిండి.. నిద్ర .. మానేసి మరీ  చెపుతాను. అన్నట్లు నేను నిద్ర తర్వాత పాటలు వినడంలోనే  ఎక్కువ  సమయం గడచిపోతుంది మరి.

ఈ పాట  సాహిత్యం ..  

ఏవేవో కలలు కన్నాను మదిలో
మౌన వేణువై విరహ వీణ నై
స్వామీ గుడికి చేరు వేళలో ..
ఏవేవో కలలు కన్నాను మదిలో

సుడి  గాలులతో వెలిగే దీపం ఈ కోవెలలో ఎటు చేరినదో
ఏ జన్మలోని బంధమో ఇదే రుణానుబంధమో (2)
 నీకునేను  బానిసై నాకు నువ్వు బాసటై
సాగిపోవు వరముగా
ఏవేవో కలలు కన్నాను మదిలో

 నా.. కన్నులలో  వెలుగై నిలిచి సిరి వెన్నెలగా బ్రతుకే మలిచి 
నిట్టూర్పు  గొన్న  గుండెకి  ఓదార్పు చూపినావు రా..
నాది పేద మనసురా.. కాన్కలీయలేనురా..
కనుల నీరే కాన్చరా.. 

ఎంత  బాగుంటుందో..   కలలాగా..  విషాదం కదా .?.

అందులోనూ ఆనందమే నాకు. ఈ లింక్ లో  ఏవేవో కలలు కన్నాను   మీరు వినండి.

నీవు వచ్చే చోట

Posted by Picasa నాకు చాలా ఇష్టమైన పాట  మల్లెపువ్వు .. చిత్రంలో.. వాణిజయరాం .. ఆలపించిన పాట.
నువ్వు వస్తావని  బృందావని .. ఆశగా చూసేనయ్యా.. కృష్ణయ్యా.. అనే పాట.

ఆ పాటని ఆ చిత్రంలో .. పండరీబాయి.. పై .. చిత్రీకరించారు.. కథానుగుణంగా... చిత్ర నాయిక .. నాయకుడిపై.. ఆరాధన భావం  పెంచుకుని అతని  దరి చేరాలని  ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఈ పాటని  ఆరుద్ర గారు రచించారు..

ఎంతో  ఘాడమైన  భావనతో .. మధుర భక్తితో.. మమేకమై .. ఆద్యంతం గొప్ప అనుభూతిని  అందించే పాట.

"నీవు వచ్చే చోట, నీవు నడిచే బాట  మమతల దీపాలు వెలిగించాను.
కుశలం అడగాలని.. పదములు కడగాలని ..
కన్నీటి కెరటాలు  తరలించాను... నీ పద   రేణువు నైనా .. పెదవుల వేణువు నైనా .. బ్రతుకే  ధన్యమని భావించాను
నిన్నే చేరాలని .. నీలో కరగాలని .. నా మనసే  హారతిగా.. వెలిగించాను .. "

ఎంత ఘాడత .. ఎంత స్వచ్చత..  ఈ మంచి పాటకి.. చక్రవర్తి గారు స్వరాలు.. అందించారు.

ఈ మల్లెపువ్వు  సినిమా .. నేను చాలా చిన్నప్పుడు చూసాను. ఈ సినిమా  చూసి శోభన్ బాబు  గారి తల్లి బాగా ఏడిచారట... మా వూరిలో చెప్పుకునే విషయం ఇది. శోభన్ బాబు గారి మూలాలు మావూరివే మరి.

ప్రతి రోజు నేను విని పరవశించి .. వనమాలికి అన్వనయించుకుని.. మధుర భక్తిలో తెలియడుతుంటాను.

రేడియోలో  మరీ మరి .. కోరి నేను వింటూ.. ఇతరులకి  విసుగు కల్గిస్తాను  కూడా.. ఇంత మంచి పాటని మీరు వీలైనప్పుడు   వినండోయ్..  వింటారు కదా ... !

నువ్వువస్తావని .. పాట   ఇదిగో.... వినేసేయండి.