31, అక్టోబర్ 2013, గురువారం

క్రొత్త నీటిని కలుపుకునే "సంస్కారం" సారంగ లో

మనషులు సమస్యలలో ఉన్నప్పుడుఆ సమస్యలు తీరక ఏదో ఒక రూపంలో దేవుడు వచ్చి తమని  ఆదుకుంటాడనే  నమ్మకంతో ఉంటారు . తాము ఆ సమస్యలలో నుండి బయటపడలేనప్పుడు ఇంకొక దేవుడు ఆదుకుంటాడనే భ్రమలో మతం మారి అక్కడ నమ్మకం పెంచుకుంటారు తప్ప అది మనుషుల బలహీనత అని . ఆ బలహీనత ఆధారం చేసుకుని   మతమార్పిడి జరుగుతుందని ఒప్పుకోవడానికి ఇష్టపడరు.  అయితే కొద్ది గొప్పో సేవా భావం కలవారు దైవం పట్ల నమ్మకం కలవారు బలహీనులకి ఎంతోకొంత అండ ఉండి వారికి మంచి చేయాలని పాటుపడతారు అలాంటి  రెండో రకం కి చెందిన మనిషి కావడంతో .. మా వూరిలో ఫాస్టర్ గారిని అందరూ గౌరవించేవారు. కొత్త మతం పుచ్చుకున్న వారిని వ్యతిరేకిన్చినవారే    ఏ నీరు  ఆ నీరెంట నడవకుండా  పాత నీరులో కొత్తనీరు నిశ్శబ్దంగా కలసిపారుతుందని గ్రహించక తప్పలేదు. 

ఈ కొత్త నీరు పాత నీటిలో... ఎలా కలసిపోతుందో...  మత స్వేచ్చ కి అర్ధం ఏమిటో ... చెప్పాలని ప్రయత్నించిన కథ 




"సంస్కారం"  సారంగ లో ఈ వారం 

చదివి మీ అమూల్యమైన స్పందన అందిస్తారని ఆశిస్తూ..  

అన్నట్టు  ఇది నా "యాబై"  వ కథ.  

29, అక్టోబర్ 2013, మంగళవారం

పురుషార్ధాల కోసమే "సాహిత్యం"

ఆ పాత మధురం  సంగీతం,  ఆలోచనామృతం సాహితం అని అన్నారు .   సంగీతం ఆహ్లాదాన్ని ఇవ్వాలి,  సాహిత్యం ఆలోచనని  పెంచాలి అన్నది ఎవరికీ వారు స్వానుభవంతో తెలుసుకోవలసిన విషయమిది .

మన ప్రఖ్యాత  ప్రాచీన కవులందరూ  మంచి యితి వృత్తాలని ఎన్నుకుని   అందరూ ఆదర్శంగా  వుండేవిధంగా తలఛి ఇతిహాసం వ్రాసినా, పురాణం వ్రాసినా, నాటకం వ్రాసినా సంఘ శ్రేయస్సుకు వెలుగుబాటగా ఉండాలని తలచి రచనలు చేసేవారు    వారి బాటలోనే నడచిన మన మహా కవులందరూ సాంఘిక వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండాలనే తలంపులతోనే కావ్యాలు రచించారు . ఆ తర్వాతి కాలంలో   అజ్ఞానపు  చీకట్లు అలుముకుని   మూఢ నమ్మకాలతో, దురాచారాలతో మ్రగ్గిపోతున్న  మానవజాతి వికాసంతో మెలగాల్సిన అవసరం గుర్తించిన సంఘ సంస్కర్తలు మరింత చైతన్యం నింపుకుని రచనలు చేసారు.

పురుషార్ధం కోసమే  చతుర్విధ పురుషార్ధాలనే అంతర్లీన సూత్రంని క్రోడీకరిస్తూ  ఉదాత్తంగా వ్యవహరిస్తూ అనేక రచనలు చేసారు . ఏ కాలానికి ఆ కాలంలో కొంత విమర్శలు చోటు చేసుకునే ఉంటాయి . ఉత్తమ సాహిత్యం అంటూ ఎవరూ  ముద్ర వేయదగిన విధంగా సాహిత్యం ఉండలేదన్నది అక్షర సత్యం . అయితే ప్రజాదరణ పొందినదే ఉత్తమ సాహిత్యం గా లెక్కించడం ఉంది.   నలుగురికి చేరువ కాలేని వెలుగులోకి రాని సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి. అంత మాత్రంచేత అది సాహిత్యం కాకుండాను పోలేదు  .

అసలు ఉత్తమ సాహిత్యమంతా రాజనీతి కోసమే పుట్టిందని సాహిత్య మర్మజ్ఞులు అంటారని ఓ  ..ప్రముఖ కవి వ్రాస్తే నేను చదివాను రాజనీతి పూర్వకాలంలో రాచరికం నెరిపినవారికే కావచ్చు . చాణుక్యుడు అర్ధ శాస్త్రం రచించినా ఆ.. రచన  ఆనాటి కాలంకి అద్దం  పడుతూ ఉంది . తర్వాత  రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది  కాలానుగుణంగా యీనాడు పాలకులు యెట్లా వుండాలో , ప్రజలు యెట్లా వుండాలో ,  ఉద్యోగులు యెలా  ఉండాలో ఆర్ధిక , రాజకీయ సామాజిక, వాణిజ్య, సైనిక,అంతర్జాతీయ నీతి  యెలా వుండాలో చెప్పేది కూడా రాజనీతి అంటారు . రాజ్యపాలకులే అవినీతి పరులైతే ఇక ప్రజల సంగతి యే౦  కాను?

ధర్మార్ధ కామమోక్షాలలో ఆఖరిదాని గురించి ఆలోచించకుండా మొదటి మూడు ప్రతి ఒక్కరికి అత్యసరమైనవె కదా ! అయితే మొదటిది వదిలేసి అర్ధ,కామాల కోసమే మానవ జీవితం ఉన్నట్టు ఈ రెండింటి చుట్టూ పరుగులెత్తే జనావళి కోసం అలాంటి సాహిత్యం వస్తుందని దిగులు పడే వారిని చూస్తున్నాం.  అందుకే ధర్మం ఎవరికీ అవసరం లేదు. అందరికి అర్ధకామాలే ముఖ్యం   

నవరసాలలో రసరాట్టు శృంగారం  అంటారు . సకల ప్రాణ కోటి కోరుకునేది . సకల ప్రాణ కోటిలో ఉత్తమ శ్రేణికి చెందినవాళ్ళం అనుకునే మానవులు ఆ రసాన్ని మనసారా,ఉదాత్తంగా ఆస్వాదించాలి. బాహ్య ప్రపంచం నుండి విడివడి ఆత్మలు సంయోగం చెందినట్లు మమేకం కావాలి. అది తప్ప మరింకేం లేదు అన్నట్టు అచ్చంగా ఆ రసం రంగరించి రాసేవారున్నారు. ఆ రచనలకి పట్టం కట్టేవారు ఉన్నారు. ఇప్పుడొస్తున్న సినిమా పాటలు ఇలాంటివే.   
.
ధర్మరహితమైన అర్ధ,కామాలు విభృజించి  అత్యంత పాశవికంగా ప్రక్కవారిని పూడ్చేస్తున్నాయి . ధనాంద కారం క్రమ్ముకుని కొందరు , కామ ప్రకోపాలతో కొందరు  విషనాగుల వలే పొంచి.. వారి  వారి  కాటుకు కొందరి జీవితాలని బలి చేస్తున్నాయి. ముసుగు వేసుకుని కొన్ని, అవకాశం చూసుకుని కొన్ని,  ఆయాచితంగా లభిస్తున్నాయని కొన్ని ఇలా జవజీవాలని తోడేసుకుంటూ పోతున్నారు. వీళ్ళ తాకిడిలో  సామాన్యులు యెటువైపు  కొట్టుకుపోతున్నామో తెలియకుండా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నారు.

 ఎంత కష్టపడినా నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళడం కష్టంగా ఉన్న పరిస్థితులు, కష్టపడకుండా  ప్రక్కవాడికి ఆయాచితంగా  లభంచే అన్ని సౌకర్యాల పట్ల ఈర్ష్య , విలాస జీవితం పట్ల వ్యామోహం.  కాలక్షేపం కోసం చూసే కార్యక్రమాల ప్రభావం, నేరం ఇలా చేయాలని చూపిస్తున్నట్లు ఉన్న ప్రసార మాధ్యమాలు ఒకటేమిటి అన్ని రకాలగా  నాశనమయ్యే  కాలంలో మనం జీవిస్తున్నాం . వినాశకాలే విపరీత బుద్ది  అంటారు కదా!   విలువలు లేని సాహిత్యం కూడా మనిషిని నాశనం చేస్తుంది. మన బ్లాగ్ లోకం కూడా అందులో చేరిపోయింది .. అందుకు విచారిస్తూ .. యీ పోస్ట్ వ్రాయక తప్పలేదు మరి

మనం యే౦  చదువుతున్నాం,  యేమి వింటున్నాం , యే౦ చూస్తున్నాం ..  యేమి  వ్రాస్తున్నాం ? మన మానసిక స్థితి ఎలా ఉంది ? ఇవన్నీ ఆలోచించుకోవలసిన విషయాలు .   ఆ ఆలోచనే మనకి కావాల్సింది యిస్తుంది. మనకి మనని మిగులుస్తుంది..

రాజుకి కావాల్సింది   వందలమంది వందిమాగధులు, భట్రాజు పొగడ్తలు కాదు కావాల్సింది. ప్రజారంజకంగా పాలించడం , దర్మబద్దంగా  వ్యవహరించడం.  అది రచనలకి కూడా వర్తిస్తుందనేది అక్షర సత్యం/.

 సంగీతాన్ని, సాహిత్యాన్ని ఆస్వాదించే.. గుణాన్ని  ఇచ్చిన జ్ఞాన సరస్వతి పాదారవిందాలకి ప్రణమిల్లుతూ..  ఈ.. ఆపాత మధురం (అ పాత మధురం) ఆలోచనామృతం

బ్లాగ్ వ్రాయడానికి బద్దకిస్తూ  చదువుకోవడంలోనే మునిగి ఉన్న నాకు .... బ్లాగ్ లోకంలో నేను చదవని చూడనివి  కొన్ని పోస్ట్ లని ఓపికగా నా కోసం ఏరి నా కోసం అందించే ఓ .. మిత్రురాలికి ...   ధన్యవాదాలు చెపుతూ ఈ పోస్ట్ .            

24, అక్టోబర్ 2013, గురువారం

సోలః సింగార్


Mohra  చిత్రంలో  నాకిష్టమైన  "Na  kajre ki dhar Na  Mothian  ki  haar  "   పాట  వింటున్నాను .

Singaar tera yovan, yovan hi tera gehna అన్న సాహిత్యం వినగానే సోలః  సింగార్  గుర్తుకు వచ్చింది 

అసలు సోలః  సింగార్ ఏమిటీ అని  చూస్తే  స్త్రీల  అలంకరణలో భాగాలైన ఇవన్నీ గుర్తుకు వచ్చాయి . కొన్ని తెలుసుకోవడానికి  గూగులమ్మ సహాయం చేసింది .

మన భారతీయ సంప్రదాయంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది . వివాహ సమయానికి ముందు వివాహ సమయంలోను , వివాహం తర్వాత అనేక ఆనవాయితీ లు ఉన్నాయి .

వివాహ  సమయంలో  ఎక్కువగా అందరి దృష్టి  వధువు పైనే ఉంటుంది. వధువు యొక్క రూపురేఖలుతో పాటు ఆమె ధరించిన వస్త్రాలు, ఆభరణాలు , అలంకారం పైనే ఆసక్తి చూపుతారు .

వధువు అలంకరణ  పూర్తీగా ఉండాలంటే  పదహారు విధాలుగా ఉండాలని పూర్వీకుల కాలం నుండి నిర్ణయించారు . ఉత్తర,  దక్షిణ భారత దేశ వివాహ పద్దతులలో కొద్దిపాటి తేడాలున్నప్పటికీ వధువు అలంకరణ అంతా  అన్నిచోట్లా ఒకే విధంగా ఉంటుంది . "సోలః సింగార్" గా అభివర్ణించే ఈ అలంకరణ ఇలా ఉంటుంది .

ముందుగా వస్త్ర సాంప్రదాయం . మన దక్షిణాది ప్రాంతంలో పట్టుచీర జాకెట్  ధరిస్తారు. ఉత్తరాదిన లేహంగ చోళీ ధరించి  అందంగా డిజైన్ చేయబడ్డ  మేలిముసుగు ని కప్పుతారు.

వధువు ముఖం చూడగానే మనకి కనిపించే ముఖ్యమైన అలంకారం నుదుటన ధరించే తిలకం . మన ప్రాంతాలలో "కళ్యాణ తిలకం " ని దిద్దుతారు . ఉత్తర భారతంలో "బింది" లేదా బిందియా అని వ్యవహరిస్తూ ఉంటారు . ఈ బిందీ ఎరుపు రంగులో ఉండి శుభ చిహ్నంగా ఉంటుంది.

ఇక మూడవది కన్నుల కాటుక "కాజల్ " అని వ్యవహరిస్తారు . కళ్ళకి కాటుక ఇచ్చే అందం ఇంత అని చెప్పనలవి కాదు.  ఇప్పుడంటే కాటుక పెట్టుకోకపోవడం ప్యాషన్ , అయినప్పటికీ మేకప్ లో భాగంగా "ఐ "లైనర్ వాడటం మామూలైపోయింది . అలాగే కనురెప్పలు మరింత నల్లగా,దట్టంగా ,పొడవుగా కనబడటానికి "ఐ లాష్ " ఉపయోగించడం చేస్తున్నారు     కాటుకని స్త్రీల అలంకారంలో చాలా ముఖ్యం అని ఒప్పుకోవాల్సిందే మరి .

ఇక నాలుగవది .. ముక్కెర .  స్త్రీ జీవితంలో వివాహం తర్వాత ధరించే ముఖ్య చిహ్నం .  సంప్రదాయ ముక్కెర ముక్కు  నుండి   రింగుల లింక్ ల ద్వారా చెవి వరకు సాగుతూ  ఉంటుంది . . ఇప్పటి తరం అయితే వారి వారి అబిరుచిని బట్టి ముక్కెరని , లేదా పుడకని ధరిస్తున్నారు .

ఇక ఐదవ అలంకారం బంగారు ఆభరణం  "పాపిట బిళ్ళ " ఉత్తర భారతంలో ఈ ఆభరణం ని "మాంగ్ టిక్కా"    గా వ్యవహరిస్తారు . జుట్టుని రెండు భాగాలుగా విడదీసిన నిలువు పాపిడి పొడవునా నుదుటిపై వ్రేలాడుతూ వధువుకి వింత శోభని కల్గించే అలంకారం ఇది .

ఆరవది కర్ణాభరణం.... వ్రేలాడే జుంకీలు ధరిస్తారు .

.ఏడవది "హారం" మెడకి ధరించే బంగారు ఆభరణం ఇది . ఇది చాలా ప్రత్యేకంగా తయారుచేయించుకుంటారు .

 ఎనిమిది ..  గాజులు ..  మన సంప్రదాయంలో కుడి చేతికి 21 గాజులు,ఎడమ చేతికి 19 గాజులు ధరిస్తారు . వధువు ధరించే గాజులు రంగు రంగుల  మట్టి, మెటల్  గాజులతో పాటు బంగారు గాజులు తప్పనిసరిగా ధరిస్తారు .  " "చుడియాన్"  గా వ్యవహరించే  ఈ గాజులు సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు .

తొమ్మిదవ  అలంకారం " బాజు బాండ్ "  అంటారు . మన వాళ్ళు  'అరవంకీ" అని అంటారు. లేదా "భుజ కీర్తులు" అని కూడా అంటారు .

పదవది..  అంగుళీయకాలు  లేదా  వేలి ఉంగరాలు .  విడి విడిగా అన్ని వ్రేళ్ళకి ధరించడం  లేదా  అన్ని వ్రేళ్ళకి ధరించిన ఉంగరాల నుండి గొలుసుల ద్వారా  ముంజేతి వరకు  సాగి బ్రాస్లెట్ లా అలంకరించుకునే ఆభరణం .. దీనిని "అరసి" గా వ్యవహరిస్తారు .

పదకొండు  మెహందీ ..  ఎండిన గోరింట పొడిలో   నిమ్మ పులుసుని  చేర్చి వధువు కాళ్ళకి, చేతులకి చక్కని డిజైన్స్ తో  గోరింటని ఎర్రగా పూయిస్తారు.  ఈ అలంకరణ పూర్తయిన తర్వాతనే మిగతా అలంకరణ చేస్తారు . మన ప్రాంతంలో   అదివరకు   పారాణి  పెట్టి వారు. ఇప్పుడంతా మెహందీ డిజైన్స్ సాధారణం అయిపోయింది  .

పన్నెండవది.. నడుమకి ధరించే ఆభరణం .. "వడ్డాణం"

.పదమూదవది. కేశాలంకరణ.    అభ్యంగ స్నానంచేయించి  సాంబ్రాణి తో ఆరబెట్టి  వింత పరిమాళాలని వెదజల్లే కేశాలని అందంగా ముడి గా అమర్చి  ఆ ముడిని పూలతోను, ఆభరణాలతోనూ అలంకరింపజేస్తారు. మన ప్రాంతంలో "పూల జడ " చాలా ఫేమస్ . ఇప్పుడు ముత్యాల జడలు , బంగారు జడలు కూడా చోటు చేసుకుంటున్నాయి .

 పద్నాలుగవది .. కాళ్ళకి ధరించే కడియాలు , లేదా "పాయల్ " మువ్వల పట్టీలు . వధువు నడుస్తున్నప్పుడు చిరు ధ్వనులు చేస్తూ శుభసూచకంగా నిలుస్తాయి.

పదిహేనవది   తాంబూల సేవనం చేసి .. పరిమళద్రవ్యంని జల్లుకుని సువాసనలు చిందిస్తూ ఉంటారు .

పదహారవది ... వివాహానికి ముందు  బుగ్గన చుక్క  వివాహం తర్వాత సిందూర్, మట్టెలు  ధరించడం .ఆనవాయితీ

ఈ పదహారు అలంకరణలు (సోలః సింగార్ ) చేసుకున్న మన భారతీయ స్త్రీ  సౌభాగ్యవతిగా, ఇంటికి దీపంలా కళ కళ లాడుతూ ఉంటారు .



ఇదండీ .. సోలః  సింగార్ . కొన్ని తెలిసిన సంగతులు ,కొన్ని తెలియని సంగతులు ఆసక్తిగా తెలుసుకుని ఇలా ఒక పోస్ట్ వ్రాసేశాను . :)