4, మే 2012, శుక్రవారం

సత్యం - శివం -సుందరం



2008 జూలై భూమిక  మాస పత్రికలో ..ప్రచురింపబడిన నా కవిత ఇది.
నేను బ్లాగ్ మొదలెట్టిన తొలిరోజుల్లో పోస్ట్ చేసాను. అప్పటికి ..నా బ్లాగ్ అందరికి షేర్ చేయకపోవడం వలన.. అందరికి ఈ కవిత పరిచయం లేదు. అందుకే..ఇప్పుడు.. ఇలా షేర్ చేసుకుంటున్నాను.

సత్యం - శివం -సుందరం


విఫలమైన రెండు పార్శ్వాలకు 
చిరునామాని నేను
నాతి చరామి అని దగా చేసినా
అనుకోని అతిధిలా వచ్చి
కొండంత ప్రేమని కఠినశిలలా మార్చి
దిగాలుతో కుదిపేసినా
జీవచ్చవాన్ని   కాలేదు కానీ..
మళ్లీ మళ్లీ వసంతం వస్తుందంటే..
నమ్మని మోడుని నేను..

అదేం చిత్రమో
రాతిలోనూ  రాగాలు పలికించగల
వైణికుడు ఉంటాడని
ప్రేమ సంజీవనితో బ్రతికిస్తాడని 
భావ ఉద్వేగాల ఉప్పెనలో
ఆలోచనాతరంగాలతో..
జీవనతీరాలు సృశించుకుని
ఆకర్షణకి తావే లేని..
అంతరాలు తెలియనివ్వని 
ఆత్మబంధువు అవుతాడని ఊహించనేలేదు. .

ప్రాణ హితుడా !
నేను  నిర్మిచుకున్న చట్రం నుండి..
నేనే వెలుపలకి వచ్చానో..
నువ్వే లోపలకి జోచ్చుకుని వచ్చావో !

వద్దు వద్దు అనుకుంటూనే..
హృదయపు వాకిళ్ళు తెరచి
ఎదను చిగిర్చుకుంటూ
గంపెడాశతో చిగురంత ప్రేమని ఆహ్వానించానే !

పది శరత్కాలాలు ఎక్కడో.దాక్కుని
హఠాత్తుగా మళ్ళీ నాకోసమే అన్నట్టు
వెన్నెల నింపుకుని వచ్చిన చంద్రుడా
నాకొక రక్షణ కవచమై నిలిచావే..!

ప్రేమ పాత్రని వొంపి 
రోజుకొక చుక్కా చుక్క రుచి చూపిస్తూ
జవసత్వాలు నింపావే
ఎన్నెన్ని దీర్ఘ రాత్రాలు..
ఎవరికి చెప్పని సంగతాలు
నీ స్నేహ పరిష్వంగంలో కరిగి
నా.. ఆవేదనని తేలిక పరిచాయో
నా ఆలోచనా సహచరుడా
ఎన్నెన్ని కలలు వాస్తవాలు అవుతాయని..
పచ్చబొట్టంత గాఢంగా నీ ముద్రని ధరించి..
హృదయ భాండాగారంలో నిక్షిప్తం చేసుకున్నానో!

హఠాత్తుగా ఏ సంశయాలు వేధించాయో 
చేసుకున్న వాగ్దానాలు భంగపడ్డాయో
అపనమ్మకం ముంచెత్తిందో
దూరంగా జరుగుతూ నీవు 
దూరం ఊహించని నేను
వేరొకరి నీడనే కాదు నా నీడని కూడా
నేను ద్వేషించి

జీవనగమనంలో 
ఎవరి గమనానికి అడ్డు తగలని బాటసారినై
ఎవరిని తిరిగి..ప్రశ్నించని  మౌన శతఘ్నినై 
లోకానికి వెల్లడించుకోలేని
అముద్రిత విషాద సంచికనై
శరీరాన్ని కాపాడుకున్నంత భద్రంగా
మనసుని కాపాడుకోలేకపోయానని 
కుములుతూ
ప్రతిక్షణం  నీ వలపు
నా తలపుని తాకిన వేళ
నా హృదిపై
ఒక బాధావీచిక పయనించి వెళుతుంది..
కనుకొనకులనుండి
ఒక చుక్క నిర్వేదంగా నిలిచింది
"ఒంటరి " అయి అచ్చు నాలా!

జీవితాన్ని ప్రేమించుకోవడం
జీవనాన్ని ప్రేమించడం
ఇతరుల ప్రేమని ఆశించకుండా 
ఉండటం  అవసరమని
దశాబ్దాల నా అనుభవం  నొక్కి చెప్పింది..
సత్యం ..శివం.. సుందరమై .

*****************

రెండు వ్యాఖ్యలు-నా స్పందన

ఒక వ్యాఖ్య : ఇటువంటి నవలని మీరు సమర్ధిస్తున్నారంటే దానికి కారణం నేను అర్ధం చేసుకోగలను. 

రెండవ వ్యాఖ్య:భారతీయ సంస్కృతి, కట్టుబాట్లు, భార్యాభర్తల అనుబంధాలు వంటి విషయాలు హద్దులు దాటుతున్నయనే విషయం గుర్తెరగాలి. 

ఈ రెండు వ్యాఖ్యలకి ..నా స్పందన. సాహిత్యం లో స్త్రీల పాత్ర చిత్రీకరణల వల్లనే.. ఇవన్ని జరుగుతున్నాయా!? ఇక తతిమా వేటి ప్రభావం .. లేదంటారా!? వివాహం అయిన తర్వాత కూడా.. ఇరువురు స్త్రీపురుషుల మధ్య ఏర్పడిన ఆకర్షణలు.. సమాజం లో ఇప్పుడే కొత్తగా మొదలయ్యాయా!? సాహిత్యంలో చలం వందేళ్ళ ముందే.. "మైదానం '' రచించారు. మైదానం ని యెంత మంది చదివారు. చదివిన వాళ్ళు అందరు.. రాజేశ్వరిని అనుకరించారా!? చదవని వాళ్ళలో రాజేశ్వరిలు లేరా? తన్హాయి" సమీక్ష పై స్పందించే తీరులొ నన్ను కించపరిచిన వారికి,ఇంకా కొంత మంది అతి తీవ్ర భావజాలం ప్రదర్శించేవారికి.. నేను ఇంకా కొన్ని సమాజాన్ని పెడదారి పట్టించే దోరణులను లని పరిచయం చేస్తాను. వాటి మీద పోరాటం చేసి.. సమాజానికి మంచి చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. 

 మన భారతీయ సమాజంలో మొబైల్ విప్లవం మొదలైన మొదటి దశకంలో ఉన్నాం. ఈ పదేళ్ళలో .. ఒకోకరికి రెండు లేదా మూడు మొబైల్ పోన్లు. సాధారణ పౌరులకి కూడా మొబైల్ ఫోన్  ఉండటం సర్వ సాధారణమైన రోజులివి. పదిహేను ఏళ్ళ పిల్లల దగ్గర నుండి..బామ్మల వరకు ఫోన్ లు ఉంటున్నాయి. ఫ్రీ గా లభిస్తున్న లేదా అతి తక్కువ ఖర్చుతో లభిస్తున్న ఎస్.ఎమ్.ఎస్ సౌకర్యం ఉంది. ,బస్సు స్టాప్ లోను ,రైళ్ళ లోను తరగతి గదుల్లోను ,ఇంట్లోను టక టక మని కదిలే వేళ్ళకదలికల వెనుక... మొబైల్ ఫోన్ ల నుండి నిరంతరం ప్రవహించే ఎస్.ఎమ్.ఎస్ లు,గంటల తరబడి మాటలులో ఆరోగ్య కరమైన వాతావరణం ఉందా ! ఉద్యోగస్తుల మధ్య మెయిల్స్ లో నడిచే ప్రేమ వ్యవహారాలు....వీటన్నిటిలోనూ మానసిక వ్యభిచారం కనబడలేదా!? సినిమాల్లోవస్త్ర ధారణా లో, పాటల సాహిత్యంలో, డైలాగ్ లలో, పత్రికలలో ప్రచురించే చిత్రాలలో,ఇంకా చెప్పాలంటే..నడివీధుల్లో.. వ్యాపార ప్రకటనలకి చీరలు చుట్టి నిలువెత్తు ప్రదర్శనలు అంతా అశ్లీలతే! మరి అక్కడ పోరాటం చేయాలి కదా!? అలాంటి చోట నోరు విప్పని ,నోరు విప్పడానికి ప్రయత్నం చేయని వారు ఒక నవల లో ఒక పాత్ర గురించి పోలిక చెప్పి వ్యక్తిగతంగా నన్ను మీరు ఎలాంటి వారో అర్ధం చేసుకోవచ్చు..అని అంటే ... 

నేను మౌనంగా ఊరుకుంటే.. మరి ఆ మౌనం ఏ అర్ధాలకు దారి తీస్తుంది. నా ఆభిజాత్యం దెబ్బ తినలేదా!? అయినా రచనల లోని పాత్రల ఔచిత్యం పట్ల సానుకూల దోరణి..ప్రదర్శిస్తే .. వ్యక్తిగతాలకి కూడా అవే లక్షణాలు అపాదిస్తాయా!? రచనలు వేరు ..రచయితల వ్యక్తిగత జీవితాలు వేరు. రచయితల వ్యక్తిగత జీవితాలు రచనలలో..గోచరిస్తూ ఉండాలనే నిబందనలు ఉన్నయా!? రచయిత తన ఇష్ట ప్రకారం పాత్రలుని సృస్టిస్తారు. ఆ పాత్రలు సమాజంలో మనకి కనబడవచ్చును లేకపోవచ్చును కూడా! ప్రపంచంలో ఎన్నో కథలు. ఆ కథలో ఊహా జనిత కథ .."తన్హాయి" 

 శ్రీ శ్రీ కవిత్వాన్ని మనం అందరం మెచ్చుకుంటాం.ఆకాశానికి ఎత్తేస్తాము ఆయన రచనల ప్రభావం మన మనసుల మీద చూపే ప్రభావం చాలా గొప్పది. . శ్రీ శ్రీ వ్యక్తి గత జీవితం గురించి మనం ఏ రచనలలోను ప్రతిబింబిచలేదని అనుకున్నామా!? ఎందుకు రచనలకి..వ్యక్తిగత జీవితాలకి ముడిపెట్టడం. ? అయినా "కల్హార" పాత్ర సమాజానికి చెడ్డ సందేశం ఇవ్వలేదు.మానసిక భావప్రకంపనలకి లోనైనవారు లేదా వ్యక్తీ గత బలహీనతలు తో.గడప దాటాలనుకునేవారికి ఒక వివేకవంతురాలైన స్త్రీ ఎలా నిలబడిందో అన్న దానికి నిదర్శనంగా నాకు కనిపించింది. కారణాలు ఏవైనా గడప దాటని స్త్రీ పాత్రలలో "కల్హార" ని చూడండి అని చెపుతాను నేను. నేను మరో రాజేశ్వరి చచ్చిపోయింది..అనే " నీరజ "నిజ జీవిత కథ గురించి  చెప్పినప్పుడు.. రాజేశ్వరి తొందరపాటు చర్యలో వివేకం ,విచక్షణ లోపించాయని బాధపడ్డాను. "మానవి" గురించి చెప్పినప్పుడు.. ఓ..మానవి గా స్పందించాను. ఓ.."కల్హార " గురించి చెప్పినప్పుడు.. మనసు తనానికి-వివాహ బంధానికి మధ్య నలిగిన .. ఓ.. స్త్రీ అంతరంగాన్ని విశ్లేషించే ప్రయత్నం చేసాను.అక్కడ వివాహ బంధానికే ప్రాముఖ్యత నిచ్చిన ప్రయత్నాన్ని..

"అవగాహన,సర్దుబాటు,రాజీపడటం,సమాజం లో గౌరవం ఈ నాలిగింటి కోసమే ఆ రెండు జంటలు .. మరో రెండు హృదయపు శకలాల పై నిలబడి ఉన్నాయి అన్నది ఎవరు కాదనలేని సత్యం" అంటూ విలువని చేకూర్చే యత్నమే చేసాను.

తన్హాయి..భారతీయ సమాజానికి ఏ చెడ్డ సందేశం ఇస్తుందో..అన్నది చెప్పే ముందు..ఈ లోతైన విషయాలని ఆలోచించారా!?

"తన్హాయి" నవలని ఇష్ట పడినవారికి,నా సమీక్షలో అంశాలు నచ్చినవారు వేరొక చోట షేర్ చేసుకుంటే.. వారిని విచక్షణా రహితమైన ప్రశ్నలు వేసి..,ఇంకొకరిని తెగ నాడి..

ఏం మూట గట్టుకోవాలనుకున్నారో.. వారి భావజాలం ఏమిటో..నాకు బోధపడలేదు.

ఈ సమీక్ష వ్రాసినందుకు గాను నేను ఈ మాత్రం సమాధానం చెప్పాలనుకున్నాను. "విహంగ" లో సభ్యతగా ఉండదు కాబట్టి..నా స్పందనని నా బ్లాగ్ లో చెప్పడం భావ్యం గా అనిపించింది.

తన్హాయి సమీక్ష పోస్ట్ ని షేర్ చేయడమే తప్ప చర్చలో జోక్యంచేసుకోకపోయినా వారికి కల్గిన ఇబ్బందికి క్షమాపణలు చెపుతూ ("పరవళ్ళు" బ్లాగర్ భాస్కర్ గార్కి,)

పై ఎవరి అభిప్రాయం వారిది.. ఇందులో.. వివాదాలు కి ఎందుకు తెరదీయడం ?

ఇటువంటి నవలలని ప్రోత్సహించడం ద్వారా భారతీయ స్త్రీ అదుపు తప్పుతోంది అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ !!

ఇలాటి అభిప్రాయాలకి చోటు ఇవ్వకుండా.. నచ్చితే చదవడం వీలయితే అభినందించడం, బాగా నచ్చితే..ఓ..సమీక్ష వ్రాయాలని అనుకోవడం..వ్రాయగల్గితే వ్రాయడం లేకుంటే అవతల పడేయడం చేస్తే బాగుంటుందేమో!

3, మే 2012, గురువారం

హృదయం


హృదయం 

ఏ పుట్టలో ఏ పాము ఉందొ..ఎవరికి తెలుసు.
ఏ మట్టిలో ఏ మొలక తలఎత్తునో ఎవరికి తెలుసు.
ఏ పడతి మనసులో ఏముందో ఎవరికి తెలుసు
ఏ నడక ఏ గమ్యం వైపు సాగునో ఎవరికి తెలుసు

అయినా వెంటాడే చూపులు
వేటాడే మాటల కత్తులు
దూసి పోసి, విద్వేషం రంగు పులిమి
దాగిన నిజం కుత్తుక నులిమి..
తాము ఆశించిన జవాబు కై..
వడేసి హృదయాన్ని పిండితే..
విల విల లాడే గుండె
గాయం గేయమైన  చోట


ఎద బరువెంతో ఎడబాసిన హృదయానికే తెలుసు..
చేజారిన చెలిమి విలువ చెలియ మనసుకే తెలుసు..
పాశం విలువ రక్తసంబంధం కన్నా మరెవరికి తెలుసు..
మనసుకి మనసుతో తప్ప  సంకెళ్ళు వేయలేరని తెలుసు..