20, జూన్ 2013, గురువారం

స్వాతి వాళ్ళ అమ్మ "సారంగ " లో

స్వాతి వాళ్ళ అమ్మ  "సారంగ " లో

   నేను వ్రాసే కథలు ఎప్పుడూ  వాస్తవిక జీవితాల్లో నుంచే  పుడతాయి.  స్త్రీలకి పునర్వివాహం లో ఉండే కష్ట నష్టాలు గురించి ఒక కథ వ్రాసాను . ఆ కథ   ఈ లింక్ లో "స్వాతి వాళ్ళ అమ్మ " కథ
 ఈ కథ వారం వారం మనని పలకరించే  వెబ్ మాగజైన్  "సారంగ " లో  పాఠకులకి చేరువలో ఉంది

కథని చదివి మీ ఆలోచనలని అభిప్రాయాన్ని పంచుకోండి .

18, జూన్ 2013, మంగళవారం

తెలుగు తెగులు వెలుగు చోటు

డాడ్ .. డాడ్ .. అంటూ పిలుస్తూ .. "మే ఐ కమిన్" అంటూ అనుమతి కోసం గుమ్మం దగ్గర నిలబడ్డాడు హర్ష.

కమిన్ ... అంటూ అనుమతి ఇచ్చాడు తండ్రి.

"మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను" సమయం ఉందా అన్నట్టు చూసాడు.

"చెప్పు" . అన్నారు మిస్టర్ రావు

పక్షులు ఏ భాష మాట్లాడతాయి ?

"పక్షుల భాష "

"జంతువులూ" ?

"జంతువుల భాష "

మనం మన భాషలోనే అంటే మన మాతృ భాషలో యె౦దుకు మాట్లాడం ?

ఆంగ్లంలోనే మాట్లాడుతూ ఆంగ్లేయుల మధ్య బ్రతుకుతూ ఆంగ్లమునే శ్వాసిస్తున్న ఆ తండ్రికి కొడుకు ప్రశ్నతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది.
మీరు,అమ్మ యిరువురు కూడా మన మాతృభాష ను నేర్పడం లో అలసత్వం, అల్పత్వం కూడా ప్రదర్శించారు అందువల్ల తెలుగు వాడిగా పుట్టిన నాకు తెలుగు మాట్లాడటం తెలుగు మాట్లాడిన వారి భాష మాకు అర్ధం కాకపోవడం జరుగుతుంది

ముఖ్యంగా ఆంగ్లం యే మాత్రం తెలియని నానమ్మ,తాతయ్యలతో యేమి మాట్లాడలేకపోవడం, వాళ్ళు మాట్లాడినది అర్ధం చేసుకోలేకపోవడం వల్ల మా మధ్య తాతా-బామ్మా మనుమడి అనుబంధం యేమిటో తెలియకపోయింది దగ్గరికి వెళ్ళినప్పుడు నాకర్ధం కాని వాళ్ళ బాషలో యేదో చెపుతూ ఆత్మీయంగా ప్రేమగా తడుముతూ వారి ప్రేమ భాషను  వ్యక్తపరుస్తుంటే వారికి వొట్టి థాంక్స్ మాత్రమే కాకుండా వారిపై నాకున్న ప్రేమని తెలియజెప్పాలనిపిస్తుంది . నేను చెప్పినా వారికి అర్ధం కాదని తెలిసి మూగగా కంటి చూపుతో మాట్లాడి బయట పడటం నాకు సిగ్గుగా ఉంది.నేను వారితో మాట్లాడలేకపోవడం వల్ల యెన్నో కోల్పోయాను.
.
 
పరాయి దేశానికి బ్రతకడానికి వచ్చి మన భాషని మర్చిపోయి వారి భాషనే ఆశ్రయించి మనకి మనమే అన్యాయం చేసుకుంటున్నాం, మన మూలాలు మనం కోల్పోతున్నాం.మీలా అందరూ మాతృ బాషని నేర్పించకుండా నిర్లక్ష్యం చేస్తే .. మంచి అవకాశాల కోసం ఉద్యోగం కోసమో అందరూ ఆంగ్లమే నేర్చుకుంటే... కొన్నాళ్ళకి సవర భాష , ఎరుకల భాష లాగా మన భాష కనుమరుగవడంలో ఆశ్చర్యం లేదు" చిన్న ఉపన్యాసమే యిచ్చాడు హర్ష.
మిస్టర్ రావు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. హర్ష తన మాటలు కొనసాగిస్తూ

ఈ రోజు నుండి నేను తెలుగు తరగతులకి వెళుతున్నాను తెలుగే మాట్లాడతాను, నానమ్మ తాతయ్యలతో రోజు కబుర్లు చెప్పుకోవడానికి తెలుగు నేర్చుకుంటాను అని చెప్పాడు .పాతికేళ్ళ కొడుకు తమ తప్పుని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పడానికి మాటలు రాక మౌనంగా వుండిపోయాడు మిస్టర్ రావ్.
***************************
ఇది నేను వ్రాయబోతున్న ఒక కథలో భాగం
ఈ కథ వెనుక కథ .. అనబడు ఒక విషయం పంచుకోవాలని పించి ఈ పోస్ట్ .
నేను ఆంగ్లంలో బాగా వెనుకబడి ఉంటాను . అంటే అత్తెసరు మార్కులతో యెలాగోలా గండం గట్టెక్కేది . ఆంగ్లం అంటే భయమో లేదా అనాసక్తో తెలియదు కాని తెలుగు అంటే వల్లమాలిన ప్రేమ. (తెలుగు సరిగ్గా రాదనుకోండి :)
మా అబ్బాయితో ఎప్పుడూ దెబ్బలాడే దాన్ని,కనీసం వారానికి వొకసారి అయినా నాకు తెలుగులో ఒక ఇ-ఉత్తరం వ్రాయాలని. నేను కొన్నాళ్ళు రోజూ మా అబ్బాయికి ఇ -ఉత్తరం వ్రాసేదాన్ని. దానికి జవాబుగా మా అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడేవాడు . నాన్నా ! తెలుగు వ్రాయడం చదవడం మర్చిపపోతావేమో ..కాస్త తెలుగు చదువు, వ్రాయి .అంటూ తెగ నస పెట్టేదాన్ని . అబ్బ ఆపమ్మా ... నీ గోల అనేవాడు. మరీ... సోది అంటే నేను బాధపడతానని . పోనీ నా బ్లాగ్ అయినా చదువు బంగారం అని మరో చచ్చు సలహా యిచ్చేదాన్ని. అన్నీ వ్రాయి, నా పిల్లలతో కలసి మా అమ్మ ఇలా వ్రాసింది అని వారికి చూపిస్తూ తీరికగా చదువుకుంటాను, యిప్పుడు తీరిక లేదు అంటాడు 

అలాంటి సమాధానం విన్నప్పుడల్లా అసలు తర్వాత తరం పిల్లలు తెలుగు నేర్చుకుంటారా? పెద్దలు వారికి అంత శ్రద్దగా తెలుగు నేర్పుతారా? వాళ్ళు తెలుగు నేర్చుకోకపోతే నేను నా మనుమడు మనుమరాలితో ఎలా మాట్లాడాలి ? అనే బోలెడు సందేహాలు .

"అమ్మా ! నువ్వు నా దగ్గరికి వచ్చేయమ్మా " అన్నాడు నేను అప్పుడప్పుడు ధారాపాతంగా కార్చే కన్నీరు చూసి .

"వస్తాను ..కానీ నాకు ఆంగ్లం రాదు కదా ! స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు లకి వెళతాను" అన్నాను . "క్లాస్ లకి వద్దులేమ్మా.. హోం ట్యూషన్ పెట్టించుకుని నేర్చుకో! "అని చెప్పాడు .

నేను అలాంటి ప్రయత్నం లోనే ఉన్నాను 
.
పైన కథ కోసం వ్రాసిన సంభాషణ అక్షరాలా నిజం 
.
ఇకపోతే ఇది వ్రాస్తూ నా ఆలోచన మార్చుకున్నాను . నేను ఆంగ్లం నేర్చుకోవాల్సిన అవసరం లేకుండానే నా భావితరాల వారికి తెలుగుని పరిచయం చేసి వారికి తెలుగు నేర్పడం మూలంగా మన భాషకి న్యాయం చేసినట్లు అవుతుంది. నా వారితో నేను నా భాష మాత్రమే మాట్లాడుకోవాలి అని దృఢ నిశ్చయం చేసుకున్నాను
(అయినా నాకు ఈ ఇంగ్లీష్ రాదులే అనుకుంటూ ..వెధవింగ్లీష్ .అనుకుంటూ పుస్తకాలు గిరాటు కొట్టాను) .

మనలో ఒక మాట ..

మన తెలుగు కథల కోసం ఫేస్ బుక్ లో ఒక గ్రూప్ ఉంది . "కథ గ్రూప్" అని . ఆ వేదిక పై తెలుగు కథ గురించి మూడొంతులు మంది ఆంగ్లం లోనే చర్చలు జరుపుతారు ఆంగ్లం వచ్చి ఉంటే ఆంగ్లంలో అభిప్రాయాలు చెప్పేందుకు నేను తయారుగా వుండేదాన్నేమో ! అక్కడ నాకు ఒక్క ముక్క అర్ధం కాదు. అదంతా తెలుగువారి కోట. ఆ కోటలో ఆంగ్ల పాగా వేసేవాడిదే రాజ్యం అనుకుంటూ తప్పుకుంటాను. మన తెలుగు వాళ్లకి ఆంగ్ల తెగులు బాగా తగిలింది . అది తెలుగుని వూడ్చి పెట్టేస్తుంది. అది ఖాయం అని అనుకుంటూ ఉంటాను.
వలచి విలపించడం అంటే ఇంతే  కదా ! అని అనుకుంటాను .

పై కథ లోని భాగంలా ప్రపంచ దేశాలలో నివసిస్తున్న తెలుగు వారి యింట యిలాంటి సన్నివేశాలు  యెదురుకాకూడదని కోరుకుంటూ .. ప్రవాసాంద్రులు  వారి పిల్లలకి  తెలుగు నేర్పుతూ యితర   దేశీయులకి  నేర్పుతూ  మన మూలాలని మిగుల్చుతున్నందుకు మనస్పూర్తిగా  ధన్యవాదములు తెలుపుతూ

 అవును .. ఈ  టపా కి  యే౦  పేరు పెట్టా లబ్బా  !?
తెలుగు తెగులు వెలుగు చోటు  అనేస్తాను బావుంది కదా!!

(అచ్చు తప్పులుంటే క్షమించాలి)  .

16, జూన్ 2013, ఆదివారం

ఎవరూ చెప్పరు !

స్త్రీలు మాత్రమే సున్నిత మనస్కులా? పురుషుడి ప్రేమ దక్కకపోతే ఆత్మహత్య చేసుకునే పిరికి వాళ్ళా ?

 కాలం ఏదైనా .. ఎన్ని విద్యలు నేర్చినా  స్త్రీల  యొక్క బలహీన స్వభావం బట్టబయలు అవుతూనే ఉంది వాళ్ళు కోల్పోయిన జీవితం, మోసపూరితమైన మాటలవల్ల, వ్యక్తిగత బలహీనల వల్ల, ఆశించిన జీవితం లభించక పోవడం వల్ల  ప్రేమ రాహిత్యం తో బాధపడుతూ .. ఆత్మా హత్యలు చేసుకుంటున్నాం అని చెప్పి మరీ చేస్తున్నారు

జియా ఖాన్ మరణం  మనసున్న ప్రతి ఒక్కరిని కదిలించింది రక రకాల కథనాలు ఆఖరిన ఆమె వ్రాసిన ఆఖరి ఉత్తరం  చదివి  బాధపడని వారు అంటూ ఎవరూ ఉండరేమో ! స్త్రీలు బలహీనమనస్కులు అని జియా ఖాన్ నిరూపించింది అంటున్నారు కొందరు.

 సెలబ్రిటీల సంగతి ప్రక్కన పెట్టి  మన చుట్టూరా  చూసినా  అవే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

చాలా మందికి ప్రేమ అనేది ఒక ఆట అయిపోయింది. ఒక దశకి చేరుకునేవరకే వారి కబుర్లు,  తర్వాత నిజస్వరూపాలు బయటపడటం  చంపడం  లేదా చావడం ఇవే కనబడుతున్నాయి

కీర్తి కండూతి కోసం ప్రాకులాడేది కొందరైతే, అవకాశాల కోసం అమ్ముడు పోయేవాళ్ళు కొందరు . ఎక్కడ చూసినా డబ్బు  డబ్బు . డబ్బు కి ప్రాధాన్యత ఇవ్వడం ఎక్కువైపోయింది  నమ్మక ద్రోహం ఎక్కువైపోయింది. ప్రేమించిన వారిని సరిగా అంచనా వేయలేక సర్వం కోల్పోయి మనసు విప్పి చెప్పుకునే వాళ్ళు లేక, ఉన్నా వారికి చెప్పుకోలేక తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నారు.

స్త్రీలు బలహీనమనస్కులు అని జియా ఖాన్ మాత్రమే కాదు చాలా మంది పురుషులు బలహీన మనస్కులే అని  నేను కొన్ని విషయాలు విని, చూసి రూడీ చేసుకున్నాను

కొన్నాళ్ళ క్రితమే ఒక యువకుడు అతి సన్నిహితంగా మెలిగే తన గర్ల్ ఫ్రెండ్ తనని అర్ధం చేసుకోవడం లేదని విలాసాల కోసం తనని విపరీతంగా వాడుకుని తన దగ్గర డబ్బులేక అప్పులు పాలై ఉన్నప్పుడు తన మొహం వంక కూడా చూడకుండా, కనీసం ఫోన్ కి కూడా దొరక్కుండా, ముఖా ముఖి  కలసినప్పుడు  చీత్కరించుకుందని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు . స్త్రీలు మాత్రమే  కాదు పురుషులు కూడా బలహీన మనస్కులే ! అని

నిన్నటికి నిన్న ఒక మంచి విషయం విన్నాను . మా సమీపంలో ఉన్న వివాహ వేదిక పై ఒక వివాహం జరగవలసి ఉంది.క్రైస్థవ మతాచారం ప్రకారం పెళ్లి జరగవలసిన కొద్ది నిమిషాల ముందు ఆ పెళ్లిని ..ఒక యువతి వచ్చి అడ్డుకుంది. ఆమెని ప్రేమించి మోసం చేసి ఆమెకి తెలియకుండా వేరొకరిని వివాహం చేసుకోబోతున్న యువకుడిని బంధుమిత్రుల సమక్షంలోనే నిలదీసి ఆ పెళ్లిని అడ్డుకుంది

మళ్ళీ ఆమె ప్రేమించిన యువకుడితో ఆమెకి వివాహం అవుతుందా లేదా అన్నది ముఖ్యం కాదు. కనీసం తనకి అన్యాయం జరిగిందని తెలుసుకున్నప్పుడు ప్రశ్నించడం కూడా చేయకుండా మౌనంగా భరించి తర్వాత వేదన చెంది,చీత్కరించుకుని, మరి కొన్నాళ్ళకి  జరిగిన దాన్ని మర్చిపోయి, మర్చిపోలేకపోతే బాధ పడి ఆత్మ హత్య చేసుకోవడం అలవాటైపోతుంది .

ఇంత పిరికితనాన్ని మోస్తూ మా ఖర్మ అని సరిపెట్టుకునే వాళ్ళని చూసి జాలి పడాలనుకుంటాను నేను.
ఇప్పటి కాలంలో కన్నా ఇంతకూ ముందు తరాలలో వారు స్త్రీలు చాలా దైర్యంగా ఉండేవారు . చెట్టంత మగాడు పోయినా, వదిలేసి పోయినా   ఒంటరి స్త్రీలు పిల్లలని పెట్టుకుని దైర్యంగా  బ్రతికేవారు. జీవితం జీవించడం కోసమే అన్నట్టు ఇంటింటా బాల్య వితంతువులు గుండ్రాయి లాగా బ్రతికేవారు తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం తక్కువని  వింటూ ఉంటాం

అసలు బ్రతకడానికంటే  చావడానికంటే ఎక్కువ దైర్యం కావాలి కూడా!  బ్రతికేవాడు నిత్యం చస్తూ ఉంటాడు

మనదేశం లో ఐ ఐ టి లలో ప్రవేశం కోసం జరిగే అర్హత పరీక్షల ఫలితాలని ఇంకా ఇతర ఫలితాల ని సునిశితంగా పరిశీలించి  చూస్తే   ప్రధమ స్థానాలలో అత్యుత్తమ రాంక్లు   సాధించిన వాళ్ళలో .. మగ పిల్లలు ఎక్కువ ఉంటారు. ఎంత బాగా చదివినా పరీక్ష సమయంలో ఆడపిల్లలు   విపరీతమైన మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు వారు మగపిల్లలతో పోటీ పడలేరు అందుకనే మేము ఆడపిల్లలు  అత్యుత్తమ రాంక్లు తెచ్చుకుంటారని  ఆశించం అని ఒక కార్పోరేట్ విద్యాసంస్థల డైరెక్టర్  అన్నారు.

స్త్రీలలో మానసిక వత్తిడి ని అధిగమించడం, ఆశాభంగం కలగితే  పాజిటివ్ గా తీసుకోగల్గడం  సమర్ధవంతంగా  ఎదుర్కోవడం లాంటి విషయాలలో ఇంకా పరిణితి సాధించాల్సి ఉంది .అందరు ఒకేలా ఉండరు ఒకేలా ప్రతిస్పందించరు. వ్యక్తికీ వ్యక్తికీ సామర్ధ్యం విషయంలో తేడా ఎలాగు ఉండనే ఉంటుంది . కానీ జీవితం మాత్రం  అందరికి ఒకటే !   జీవించడం అందరికి ఒకటే! ఆర్టిస్టిక్ గా జీవించగలగడం గొప్ప కళ .. ఆ కళ ని అందరూ నేర్చుకోవాలి. వ్యాధులు,బాధలు ,ఆశాభంగాలు అందరికి ఉండేవే! అవి ఉన్నాయని చచ్చిపోతే ఈ అసుపత్రులు అన్నీ ఏమైపోవాలి ,  సుఖం ఒకటే ఉంటే  బోర్ కొట్టి చచ్చి పోవాలనిపిస్తుంది. ఆశాభంగాలు లేకపోతే ...   సరదాగా చందమామని చేతి వేలుపై నిలబెడదామా.. అని పాటలు ఎవరు పాడుకుంటారు చెప్పండి ?

జీవితాన్ని ప్రేమించుకోవడం
జీవనాన్ని ప్రేమించడం
ఇతరుల ప్రేమని ఆశించకుండా ..
ఉండటం .. అవసరం కదా ! ..
ఇదే  సత్యం ..శివం.. సుందరం  

అని ఎవరూ చెప్పరు .. ఎవరికీ వారే నేర్చుకోవాలి . .