31, ఆగస్టు 2013, శనివారం

ఆకుపచ్చ రంగు ఆశ

మా పెనమలూరు అంటేనే పచ్చని ప్రకృతి. కానీ ఇప్పుడంతా కాంక్రీట్ భవనాల సముదాయం . ఇలా ఆహ్లాదకర వాతావరణం ని బంధించినప్పుడు ఇలాంటి దృశ్యాలని ఇకముందు చూడలేమన్న దిగులు మొదలవుతుంది .. గత నాలుగేళ్ల నుంచి అనూహ్యంగా మా వూరి ముఖచిత్రం మారిపోతుంది. అభివృద్ధి కన్నా మూలాలు నాశనం కావడమే బాధగా ఉంది . ఎటుచూసినా భూమికి ఆకుపచ్చని రంగేసినట్లుండే పరిసరాలు కనుమరుగవుతూ ....................

ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది ..  

మచిలీపట్నం రోడ్డు వెంబడి భూమి విలువ ఎకరం ఒక కోటి ముప్పై లక్షలు దాటుతుంది .  తామరతంపరగా నెలకొంటున్న కార్పోరేట్ కాలేజ్ లు ,విస్తరిస్తున్న కాలనీల సంస్కృతీ .. వ్యవసాయం ని దూరం చేస్తున్నాయి . అభివృద్ధి - సోమరితనం రెండు పోటీ పడుతున్నాయి.  నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత పరిడవిల్లుతుంది అంటే ఇలాగేనేమో మరి !



అడవులు  ఉండేవి.. అన్నగుర్తుకు..
ఆనవాళ్ళుగా మిగిలిన మొదలంటా.. నరికిన మోళ్లు..
ఒట్టిపోయిన పుడమి తల్లి ఒడిలో..
పచ్చదనాలు స్థానే .. ఆక్రమిస్తున్నఎడారులు ..
కాలుష్య పరిమాణాన్ని సూచించే..
ఎలక్ట్రానిక్ . డిస్ప్లే బోర్డులు.. 
మునిగిపోతున్న ద్వీపకల్పాలతో.. 
ఎటు చూసినా.. నీరే!. 
తాగేందుకు చుక్క కూడా లేదనుకుంటూ .. 
మనం పడే.. పాట్లు...
ఎక్కడ ఉంది.. ప్రకృతి..? 
మనిషి వికృత  చేష్టలకి  మలిగి.. 
సాధించిన ప్రగతి ముంజేతి కంకణం లా..
గ్రీన్ హౌస్  ఎఫెక్ట్ .. అనే అద్దంలో..  కనబడుతుంటే..
చాపక్రింద నీరులా.. కబళిస్తున్న కాలుష్యం లో మునిగి తేలుతున్నాం
మలమలలాడుతూ..భూమండలం.. అగ్నిగుండమవుతుందని వాపోతున్నాం
నీటికై.. మరో.. ప్రపంచ యుద్ధానికి.. సమాయుతం అవుతున్నాం
క్షామంతో.. మన జీవనాలు.. అతలాకుతలం కావడం నిజం .
విచ్చల విడి వినియోగాన్ని మానేద్దాం
భావితరంకి ప్రకృతి  ఆకృతిని ..మిగుల్చుదాం
మొక్కలని  మొక్కవోని దీక్షతో..  నాటి...
భూమికి .. ఆకుపచ్చని రంగు వేద్దాం
(అని ఓ.. ఆశ )

ఈవిషయం ఓ.. 11 ఏళ్ళ క్రితం వ్రాసుకుంది . ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంది

28, ఆగస్టు 2013, బుధవారం

అష్టమి కష్టమా!?

నిన్న నాకు  ఫేస్ బుక్ లో   మెసేజెస్ లో  ఒక రిక్వెస్ట్ వచ్చింది .  మా పేజ్ ని like చేయండి recommend చేయండి అని  అది జ్యోతిష్యం కి సంబందించిన పేజ్. నేను అసలు ఒక్క క్షణం కూడా చూడకుండా తొలగించాను. జ్యోతిష్యం పై మీకు నమ్మకం లేదా అంటే అవునని.. కాదని రెండు రకాలుగా తల ఆడించే రకం నేను . అంటే నమ్మకం ఉందొ లేదో అన్నది నేనే తెల్చుకోలేను అన్నమాట.

ఒకసారి ఇలాగే పంచాంగం చూసి  ఆ విషయాన్ని దీర్ఘంగా తలకి ఎక్కించుకుని నేను నాతోపాటు మా అబ్బాయిని కూడా టెన్షన్ పెట్టిన వైనం .. ఏమిటంటే ఖచ్చితంగా ఇది జరిగి రెండేళ్ళు అయింది. ఇలాగే కృష్ణాష్టమి రోజున US వెళ్ళడానికి   రిటర్న్ టికెట్ కొనుక్కునే వచ్చాడు . వచ్చేటప్పుడు తెలంగాణా సంపూర్ణ బంద్  ఆ రోజు నానా తిప్పలు పడి  ఇంటికి వచ్చాడు. ఆ వచ్చేటప్పుడే తన లగేజ్ లో చాలా విలువైన వస్తువులు మిస్ అయ్యాయి.  అలా జరిగిందని నేను వెంటనే పంచాంగం చూసి "నువ్వు బయలుదేరిన సమయమే మంచిది కాదు .. మళ్ళీ తిరుగు ప్రయాణంకి ఏ తేదీ” అని అడిగి .. ఆ తేదీ చెప్పగానే నీరస పడిపోయాను "ఆ రోజు కృష్ణాష్టమి. అష్టమి పూట ప్రయాణమా !?" అని చిరాకు పడుతూ ..  “ఈ సారి ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు నాకొకసారి చెప్పి చేయి” అని కొంచెం క్లాస్ తీసుకున్నాను .

"అమ్మా! నీకు చాదస్తం ఎక్కువైపోతుందమ్మా" అంటూ విసుక్కున్నాడు .

" హా ..  మీకే మీరలాగే అంటారు. ఇప్పుడు చూడు ఎన్ని ఇబ్బందులు పడ్డావో ? వేళా విశేషం  అంటూ ఉంటారు పెద్దలు . వాళ్ళేమి ఉబుసుపోక కాకమ్మ కబుర్లు చెప్పలేదు. దానికి ఏదో రీజన్ ఉంటుంది. అందుకే పెద్దల మాట చద్దిమూట అంటారు అలా .. ఊరికే  త్రోసి పారేయకూడదు " అని చెప్పాను  ఇలా చెప్పి ఊరుకున్నాననుకున్నారా ? మళ్ళీ వెంటనే "పెద్దవాళ్ళు ఏది చెప్పినా వ్యతిరేకించడం ఫాష్యన్ అయిపోయింది.మీలా మేము పెద్దవాళ్ళకి ఎదురు చెప్పలేదు" అన్నాను .

అందుకు "నిజంగా.. అలాగే ఉన్నావమ్మా! ? నిజం చెప్పమ్మా మా అమ్మవి కదూ” గడ్డం పట్టుకుని అడిగాడు బ్రతిమలాడుతున్నట్లు .

నాకు నవ్వు ..(అబద్దం చెపుతున్నాను కాబట్టి ) నవ్వుతూనే “నిజం నాన్నా!. కావాలంటే అడుగు” అన్నాను .

"నిజంగా అడగనా?" మళ్ళీ ప్రశ్న.

"నిజంగానే అమ్మమ్మని అడుగు కావాలంటే" అన్నాను ఆ ఫ్లో లో ......

"ఎక్కడకి వెళ్లి అడగాలి ? అని నవ్వుతుంటే గాని నాకు వెలగలేదు . "అమ్మ " చనిపోయి పుష్కరం దాటిందని. నవ్వులు మాయమయ్యాయి.

నలబై రోజుల  తర్వాత అబ్బాయి ప్రయాణం కి ముందు చాలా చికాకులు ఎదురయ్యాయి. ముందు రోజు ప్రయాణం కావడానికి వీలు కాలేదు ఒక రోజు ముందుగా వెళ్ళి హైదరాబాద్ లో ఉందాం అనుకున్నాం కానీ అప్పటికి  అనుకున్న పనులు ఏవి సరిగా పూర్తవలేదు, బస్ లు నడవడం లేదు, ఎక్కడబడితే అక్కడ ప్రయాణించే కార్లని  కూడా ఆపేస్తున్నారు. ప్లైట్ టికెట్స్ కొనుక్కోమంటే రెండు టికెట్స్ మాత్రమే దొరికాయి. లగేజ్  మొత్తం వెళ్ళడం కుదర లేదు . అబ్బాయేమో ఫ్రెండ్స్ లగేజ్ బోలెడు పోగేసాడు  ఏది వదలకుండా అన్నీ పట్టుకుని వెళ్ళాలి అంటాడు   నేను గన్నవరం వరకు వస్తాను, నువ్వు మీ నాన్నగారు వెళ్ళండి నాన్నా!  అంటే వినడు. “అమ్మా నువ్వు రావాలి నువ్వు రాకుండా నేను వెళ్ళను" అని దిగులుగా ముఖం పెట్టాడు. ఏదైతే అదయిందని టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని రెంటల్ కార్ ని పిలిచాము.

సప్తమి ఘడియలు దాటాక ముందే అతనిని రమ్మని చెప్పాను అంతకి ముందు బయలుదేరడానికి దుర్ముహూర్తం ఉందని బయలుదేరలేదు. దుర్ముహూర్తం దాటినాక సప్తమి కొద్ది సమయం మాత్రమే ఉంది . అష్టమి రానే వస్తుంది ఆ సమయంలో బిడ్డని బయలుదేరదీయడం ఎలా ? అని నాకు ఒకటే టెన్షన్. మధ్యలో అబ్బాయిని బాగా విసుక్కోవడం జరిగిపోయాయి. అంతలోనే మేము మాట్లాడుకున్న కారు రానే వచ్చింది .  టైం కి చక్కగా వచ్చాడన్న సంతోషంలో డ్రైవర్ కి థాంక్స్ కూడా చెప్పేసాను. మీరు చెప్పిన టైం కి కాకుండా ఆలస్యంగా ఎప్పుడూ రాలేదు కదండీ ? అని అతని నవ్వుతాల ప్రశ్న.

 హడావిడిగా సప్తమి ఘడియలు ఉండగానే ఇంటి నుండి బయలు దేరాం. ఉత్తరం కి ప్రయాణించి బాబా దర్శనం చేసుకుని తూర్పుకి తిరిగి ప్రయాణించి ఆగ్నేయంగుండా దక్షిణం వైపు ఉన్న మెయిన్  రోడ్డుకి చేరుకొని శివపంచాయతన మూర్తుల దివ్యదర్శనం చేసుకుని "అమ్మయ్య " చక్కగా బయలుదేరాం అనుకుంటూ ఉండగా .. "అమ్మా!  నా ఫోన్  ఎక్కడ ?" అన్నాడబ్బాయి. "ఫోన్ మర్చి పోయినా సరే ఇంటికి వెళ్ళడానికి  వీల్లేదు " అని ఖచ్చితంగా చెప్పేసి నేను ఆ నంబర్ కి రింగ్ చేసాను . ఆ ఫోన్ నా బేగ్ లో ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నాకు మా అబ్బాయికి మరోసారి ఈ  చాదస్తాల వాదన మొదలయ్యేది.

మా అత్తమ్మ , అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వు. అబ్బాయితో  చెపుతున్నారు. “మీ అమ్మ ఎప్పుడూ మంచి-చెడు అంటూ ఇంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు బాగా హైరానా పడిపోయిందంటే అదంతా నీ మీద ప్రేమ వల్లనే !  నీకేమి ఇబ్బందులు కలగకూడదని క్షేమం చేరాలని. మీ అమ్మ ఆరాటం" అంటూ రహస్యం చెప్పేశారు . అబ్బాయి ప్రశాంతంగా అమ్మ భుజం పై వాలి పడుకున్నాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం  భోజనం చేయడానికి కూడా ఆగకుండా అతను భోజనం చేయడం కూడా మానుకుని చాలా జాగ్రత్తగా కారు నడుపుతూనే నాలుగున్నర గంటల్లో మేము ప్రయాణిస్తున్న వాహనం  "ఇన్నోవా" ని   అనుకున్న సమయం కంటే  గంట  ముందు గానే "రాజీవ్ గాంధి " విమానాశ్రయంలో ఉంచాడు.

ఇక అక్కడ గంట సమయం ఉండేటప్పటికి  అప్పటి వరకు లోలోపల దాచుకున్న దిగులు బయటపడింది.  అబ్బాయి చేయి పట్టుకుని  నేను ఒకటే ఏడుపు. "అమ్మా ! అందరు ఇటే చూస్తున్నారు  చూడు ..మా అమ్మ.. కి అలా చూడటం ఇష్టం ఉండదు. కాబట్టి  ఇప్పుడు మా అమ్మ ఏడుపు ఆపేస్తుంది  అంటూ  నవ్వించడం,  అక్కడి నుండి ప్రక్కకి తీసుకు వెళ్లి  ఫోటోస్ తీద్దాం రా..  అంటూ  విమానాశ్రయాన్ని ఫోటోస్ తీయించాడు.  కాసేపటి తర్వాత మళ్ళీ నాకు దుఃఖం  ముంచుకొస్తుంది. ఇంకొంచెం సేపటిలో అబ్బాయి చెక్ ఇన్ లోకి వెళితే మళ్ళీ ఎప్పుడో అబ్బాయిని చూసేది  అని దిగులు. "నాన్నా ! నిన్ను చూడకుండా ఈ అమ్మ ఎలారా బ్రతికేది ? అని  కన్నీళ్లు . "అమ్మా ! నువ్వలా ఏడిస్తే నేనలా వెళ్ళేది ? పోనీ వెళ్ళడం మానేయనా ? ఇంటికి వెళ్ళిపోదాం పద " అన్నాడు. "వద్దు " అని అడ్డంగా  తలూపి గట్టిగా కళ్ళు తుడుచుకున్నాను.

నవ్వి "మా అమ్మ గుడ్ " అంటూ అదిగో అక్కడ "ఆడీ" కారుంది చూసొద్దాం రా” అంటూ తీసుకు వెళ్ళాడు ఆ కారు ని చుట్టూ తిరిగి చూపిస్తూ చాలా  బావుంది కదమ్మా ! అన్నాడు. బావుంది కాని "మెర్సిడెస్ బెంజ్" కన్నా బాగా కాదు అన్నాను. అలా కబుర్లు చెపుతూ ఉంటే గంట గడచిపోయింది.

5 గంటలు అవుతుండగా  “ఇక  లోపలికి వెళదాం  రా ..అమ్మా!”  అన్నాడు లోపలికి వెళుతూ ఉంటే  నిలబెట్టి ఇలా ఒక పిక్ తీసుకున్నాను

చెక్ ఇన్ అయి లగేజ్ వెయిట్ వేయించుకుని, వీసా అన్నీ చెక్ చేయించుకుని మళ్ళీ దగ్గరికి వచ్చాడు. "అమ్మా ! నువ్వసలు ఏడవ కూడదు, నువ్వ లా ఏడుస్తుంటే నాకు వెళ్ళబుద్ది కాదు" అన్నాడు. అప్పుడు నేను నవ్వు తెచ్చుకుని bye బంగారం అని చెప్పాను. మా నాన్న గారు, అబ్బాయి  వాళ్ళ నాన్న గారు జాగ్రత్తలు చెపుతూ ఉన్నారు. వాళ్ళ నానమ్మ .. కళ్ళ నీళ్ళతో .. జాగ్రత్త బంగారం! అంటూ మనుమడిని ముద్దాడారు. మా మరిది గారు  "జాగ్రత్త చంద్రబాబు " లాండ్ అవగానే కాల్ చేయి” అని చెప్పారు

లిఫ్ట్ వైపు వెళుతూ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ  నన్ను చూసుకుంటూ  రెడ్ కలర్ డోమ్ ఉన్న లిఫ్ట్ లోకి వెళుతూ .. అమ్మా.. వెళ్ళొస్తా!  అంటూ చూపులతో చెప్పిన చూపు  సరిగ్గా రెండేళ్ళ క్రితం నాటిది. ఇప్పుడూ..   నా కళ్ళ ముందు  మెదలాడుతూ  ఉండగా మనసు నిండుగా నా బిడ్డని  అప్పుడు, ఇప్పుడు కూడా దీవిస్తున్నాను. “చల్లగా ఉండాలి బంగారం" అనుకుంటూ  మా ఇంటికి అల్లరి కృష్ణుడు  వాడే ! తను ఇంట లేకుండా  నేను కృష్ణాష్టమి జరుపుకోలేను.  ఈ పండుగే కాదు అసలు ఏ పండుగ లేదు మా ఇంట.   తల్లి  ప్రేమతో  తనతో గడిపిన సమయాలని ఇలా ముచ్చటించుకుంటూ  కాస్త తేలిక పడతాను అంతే!

అలా ఆరోజు ఆ ప్రయాణానికి నేను ఎంత టెన్షన్ అనుభవించానో! ఛీ  ఇంకెప్పుడూ ఈ పంచాంగం చూడటం లాంటి సెంటిమెంట్స్ పెట్టుకోకూడదు, నేను  టెన్షన్ పడటం  మాత్రమే కాకుండా ఇంటిల్లపాది నా వలన టెన్షన్ పడ్డారు. ముఖ్యంగా  నా బిడ్డ. తను  పైకి ప్రకటించలేదు కాని చాలా చాలా ఇబ్బంది పడ్డాడు అనిపించింది  నిజంగా అష్టమి పూట ప్రయాణం కష్టమా !? అనిపించింది కూడా !

మనవారి పట్ల మనకున్న ప్రేమ తో వారికి ఏ ఇబ్బంది కలగకూడదని అనుకుంటాం. అందులో తప్పులేదు కాని ఇలా పంచాగం చూసుకుని పనులు చేయడం, ప్రయాణాలు చేయడం, జ్యోతిష్యం, శాంతులు చేయించడం ఇవన్నీ పరిగణన లోకి తీసుకోవడం వల్ల కొంత మానసిక శాంతి లోపిస్తుంది. అనవసర  భయాలు ఏర్పడతాయన్నది నిజం. అన్నింటికీ ఆ సర్వేశ్వరుడే ఉన్నాడనుకుని ఆయనకి నమస్కరించుకుని ఎటువంటి సంశయాలు లేకుండా బ్రతుకు గమనంలో సాగిపోవడం నేర్చుకోవాలనుకున్నాను. ఇక తర్వాత ఎప్పుడు అలాంటి విషయాలకి ప్రాధాన్యత ఇవ్వలేదు.మనం నమ్ముతున్నామా  లేదా ? అన్నదానికన్నా మనం ఇతరులని ఇబ్బంది పెడుతున్నామేమో అన్నదాని గురించి  ఎక్కువ ఆలోచిస్తాను నేను.  ఆకోణంలోనే ఈవిషయం వ్రాసాను కూడా !

ఇక ఈ మధ్య నేను విన్న అనుభవాల గురించి .. జ్యోతిష్యం, పండితుల ధోరణి గురించి కొన్ని విషయాలు చెప్పదలచాను. వ్యక్తుల బలహీనతల పై కొందరు ఎలా తమ పాండిత్యంతో అజమాయిషీ చేస్తారో అన్నది నాకు అర్ధమైనప్పుడు నిరసించాను. అలాంటి పాండిత్య ప్రకర్ష వల్ల  మనకున్న శాస్త్రాల్ని కూడా మనం వ్యతిరేకిస్తాం.  అలాగే మరికొందరి చేత పరిహసించబడతారన్నది కూడా చాలా  నిజం. నాకు జ్యోతిష్యం, జాతకాలు ఇటువంటి విషయాలు పై బొత్తిగా పరిజ్ఞానం లేదు.  ఈ వ్రాయడం కూడా నేను సరిగా వ్రాస్తున్నానో లేదో తెలియదు కాని  నా ఫీలింగ్స్ ని, నా అనుభవాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేసానంతే ! 

ఇక్కడ ఈ పోస్ట్ లో నేను ఎవరిని కించపరచలేదు. దయచేసి తప్పుగా తీసుకోవద్దని మనవి.  ఎవరి వ్యక్తిగత అనుభవాలు వారికి ఉంటాయి కదా! అదే దృష్టితో ఈ పోస్ట్. 

25, ఆగస్టు 2013, ఆదివారం

కొన్ని దుఃఖాలు

నిన్న ఉదయం  మా "భవ్య " ఒక వీడియో లింక్ పంపి .. ఇది చూడమ్మా ! అంది

"సరే  చూస్తాను ".. అని చెప్పాను

మళ్ళీ కాసేపటికి .. "చూస్తున్నావా ..?  లాస్ట్   వరకు  చూడు"  అని చెప్పింది .

నన్ను   ఎడ్యుకేట్  చేయడంలో  మా  పిల్లలు  ఎప్పుడూ  ముందుంటారు .  అమ్మాయి  పంపిన లింక్ లో ఉన్న వీడియోని డౌన్ లోడ్  చేసుకుని   దాదాపు గంట సేపు  నిడివి  ఉన్న ఆ వీడియో చూస్తున్నంత  సేపు  చాలా దుఃఖం వచ్చింది  ఆ వీడియో  మీరూ  చూడండి.


అసలు ఈ వీడియో చిత్రించినందుకు BBC వారిపై కోపం వచ్చింది . ఎందుకు ప్రపంచదేశాలకి మన దేశం  గురించి తక్కువది ఎక్కువగా, ఎక్కువది తక్కువగా గా చెప్పి  మన దేశం పట్ల భీతీ  కల్గిస్తారు . అని అనుకున్నాను కూడా. ఇప్పటికే మన దేశం గురించి ప్రపంచ దేశాలకి చెడ్డ సందేశాలు  వెళుతుంటే పర్యాటకులుగా  ఈ దేశాన్ని  సందర్శించడానికి  కూడా భయపడి వారి ప్రయత్నాలని విరమించుకుంటున్నారు అని వింటున్నాం. అది నిజం కూడా అని కొన్ని చోట్ల రూడీగా  చదివాను కూడా. అలాంటి మెసేజ్ వెళ్ళడానికి ఇక్కడ పరిస్థితులు కూడా  కారణం అయ్యాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు

ఇంతకీ ఈ వీడియోలో చూసింది ఏమిటంటే .... మన భారతీయ సంస్కృతీ సంప్రదాయం అని గొప్పగా చెప్పుకుంటామే .. ఆ సంప్రదాయం  ఎగతాళిగా మారిన వైనం ని మనకి దృశ్య రూపంలో చూపించింది. డిల్లీ లో జరిగిన అత్యాచారం కి దేశం  అంతా  అట్టుడికి  పోయి   నిరసన చేసిన దృశ్యాల నుండి,అమ్మాయిలని నడిబజారులో వివస్త్రని చేసి ఆడుకున్న వైనాన్ని; యాసిడ్ దాడికి బలైపోయిన అమ్మాయిని, ఆడపిల్లలు పుట్టి మగ పిల్లలు పుట్టకపోతే మొహం మాడ్చుకునే ఇంటి పెద్దలని , మగ సంతానం పుడితే  మాత్రమే వేడుకలు చేసే కుటుంబాలని,అదే ఆడపిల్లలు అయితే నడిరోడ్డు పై  వదిలేస్తే ఆ వదిలేసిన పాపలని పెంచే తల్లిని ,  కారణం ఏమిటో చెప్పకుండానే ఉరితీసుకుని మరణించిన యువతి  గురించి ఆవేదనగా చెప్పే తండ్రిని, చదువుకుని డాక్టర్  వృత్తి  లో ఉండి కూడా అధిక కట్నం కోసం బార్య  ని వేదించే భర్తలు .. ఇలా ఎన్నో వాస్తవ సంఘటనలతో కూడిన విషయాలల్తో ఈ వీడియో  ఘనత కల్గిన మన  దేశంలో స్త్రీల పరిస్థితి ఎలా ఉందొ చెప్పింది. India A Dangerous Place to Be a Woman -ఇలా 

ఏ వార్తా పత్రిక చూసినా అత్యాచారాల వార్త లతో విరాజిల్లుతూ ఉంటుంది . చట్టం తనపని చేయడానికి న్యాయస్థానం నేర నిర్ధారణ చేసి శిక్ష ఖరారు చేయడానికి ఎంత అలసత్వం చూపుతున్నాయో చెపుతుంది ఈ జాతి మూల మూలాల్లో స్త్రీ ల పట్ల ఉన్న వ్యతిరేకతని, వివక్ష ని భ్రూణ  హత్యలని, సెక్సువల్  హెరాస్మెంట్ ని , నేరాల చిట్టా తో సహా చూపుతూ .. ఈ దేశంలో ఎందుకింత ప్రమాదకరమో ! ఆలొచించమంటూ  ప్రశ్నిస్తూ ముగుస్తుంది .

ఈ వీడియోలో చూసింది చాలా తక్కువ . ఇంతకన్నా ఎక్కువ మనం చూస్తూనే ఉన్నాం . మన్ను తిన్న పాముల్లా పడి  ఉంటున్నాం .

 ఒక అజ్ఞాత నాకొకసారి ఒక  వ్యాఖ్య వ్రాసారు . మగవాళ్ళు అందరూ చెడ్డవారు కాదు . అందరిని దూషించకండి . ఎక్కడో  వెనుకబడిన బీహారీ ప్రాంతపు యువకుడు ఏదో చేసాడని మీరు అందరిని తిడుతున్నారు . అసలు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయంటే అని ఏదో చెపుతూ నా వ్రాతల పట్ల తీవ్ర వ్యతిరేకతని తెలిపారు . ఆ అజ్ఞాత చెప్పిన దానిలో నిజం ఉండవచ్చు . కానీ ఈ దేశంలో  ఇన్ని లైంగిక వేధింపులు,  అత్యాచారాలు ,వరకట్న హత్యలు ఇవన్నీ చదువుసంధ్యలు లేని మారుమూల ప్రాంతాల వారే చేయడం లేదు కదా !  చట్టం దృష్టికి  వచ్చిన కేసుల గణాంకాలకే  ఒణుకు  పుడుతుంది. ఇంకా చట్టం దృష్టికి రాని కేసులు ఎన్ని ఉంటాయో !

స్త్రీని గౌరవించడం నేర్పని, నేర్పని ఈ దేశంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి వీటికి అడ్డు,  అదుపు లేదు కాకుల లెక్కన రోడ్డున పడి నాలుగు రోజులు కూసి  గమ్మున ఊరుకుంటాయి అనే అలసత్వం కనబడటం తప్ప. " "సహభాగినిగా సమభాగినిగా " అనే పాటలు వినడానికి బాగానే ఉంటాయి. ఆచరణలో అవి శూన్యం అని తెలుస్తున్నప్పుడు .. భయం భయంగా ఆడపిల్లల్ని బయటకి పంపుతూ చదువు అయ్యి అవగానే పెళ్లి చేసేసి విదేశానికి కాపురానికి పంపించేసి,  హమ్మయ్య .. ఇక్కడంత  భయం అక్కడ ఉండదు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేకపోతే  నన్నెందుకు ప్రేమించవ్  అని యాసిడ్ బాటిల్స్ పట్టుకుని వెంటబడే కాలమిది. ఒంటరిగా ఆడపిల్లలు కనబడితే బ్రతకనివ్వని కాలమిది. వీళ్ళని పువ్వుల మాదిరి ఎక్కడ కాపాడ గలం ? అని భయపడుతున్న కాలమిది.

ప్రతి ఇంట్లో ఒక కూతురు ఉండాలి .అప్పుడే భాద్యత కల్గి సంస్కారంతో నడుచుకునే సోదరుడు ఉంటాడు , ఉండాలి కూడా !. నేనేం పురుషద్వేషిని కాదు. సమాజంలో స్త్రీ పురుషులు ఇరువురూ వుండాలి. కాకపోతే పీడనలో పురుషుడు ముందుంటాడు. స్త్రీ లోపల వుంటుంది.  వేధింపులు అత్యాచారాలు వరకట్న హత్యలు అనుమానంతో చంపడాలు వీరిలో పురుషుడే ఎక్కువ వుంటాడు. 

ఆడదానిగా పుట్టడం కంటే .అడవిలో మానై  పుట్టినా బాగుండేదని ఆడవాళ్ళ వెతలు ని చెప్పుకుంటూ  ఒక పోలిక చెప్పుకుంటారు. ఇప్పుడంతా అలా పోల్చడం బాగోదు అడవిలో మానై  పుడితేను మొదలంటా నరికేస్తారు. ఆడదానిగా పుట్టినా అణచి వేస్తారు, నలిపి వేస్తారు, సమూలంగా పెరికేస్తారు ఇదండీ విషయం
ఇదే విషయం పై .. ఈ లింక్ లో ఈ ఆర్టికల్ కూడా India: a Dangerous Place for Women?



ఈ వీడియో చూసినప్పటి నుండి కొంత దుఃఖం  మోస్తూ ..ఉన్నాను. ఈ దుఃఖాలు  మనవి కావు కాని సమాజానివి అనుకుంటే ... ఏ రోజైనా కొన్ని దుఖాల బారిన పడే తీరతాము .

మనదేశం గురించి ఇంత  చెడ్డ  సందేశం ప్రపంచానికి  అందుతుంటే  ఏం  చేయాలో మేధో వర్గానికి తెలుసు. హృదయ సంస్కారం ఉన్నవారికి తెలుసు .

అన్నలారా ..తమ్ములారా.. బిడ్డలారా ! ఆలోచించండి ..