7, జనవరి 2012, శనివారం

ఎవ్వరికీ చెప్పకే

ఎవ్వరికీ చెప్పకే.. అంటే నేను ఊరుకుంటానా? చెయ్యవద్దనే పనే చేస్తాను.

చిన్నప్పుడు నుంచి అంతే..అని మా అమ్మ అనేది. చెయ్యవద్దు అంటే ఆ పనే చేస్తావు.. ఎందుకే ? అనేది.

ఆ పని ఎందుకు చేయకూడదో..నువ్వు చెప్పలేదు కదా అమ్మా!.. అందుకే చేస్తే ఏమవుతుందో..తెలుసుకుందామని చేసాను అనేదాన్ని నిర్భయంగా.. అందుకే అసలు నా దగ్గర ఆ మాట రాకుండా జాగ్రత్తపడటం.. వీలయితే ఏ పని అయినా ఎందుకు చేయకూడదో.. వివరించి చెప్పడం చేసేది..మా అమ్మ.

ఎవరు ఏం చెప్పినా  నమ్మకంగా విన్నట్టే ఉంటుంది. కానీ..ఆఖరికి  తను చేయాలనుకున్నదే చేస్తుంది..అని మా అన్నయ్య   నా గురించి నొక్కి వక్కాణించే మాటలు అన్నమాట.

అలా బాల్యం నుండే..నేనో మొండి ఘటం ని.

ఒక సారి ఏం జరిగింది అంటే..  నేను సెవెంత్ క్లాస్స్ చదువుతూ ఉన్నప్పుడు అన్నమాట. మార్చి నెల ఆఖరు రోజులు.  ఒంటి పూట బడులు. ఉదయ్యాన్నే పెరుగన్నం తినేసి కేరేజీ తీసుకు వెళ్ళకుండా.. ఇంటికి వచ్చి.. ఆవురావురుమంటూ.. అమ్మ కలిపి పెడుతున్న  అన్నం ముద్దలుని  గబా గబా  తినేసి..  ఎక్కడ పడితే అక్కడ ఆ పటినే పడి నిద్రపోయే రోజులు.ఈ కాలంతో పోల్చుకుంటే.. చాలా అమాయకమైన కాలం అది.

రోజూ  మైలవరం బడికి రిక్షాలో వెడుతూ.. వెడుతూ..రిక్షాలోనుంచి హటాత్తుగా దూకేసి  వెళ్ళేదారిలో ఉన్న చింత   చెట్లు క్రింద  పడిన  చింతకాయలు ఏరుకుని.. లేదా..రాలిన మామిడి పిందెలు ఏరుకుని.పరిగెత్తుకుంటూ..ఆపకుండా వెళ్ళిపోతున్న రిక్షాని క్యాచ్ చేసి.. అందులో ఎక్కడం.. భలే థ్రిల్లింగ్ రోజులు అవి.

 "మా రిక్షా చిన్న" రిక్షా ఆపమంటే ఆపే వాడే  కాదు.అందుకే.. మేమే   రిక్షా ఎక్కే టప్పుడే   గుస గుసలాడుకుని ఎవరు  ఎక్కడ దిగి ఏమేమి సేకరించుకుని రిక్షా ఎక్కాలో ప్లాన్ చేసుకునేవారం. ఆ ప్లాను ప్రకారం చేసేవాళ్ళం. నేను  రోజూ  అల్లాగే చేస్తున్నాని మా రిక్షాలో ఒక ఇద్దరు..వాళ్ళు ముందు కూర్చునేవారు నా మీద ఉక్రోషంతో..  నేను రిక్షాలోనుంచి దూకి చెట్ల క్రిందకి పరుగులు తీయగానే.. మా చిన్నతో పాటు పెడల్స్ మీద కాళ్ళువేసి రిక్షా త్రొక్కుతూ. స్పీడ్ గా  పరుగులు తీయిన్చేవారు.అయినా నేను లెక్క చేసేదాన్నే కాదు.నాకు కావాల్సినవి నేను సేకరించుకున్నాకే .. వెళ్ళేదాన్ని. రిక్షాని క్యాచ్ చేసి.. గొప్పగా ఓ..లుక్ ఇచ్చేదాన్ని.    లేకుండా ఏరుకుని వచ్చిన కాయా గట్రా వాళ్లకు ఇచ్చేదాన్ని కూడా..

ఇలా రోజు రిక్షా దూకేసి చెట్ల వెంట   పడుతున్నానని.. మా రిక్షా చిన్న నన్ను మద్యలో..కూర్చేపెట్టి..దిగనీయ కుండా కట్టడి చేసే వాడు...నన్ను అలా బలవంతంగా ఉంచడం నచ్చేది కాదు.

ఒక రోజు నా చూపు.. మా వూరి రోడ్డు నుండి ప్రక్కగా చీలుతూ..ఓ..ఎడ్ల బండి వెళ్ళేంత దారి కనబడింది. ఈ దారి ఎక్కడికి వెళుతుంది..చిన్నా..అడిగాను ఆసక్తిగా..

ఈ  బండ్ల దారి దారి మైలారం  చిన్న చెరువు కట్ట మీదకు వెళుతుంది. ఎనకటి   రోజుల్లో..అందరు ఈ దారి గుండానే వెళ్ళేవారు.ఇప్పుడు రోడ్డు పడినాక అందరు రోడ్డు దారిన  వెళుతున్నారు అని చెప్పాడు.

ఒకసారి అటునుండి వెళదామా..ఆ దారి చూద్దాం . అని .అడిగాను ఉత్సాహంగా.

ఆ డొంక అంత  బాగుండదు..అంతా ముళ్ళే ఉంటాయి..రిక్షా టైర్లు పంచర్ పడతాయి వెళ్ళడం కుదరదు..అన్నాడు.  

మనసులో నిరుత్సాహం. ఏం చేయాలి..?ఒకటే  ఆలోచనలు.

మా క్లాస్స్ లో యేసు కుమారి అని ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మ-నాన్న అన్నలు అందరు మా పొలాల్లో పని చేసే వాళ్ళు. ఆ అమ్మాయి   రోజు..పాపం ఆరు కిలోమీటర్లు నడచి స్కూల్కి  వచ్చేది. వాళ్ళు మా వూరి మొదట్లో ఉన్న హరిజనవాడలో ఉండేవారు. ఆ అమ్మాయి తో నాకు బాగా దోస్తీనే! మళ్లి బయట ఎక్కడ  మాట్లాడేది కాదు. మధ్యానం అన్నం తినే సమయంలో కూడా కలసి కూర్చుని  అన్నం తిందాం రమ్మంటే..వచ్చేది కాదు. వాళ్ళ ఇంట్లో పెద్ద వాళ్ళు మా ప్రక్కన కూర్చోవద్దని చెప్పే వాళ్ళని  ఆమె  చెప్పేది.

నా తోటి పిల్లలేమో..ఎందుకు ఆ అమ్మాయిని పిలుస్తావు..? వాళ్ళతో..మనం కూర్చోకూడదు. మనం కమ్మవారిమి కదా..అనే వారు. ఎందుకో   ఈ తేడా   నాకు అర్ధమయ్యేది కాదు.

 యేసు కుమారి వాళ్ళ నాన్న మా తాతయ్య,నాన్న వాళ్ళ ముందు..భుజం మీద తుండు తీసి చేతిలో పట్టుకుని.. చెప్పులు చేతిలో పట్టుకుని.. నుంచునే వారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంటికి పని చేయడానికి వస్తే దాహం వేస్తె..నీళ్ళు ఇస్తే.. దోసిలి నోటిదగ్గర పెట్టుకుని..ఆ దోసిలిలో నీళ్ళు పోసుకుని తాగేవారు. అలాగే అన్నం కూడా.. విస్తరాకులోనో.. గుడ్డ ముక్కలోనో పెట్టుకుని..ముద్దలు చేసుకుని ఎడమ చేతిలో పెట్టుకుని తినే వారు. వాళ్ళ ప్రతి పని నాకు ఆశ్చర్యంగా ఉండేది.      

ఇక  ఆ రోజు ఇంటర్వెల్ లో ఆ అమ్మాయిని అడిగాను.. మన రోడ్డు ప్రక్క నుండి  నుండి సారవ వైపు పొలాల్లోనుండి.  ఓ..డొంక దారి ఉందన్టగా నీకు తెలుసా..అని.

 అందుకు ఆ అమ్మాయి  ఓ..ఆ దారి నాకు తెలుసు.. అప్పుడప్పుడు..ఎక్కువ మంది ఉంటే అటువైపు నుండే నడుచుకుంటూ వస్తాం.  ఆదారి యెంత బాగుంటుందో తెలుసా.. మెత్తటి ఇసుక ..దారి అమ్మట అంతా చిట్టి ఈతకాయ చెట్లు... గచ్చకాయల చెట్లు.. గురివింద గింజల చెట్లు.. ఇక మామిడికాయలు కూడా తెగ కోసుకోవచ్చు.. ఎవరు ఉండరు అని చెప్పింది.

అయితే ఆ దారిలో నన్ను తీసుకు వెళతావా..అని అడిగాను.

అమ్మో.. మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు.. నేను రానండి..అంది.

ఏం చేయాలబ్బా.. ! ఈ అమ్మాయి రానంటుంది. నాతో  రిక్షాలో వచ్చే ఎవరు రారు. మా అన్నయ్యకి అసలే భయం. అటు వద్దమ్మా.. అంటాడు. పైగా అమ్మతో చెప్పినా చెపుతాడు.. అనుకున్నాను.  ఆలోచిస్తున్నాను.

స్కూల్  వదిలిన తర్వాత.. యేసు కుమారి వచ్చి నాతో చెప్పింది..నేను నిన్ను తీసుకు వెళతాను.. అంది అయితే ఎవరికి చెప్ప కూడదు అని ఒట్టు పెట్టిన్చుకుంది.  సరే రేపు మధ్యానం అటునుండి వెళదాం అని చెప్పాను.

మరి రిక్షాలో వెళ్ళకపోతే ఊరుకోరుగా.అని అడిగింది.

ఎలాగబ్బా.. మళ్ళీ ఆలోచన. రేపు చెపుతానులే..నీకు ఏ సంగతి..అని చెప్పాను.

ఇంటికి వచ్చి ఆ సంగతే ఆలోచించాను. ఒక ఆలోచన తట్టింది. సరే అదే అమలు చేయాలనుకుని గట్టిగా అనేసుకుని.. మెదలకుండా..ఊరుకున్నాను.

తెల్లవారి..స్కూల్ కి వెళ్ళామా.. మధ్యానం అయ్యిందా.. గబా గబా మా రిక్షా చిన్న దగ్గరికి వచ్చి.. "చిన్నా..నేను ఈ పూట రిక్షాలో రావడం లేదు. మా తెలుగు మాస్టారు.. పరీక్షలు దగ్గరకి వస్తున్నాయి అని ప్రేవేట్ క్లాస్స్ తీసుకుంటాను  అన్నారు అని చెప్పాను.

అంతలో..మా అన్నయ్య..అమ్మాయి! నీకు అన్నం ఎలా..ఆకలి అవుతుందిగా అని అడిగాడు. పర్వాలేదు..మా ఫ్రెండ్ తీసుకువస్తానని  వెళ్ళింది..నాలుగు గంటలకి చిన్న మళ్ళీ వస్తాడుగా..అప్పుడు వస్తాను అని చెప్పాను. అందరు నమ్మేశారు. పాపం ..మా అన్నయ్య.. నేను అన్నం తిననేమో అని దిగులు మొహం పెట్టాడు. నాకు వాడి మొహం చూస్తే,,బాధ వేసింది..కానీ ఆ డొంక దారి చూడాలి అన్న కృత నిశ్చయం ముందు.. అది కొట్టుకు   పోయింది.

సరే..ఇక  నేను చెప్పినది నిజం అనుకుని నమ్మేసి..రిక్షా ఎక్కి అందరు వెళ్ళిపోయారు. మళ్లీ స్కూల్ లోపలకి వెళ్లి.. యేసు కుమారి దగ్గరికి వెళ్లి ఇద్దరం కలసి పంపు కొట్టుకుని కడుపు నిండా మంచి నీళ్ళు తాగి.. ఎవరికి  కనబడకుండా.. స్కూల్ నుండి..బ్లాక్ ఆపీస్ క్వార్టర్స్ దారికి వెళ్లి అక్కడి నుండి..శివాలయం మీదగా.. మార్కెట్ దారి..రామాలయం మీదగా.. సాలీల బజారులోనుండి..కోనేటి కట్ట మీదకి  ఎక్కి.. దానికి ఆనుకుని చిన్న చెరువు కట్ట ఎక్కి..ఎలాగోలా  ఆ డొంక దారిలో పడ్డాం..

అమ్మయ్య ఎవరి కంటా పడలేదు మనం అనుకుని.. ఆడుతూ.. గంతులు వేస్తూ.. ఆ దారిన రావడం మొదలెట్టాం. మద్యలో..పిందెలు అయినా చిట్టి ఈతకాయలు కోసుకున్నాం. గచ్చ కాయలు ఇంకా పగలలేదు...చాలా సేపు వెదుక్కుని  పాత కాయలు..ఏరుకున్నాం. మామిడి కాయలని  కోసి తిన్నాం..ఇంకా చాలా కాయలు..స్కూల్ బేగ్ లో వేసుకున్నాం. ఇవి ఎక్కడవి అంటే.. ఇంట్లో ఏం చెప్పాలో..ఆలోచించుకున్నాను..   నిజంగా ఆ దారి చాలా బాగుంది. పాపం యేసు కుమారికి కాళ్ళు కాలుతున్నాయి. ఆ అమ్మాయికి చెప్పులు లేవు. కాసేపు నా చెప్పులు వేసుకో..అన్నాను...కానీ..ఆ అమ్మాయి వద్దు అంది.  నాకైతే ఆ అమ్మాయి మీద చాలా స్నేహం పుట్టుకు వచ్చింది. నా కోసం యెంత..ఇబ్బంది పడుతుంది..అనుకున్నాను. ఎప్పటికి ఈ అమ్మాయితో..స్నేహం చేయాలి అనుకున్నాను కూడా..

సగం దూరం వచ్చాక  భయం మొదలైంది. దారిలో.. సమాధులు కనబడ్డాయి.దూరంగా రోడ్డు మీద వెళుతున్న బస్ లు  ,లారీల శబ్దాలు తప్ప ఒక్కరు కూడా మనుషులు కనబడటం లేదు. దాహం వేస్తుంది.. ఎక్కడా నీళ్ళే కనబడలేదు. దారి ప్రక్కనే ఉన్న మూడు ముంతలాకుని కోసి.. చిట్టి ఈత   ఆకులో చుట్టి..  ఇది నమలి.. బుగ్గన పెట్టుకో..మంచి నీళ్ళు అవవు అని చెప్పింది.

 ప్రొద్దున ఎప్పుడో తిన్న అన్నమేమో..ఆకలి మొదలైంది.పైగా అలవాటులేని ఎండ..నడక. ఇక నా పని అయిపొయింది. తూనీగలా క్షణం కూడా కుదురు లేకుండా ఎగిరే నేను నేను నడవలేనంటూ..చతికిల బడ్డాను. ఆ అమ్మాయి నా కోసం కూర్చుంది.

అందుకేనండీ.. నేను వద్దన్నాను అంది. ఏం పరవాలేదులే..పద వెళదాం అని.. నడక   సాగించి..   ఎలా అయితేనేం ఊర్లో పడ్డాం.

ఊరు మొదట్లోనే..మా యేసు కుమారి వాళ్ళ ఇల్లు అని చెప్పాను కదా.. మా ఇంటికి వెళదాం రండి అని పిలిచింది. సరే..అని తనతో..వెళ్లాను.

మేము వెళ్ళేటప్పటికి..యేసు కుమారి వాళ్ళ అమ్మ నులక మంచం మీద పడుకుని ఉంది. నేను యేసు కుమారితో..వెళ్ళడం చూసి..గబుక్కున లేచి నిల్చుంది.

ఏమిటి చిన్న అమ్మాయిగారు..ఇలా వచ్చారు అడిగింది. ఏసుకుమారి డొంక దారిన పడి నడచి వచ్చిన సంగతి చెప్పేసింది.

అమ్మో!.. నోరు ఆరిపోయి పడిపోయి ఉంటే ఇంకేమైనా ఉందా? ఆ దారిన ఎవరు సరిగ్గా రారు కూడా. పొద్దుగూకే ఏలకి..ఏ తోట కాపలా వాళ్ళో వచ్చేదాకా అలాగే  పడి ఉంటే ఇంకేమైనా ఉందా.. అయినా అమ్మాయి గారు అడిగిందని నువ్వు తీసుకువత్తావా..? అని యేసుకుమారిని వాళ్ళమ్మ నాలుగు బాదేసింది.

కూర్చో అమ్మాయిగారు.. .అని మంచం చూపించి మర్యాద చేసింది. ముందు మంచి నీళ్ళు తాగు.. మంచి నీళ్ళ బావి నీళ్ళే అని ఇచ్చింది. (అప్పుడు ఊరందరికీ..మంచి నీళ్ళ బావి ఒకటే ఉండేది. కొంత మందిని అందులోనుండి నీరు  తోడనిచ్చే వాళ్ళు కాదు. వాళ్లకి..ఎవరన్న తోడి పోసి బిందెలు నింపితే.. ఇంటికి తెచ్చుకునే వారు . వాటిని భద్రంగా తాగేవాళ్ళని తర్వాత తెలిసింది.)

మంచి నీళ్ళు తాగి..కూర్చున్నాను. అమ్మాయి గారు..కాళ్ళు చేతులు కడుక్కోండి..ఒక ముద్ద తిని ఇంటికి  పోవచ్చు...అంది.

సరే ఏమా ఆకలిగా ఉంది..కదా..బుద్దిగా తల ఊపాను.. యేసు కుమారికి  సత్తు గిన్నెలో అన్నం పెటింది..నాకు ఇత్తడి పళ్ళెంలో అన్నం పెట్టింది.ఇత్తడి గ్లాసుతో.. మంచి నీళ్ళు పెట్టింది. ఈ తేడాలు చూస్తున్నాను. యేసు కుమారిని క్రిందనే కూర్చోమని గదమాయించింది వాళ్ళ అమ్మ.  నాకు ఇచ్చిన అన్నం పళ్ళెం వైపు చూసాను..తెల్లగా లేదు.. అయినా ఆకలి అవుతుంది కాబట్టి తలొంచుకుని గబాల్న తినేసాను. ఆకలి తీరింది. ఎండకి  తిరిగి అలసి పోయానేమో..నిద్ర ముంచుకొచ్చేసింది. అలాగే పడుకుని నిద్రపోయాను.

నాకు మెలుకువ  వచ్చే సరికి  ప్రొద్దు గూకుతుంది.నా వంక కంగారుగా చూస్తూ ఉన్న యేసు కుమారి వాళ్ళమ్మ.

అమ్మాయి గారు ప్రొద్దుగూకుతుంది.ఇంటికాడ అమ్మ గారు కంగారు పడతారమ్మా. యేసు వచ్చి ఇంటికాడకి పంపించి వస్తాది.. వెళ్ళండి అమ్మా..అంది.

ఇక పుస్తకాల బేగ్ భుజాన వేసుకుని నేను బయలు దేరాను. నా దగ్గర నుండి బేగ్ తీసుకుని యేసు కుమారికి ఇచ్చింది వాళ్ళమ్మ. అమ్మాయి గారు.. మా ఇంట్లో తిన్నానని ఇంటిదగ్గర చెప్పబాకండి అంది. నేను.. అర్ధం కాక..అలాగే చూసి ఆలోచించుకుంటూ ఇంటికి  వెళ్ళిపోయాను.

అమ్మ నా వెంట వచ్చిన ఏసుకుమారిని చూసి..   ఏంటి..ఈ పిల్ల వచ్చింది..చిన్నా నిన్ను రిక్షాలో ఎక్కించుకుని రాలేదా..అని అడిగింది.

చిన్నా ..రిక్షా నాకు కనబడలేదమ్మా..అందుకే.. వీళ్ళ  వెంట నడచి వచ్చేసా..అని యెంత బాగా అబద్దం చేప్పేసానో!

సరేలే.. వెళ్లి స్నానం చేయి అన్నం తిందువుగాని..అని నాకు చెప్పి.. ఉండవే.. ఇప్పుడే వస్తాను అని చెప్పి ఏసుకుమారికి ఇంట్లో చేసిన  బోలెడన్ని పప్పులు తెచ్చి ఇచ్చింది.

చీకటి పడుతుంది..తొందరాగా వెళ్ళు అని పంపించేసింది. మేము ఇద్దరం కళ్ళతో సంజ్ఞలు చేసి తెగ నవ్వుకున్నాం.

ఇక ఆ రాత్రికి.. నేను చేసిన గొప్ప  ఎడ్వంచర్ మా అన్నయ్యకి  చెప్పాలి అని ఒక    ప్రక్క, వద్దని ఒక ప్రక్క  మెదడు చెపుతూ ఉంది..ఎందు కంటే..మా అన్నయ్య ప్రతి విషయాన్ని అమ్మకి మోసేస్తాడు. అందుకే అన్నయ్య అంటే  అమ్మకి బోలెడు ప్రేమ కూడాను. ఏమైనా అన్నయ్యకి తెలియనివ్వకూడదు. మరి ఎవరికి చెప్పాలి. ?

 ఆ..తాతయ్యకి.. చెప్పాలి అని  అనుకుని ఆయన ప్రక్కన చేరి పోయి.. పూస గుచ్చినట్లు అన్ని చెప్పేశాను.

అప్పుడు తాతయ్య అన్ని విని..ఇప్పుడు కొంచెం జనం మారుతున్నారు..మా అప్పుడైతే.. ఇంకా చాలా ఇదిగా ఉండేది అని చెప్పి..కులాలు,వృత్తులు,పేద,గొప్ప తేడాలు అన్ని వివరంగా చెప్పారు. (అవన్నీ ఇంకొక పోస్ట్ లో వ్రాస్తాను)అన్నీ చెప్పాక.. వాళ్ళ ఇంట్లో..అన్నం తిన్నానని ఎవరికి చెప్పకే..!అన్నారు.

నేను బుద్దిగా తల ఊపేసి వచ్చి మెల్లగా వచ్చి నానమ్మ ప్రక్కన పడుకుని  నాన్నమ్మకి  చెప్పాను. ఆకలి అయినది తిన్నావు..అన్నానికి ఏం తప్పులే..!అయినా ఆడపిల్లలు అలా తిరగకూడదు.ఈ విషయాలన్నీ ఎవరి చెప్పకు అంది.

అలాగే అని తల ఊపి నేను వెంటనే వెళ్లి మా అమ్మకి చెప్పాను.

అమ్మ  ఏ కళన ఉందొ.. అందరూ మనుషులేలే! ఏమైంది..లే..అంది. అంతలోనే  కానీ ఎవరికి ఈ విషయం గొప్పగా చెప్పకు..అందరికి నచ్చవు అంది.  ఎవరికి  వాళ్ళు ఎవరికి చెప్పకే.! ఎవరికీ చెప్పకే...అంటారు..అసలు ఈ విషయం అంటూ  చెపితే ఏమవుతుందో..ఏమిటో..చూడాలనుకుని..

పోద్దుపోద్దున్నే లేస్తూనే..మా చిన్న నాయనమ్మ దగ్గరికి వెళ్లి ..నాయనమ్మా !నేను ఇలా ఏసుకుమారి వాళ్ళింటికి వెళ్లాను ..అని మొదలు పెట్టగానే..మా అమ్మ గబుక్కున పరిగెత్తుకు వచ్చి నా నోరు మూసేసింది. అప్పటికే నా నోటి నుండి..విషయం వెళ్ళిపోయి ఆమెకి అర్ధం అయి.. ఇక ఒకటే తిట్ల దండకం మొదలెట్టింది.

ఎదవ సంత..ఒక కులం లేదు..గోత్రం లేదు.. యజమాని నౌకరు తేడాలేదు..అంతా భ్రష్టు పట్టిస్తున్నారు.పెద్దవాళ్ళకి చస్తేగా..!? పిల్లలకి రావడానికి. శుద్ధి  శుభ్రం లేని మంద అని ఒకటే..తిట్లు తో..గంటల తరబడి.. తూర్పారబట్టింది అంట. నేను బడికి వెళ్ళిపోయాను కాబట్టి బతికి పోయాను. లేకపొతే ..మా అమ్మ నన్ను  బాగా ఉతికి ఇస్త్రీ చేసేది అనుకున్నాను.

ఇక ఆ తర్వాత మా చిన్న   నాయనమ్మ నన్ను తన దరిదాపులకి రానిచ్చేదికాదు.దూరం దూరం అంటూ..ఒక కర్ర పట్టుకుని.. కొడతానని బెదిరిస్తూ.. ఉండేది. అప్పుడు తెలిసింది  కులాల పట్ల అంతస్తుల పట్ల మా ఇంట్లో వారికి..మా బంధువులకి ఉన్న తేడా..

నాకైతే..ఉక్రోషం ముంచుకొచ్చి..మరి జాన్ సుదర్శనం ని ఎందుకమ్మా కుర్చీ వేసి కూర్చోబెట్టి కాఫీ ఇస్తారు.వాళ్ళది హరిజనవాదేకడా.. యేసు కుమారి వాళ్ళకి చుట్టాలే కదా..! జాన్ సుదర్శనం   ప్రెసిడెంట్ అనా..లేక వాళ్ళ పిల్లలు అందరు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ..అమెరికా లాంటి దేశంలో ఉన్నారనా.?.అని అడిగేదాన్ని.

మా ఇళ్ళల్లో.. బలిపీఠం  సినిమా గురించి, మనుషులు మారాలి సినిమా గురించి బాగా వాదనలు జరిగేవి.మా అమ్మ పుస్తకాలు చదవడం,సినిమాలు చూడటం ,రేడియో వినడం మూలంగా చాలా విషయాలు.. బాగా వాదించేది.

నేను ఏసుకుమారితో  స్నేహంగా ఉండటం నేర్చుకున్నాను. అమ్మ పెట్టిన అప్పచ్చులు దాచుకుని మరీ ఆ అమ్మాయికి పెట్టేదాన్ని. తర్వాత పరీక్షలు   అయిపోయి సెలవలు ఇచ్చారు.

ఇక తర్వాత నేను ఎప్పుడు ఏసుకుమారి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు.ఏడవ తరగతి అయిపోయాక ఆ అమ్మాయి కనబడలేదు. ఆ అమ్మాయికి  పెళ్ళైపోయింది అని చెప్పారు.  తర్వాత ఆ అమ్మాయి నాకు ఎప్పుడు కనబడలేదు కూడా.. తరవాత మా వూరిలో చాలా మార్పులు వచ్చినా .. మా చిన్న నాయనమ్మ మాత్రం మారలేదు. ఎప్పుడు ఎవరినో ఒకరిని తిడుతూ.. ఒకకర్ర పట్టుకుని అందరిని దూరంగా జరగమని చూపుతూ..దారివెంట నడిచేది.

ఇప్పటికి నాకు..మా వూరి రోడ్డు..సారవ పొలాలు ప్రక్కన డొంక దారి  గుర్తుకువస్తే..ఏసుకుమారి,ఎవరికి చెప్పకే.విషయం  గుర్తుకు వస్తుంది..అప్రయత్నంగా..నవ్వు వచ్చేస్తుంది.

ఇక మా  ఇంట్లో  అయితే..నాకు . ఏది .చెప్పకూడదో ..ఎందుకు చెప్పాలో..  ఎందుకు చెప్ప కూడదో..అర్ధం కాక తలలు పట్టుకునేవారు.

అమ్మ అయితే..అసలు ఏం చెప్పేది కాదు. ముఖ్యంగా చేయవద్దని. అలా చెపితే.. చెయ్యవద్దనే పనే చేసేదాన్ని.

అందుకే.. ఏ పని అయినా చేయవద్దు అని చెప్పడం కన్నా.. చేస్తే..ఎలాటి ఇబ్బందులు పడతామో..చెప్పడం మొదలెట్టేసి.. నన్ను జ్ఞానవంతురాలిగా..పెంచే పని చేస్తుండేది అమ్మ.

 ఇలాటి విషయాలు..నా జ్ఞాపకాల   దొంతరలో..చాలా  ఉన్నాయి. అవి ఇంకోసారి వ్రాస్తాను.
  

6, జనవరి 2012, శుక్రవారం

పోర్టబిలిటి విజయమో..వీర గర్వమో!

మొబైల్ పోన్ నెంబర్  పోర్టబిలిటి ... ఓడిన  నా పోరాట  పటిమ   

నేను దాదాపుగా ఎనిమిదేళ్ళ క్రితం హచ్..నుండి ఒక మొబైల్ కనెక్షన్ తీసుకున్నాను నాకు అంతా ఫ్యాన్సీ నెంబర్ల అభిరుచి. ఆ నెంబర్ పోస్ట్ పెయిడ్  అయితేనే ఇస్తానని.. నెట్ వర్క్ వాళ్ళు కండీషన్ పెట్టారు. సరే ఆ నంబర్   కావాలంటే..  రోట్లో తల పెట్టక తప్పదు. పెట్టాక రోకళ్ల దెబ్బలు తినక తప్పదు.

కనెక్షన్ తీసుకున్న ఓ..నాలుగేళ్ళు..వేలల్లోనే బిల్లులు చెల్లించి ఉంటాను.  ఎందుకంటె.. మా వర్కర్స్ ఇంటి నుండి ఓ..మిస్ కాల్ వచ్చేది. వాళ్ళు వెంటనే ..ఇంటికి పోన్ చేసుకుంటాం మేడం అనే వాళ్ళు.. మన వర్కర్సే కదా.. పోన్లే పాపం అని ఇచ్చేదాన్ని. నెల తిరిగి వచ్చేసరికి బిల్లు చూస్తే  కళ్ళముందు.. పట్ట పగలు నక్షత్రాలే  ఈస్టమన్ కలర్లో కనిపించేయి. అయినా తాగినోడు  తాళ్ళ పన్ను   కట్టక వేరొకరు ఎందుకు కడతారు చెప్పండి.? మొహం మాడ్చుకుని కట్టేసి బిల్ కట్టేసినాక హచ్ వాడు చెప్పే థాంక్స్ కి ఏడ్వలేక ఓ..వెర్రి నవ్వు నవ్వి బయట పడేదాన్ని.

పనిలో పని ఒకోసారి మెసేజెస్ చార్జ్ కూడా విపరీతంగా ఉండేది. అంతగా.. ఎస్ ఎమ్మెస్ లు చేసేదాన్ని. సరే...  హోం ,పైనాన్స్ శాఖలు రెండూ నావే  కాబట్టి.. వేరొకరితో తిట్ల దండకం,చీవాట్ల వడ్డింపులు ఉండేవి కాదు.  అలా హచ్ వాడిని నా నుండే.. లక్షాదికారిని చేసాక..కాస్త జ్ఞానం తెచ్చుకుని..నేనే లక్షణంగా లక్షాధి కారిగా మెలగాలని నా పోన్ కి బిల్ కట్టడం మానేస్తే.. నెలలో ఓ..పదిరోజులు.. బారింగ్లో పెట్టి.. (పెట్టించుకుని ) తీరిగ్గా బిల్ కట్టాక అవుట్ గోయింగ్ పర్మిషన్ ఇచ్చే టట్లు..తెలివిగా నడుచుకుని..వర్కర్స్ కి ద్రోహం చేసేదాన్ని. అలా నాలుగేళ్ళు గడిచి పోయాయి.

ఇంతలో..ఇల్లు షిఫ్ట్ అయ్యాం. ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ . ఒక్క పాయింట్ అయినా   సిగ్నల్ వస్తే ఒట్టు.  పోన్ అసలు మొగేదే కాదు..ఒకవేళ మ్రోగినా.. వీది గేట్ వరకు వెళితే కానీ మాట్లాడను వీలు ఉండేది కాదు. నాకు ఈ బజారు పోన్ వద్దురా బాబు అంటే..మా అబ్బాయి వినేవాడు కాదు..అమ్మో పాన్సీ నెంబర్ పొతే దొరకదు ..అనేవాడు. సరే ఏదో ఒకటి లే..చావనీ అనుకుని..ప్లాన్ తక్కువలోకి మారి..వేరే నెట్వర్క్ పోన్ తీసుకుని అది వాడుతున్నాను. ఇంతలోకి
నెంబర్ పోర్టబిలిటి  ఆశ రేపి  ఓ..సంవత్సరం..ఆటలాడుకున్నాడు. ఆశగా చూసి   చూసి  అంతా బ్రాంతి ఏనా.. అని పాటలు పాడుకునే అ..శుభ తరుణాన.. పోర్ట బిలిటి..సౌలభ్యం  వస్తునదని ప్రకటన వచ్చి రాగానే.. వోడా..పోన్ ఆఫీసుకి వెళ్లి నెంబర్ మార్చుకోవచ్చు అనుకుని తెగ సంతోష పడి పోయాను.

ఏ మాట కామాట చెప్పుకోవాలి. వోడా పోన్ వాళ్ళు   వొడ  అన్న పేరే కానీ మరీ డీప్ ప్రయ్ చేయరులే అనుకునే దాన్ని.  కానీ తర్వాత తెలిసింది కారు చవకగా లభించే సదుపాయాలూ ఇతర నెట్ వర్క్ ల లో  ఉన్నాయి అని. కానీ ఈ ఫ్యాన్సీ నెంబర్ వదలలేను. ఇలా రోజులు గడుస్తున్నాయి.  ఎట్టకేలకు.. పోర్ట బిలిటీ  నా పాలిట వరమై వచ్చింది.  పోర్టింగ్ నెంబర్ తీసుకోవడం  వోడా  పీడా వదిలించుకోవాలని ప్రయత్నించడం,  వాడు ఏదో సాకు చెప్పడం ఇలా ఓడా స్టోర్స్ చుట్టూ తిరగడం.. మొదలెట్టి  దాదాపు ఏడాది కావస్తుంది. అయినా వాడు నాకు విముక్తి ఇవ్వడు. మీరు  సరి అయిన కారణాలు చూపక పోవడం   వల్ల.. మీ నెంబర్ మార్పు సాధ్యపడదు. అని ఆ కంప్యూటర్ వాయిస్ రికార్డ్  అమ్మణ్ణి నన్ను వాయిస్తుంది.

ఇక వారి సేవలు మనలని మురిపించే విధం నానా రకములు.  పోస్ట్ పైడ్ కి వచ్చే.. ప్రింటెడ్ బిల్లు పంపడం మానేసి రోజుకొక పది మెసేజ్ లతో..బిల్ కట్టాలని గుర్తు చేసే సౌకర్యం ... ఉన్నది . ఇక బిల్ కట్టేస్తాము.ఏదైనాఅవసరం అయితే కస్టమర్   కేర్  ఉండనే ఉంది.  నెట్ వర్క్ వారి సేవలు యెంత   దయగలవి అనుకుంటాను.  అదేమిటో మన అవసరాలని మనం చెప్పా కుండానే గుర్తిన్చేసి..  ప్రొద్దున్నే సుప్రభాతం నుండి..రాత్రి పూట శుభ రాత్రి కూడా చెప్పకుండా  మనని  నాన్ స్టాప్ గా   దిల్ కుషి గా ఉంచే ఎన్నో   సేవల్ దొరుకుతుంటే.. ఇంట్లో..పెళ్ళాం బిడ్డ,అమ్మ అయ్యా ఊసేం ఎత్తకుండా రోజులకి రోజులు డోల్లించే యవచ్చు ..అనుకున్నాడట నాలాటి వెర్రి వెంగళప్ప.
 
కానీ నా నంబర్ ని ఇతర నెట్ వర్క్ లకి మార్చుకోనీయకుండా  ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అలుపెరగక..నేను  పోర్టింగ్ కోడ్ తీసుకోవడం .. నేను పోర్టింగ్ ప్రాసెస్ ని మొదలెట్టడం.. జరుగుతూనే ఉన్నాయి. ఇలా నాలుగు సార్లు వివిధ కారణాలు చెపుతూ  మార్చడం సాధ్యపడని చెప్పకుండానే.. చెపుతూ సహన్నాన్ని పరిక్శిస్తున్నారు.
ఇక ఈ సారి నేను ఉపెక్షించ దలచుకోలేదు. కన్స్యూమర్ కోర్ట్ కి వెళ్ళా లనుకున్కుని ..  సిగ్నల్ ప్రాబ్లం గురించి  తెలియజేస్తూ..నేను ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్లు.. వారితో.. ఒక ఆఫీషియల్ స్టాంప్ వేయించుకోవడం చాలా కష్టమై పోయింది. అలాగే..నేను పోర్టింగ్ కి ఎన్నిసార్లు ప్రయత్నించాను. ఏయే కారణాలు వల్ల వాళ్ళు నెంబర్ మార్పిడిని తిరిగి అడ్డుకున్తున్నారో.. అన్నిటిని ఉదాహరిస్తూ.. నేను కట్టిన బిల్లుల వివరాలన్నీ పొందు పరుస్తూ.. మళ్లి ఒక రిక్వెస్ట్ ని స్వయంగా ఇచ్చాను. ఈ సారి తప్పకుండా అయిపోతుంది మేడం..అంటూ..సన్నాయి నొక్కులు నొక్కి.. ప్లాస్టిక్ నవ్వులు పంచి పంపింది  అక్కడున్న ఒక సేవా భామిని.  మళ్ళీ పోర్టింగ్ గడువు ముగిసి పోయింది. నా నెంబర్ నెట్ వర్క్ మారనూ లేదు. నేను వోడాలో వడలా  వేగడం మాన లేదు. అసలు విషయం ఆరా తీద్దును   కదా.. ఏ నెట్ వర్క్ కూడా ప్యాన్సీ నెంబర్ ని  వదులుకోవడం లేదు. పోర్టింగ్ కి అనుమతి ఇవ్వడం లేదు. ఒక ఆలోచన వచ్చి  ఇలా ట్రై చేస్తే!!! కన్స్యూమర్ కోర్ట్ ... ఉందిగా..అని ఆలోచన వచ్చింది.

అదేమిటో..మా విజయవాడలో.. ఉన్న వినియోగ దారుల సేవా కేంద్రం వారు ఇచ్చిన నంబర్ ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది.. కానీ ఎవరు..అందుబాటులో ఉండరు. ఇంకా నేను ఏం చేయుదును? నా ఫ్యాన్సీ నంబర్ పిచ్చి కాదు కానీ.. ఎనిమిదేళ్లుగా అందరికి అలవాటైన నంబర్.. మా  కస్టమర్స్ అందరికి అలవాటైన నంబర్.. నేను వదల వీలుపడదు. కారణం ఏమనగా.. నెంబర్ పోర్ట బిలిటి అనేది  ఫ్యాన్సీ నంబర్స్ కాని వాళ్ళకి త్వరితంగా అవుతుంది. నా నంబర్ లాటి నంబర్ కి మాత్రం సాధ్యపడదు.  చచ్చినట్లు..వారి ఇనుప కబంధపు హస్తముల మద్య చిక్కుకుని విల విలలాదాల్సిందే! లేదా..కసిదీరా విసిరి కొట్టాల్సిందే   తప్ప వేరొక ప్రత్యాన్మయం కాన రాదు. రాదు. రాదు అని తీర్మానించుకుని.. :)))))))) తో..  పోన్ వచ్చింది. మరి   నేను మాట్లాడాలి కదా అనుకుని వీది లోకి పరిగెడుతూ.. ఛీ.. పాడు  మొబైల్ పోను - పాడు  జన్మ ..అని తిట్టుకుంటూ.. పోర్ట బిలిటి విజయమో..వీర గర్వమో! టెస్ట్ లు పెట్టుకుంటూనే ఉన్నాను.

ఎవరైనా సలహా చెపితే..  ఆ సలహా వర్కవుట్ అయితే నా తదనంతరం నా ఫ్యాన్సీ నెంబర్ మీకు ఇవ్వగలన ని  హామీ పత్రం రాసి ఇస్తానని మనవి చేస్తూ..  వోడా పై నేను చేసిన పోరాటంలో గెలిచి   నా మొహాన ఓ..విజయ గర్వం నాట్యమాడే దృశ్యం ఊహించుకుంటూ..   (కల లో అయినా ) నిద్ర వస్తుంది..ఫ్రెండ్స్.. శుభరాత్రి..

5, జనవరి 2012, గురువారం

మైలవరం - మల్లె తీగకు పందిరి ఓలే

ఇప్పుడే .ఓ.. ఫ్రెండ్ మిస్ కాల్ ఇస్తే.. వెంటనే నేను కృష్ణ వేణి ఎఫ్.ఎమ్ ఆన్ చేసాను.
అలా ఎందుకంటారా?
మిస్ కాల్ అనేది మా ఫ్రెండ్స్ కి  మాకు  మద్యన   ఉన్న సంకేతానికి అర్ధం ఏమిటంటే.. మంచి పాట వస్తుంది వినండి అని.
ఒక వేళ రేడియో పెట్టడం మర్చిపోయినా వెంటనే రేడియో ట్యూన్ చేసుకుని సదరు ఆ పాట వింటాం. చానల్స్ మధ్య రేడియో మూగ పోకుండా ఉందంటే.. కారణం ..ఎందుకంటే రేడియోలో  వచ్చే పాటలు వింటుంటే  ఎంత మధురం గా ఉంటాయో! ఎప్పుడు ఎక్కడ ఆ పాట విన్నా ఎందుకో నాకు అంతగా నచ్చదు మరి. పాట వింటే రెడియోలోనే వినాలి. గారెలు తింటే పట్టు పప్పు గారెలే తినాలి కాబట్టి.వాటి రుచి చెవులూరించగ …చవులూరించగా..అన్నమాట.

అలా వెంటనే రేడియో ఆన్ చేయగానే “ఒరేయ్ రిక్షా” చిత్రం నుండి.. మల్లె తీగకు పందిరి ఓలే  అనేపాట వస్తుంది. ఆ పాట నాకు చాలా ఇష్టం.

ఆ పాట వినగానే.. వెంటనే మా అన్నయ్య గుర్తుకు వచ్చాడు. మా రిక్షా చిన్న గుర్తుకు వచ్చాడు. ఇవి రెండు తెలుసు కోవాలంటే .. అర్జంట్ గా మా మైలవరం వెళ్ళాలి. మైలవరం అయితే ఏమిటి అంటారా? ఇదిగో..ఏమిటో.. చూడండీ!!!

మైలవరం ..ఆ పేరు వినగానే పుట్టింటికి వెళ్ళినప్పటి కంటే ఎక్కువ పులకరింత. అది నేను పుట్టిన ఊరు కాదు. అయినా నాకు అంత కన్నా ఎక్కువే!

నా బాల్యంతో.. అంతకన్నా నా స్వేచ్చ   ప్రపంచంలో  నా కంటూ కొన్ని మేలిమి గుర్తులను ఎన్నింటినో..మిగిల్చిన మా మైలవరమంటే నాకు విపరీతమైన అభిమానం.

ఓ..పదేళ్ళు నా జీవిత పుస్తకంలో.. మూడొంతుల పుటలు మైలవరం ఉంటుంది. అలాగే చుట్టూ ప్రక్కల ఊళ్ళలో అంతా నా బాల్య స్నేహితులే ఉంటారు.

మన ఆంద్ర ప్రదేశ్ లో.. మూడు “మైలవరం” లు ఉన్నాయి ఒకటి కడప జిల్లాలో, ఇంకొకటి   మెదక్ జిల్లాలోనో.. తెలంగాణా ప్రాంతంలోనో ఉంది. .. ముచ్చటగా మూడవది కృష్ణా జిల్లాలో ఉన్న మైలవరం. మా మైలవరం.

అక్కడ జిల్లాపరిషత్ హై స్కూల్ లో అడుగుపెట్టి.. ఎమ్.బి.ఎమ్.గరల్స్ హై స్కూల్ కి మారి మళ్ళీ వి.వి.ఆర్ జూనియర్   కాలేజ్  కి మారిన ఏడేళ్ళలో.. అందరూ..స్నేహితులే.. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చి పోతుండేవారే కానీ మేము మాత్రం మారేదే ఉండేది కాదు. అలా మాకు స్కూల్ , కాలేజీ లో లో..స్థాన బలం. చదువుల బలం కాస్త తక్కువే కానీ ఆట పాటల బలం..బ్రహ్మాండంగా  ఉండేది.

నిజంగా చెప్పాలంటే.. నేను అప్పుడు పిల్ల కాకినే! మా కన్నా  అయిదారేళ్ళ ముందు.. దుర్గ అక్క..(కోమటి జయరాం గారి చెల్లెలు) సాహిత్య వాణి.(పిన్నమనేని వెంకటేశ్వర రావు భార్య) విజయలక్ష్మి (వడ్డే నవీన్ వాళ్ళ పిన్ని)  వీళ్ళంతా మాకు   సీనియర్స్. సుధా, రాణి  నేను.. ఒక్కో క్లాసులు తేడా. అయినా  కూడా ఫ్రెండ్స్ మి.

వాళ్ళు వాళ్ళ చదువు ముగించుకుని వెళ్ళేటప్పటికి మేము కాస్త ముదిరాం   అన్నమాట. నాతో నా బాల్య స్నేహితులు అందరు ఆ చుట్టూ ప్రక్కల వూర్లు నుండి మైలవరం వచ్చి చదువుకునే వారు. మైలవరం కి. ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊరినుండి.. గూడు రిక్షాలో మైలవరం వచ్చి చదువుకున్నాం. మేమే కాదు మా వూరి నుండి చాలా కష్ట పడి  కాలి నడకన పొలాలకి అడ్డం పడి నడచి వెళ్ళి చదుకున్న వారిలో.. నట భూషణుడు "శోభన్ బాబు " నిర్మాత కే.ఎస్.రామారావు..ఉన్నారు. మైలవరం అందరి చదువుల చిరునామా.
 ఆ తర్వాత గూడు రిక్షాలు వచ్చాక ఆ తర్వాత తరం వాళ్ళంతా రిక్షాలలో.. వెళ్లి చదువు సాగించారు. ఒక్కో రిక్షాలో..ఆరుగురేసి   చొప్పున పది ఏళ్ళప్పటి  నుండి పదిహేడేళ్ళు వచ్చినా అదే రిక్షాలో ఇరికి ఇరికి కూర్చునే విశాల హృదయం అన్నమాట. అలా చదువులు సా....గ దీసి చదివే కాలం ముచ్చట్లు ఎన్నో..ఎన్నెన్నో!

నాతోపాటు చదువుకున్న బాల్య మిత్రులు ఎక్కడెక్కడ ఉన్నారో..ఏమిటో! నిజంగా నేను తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు. కానీ ఇప్పుడు కొందరు టచ్ లో ఉన్నా చాలా మందిని మిస్ అవుతున్నాను. నాతో పాటు చదువుకున్న తిరుమలరావు..చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ అయి అక్కడే హాస్పిటల్ నడుపుతున్నాడు.(ఓ..పదిహేను ఏళ్ళ క్రితం) అలాగే.. రవి కూడా మెడిసన్ చదివాడని వినడమే ! తనని చూడనే లేదు. అలాగే "అల్లాభక్ష్" వెల్వడం నుంచి వచ్చేవాడు. డాక్టర్ చదవాలనే ఉద్దేశ్యం ఉండేది. విదేశాలకి వెళ్ళాడని విన్నాను. ఇంకా శ్రీను,కొక్కెం కృష్ణ , గంగాధర్ అన్నయ్య.. ఇలా ఎక్కడ ఉన్నారో! వాళ్ళందరూ కలిస్తే బాగుండును అనిపిస్తుంది.

 అందరికన్నా..మా అన్నయ్య రెండేళ్ళు పెద్ద అయినా మన తెలివి తేటల జంపింగ్   తో.. ఇద్దరం ఒకే  క్లాస్. మా అన్నయ్య నా చిన్ననాటి  స్నేహితుడు కూడా. ఇప్పుడు   పేస్ బుక్ ద్వారా  స్నేహితులు అందరు కలవాలని ట్రై చేస్తున్నాను. మన బ్లాగుల్లో.. పూర్వ విద్యార్ధులు, స్నేహితులు కలుసుకుంటున్నారని విశేషం చదివినప్పుడల్లా.. అలా మేమందరం కలవాలనే ఆశ కల్గుతుంది.

ఇంకొక ముఖ్య విషయం ఏమంటే..  మా మైలవరం లో.. డాక్టర్ అనివి రెడ్డి (లకిరెడ్డి బాలి  రెడ్డి సోదరుడు )గారి దాతృత్వంతో.. ఇదు కోట్ల రూపాయల విరాళంతో..డిగ్రీ చదువుకునే విద్యార్దుల కోసం కాలేజ్ ని నిర్మించి మొన్నీ మద్య యూనివర్సిటీకి హ్యాండోవర్  చేసారు అని చెప్పినప్పటి నుండి ఒక సారి వెళ్లి చూసి రావాలనిపిస్తుంది.

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో.. మంచిగానో,చెడుగానో..పేరు గాంచిన  లకిరెడ్డి బాలిరెడ్డి గారు.. ఇంజినీరింగ్ కాలేజ్ పెట్టి అభివృద్ధి చెందారు కానీ.. ఆయన సోదరుడిలా.. ఆయన- అంత పెద్ద దాతృత్వం చూపలేదు. అని నా భావన.

ఒక్క సారి మైలవరం వెళ్లి రావాలి. ఊసులెన్నో పంచుకుని మా అల్లరికి సాక్షిగా నిలిచిన "మా చిన్నా"' గూడు రిక్షా ని (ఉందో లేదో తెలియదు కూడా) ఆత్మీయంగా స్పృశించి రావాలని ఉంది. అలాగే . నాకు తీరని ఒక కలని  ఇప్పుడు చూసి రావాలని  కోరిక అన్నమాట.అది ఇప్పుడు కొత్తగా   నిర్మించిన డిగ్రీ కాలేజ్ని  చూసి రావాలి అని.

నాకు ఇంటర్ మీడియట్   అయిపోయేటప్పటికి ఇంకా .. అప్పటికి మైలవరం లో డిగ్రీ కాలేజ్ రాలేదు.  మా వూరి నుండి విజయవాడ కి డిగ్రీ చదువుకోవడానికి వెళ్ళాల్సి వచ్చేది. వేరే ప్రేవేట్ కాలేజ్ వచ్చింది కానీ  నేను అలానూ వెళ్ళ లేదు. కారణం అప్పటికి  నా పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నిర్మించిన డిగ్రీ కాలేజ్ కి వెళ్లి చూసి రావాలని ఓ..కోరిక.

అలాగే..నా బాల్య మిత్రులు ఎవరైనా కనబడతారని ఆశ కూడా.. ఓ..నాలుగేళ్ల క్రితం వెళ్లి నప్పుడు. హడావిడిగా.. రన్నింగ్   బస్ ని ఎక్కి ..హమ్మయ్య తొందరగానే ఇంటికి చేరుకుంటాం అనుకునేంతలో..” ఒసేయ్..రాక్షసి! నువ్వు ఇంకా ఏమి మారలేదు.ఆ పరుగులు ఏమిటీ.. రన్నింగ్ బస్ ఎక్కడం ఏమిటీ? “ అని ఆత్మీయంగా తిట్టిన..మా దొంగ రెడ్డి అనబడు..రాజశేఖర్ వీళ్ళంతా అక్కడే ఉండి ఉంటారు.

మా వాళ్ళందరం కలుసుకుని ..మనందరం ఈ కాలేజ్ అప్పుడే ఉండి వుంటే.. ఇంకో మూడేళ్ళు అక్కడే కలసి చదువుకునే వాళ్ళం కదా..అని చెప్పుకుందామని ఆశతో పాటు.. మన బుడమేరు వాగు ఏది..? ఎవరో ఆక్రమించేసి నట్టు ఉన్నారు.  పెద్ద చెరువు (దేవుడు చెరువు )ని  లక్కిరెడ్డి   ఇంజినీరింగ్ కాలేజ్   చేసేసారు కదా.. మన స్కూల్,తర్వాత కాలేజ్ గా మారిన (బస్సు స్టాండ్ ప్రక్కన ఉన్న కాలేజ్) లో..బాదం చెట్లు అలాగే ఉన్నాయా?శివలింగం పూల చెట్టు అలాగే ఉందా? మన బాల్ బాట్ మింటన్   కోర్టు, త్రోబాల్ కోర్టు ఇంకా బహుమతులు కొట్టుకొచ్చే లెవెల్ లోనే అంతగా ఉన్నాయా? మన కాలేజ్ మాగజైన్ వస్తుందా?  అందరం కలసి మన నారాయణ ధియేటర్ లో సినిమాకి వెళ్ళి అల్లరి చేద్దామా? ఇలా ఎన్నో   చెప్పుకోవాలని.. మా మైలవరం పొలిమేరలు చుట్టేసి రావాలని చాలా బలీయమైన కోరిక మొదలైంది.

అలాగే..నాలుగు రోజుల క్రితం  తండా వాళ్ళు కల్తీ సారా తాగి చనిపోయారంట. మనమందరం కలసి.. ఒక అవేర్నెస్ పోగ్రాం చేద్దామా..?  అని మాట్లాడుకోవాలని ఉంది.

మా అందరి మధ్య.. ఎన్నో తగాదాలు,కొట్టుకోవడాలు,మళ్ళీ అంతలోనే.. కలసి పోవడాలు..ఎన్నో తీపి గుర్తులకి చిహ్నమైన ..మా మైలవరం విద్యార్ధులు ఎవరైనా ఈ బ్లాగ్ చూస్తే..వెంటనే టచ్ లోకి వస్తారని ఆకాంక్షిస్తూ..
 
 మల్లె తీగకు  పందిరి  ఓలే   ఈ పాటకి అర్ధమై నిలిచిన మా అన్నయ్యే కాదు..నాతో..కలసి చదువుకుని ఆడి పాడిన అందరి మనసుల్లోని ప్రేమ పూర్వక  వాత్సల్య ఆత్మీయ భావన .. ఈ పాటలో..చూసుకుంటూ..(వెధవ టీనేజ్ లవ్ లు, ఎలాటి కల్మషాలు లేని రోజులు అవి)

నేనెవరో..గుర్తుకు రాక పొతే ఒక చిన్న హింట్. (పైన బోల్డన్ని హింట్లు ఉన్నాయి) మన కాలేజ్ లో..రెండు సంవత్సరాలు.. లేడీ స్టూడెంట్ యూనియన్ లీడర్‌ని. ఓ..రాక్షసిని.