17, ఏప్రిల్ 2012, మంగళవారం

పోస్ట్ కార్డ్ స్పందన

ఆడ పిల్లలు మెకానిక్ కోర్సెస్ చదివి ఏం చేస్తారు? అని చాలా మంది యెగతాళి చేస్తారు.
అది ఒకప్పటి మాట.
నేటి కాలం లో మెకానికల్,ఆటో మొబైల్  బ్రాంచ్ లని కోరి  తీసుకుని ఇష్టంగా చదువుతున్న ఆమ్మాయిలని చూస్తున్నాం. 

పురుషులకి మాత్రమే పరిమితమైన రంగాలలో స్త్రీలు ప్రవేశించడం చాలా సంవత్సరాల క్రితమే ప్రారంభం  అయింది. 
ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పబోతూ ఈ ఉపోద్ఘాతం అన్నమాట. 
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో కంప్యూటర్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న  ఒక యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి విదేశాలకి వెళ్లి అక్కడ కంప్యుటర్ సైన్స్ లో డాక్టరేట్ సాధించాలని ఆశయం తో ఉంది. 
అప్పటికి ఆమె చదువుతున్న తరగతిలో  ఒకే ఒక స్త్రీ ఆమె. 

ఒక రోజు నోటీస్ బోర్డ్లో  ఒక ఉద్యోగ ప్రకటన  కనిపించింది. 

టెల్కో ఆటో మొబైల్ సంస్థ జారీ చేసిన ఆ ప్రకటన లో యువకులు,తెలివికలవారు,కష్టించి పనిచేసేవాళ్ళు,అత్యున్నత విద్యా ప్రమాణ నేపధ్యం ఉన్న ఇంజినీర్లు కావలెను. స్త్రీ అభ్యర్ధులు దరఖాస్తు పంపనవసరం లేదు అని చదివిన ఆమెకి ఉవెత్తున కోపం ముంచుకు వచ్చింది. స్త్రీ అభ్యర్ధులు ఎందుకు అర్హులు కాదో తెలుసుకోవాలనుకుని ఆ విషయాన్ని సవాల్ గా తీసుకుంది.  ఆ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుని నిర్ణయించుకుని

టాటా గ్రూప్ అధిపతి జే.ఆర్.డి.టాటా. గారికి ఓ పోస్ట్ కార్డు పై ఇలా వ్రాసి పోస్ట్ చేసింది.

"భారత దేశంలో  టాటాలు ఎన్నిటికో ఆధ్యులు. ఇనుము-ఉక్కుకర్మాగారం,రసాయనాలు,వస్త్రాలు,రైలింజనాలు,ఇంకా అనేక పరిశ్రమలు స్తాపించారు. ఉన్నత విద్య కోసం ఇనిస్టి ట్యూషన్స్ ఎన్నో స్తాపించారు. నా అదృష్టం కొద్ది నేను అక్కడే చదువుకున్నాను. అలాంటి  మీరు స్త్రీ-పురుషుల మధ్య వివక్షని మీ కంపెనీలో పాటిస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉంది".అని వ్రాసి పోస్ట్ చేసారు. 

పదిరోజులకి ఆమెకి ఓ టెలిగ్రాం వచ్చింది.  టెల్కో పూనే లో మీరు ఇంటర్వ్యూ కి హాజరు కావాలని.  ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళింది. ఆమెకి  ఆ ఉద్యోగం లభించింది.టెల్కో ప్లోర్ లో పని జేసిన మొట్టమొదటి మహిళ ఆమె నని చెపాల్సిన పనిలేదు కదా! 

కొన్ని వందల ఉత్తరాలలో ఒక పోస్ట్ కార్డ్ కి విలువనిచ్చిన వ్యక్తీ ఓ ప్రముఖ వ్యక్తితో మాట్లాడింది కూడా! ఆయన అప్రో జే.ఆర్.డి.టాటా. (అప్రో అనేది గుజరాతీ పదం. అప్రో..అంటే "మన" అని అర్ధం.) 

ఆమెకి ఓ రోజు రాత్రి   పోద్దుపోయిన తర్వాత ఆమె భర్త వచ్చి ఆమెతో కలసి వెళ్ళేవరకు ఆమెకి రక్షణగా నిలబడ్డారు. అలాగే ఆమె 1982  లో టెల్కో ఉద్యోగం కి రాజీ చేసిన రోజు  అప్రో జే.ఆర్.డి.టాటా తో మాట్లాడింది. 

'ఇప్పుడు ఏం చేద్దామనుకున్తున్నావ్ మిసెస్ కులకర్ణీ"!? అని అడిగారు.
అప్పుడు ఆమె నా భర్త ఇన్ఫోసిస్ కంపెనీ ప్రారంభిస్తున్నారు. నేను పూనే  కి మారాలి అని చెప్పారు ఆమె.


 ఇప్పుడు అర్ధం అయిందా!? ఆమె సుధా కులకర్ణి. (సుధా నారాయణ మూర్తి  or  సుధా మూర్తి) 

తర్వాత ఇన్ప్ఫోసిస్ కంపెనీ పురోగమన వృద్దిని ఆయన చూడాలని ఆమె కోరుకుంది. కానీ ఆమె కోరిక నెరవేరలేదు. కానీ  ప్రతి రోజు ఆమె తన ఆఫీస్ లో అడుగుపెట్టగానే అప్రో ఫోటో ని చూసి నమస్కరించుకుంటుంది.

ఈనాడు దేశంలో ఎంతో మంది ఆడపిల్లలు పురుషులతో సమానంగా ఉన్నారంటే అది వారు వేసిన బాటే కదా!

ఈ స్పూర్తికరమైన విషయం ప్రస్తుతం ఇంటర్ మీడియట్ ప్రధమ సంవత్సరంలో పాఠ్యభాగంగా ఉంది.  

అలాగే ఆమె చెప్పిన ఎన్నో విలువైన విషయాలు" How I  taught My Grand Mother.". అనే  పుస్తకంలో కథలుగా చదువుకోవచ్చు. తెలుగులో "అమ్మమ్మచదువు " పుస్తకంలో చదవవచ్చు.
తెలుగు అనువాదం:ద్వారక, అలకనంద ప్రచురణలు.  తప్పక చదవండి.  

16, ఏప్రిల్ 2012, సోమవారం

తన రంగునిచ్చి తను రాలిపోయిన "గోరింటాకు"



నాకు  చాలా బాగా  నచ్చిన సినిమా .. గోరింటాకు.

నేను పదునైదేండ్లు వయసులో ఉండగా.. చూసిన సినిమా. ఇప్పటిలా ఒక సినిమా రాగానే కొన్ని నెలలకే , కొన్ని రోజులకే కనుమరుగై పోయిన రోజులు కావు కదా అవి. మంచి సినిమా అంటే ఏడాదికి ఓ సారి అయినా వచ్చి ఓ..పది పదిహేను రోజులపాటు ధియేటర్ లో మూడు పూటలా  అలరించి వెళ్ళేవి .

నేను పదవతరగతి చదివేటప్పటికి  ఆ చిత్రం విడుదలయి ఓ..రెండేళ్ళు దాటింది. శోభన్ చిత్రాలు అంటే..మా వూరి వాళ్లకి బాగా అభిమానం. అక్కడే పుట్టి పెరిగి వెళ్ళినవాడని..అందరికి పరిచయం ఉండటం మూలంగా ఎక్కువ గా శోభన్ చిత్రాలని   ఆదరించే వారు.  చిత్రం బాగుంటే ఇంకా ఎక్కువగా  ఆ చిత్రాన్ని ఆదరించి అభిమానాన్ని చాటుకునేవారు.  అయినా శోభన్ బాబు ఖాతాలో ఎక్కువ మంచి చిత్రాలే ఉండేవి.

నేను "గోరింటాకు " చిత్రాన్ని చూసింది మూడు సార్లు..కానీ ఆ చిత్రాన్ని రోజు సెకండ్ షో ని చూడకుండా వినడం ఓ..పదిహేను రోజులు. రాత్రి సమయాలలో ట్యూషన్ టైం అయిపోయి..అందరూ  ముసుగుతన్ని  పడుకుంటే..ఆ చిత్రంలో సంభాషణలన్నింటిని  బాగా  వింటూ.. అంత కన్నా బాగా జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ.. అలా నిద్రలోకి జారుకునేదానిని.(ప్రక్కనే దియేటర్ ఉండేది కాబట్టి)

అలా గోరింటాకు చిత్రం నాకు బాగా నచ్చేసింది. చిత్ర కథా రచన దాసరి గారు అనుకుంటాను. చాలా పదునైన సంభాషణలు, కదిలించే సంభాషణలు చాలానే ఉండేయి,

ఓ పల్లెటూర్లో పుట్టిన రాము కి ఓ..చిట్టి చెల్లి ఉండేది. ఆమెకి గోరింటాకు అంటే చాలా ఇష్టం. తల్లి ఆ అమ్మాయికి గోరింటాకు కోసి రుబ్బి పెడుతూ.. ఓ.పాట పాడుతుంది. ఆ పాట వినగానే మనకి గీత రచయిత దేవులపల్లి  టక్కున గురుకు వస్తారు. మాహానటి సావిత్రి రూపం గుర్తుకు వచ్చి బాగా బాధ కల్గుతుంది.

"మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు,గన్నేరులా పూస్తే కలవాడోస్తాడు,  సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా..అందాల చందమామ తానే దిగి వస్తాడు." అని పదహారు అణాల తెలుగుతనాన్ని పూయించిన పాట.
ఇంతకీ  ఆ తల్లికి లభించిన  మొగుడు కోపిస్టి వాడు,పాపిష్టి వాడు కాబట్టి..అ బిడ్డ అల్పాయుష్కురాలయింది.ఆ ముద్దుల అన్నకి గోరింటాకు అంటేనే భయం మిగిల్చింది.

ఆ చిత్రంలో సావిత్రి భర్త ఓ..వ్యసనపరుడు. పరాయి స్త్రీల మోజులో..కుటుంబాన్ని గాలికి వదిలేసి..అప్పుడప్పుడు వచ్చి తన ప్రతాపాన్ని చూపించి వెళ్ళిపోతూ ఉంటాడు. కనుల నీరు నింపుకుని ఆ భర్తకి ఎదురు చెప్పలేక మౌనంగా భరిస్తూ.. బిడ్డలే ప్రాణంగా బ్రతుకుతున్న ఆమెకి కడుపు కోత మిగిల్చి..పూర్తిగా తన విలాస జీవితంలోనే మునిగి పోతాడు..తండ్రి (జే వి రమణ మూర్తి). మేనమామ, అత్తల సాయంతో..రాము (శోభన్ బాబు ) చదువుకోవడానికి పట్నం చేరు కుంటాడు. మెడిసన్ కోర్స్ లో జాయిన్ అయి.. చదువుకుంటూ.. సక్రమంగా ఫీజు చెల్లించలేక ఆ
దుస్థితిలో అందరి దృష్టిలో పడినప్పుడు  స్వప్న (సుజాత) దృష్టిలో పడతాడు. ఆమె అతని కి సాయపడి..అందుకు బదులుగా తన చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పమని అడిగి వారి ఇంట్లోనే అవుట్ హౌస్ లో ఆశ్రయం ఇస్తుంది. అతనికి సహాయ పడుతుంది.

ఆమె మంచితనాన్ని, సహృదయాన్ని, వ్యక్తిత్వంని ఆరాదిస్తూ..తన మనసులో భావాల్ని ఎప్పటికప్పుడు  డైరీలో రాసుకుంటూ ఉంటాడు రాము. అవకాశం దొరికితే తన మనసులో భావాలని  ఎన్నో సార్లు  చెప్పాలనుకుని ఆరాట పడతాడు. అలా కొన్నేళ్ళు ఆమెకి తన ప్రేమని చెప్పాలనుకుని కూడా చెప్పలేక మూగప్రేమతో.. సతమత మవుతాడు.

చదువు పూర్తికావడంతో..స్వప్న తండ్రి ఆమెకి  వివాహం చేయదలచి ఒక మంచి సంబందం చూస్తాడు.ఆ విషయాన్నే  రాముకి చెప్పి అతని సలహా తీసుకుంటాడు.రాము కూడా ఆమెకి అన్ని విధాల సరైనజోడని ఆమె తండ్రి ఎంపికకి ఓటు వేస్తాడు. అది తెలిసిన స్వప్న ..తన ప్రేమని తనలోనే దాచుకుని తండ్రి కుదిర్చిన వ్యక్తి ని వివాహం చేసుకుంటుంది.

ఆనంద్ తో   కలసి కాపురానికి  వెళ్ళిన స్వప్నకి .. ఓ..చేదు విషయం తెలుస్తుంది. ఆమె వివాహమాడిన ఆనంద్ (దేవదాస్ కనకాల) కి అంతకు ముందు ఓ..వివాహం జరిగి..ఓ..పాపకి జన్మనిచ్చాడని తెలుస్తుంది. అతని తప్పుని నిలదీసి..అతనికి బుద్ధి చెప్పి  పాపతో కూడా వచ్చిన ఆమెని అతనితో కలిపి   తిరిగి పుట్టింటికి చేరుకుంటుంది. ఈ లోపు రాము ..ఆ ఇంటి నుండి వేరే ఇంటికి మారి పోయి..పల్లెటూరి నుండి తల్లిని తీసుకు వచ్చుకుని ఆమెతో కలసి ఉంటూ ఉంటాడు.

వారి ఇంటి ప్రక్కనే మేడమీద నివసిస్తున్న పద్మ పాడిన విషాదమైన పాట (పాడితే శిలలైన కరగాలి) వింటాడు. ఆ పాట తర్వాత ఆమె  దుఖః భారంతో సృహ తప్పడం ఉన్మాదిలా ప్రవర్తించడం  చేస్తూ ఉంటుంది. రాము  ఒక డాక్టర్ గా వెళ్లి ఆమెకి సేవలు అందిస్తాడు.ఆ క్రమంలో  ఆమె  చేష్టలవలన  గాయపడతాడు కూడా. ఆమె తల్లి  చెప్పిన విషయాల వల్ల కొన్ని విషయాలు  రాముకి తెలుస్తాయి. పద్మ వివాహ ఘడియకు ముందు ఆమెని పెండ్లాడాల్సిన వరుడు..పెళ్ళికి సిద్దమై వస్తూ.. దారిలో జరిగిన  యాక్సిడెంట్ లో చనిపోవడం మూలంగా  ఆమె ఆ షాక్ తో మానసికంగా దెబ్బతిని అలా ప్రవర్తిస్తుందని తెలుస్తుంది. ఆమె పై కలిగిన సానుభూతితో.. ఆమెకి ట్రీట్మెంట్ లో భాగంగాను..పద్మకి సన్నిహితం అవుతాడు. ఈ లోపు.. రాము తండ్రి అనారోగ్యం పాలయి హాస్పిటల్ లో దిక్కు మొక్కు లేకుండా పడి ఉండటం చూసి  తండ్రికి  తన తిరస్కృతి చూపుతూనే వైద్యం అందించి మామూలు మనిషి అయ్యేటట్లు చూస్తాడు. ఆ తర్వాత  తండ్రి తమతో మరలా కలసి ఉంటాడని  తల్లి అన్నప్పుడు వ్యతిరేకిస్తాడు...కానీ తల్లి మాట కాదనుకోలేక తమతో కలసి ఉండటానికి అయిష్టంగానే అంగీకరిస్తాడు. ఎందుకో సావిత్రి నిర్ణయాన్ని హర్షించలేకపోయాను కూడా ! అలాంటి భర్తని ఆమె క్షమించడం నా దృష్టిలో అవివేకం కూడా !

మధ్యలో ఒకసారి స్వప ని  కలసినప్పుడు ఆమెకి జరిగిన అన్యాయానికి బాధపడతాడు.
ఒకరోజు..  స్వప్నకి రాము డైరీ ఆ ఇంట్లో కనబడుతుంది అది చదివిన ఆమెకి అతని మనసులో ఉన్న ప్రేమ  సంగతి తెలుస్తుంది. అతనితో.. మాట్లాడాలనుకుంటుంది. ఈ లోపుగా రాముకి  పద్మకి మధ్య ప్రేమ చిగురిస్తుంది. వారు ఇద్దరు పెళ్ళిచేసుకోవాలని నిర్ణయం చేసుకున్తప్పటికి ..స్వప్న ప్రేమ సంగతి తెలుస్తుంది. పద్మ ఆత్మహత్యా ప్రయత్నం .. చేయడం..స్వప్న ఆమెకి బ్లడ్ డొనేట్ చేసి బ్రతికించడం.. ఆ ఇరువురి మధ్య నలిగిన మూగ ప్రేమ తిరిగి కలిసే సమయానికి మళ్ళీ ట్రయాంగిల్ లవ్ స్టొరీ కావడం అంతా  ఒక కలలా అనిపించినా.. కథ, సెంటిమెంట్ బలంగా ఉండటంతో.. ఎక్కడా ప్రేక్షకుడికి విసుగు పుట్టవు. మన మధ్య జరుగుతున్న  సహజమైన కథలా రీళ్ళు కి రీళ్ళు కదలి వెళ్లి పోతుంటాయి .

పద్మ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్నాని రాము చెప్పినప్పుడు   స్వప్న ఒక ఉన్నత వ్యక్తిత్వంతో.. పద్మ ఉన్న స్థితిలో ఆమెని వివాహమాడటమే మంచిదని రాముని ఒప్పిస్తుంది.

"స్వప్నా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్ ? "  అని అడుగుతాడు..రాము.
"నేను తిరిగి నా భర్త దగ్గరకే వెళ్లి పోవాలనుకుంటున్నాను" అని చెపుతుంది.
"నీకు పాత కాలం ఆడవారికి తేడా లేదు అని నిరూపించావ్"..అంటాడు రాము.
"కాలం ఏదైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే కదా !" అంటుంది..స్వప్న.
చదువుకునే రోజుల్లో వల్లించే ఆదర్శాలు,ఆశయాలు నిజ జీవితంలో ఆచరణ లో కనబడని స్త్రీల జీవితం పట్ల ఆవేశం,ఆవేదన ఉంటుంది.
అలాగే  చిత్రం ఆఖరిలో స్వప్న   ఒంటరిగా మిగిలిపోయి..అలా దూరంగా నడచి వెల్లిపోయేటప్పుడు.. వినిపించే  గీతం  మనసుకు వస్తూను ఉంటుంది.  "తన రంగుని ఇచ్చి (ప్రాణ మిచ్చి ) తనువంతా ఎండి తను రాలిపోతుంది." అంటూ గోరింటాకు స్వరూపాన్ని స్వప్న పాత్రకి అన్వనయించి చెప్పడం నాకు చాలా నచ్చింది.

స్త్రీల  పూర్తి కాల జీవితం పురుషుల నడవడికతో ముడిపడి ఉండటం.. వారి అహంకార విలాస,విచ్చలవిడి శృంగార జీవితాన్ని భరించాల్సి రావడం.ఎన్ని తప్పులు చేసినా..అన్నీ మరచి పోయి వారిని క్షమించడం.. సావిత్రి పాత్రలో మనకు దర్శనం ఇస్తే..

పెద్ద చదువులు చదువుకుని.. ఇచ్చిన మనసు బయట పెట్టుకోలేక తండ్రి కుదిర్చిన మనువాడి..అతని నిజ స్వరూపం తెలిసిన తర్వాత ఇంకొక స్త్రీజీవితాన్ని సరిదిద్దే ప్రయత్నంలో.. పురుషుడి మోసాన్ని నిలబెట్టి కడిగి పారేసి ఆ స్త్రీకి న్యాయం చేకూరుస్తుంది... ఆ పాత్రలో నటి  సుజాతని తప్ప మరొకరిని ఊహించలేము.

ఆనంద్ (దేవదాస్ కనకాల) ని నిలదీసే టప్పటి డైలాగ్స్ నాకు యెంత బాగా నచ్చాయో!

మూడు మూరల పసుపుతాడుతో..  ఒక పసుపు కొమ్ముతో..ఒక ఆడదాన్ని జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు. ఆమెని తల్లిని  చేసి మరలా డబ్బు కోసం నన్ను పెళ్లి చేసుకుని ..ఎంతోమంది జీవితాలతోనో ఆడుకోవాలనుకునే నిన్ను షూట్ చేసి పారేసినా పాపం లేదంటుంది. చాలా పదునైన సంభాషణలు.

సంభాషణ ల రచయిత ఎవరో గుర్తు లేదు కానీ ..ముప్పయ్యి ఏళ్ళ క్రితం చూసిన చిత్రం ఇంకా  గుర్తు ఉండి పోయిందంటే  ..కథా కథనం యెంత గొప్పవో కదా! ఆ చిత్రంలో పాటలన్నీ ఎంతో..బాగుంటాయి. రమాప్రభ,చలం ల హాస్యం మనసార నవ్విస్తాయి.  కే.వి.మహదేవన్ సంగీతంలో పాటలు ఒక దానికి మించి మరొకటి..
అద్వితీయమైన సుజాత నటన మన మనస్సులో చెరగని ముద్ర వేస్తుంది.

నాలో స్త్రీవాదం పట్ల ఉన్న భావాలు బలంగా నాటించిన చిత్రం అది.ఎందుకంటే..అలాటి కథలు సావిత్రి భర్త లాటి పురుషులు కుడి ఎడమగా అలాటి ధోరణులు   మనం చూస్తూనే ఉంటాం కాబట్టి.  భర్తలని ప్రశ్నించలేని అసహాయతలో ఇంట్లో మగ్గిపోయిన ఆడవారి జీవితాలకి తార్కాణం సావిత్రి పాత్ర.. మేడిపండు లాటి వివాహ వ్యవస్థలో మగ్గిపోయిన ఆడవారి కథ కూడా.

విధి వంచించినా ఓ..సహ్రుదయుడి సానుభూతి లభించి అది ప్రేమగా మారి సరిక్రొత్త జీవితం లభించిన పద్మ  జీవితం..  ఇలా ఇన్ని కోణాలు ఉన్న చిత్రం అది.

మళ్ళీ ఒకసారి చూసి చిత్రం గురించి వ్రాయాలనుకున్నాను. కానీ చూడటం కుదరక.. గుర్తు తెచ్చుకుని ఇది వ్రాస్తున్నాను.


14, ఏప్రిల్ 2012, శనివారం

ఎవరున్నారని..

ఎవరున్నారని..


అన్యమనస్కంగానే ఆఫీస్ లో వర్క్ చేస్తున్న శ్రావ్య కి మనసంతా పాప చుట్టూనే తిరుగుతుంది.


జ్వరం తగ్గింది లేదో, రెండవ మోతాదు  సిరఫ్ యిచ్చారో లేదో! కొంచెమైనా  పాలు త్రాగిందో లేదో, తప్పని  సరిగా హాజరు కావాల్సిన  పని  రోజులు. సెలవు పెట్టడానికి వీలు లేని  సంవత్సరాంతపు లెక్కలు.


చేస్తున్నకొద్దీ పని  తవ్వుకుని వస్తుంది. ప్రక్కవాళ్ళు చేసే పనిని  కూడా నైపుణ్యం అని కితాబు విసిరి అరగ రుద్ది చేయించే  మేనేజర్.


మాములుగా అయితే అభ్యంతరం చెప్పేది కాదేమో, ఇప్పుడు పసిగుడ్డు అలా జ్వరంతో పడివుంటే చూసుకునే వీలు లేక మనసు బాధగా మూలుగుతుంది. పేగు పాశం మెలిపెడుతుంది.  వాసు కి కాల్ చేసి ఒకసారి పాపని చూసి రమ్మని చెపితే! మనసులో అనుకుంది.


ఊహు ప్రయోజనం లేదు అనుకుంటూనే..మళ్ళీ మొబైల్ చేతిలోకి తీసుకుని నెంబర్ డయల్ చేసి కాల్ బటన్ నొక్కబోయి ఆగిపోయింది.


పిచ్చి మొహం! నిన్న నువ్వు కాల్ చేసి చెపితే మాత్రం అతను  యే౦ పట్టించుకున్నాడు గనుక? ఈ రోజు మళ్ళీ చెప్పాలనుకున్నావ్..అని  మనసు చీవాట్లువేసింది. ఉష్..అని నిట్టూర్చి ..క్రెష్ కి కాల్ చేసింది..


"పాపకి యెలా ఉంది" అడిగింది


క్రెష్  నిర్వాహకురాలు సుధ స్నేహశీలి. తన ఆదుర్ధాని అర్థం చేసుకుని "పాపకి  మీరు చెప్పినట్లు  కరెక్ట్ టైం కి మందు యిచ్చాను. జ్వరం తగ్గింది. నిద్రపోతుంది. మీకేం కంగారు వద్దు. జాగ్రత్తగా చూసుకుంటాను. మాములుగా సాయంత్రం వచ్చి తీసుకుని వెళ్ళండి” అంది.


కాస్త మనసు శాంతించింది. లంచ్ టైములో కొలీగ్,  స్నేహితురాలు లత అడిగింది "పాపకి యెలా వుంది? ఇంట్లోనే వుంచి వచ్చావా? "అని.


“లేదు,  క్రెష్ లోనే వదిలివచ్చాను.జ్వరం తగ్గింది పర్వాలేదు" అని చెప్పింది.


“మీ అమ్మ గారికి అనారోగ్య సమస్య లేకుంటే ఆవిడే చూసుకునేవారు. ఆవిడ అనారోగ్యం మీకు పెద్ద యిబ్బంది తెచ్చిపెట్టింది”


ఇబ్బంది యేముంటుంది. పిల్లలని తల్లిదండ్రులేకదా చూసుకోవాలి. పాపం అమ్మ మాత్రం యెవరి పిల్లల్నని చూస్తుంది. అన్నయ్య పిల్లలిద్దరిని నాలుగేళ్ళు వచ్చేదాకా పెంచిచ్చి అలసి పోయింది.అయినా  పిల్లలని పెంచే అలవాటు పోయిన దశలో పిల్లని పెంచడం యెంత కష్టం? ఏదో కాసేపు యెత్తుకుని ముద్దు చేసి లాలించడానికినూ అచ్చంగా అమ్మలా పెంచడానికీనూ  యెంత తేడా!? పాల బాటిల్స్ కడగడం వాళ్లకి యే మాత్రం బాగోకున్నా హాస్పిటల్ కి తిప్పడం రాత్రుళ్ళు మెలుకువగా వుండి చూసుకోవడం యెంత కష్టం. వాళ్ళ బాధని మనం అర్ధం చేసుకోవాలి. మన వుద్యోగాలు,మన సంపాదనలు, మన సరదాల కోసం వాళ్ళని అరగదీస్తున్నాం. 


కోడలు వుద్యోగం చేస్తుందని ఆమెకి సాయపడాలని ఆరు సంవత్సరాలు నడుం విరిగేలా చాకిరి చేసి యిద్దరి పిల్లలని పెంచి యిచ్చింది. అయినా కోడలికి యింత కృతజ్ఞత లేదు.  ఈ మధ్య మంచి ట్రీట్మెంట్ కోసమని హైదరాబాద్ వెళితే.. ఒక వారం రోజుల లోపలే  తను  బండెడు చాకిరి చేయలేకపోతున్నానని పెద్ద గొడవ  చేసిందట.అమ్మ-నాన్న

 వింటూన్నారనే జ్ఞానం కూడా లేకుండా అన్నయ్యని సాధించడం చూసి వాళ్ళే  అక్కడ వుండలేక వచ్చేసారు.


అవసరం వున్న నీకు సాయంగా వుండలేకపోయాను. పరాయి బిడ్డకి చాకిరి చేసి చేసి అలసిపోయాను   పనివాళ్ళకి వున్నపాటి   విలువ కూడా సంపాదించుకోలేకపోయాను అని అమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంటే  వింటున్నప్పుడు చాలా బాధగా వుంటుంది.


సర్ది చెపుతూ నువ్వే వదినని అర్ధం చేసుకోలేదేమో, అయినా వదిన పరాయి బిడ్డని అంటావెందుకు?   అయినా నువ్వు నీ  కొడుకు బిడ్డలనే కదా పెంచి పెద్ద చేసావు. ఎందుకమ్మా అలా అనుకుంటావ్ అని సర్ది చెపుతుంటాను అని చెప్పుకొచ్చింది.


మన ఆడవాళ్ళలో కూడా కొంత మందిలో యెంత చదువుకుని వుద్యోగాలు చేస్తున్నా సంస్కారం, కృతజ్ఞత వుండదు. మీ అమ్మగారి లాంటి అత్త గారిని కళ్ళకద్దుకుని చూసుకోవాలి. మరి మీ  వదిన తీరు యేమిటో! అంది లత.


నేనయినా అమ్మని తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ యిప్పించాలని మనసులో వున్నా ఆచరించి చూపలేను. అసలు అమ్మ యిక్కడికి రాదు కూడా. మా అత్త గారు నా డెలివరి టైములో చేసిన గొడవ నేను మర్చిపోలేదు.  అమ్మని నాన్నని వూరికే యిక్కడ కూర్చుని తిని పోవడానికి వచ్చినట్లు యెన్ని మాటలు అన్నారో, కాన్పుకి పుట్టింటికి వెళ్ళక వారిని యెన్ని మాటలు అనిపించానో !


అమ్మ కూడా నాకు సాయంగా ఉండాలని యెంతగా అనుకుందో, నడుం నొప్పి బాధిస్తున్నా నాకు,పాపకి సేవలు చేయాలని యెంత ఆత్రుత పడిందో?మా అత్తగారి మాటలకు  గాయపడి నేనే వాళ్ళని పంపించేసాను. వాళ్ళు వెళ్ళిన రెండు రోజులకే అత్తగారు  వెళ్ళిపోయింది. నెలరోజుల పసి గుడ్డుతో యెంత అవస్థ పడ్డానో వాసుకి అంతా వినోదంగా వుంటుంది.


ఇంటి లోన్ తీసుకుని వున్నాను కాబట్టి ఉద్యోగం మానేయలేను. పైగా "వాసు” సేలరీ కూడా బాగా కట్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో జాబ్ మానేయలేను.


వాసుకి స్నేహితులు తప్ప యెవరూ, యేమీ  పట్టవు. స్నేహితులు అతని చేత ష్యూరిటీ సంతకాలు యిప్పించుకుని నల్లపూసై పోయారు. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీ వారికి వాసు జీతంలో నుండి ఆ మొత్తం కట్ అవక తప్పడం లేదు.ష్యూరిటీ పెట్టినందుకుగాను తానే ఆ లోను అమౌంట్ లు తీర్చక తప్పని పరిస్థితి.రాత్రుళ్ళు ఆలస్యంగా రావడం మామూలైపోయింది. ఈ మధ్య డ్రింక్ కూడా చేస్తున్నాడు.


అసలు ఫ్రెండ్స్ అంటే యెవరు? అవసరానికి అలా ష్యూరిటీ సంతకాలు పెట్టించుకుని మొహం చాటేసేవారా?  స్నేహం ముసుగులో అలా ప్రవర్తించే వాళ్ళు నిజమైన స్నేహితులేనా? అసలు మనుషులపై నమ్మకమే పోతుంది. ఎవరిని నమ్మాలో యెవరిని నమ్మకూదదో అర్ధం కావడం లేదు. 


ఏదైనా ప్రశ్నిస్తే ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాను తప్పేముంది అంటాడు. ఆ ఫ్రెండ్స్ మూలంగానే కదా చాలా యిబ్బంది పడుతున్నాం అంటే  నాకు ఫ్రెండ్స్ ముఖ్యం అంటాడు.


వాదనకి కాకపోయినా వాస్తవం తెలుసుకుంటాడని "మరి నన్నెందుకు చేసుకున్నావ్.."అని అడగాల్సి వస్తుంది.


ఓహో.. యిప్పుడు నన్ను నువ్వే కదా పోషించేది, అందుకే నీకు లోకువైపోయాను అంటాడు.అలిగి అన్నం తినడు. రెండు రోజులు బ్రతిమాలించుకుని అలా అడగడం నా తప్పని చెంపలు వేసుకుని సారీ చెపితే గాని శాంతించడు. తప్పు కాకపోయినా సారీ చెప్పడం, కుటుంబ బాధ్యత మోయడం, పాపను చూసుకోవడం వుద్యోగం చేయడం అన్నీ చేసుకుంటూనే వున్నాను. అసలు మాది ప్రేమ వివాహమేనా అన్న అనుమానం వస్తుంది.  అమ్మ నాన్నని  వొప్పించి యెంత ఇష్టపడి చేసుకున్నాం.  కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా  వరుసగా తన పరిస్థితిని బాధగా చెప్పింది.


మళ్ళీ స్నేహితురాలి భుజంపై చేయి వేసి ఓదార్చుతూ పక్కనే వచ్చి కూర్చుంది లత.


“అసలు నేనే పొరబాటు చేసినట్లు ఉన్నాను . సొంత ఇల్లు అమరుతుందని ఆశతో వుద్యోగం చేస్తానని సంబరపడ్డాను కానీ ఆ ఇల్లు  మా మధ్య వైరుధ్యాలు పెంచుతుందని అనుకోలేదు. నేను అప్లై చేయడం వెంటనే  జాబ్ రావడం అదృష్టం అంటారు. అలాగే అమ్మ వాళ్ళు యిచ్చిన డబ్బుతో యిల్లు కొనడం,దానికి పూర్తి డబ్బు సమకూరకపోతే లోన్ తీసుకోవడం నా జాబు ష్యూరిటి పై  లోన్ ఇవ్వడం వలన నా పేరుతొ యిల్లు రిజిస్టరై వుండటం సరదాకి యిల్లు నాది కదా అనడం కూడా నచ్చలేదు.  వాసుకి ఆ మాటే బాగా నాటుకుపోయి  నూన్యతా భావం వచ్చేసింది.  నన్ను చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడు. తట్టుకోలేకపోతున్నాను.  కన్నీళ్లు కారుతుండగా అంది.


ఓదార్పుగా స్నేహితురాలి భుజంపై చేయి వేసింది


నిన్నటికి నిన్న క్రెష్ నుండి పాపకి బాగా జ్వరంగా వుందని కాల్ చేసారు. తను ఖాళీగానే వున్నాడు. నేను వెంటనే కాల్ చేసి పాపని యింటికి తీసుకుని వెళ్ళు వాసు. నేను హాస్పిటల్ లో  అపాయింట్ మెంట్ తీసుకుని యింటికి వస్తాను అని చెపితే నాకు తీరికలేదు. ఫ్రెండ్స్ తో వేరే పని మీద బయటకి వెళ్ళాలి, అవన్నీ నువ్వే చూసుకో అని చెప్పి ఫోన్ కట్ చేసాడు.  వర్కింగ్ అవర్స్ అయ్యేవరకు పాపకి యెలా వుందో  అని  నేను యెంత టెన్షన్ అనుభవించానో,ఇలాటి నిర్లక్ష్యాన్ని యెలా అర్ధం చేసుకోవాలి, తండ్రిగా అతనికి యే౦ పట్టదా?


-క్రెష్ కి వెళ్లి పాపని తీసుకుని హాస్పిటల్ లో చూపించుకుని యింటికి  వెళ్లేసరికి వాసు యింట్లోనే వున్నాడు. తీరిగ్గా టీవి చూసుకుంటూ. కూరగాయలు లేవు. ఉదయం చేసిన కూరలు వేసి పెట్టానని బేగ్ వేసుకుని వుద్యోగాలు వెలగ బెట్టడం కాదు. మొగుడు కంచంలో యే౦ కావాలో కూడా చూసుకోవాలని పరుషమైన మాటలు.ప్రక్కనే వున్న  కూరగాయల మార్కెట్ కి వెళ్లి కూరలు తెచ్చే తీరిక తనకి వుండదు.నేను మాత్రం అన్ని పనులు చేయాలనుకుంటాడు. ఎందుకింత క్రూరమైన హింస? నాకు అర్ధం కావడం లేదు.


“ఉదయమే.. జ్వరంతో వున్న  పాపనేసుకుని వెళ్లి కూరగాయలు తెచ్చి వంట చేసి అతనకి లంచ్ బాక్స్ సర్ది టిఫిన్ రెడీ చేసి టేబుల్ పై పెట్టి..   పాపతో సహా బయటపడి మనసు పీకుతున్నా జ్వరంతో వున్న బిడ్డని  క్రెష్ లో వదిలేసి వచ్చాను. ఈ వుద్యోగం అవసరమా అనిపిస్తుంది” మనసులో బాధ౦తా చెప్పుకుంది.


" ఊరుకో.. యిలా యెన్నైనా సర్దుకుపోవాలి ఆకాశంలో సగం మనం " చెప్పింది నవ్వుతూ.


"అవును కదా"అని నవ్వుతూ శ్రావ్య.


లంచ్ బాక్స్ తీసి అలా యేదో కెలికి తిన్నాననిపించింది. సాయంత్రం వరకు ఆలోచన బరువుతో అలాగే పని చేసుకుని బయటపడి క్రెష్ కి వెళ్ళింది.


క్రెష్ సుధ "మేడం పాపని వాళ్ళ నాన్నగారు  వచ్చి  మద్యాహ్నమే తీసుకుని వెళ్ళారు " అని చెప్పింది.కొంచెం ఆశ్చర్యం,సంతోషంతో యింటికి  దారితీసింది. బస్ లో సీటు దొరికింది. విండో సీట్ లో కూర్చుని కళ్లు మూసుకుంది. ఆమె కనుల ముందు మనోహర దృశ్యం.


***********

ఇంట్లోకి ఫ్రవేశిస్తూనే… 

వాసు పాపని  ఆడిస్తూ కనపడ్డాడు. ఆమె ఆడగక ముందే అతనే చెప్పాడు. “పాపకి జ్వరం తగ్గిందిలే, కంగారు పడకు. పాపకి స్నానం చేయించాను.నువ్వు ఫ్రెష్ అయి రా” అన్నాడు.


పాపని అతని చేతుల్లో నుంచి తీసుకుంది.పాప మొహం జ్వరం తగ్గి తేటగా వుంది. స్నానం చేయించి వుండటం వల్ల   పువ్వులాగా ప్రెష్ గా వుంది. కొంచెంసేపు అలా చూసి పాపని అతనికి యిచ్చి ఆమె ప్రెష్ అయి వచ్చింది. 


“శ్రావ్యా!  నేను కాఫీ కలిపాను,త్రాగి చూడు” చెప్పాడు. మళ్ళీ ఆశ్చర్యం .


“ఆ రెండు కళ్ళల్లో యిన్ని ఆశ్చర్యాలు చూపకు.  నువ్వు నిన్న యెంత నొచ్చుకున్నావో అర్ధం అవుతూనే వుంది.నేను రాత్ర౦తా   ఆలోచించాను. నిన్ను బాధపెడుతున్నాని అర్థమవుతుంది. నేను

మారాలనుకుంటున్నాను”.

 

మౌనంగా వింటుంది శ్రావ్య


“ఉదయాన్నే లేచి కూరగాయలు అవి తీసుకొచ్చి నీకు హెల్ప్ చేద్దామనుకున్నాను. అలవాటు లేక మెలుకువ రాలేదు నేను  నిద్ర లేచేటప్పటికే  నువ్వు ఆఫీస్ కి వెళ్ళిపోయావు. పాపకి జ్వరం తగ్గిందో లేదో ఆలోచించాను నాకు సిగ్గుగా అనిపించింది” అపాలజిక్ గా అన్నాడు .


అతని మాటల్లో నిజాయితీకి చలించిపోయింది శ్రావ్య, 


మళ్ళీ వాసునే మాట్లాడసాగాడు.


నేను నిన్ను సాధించాలని, దూరం పెట్టాలని యేదో వొక మాటలు అంటున్నాననుకున్నాను కానీ నువ్వు  చేసే శ్రమ, మన యింటి కోసం నువ్వు పడే తాపత్రయం అన్నీ అర్ధమయ్యే కొద్ది నీ పై జాలి కల్గింది. పెళ్ళికి ముందు మన నాలుగేళ్ల ప్రేమలో యెప్పుడూ కస్సుమనే నీలో యింత ఓర్పు యెలా వచ్చిందో! ఆశ్చర్యంగా అనిపిస్తుంది కూడా.  నాకు ఫ్రెండ్స్ మాత్రమే  కాదు నువ్వు,పాప కూడా ముఖ్యమే !అయినా మనకిప్పుడు  యెవరున్నారు, అదే యిక్కడ యెవరున్నారని?


“ఎవరున్నారని నాకైనా.. యెవరున్నారు నీకైనా యెవరున్నారని  నీలా నాకైనా” నవ్వుతూ పాట అందుకున్నాడు.  ఆమెని రారమ్మని చేయి చాచాడు. 


శ్రావ్య అతని బాహువుల మధ్య  యింకో పాపలా సంతోషంగా వొదిగిపోయింది. 


*********

కండక్టర్ గట్టిగా హెచ్చరించాడు ఫలానా స్టేజ్ లో దిగివాళ్లు ముందుకు రావాలని…

ఉలికిపడి లేచింది. ఇంట్లోకి వెళ్లకుండానే కారిడార్ లో పాపను ఎత్తుకుని తల్లి కనబడింది. ఆశ్చర్యపడలేదు.


నువ్వు ఎప్పుడొచ్చావమ్మా అంది.


“మధ్యాహ్నం వచ్చానమ్మా…రాగానే అల్లుడికి ఫోన్ చేసి చెప్పాను. పాపను క్రెష్ నుండి తీసుకొచ్చేయమని.

నా బంగారుతల్లిని చూసుకోవడానికి ఈ అమ్మమ్మ లేదూ”


శ్రావ్య ఊహలు తల్లకిందులయ్యాయి. కలలెన్నటికీ నిజమవవేమో! వాస్తవం ముల్లై గుచ్చుతుంది. భారంగా నిట్టూర్చింది.