12, ఏప్రిల్ 2012, గురువారం

"మానవి " గురించి ఓ..మానవి..





"మానవి " గురించి ఓ..మానవి..

పెద్దల ఇష్టాలతో బేరసారాలు ముడిపడిన పెళ్ళిలో.. 

20  సంవత్సరాలు ఏదైతే తన సంపూర్ణ జీవితం అనుకుందో..ఆ జీవితం తనదికాదని తెలిసినప్పుడు..తన ఆశలు అడియాసలై.. కట్టుకున్న ఆకాశ హర్మ్యాలు పేక మేడలా కుప్పకూలిపోయినప్పుడు  కానీ భారతీయ వివాహ వ్యవస్థ లోని డొల్లతనం అర్ధం కాలేని  స్త్రీ.. వసంత. 

జీవితమంతా   వసంతంలా సాగిపోవాలనుకునే  అతి సామాన్యమైన స్త్రీ. 

ఆమె గుంటూరులో డిగ్రీ చదువుకునే రోజుల్లో కూడా విద్యార్ధి సమస్యలకి మద్దతునివ్వని, ఉక్కు కర్మాగార ఉద్యమంలో గళం కలపని బుద్దిగా ఒద్దికగా చదువుకుని డిగ్రీ పూర్తి చేసిన అమ్మాయి. 
రంగనాయకమ్మ నవలలోని మొగుడులాంటి మొగుడు తనకి దొరకగూడదని ప్రార్దిస్తూ,యద్దనపూడి నవలా నాయకుడు నాకు ఎక్కడ దొరుకుతాడులే ఆని అనుకుని నిరాశపడే అమ్మాయి. 

ప్రేమ దోమ లేకుండా తల్లిదండ్రులు కుదిర్చిపెట్టిన సురేష్ ని వివాహం చేసుకుని డాక్టర్ గారి భార్య అయింది. ఇద్దరి బిడ్డల తల్లి అయింది. నా ఇల్లు, నా సర్వస్వం నా భర్త, నా బిడ్డలే   నాప్రపంచం అనుకుంటూ అందులో ముని గిపోయింది.

భర్తకి టూత్ బ్రష్ పై  పేస్ట్ దగ్గరనుండి,బయటకి వెళ్ళేటప్పుడు ఇచ్చే కర్చీఫ్ వరకు స్వయంగా అందిస్తూ భాద్యతగా గృహిణిగా..తన కర్తవ్యమ్ నిర్వహించేది. తనకున్న ఇద్దరి కూతుళ్ళ లో లావణ్య అంటే ఎక్కువ ఇష్టం.ఆమె మాట  తుచ తప్పకుండా వింటుందని.  ఇక రెండో కూతురు నవత   అంటే..కొంచెం విముఖం.తన మాట అసలు వినదని.   చదువంటే పెద్ద ఆసక్తి లేని లావణ్యకి పెళ్ళి  చేసి అత్తగారైంది.  

అలాటి వసంత జీవితంలోకి .. వడగాల్పులా నీలిమని  తీసుకువచ్చి వదిలేసాడు భర్త సురేష్. 
కుటుంబంలో భార్య భర్తలమధ్య ప్రేమ,అనురాగం,సదవగాహన లోపిస్తే కుటుంబ వ్యవస్థ తాత్కాలికంగాను, శాశ్వతం గాను దెబ్బతినే అవకాశాలు ఉన్న్తాయి.  సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య బలహీనతలు ఉండటం,సర్దుబాటు లేకపోవడం వల్ల వివాహ సంబందం తెగిపోవడమనేది జరిగిపోతుంది. 

ఈ నవలలో అదే జరిగింది. పెళ్ళయిన ఇరవై సంవత్సరాల కాలంలో ఏనాడు భార్య పై ప్రేమ  కలగ లేదని..తోటి డాక్టర్ నీలిమపై తనకు ప్రేమ కల్గినది అని ఆమెని వదులుకోవడం కష్టంగా ఉందని.. రహస్యంగా దాచి వసంతని మోసం చేసే ఉద్దేశ్యం తనకి లేదని  ఆమెకి  చెపుతాడు సురేష్. ఇకపై వసంత కలసి ఉండటం ఇష్టం లేదని కూడా చెపుతాడు.

అయ్యో! ప్రేమ అంటే ఏమిటి..? భర్తని నేను ప్రేమించాలని నాకు ఎవరు చెప్పలేదే..? అయినా మీ నాన్నకి ఇప్పుడు ప్రేమ ఏమిటే? ఇన్నేళ్ళ మా బంధంలో ప్రేమ లేకుండానే కాపురం చేసానా!? అని విస్తుపోయే సగటు భారతీయ స్త్రీ వసంత. 

ఇరవై ఏళ్ళు కాపురంచేసి భర్తపై హక్కులైతే సంపాదించుకుంది కానీ అతని మనసులో  తన పై ప్రేమ లేదని తెలుసుకుని మనసులో కుమిలిపోయి.. అమ్మా ! లావణ్యా..నా తరపున వఖల్తా పుచ్చుకుని అమ్మకి అన్యాయం చేయవద్దని మీ నాన్నకి నువ్వైనా చెప్పమ్మా! అని దీనంగా  వేడుకుంటుంది.

ఆ లావణ్య అనే కూతురు భర్త తో కలసి వచ్చి ఆస్తులని పంపకం చేసుకుని.. నాన్నని ఎలాగోలా నువ్వే ఓపికగా మార్చుకోవాలి గాని..మా అత్తవారింట్లో ఈ విషయం తెలిస్తే యెంత నామోషి అనే  కూతురిని చూసి వసంత నిర్ఘాంత పోతుంది. సగటు స్త్రీలా భర్తని నలభై ఏళ్ళ ప్రౌడ ప్రాయంతో..ఆకర్షించడానికి ప్రయత్నించి విపలమై..
భర్త పరాయి స్త్రీతో కలసి ఉంటూ తనని నిర్లక్ష్యం చేయడాన్ని భరించలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది.

ఆమెని బ్రతికించి వసంత స్నేహితురాలు రోహిణి ఇంటికి పంపించాక అక్కడ మరో స్నేహితురాలు  అవివాహితురాలు శాంత కి ఆమె స్నేహితుడు రాధాకృష్ణ కి గల సంబందాన్ని  అసహ్యించు కుంటూనే social  dis organisation  గురించి తెలుసుకుంటుంది. వివాహ వ్యవస్థలో లేని ప్రేమ గురించి, అంతకు క్రితం ఆమె ఎప్పుడో చదివిన నవలలోని భర్త ప్రేమ కోసం దేవులాడే ఆడవాళ్ళ గురించి  గుర్తు తెచ్చుకుని.. వారి స్థానంలో తనని పోల్చుకుని వ్యద చెందుతుంది.   

 పెళ్ళి  అనేది కుటుంబం సభ్యుల మధ్య,సమాజంలో ఇతర సమూహాల మధ్య లైంగిక సంబంధాలని క్రమ బద్దం అయితే చేయవచ్చోమో కానీ ప్రేమ ఆధారం లేని పెళ్ళి  అనే భవనం ఏదో ఒకనాడు కుప్పకూలి పోతుందని తెలుసుకుంటుంది. పురుషుల అక్రమ సంబందాలు,బహు వివాహాలు వల్ల ఇలాంటివి  జరగడం వివాహిత స్త్రీలకి అమితమైన బాధ కలగడం జరుగుతూనే ఉంది కదా! ఆమె విషయంలోను అదే జరిగింది

వసంత తను  సురేష్ భార్యగా  హోదా కోల్పోతానని బాధ పడుతూ సమాజంలో మొగుడు వదిలేసిన, లేదా మొగుడుని గుప్పిట పెట్టుకోలేనితనం అని  అందరూ ఎద్దేవా చేస్తారని బాధపడుతూ సంఘర్షణతో  పిచ్చిదయి పోయి  భర్త తో కలసి ఉండటం ఇష్టం లేక తన ప్రమేయం లేకుండానే భర్త నుండి విడదీయబడుతుంది.  చివరకు అన్నీ పోగుట్టుకున్న భావనలో జీవశ్చవంలా మారి చిన్న కూతురు నవతతో ఆమె ఉంటున్న విశాఖపట్నం చేర్చబడుతుంది. 

అక్కడ నవత స్నేహితులని,ఆమె స్నేహితులు ఆమె కలసి చేసే ఉద్య మాలని గమనిస్తూ  ఆనారోగ్యంగా ఉన్న ఉద్యమకారునికి  సేవే చేస్తూ తనలో ఉన్న తనని  గుర్తించుకుంటుంది. 

స్త్రీ కి జీవితం అంటే పెళ్ళి ,పిల్లలు,ఇల్లు మాత్రమే కాదని జీవితం లో వాటికి అధిక ప్రాధాన్యత నివ్వడం మూలంగా బలహీనమైన అనుబందాలు నిలబడలేనప్పుడు వ్యద చెందక తప్పదని గుర్తించింది వసంత. 

సిద్దాంతాల కోసం ఉద్యమంలో నడిచే వారు కొందరైతే, సిద్దాంతాలు ప్రక్కన పెట్టి ఇతరులకిమంచి జరుతుంది అనుకుంటే  ఆ విధంగాను నడిచే కొందరు  ఉద్యమ కారులుని,  అలాంటి లోకంని  తన కళ్ళతో తానూ చూసి ..నిర్ధారించుకుని వాటి గురించి అనర్ఘళంగా  మాట్లాడే స్థాయికి ఎదిగిన వసంతని చూస్తే మనకి ఆశ్చర్యం కల్గుతుంది.  ఈ వసంత ని  చూస్తే భర్త ప్రేమకి నోచుకోలేదని ఆత్మ హత్య చేసుకోబోయిన వసంత యేనా ఈమె అని అనుకుంటాం. 

ఆఖరికి కొన్ని నెలల తర్వాత చూసిన భర్త ని చూసి కూడా ఆమె మనసులో కోపం,భాద కలగకపోవడ అనే లక్షణాలని చూసి ఆశ్చర్య పోతాం.  చిన్న కూతురు మాటలతో, చేతలలో కనిపించే వ్యక్తిత్వం, ఆధారపడని తత్త్వం, స్నేహశీలత..ఇవన్నీ ఆమెకి ఒక  కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. 

నవత తన స్నేహితురాలు రాజ్య లక్ష్మి యవ్వన ఉద్రేకం లో చేసిన పొరబాటు ఆమె తనని వివాహం చేసుకో వాలనుకున్న  అతనికి   ఆ సంగతి చెప్పడం, ఎంతో  ఆదర్శ వాదులుగా కనిపించే ఉద్యమకారులు స్త్రీ శారీరక శీలానికి   ప్రాధాన్యత నిస్తూ సగటు మగవారిలా ప్రవర్తించడం, మరొక పురుషుడు..ప్రేమించినప్పుడు  అతను ఆమె వ్యక్తిత్వానికే  గాని శీలం అనే పదానికి  ఎక్కువ  విలువ ఇవ్వకపోవడం అనే విషయాలతో  (మనసుఅంగీకరినచని,సాంప్రదాయవాదులు ఆమోదించని) విషయాలు ) పాటు.. శాంత -  రాదాకృష్ణ మధ్య  ఉన్న పెళ్ళి  లేని ప్రేమ సంబంధాలు , ఆ సంబంధాలకి  సమాజంలో ఉన్న విలువ.. వాటికి ప్రాధాన్యత నివ్వకుండా.. వారికి నచ్చిన జీవన మార్గంలో నడిచే వారిని   ఈ నవలలో మరొక కోణంగా  చూస్తాం.మెదడుని తొలిచే ఆలోచనలతో  పెళ్ళి లేని ప్రేమల గురించి, సహజీవనం గురించి ఆలోచిస్తాం.

ఈ నవలలో నన్ను అమితంగా ప్రభావితం చేసిన పాత్ర "వసంత"
భారతీయ సాధారణ గృహిణిగా మనకి పరిచయమై.. నవల ముగింపుకి వచ్చేసరికి ఒక మనిషిగా, మానవిగా పరిణామ క్రమంలో ఎదిగిన స్త్రీగా చూపడం నాకు బాగా నచ్చింది. 

ప్రేమ లేకపోయినా కుటుంబం ఉంటుంది. 
అదే ప్రేమ లేని స్త్రీ-పురుష అనైతిక సంబంధాలు ఉన్నాయి.
ప్రేమని ఆశించి, ప్రేమని ఇచ్చి, ప్రేమని పొందుతూ  సమాజానికి  వెరవని , కుటుంబ కట్టుబాట్లు లేని స్త్రీ-పురుష సంబంద భాంధవ్యాలు  ఉంటాయని  వాటి గురించి  కూడా చెపుతుంది ఈ నవల. 

భారతీయ సమాజం లో కూతురిగా మాట వెల్లడించుకునే స్వేచ్చలేక, భార్యగా మారిన   ఇరవై ఏళ్ళ తర్వాత కూడా భర్త ప్రేమకి నోచుకోక,తల్లిగా బిడ్డలని ప్రభావితం చేయలేక,వారి మనసులో తల్లిగా మంచి స్థానం సంపాదించుకోలేక..అదే సమస్త  జీవితం అనుకుని బ్రతికిన వసంతకి జ్ఞానోదయం కలుగుతుంది. 

భర్త వద్దన్నప్పుడు ఏ ఆధారం లేకుండా పోతుందని,  ఏ భద్రతా లేదని భావించిన వసంత ..కళ్ళకి కదలిక వచ్చింది.కళ్ళు చూడటం నేర్చుకుంటాయి,నోరు మాట్లాడుతుంది,జీవ శక్తి నింపుకుని ప్రవహించడం మొదలెట్టి భార్య నుండి,తల్లి నుండి వేరై..ప్రవహించడం మొదలెట్టింది..

ఆడదాని జీవితంలో ఏదో ఒక రోజు మనిషిగా మానవిగా మారాల్సిన రోజు వస్తుందని,అట్లా మారే శక్తి లేకపోతే. మారడానికి ఏ ఆధారం లేకపోతే సర్వనాశనం అయిపోతాం అని, ప్రాణాలు ధారపోసి అయినా మనుషుల్లా మారడానికి కావాల్సిన శక్తి సంపాదించుకోవాలని చెపుతూ కూతురికి ఉత్తరం రాస్తుంది వసంత.

 అలాగే ఎవరి జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉండాలని ఆ జ్ఞానం రావడం చాలా అవసరమని మీ అమ్మ ఒకరి భార్యగా కాకుండా ఒక వ్యక్తిగా బతుకుతుందని గర్వపడమని,నలుగురుకి సాయం చేస్తున్నందుకు సంతోషించమని చెపుతుంది.    తల్లి ప్రేమని బిడ్డలు అర్ధం చేసుకోవాలని,బిడ్డలకి చాకిరి చేసి పెట్టె అమ్మలుగా చూడటం కాకుండా..మనిషిగా చూడటం నేర్చుకోమని చెపుతూ.. నువ్వు..నాలా ఒకప్పటి వసంతలా కాకుండా ఒక వ్యక్తిలా గుర్తించుకునే రోజు కోసం ఎదురు చూస్తాను" అన్జెప్పి  ఉత్తరం ముగిస్తుంది.

మన భారతీయ సమాజంలో లక్షలాది వసంతలు ఉన్నారు. కొద్ది గొప్ప తేడాలతో వారి జీవితాలు చాలా వరకు అలాగే ఉంటాయి. వివాహ వైఫల్యంతో,సమాజంలో చులకన భావం ఏర్పడుతుందని , పుట్టింటి వారి ఆదరణ ఉండదని ,  ఆర్ధిక భద్రత లేకపోవడం లాంటి  విషయాలతో..  వెనకంజ వేస్తూ .. జీవితం కొల్లగొట్టబడి.. జీవశ్చవాలుగా..మిగిలిన వారు కనబడతారు. వారికి ఏం కావాలో తెలియని స్థితిలో ఆత్మహత్యా ప్రయత్నాలతో, లేదా మానసిక వికలాంగులై బ్రతుకుతూ హిస్టీరియా రోగులుగానో,రాక్షసుల్లాగా ప్రవర్తించే వారిగానో మారిన వారందరూ గుర్తుకువచ్చి  వారందరిపైనా సానుభూతి కల్గుతుంది. 
అలాంటి వారందరూ  నిజాన్ని గుర్తించి మళ్ళీ  నడక మొదలెట్టి  జీవితాన్ని సాగించాలనే స్ఫూర్తి వంతమైన సందేశం  ఈ నవలలో ఉంటుంది.

1989   డిసెంబర్ చతుర నవలగా వచ్చిన ఈ నవల 1998లో ప్రధమ ముద్రణ వచ్చింది. అప్పటి నుండి.. నేను ఈ నవల కొంటూనే ఉంటాను. బలహీన మనస్కులైన వసంత లాటి స్త్రీల కోసం ఈ నవల  నా నుండి బహుమతిగా అందుతుంది. 
అవును వసంత లాంటి వసంతలు ఉండకూడదు. ఈ నవల చదువుతుంటే..ఎన్నో సార్లు హృదయం ద్రవించి పోతుంది. వసంత పాత్రలో నన్ను నేను చూసుకుంటే పుట్టెడు దుఖం ముంచుకొస్తుంది.నెమ్మదిగా లేచి నిలబడి తడబడి అడుగులు వేయడం నేర్చుకున్న వసంత గుర్తుకు వస్తుంది. 

స్త్రీ జీవితంలో ప్రేమ,పెళ్లి,పిల్లలు.. కొంత భాగం మాత్రమే పూర్తి భాగం మాత్రం అవి  కానే కాదు. అలా అనుకున్నప్పుడే వసంత లు లేకుండా.."మానవి"మాత్రమే ఉంటుంది. అందుకే..మానవి నాకు చాలా  ఇష్టమైన నవల అయింది.

నేను చదవడం నేర్చినప్పటి నుండి ఎన్నో పుస్తకాలు చదివాను. కానీ నన్ను అమితంగా ప్రభావితం చేసిందనడం కన్నా, నాకు నచ్చిన నవలల్లో  మొదటిది,ఆఖరిది  కూడా అయిన నవల ఇది.  స్త్రీ ఒక కూతురు,ఒక సోదరి,ఒక భార్య,ఒక తల్లి వీటి అన్నిటికన్నా ముందు ఒక  మనిషి అన్నది ఎరింగి ఉండాలన్నది ..ఓల్గా గారి అభిప్రాయం మాత్రమే కాదు.. స్త్రీల అందరి అభిప్రాయం.కూడా. అలా అందరు అనుకున్నప్పుడు నాకు "మానవి" నవల కొనడం అవసరపడదు. 

ఈ నవల దొరుకు చోటు నవోదయ బుక్ హౌస్, విశాలాంద్ర బుక్ హౌస్, ప్రజా శక్తి బుక్ హౌస్.     .

(మిత్రులు ఎక్కడైనా  ముద్రా రాక్షసాలు ఉంటే మన్నించగలరు) 

అలాగే ఈ పోస్ట్ పై ఆరోగ్యకరమైన చర్చకి ఆహ్వానం.

11, ఏప్రిల్ 2012, బుధవారం

ఈ రోజుల్లో

ఈ రోజుల్లో...


అవునండీ .. ఈ రోజుల్లో...నే.. అది ఒక సినిమా పేరు.. అలాగే.. సమయోచితం కూడా గుర్తు చేస్తూ.. ఒక మహత్తరమైన పాట..(అబ్బే..నాలాటి కంట్రీ ఉమెన్ కి నచ్చని) యూత్.. కి బాగా నచ్చుతుంది అనుకుంటాను. 
సినిమాల లోని సంభాషణ లని యువత  అనుకరిస్తున్నారా..లేక యువత మాట్లాడే భాషని సినిమాల లోని సంభాషణ లాగా వ్రాస్తున్నారా?

ఇది పిల్లల దిగజారిన భాషా సంస్కారమా..లేక..సినిమా సంస్కారమా? 
పిల్లలు మాటలాడే భాషని పెద్దలు ఇండ్లలలో మర్చలేరా?  

ఏమిటో..నండీ..నాకు" రామ " అంటే..______ మాట లాగా వినబడుతుందని అనుమానంగా ఉందని తీర్మానిన్చేస్తారేమో.. అన్న దిగులు,భయం ఉంది. ఏం చేయాలి చెప్పండి. ?  

ఇదిగో..ఈ పాట విని   " సెల్ "    సంభాషణ లు.. పాటగా.. ఎలా ఉన్నాయో..కాస్త చెబుదురూ...! కొంత మంది అమ్మాయిలూ..తప్పేముంది? బయట  ఎలా మాట్లాడుకుంటున్నారో..అలాగే ఈ పాట ఉంది అన్నారట. 

అలా మాట్లాడే పిల్లల్లో.. మా అబ్బాయి  ఉండకూదదనుకుని.. ఈ పోస్ట్.
ఎవరికైనా ..ఇలాటి తరహా సంభాషణలు నచ్చకుంటే.. సినిమా బాగుందా లేదా అని కూడా చూడవద్దు..నిరసన తెలిపి.. గళం విప్పి చెప్పండి. "ప్రశ్నిస్తే.. పోయేది ఏం లేదు.. రాబోయే  చైతన్యం తప్ప".. 

10, ఏప్రిల్ 2012, మంగళవారం

ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం

అమ్మాయిని అత్తవారింటికి పంపించేటప్పుడు.. చెప్పవలసిన నాలుగు  మంచి మాటలు కోసం కౌన్సిలింగ్ ఇప్పించాలి.
అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత కలిగే అనుమానాలకి,భయాలకి కౌన్సిలింగ్ ఇప్పించాలి.
భార్య-భర్తల మధ్య బేదాభి ప్రాయాలు వస్తే కౌన్సిలింగ్ కావాలి.
తల్లిదండ్రులకి బిడ్డలా భవిష్యత్ ఏమిటో అర్ధం కానప్పుడు పిల్లలకి కౌన్సిలింగ్ కావాలి.
ఈ కౌన్సిలింగ్ అవసరాలు బాగా పెరిగిన రోజులివి.
 నేను అయితే ఈ కౌన్సిలింగ్ ల బదులు ఒక పుస్తకం కొని ఇవ్వండి అని చెపుతాను ..ఆ పుస్తకం పెద్ద బాలశిక్ష
ఆ పుస్తకం ఉంటే.. చాలా మంది పెద్దలు మన ప్రక్కన ఉండి..మంచివిషయాలు చెపుతూ,భయాలు,సందేహాలు తీరుస్తున్నట్లే ఉంటుంది కూడా.
అమ్మాయిని అత్తవారింటికి పంపేటప్పుడు ..చెప్పవలసిన విషయాలు ఉన్నఒక  శతకం..కుమారి శతకం.ఉన్నదని..నాకు అసలు తెలియదు.అలాగే గువ్వల చెన్న .. అంటూ సాగిన పాట సిరివెన్నెల చిత్రంలో విన్నప్పుడు.. అది ఒక శతకం అని తెలియదు...
ఎప్పటిదాక అంటారా!? నేను పెద్ద బాల శిక్ష చూసేదాకా. మొదటి సారి నేను నెల్లూరు లో మా కుటుంబ స్నేహితుల ఇంట్లో .. పెద్ద బాల శిక్షని చూసాను.
చిన్నప్పుడు నేను పెదబాలశిక్ష చదవలేదు.ఎందుకో..మా ఇంట్లో ఆ "విజ్ఞాన సర్వస్వం " ఉండేది కాదు.  మా అబ్బాయి కోసం నేను "పెద్ద బాలశిక్ష' కొనుక్కుని వచ్చాను.. కానీ ఇప్పటికి రోజు ..ఆ పుస్తకం తీసుకుని చదవడం అలవాటు అయిపొయింది.
మా అమ్మ నన్ను కాపురానికి పంపేటప్పుడు.. చాలా సామాగ్రి తో పాటు... భారత,భాగవత,రామాయణ గ్రంధాలు కొని ఇచ్చింది.
ఖాళీ సమయాలలో ఈ గ్రంధాలు కూడా తప్పకుండా చదువుకో..అని. అప్పటివరకు అన్నిపుస్తకాలు చదవనిచ్చిన అమ్మ ఇప్పుడు ప్రత్యేకంగా ఇంతంత..లావు పుస్తకాలు కొని ఇచ్చింది ఏమిటి..చాదస్తం.ఆ శ్లోకాలు..అర్ధాలు చదవడం ఎవరి తరం అనుకునేదాన్నివిసుగ్గా. అదే మాట అమ్మతో అంటే..ఇలా ఈ మహాత్గ్రంధాలు ఇవ్వడం మన సంప్రదాయం అని చెప్పింది.
అంతకు ముందు..మాఇంట్లో పూజ గదిలో ఓ..పీటమీద ఆ మూడు..గ్రంధాలు ఉండేవి. "శ్రీ మద్భాగ వద్గీత " లోని ఒక శ్లోకం ని..తాత్పర్యoని ...ని పూజ ఆఖరి సమయంలో చదువుకుని..పిల్లలు ఉంటే మాకు వినిపించి.. ఆ గ్రంధాన్ని మూయకుండా ..చదివిన పేజీపైన పువ్వులు అక్షితలు ఉంచి నమస్కరించడం చేసేవారు.అమ్మ,నాయనమ్మ కూడా.  
 అలా అది చూసిన ఉత్సాహంలో పదవతరగతి పరీక్షలు వ్రాసాక సెలవలలో..ఏం తోచక "శ్రీ మద్భాగ వద్గీత" ఏక దీక్షగా చదువుతుంటే..ఈ వయసులో చదవకూడని.. లాగి పడేసేవారు. ఏమిటో..ఈ పెద్దవాళ్ళు ఎప్పుడు ఏం చేయమంటారో!వాళ్ల్లకే తెలియదు అని మనసులో స్టేట్ మెంట్ లు ఇచ్చేసుకుని... ఏ పొట్లం కట్టి ఇచ్చిన పేపర్ ముక్కతో..సహా సుదీర్ఘంగా చదివి పడేసేదాన్ని.
పదిహేడేళ్ళు నిండిన రెండు నెలలకే  చదువులు వద్దని పెళ్లి చేసి పడేసి.. ఇప్పుడు అత్తగారింట్లో..ఇంతలావు పుస్తకాలు చదువుకోమని ఇస్తారు ఏమిటీ..అని తిట్టుకున్నాను అనుకోండి. కానీ ఆ మహా గ్రంధాలు మాత్రం నాకు అసలు చదివినా తలకేక్కేవి కాదు.
కానీ ప్రతి ఇంట్లో ఉండాల్సిన .. పుస్తకం ఒకటుంది... అని తర్వాత  కదా తెలిసింది. పెళ్లి అయినాక రెండేళ్ళకి
పెద్ద బాలశిక్ష ని కొనుక్కోచ్చుకుంటే..ఇంకా చిన్న పిల్లవా!?..పెద్ద బాలశిక్ష చదవడానికి అని పరిహాసమాడితే.. అలా ఓ..లుక్ నిరసనగా పడేసి..అందులో మునిగి పోయేదాన్ని.
తర్వాత ఎవరికైనా బహుమతి ఇవాల్సి వచ్చినప్పుడు..పెద్ద బాలశిక్షని ఇవ్వడం అలవాటు చేసుకున్నాను. విదేశాలలో  ఉన్న వారికి ఎవరికైనా ఇచ్చినా బరువు ఎక్కువ ఉన్నా కూడా వేరే వస్తువులు తగ్గించుకుని పెద్ద బాలశిక్ష ని తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాం అని చెపుతుంటే  చాలా సంతోషంగా కూడా ఉంటుంది.
ఇప్పటికి రోజు న్యూస్ పేపర్ తో పాటు..పెద్ద బాల శిక్ష పట్టుకోచ్చుకుని..ఓ..చేతిలో కాఫీ కప్పు..తోపాటు  అందులో ఉన్న ఆసక్తి కర విషయాలని .. కూడా  త్రాగేసి.. నిత్య నూతన పెద్ద బాలశిక్ష విద్యార్ధిని.అనిపించుకుంటాను.


గాజుల సత్యనారాయణ గారి పెద్ద బాల శిక్ష  2004  వ సంవత్సరం నుండి  ఇప్పటికి 72 ముద్రణలు అయ్యాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వేల 116 రూపాయలు మాత్రమే! పది కి పైగా కాఫీలు కొంటె.. 100 ..లెక్కన ఇస్తారు.డిస్కౌంట్ ఉంటుంది. (నేను అప్పుడప్పుడు అలా కొంటూ ఉంటాను)
చిన్న పిల్లలకి ఒక బొమ్మ బహుమతిగా ఇవ్వడం కంటే ఒక పుస్తకం ఇవ్వడం బాగుంటుంది అని. ఇంగ్లిష్ డిక్ష్ట నరీ  ఇవ్వడం మానేసి ఈ మధ్య పెద్ద బాల శిక్ష ఇస్తున్నాను. గాజుల సత్యనారాయణ గారి పెద్దబాలశిక్ష కాకుండా.
.
కూడా ఉంది.
యది హాస్తి తదన్యత్ర
యన్నేహాస్తి నత్ త్ క్వచిత్ ..
మహా భారతంలో ప్రచారం పొందిన జనవాక్యం .
ఇది పెద్ద బాలశిక్షకి  వర్తిస్తుంది..కదా!
మా ఇంట్లో ఉన్న పెద్ద బాలశిక్ష.. ఎప్పుడు బహుమతి కోసమే సిద్దంగా ఉంటుంది.  మళ్ళీ కొద్ది రోజులకి వస్తుంది. నేను చెప్పే ఒక మాట ఏమనగా.. ప్రతి ఇంట్లో ఒక పెద్ద బాలశిక్ష ఉండాలి. రామాయణ,భారత ,భాగవతములు లేకపోయినా సరే!
(ఈ విషయాన్ని పంచుకోవడానికి  స్పూర్తి కరం అయిన  సామాన్య గారికి ధన్యవాదములతో)