15, సెప్టెంబర్ 2019, ఆదివారం

నాన్నెప్పుడొస్తాడు




రాజీవ్ ఇంకా యింటికి రాలేదు. పిల్లల్ని నిద్రపుచ్చి మళ్ళీ హాల్లోకి  వచ్చి కూర్చుంది మీనా.  నిమిషానికొకసారి యింటి  ముఖద్వారం నుండి రోడ్డు వారగా  వున్న గేటు దాకా చూపు సారిస్తూ  మధ్యమధ్యలో టీవీ చూస్తూ కూర్చుంది.

"ఎంతసేపని యెదురు చూస్తావమ్మా, భోజనం చేసి పడుకో. వాడొచ్చినప్పుడు తలుపులు నేను తీస్తానులే " అన్నాడు మాధవరావు. అయినా అక్కడినుండి కదలకుండా ఆవలిస్తూ కూర్చుంది మీనా . మాధవరావు నిట్టూరుస్తూ  మూతపడని కళ్ళతో ఆలోచిస్తూ పడుకున్నాడు.

నారు వేరవుతుంది కానీ వేరు నారవుతుందా ? తనలాగే కొడుకూ. చెప్పాలంటే తనే  నయం. ఏ దురలవాట్లు లేకుండా  భార్య మనసుని కష్టపెట్టకుండా  పూర్వీకులు యిచ్చిన ఆస్తిని నిలబెట్టుకుంటూనే వుద్యోగం చేసి ముగ్గురు బిడ్డలని చక్కగా చదివించాడు. ఆదర్శ వివాహాలు చేసాడు.

కొడుకు పెళ్ళైన కొత్తలో...  "మీ ఇద్దరూ యెవరి వుద్యోగాలలో వాళ్ళు బిజీగా వుంటే  యెలాగమ్మా ,  వాడు బాగానే సంపాదిస్తున్నాడు కదా!  నువ్వు కూడా వుద్యోగం చెయ్యాలా యింకా" అని అడిగాడు.  వెంటనే  కోడలు మీనా  వుద్యోగం మానేసింది. MBA గోల్డ్ మెడలిస్ట్. నట్టింట్లో  అలంకార ప్రాయంగా ఆమె ఫోటోకి వ్రేలాడదీసిన మెడల్  కంట్లోబడినప్పుడల్లా తాను  కథల్లో వ్రాసిన స్త్రీ పురుష సమానత్వం వెక్కిరిస్తున్నట్లు కనబడేది మాధవరావుకి.

వెంటవెంటనే ఇద్దరి బిడ్డలని కని  శ్రద్దగా పెంచుకోవడంతో పాటు  యింట్లో  యెంత మంది నౌకర్లు వున్నా  తనకి కావల్సినదల్లా  మొక్కుబడిగా కాకుండానూ యేదో సేవ చేస్తున్నాను అనుకోకుండానూ  ప్రేమగా చేసే కోడలంటే మాధవరావుకి అభిమానం. పిల్లలు హోమ్ వర్క్ చేసుకుంటుంటే చదివిన పుస్తకాల గురించి తనతో చర్చించడమో వెబ్ నుండి మంచి మంచి వ్యాసాల్ని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి యివ్వడమో,తాను చెపుతున్న దానిని టైపు చేసిపెట్టడమో  చేస్తుంది . రుక్మిణమ్మ బ్రతికి వుంటే ఈ కోడలిని చూసి యెంతగా మురిసిపోయేదో అనుకుంటాడు  మాధవరావు తరుచుగా .

మాధవరావు అలా  జ్ఞాపకాల జడిలో  కొట్టుకుపోతున్నాడు. పగలల్లా పత్రికాఫీస్ లో పని. సాయంకాలమైతే  మిత్రులతో సాహిత్య గోష్ఠి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి పెళ్ళి కాని మిత్రుల గదుల్లో మీటింగ్ లు పెట్టేవాళ్ళు. వాళ్ళతో కబుర్లు కథలు కవిత్వాలు రాజకీయాలు అన్నీ కలబోసుకుంటూ రాత్రిని అరగదీసేవాడు.  మూడొంతుల  రోజులు అలాగే గడిచేవి. రాజీవ్ మీ కోసం  యెదురు చూసి చూసి నిద్రపోతున్నాడు. పెందలాడే యింటికి రాకూడదూ అనేది రుక్మిణమ్మ.  

నగరపు కొసన  చిన్న పెంకుటింట్లో  వుండేవాళ్ళు .  భార్య  పిల్లలని ప్రక్కనేసుకుని    భారత రామాయాణాలు భాగవత కథలు చెపుతూ బిక్కు బిక్కుమంటూ కాలం గడిపేది. తను యే తెల్లవారుఝామునో వచ్చి తలుపు తడితే  రుక్మిణిమ్మ కన్నా రాజీవ్  ముందు లేచొచ్చి  తలుపు తీసేవాడు. అంత మెలుకువగా వుండేవాడు. "నాన్నా యిప్పటిదాకా యింటికెందుకు రాలేదు" అని నిలేసేవాడు."ఒరేయ్ చిన్నా  డబ్బు సంపాదించడమంటే అంత తేలికైన పనేమి  కాదు, అది తెలుసుకోవాలి నువ్వు" అనేవాడు మాధవరావు

"నేను పెద్దయ్యాక బోలెడు డబ్బులు సంపాదించి మీకిస్తాను కానీ త్వరగా యింటికొచ్చీయ్ నాన్నా. అమ్మకి మాకు భయమవుతుంది" అనేసి  కాళ్ళకి వాటేసుకుని బిక్క ముఖం పెట్టి తల పైకెత్తి తన   కళ్ళలోకి చూస్తుంటే  .. మనసు చివుక్కుమనేది మాధవరావుకి.  

తనకిష్టమైన వ్యాపకంలో పడి  పసిపిల్లలని పట్టించుకోవడంలేదని సిగ్గుపడేవాడు. కొన్నాళ్ళు మిత్రులకి ముఖం తప్పించి  ఆఫీసు నుండి నేరుగా యింటికి చేరుకోవడం  కాసేపు పిల్లలతో గడిపి తర్వాత వ్రాసుకోవడం బాగానే ఉన్నట్టనిపించినా పాతవాసనలు మళ్ళీ రా రమ్మని పిలుస్తూ వుండేవి. మళ్ళీ  మనసు పీకి కొన్నాళ్ళకి మిత్రులతో కాలక్షేపాలు యధావిధిగా జరిగేవి.  అభిరుచులు కలసిన మిత్రులతో గడపడం కూడా ఒక మత్తే అని అనిపించేది. భార్య యెన్నడూ యిదేమిటని అడిగింది లేదు. పైగా నాన్నెప్పుడు వస్తాడు అనే ప్రశ్న రాజీవ్ నుండి వచ్చినప్పుడల్లా రోజూ అలా అడిగి  విసిగించకూడదు, నువ్వు పడుకుందువు  రా  అంటూ  యెత్తుకుని తీసుకెళ్ళి పడుకోబెట్టి కథలు వినిపించి మాయచేసేది  రుక్మిణమ్మ . అప్పుడప్పుడు మీ నాన్నగారు మాట్లాడుతున్నప్పుటి ఫోటో పేపర్ లో వుంది చూడు ఆయన యేమి  మాట్లాడారో క్రింద రాసారు కూడా, చదివి చెప్పు అని పేపరో పత్రికో వాడి చేతికిచ్చేది. అలా బుజ్జగించేది. నాన్న లోని మలినాలనన్నింటిని కాచి వొడపోసి స్వచ్చంగా చూపించేది తల్లి కదా  అనుకునేవాడు మాధవరావు. అలా పెరిగి పెద్దవాడయ్యాడు రాజీవ్.

ఇప్పుడు అదే మాదిరిగా “సన్నీ” పెరిగి పెద్దవాడవుతున్నాడు. కానీ ఈ మధ్య  రాజీవ్ ప్రవర్తనే ముల్లులా గుచ్చుకుంటుంది.  గుండె భారంగా వుంది.  రాత్రుళ్ళు ఆలస్యంగా వస్తున్న కొడుకుని ప్రశ్నించడమే  పనిగా బెట్టుకుని  ఆరాత్రి మేలుకుని కూర్చున్నాడు. కాలింగ్ బెల్ మ్రోగగానే  తలుపు తీసి "రాజీవ్!  రోజూ ఇంత పొద్దుపోతుంది యెందుకని? " నిలదీసాడు మాధవరావు . 

"డబ్బు సంపాదించడం అంత తేలికైన పని కాదని మీకూ  తెలుసు కదా నాన్నా,  అప్పటి మీలాగే నాకు యేవేవో వ్యాపకాలు" అన్నాడు నవ్వుతూ.

"సన్నీ తనేసిన చిత్రానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని నీకు చెప్పాలని పన్నెండు అయిందాకా యెదురు చూసి చూసి పడుకున్నాడు. అమ్మా డాడీ యెప్పుడొస్తారు, తాతయ్యా నాన్నెప్పుడొస్తారు అని అడుగుతూనే వున్నాడు. బిడ్డలతో గడపలేని సమయం మీదైతే బిడ్డలని కనడమే మానేయాల్సింది,  హాయిగా బిజినెస్ చేసుకుంటూ డబ్బు సంపాదించి పార్టీలు చేసుకుంటూ బ్రతికేయాల్సింది, భార్య పిల్లలు యెందుకు నీకు?" అని గట్టిగా మందలించాడు కొడుకుని.

" కని పెట్టుకుని చూసుకోవడానికి పిల్లలకు వాళ్ళ అమ్మ వుంది. బోలెడన్ని కథలు కబుర్లు చెప్పడానికి మీరూ  కాలక్షేపానికి టీవీ ఇన్ని ఉన్నాయి. ఇంకేమి కావాలి చెప్పండి" అన్నాడు రాజీవ్ తేలికగా.
నువ్వు పసివాడి మనసు గురించి ఆలోచించడం లేదు. తనతోటి పిల్లలతో కూడా ఆడుకోవడం మానేసాడు. ఈ మధ్య చదువులో కూడా డల్ గా ఉంటున్నాడని క్లాస్ టీచర్ చెప్పింది. కొన్నాళ్ళ క్రితం  ఒక రోజు ఏం చేసాడో తెలుసా ..అని ఆగాడు మాధవరావు. 

ఆ విషయాన్ని వినడానికి కూడా ఆసక్తి లేనట్లు  మొబైల్ ఫోన్  చూసుకుంటూ మధ్యలో తండ్రి వైపు చూసాడు.  ఆ విషయాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ విచారంగా  ముఖం పెట్టి " ఆ రోజు మన తోటలోకి వెళ్లి  తన మేథ్స్ పుస్తకాన్ని అక్కడొక చెట్టుకి బూట్ లేసుతో కట్టేసి నీకెందుకు అర్ధం కావడంలేదు. ఇంతేనా ఈ టేబుల్ వేసేది. రేపు గనుక నాకు సరిగ్గా వేసి చూపకపోతే నీకు ఇదే పనిష్మెంట్ అంటూ  చెట్టును బెత్తంతో కొడుతున్నాడు. వాడిని ఆ స్థితిలో చూసి గుండె చెదిరిపోయింది. నాకు మేథ్స్ అంటే యిష్టం లేదు తాతయ్యా. మా టీచర్ చెయ్యకపోతే పనిష్మెంట్ యిస్తుంది. డాడీతో చెప్పించుకుంటే నాకు మేథ్స్ వస్తుందేమో. డాడీ యేమో ఇంటికే రావడం లేదు" అన్నాడు నాకాళ్ళకి చుట్టుకుని. ఇంకో రోజు  అన్నం కూడా తినకుండా అలిగి తోటలో బెంచీపై కూర్చుని  రాత్రి పదకొండు గంటలు దాటినా దోమలు కుడుతున్నా లెక్కచేయకుండా డాడీ వస్తేనే యింట్లోకి వస్తా అని మంకుపట్టు పట్టుకు కూర్చున్నాడు.  వాడికి మాయమాటలు చెప్పి సమదాయించడం వాళ్ళ అమ్మ వల్ల కావడంలేదు. రేపట్నుంచైనా  పెందలాడే యింటికి రా ..రాజీవ్. ఇంట్లో ఎందరున్నా నీ లోటు తీర్చగలరా ? ఆ పసివాడిని నిరాశ పరచకు." అనునయంగా చెప్పాడు కొడుకుకి.

మర్నాడు సాయంత్రం పెందలాడే యింటికి  వచ్చాడు రాజీవ్. "నీకోసం మంచి బహుమతి తెచ్చాను చూడు" అంటూ  play store బాక్స్ ని సన్నీచేతుల్లోపెట్టాడు రాజీవ్ . సన్నీ  ఆ అట్ట పెట్టె వైపు అనాసక్తిగా చూసాడు . లేచి వెళ్లి తండ్రి కాళ్ళని చుట్టేసాడు. కొడుకుని  యెత్తుకుని భార్య వైపు చూస్తూ " మీ కళ్ళల్లో యెప్పుడూ  యేదో  కంప్లయింట్. ఇంటికొస్తే చాలు నేనేదో నేరం చేసిన  వాడిలాగా చూడటం అలవాటైపోయింది మీకు. ఇంటికి రావడమంటే చిరాకు కల్గుతుంది. నాకు మాత్రం మనసుండదా, క్వాలిటీ ఆఫ్ టైం యింట్లో గడపలేకపోవడం పట్ల నాకూ  అసంతృప్తిగానే వుంది. విషయాలు నాదాకా రాకుండా  నువ్వే పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి కదా " అన్నాడు భార్యవైపు కోపంగా చూస్తూ .

మీనా యేమీ మాట్లాడకుండా అతని దగ్గర్నుండి సన్నీని తీసుకుని “డాడీ ప్రెష్ అయి వస్తారు.అంతలోకి మనమెళ్ళి  నువ్వేసిన  చిత్రాలు  తీసుకొద్దాం రా” అంటూ సన్నీని పిల్లల  గదిలోకి తీసుకువెళ్ళింది.  తండ్రికి తనేసిన చిత్రాలు, వచ్చిన  ప్రైజ్ చూపించి అందరూ తనని యెలా  మెచ్చుకున్నారో సంతోషంగా చెపుతుంటే రాజీవ్ ఓపిక చేసుకుని విన్నాడు. “మీరంటే సన్నీకి చాలా యిష్టం. ఎంత ఇష్టమంటే అంత వ్రాసి చూపడానికి పోల్చి చూపడానికి చేత కానంత అని చెపుతాడు” అంది మీనా నవ్వుతూ. మనసులో ఈ విషయం కూడా నేను మీకు చెప్పాల్సిరావడం దురదృష్టం అని కూడా అనుకుంది. రాజీవ్ మురిసిపోతూ ఆరేళ్ళ కొడుకుని గుండెలపై వేసుకుని కబుర్లు చెప్పాడు.

"డాడీ, మీరు రోజూ యిలాగే యింట్లో వుండొచ్చు కదా, వుండు డాడీ, ప్లీజ్ డాడీ" అని గడ్డం పుచ్చుకుని బతిమాలాడుతున్నట్టు సన్నీ ప్రేమగా అడిగేసరికి  రాజీవ్ కరిగిపోయి "అలాగే డియర్. తప్పకుండా రోజూ మీరు నిద్రపోక ముందే  యింటికి   వస్తాను" అని మాటిచ్చాడు. మిగిలిన ఆ రాత్రంతా సన్నీ తండ్రి మెడచుట్టూ చేతులేసి కావిలించుకొని పడుకునే వున్నాడు.  

ఉదయాన  టిఫిన్ చేస్తూ భార్య మీనాతో   "నాకోసం యెవరూ యెదురు చూడొద్దు. పిల్లలు, నాన్న యెవరేమడిగినా నువ్వే సమాధానం యిచ్చుకోవాలి.  ఫోన్ చేసి పిల్లలు మాట్లాడతారంట అని  పదే పదే డిస్ట్రబ్ చేయొద్దు. చూడబోతే నువ్వు మౌనంగా వుండి  వాళ్ళని నామీదకి వుసిగొల్పుతున్నట్టు వుంది. రోజూ సాయంత్రమయ్యేసరికి కారు రెడీ చేసి వుంచుతున్నాను. ఎప్పుడూ ఆ వంటింట్లోనూ పుస్తకాలలోనూ మగ్గకుండా నాన్నని పిల్లలనూ   తీసుకుని పార్క్ కి వెళ్ళరావచ్చుకదా, సరదాగా మూవీస్ కి వెళ్లొచ్చు. బయట డిన్నర్ చేసి రావచ్చు.  కావాల్సినంత డబ్బు సమకూరుస్తున్నా యెప్పుడూ యేదో పోగొట్టుకున్న యేడుపు వొకటి" అన్నాడు.

"మీరేమి చేస్తున్నారో మీకే తెలుసు. ఇంట్లో అందరిని తప్పుపట్టడం మానేయండి ప్లీజ్.. అంది మీనా. సమాధానం చెప్పకుండానే  ప్లేటులోనే చేయి కడిగేసి  విసురుగా  నడిచివెళ్లి కారెక్కి  డోర్ గట్టిగా వేసుకున్నాడు. కళ్ళల్లో ఉబికిన నీటిని దాచేసుకుని బలవంతంగా నవ్వుతూ   బై చెపుతూ  భర్తని నయమారా చూసుకుంది. మళ్ళీ వారానికో పదిరోజులకో  కంటికి కనబడేదని ఆమెకి తెలుసు కాబట్టి.

పిల్లలిద్దరూ రాత్రి  తండ్రి యిచ్చినమాట నిజమనుకుని పదిగంటలదాకా యెదురు చూసి పడుకున్నారు. నాలుగు రోజుల తర్వాత  ఇవాళ డాడీ వచ్చేదాకా  యిక్కడే కూర్చుంటాం అనేసి యెదురు చూసి చూసి   హాల్లోనే పడి నిద్ర పోయారు. మరుసటిరోజు కూడా అలాగే ఎదురుచూస్తారని "డాడీ మధ్యాహ్నం యింటికి వచ్చి మళ్ళీ  వెంటనే వెళ్లిపోయారు బిజినెస్ పనిమీద స్విజర్లాండ్ వెళ్ళారు. నాలుగైది రోజులలో వచ్చేస్తారంట. ఇవిగో మీకు బొమ్మలు, చాక్ లెట్స్ కొని తెచ్చారు చూడండి" అని  తాను కొని తెచ్చిన వాటిని చూపించి పిల్లలకి  అబద్దం చెప్పింది. "ఇలా యెన్నాళ్ళు మభ్య పెడదాం తల్లీ! నిన్ను చూస్తే దిగులేస్తుంది. నీ సంసారం యేమవుతుందోనని భయమేస్తుంది" అన్నాడు మాధవరావు.

“జరిగేదే జరగనివ్వండి మామయ్యా! ముందునుండే భయపడటం యెందుకు? "అని పని కల్పించుకుని  మారు మాటలకందకూడా దూరంగా వెళ్లిపోయింది మీనా.

ఆ రోజు ఆదివారం. రాక్ లో వున్న పుస్తకాల  వరుసలను చూస్తూ తాతయ్యా .. ఈ పుస్తకాలలో యేముంది? అని అడుగుతూనే మళ్ళీ మాధవరావు ఫోటో వున్న ఒక పుస్తకం పట్టుకుని.. "తాతయ్యా! ఈ కథలు నువ్వే వ్రాసావా?" ఆసక్తిగా అడిగాడు సన్నీ. "అవునురా మనుమడా, నేనే వ్రాసాను. నీ అంత వున్నప్పుడు నుండే  కవిత్వం వ్రాసేవాడిని తెలుసా" అన్నాడు కాస్త గర్వంగా .

"నాలాగా మీ చిన్నతనమంతా యెప్పుడూ స్కూల్, ఇల్లు యిలాగే వుండేదా, ఇంట్లో  కూర్చునే  ఇవన్నీ వ్రాసారా"  అనడిగాడు సన్నీ. గతుక్కుమన్నాడు మాధవరావు. సమాధానమేమి చెప్పాలో తెలియక మాటమార్చి "మన బుజ్జి కుక్క పిల్లకి జ్వరమొచ్చి పాలు తాగడం లేదు చూసొద్దాం పద" అంటూ తోటలోకి తీసుకెళ్లాడు మనుమడిని.

వారం రోజుల తర్వాత రాజీవ్ యింటికొచ్చిన రాత్రి పిల్లలు  మాధవరావు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని వున్నారు.   కొడుకుని చూసి కోపం అణుచుకోలేక "పదేసి  రోజులు యింటికి  రాకపోతే ప్రతిరోజూ నిద్ర లేచి  కోడలి ముఖం చూడాల్సి రావడం నాకు సిగ్గుగా ఉంటుంది. పాపం! ఆ అమ్మాయేమీ  అనదు, మనసులో బాధ బయటపెట్టదు. భర్త  యెదుగుదలకి  స్నేహాలు పార్టీలు యెంత అవసరమో అర్ధం చేసుకుంది కాబోలు. ఆ వొంకతో  నువ్వు పరాయి స్త్రీల మోహంలో పడి కొట్టుకుని పోతున్నావని తెలిసి కూడా  భరిస్తుంది   ఇంటికి యెప్పుడు వస్తున్నా అడగడం మానేసింది.పాప అంత అడగపోయినా   సన్నీ  అడగడం మానలేదు. వాడితో పాటు  ముసలి ప్రాణం నేనూ యెదురుచూస్తున్నాను. ఈ పది రోజులలో సిటీలో  కారులో వెళుతూ రెండుసార్లు కనబడ్డావు కానీ యింటికి వచ్చే తీరిక లేకపోయింది నీకు. నువ్వు ఇంటికి రానిరోజులే కాదు  వేకువఝామున  కాలింగ్ బెల్ మోగని రోజులు ఈ యింట్లో వుండాలని ఆశపడుతున్నాను'' గట్టిగా మందలించాననుకున్నాడు కొడుకుని .

"కోడలి తరపున వకాల్తా పుచ్చుకుంది చాలు, యిక ఆపండి నాన్నా. ఇంటికి రావడం ఆలస్యం హితబోధ మొదలెడతారు" విసుగ్గా అన్నాడు రాజీవ్

"రాజీవ్, నేను  చేసిన తప్పునే మళ్ళీ నువ్వు చేస్తున్నావ్, మనిషికి  బాల్యం తిరిగి రాదు.నాన్న గురమెక్కి ఊగాలి . నాన్న వేలు పట్టుకుని షికారుకి వెళ్లి రావాలి.పిల్లలు వాళ్ళ ఆటలు పాటలు చిలిపి చేష్టలు అన్నీ నాన్నతోనే అనుకుంటారు. పిల్లలకి నాన్నే అసలు హీరో.  డబ్బు అంతస్తు రెండు చేతుల్లో పెట్టి అందించగలవు గానీ మధురమైన బాల్యాన్ని అందించగలవా, సన్నీని చూడు నీమీద దిగులుతో యెంత చిక్కిపోయాడో , వాడి ఆలోచనలు చితికిపోతున్నాయి తెర పై కనిపించే జీవితాలేకాదు అసలు ప్రపంచాన్ని వాడికి చూపించాలి. అప్పుడే బాల్యం వికసిస్తుంది. ఇదంతా పదే పదే చెప్పాల్సిరావడం నాకూ ఇబ్బందిగా  వుంది" అనునయంగా చెప్పసాగారు మాధవరావు .

"అంత యిబ్బందిగా వుంటే కొన్నాళ్ళు ప్రియ వాళ్ళింటికి వెళ్లి వుండండి. అక్కడికి వెళ్లడం యిష్టం లేకపోతే యేదో ఆశ్రమానికి వెళ్ళి వుండండి. ఏర్పాట్లు చేస్తాను" అన్నాడు రాజీవ్. ఊహించని మాటలకు మాధవరావు అవాక్కయ్యాడు.

"అయ్యో! పెద్దవారిని అలాంటి మాటలని  బాధపెడతారెందుకు? మీరెప్పుడు యింటికి వచ్చినా యెవరూ అడగరులెండి.ముందు పైకి వెళ్ళండి, పిల్లలు చూస్తున్నారు. వాళ్ళ  ముందు యివన్నీ బాగోదు" అంది వాటర్ బాటిల్  అందిస్తూ.

"షిట్ ...అసలు దీనికంతటికీ కారణం నువ్వు కాదూ " అంటూ  భార్య చెంప చెళ్ళుమనిపించాడు రాజీవ్. చెంప పట్టుకుని నిలబడిపోయింది మీనా.  పిల్లలు మౌనంగా అన్నం తినేసి తమ గదిలోకి వెళ్లిపోయారు. వెళుతూ "డాడీ బ్యాడ్ తాతయ్య. నేను కటీఫ్ చెప్పేస్తున్నా" అంది తొమ్మిదేళ్ళ పాప. మాధవరావు కోడలి వైపు  చూసి  "నన్ను క్షమించమ్మా" అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. 

కాసేపటి తర్వాత సూట్కేస్ నిండా బట్టలు సర్దుకుని నౌకరుతో మోయించి కారులో పెట్టించుకుని బయటకి వెళ్ళిపోయాడు రాజీవ్ . ఆ రాత్రి తమ ప్రక్కన పడుకుని మౌనంగా కన్నీళ్లు కారుస్తున్న తల్లిని  దిగులుగా చూస్తూనే వున్నాడు సన్నీ. తన  చిట్టి చేతులతో కన్నీరు తుడుస్తూ "అమ్మా! నువ్వేడుస్తుంటే నాకు యేడుపొస్తుంది" అన్నాడు. మీనా కొడుకుని హత్తుకుని మరింత యేడ్చింది.

తెల్లవారింది. పిల్లలు స్కూల్ కి వెళితే మాధవరావు మిత్రుడిని కలవాలని బయటకు వెళ్ళిపోయాడు. మీనా కూడా గది  వదిలి బయటకు రాలేదు. సాయంత్రం పిల్లలొచ్చిన తర్వాత కూడా ఆ యింట్లో మౌనం రాజ్యమేలింది.

ఆ రాత్రి తనప్రక్కనే నిద్రపోయిన తల్లిని చూసి అప్పటిదాకా నిద్రపోతున్నట్లు నటిస్తున్న సన్నీ పైన కప్పుకున్న కంఫర్ట్ ని తొలగించి మెల్లిగా మంచం దిగాడు. శబ్దం కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు తీసుకుని బయటకి వచ్చాడు. హాలంతా మసక చీకటిలో నిశ్శబ్దంగా వుంది. మోయలేని బరువున్న కుర్చీని శబ్దం కాకుండా సింహద్వారం దగ్గరికి చేర్చేసరికి సన్నీకి చెమటలు పట్టేసినయి. చేత్తో  చెమట తుడుచుకుని కుర్చీ యెక్కి బోల్ట్ ని మెల్లిగా  క్రిందికి లాగి మళ్ళీ కుర్చీని యధాస్థానంలో పెట్టేసాడు. తాతయ్య చూడకుండా దాచుకున్న తాళాల గుత్తిని  జేబులో నుంచి తీసి గుర్తుపెట్టుకున్న తాళంచెవి పెట్టి రెండు సార్లు  తిప్పి మళ్ళీ వెనక్కి తిప్పి  మధ్యలోకి తెచ్చి ఆపాడు. నెమ్మెదిగా తలుపు తీసుకుని బయటకి వొచ్చి బూట్లు తొడుక్కున్నాడు. చెట్ల నీడల్లో దొంగలా నడుస్తూ గేటు వరకూ చేరుకున్నాడు. వాచ్ మెన్ కూడా చలికి మునగదీసుకుని  టోపీని ముఖం మీదకి జార్చుకుని గుర్రు పెడుతున్నాడు.  గార్డ్ షెడ్ లోపలికి  వెళ్లి  గ్లాస్ డోర్ తాళం తీసుకుని రోడ్డు మీదకి  వచ్చి స్వేఛ్చగా వూపిరి పీల్చుకుని కుడివైపుకు తిరిగి నడక మొదలెట్టాడు.

ఎదురొస్తున్న వాహనాల వేగం వెలుగు సన్నీకి భయం కల్గిస్తున్నాయి. ముఖం దించుకుని చకచకా నడుస్తున్నాడు. పెద్ద కూడలి వచ్చింది. నిన్న వుదయం అమ్మ  స్నానానికి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్ లో గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేసి  కాగితం మీద గజిబిజిగా వ్రాసుకున్న గుర్తులని  పదే పదే గుర్తుకు తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా చుట్టూ చూసుకుంటూ నడుస్తున్నాడు. అక్కడక్కడా జన సంచారం. ఎవరూ ఎవరినీ పట్టించుకోవడం లేదు. సన్నీని అసలు పట్టించుకోవడం లేదు. రెండు గంటలు పైనే నడిచాడు నడిచాడు. నడుస్తున్న కొద్దీ పట్టుదల పెరిగి మనసులో భయం పటాపంచలై పోతుంది. రావాల్సిన చోటుకి చేరుకున్నాడు. అక్కడ గేట్ మెన్ మెలుకువగానే  వుండి  అటుఇటు  తిరుగుతూ వున్నాడు. అతనికి కనబడకుండా చెట్టు మొదలునానుకుని నిలబడ్డాడు కాసేపు. రోడ్డుకావలి వైపున యెదురింటి ప్రక్కనే వున్న టీ కొట్టు దగ్గర టీ  తాగుతూన్న ఇంకొకతను ఇతన్ని చేయి వూపి పిలిచాడు. హమ్మయ్య అనుకున్న సన్నీ పిల్లిలా అక్కడికి చేరుకొని కోతిలా గేటు యెక్కి లోపలికి దూకేసాడు.

కొంచెం చిన్నగా వున్నప్పుడు  నాన్నతో కలిసి వొకసారి అక్కడికి వచ్చిన గుర్తు. దైర్యంగా నిటారుగా  ముందుకు అడుగులు వేస్తున్నాడు. సరాసరి ఇంటి గుమ్మం ముందు నిలబడి మూడుసార్లు  కాలింగ్ బెల్ మోగించాడు . ఒక స్త్రీ వచ్చి తలుపుతీసి ఆశ్చర్యంగా చూసింది. మళ్ళీ ఆపకుండా పదిసార్లు పైగా బెల్ మోగించాడు. వద్దు వద్దని వారిస్తూ చేయి పట్టుకున్న స్త్రీ చేతిని అవతలకి తోసేస్తూ మళ్ళీ బెల్ మోగిస్తూనే వున్నాడు. 

"కమలా, అన్నిసార్లు బెల్ మ్రోగుతుంటే చూడకుండా యేమి చేస్తున్నావ్, నిద్రంతా చెడిపోయింది" అనుకుంటూ ఆమె మెట్లు దిగివస్తుంది. ఆమె వెనుక  నైట్ డ్రెస్ లో అతను. అతన్ని చూస్తూనే   స్విచ్ బోర్డ్ వదిలేసి వచ్చి  గుమ్మం ముందు నిలబడ్డాడు సన్నీ. ఆమె సన్నీని చూసి  ఆశ్చర్యపోయి అనేక అనుమానాలతో వెనుక యింకెవరైనా వున్నారేమోనని తొంగి  చూస్తుంటే  సన్నీని చూసిన రాజీవ్ నిరుత్తురుడైపోయాడు. మెల్లిగా  తేరుకుని "సన్నీ! ఇంత అర్ధరాత్రి యిక్కడికి  యెలా వచ్చావ్ నిజం చెప్పు, నిన్నెవరు తీసుకొచ్చారిక్కడికి" అనడిగాడు. 

"ఎవరూ తీసుకురాలేదు డాడీ, నేనే వచ్చాను. నిజ్జంగా నేనొక్కడినే యిక్కడికి వొచ్చాను. ఇంటికి వెళదాం రా  డాడీ" అని  తండ్రి చేయి పట్టుకున్నాడు. ఆమె అతని కళ్ళల్లోకి చూసింది. "ఇప్పుడే వెళదాం, డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను" అంటూ అతను మెట్లెక్కి పై గదిలోకి వెళ్ళాడు.

"సన్నీ, ఇలా రా బాబూ" అంటూ వొంగి సన్నీని యెత్తుకోబోయింది ఆమె. ఉహూ అంటూ తల అడ్డంగా వూపుతూ  దూరంగా వెళ్లి నిలబడ్డాడు. "నా దగ్గరకి రావద్దులే, అలా సోఫాలో కూర్చో డాడీ వచ్చేస్తారు" అంది.  

"నువ్వు  బాడ్ గర్ల్ వి. నీతో మాట్లాడను" ఆ  ఒక్క మాట అనేసి యింట్లో నుండి  బయటకొచ్చి నిలబడ్డాడు. ఆమె కన్నార్పకుండా   సన్నీని చూస్తూ నిలబడిపోయింది. 

రాజీవ్  క్రిందికి వచ్చి "బై డాళింగ్  మళ్ళీ కలుద్దాం" అని ఆమె నడుంచుట్టూ చెయ్యేసి చెంపకి చెంప ఆనించి కళ్ళు చికిలించాడు. ఆమె  రాజీవ్ ని మృదువుగా తోసేసి ముందుగా తానే గుమ్మము వైపుకి నడిచింది. 

అతను గుమ్మము దాటి సన్నీని  యెత్తుకుని  "ఆంటీకి బై  చెప్పు" అంటున్నాడు. సన్నీ ఆమె కళ్ళల్లోకే చూస్తున్నాడు కానీ పెదవి విప్పలేదు, చేయి వూపనూ లేదు. ఆమె అలా  సన్నీ కళ్ళలోకి చూస్తూ రాజేష్ యేదో చెపుతున్నాకూడా  వినిపించుకోకుండా ఠక్కున తలుపులు మూసేసింది.  


4, సెప్టెంబర్ 2019, బుధవారం

పగిలిన కల

యుద్ధం తర్వాత మిగిలిన పగిలిన భూమిలా వుంది  ఆ యిల్లు. తెల్లని గోడలన్నీ మసి పట్టినట్లు నల్లగా .. అక్కడక్కడా పిచ్చి పిచ్చిగా వొంకర టింకరగా  చావు సంతకం. గది  మధ్యలో పైన వ్రేలాడుతున్న నాలుగు రెక్కల ప్యాన్ శాసించినట్లు నలుదిక్కులకు  గాలిని సమానంగా పంచుతున్నా స్విచ్ తీసేయగానే ఆగిపోయినట్లుంది.  అస్తవ్యస్తంగా వున్న సామానులన్నింటిని సర్దుకోవాలని వున్నా అరంగుళం కూడా ముందుకు కదలలేక నేలమీద కూలబడిపోయింది ఆమె.


నలుగురు చూస్తుండగా చేయలేని పనిని అతను  గది  తలుపులు బిగించుకుని స్వేచ్ఛగా యథేచ్ఛగా చేసుకుంటున్నట్లు.. గంటలు గడిచాక యెవరో వచ్చి  కిటికీ రెక్క నెమ్మదిగా తట్టినట్లు మరి కాసేపటికి మరింత గట్టిగా బాదినట్లు సమాధానం రాకపోయేసరికి సుత్తితో అద్దం  పగలగొట్టి కళ్ళు చికిలించుకుని చూసి  గది  మధ్యలో వ్రేలాడున్న శవాన్ని చూసి వెర్రిగా కేక పెట్టినట్లు ఆమె కళ్ళముందు కలలా కదులుతూ వుంది.


ఖాళీ అయిన నెర్రెలిచ్చిన మాగాణి భూముల మధ్యనుండి  వెర్రిగా యేడుస్తూ అడ్డదిడ్డంగా పరిగెడుతుంది. పెట్టెని మోస్తున్న మనుషుల వెనుక మనుషులు కొందఱు ఆమెను చూసి ఆవేశంగా కసిగా ఆమె వైపు పరిగెత్తివచ్చారు. ఒక ఆడది ఆమెని యెలా ఆపవచ్చో తెలుసుకున్న వు త్సాహంతో సులువుగా ఆమె చీరని లాగిపడేసింది. ఒక మగవాడు యుగయుగాల అహంకారాన్ని అతి తేలికగా ప్రదర్శిస్తూ జుట్టుపట్టుకుని క్రిందకి లాగి పడేసాడు. ఇంకొకడు కాళ్ళతో  ఆమెని మట్టగించసాగాడు. ఇంకొకడు యెదకు అడ్డం పెట్టుకున్న రెండు చేతులను లాగేసి పిడిగ్రుద్దులు గుద్దాడు. అమ్మా అని ఆక్రోశంగా అరిచింది. కొద్ది దూరంలో ఇంకొందరు ఆమెను లాగి పడేస్తుండగా ఆ పిలుపు వినబడి రాక్షసిలా తిరగబడి వాళ్ళని కొట్టి తప్పించుకుని పిల్ల దగ్గరికి పరుగునవచ్చి బిడ్డ వొంటిపై దెబ్బలు పడకుండా కాపుకాసింది. వాళ్ళ ఆవేశం అణిగేదాకా తల్లి వొంటిపై దెబ్బల వర్షం కురుస్తూనే వుంది. పెట్టె దూరమైందో  లేదో చూసి అలుపు తీర్చుకుంటూ దూరం జరిగారు. తల్లి లేచి దూరంగా పడి  వున్న చీరను తెచ్చి బిడ్డకి చుట్టింది. ఒకడు ఆమె జుట్టుపట్టుకుని రోడ్డు మీదకు ఈడ్చుకొస్తుంటే తల్లి యేడుస్తూ వెనుక అనుసరిస్తుంది.


ఎక్కడ చూసినా దుఃఖం దుఃఖం వరదలై పారుతుంది. వాటికి ఆనకట్టలు వేస్తున్నారు. భద్రంగా నిలువజేసుకుని  అహంకార పంటలు పండిస్తున్నారు. అహంకారాల మధ్య యేడుస్తూనే వుంది స్త్రీ. తాను కూడా యేడుస్తూనే వుంది. మెలుకువ, కాస్తంత మెలుకువ అందులో  కూసింత వెలుగు. కలవరంగా  లేచి కూర్చున్నాను. కల అని తెలిసింది. కలలో విషయాల చిరునామా యెక్కడుందో  తెలుసు అందుకే మరింత కలవరం. ఎవరో చెపితేనే  తనలో యింత  కలవరం కల్గిస్తే అసలు మనిషి చెపితే ఆ అనుభవం యింకెంత దుఃఖంతో నిండి వుంటుందో... ఎక్కువగా ఆలస్యం చేయదల్చుకోలేదు. వీలైనంత తొందరగా రమేష్ భార్యను పలకరించి రావాలనిపించింది. ఆమె ఇంటి అడ్రెస్స్  కనుక్కుందామని "దాసు" కి కాల్ చేస్తే  స్విచ్ ఆఫ్ వచ్చింది.

        

*************

కూరగాయల సంచీలను డిక్కీలో నింపుకుంటూ   యెదురుగా నడచివొస్తున్న ఆమెని చూసాను. నన్ను చూసి పలకరింపుగా నవ్వింది. మొహమాటంగా నేను నవ్వి కొన్ని క్షణాలు ఆలోచించాను. ఎక్కడ చూసానో జ్ఞాపకం రావడం లేదు.ఇంకొకసారి చూస్తే గుర్తుకురావచ్చు అనుకుంటూ నన్ను దాటెళ్ళిన ఆమెని వెనక్కి తిరిగి చూసాను. ఎడమచేతిని అడ్డంగా మడిచి భద్రంగా పుస్తకాలని గుండెలకి హత్తుకున్నతీరు ముఖాన్ని బట్టి  వయసు అంచనా వేస్తూ స్కూల్ టీచర్ లా  వుంది అని మనసులో అనుకుంటుంటే వెనక్కి తిరిగి మళ్ళీ నన్ను చూసి నవ్వి ముందుకు సాగిపోతుంది. బండి స్టార్ట్ చేసి యెవరైవుంటుందీమె అని ఆలోచన చేస్తూనే యింటికి వచ్చి  కారు ప్రక్కనే బండి నిలిపి స్టాండ్ వేస్తున్నప్పుడు వెలిగింది ఆమె డ్రైవర్ రమేష్ భార్య అని.


కూరగాయల సంచులు లోపల పడేసి దాసు కి కాల్ చేసాను. ఈ సారి ఫోన్ మ్రోగింది. అడ్రెస్స్ చెప్పాడు."రమేష్ భార్య  ఈ టైమ్ లో అంగన్వాడీ కేంద్రంలో కూర్చుని వుంటుంది. వెళ్ళి  ఆమెతో ఒకసారి మాట్లాడండి. యింకా మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఆమె నోటివెంట వింటేనే మీకు నమ్మకం కల్గుతుంది,స్థిమితపడతారు"  అన్నాడతను అంతలోనే నన్ను చదివేసినట్లు. మనుషులను చదవడం కూడా ఒక కళే కదా అనుకుంటూ బయలుదేరాను.


నన్ను చూసి  "రండి మేడమ్,బాగున్నారా?" అని పలకరించి  స్టూల్ చూపించింది కూర్చోమని. "ఇందాక  కనబడినప్పుడు వెంటనే గుర్తుకురాలేదమ్మా రాణీ "  అన్నాను ఆమె పేరుని జ్ఞాపకం తెచ్చుకుని. తెరిపిగా నవ్వింది. "నన్ను చూసి నాలుగేళ్ళయిందిగా, మర్చిపోయినట్టున్నారని అనుకున్నాను లెండి" అంది.


"ఎలా వున్నావ్ ? పిల్లలు నీ దగ్గరే వున్నారా? " అనడిగాను.


"నా దగ్గరే వున్నారండి. ఇంకెవరున్నారు చూడటానికి ? "  అంది.


"అంతా మీ వాళ్లేనట కదా"


"అందరూ అయినవాళ్ళే. కక్ష కట్టి నా బతుకు బుగ్గిపాలు చేసేసారు" .


"చదువుకున్నావ్, గ్రామ సర్పంచ్ గా పోటీ కూడా చేసావ్ కదమ్మా. అంత మెలుకువ వున్న నువ్వు నీకు జరుగుతున్న అన్యాయాన్నియెలా భరించావు. మీ ఆయనకు పెద్ద పెద్దవాళ్ళు తెలుసు. ఎవరో వొకరు మధ్యవర్తిత్వం చేస్తే అర్ధం చేసుకుని సర్దుకునేవాడేమో,అన్యాయం జరిగిపోయింది"


"లేదండీ అతను చెప్పినదానికల్లా నేను వొప్పుకోకపోవడం వలెనే   యివన్నీజరిగాయంటుంది నా బంధువర్గం. ఒరేయ్, అలా చేయడం తప్పురా అని యే ఒక్కరు ఖండించలేదు. ఇప్పుడు మాత్రం నన్నే బాధ్యురాలిని చేస్తున్నారు,మొగుడిని మింగింది అంటున్నారు"  అంది బాధగా.


"ఏం జరిగిందమ్మా అభ్యంతరం లేకపోతే చెపుతావా, నీ గురించి నీ మాటల్లోనే తెలుసుకోవాలని ఉంది"  .


రమేష్ నా మేనమామే నండీ. ముగ్గురు మామయ్యల్లో ఆఖరివాడు. అమ్మ అందరికన్నా పెద్దది. ఇంకో పిన్ని. మొత్తం అయిదుగురు సంతానం మా తాతకి. అందరూ పొలాల్లో పని చేస్తూనే పాడి పశువులను పెట్టుకునే బతికారు. మా నాన్నది మాచవరం. ఆటోనగర్ లో రాడ్ వెల్డింగ్ పని చేస్తాడు. మేము ముగ్గురం పిల్లలం. అందరం దగ్గరలో ఉన్న ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో చదువుకున్న వాళ్ళమే. నాన్న సంపాదించిన డబ్బుతో రిజిస్టార్ ఆఫీస్ సందులో రెండు బిల్డింగ్ లు కొని అద్దెకి యిచ్చాడు. కొద్దిగా పొలం కూడా కొని వ్యవసాయం చేయాలనుకుని ఈ ఊరుకి వచ్చేసారు. మా తాత దగ్గరే స్థలం కొని యిక్కడే  ఇల్లు కూడా కట్టుకున్నాం. మా అన్నలిద్దరు వుద్యోగాలకు వెళ్ళకుండా  రాడ్ వెల్డింగ్ పనే చేస్తూ పెళ్ళి చేసుకుని మాచవరంలో వుండిపోయారు. మా నాన్న నన్ను మంచి వుద్యోగస్తుడికి యిచ్చి చేయాలని ఆశ. నేనేమో రమేష్ ని ఇష్టపడి అతన్నే పెళ్ళి  చేసుకుంటానని చెప్పాను. మా నాన్నకిష్టం లేదు. మనం అమ్మాయికి ఆస్థి యిస్తే వాడికి వున్నట్టే కదా, చదువబ్బలేదు కానీ రమేష్ మంచాడు. మన పిల్లల మధ్య పనిలో పడేస్తే వాడే దారిలోకి వస్తాడు పిల్ల కళ్ళ ముందు వుంటుందని వొప్పించింది అమ్మ . పెళ్ళై  యెనిమిదేళ్ళు ఇద్దరు పిల్లలు. కార్ డ్రైవర్ గా వెళ్లి బాగానే సంపాదించేవాడు. హాయిగా గడిచిపోతుంది అనుకుని సంతోషించాను.


నాలుగేళ్లు మంత్రికి డ్రైవర్ గా పనిచేశాడు.  గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయం.  రోజూ  త్రాగుడు అలవాటైపోయింది. రాజకీయాలు మాట్లాడం తనని  కులం పేరుతో అణిచివేస్తున్నారని గడ్డిపరక కన్నా హీనంగా చూస్తున్నారని వాపోయేవాడు. మా పక్కింటి అబ్బాయితో గొడవపడి అది మనసులో పెట్టుకుని యేడాది తర్వాత నాతో కేసు పెట్టించాడు  ఈవిటీజింగ్ చేస్తున్నాడని కులం పేరున తిడుతున్నాడని. అలా పెట్టకపోతే వురి వేసుకుని చస్తానని బెదిరించాడు నన్ను. పాపం, ఇంటిప్రక్కబ్బాయి యేనాడు నన్నేమి అనలేదు. అతనికి బెయిల్ కూడా రాలేదు. కోర్ట్ లో జడ్జి గారు అడిగితే అబద్దం చెప్పలేక నిజం చెప్పేసాను. జడ్జి మందలించి కేసు కొట్టేశారు. ఆ రోజు నుండి రోజూ తాగొచ్చి నన్ను కొట్టడం పక్కింటి అబ్బాయితో నాకు సంబంధం వుందని అబాండాలు వేయడం మొదలెట్టాడు. మా అమ్మ నాన్న అన్నలు అందరూ అతని పద్దతి మార్చుకోమని యితరులతో గొడవలు పడొద్దని హితబోధలు చేసినా అతని చెవికెక్కేవి కావు. గ్రామ సర్పంచ్ గా పోటీ చేయడం కూడా అతని వొత్తిడి  మీదే. రమేష్ మాటల్లో నిజం లేకపోలేదు.కులవివక్ష,పెత్తందారీతనమూ యెప్పుడూ వున్నయ్యే కదా, ఓపిక పట్టాలి  చదువుకుని ఉద్యోగాలు చేస్తే హోదా పెరుగుతుంది. హోదాలని బట్టేగా గౌరవం అని నేను నచ్చచెపుతూ ఉండేదాన్ని. 


 ఇక అతని కుటుంబం గురించి చెప్పాలంటే అదో  పెద్దకథ. అతని పెద్దన్న వదిన  హెచ్ ఐవి సోకి చనిపోయారు . రెండో అన్న భార్య రమేష్ కి మేనమామ కూతురే. వూర్లో ఉంటున్న రైతుతో సన్నిహితంగా మెలుగుతుందని అమ్మ గమనించింది . అతను యింటికి  వస్తూ పోతుండటం చూసి  తప్పు చేస్తున్నావని  హెచ్చరించింది. ఆ విషయం  యెక్కడ బయటపడుతుందేమో  భర్తకి తెలుస్తుందేమో అని భయపడుతూనే అమ్మమీద , నా మీద  కక్ష పెట్టుకుని చాటుమాటుగా   రమేష్ కి మా మీద వ్యతిరేకంగా మరిన్ని మాటలు చెప్పి  యెగదోసేది.  ఆమె యేమి చెప్పినా   నమ్మేసేవాడు. తాగొచ్చినా తాగకపోయినా లేస్తే తన్ను  కూర్చుంటే తన్నుయేడాది పాటు  నరకం చూపించాడు. నేను విసిగిపోయాను మా వాళ్ళు భరించలేకపోయారు . నాన్నదగ్గరుండి మరీ  పోలీస్ కంప్లైంట్ యిప్పించాడు. 


కేస్ పెట్టిన తర్వాత పిల్లల్తో సహా అమ్మ వాళ్లింట్లోనే ఉన్నాను .  కేసు పెట్టినందుకు అమ్మ వాళ్ళింట్లోకి కూడా   జొరబడి వచ్చి కొట్టేవాడు. అతని నుండి కాపాడటానికి అన్న వాళ్ళు వాళ్ళింటికి తీసుకు వెళ్ళారు. చర్చికి వెళ్లే సమయానికి  అక్కడ దారి కాసి నడి  బజార్లో కొడుతూ వుంటే ఎస్ ఐ  చూసి మరొక కేస్ ఫైల్ చేశారు. విచారణ చేసేటప్పుడల్లా వాళ్ళతో కూడా విపరీతమైన వాదనాడేవాడని నాన్న అన్నయ్యలు చెప్పే వాళ్ళు. మొత్తం అతని మీద అయిదు కేసులు. రౌడీ షీటర్ కూడా ఓపెన్ అయింది. రోజూ వెళ్లి సంతకం పెట్టి రావాలనే నిబంధన.  తనకున్న పలుకుబడి గురించి చెప్పి పోలీస్ లనే బెదిరించే వాడట. అది గమనించి హేళనగా నవ్వుకుంటూ మరింత  హెరాస్ చేయాలని  వొట్టి పుణ్యానికే  పదే  పదే  విచారణకు పిలిచేవాళ్ళు. అలా జరుగుతుండగానే   పిల్లలని బలవంతంగా  నా దగ్గర్నుండి తీసుకువెళ్ళాడు. పిల్లలన్నా అతని దగ్గరుంటే వాళ్ళని చూసుకుని మార్పు తెచ్చుకుంటాడేమోనని నేను అభ్యంతరం చెప్పలేదు. పైగా   ప్రక్క యింట్లోనే అమ్మ వుండటం వల్ల పిల్లలకు ఆలనా పాలన బాగానే వుండేది. మేము దూరంగా వున్న యేడాది కాలంలోనే  అనుకోని యెన్నోమార్పులు వచ్చాయి. రమేష్ కి  హెచ్ ఐ వి ఉన్నట్లు తెలియడం వల్ల మానసికంగా తల్లడిల్లిపోయి వుంటాడు. అతని ఆరోగ్య స్థితి, పరిస్థితులు  అన్నీ అగమ్యగోచరంగానే అనిపించి వుంటాయని  ఇప్పుడు  తల్చుకుంటే దుఃఖంగా వుంది.


కంఠంలో దుఃఖం. చెప్పలేక కాసేపు ఆగింది. నేను మౌనంగా కూర్చున్నాను. కాసేపటి తర్వాత మళ్ళీ చెప్పసాగింది.



అతనంత  పిరికివాడేమీ కాదు. ఎన్ని కేసులనైనా ఎదుర్కునే మొండివాడు. చనిపోవడానికి కొద్దీ గంటల ముందే   దాసు మామతో  మాట్లాడుతున్నప్పుడే   పోలీస్ స్టేషన్ నుండి విచారణకు రావాలని ఫోన్ చేశారని చెప్పాడు. విచారణకి వెళ్లొచ్చిన రెండు గంటలకు  యింటికి వెళ్ళి  ఉరి వేసుకుని చనిపోయాడు.  అది తెలిసి గుండె పగిలిపోయినట్లయింది . నేనూ అన్నలూ   అందరం యింటికి వచ్చాము. నా మూలంగానే రమేష్ చనిపోయాడని అతని రెండో అన్న వదినలు మిగతా బంధువులు అందరూ మా మీద కర్రలతో  రాళ్లతో దాడి చేశారు. శవం దరిదాపులకు కూడా రానీయలేదు.ఇంట్లో వున్న వస్తువులు బీరువాలో వున్న బట్టలు అన్నీరోడ్డుపై వేసి  తగలబెట్టేశారు. అమ్మ వాళ్ళ పాడి గేదలను తాళ్లు విప్పి దూరంగా  పారదోలారు. కిటికీల అద్దాలు పగలగొట్టారు.అరటితోటని నరికేశారు. ఆ హింస చూస్తే నోరు తడారిపోయింది.  రమేష్ ని కడసారి చూడటానికి   మాజీ మంత్రి వచ్చాడు. పోలీసుల గట్టి బందోబస్తు  మధ్య అతని ఆఖరియాత్ర మొదలైంది. ఆఖరి చూపైనా చూసుకోవాలని   చేలకి అడ్డంపడి ఖనం చేసే చోటికి వెర్రిగా పరిగెత్తాను అక్కడైనా చూడనిస్తారని. నన్ను దరిదాపులలోకి రాకుండా  నా వొంటిపై చీరను లాగేసి నన్నుచేలో పడేసి  కొట్టి జుట్టుపట్టుకుని  ఊరి మధ్యలోకి యీడ్చుకొచ్చి యింకా  అక్కడే  వుంటే  పెట్రోల్ పోసి తగలబెడతామని బెదిరించి  తరిమేశారు.  ఊర్లో ఒక్కరు కూడా నాకు సహాయంగా నిలబడలేదు. కుటుంబ సభ్యుల గొడవ మనకెందుకులే  అని చూసీచూడనట్టు   వూరుకున్నారు.


నిజంగానే కుటుంబ రాజకీయాలమధ్య ఈర్ష్యాద్వేషాల  ముళ్ళ మధ్య పడి  నా జీవితం చిరిగిపోయింది. అమ్మ నాన్న అన్నయ్యలు వాళ్లకి భయపడి ఇల్లు విడిచి యెక్కడో అజ్ఞాతంగా తలదాచుకోవలసి వచ్చింది. ఊరికి దూరంగా యెక్కడో అనామకంగా తాళి తెంచేసి తెల్ల చీర కట్టుకుని జరిగినదాంట్లో నా తప్పెంత నా తల్లిదండ్రులు చేసిన నేరమేమిటీ  అని మేమంతా  కన్నీరు మున్నీరవుతుంటే జ్ఞాపకార్ధ కూటమి రోజున విందు భోజనాల మధ్య మద్యం యేరులా పారించి రమేష్ గురించి మంచిగా మైక్ లో చెప్పుకుని తెరిపినబడ్డారు.  తెల్లవారేటప్పటికి  నా పిల్లలని మా యింటికి తోలేశారు. 


చనిపోయే ముందు  రమేష్ అతని  ఫ్రెండ్స్ కి పంపిన వీడియో వల్ల నిదానంగా  అన్నీ బయటకొచ్చాయి. అందులో  యేముందో చూడండి అని మొబైల్ఎ లో ఉన్నవీడియో తీసి నాకిచ్చింది  చూడమని. నిర్వికారమైన చూపులతో నెమ్మదిన మాటలతో రమష్ "ఎవరిపైనో తెలియని కసి,ఆవేశం.బాగా బతికే అవకాశం నాకూ రావాలి. బ్రతకడానికి అణిగి మణిగి ఉండటం నా వల్ల కాదు.   హెచ్ ఐ వి తో ఎన్నాళ్ళో  బ్రతకను,బ్రతికినా పోలీస్ స్టేషన్ చుట్టూ  తిరగాలి.  మా అన్న వదినలు హెచ్ ఐ వి తో  పదేళ్ల క్రిందటే చనిపోయారని  యిప్పటికీ అందరూ  ఎగతాళి చేస్తుంటారు.  అలాంటి   ఎగతాళి మధ్య బ్రతకడం కన్నా చావే మేలుకుని ఉరి వేసుకుంటున్నాను. నా చావుకి కారణం నేనే. సమాధానపడని నా మనస్తత్వమే.  అని ముగించాడు. అది చూసి అందరూ జరిగింది ఏదో జరిగిపోయిందిలే పోనీయండి.. పిల్లలను పెట్టుకుని  ఆమె బతుకుద్ది అని చెప్పాక నన్ను నా యింట్లోకి రానిచ్చారు. అమ్మ నాన్న అండ వుంది. ఇల్లు వాకిలి డబ్బు అన్నీ వున్నాయి. మనిషే లేడు. రమేష్ లేడన్నదిగులు కూడా లేనంత గట్టిపడిపోయాను.అతనితో జీవితం పచ్చగా వుండాలని యెన్నెన్నో కలలు కన్నాను.ఆ కల పగిలిపోయింది. చివరకిలా  బుగ్గి చేసి కడతేరిపోయాడు. ఎవరికీ ఇలాంటి బతుకు రాకూడదు అంది కన్నీటితో.


కాసేపు మౌనం.


జ్ఞాపకాలను మోయడం పువ్వు పరిమళాన్ని మోయడమంత సహజం కదండీ, మంచిగానో చెడుగానో అతను నా భర్త. నా కట్టే కాలేదాకా ఈ బాధ అనుభవించాల్సిందే. లోకులేమన్నా  తలొంచుకోవాల్సిందే  అంది తాను తప్పు చేసినట్లుగా తలొంచుకుని.


 రాణి నాతో మాట్లాడటం చూసి  ఆమె తల్లి  మాదగ్గరికి వచ్చి నిలబడి అప్పటికే చాలాసేపైంది.  "చిన్నప్పటి నుండి వాడంతేనమ్మా  ఇంట్లో పేచీ, బడిలో పిల్లలతో పేచీ  అసలు మనుషులతోనే  పేచీ" అంది విరక్తిగా .


"అవున్నిజమే! అతనికి అందరితో గొడవే కానీ భార్యన్నా పిల్లలన్నా భలే ప్రేమ. మా ఆవిడ అసలు బయటకు రాదండీ పిల్లలను బడికి పంపించుకోవడం వాళ్ళకు చదువు చెప్పుకుంటూ కూచోవడం తప్ప  లోకం  సంగతి కొంచెమైనా  పట్టించుకోదు  అని గొప్పగా చెప్పేవాడు. ఏమిటో యిలా చేసాడు" అన్నాను బాధగా.



"భార్యాభర్తలమధ్య విభేదాలుంటే సరిదిద్దాల్సిన అయినవాళ్లే కుట్రలు చేసి మరింత మంటను యెగదోస్తే ఇట్టాగే  వుంటాయమ్మా , పెద్ద పెద్దవాళ్ళతో  పోల్చుకుని మన మట్టాంటి  స్థితికి చేరుకోవాలంటే   కష్టపడాలని   అర్ధం  చేసుకోక లేనిపోనీ  ఆలోచనలు చేసి సంసారాన్నిట్టా చేసుకున్నాడు. తప్పుడు కేసులు పెట్టుకుంటూ జీవితాన్ని నరకం చేసుకున్నాడు. బిడ్డను కళ్ళ ముందు పెట్టుకుని కుమిలిపోతున్నామమ్మా" అని కళ్ళొత్తుకుంది.


 మార్పుగా వుంటుంది ఏదైనా వుద్యోగం చేయమ్మా అన్నాను రాణితో. 


 రాణి తలవూపింది.  రాణి వాళ్ళమ్మ "మాకు డబ్బు కేమీ కొదవలేదమ్మా, ముప్పై యేళ్ళు కూడా రాలా,మళ్ళీ చదువుకుంటది.ఇంకా చదివి వుద్యోగం తెచ్చుకుని దైర్యంగా బ్రతకడం  నేర్చుకోవాలి   ఓర్పు పట్టినాళ్ళదే వందేళ్ళ జీవితం అని ఊరికే  అనలేదు పెద్దోళ్ళు.  మేము  అట్లాంటి పూరిగుడిసెలో పుట్టి కష్టపడి తెలివితేటలతో  ఇంతో అంతే సంపాయిచ్చుకోలా, మా ఆయన ఎమ్ యెల్ ఏ   ఆఫీస్ కి వెళితే యెదురెదురు మర్యాదలు చేస్తారు.  వాడికి అప్పటికి చెప్పిచూసా అణుకువుగా వుండి యెదగడం నేర్చుకోవాలి ,చీకటి రాజ్యం  యెల్ల కాలం చెలాయించదు రా అయ్యా అని. మిడిమేళం వింటేగా . జనుల నోట్టో మమ్మల్ని నానేసిపోయాడు" అని కళ్ళొత్తుకుంది. రాణి ముఖం చూస్తే గుమ్మరించని నీళ్ళకుండలా బరువుగా వుంది. అప్పటికి వాళ్ళ గుండెల భారాన్ని   కొంత నా మీదకి మార్చినట్టుంది.  

  

దాసు చెప్పిన కథ కూడా దాదాపు యిదే.కాకపొతే  అతను చెప్పినప్పటికన్నా రాణి చెప్పినప్పటి బాధ పదింతలు యెక్కువ.  నేరం యెవరిది? తిల పాపం తలా  పిడికెడు.   కళ్ళలోకి రాని  నీళ్ళను రాణి వ్యధలో చూసి బరువుగా లేచి నిలబడి  "వెళ్ళొస్తాను" అన్నాను.


"నా కథంతా చెప్పి మిమ్మల్ని బాధపెట్టినట్లున్నాను" అని నవ్విందామె.


ఆ నవ్వులో వేల వేల భాష్యాలు, మనసుల కాలుష్యాలు, మనుషుల అహంకారాలు. అవెప్పుడు కాలి మసైపోతాయో కానీ  అప్పటిదాకా రమేష్ కి యెదురుపడిన వివక్ష, కల్గిన అసహనం  రాణి లాంటి వాళ్ళ కలలను  పగలగొడుతూనే వుంటాయి. అవును.. రాణి జీవితం "పగిలిన కల " అనుకుంటుంటే మనసు మరింత బరువైంది. 


(సెప్టెంబర్ 2019 సాహిత్య ప్రస్థానం మాస పత్రికలో ప్రచురింపబడ్డ రచన)


29, ఆగస్టు 2019, గురువారం

లవ్ జె జగద్ధాత్రి ముద్ర


కొందరు రచయితలూ కవులు రచనలలోనే కాదు జీవితం జీవించి చూపడంలో కూడా ప్రేమైక స్వభావమే. ఆ ప్రేమ కోసం లోకం గీసిన సరిహద్దురేఖలను చెరిపేసి తమకు కావాల్సిన విధంగా జీవించి చూపుతారు. వద్దనుకుంటే తేలికగా జీవితాన్ని ముగించుకుంటారు. అది వారి ముద్ర .  ఆమె కవితలో చిన్న భాగం ఇక్కడ ..

పురాతన ధాత్రి
ఒకనాడు జన్మించింది
అందరికీ తెలిసినట్టుగానే ,
చాలా కాలం క్రితం
ఈ పురాతన ధరణి మరణించాల్సిందే .
కనుక వేడి గాలులను రేగనివ్వండి ,
నీలి కెరటాలను తీరం తాకనివ్వండి ;
ఎందుకంటే ప్రతి ఇరు సంధ్యలూ
ఇక నీవు చూడలేవు
శాశ్వతంగా.
అన్నీ జన్మించినవే
ఏవీ తిరిగి రావు మరల
ఎందుకంటే జన్మించినవన్నీతప్పక మరణించాల్సిందే!


"ప్రేమంటే శరీరంతోనో, హృదయంతోనో వేరు వేరుగా జీవించడం కాదు. దూరంగా వున్నప్పటికీ వొకరి మనసు స్పందిస్తే రెండో వారికి గుండె మెలిపెట్టినట్లు వుండటం" అని ఆమెకి అనుభవమై వొడలెల్లా కన్నీటి సంద్రమే.

ఆ సంద్రంలో ఆ క్షణంలోనే ఆమె మునిగిపోవచ్చు. - నేను వ్రాసిన కథ "రాతి హృదయం " నుండి ఈ వాక్యం.

ఈ బ్లాగ్ లో పదే పదే చదవడం చూసాను.ఎవరో ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యారనుకున్నాను. కానీ అనుమానం రాలేదు. జరగాల్సింది జరిగిపోయాక యిప్పుడనిపిస్తుంది.. అయ్యో ..అని. ఆమె తన ధాత్రి బ్లాగ్ నుండి ఆ కథను పదే పదే చదివారని తెలిసింది.

 సాహితీ లోకం గురించిన తెలిసిన వారందరికీ విశాఖ జగతి గారు తెలిసే వుంటారు. జగమెరిగిన జగతి జగద్దాత్రి అనుకోవచ్చు. అందరిని ప్రేమగా పలకరించే ఆమెను మర్చిపోవడం కష్టం. సహచరుడు రామతీర్ధ గారు మరణించాక కల్గిన వొంటరితనం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయం తెలియగానే షాక్ అయ్యాను. 

ఆమెతో ఫేస్బుక్ లో కాకుండా వ్యక్తిగతంగా మూడు నాలుగుసార్లు వ్యక్తిగత సంభాషణ జరిగింది.  నేనెవరో ఆమెకు పరిచయం లేకపోయినా నా  కవిత "నా ఏకాంతంలో నేను" అనే poem translate చేసారు. "మర్మమేమి" కథ తీసుకున్నారు. Translate చేయడానికని. ఈ మధ్య “రేపటి టీచర్లు” అనే కథ రాసారు share చేసి Tag చేయబోతే Facebook deactivate చేసి వుంది. Call చేస్తే తీయలేదు. కొద్దిరోజులకు facebook కి మళ్ళీ వచ్చారు. నేను మంజు యనమదల కలిసి ఆమె దగ్గరకు వెళదామనుకున్నాము. ఇంతలో యిలా..  ఒంటరితనం అంత భయంకరం యింకోటి లేదు. 😞😢

జగద్దాత్రి చనిపోయిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం  గురించి అనేక సంగతులు బయటకు వచ్చాయి. అవన్నీ నాకు తెలియక ముందు యెలాంటి ఫీలింగ్ వుందో తెలిసిన తర్వాత అదే ఫీల్ నాకు. నేను జడ్జ్ చేయను. కానీ moral policing చేస్తూ యెన్నెన్నో వ్యాఖ్యానాలు. అసహ్యమేసింది మనిషి చనిపోయాక కూడా వ్యాఖ్యానించడం చూసి.  ఒంటరితనం భరించలేక చనిపోయారు అని  అంటే అదే బాధ. ప్చ్. ఒంటరితనం వేయి కొండచిలువులు కలసి చుట్టేసిన ఊపిరాడనితనం. అందరూ జీవించడానికి రకరకాల కారణాలు వెదుక్కుంటారు ఆమె జీవించడానికి కారణమే లేదు అనుకుని ఉండవచ్చు. కవులు రచయితలు సున్నిత మనస్కులు అని నిరూపించారు 😥


ఈ కల్లోల ప్రపంచంలో రకరకాల బాధలు. మనవి కాకపోయినా యేదో బాధ. నాలుగైదు రోజులుగా నాలో  అలాంటి  బాధే! మనసు కృంగకుండా ప్రశాంతంగా వుండటాన్ని సాధన చేస్తున్నా.. ఆమె గురించి సానుభూతిగా వ్రాసిన మాటలు చూసి మెసెంజర్ ద్వారా కొన్ని వివరాలు అందించారు ఇద్దరు వ్యక్తులు. ఆ వివరాలు చూసిన తర్వాత కూడా ఆమెపై నా అభిప్రాయమేమీ మారలేదుకూడా!   తర్వాత నా ఆలోచనలు నాణేనికి రెండో వైపు అనుకుంటూ ..ఇలా వ్రాసుకున్నాను.

ఉబుసుపోక కాదు యీ మాటలు రాస్తున్నది. నా ఆలోచనలను వ్రాస్తున్నా! జరిగిన తప్పిదంలో పురుషుడిని వదిలేసి స్త్రీని మాత్రమే జడ్జ్ చేయడం నాకు నచ్చలేదు.

ఒకప్పుడు నా మధ్య నా భర్త మధ్య జరిగిన ఒక సంభాషణ గుర్తు చేసుకుంటున్నాను.

"ఒక పురుషుడు హటాత్తుగా చనిపోతే ప్రియురాలు కూడా వెంటనే చచ్చిపోతుంది అతనంటే అంత ప్రేమ. భార్య కావాలంటే పొర్లుగింతలు పెడుతూ గుండెలు బాదుకుంటూ యేడుస్తుంది కానీ .. అని నా భర్త.

వెంటనే.. "భార్యకు అనేక భాధ్యతలుంటాయి వాటిని వదిలేసి భర్త తో పాటే మరణించడానికి ఆ ప్రేమ అనేది అతను ఆమెకు ఏనాడైనా యిస్తే కదా.. ఆ భాధ్యతలేమిటో అతనికి తెలిస్తే కదా " అన్నాను నేను.

ప్రేమ తెలియకపోయినా పర్లేదు బాధ్యత మాత్రం అందరికి తెలిసి ఉండాలి.

ఆ బాధ్యత లేకుండా వ్యక్తిగత ఆనందం కోసం ప్రాకులాడిన వారికి అయిన వాళ్ళెవరూ మిగలరూ..సమాజమూ వారిని అర్ధం చేసుకోదు. రాళ్ళుచ్చుకుని వెంటబడి మరీ కొడుతుంది.

మనుషుల వ్యక్తిగత వివరాలు తెలియకుండా నాకు తెలిసిన వారు యిలా మరణించినవారు రెండు జంటలున్నాయి. ప్రియురాలు చనిపోయాక కొన్నాళ్ళకు ఆ పురుషుడు చనిపోవడం వొకటి అయితే రెండవది పురుషుడు చనిపోయాక అతని ప్రియురాలు విరక్తితో వొంటరితనంతో ఆత్మహత్య చేసుకోవడం.

కారణాలు ఏవైనా .. ఇలాంటి సహజీవనాలలో స్త్రీ ని వొక్కరినే తప్పు పట్టడం భావ్యం కాదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఎవరెవరో అవాకులు చెవాకులు పేలిన మాటలు వింటున్నా బాధేస్తుంది. అప్పుడిలా అనుకుంటాను.

స్త్రీలకూ వొక విజ్ఞప్తి మీ చదువులు ఆర్ధిక స్వావలంబనలూ దైర్యాన్ని ఒక్కటే కాదు విజ్ఞతను కూడా యివ్వాలి. ముఖ్యంగా మీరు తల్లిదంద్రులైతే మీరు మరింత బాధ్యతగా ఉండాలని గుర్తెరగాలి తప్ప సమాజానికి సవాల్ విసిరి బ్రతుకుతున్నాం అని గొప్పగా బోర విరుచుకుని నడిచి కడకు అనామకులుగా కడతేరిపోకూడదు. మరో రాజేశ్వరి కాకూడదు అని అనుకోవాలి అని. 

 ఈ విషయం అర్ధమైనా సరే అనుచితంగా కామెంట్స్ చేయకండి ప్లీజ్.. సానుభూతి చూపుతూ కూడా మనం ఆలోచించవచ్చు. పాఠాలు నేర్చుకోవచ్చు అని సున్నితంగా హెచ్చరించాను. అయినా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే వున్నారు. సరే ఒకరి అభిప్రాయాన్ని మనం మార్చలేం. ఎవరి అభిప్రాయం వారిది.  గతంలో ఇలాంటి అనుభవంతోనే "జాబిలి హృదయం " కథ వ్రాసాను. ఆసక్తి ఉంటే యీ లింక్ లో చదువుకోవచ్చు.

జగతి జగద్ధాత్రి గురించి నా స్పందనను చూసిన మరికొందరు మెసెంజర్ లలో ఫోన్ కాల్స్ లో విపరీతంగా చెప్పుకున్నారు. ఆ విషయం నాకు తెలిసి నవ్వుకున్నాను. మనుషులకు ఎంతసేపు సమాజాన్ని వేలెత్తి చూపించే పని మాత్రం 24*7 కావాలి. సమాజానికి కళ్ళెం వేసి నడిపించడం మావల్ల కావాలి అన్నట్టు వుంటాయి వారి మాటలు. సంస్కృతీ సంప్రదాయం వివాహ వ్యవస్థ అనైతికం అంటూ మూకుమ్మడిగా గళాలు విప్పడం మొదలెడతారు.

నేను శుద్ద సంప్రదాయవాదినే. కానీ ఇతరుల జీవితాలను నిర్దేశించాలనో కట్టడిచేయాలనో అనుకోను. వేష భాషలందు ఆధునికంగా వుంటాను. మూఢాచారాలను నిరసిస్తూ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా నిలబడుతూ... స్త్రీ పక్షపాతిగా వుంటూనే పురుషులను సమానంగా గౌరవిస్తాను.

ప్రతి వ్యక్తికి వ్యక్తి స్వేచ్ఛ వుంటుంది. ఆ స్వేచ్ఛతో వారు బ్రతకడం వల్ల ఇతరులకు యేమి హాని జరగదు. జరగనంత వరకూ ఎవరి బ్రతుకు వారిని బ్రతకనివ్వాలి తప్ప ముల్లు కర్రతో వెనుక పొడవడం సమంజసంకాదు. జగద్దాత్రి ఆమె వ్యక్తిగత ఆకాంక్షలకు వ్యక్తిస్వేఛ్చకు ప్రతీకగా నిలిచారు. ఆమె నిర్ణయాలకు ఆమె జవాబుదారీ. యిష్టమైనట్టు జీవించడం మరణించడం ఆమె హక్కు. 

మీ అభిప్రాయం మీకున్నట్లే ఎదుటివారికి వారి అభిప్రాయాలుంటాయి. మీ అభిప్రాయమే సరైనది అనుకుంటూ యితరులను బాధ పెట్టకూడదు. సమాజం మొత్తాన్ని right track పై నడిపించాలనుకునే మితిమీరిన ఆశ నాకు లేదు ఇతరులకు వుండకూడదని భావిస్తాను.

మాటల ద్వారా పరోక్ష వ్యాఖ్యానాల ద్వారా ఒక మనిషిని బాధకు గురిచేసేంత కుసంస్కారం వుండకూడదు. అది మరీ పాపం.

పాండిత్యం వున్న వాళ్ళు పండితులు జ్ఞానం వున్న వాళ్ళు గురువులు కావచ్చు. కానీ హృదయ సంస్కారం వున్నవాళ్ళు అన్నీ కాగలరు.

ఓం శాంతి శాంతి శాంతి.

జగద్ధాత్రి  గురించి నా స్పందనతో  పాటు ఆమె మరణం తర్వాత విన్న వ్యాఖ్యానాలను ఇక్కడ ఉదహరించాను. ఇది నివాళి కాదు. ఆమె పై నా అభిమానం యిలా వుంది, లోకం తీరు యిలా వుంది అని చెప్పడమే నా వుద్దేశ్యం.
రామతీర్ధ తో తనకున్న అనుబంధం యేమిటో "ఆ కిటికీ " అనే కవితలో వ్రాసుకున్నారు. అది చదివాక కూడా మనం వారి బంధాన్ని ఆమోదించలేని కుసంస్కారం నెలకొని వుంటే మనం నిత్యం చూస్తున్న అనేకానేక బంధాల బోలుతనాన్నికూడా  గర్హించాలి అని నా అభిప్రాయం. 

ప్రేమమూర్తి జగతి జగద్దాత్రి గురించి ఆమెకు ఎంతో సన్నిహితురాలైన "సాయిపద్మ" వ్రాసిన నివాళి క్రింద క్లిప్పింగ్ లో చూడవచ్చు. 
జగద్దాత్రి బ్లాగ్ ఈ లింక్ లో .. ఆమె వ్రాసుకున్న వ్రాతలు రచనలు ఇక్కడ కొన్ని చూడవచ్చు.