29, జూన్ 2024, శనివారం

వానకారు కోయిల

వానకారు కోయిల వేకువఝామునే మేల్కొలిపింది. 

హృదయంలో మారణాయుధం ధరించి

పెదవులపై మధుర సంగీతం పలికించినట్లు.

బాధ కూడా ఒక మెలుకువే కనుక. 


నిన్నంతా.. 

ఏదో సాధించాలనే తాపత్రయం దహించి వేయవచ్చును  గాక

ఏదో కొంత సాధించాం లే.. 

అన్న సంతృప్తి తో ప్రశాంతత ను నిద్రలో వెదుక్కొంటాం గనుక 


కామితములు తగ్గుతాయా తగ్గించుకోవడానికి ప్రయత్నించామా

వ్యక్తీకరించడానికి ఇష్టపడని రహస్యనిధి 

ముఖపత్రం పై సంతకం చేయడానికి తిరస్కరించింది గనుక 

ఇంకనూ..

జనలోకంలో గౌరవంగా బతికివున్నాం గనుక


త్రి దుఃఖాలు మనిషి వేటాడుతుండగా

దుఃఖం లేని జీవితాన్ని ఆశించడం అత్యాశ

అని అంటుంది వానకారు కోయిల

ఆమోదం లేని ఆజ్ఞాపన అది.




28, జూన్ 2024, శుక్రవారం

గొల్ల పిల్ల

పాలు అమ్మే ఒక గొల్ల వనితపై కథానాయకుడు ఆకర్షితుడవుతాడు. అతని బారినుండి తనను తాను కాపాడుకోవడానికి రూపొందించబడిన ఉపాయం ఎంత సహజంగా వుంటుందో కథ వివరిస్తుంది. కథ వినండీ..
 

 

22, జూన్ 2024, శనివారం

శిశిరం చిగురిస్తుందా!?

 కొద్ది గంటల్లో పది రోజులు పూరై పోతున్నాయి."నీ లాంటి రాతి మనిషి ని నేనెక్కడా చూడలేదు. రాతి గుడిలో దేవతలా నువ్వు   ఆరాధనీయమే కాని అనుభవంలోకి రాని దానివి" నిరాశని అణుచుకుంటూ నిష్టూరంగా అన్నాడు.

 అతని చేతిని తన చేతిలోకి తీసుకుని  " ఈ ప్రయాణం ఒక అనుభవం కాదూ! ప్రేమ మానసికం అని నేను గాఢ౦గా  నమ్ముతాను.  ఎన్నోసార్లు మానసికంగా  చచ్చిన మనిషిని నేను. భర్త నీడన లేకపోవడంవల్ల మాట్లాడిన ప్రతి మనిషితోటి అక్రమ సంబంధాన్ని అంటకట్టి తృప్తి పడిన లోకానికి నా మనఃసాక్షి ధిక్కార స్వరంతో చెప్పిన  సమాధానం ఇది.  మనసు పారేసుకున్న  మనిషి, నాకెంతో ఇష్టమైన మనిషిని  యేళ్ళ తరబడి ప్రక్కన పెట్టుకుని కూడా ఉంచుకోలేని మనిషినన్న ఆత్మ తృప్తి   నాకు మిగలింది, ఇది చాలు"అంది.
"నాతో మాట్లాడేటప్పుడు మాత్రమే తెచ్చిపెట్టుకున్న జాగ్రత్తతో  తెలివిగా మాట్లాడతావు. ఈ ప్రపంచంతో సంభాషించేటప్పుడు  హృదయంతో మాట్లాడతావు.ప్రకృతిలో సంచరించేటప్పుడు పసిపిల్లవిగా మారిపోతావ్, నీలో ఇన్ని కోణాలని ఇంత దగ్గరగా చూసిన తర్వాత నాలో కలిగే శారీరక స్పందనలు మాయమైపోయాయి. నాలో ఎలాంటి మనోవికారాలు లేవు.  నిజం చెప్పాలంటే హృదయమంతా ప్రేమ పొంగి పొర్లుతుంది. 
అతను చెపుతూ చెపుతూ  స్వరం జీరపోయినట్లు కొద్దిసేపు ఆగి, తర్వాత "ఆ అనుభూతిని చెప్పడానికి నా దగ్గర మాటల్లేవ్.  దుర్భలత్వంతో  చటుక్కున పురుషుడిపై ఆధారపడిపోయే  యె౦దఱో స్త్రీలని  చూసాను, వాళ్ళతో నేనిన్ను పోల్చలేను.  స్త్రీలు నిజమైన  చైతన్యవంతులు దృడ మనస్కులు   అయితే నీలా ఉంటారు. నీ పై గౌరవం ఇంకా పెరిగింది,  నిన్నెప్పుడూ డిస్ట్రబ్ చేయను. " తల వొంచి గౌరవంగా ఆమెకి నమస్కరించాడు.