7, డిసెంబర్ 2010, మంగళవారం

స్వప్న లోకం

                                                                                                                                                                                                                                                                                                            
స్వప్న లోకం

స్తబ్దత లోను అతి నిశ్శబ్ద భావ సంచనల రూపమా
 చేతనతో నన్ను నేను దర్శించుకునేలా చేసే మాయా దర్పణ సౌధమా 
అనిశ్చిత  జీవితాల అంతులేని సందిగ్ధతల క్లిష్ట  రూపమా

జీవనకాసారంలో నేడు - రేపు మధ్య సంధిగా నిలిచిన మగతలో..
మరో లోకాన్ని చూపిన నేస్తమా 


అచేతనావస్థలో.. గత స్మృతులను  రేపిన స్వప్నమా
లౌకిక స్వప్నాలతో అలౌకిక ఆనందం మిగిల్చిన తేజమా..

కోటి ఊహలతో మనోరధంపై ఊరేగానో
కోర్కెల  రెక్కలు గట్టుకుని అంబరాన
స్వేచ్ఛా విహంగమై  విహరించానో

కలతలెన్నో మరిపించావు..
కలవరము కల్గించావు
నీలో నేను కరగని నాడు
నేనొక విగత జీవినో నిశాచరినో
అందుకే   అయ్యావు  నువ్వే నాలోకం
నాదైన లోకం స్వప్నలోకం

స్వప్న సౌధంలో  నివశిస్తూ అందరు
స్వప్న సాకారానికి  ప్రయత్నిస్తూ  కొందఱు 
జీవితమంతా  స్వాప్నికమై సాగుతూ  మరి కొందఱు 
స్వప్నం  బ్రాంతిగా భావించిన  ఎందఱో 

ఇందరికి ఉందిక్కడ  లిఖించలేని చిరునామా
ఓ జీవితకాల  నమూనా !


జైత్రయాత్ర

జైత్రయాత్ర


ప్రేమా..ఓ ప్రేమా

ఏదీ  నీ  చిరునామా

మనోవేదన నీకు ప్రతి రూపమా 

అనుభూతిలో  కనిపించే అంతరంగమా

మౌనంగా  కుమలడమే నీ ఉనికికి సాక్ష్యమా

 

కాలమే కదా నీకు ఎన్నడూ మిగిలే నేస్తం

అందుకే చిరంజీవి అయినావు కదా

ఇలలో నీకు  సాటి కలదా !


శ్వాస బ్రహ్మ  సృష్టి అయితే..

ప్రతి శ్వాసలో మమేకం అవుతావు.

విశ్వామిత్రుని  ప్రతి సృష్టిలో  తేలియాడిస్తావు

తెలియని ఆవేదనని రగిలిస్తావు

పొగమంచు వలె కమ్మేస్తావు

తెలియని ఆ అనుభూతి లోనే 

మనసంతా ఆక్రమిస్తావు


కనిపించని రూపంతో కనిపించే రూపాలలో 

ఎన్నో మార్పులకు శ్రీకారం  చుడతావు 

బడబాగ్నిలా  దహించి వేస్తావు

ఏ కొందరికో అర్ధమవుతాయి

అర్ధమైన ఏ కొందరికో 

హృదయంలో బందీవి అవుతావు


నిన్ను గెలిపించి ఓడించి తాము గెలుస్తారు

ఎందరో చరిత్రహీనులై 

పర్యాయపదమైన భ్రాంతిలో 

చిత్తు  చిత్తుగా ఓడి  కాలగర్భంలో

తమ  యాత్రని  ముగిస్తారు

అయినా నీ  జైత్రయాత్ర

సాగుతూనే ఉంటుంది అప్రతిహతంగా.


#వనజతాతినేని #vanajatatineni #poetry


  

నేను ఎవరిని

నేను ఎవరిని ? 


ఎంత సంక్లిష్టత
ఎంత  అయిష్టత
మస్తిష్కంని  మధించి
హృదయంతరాళ్ళలో
శోధన మొదలిడి
ఎవరికి వారు
విశ్లేషించుకోవాల్సిన స్థితి
ఆత్మ సమీక్ష రాసుకోవాల్సిన పరిస్థితి

సహజ ప్రసవాలు
అనాగరికం అయినచోట
తిధి వార నక్షత్రాలతో సహా
మంచి మాత్రమే ఎంచుకుని
భూమి మీదకి వచ్చిన
మానవ వారసుడిని.

సముద్రాలని  మించిన  అలజడితో
అశాంతితో  మృగ తృష్ణతో
అలమటిస్తున్న ఆశలజీవిని 

ఎన్నో లోటులను  
భర్తీ చేసుకుంటూ
దివారాత్రాలు
రుద్రకులై పరిశ్రమిస్తూ
దేహాల్ని, దెండాలని    
ఉతికి ఆరేసుకోవాలనుకునే 
తపన జీవిని 

వెలుగు రేఖల వైపు 
పయనిస్తామనుకుంటూ
చీకటి గుహల్లోకి
పయనించే  తిరోగామిని
ఎక్కడో చిరునామా 
మిగిలి ఉందనుకున్న 
మానవత్వపు  ఉనికిని.