30, నవంబర్ 2024, శనివారం

అపుడపుడూ..

 అపుడపుడూ… 

ప్రకృతి తన సౌందర్యానికి తనే

మూర్ఛిలుతుంది

ఉదారంగా ఇతరులను చూడనిస్తుంది

సౌందర్యానుభవం  సొంతం చేసుకోమని 

ప్రేరేపిస్తుంది. కానీ.. 

తన సౌందర్యాన్ని నాశనం చేస్తూ 

నామ రూప గుణ విశేషణాలు లేకుండా 

చేస్తుంటే బెంగటిల్లుతుంది

జీవకణ విచ్ఛిన్నం విధ్వంసం చిరునామాగా 

మిగిలిందా అని చిరుకోపం ప్రదర్శిస్తుంది. 

నవంబరు 30/24 08:00 am.


29, నవంబర్ 2024, శుక్రవారం

తితిలియోం డూండ్నే వాలీ

 వందల వేల కథల్లో ఒక ఆణిముత్యం ఈ కథ.. తప్పకుండా వినండి.. 

Very very touching story!

మీ వాయిస్, చదివిన విధం కథకు వాటి అసలు రంగు టోన్ ఇచ్చాయి. అభినందనలు వనజ గారూ. అని ఒక మిత్రురాలు అభిప్రాయం తెలియజేశారు. 




26, నవంబర్ 2024, మంగళవారం

గుంటూరు చిన్నోడా

తొలిసారి జానపదగీతం రాసాను. ఎలా వుందో తెలియజేయండి ఫ్రెండ్స్.. 

గుంటూరు చిన్నోడా..  జానపద గీతం

రచన -వనజ తాతినేని .

గాయనీగాయకులు : 

P.T.Gayathri

Dr MRK Prabhakar Rao


ఆమె:

గుంటూరు చిన్నోడా గుబురు మీసాలోడా

గుబుర మీసాలపై నిమ్మపండు నిలిపేటోడా 

గుంటూరు చిన్నోడా గుబురు మీసాలోడా

గుబుర మీసాలపై నిమ్మపండు నిలిపేటోడా

చిన్నదాని మనసునెత్తగలవా

అహ..ఈ చిన్నదాని మనసునెత్తగలవా? 


అతను:

ఏటవతల చిన్నదాన ఏటి నడకలు దానా

ఏటి నడకలపై ఎన్నెలు చిందేదానా (2)

నిన్నైతే చిటికెలో యెత్తగలనే 

లోతైన నీ మనసు నెట్టా పట్టుకుందు నే 

పట్టుకుని నేనెట్టా నిలుపుకుందునే

అహ...పట్టుకుని నేనెట్టా నిలుపుకుందునే


ఆమె:

గుంటూరు చిన్నోడా బండల్ని పిండి   చేసేటోడా 

బండ లాంటి మనసు నీది రా

మనిషివైతే ఎదిగినావు  కానీ 

చీమ మెదడంత తెలివి లేనోడా ।।2।।

నీతో జతకట్టలేను జీవితమూ ఈదలేను

నువ్వొద్దు పోరా నువ్వొద్దు పోరా  (2)


అతను: 

ఎంత మాటంటివే పిల్లా నీవు

నీ వదరుబోతు తనం నా కాడ కాదే ।।ఎ।।

పోట్లగిత్త లెన్నింటినో లొంగదీసి నోడిని

పోట్లగిత్త లెన్నింటినో లొంగదీసి నోడిని

నీకు వేయలేనా ముకుతాడు 

అహ..నీకు వేయలేనా ముకుతాడు నేను 

ఆ మూడు ముళ్ళు నే వేయలేనా

నూరేళ్ళు నీ వొడి లోన నే నిండిపోనా (2)


ఆమె: అబ్బో! 

నీ బడాయి మాటలు జబ్బల గొప్పలు 

చెప్పింది చాల్లే బండోడా 

సూక్ష్మం చెబుతాను వినుకో.. 

చిన్నదాన్ని మనసు శివధనుస్సు లాంటిది

ధనుస్సునెత్తే ముందు ధరణి పుత్రి ను చూసినాడు రాముడు

 ఆ చూపుతోనే మనసు చిక్కబట్టినాడు

చక్కనమ్మ చిక్కినాక ధనుస్సు ఇరగ్గొటినాడు

చక్కనమ్మ చిక్కినాక ధనుస్సు ఇరగ్గొటినాడు

ఆ సులువు కనిపెట్టలేవా 

ఇంత మంద మెదడు వున్న మొనగాడా 

అహ..ఆ..  సులువు నువ్వు కనిపెట్టలేవా… 

మగువ మనసు తెలుసుకోరా బండోడా (2)


అతను:

కనిపెట్టినానే పిల్లా! నేను

అహ .. కనిపెట్టినానే పిల్లా నేనూ.. 

నీ కళ్ళలోకి నేను కళ్ళు పెట్టి చూసా

గుండె లోకి తిన్నగా దారేసినాను

మనసుతో  మనసుకి పీట ముడి పెట్టేసినాను

లగ్గం చేసుకోను ఎత్తుకొని పోతాను

నే  లగ్గం చేసుకోను ఎత్తుకొని పోతాను నేను

ఎత్తుకొని పోతాను నేనూ.. 

మీసాలపై మనసునేంటి పిల్లా 

మొత్తంగా నిన్నే  నెత్తిన పెట్టుకొంటా.. 

అహ్.. మొత్తంగా నిన్నే  నెత్తిన పెట్టుకొంటా.. 

ఇద్దరు: గుంటూరు చిన్నోడా గుంటూరు పిల్లదానా 

©️copyright   - Vanaja Tatineni 

గమనిక: అనుమతి లేకుండా.. ఈ సాహిత్యం యుగళ గీతం ఎవరూ ఉపయోగించకూడదు.