3, సెప్టెంబర్ 2011, శనివారం

వీరగాథలు

ఛీ ..వెదవదీ.. జీవితం.. ఎప్పుడు వండి పెట్టడానికో..వంగి వంగి దణ్ణాలు పెట్టడానికో అన్నట్టు కని పారేసినట్టున్నారు..అమ్మ-అబ్బా.

ఆత్రేయ గారు ఓ..పాటలో..ఆడదాని జీవిత సత్యం ఏమిటో.. ఆడాళ్ళు మీకు జోహర్లు అంటూ..రెండు చరణా లలో.. తేల్చి వేసినంత గొప్పగా ఎప్పుడు ఉండునో!

అసలే చదువల  కాలం వచ్చేసి. మంచి-చెడులన్నీ తెలిసిపోయి అణగద్రోక్కుదాం అనుకున్న వాడి తలపై భరతనాట్యం,కూచిపూడి వగైరాల నాట్య రీతులతో..పాటు..బ్రేక్ డాన్సు..రాక్ డేన్సులు చేస్తున్న  కాలం అనుకుంటారు కానీ..

ఎంతెంత దూరం కూసింత దూరం అనుకుంటూ ..మొదటి అడుగులోనే ఉన్నామన్న చిదంబర రహస్యం  మన ఆడోళ్ళకి..తెలీదంటారా? అనుకుంటూ ఉంటూ.. అలా నిరాశ,నిసృహకి లోనవుతూ.. ఉండే మహిళలకి..స్పూర్తి  నిచ్చే  ఒక కథల పుస్తకం గురించి చెప్పడానికి వచ్చాను. చదివి..కాస్తంత... స్పూర్తిని..ఓపికని మూట గట్టుకుంటారని ఆశ.  స్త్రీ-పురుష బేధం లేకుండా చూసేయండీ..అందరూ.

 మన దేశ చరిత్రలో..ఎంతోమంది సామన్యులు అసామాన్యమైన  దైర్య సాహసాలు ప్రదర్శించారో! స్త్రీలు కూడా పురుషులకి ఏ మాత్రం తీసిపోకుండా ఒకోసారి పురుషులని అధిగమించి తమ భర్తలు,కుమారులు అధార్మికంగా ప్రవర్తిస్తే వారికి బుద్దివచ్చేటట్లు చేసారు.

ఈ సమాజం గర్వించదగినవారి గాధలు నేటి యువతీ యువకులకు తెలియడం అవసరం. దైర్యం,సాహసం ,త్యాగం ఈ సమాజాన్ని ముందుకు నడిపించిన లక్షణాలని,అవే రాబోయే రోజుల్లో..ఈ సమాజాన్ని కాపాడగలవని తెలియాలి.అప్పుడే నేటితరానికి తగిన స్పూర్తి లభిస్తుంది అనే ప్రయత్నంలో.. "ఆర్గనైజర్" అనే ఆంగ్ల వారపత్రికలో..ప్రచురింప బడ్డ వీర గాధలని.. తెలుగులో..పరిచయం  చేసారు.  

"చూడు విద్యుల్లతా ! గత  కొద్దిరోజులుగా యుద్దరంగంలో  ఉన్న నాకు ఒకటి తెలిసిపోయింది..మనం ఎలాటి పరిస్థితుల్లోను కోటను రక్షించుకోలెం. అల్లా ఉద్దీన్ ఖిల్లీ కోటను వశపరచుకునే తీరతాడు.దీనిని ఆపడం మనకు సాధ్యం  కాదు. అయితే ..?అమాయకంగా ఆమె  ప్రశ్న. మనిద్దరం కలసి వెల్లిపోదాం..సమర సింహుడి మాటలు..విని..ఆమె చీత్కరించుకుంది...  చిత్తోడ్ కోటపై..మహమదీయ పతాకం  ఎగురుతుంది. రాజపుత్ర స్త్రీలందరు చితికి ఏర్పాట్లు చేసుకున్నారు. శత్రుమూకలు లోపలి జోచ్చుకుని వస్తున్నాయి..వారి ప్రక్కనే..సమర సింహుడు..విద్యుల్లత ఆశ్చర్య పోయింది. ఒక దేశ ద్రోహి తో ..తనకు పెళ్ళా?నేను ఎలాటి పరిస్థితుల్లోను అంగీకరించను..అని పదునైన బాకుని..గుండెల్లో..దింపుకుని..తనువు చాలించింది. 

ఇంకొక..కథ. ఈ  యుద్దాన్ని నేను చూడలేను.ఓ..ముసలి..దృడం గా అంది. బాజీరావు పీష్వా ఉలికి పడ్డాడు.  మళ్ళీ ఆమె ఈ పిల్లవాడిని.. సైన్యంలో..చేర్చుకోండి..అంటూ..పదేళ్ళ మనుమడిని ముందుకు నెట్టింది. బాజీ రావు పీష్వా  ఆ ముదుసలి..పద ధూళిని..కళ్ళకు అద్దుకున్నాడు.   ఎందుకు..ఏమిటి.. తెలుసుకోవాలంటే.. వీరగాధ మాల పుస్తకం చదవాల్సిందే.






అంతే కాదు.. టిప్పు సుల్తాన్  మరణం కి..కారణం ఎవరు? పైజార్ పట్టీ ..అనే మార్గం ఎక్కడ ఉంది ఎందుకు..ఆ పేరు వచ్చింది.. త్యాగ జీవి పన్నాదాయి  ద్యేయం ఏమిటో..అనే విషయాలు తెలుసుకోవాలంటే..  "శ్రీ మణి" గారు అనువదించిన దేశద్రోహితో పెళ్ళా? అనే పేరుతో..వెలువడిన పదమూడు కథల పుస్తకం చదవాల్సిందే! వీరవనితలు ఎందరో..జాతి కి స్ఫూర్తి అందించిన జీవిత గాధలని వీర గాధలుగా..చదువుతుంటే..ఒడలు పులకరిస్తుంది. త్యాగాలు మహిళల వంతు కూడా..అని ఉద్భోదిస్తుంది.

ఈ పుస్తకం సాహిత్యనికేతన్ ప్రచురణ. అన్ని చోట్ల లభ్యం. 

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

మరో రాజేశ్వరి చచ్చిపోయింది

కొన్నాళ్ళ క్రితం నాకొక  విషయం తెలియగానే ఆశ్చర్య పోయాను. నీరజ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటే జీర్ణించు కోలేకపోయాను. ఆదే  విషయం నన్ను వెంటాడింది.
అప్రయత్నంగా "మరో రాజేశ్వరి చచ్చిపోయింది" అనుకున్నాను.

రాజేశ్వరి చచ్చిపోయింది అనగానే  చాలా మందికి టక్కున చలం గారి  మైదానం గుర్తుకు వస్తుంది.

నిజంగా అలాటి కథే ఇది. 

వివాహం స్త్రీకే కాదు పురుషుడికి అవసరమైన తప్పని సరి బంధం. "వాడికేమిటి వాడు మగవాడు, మగవాడు  తిరగక చెడ్డాడట" అనే పాతకాలపు వాసనలు ఇప్పుడు పనికి రావు. ఆలస్యం  అయితే వీడికెవరు పిల్లని ఇవ్వరు  ఎవరో ఒక అమ్మాయని  కాకుండా ఈ తెలివి తక్కువ వెధవాయికి మంచి తెలివైన పిల్లని చూసి పెళ్లి చేయాలి అని అబ్బాయి బామ్మ తమ బంధువుల కుటుంబాలన్నీ గాలించి జల్లెడవేసి ఓ..చక్కని పిల్లని కట్టబెట్టినప్పుడు..ఈ  రాజేశ్వరి అనబడే నీరజ  వయసు పదహారేళ్ళు. 

పెళ్లి అనగానే  అబ్బాయి  తరపు వాళ్ళు పెట్టె నగలు,చీరెలు,పొలాలు  ఆస్తులు ముందు..అబ్బాయి మొద్దు  రూపం. తెలివితక్కువ తనం ఏమి  కనబడలేదు నీరజ తల్లిదండ్రులకి.(అలాగే ఇప్పటి తల్లిదండ్రులకి కూడా అని నా అభిప్రాయం.)

నీరజకి  పెళ్లి అయింది.అత్తా-మామల మాటున బామ్మతెలివితేటల పాటున ఇద్దరి పిల్లల తల్లి యింది.ఇద్దరు  పిల్లలు..స్కూల్ కి..వెళ్ళే కాలానికి బాతిక్ ప్రింటింగ్ &డైయింగ్ నేర్చుకుని..ఒక పది మంది వర్కర్స్ తో ఒక  యూనిట్ నడపడం మొదలైంది. అలాగే  ఆమె పరిచయం అయ్యింది  నాకు.

మా షాప్ కి కావాల్సిన హ్యాండ్ ప్రింట్ చీరలు కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు వైజాగ్ లో ఉన్న దుకాణాదారు నాకు చెపితే కానీ  తెలియరాలేదు నాకు. మాకు కూసింత దూరంలో ఉన్నఆ యూనిట్ గురించి విని  మొదటి సారి  అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడామె  పనితనం,పర్యవేక్షణ అన్నీ చూసి ఆశ్చర్యపోయాను.

ఊరికి చివరగా ఉన్నఇంటిలోనే యూనిట్ నడుపుతూ ఇతర ప్రాంతాలనుండి వచ్చే ఆర్డర్స్ ప్రకారం రంగు రంగుల కలయికతో అందమైన ప్రింట్లతో చీరెలు తయారు చేయించేది. భర్త ఒక మంచి కూడలిలో హాండ్లూమ్ హవుస్ నిర్వహిస్తూ పొద్దున్నే స్కూల్లో పిల్లల్ని దించేసి షాప్ కి వెళ్ళిపోతే తిరిగి రాత్రికే రావడం. ప్రతి పనిని ఆవిడే స్వయంగా చూసుకునేది. గట్టిగా వ్యాపారం నిర్వహించేది.ఎప్పుడైనా నాకు రిమార్క్ పీసెస్ వచ్చినా ఆరునెలల తర్వాత మాత్రమే ఆ పీస్ కి బదులు పీస్ ఇచ్చేది.నేను మనసులో తిట్టుకునేదాన్నికూడా. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే  మనిషి నిక్కచ్చి తనం గురించి తెలియజెప్పడానికి అన్నమాట. 

అలా ఉండే నీరజ  ఒకానొక రోజు తన యూనిట్లో పనిచేసే ఒక వర్కర్తో కలసి ఊరువిడిచి వెళ్లిపోయింది. కొన్నాళ్ళకి ఆమెని వెతికి తీసుకుని వచ్చారు. ఆమె వెంట పడినవాడు వీరి ధనబలం ముందు పరపతికి భయపడి పారిపోయాడు.  తిరిగొచ్చిన  ఆమె ఎన్నాళ్ళో బ్రతికి లేదు. ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇప్పుడు ఆ  బాతిక్ యూనిట్ లేదు. ఆమె భర్త నడిపే షాప్ లేదు.ఈ పట్నం నుండే ఆ కుటుంబం వెళ్ళిపోయి ఏ మూలో ముఖం దాచుకుంది.



ఈ విషయం  ఓ నల్గురు కూర్చున్నప్పుడు..చర్చకు వచ్చింది.

ఒకావిడ ఇలా అన్నారు. "ఆడవాళ్ళకి..కొవ్వెక్కితే ఇలాటి చేష్టలే చేస్తారు" అని తన భర్త  తిట్టిపోస్తుంటే సిగ్గేసింది" అంది. 

ఆమె భర్త యెంత ఉత్తమ పురుషుడో ఎవరికి తెలియదన్నట్టు అంది ఇంకొకామె రహస్యంగా అక్కసుగా.
ఆ విషయం గురించి కొంతమంది అభిప్రాయం ఇలా ("చలం" మైదానం చదివి ఆ ఆలోచనల ప్రభావం ఉన్న వారి మాటల్లో వారి అభిప్రాయాలు.)


నీరజ వివాహము జరిగినప్పుడు  ఆమె   వయసు పదహారు. పెళ్లి అంటే ఏమిటో..తెలియదు.ఓ పెద్దింటి కోడలు కాబోతుంది.అయింది కూడా. భర్త చాకులాంటి కుర్రాడు, చదువుకున్న వాడు, అందగాడు కానేకాదు.అయితే ఏమి ఇద్దరి పిల్లల తండ్రి. ఇంకా ఏం అర్హతలు కావాలి? మగవాడికి అది చాలదా? ఒక తీవ్రమైన ప్రశ్న.

చాలదు.ఆ అమ్మాయి మనసు వికసించాక చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తన కళ్ళతో చూసాక తన దగ్గర పనిచేసే వ్యక్తిలోని చురుకుదనం, ఆకర్షణ, హాస్యోక్తి ఇవన్నీ భర్తలో లేకపోవడం మన్ను తిన్న పాములా డబ్బుకోసం తాపత్రయపడే ఓ..సగటు మనిషి పట్ల ఆమెకి విరక్తి భావం పెంచుకుని ఉండవచ్చు. అందుకే అలా చేసి ఉండవచ్చు. అలా ఉన్నారని నచ్చిన వాడితో వెళ్ళిపోతారా? అనుకోవచ్చు కానీ ఆమె చెప్పిన కారణాలు అవే కావచ్చు

వెళితే వెళ్ళింది. వెళ్ళిన తరువాత తిరిగి రాకూడదు. వచ్చిందా చచ్చినట్టు తిట్టినా, కొట్టినా  భరించాలి. లేకుంటే క్షమా గుణాన్ని,సానుభూతిని ఇముడ్చుకోలేక జరిగిన తప్పు-ఒప్పులకి భాద్యత వహిస్తూ బ్రతికే అర్హత కోల్పోయి త్వర త్వరగా జీవితాన్ని ముగించుకోవాలి.

బొట్టు బిళ్ళ ఎంపిక చేసుకునేంత స్వేచ్ఛ భర్తని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేని అన్నాళ్ళు  ఎప్పుడో..ఒకప్పుడు ఎందుకో ఒకందుకు  ఎవరిపైనో మనసు పారేసుకుని ఎందుకు గడప దాటాలి? దాటినా మళ్ళీ ఎందుకు తిరిగి రావాలి? ఆ వెంటపడి వెళ్లినవాడి  నిజ స్వరూపం తెలిసిపోయి భ్రమపడితిని, పొర బడితిని అని చింతించినదా?

అవును నీరజకి ఈ ఆలోచనలు ఎందుకు రాలేదు.ముందువెనుకలు ఆలోచించకుండా,విచక్షణా జ్ఞానం లేకుండా ఓ పిరికివాడితో,నట్టడివిలో ఒదిలి పోయే  వాడిని నమ్ముకుని ఎందుకు వెళ్ళాలి.

స్త్రీకి శరీరం ఉంది వ్యాయామం కావాలి.
స్త్రీకి మెదడు ఉంది ఆలోచన ఉండాలి.
స్త్రీకి హృదయం ఉంది అనుభూతి ఉండాలి.
నిజమే ఇవన్నీ కావాలి వాటితోపాటు లోకజ్ఞానం, విచక్షణా జ్ఞానం కూడా కావాలి.
గుంటనక్కల్లాంటి పురుషుల పాల్బడకుండా ఉండే తెలివితేటలూ కావాలి. ఇవన్నీ లేకుండా మనసు పడిన మగవాడిని అత్యంతంగా ప్రేమించే మనసు మాత్రం వద్దు. అలాంటి ప్రేమించే కొంత మంది భాషలో కామించే మనసు ఉంటే రాజేశ్వరి లు వీధి వీధినా ఉంటారు.

ఇలా సాగుతూ మంచి-చెడులు ఎంచుతూ రాయి విసిరే అర్హత లేకున్నా అడుగడుగునా మాటలతో కుళ్ళ బొడిచే లోకంలో రాజేశ్వరి  లాటి నీరజ బ్రతకడం అవసరమా? అందుకే చచ్చిపోయింది.

ఆవును తప్పు నీరజ ది మాత్రమేనా? నాకు.సమాధానం దొరికే లోపు రెండు స్ట్రాంగ్ కాఫీలు, ఓ తలనొప్పి మాత్ర మాత్రం కావాలి. మరొక బ్లాగ్ పోస్ట్ అవసరపడుతుంది.

1, సెప్టెంబర్ 2011, గురువారం

మై డ్రీమ్స్

ఒక సరదా సన్నివేశం 

అమ్మ  తన కొడుకుతో  ఇలా..అంటుంది.. "ఈ చిత్రం నా చిన్నప్పటిదని నీకు తెలుసా ? " అని 

ఆ చిత్రం ఇదిగో..మీరు చూడండీ..!!


చూసారు కదా? 

అబ్బ..ఛా.. అనకండీ.. ఆ అమ్మ కొడుకులా.. 

"నిజం బంగారం..నా చిన్నప్పటి నుండీ అలా కలలు కన్నాను..నీ లాంటి కొడుకు పుట్టాలని.." అంటుంది ..మనఃస్పూర్తిగా ..

ఇక మాటలు ఏముంటాయి....!? 

చిరునవ్వులు.. తప్ప.  

 ఇంట్లో ఇలాటి  సరదా సన్నివేశాలు.. చాలా.. ఉంటాయి.

వారిద్దరూ మంచి స్నేహితులు కూడా !

ఇదిగో..ఇక్కడ ఆ..అమ్మ - అబ్బాయి.