11, డిసెంబర్ 2018, మంగళవారం

గడ్డిపూవు జ్ఞానం

సెల్ఫ్ ప్రమోషన్ కోసం పొగిడించుకోడం సర్వసాధారణమైన రోజులలో... విని చూసి వెగటుపుట్టినప్పడు పుట్టిన కథ. ఈ..చిన్న కథ.

అనగనగనగా.. ఒక కదంబమాల... అంట. అందులో పద్దెనిమిది పూలంట. ఒకో పువ్వు గురించి మిగతా పదిహేడు పూలు .. గోడెక్కి దారిన పోతున్న అందరికి వినబడేటట్టు అబ్బ.. యేమి రంగు యేమి పరిమళం యెంత సొగసు అని నోరార పొగుడుకుంటూ వున్నాయంట. దారినపోతున్న దానయ్య .. సుందరమైన సుకుమారమైన అద్బుతమైన పూవుల్లారా..మీలో వొకరినొకరు పొగుడుకునే సంబడమాపేసి దండగా మారిన మీరు దండగవకుండా దేవి పూజకు వెళ్ళండి ఆలస్యమవకుండా.. అని చెప్పి వెళ్ళిపోయాడంట.

అసుర సంధ్య వేళ దేవి మెడలో అలంకారంగా మారాలనుకుని గుడికి వెళ్ళింది అంట కదంబమాల. పూజారి దేవి మెడలో కదంబమాల వేశాక ఈ సారి ఒకొరినొకరు పొగడుకోకుండా యెవరిని వారు పొగుడుకుంటూ.. అందుకే నేనంటేనే దేవికి యెక్కువ యిష్టం అని.. చెప్పుకుంటున్న రొద విని .. దేవి కి విసుగొచ్చి ... ఇక ఆపండి మీ స్వీయస్తోత్రం. మీ అందరిని సృష్టించిన నాకు తెలియదా మీ గురించి. మీతో పాటు నేను సృజించిన ఆ గడ్డి పూవును చూడండి .. యెంత వినయంగా నా పాదాల దగ్గర వొదిగి వుందో .. అని అందట.

దేవి : జ్ఞానదేవత

పంకం లేనిదే పద్మం పుట్టదు, కానీ పంకం వాసన పద్మానికి అంటదు. జ్ఞానవంతుడికి ప్రచారం అవసరంలేదని నా భావన. 



10, డిసెంబర్ 2018, సోమవారం

కవి ఉదయం

కవిత్వమంటే 


మనిషీ .. 


కవిత్వమంటే  

మురుగు కాల్వలో 

కొట్టుకుపోయే క్యారీ బేగ్ కాదు  

మహా సముద్రంలో 

తేలియాడుతున్న డంప్ యార్డ్ కాదు 


కాలయోనిలో యెప్పుడే కవి ఉదయిస్తాడో 

పురిటి వాసన కొడుతూ

నలు దిక్కులెపుడు  చెలరేగుతాడో 

అక్షరాలుగా మారినది 

అతని  హృదయ కంపనలేమో 

వాక్యమై తేలినది అనేకుల 

ఆలోచనల ఆజ్యమేమో 

నింపాదిగా చూస్తే కదా తెలిసేది 


చూసేవాడికేమి తెలుసు కాడి బరువు

భుజం మార్చుకుని చూడు  

కుబుసం విడుస్తున్న నాగు నడుగు 

మిలమిలలాడటం ఎంత కష్టమో 


కవిత్వమంటే..

అంధకార అడవిలో  గుడ్డి  వెలుగు 

మనో వేగాశ్వాన్ని అధిరోహించడానికి 

కాలూనే రికాబు 

గుండెని పొడిచే గునపం

మెదడుకు గుచ్చుకునే పల్లేరు తీపు 

పూలకై దోసిలి పట్టిన మనిషికి  

ఆయాచితంగా లభించిన అగ్ని కణిక.   


(గణేష్ దిన పత్రిక ఆదివారం సంచికలో 09/11/2018.)

3, డిసెంబర్ 2018, సోమవారం

జ్ఞాపకాలు

కాఫీ విత్ కవిత్వం కొద్దీ నిమిషాల్లో   

జీవన వనంలో తనదికాని కాలంలో 
ఓ  పూపొద లేదు యెద సొద లేదు 
మధుపం లేదు మధువు లేదు 
మధు పాత్రలు తప్ప 

రెక్కలు విరిగిన తూనీగల్లేనూ 
రంగు రాళ్ళ సీతాకోకచిలకలను చూసి మురుస్తూనూ 
మనసును  నియంత్రించుకుంటూనూ.. 
కుదరకపోతే  జ్ఞాపకాల గుట్టలను తవ్విపోస్తూనో 

ఎంతైనా ఆలోచనలోనే మాధుర్యం ఎక్కువ 
అనుభవంలో కన్నా  
పూలు పరిమళాల్ని మోస్తున్నట్టు 
మనిషి జ్ఞాపకాలు మోయడం సహజాతి సహజం.
జ్ఞాపకాలు 
మనిషిని మొత్తంగా వెచ్చ బెట్టే చలిమంటలు